అక్షయకుమార్ సేన్ (1854 – 1923) : దేవేంద్రనాథ్ మజుందార్‌తో, మహిమా చరణ్ చక్రవర్తి ఇంట్లో మొట్టమొదటిసారి శ్రీరామకృష్ణులను ఇతడు దర్శించాడు. ఆ తరువాత తరచూ దక్షిణేశ్వరం వెళ్లసాగాడు. శ్రీరామకృష్ణులు తమ చివరి రోజులు కాశీపూర్‌లో గడిపారు. అక్కడ 1886 జనవరి ఒకటవ తారీకున ఆయన దివ్యోన్మత్త స్థితిలో నెలకొని భక్తులు కోరినవన్నిటిని అనుగ్రహించారు. ఈ రోజును కల్పతరువు దినంగా పరిగణించి ఆనవాయితీగా వేడుకలు నేటికీ జరుపుకొంటున్నారు. ఆ పుణ్యదినాన అక్షయ్కూడా అక్కడ ఉన్నాడు. అప్పుడు శ్రీరామకృష్ణులు అతణ్ణి తమ దరికి పిలిచి, ఆతడి ఛాతీని స్పృశించి మహామంత్ర దీక్ష ఒసగారు. అతడు కాలాంతరంలో మాతృమూర్తి శారదాదేవి అనుగ్రహంతోను, స్వామి వివేకానందుల అభిలాష మేరకు, దేవేంద్ర ప్రోద్బలంతోను శ్రీరామకృష్ణుల మహజ్జీవితాన్ని వంగభాషలో శ్రీరామకృష్ణ పుథీ అనే పేరిట ఒక కావ్యరూపంలో రచించాడు. ఈ రచన మాతృదేవి, స్వామీజీలతో సహా అనేకుల ప్రశంసలను అందుకొంది. అక్షయ్ రచించిన మరో ప్రఖ్యాత గ్రంథం ‘శ్రీరామకృష్ణ మహిమ’. శ్రీరామకృష్ణుల మహాసమాధి తరుణంలోను ఇతడు అక్కడే ఉన్నాడు.
అచలానందతీర్థ అవధూత : తాంత్రిక మార్గంలో వీరభావన చేపట్టి సాధన చేసిన వ్యక్తి. దక్షిణేశ్వరంలో ప్రప్రథమంగా శ్రీరామకృష్ణులను దర్శించాడు. కొన్ని సమయాల్లో శిష్యులతో వచ్చి పంచవటిలో సాధనలు చేయటం కూడా కద్దు. స్త్రీలతో కూడిన సాధనలు ఆతడు అనుష్ఠించడాన్ని శ్రీరామకృష్ణులు ఆమోదించలేదు.
అతుల్‌చంద్ర ఘోష్ : గిరీశ్చంద్ర ఘోష్ తమ్ముడితడు. కలకత్తా ఉన్నత న్యాయస్థానంలో వకీలుగా ఉండేవాడు. ప్రారంభం నుంచి శ్రీరామకృష్ణులకు కాస్త ఎడంగానే ఉంటూ వచ్చాడు; ఆయన్ను ‘రాజహంస’ అంటూ పరిహసించేవాడు. దానినీ భక్తిగానే పరిగణించి శ్రీరామకృష్ణులు అతడిపట్ల అనురాగంతోనే ఉండేవారు. కాలాంతరంలో ఇతడు శ్రీరామకృష్ణుల భక్తుడైనాడు. కల్పతరువు దినాన అనుగ్రహపాత్రులైన వారిలో ఇతడూ ఉన్నాడు.
అధర్లాల్ సేన్ (1855–1885) : 1883 లో ప్రప్రథమంగా శ్రీరామకృష్ణులను దక్షిణేశ్వరంలో ఇతడు దర్శించాడు. ఇతడు డిప్యూటీ మేజిస్ట్రేటుగా ఉండేవాడు. వంగభాషలో ఐదు కావ్యాలు రచించాడు. పద్దెనిమిదేళ్ల వయస్సు వరకు నాస్తికుడైన ఇతడు శ్రీరామకృష్ణుల దర్శనానంతరం ఆయన భక్తుడైనాడు. శ్రీరామకృష్ణులు ఇతడి నాలుకపై ఇష్టమంత్రం వ్రాసి, ఇతడి తలపై ఛాతీపై చేతులు వేసి ఆశీర్వాదం అనుగ్రహించారు. అధర్ ఇంటికి ఆయన పలుమార్లు వెళ్లటం తటస్థించింది. అనేక కార్యక్రమాలలో అధర్ నిమగ్నుడై ఉండేవాడు. రోజంతా కష్టపడి పనిచేశాక సాయంత్రం వచ్చి శ్రీరామకృష్ణులకు ప్రణమిల్లి మరీ ఇంటికి వెళ్లేవాడు. అధర్ ఇంట్లోనే బంకించంద్ర ఛటర్జీ, శ్రీరామకృష్ణులను కలుసుకున్నాడు. ప్రభుత్వ కార్యార్థం అధర్ తరచూ గుర్రపుస్వారీ చేయవలసి వచ్చేది. గుర్రపుస్వారీ చేయవద్దని శ్రీరామకృష్ణులు అధర్ను అనేకసార్లు హెచ్చరించారు. తన 30 వ ఏట ఒక రోజు గుర్రంపై నుండి క్రిందపడి గాయపడి, కొన్ని రోజుల్లోనే అధర్ మరణించాడు. ఈ ప్రమాదం తరువాత అధర్ మంచంపట్టి ఉన్నప్పుడు శ్రీరామకృష్ణులు అక్కడకు వెళ్లి కన్నీరు కారుస్తూ, అధర్ను స్పృశించి, ఆశీర్వదించారు.
