కర్మ అనే పదం ‘కృ’ అనే ధాతువునుండి ఉద్భవించింది; సమస్త వ్యాపారమూ కర్మమే. కర్మ అనే శబ్దానికి సాంకేతికంగా ప్రారబ్దమని అర్థంవుంది. ఈ శబ్దానికి ‘కారణం’ – అనీ అర్థం ఉంది. మన పూర్వజన్మ కర్మలు దీనికి కారణాలవుతాయి. కాని కర్మయోగంలో ‘పని’ అనే అర్థంలో మాత్రమే మనం కర్మ శబ్దాన్ని గ్రహించాలి. మానవజీవిత పరమావధి జ్ఞానం. ప్రాచ్య తత్త్వశాస్త్రం ఈ ఆదర్శాన్నే జీవిత ఏకైక లక్ష్యంగా మనముందుంచుతుంది. మానవ మనుగడ పరమావధి సుఖం కాదు, జ్ఞానం. సుఖ సంతోషాలకు అంతం ఉంది. సుఖమే పరమావధి అనుకోవటం భ్రాంతి; తమ అజ్ఞానంచేత మానవులు సుఖాన్ని అత్యున్నత ప్రాప్తి అనుకోవటమే లోకంలో వారు అనుభవించే కష్టాలన్నిటికీ మూలకారణం. కొంతకాలం గడిచాక మానవుడు తన గమ్యం జ్ఞానమేగాని సుఖం కాదని, సుఖదుఃఖాలు రెండూ సమంగా తనకు గుణపాఠాలు నేర్పుతాయని, తనకు మంచి ఎంత ప్రబోధకరమో చెడు కూడా అంతే ప్రబోధకరమని తెలుసుకుంటాడు. సుఖదుఃఖాలు అతడి మనోఫలకం మీద రకరకాల సంస్కారాలను ముద్రిస్తాయి. ఈ సంస్కారాలన్నిటి ఫలితమే మానవుడి ‘శీలం’ (వ్యక్తిత్వ గుణసంపద) అనబడుతుంది. ఒకవ్యక్తి సౌశీల్యాన్ని పరిశీలిస్తే అది కేవలం అతడి సంస్కారాల, చిత్తవృత్తుల సముదాయమని తెలుస్తుంది; ఆ సౌశీల్యాన్ని నిర్మించటంలో సుఖదుఃఖాలు రెండూ సమపాలు వహిస్తాయని గ్రహించవచ్చును. మంచికీ, చెడుకూ సౌశీల్యనిర్మాణంలో సమానపాత్ర ఉంది. కొన్ని సందర్భాలలో సుఖంకంటే దుఃఖమే ఎక్కువగా మానవుడికి జ్ఞానాన్ని అందివ్వగలుగుతుంది. లోకప్రశస్తులైన మహాపురుషుల వ్యక్తిత్వాన్ని పరిశీలిస్తే, వారిలో ఎక్కువ మందికి సుఖం కంటే దుఃఖమే ఎక్కువ ప్రబోధకరమైనదని, సంపదల కంటె దారిద్ర్యమే జ్ఞానానంజనమైనదని, పొగడ్తల కంటే ఎదురు దెబ్బలే అంతఃతేజాన్ని వెలువరించినవని ఢంకా మ్రోగించి చెప్పగలను.
జ్ఞానం వెలుపలనుండి జనించటం లేదు; అది మానవునిలోనే అంతర్నిహితమై ఉన్నది. మానవుడు ‘తెలుసుకొంటున్నాడు’ అనడానికంటే వాస్తవానికి ‘కనుగొంటున్నాడు, తెరను తొలగిస్తున్నాడు’ అనడమే మనస్తత్వశాస్త్రోచితమైన భాష అవుతుంది. ఇలాగే మానవుడు అఖండజ్ఞాన నిలయమైన తన ఆత్మను కప్పివున్న ‘అజ్ఞానావరణను’ తొలగించుకొని, తన ఆత్మను ‘కనుగొనుటే’ నిజానికి అతడు ‘నేర్చుకొనుట’. గురుత్వాకర్షణ శక్తిని (gravitation) న్యూటన్ కనుగొన్నాడు. అది అతడి కొరకు నిరీక్షిస్తూ ఒక మూల కూర్చుని ఉందా? అది అతడి మనస్సులోనే ఉంది. సమయం రాగానే అతడు దానిని వెలికి తీసాడు. ప్రపంచం ఇంతవరకు గ్రహించిన జ్ఞానమంతా మనస్సునుండే ఉత్పన్నమవుతున్నది; అనంత విశ్వభాండాగారం నీ మనస్సులోనే ఉన్నది. మనస్సును పరిశీలించుకొందామనే తలంపును స్ఫురింపచేసేది, పరిశీలించుకొనే అవకాశాన్ని సమకూర్చేది బాహ్య ప్రపంచమే. కాని పరిశీలించే విషయం మాత్రం నీ మనస్సుదే. ఆపిల్ పండు రాలటం న్యూటన్‌కు ఒక సూచన మాత్రమే; పూర్వమతడి మనస్సులో అంతకు ముందే ఉన్న భావపరంపరను క్రమ పద్ధతిలో అమర్చుకొనగానే ఆతడికి వాటిలో కొత్త సమన్వయం స్ఫురించింది. దీనినే మనం గురుత్వా కర్షణ నియమం (law of gravitation) అంటున్నాం. ఈ సమన్వయం ఆపిల్పండులో లేదు, భూగర్భంలో దేనిలోనూ లేదు. జ్ఞానమంతా – వ్యావహారికం గాని, పారమార్థికం గాని మానవుడి మనసులోనే ఉంది. అనేకచోట్ల ఇది మరుగునపడి, బహిర్గతపరచబడదు. ఈ తెర క్రమంగా తొలగింపబడినప్పుడు మనం ‘నేర్చుకొంటున్నాం’ అంటాం. ఈ తెర ఎంత ఎక్కువగా తొలిగితే జ్ఞానం అంత ఎక్కువ కలుగుతుంది. ఏ వ్యక్తిలో నుండి ఈ తెర తొలగింపబడుతుందో అతడే జ్ఞానాభివృద్ధి పొందే మానవుడు; ఎవరిమీద ఈ కప్పడం దట్టమైవుంటుందో అతడు అజ్ఞాని. ఎవరి మీదనుండి ఈ తెర పూర్తిగా తొలగిపోతుందో అతడే సర్వజ్ఞుడు. పూర్వం సర్వజ్ఞులు ఉండేవారు. ముందుముందు కూడా ఉద్భవిస్తారని, రాబోయే యుగాలలో అసంఖ్యాకంగా ఉంటారని నా నమ్మకం. మనస్సులో జ్ఞానం, రాతిలో దాగిన అగ్నివలె ఉంటుంది. బాహ్యప్రపంచం అనేది దానిని స్ఫురింపచేసి వెలువరించే ఒరిపిడి మాత్రమే. ఇలా మనల్ని మనం నెమ్మదిగా పరిశీలించి చూసుకుంటే అనేక అభిఘాతాలు మనకు కలిగినప్పుడు మన కన్నీళ్లు, మందహాసాలు, సంతోషాలు, దుఃఖాలు, నవ్వులు, ఏడ్పులు, ఆశీర్వచనాలు, శాపాలు, స్తుతులు, నిందలు అన్నీ మననుండి వెలువడినవే అని మనకు స్పష్టమౌతుంది. వీటన్నిటి ఫలితమే మన ప్రస్తుత స్థితి. ఈ సంఘటనలే మొత్తంమీద కర్మలనబడుతున్నాయి. ఆత్మను స్పృశించి, ఆత్మతేజాన్ని వెలువరించేది, ఆత్మకు వున్న శక్తిజ్ఞానాలను బహిర్గతపరచేది ఐన ప్రతిమానసిక భౌతిక ప్రహారం కర్మయే. కర్మ శబ్దం ఇక్కడ విపులార్థంలో ప్రయోగించబడింది. ఇలా మనం నిరంతరం కర్మ ఒనరుస్తున్నాం. మీతో నేను మాట్లాడుతున్నాను; ఇది కర్మ. మీరు వింటున్నారు? అది కర్మ. మనం ఊపిరి పీలుస్తున్నాం; ఇది కర్మ. నడుస్తున్నాం; ఇదీ కర్మమే. మన శారీరక లేదా మానసిక వ్యాపారమంతా కర్మమే; వాటి ముద్రలు మనలో నిలిచి ఉంటాయి.
కొన్ని కర్మలు చిన్నచిన్నవైన అనేక కర్మల మొత్తం. సముద్రతీరంలో నిలబడి అలల తాకిడిచే కలిగే శబ్దాన్ని విన్నప్పుడు అది మహాఘెషగా తోస్తుంది. ఐనా, అందలి ప్రతి తరంగమూ అసంఖ్యాకమైన చిన్నచిన్న తరంగాలచే రూపొందినదని మనకు తెలుసు; ఈ ప్రతి చిన్నతరంగమూ శబ్దాన్ని కలిగిస్తున్నా అది మనకు వినబడటంలేదు; అవి అన్నీ కలిసి మహాతరంగమైనప్పుడే మనం తరంగఘోషను వింటున్నాం. ఇలాగే ప్రతి హృదయస్పందనా కర్మమే: కొన్నిరకాలైన కర్మలు మన అనుభవాన్ని స్పృశిస్తాయి –విస్పష్టంగా గోచరిస్తాయి; అయినప్పటికి అవి చిన్నచిన్న కర్మల సముదాయమే. నువ్వొక వ్యక్తి గుణాన్ని నిజంగా నిర్ణయించ దలిస్తే అతడు చేసిన ఘనకార్యాలను పరిగణించవద్దు. ఎప్పుడో ఒకప్పుడు ప్రతిమూర్ఖుడూ మహావీరుడు కావచ్చు. అతిసాధారణమైన పనులను నిర్వర్తించేటప్పుడు అతణ్ణి పరిశీలించు. ఒక మహావ్యక్తి నిజమైన స్వభావాన్ని ఇలాంటి సామాన్యమైన పనులే తెలియచేస్తాయి. అల్పులు కూడా ఉత్కృష్ట సమయంలో ఏదోవిధమైన ఘనత వహిస్తారు. కాని ఎవరి నడవడి సదా ఉదాత్తమై ఉంటుందో, ఎవడు సర్వావస్థలలో ఏకరీతిగా ఉంటాడో, అతడే యథార్థంగా మహాపురుషుడు.
వ్యక్తిత్వంపై కర్మప్రభావం అద్వితీయం. మనం పరిగణించవలసింది, వ్యవహారంలోకి తీసుకోవలసింది ఈ అఖండ శక్తినే. విశ్వ శక్తులన్నింటినీ తన వైపుకు ఆకర్షించుకొనే కేంద్రమే మానవుడని చెప్పవచ్చును. ఈ కేంద్రంలో ఆ శక్తు లన్నింటినీ అతడు ఏకంచేసి తిరిగి మహాప్రవాహ రూపంలో వాటిని వెలువరిస్తున్నాడు. ఇలాంటి కేంద్రమే నిజమైన మానవుడు. సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు. ఇలాంటి మానవుడు విశ్వాన్నంతా తన వైపుకు ఆకర్షించుకుంటున్నాడు. మంచి – చెడు, సుఖం – దుఃఖం, సమస్తమూ అతడి వైపుకు పరుగెత్తి అతడిని ఆవరిస్తున్నాయి. అందులోనుండి శీలమనే మనోభావ మహాప్రవాహాన్ని అతడు వెలువరిస్తున్నాడు. సమస్తాన్నీ ఆకర్షించుకొనే శక్తి ఉన్నట్లే బైటికిత్రోసే శక్తీ అతడికి ఉంది.
లోకంలో మనకు గోచరించే అన్ని చర్యలూ, మానవసంఘంలోని అన్ని కదలికలూ, మన చూట్టూ ఉన్న సమస్తకార్యకలాపాలూ మనోజనిత భావాల అభివ్యక్తనలే, మనిషి సంకల్పరూపాలే. యంత్రాలు, సాధనాలు, నగరాలు, ఓడలు, యుద్ధనౌకలు – అన్నీ కేవలం మానవసంకల్పరూపాలు. ఈ సంకల్పం వ్యక్తిత్వంనుండి, వ్యక్తిత్వం కర్మనుండి ఏర్పడుతున్నాయి. “బుద్ధిః కర్మానుసారిణీ” అన్నట్లు కర్మానుగుణమైన బుద్ధి కలుగుతుంది. ప్రపంచంలో జన్మించిన సంకల్ప బలాన్వితులందరూ మహాకార్యశూరులు, లోకాన్ని తలక్రిందులు చెయ్యగలిగిన అఖండశక్తిమంతులు. యుగయుగాల నుండి చేస్తున్న నిరంతర కృషిచే వారికి అలాంటి సంకల్పబలం చేకూరింది. బుద్ధుని సంకల్పశక్తి, జీససు సంకల్పశక్తి వంటి మహాసంకల్పశక్తి ఒక్క జన్మలో లభించదు. మనకు వారి తండ్రులెవరో తెలుసును గదా! విశ్వమానవ కళ్యాణానికై వారి తండ్రులు ఒక్క మాటనైనా పలికినట్లు తెలియరావటం లేదు. జీససు తండ్రి జోసఫు వంటి వడ్రంగులు లక్షల మంది గతించారు: ఇంకా లక్షలమంది సజీవులై ఉన్నారు. బుద్ధుని తండ్రి లాంటి క్షుద్రరాజులు లక్షలమంది ప్రపంచంలో ఉన్నారు. అతడి ఆజ్ఞలను బహుశా అతడి సేవకులే మన్నించేవారు కారేమో! మహాసంకల్పశక్తి కేవలం వంశపారంపర్యమే అయితే ఆ క్షుద్రరాజు ప్రపంచంలో సగం మందిచే పూజలు గైకొనే పుత్రరత్నాన్ని పొందడంలో గల కారణమేమిటో చెప్పండి? వడ్రంగికి, కోట్లమంది జనులు భగవంతుడిగా ఆరాధించే అతడి కుమారుడికి గల అజగజాంతరానికి మీరేం కారణం చూపిస్తారు? పారంపర్యవాదం (heredity) దీనికి సమాధానం కాబోదు. బుద్ధుడు, జీససు ప్రపంచం మీద ప్రసరింప చేసిన ప్రబలసంకల్పశక్తి ఎక్కణ్ణుండి వచ్చింది? ఈ మహాశక్తి సంఘాతం దేనినుండి వెలువడింది? ఈ శక్తి యుగయుగాలుగా దాగి ఉండాలి. అది క్రమానుగతంగా వృద్ధి పొందుతూ ఒక బుద్ధుడిగా, జీససుగా సమాజంలో అభివ్యక్తమై, ఈ రోజుకు కూడా ఉద్ధృతపతంగా ప్రసరిస్తూనే ఉంది.
ఇవన్నీ కర్మచే నిర్ణయింపబడుతున్నాయి. గడింపకుండా ఎవరికీ ఏదీ దక్కదు. ఇది శాశ్వతనియమం. ఒకొక్కప్పుడు అది అలాంటిది కాదనుకుంటాం. కాని సుదీర్ఘకాలంలో దానిని గురించిన నమ్మకం మనకు దృఢపడుతుంది. సిరిసంపదలకోసం ఒకడు యావజ్జీవితం యాతన పడతాడు. అందుకోసం అనేకమందిని మోసగిస్తాడు. కాని చివరికి తాను ధనవంతుడవడానికి అనర్హుడనని గ్రహిస్తాడు. జీవితమంతా నరకప్రాయం, అసహ్యమయం అవుతుంది. మన శరీర సౌఖ్యానికై వస్తు రాశులను ప్రోగు చేసుకుంటాం. కాని మనం దేనిని గడించామో అదే మనకు దక్కుతుంది. మూర్ఖుడొకడు ప్రపంచంలోని సమస్త గ్రంథాలనూ తన పుస్తక భాండాగారంలో పదిలపరచుకొన్నప్పటికీ, ఏ గ్రంథాలను చదవడానికి అర్హతవుందో వాటినే మాత్రమే చదవగలుగుతాడు. ఈ అర్హత కర్మచే కలుగుతుంది. మనం దేనికి అర్హులమో, దేనిని జీర్ణించుకోగలమో మన కర్మే నిర్ణయిస్తుంది. మన ప్రస్తుత స్థితికి మనమే బాధ్యులం. మనం ఏమి కాగోరుతామో ఆ విధంగా రూపొందడానికి మనకు శక్తివుంది. మన వర్తమానస్థితి పూర్వకర్మల ఫలితమైతే, మనం పొందగోరేస్థితి ప్రస్తుత కర్మల ఫలితంగా పొందనగునని నిశ్చయమౌతోంది. కాబట్టి ఎలా ప్రవర్తించాలో మనం తెలుసుకోవాలి. “కర్మనెలా నిర్వర్తించాలో తెలుసుకోవటం వలన ఫలం ఏమిటి? లోకంలో ప్రతివ్యక్తీ ఏదో ఒక విధమైన కర్మను నిర్వర్తిస్తూనే ఉంటాడు గదా” అని మీరు అడగవచ్చును. కాని మన శక్తిసామర్థ్యాలు నిరర్థకం కూడా కావచ్చును. కౌశలంతోను* , శాస్త్రదృష్టితోను కర్మను నిర్వర్తించడాన్నే కర్మయోగమని భగవద్గీత వెల్లడిస్తుంది. నిర్వర్తించవలసిన విధానాన్ని తెలుసుకొంటే కర్మచే నిరతిశయ మహాఫలాలను పొందవచ్చు. మనస్సులో ముందే ఉన్న శక్తిని బైటికి తీసుకొని రావడమే, ఆత్మను మేల్కొల్పటమే కర్మ సర్వస్వమని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రతిమానవునిలోనూ శక్తి ఉంది, అలాగే జ్ఞానమూ ఉంది. వివిధ కర్మలు ఈ శక్తిని, జ్ఞానాన్ని ప్రజ్వలింపజేయడానికి ఉపయోగపడే ఘాతాలు.
వివిధ సంకల్పాలతో మానవుడు కర్మను చేస్తాడు. సంకల్ప రహితమైన కర్మ ఉండదు. కొందరు కీర్తిని ఆశించి దానికోసం కర్మను నిర్వర్తిస్తారు. కొంతమంది ధనాన్ని కోరి అందుకై కర్మను చేస్తారు. మరికొంతమంది అధికారవాంఛచే కర్మను ఆచరిస్తారు, ఇంకొందరు స్వర్గాభిలాషచే కర్మపరులౌతారు. చైనా దేశీయులవలె మరణానంతరం తమ పేరు నిలిచిపోవాలని కొందరు కోరుకుంటారు. మరణపర్యంతం అక్కడ ఎవరికీ బిరుదులు లభించవు. ఏమైనా మన పద్ధతి కంటే అదే మేలు. అక్కడ ఎవరైనా ఒక ఘనకార్యాన్ని చేస్తే గౌరవచిహ్నంగా ఒక బిరుదును గతించిన అతడి తండ్రికో, తాతకో ఇస్తారు. కొంతమంది దీనికోసం కృషి చేస్తారు. కొన్ని మహమ్మదీయ సంప్రదాయాలలో కొంతమంది మరణా నంతరం తమ పేర ఒక పెద్దగోరీ కట్టించుకోవడానికి యావజ్జీవితం పాటు పడుతుంటారు. బిడ్డ పుట్టగానే ఆ బిడ్డకోసం గోరీని సిద్ధంచేసి ఉంచే కొన్ని సంప్రదాయాలవారు నాకు తెలుసు; అది వారికి అతిముఖ్య కర్మ. గోరీ ఎంత పెద్దదో, రమ్యమైనదో దానికి సంబంధించిన వ్యక్తి అంతగొప్పగా పరిగణింపబడతాడు. కొంతమంది ప్రాయశ్చిత్తానికి ఇలాంటి కర్మను నిర్వర్తిస్తారు, నానారకాల దుష్కృత్యాలను చేసి చివరికి ఒక గుడి కడతారు, లేదంటే పురోహిత వర్గం వలన స్వర్గానికి పోయే అధికారాన్ని పొందడానికై వారికి లంచంగా ముడుపులిస్తారు. తాము పాపపూర్ణులై ఉన్నా ఈ విధమైన దానం తమను పునీతులను చేస్తుందని, శిక్షలకు గురి కాకుండా తాము తప్పించుకోవచ్చునని వారి అభిప్రాయం. కర్మాచరణకు పురికొల్పే సంకల్పాలు కొన్ని ఈ విధంగా ఉన్నాయి.
నిష్కామంగా కర్మను నిర్వర్తించండి. నిష్కామకర్మపరాయణులు, పేరుప్రతిష్ఠలు ఆశింపనివారు, స్వర్గాన్ని వాంఛింపనివారు ఐన మహనీయులు ప్రతిదేశంలోను కొందరున్నారు. మేలు జరుగుతుందనే కారణంచేతనే వారు కర్మను నిర్వర్తిస్తారు. ఇంతకంటే ఉన్నతాశయాలతో లోకకళ్యాణం పట్ల అవ్యాజ ప్రేమచే, లోకహితాభిలాషచే దీనులకు హితంచేకూరుస్తూ మానవకోటికి తోడ్పడే మహాత్ములు కొందరున్నారు. సర్వసాధారణంగా పేరుప్రతిష్ఠలను ఆశించేవారికి అవి వెంటనే సిద్ధించవు. ముసలితనంలో కాటికి కాళ్లు జాపుకొన్నప్పుడు అవి లభిస్తాయి. స్వార్థరహితంగా మానవుడు కర్మమొనరిస్తే, దానివలన అతడికి ఎలాంటి లాభం లేదా? ఉంది, మహోన్నత లాభం ఉంది. స్వార్థరాహిత్యమే విశేషలాభదాయకం. కాని దానిని అలవరుచుకొనే ఓర్పు జనులకు లేదు. ఆరోగ్యాన్నిబట్టి చూస్తే కూడా అది ఎంతో లాభదాయకం. ప్రేమ, సత్యం, నిస్వార్థత – అనేవి మనకు మహోన్నతాదర్శాలే గాని, కేవలం నైతిక భాషాలంకారాలు కావు.ఎందుకంటే, ఈ ఆదర్శాలలో అటువంటి శక్తి నెలకొని ఉంది. ముఖ్యవిషయం, ఎటువంటి స్వార్థాన్నీ మనసులో ఉంచుకోక, భవిష్యత్తును, స్వర్గం – నరకం వంటి వాటిని గురించి యోచింపక, ఐదురోజులు, కనీసం ఐదు నిమిషాలు కర్మను నిర్వర్తించగలిగిన వ్యక్తిలో మహాపురుషుడు కాగల శక్తి దాగి ఉంటుంది. ఇది కష్టసాధ్యమే. కాని దీని విలువ, దీనివలన కలిగే ప్రయోజనం మన అంతరంగంలో మనకు తెలుస్తుంది. మహత్తరమైన నిగ్రహంగా రూపొందేది ఈ అఖండశక్తే. బాహ్య వ్యాపారాలన్నిటిలో వ్యక్తమయ్యే శక్తికంటే ఆత్మనిగ్రహంలో కానవచ్చే శక్తి అత్యధికం. నాలుగు గుర్రాలు పూన్చిన బండి ఎలాంటి నిరోధం లేకుండా కొండమీద నుండి మహావేగంతో క్రిందకు వస్తుంది, లేదా బండివాడు ఆ గుర్రాలను నిరోధిస్తాడు. యథేచ్చగా గుర్రాలను పోనివ్వటంలోనా, వాటిని నిగ్రహించటంలోనా – వీటిలో కనబడే శక్తిలో ఏది అధికం? ఫిరంగిగుండు మహావేగంతో వాయుమార్గంలో దూసుకుపోయి దూరంగా ఎక్కడో పడుతుంది. మరొకటి మార్గమధ్యంలో ఏ గోడకో కొట్టుకొని, అక్కడే ఆగిపోతుంది. ఆ దెబ్బకు అక్కడ అమితమైన వేడి పుడుతుంది. స్వార్థసంకల్ప సాధనకై బహిర్ముఖంగా వెలువడే కృషి అంతా వ్యర్థమవుతుంది. అలాంటి ప్రక్రియ శక్తినివ్వదు. కాని శక్తిని వెలుపలికి పోనివ్వక నిగ్రహిస్తే అది బలవృద్ధికరమౌతుంది. క్రమంగా ఇలాంటి ఆత్మనిగ్రహం ఎనలేని సంకల్పశక్తిని, ఏ క్రీస్తునో, బుద్ధుడినో రూపొందించ గల మహోన్నత గుణగరిష్టతను పెంపొందిస్తుంది. ఈ రహస్యాన్ని మూర్ఖులు తెలుసుకోలేరు. కాని మానవకోటినంతా పరిపాలించాలని వాంఛిస్తారు. మూర్ఖుడైనా శ్రమపడి వేచివుంటే సమస్త ప్రపంచాన్ని పరిపాలించగలడు. అతడిని కొన్ని సంవత్సరాల వరకు వేచివుండనివ్వండి.పరిపాలింపవలెననే ఆ నిమ్నాలోచనను నిగ్రహించుకోనివ్వండి. ఆ ఆలోచన తొలగిపోగానే లోకంలో అతడు అఖండ శక్తిసంపన్నుడౌతడు. కొన్ని జంతువులు కొన్ని అడుగుల ఆవల చూడజాలకున్నట్లే మనలో అనేకులం కొన్ని సంవత్సరాల ఆవల పరిణమించే సంఘటనలను చూడలేకున్నాం. చుట్టూ గిరి గీసుకుని జీవిస్తున్నాం. దీనిని దాటి మన చూపులను ప్రసరింప చేయుటకు కావలసిన ఓపిక మనవద్ద లేనందువల్ల మనం అవినీతి పరులం, దుర్జనులం అవుతున్నాం. ఇది మన బలహీనత, అశక్తత.
అత్యంత నీచకర్మలను సైతం నిరసించకూడదు. అజ్ఞానిని స్వప్రయోజనాలకై, పేరుప్రతిష్ఠలకై ప్రవర్తించనివ్వండి. కాని ప్రతివ్యక్తీ క్రమంగా ఉన్నతాశయాలను పొందడానికి, గ్రహించడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉండాలి.
“కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన”* – కర్మను నిర్వర్తించడానికి మాత్రమే కాని కర్మఫలానికి నీవు అధికారివి కావు. కర్మఫలాలను అలా ఉండనివ్వండి. కర్మఫలాలను మీరెందుకు లక్ష్యపెట్టాలి? ఒక వ్యక్తికి మీరు చేసే సహాయం, అతడు మీ పట్ల వహించే వైఖరి మీద ఆధారపడకూడదు. ఒక సత్కార్యాన్నో, ఘనకార్యాన్నో చెయ్యాలనుకుంటే దానికి ఎలాంటి ఫలం కలుగుతుందో అనే చింత మీకు ఉండకూడదు.
ఈ కర్మాదర్శవిమర్శనంలో ఒక గట్టిప్రశ్న తలెత్తుతోంది. తీవ్ర కర్మాచరణం ఆవశ్యకం, సదా మనం కర్మను నిర్వర్తించాలి. కర్మను చేయకుండా ఒక్క నిమిషమైనా మనం జీవించలేం* . అలాంటప్పుడు విశ్రాంతో? జీవితసమరంలో ఒకవైపు కర్మ ఉంది. కర్మ అనే సుడిగుండంలో మనమంతా గిరగిరా మహావేగంతో తిప్పబడుచున్నాం. మరొకవైపు ప్రశాంతం, ఏకాంతం అయిన సర్వసంగపరిత్యాగం భాసిస్తూన్నది. ప్రశాంతత రాజ్యమేలుతుంటే, సందడి, ఆడంబరం అక్కడ ఉండలేవు. మృగాలతో, పువ్వులతో, పర్వతాలతో అక్కడ ఉండేది ప్రకృతి మాత్రమే. జీవిత దృశ్యాలైన ఈ రెంటిలో ఏదీ సమగ్రమైనది కాదు. అగాధసముద్ర జలంలో ఉండే చేపను పైకి తీసుకునిరాగానే అది తనను పరిరక్షించే నీటి ఒత్తిడి తొలగిపోవటంతో ముక్క ముక్కలైపోయే విధంగా, ఏకాంతవాసానికి అలవాటుపడ్డ వ్యక్తిని ప్రపంచమహావర్తంలోనికి తీసుకునివస్తే అందులో అతడు సమసిపోతాడు. గడిబిడి, వేగమయమైన జీవితానికి అలవాటుపడ్డ వ్యక్తి ప్రశాంతత నెలకొన్న చోటుకువస్తే సర్దుకోగలడా? కలవరపాటుతో బహుశ అతడు ఉన్మాది కావచ్చు. “ఏకాంతవాసంలో, అఖండమౌనంలో ఏ వ్యక్తి తీవ్రకర్మపరత్వాన్ని చూడగలడో; తీవ్రకర్మ పరత్వంలో ఎవరు ఎడారిలో నెలకొన్న నిశ్శబ్దాన్ని, ఏకాంతాన్ని చూడగలడో ఆ వ్యక్తే ఆదర్శపురుషుడు”. అతడు ఆత్మనిగ్రహ రహస్యాన్ని గ్రహించి తనను తాను అదుపులో ఉంచుకుంటాడు. వాహనాలు, జనసమూహంచే అత్యంత కోలాహలంగా ఉండే మహానగర వీధులలో అతడు వెళుతున్నప్పటికీ, నిశ్శబ్దమైన గుహాంతరాళంలో ఉన్నట్టుగానే అతడి మనస్సు ప్రశాంత నిలయమై ఉంటుంది. అయినా అతడు తీవ్ర కర్మాచరణ పరుడుగానే ఉంటాడు. అదే కర్మయోగాదర్శం. ఈ స్థితిని పొందితే మీరు నిజంగా కర్మ రహస్యాన్ని గ్రహించినట్లే.
కాని ప్రాప్తకార్యాలను చేస్తూ నిస్వార్థంతో ప్రారంభంనుంచీ మనం కర్మయోగాన్ని ప్రారంభించాలి. మనం కర్మను నిర్వర్తించాలి, కర్మాచరణకు మనల్ని పురికొల్పుతున్న శక్తి ఏదో గమనించాలి. ప్రారంభంలో కొన్ని సంవత్సరాలపాటు కర్మాచరణకు మనలను ప్రేరేపించేది తప్పక స్వార్థమే అని గ్రహిస్తాం. అయినా పట్టుపట్టి క్రమంగా ఈ స్వార్థపరత్వాన్ని నశింపచేస్తే చివరకు నిజంగా నిస్వార్థకర్మను నిర్వర్తించే సమయం వచ్చితీరుతుంది. జీవితగహనంలో ముందుకు వెళుతూ ఉంటే మనం పూర్తిగా నిస్స్వార్థ పరులమయ్యే రోజు ఎప్పుడో ఒకనాడు వస్తుందని ఆశించవచ్చు. ఈ స్థితి ప్రాప్తించగానే మన శక్తులన్నీ ఏకాగ్రమౌతాయి, సహజజ్ఞానం వ్యక్తమౌతుంది.