అన్నదాగుహ : ఇతడు నరేంద్రుని సన్నిహిత మిత్రుడు. దుర్జన సాంగత్యం చేస్తూ ఉన్న ఇతడు, నరేంద్రుని సహచర్యం పొందాక శ్రీరామకృష్ణులను దర్శించుకొని జీవితంలో మంచిమార్పు పొందాడు. పలువురు అతణ్ణి అహంకారిగా పేర్కొన్నప్పటికీ శ్రీరామకృష్ణులు అతడి పట్ల అనురాగంగానే ఉండేవారు.
అన్నదా బక్షి (1849–1905) : చిన్నతనం నుంచే కళలలో ఎంతో ఆసక్తి ఉన్నవాడు. ఎంబ్రాయిడరీ నేత నేర్చుకొన్నాడు. కాలాంతరంలో పాశ్చాత్య చిత్రకళలో నిష్ణాతుడైనాడు. 1885 లో శ్రీరామకృష్ణులను దర్శించాడు. శ్యాంపుకూర్లో శ్రీరామకృష్ణులు బసచేసి ఉన్నప్పుడు తను వేసిన పలు చిత్రాలను ఆయనకు చూపించాడు. శ్రీరామకృష్ణులు వాటిని చూసి ఆనందించారు. ఇతడి చిత్రాలు అనేకం పుస్తకాలలో ప్రచురితమైనాయి.
అమృతలాల్ బసు (1839–1913) : కేశవచంద్రసేన్ బ్రహ్మసమాజంలో సభ్యుడుగా ఉండేవాడు. శ్రీరామకృష్ణుల సందర్శనం ఇతడి జీవిత గమనాన్నే మార్చివేసింది. 1883 లో శ్రీరామకృష్ణులు, కేశవసేన్ను చూడబోయినప్పుడు అమృతుడు అక్కడ ఉన్నాడు. కాశీపూర్‌లో శ్రీరామకృష్ణులు బసచేసి ఉన్నప్పుడు కొన్ని సందర్భాలలో ఆయన అమృతుని చూడగోరారు. అప్పుడు అమృతుడు వచ్చి ఆయన్ను దర్శించుకొనేవాడు.
అమృతలాల్ సర్కార్ (1860 –) : ఇతడి తండ్రియైన మహేంద్రలాల్ సర్కార్ శ్రీరామకృష్ణులకు చికిత్స చేశాడు. అమృతలాల్ కూడా ఒక వైద్యుడే. అవతార భావనను ఇతడు అంతగా అంగీకరించలేదు. ఈ విషయం గురించి శ్రీరామకృష్ణులు మహేంద్రలాల్తో చెప్పటం కూడా జరిగింది.
అశ్వనీకుమార్ దత్త (1856–1923) : 19 వ శతాబ్దాన వంగదేశంలో ఉద్భవించిన దేశనాయకులలో ఒకడు. ఇతడి భక్తియోగం, కర్మయోగం, ప్రేమ్ మొదలైన గ్రంథాలు ఎంతో ప్రసిద్ధి గాంచాయి. 1881 లో శ్రీరామకృష్ణులను ప్రప్రథమంగా దర్శించాడు. పిదప నాలుగైదుమార్లు కలుసుకోవటం జరిగింది. తక్కువసార్లే శ్రీరామకృష్ణులను ఇతడు కలుసుకొనినప్పటికీ అది ఇతడి జీవితంలో ఎంతో ప్రాధాన్యాని సంతరింపచేసింది. ఇతడు దక్షిణేశ్వరానికి వెళ్లిన రోజున కేశవసేన్ తన శిష్యులతో అక్కడకు రావటం తటస్థించింది. నాడు శ్రీరామకృష్ణుల సమాధి స్థితిని చూసి ఆయన స్వతస్శిద్ధుడైన పరమహంస అని పేర్కొన్నాడు. ఇతడి తండ్రికూడా శ్రీరామకృష్ణులను దర్శించి ఉన్నాడు. అశ్వనీ నరేంద్రుని కలుసుకోవాలని శ్రీరామకృష్ణులు ఆకాంక్షించారు. కాని పన్నెండు సం ॥ తరువాత అల్మోరాలో వారిద్దరూ కలుసుకోవటం జరిగింది.
ఆషు : ఆషుతోష్ బంధోపాధ్యాయ తన 22 వ ఏట శ్రీరామకృష్ణులను మొట్టమొదటిసారి దర్శించాడు. వయస్సు పైబడ్డాక తరచూ ‘మ’ ను కలుసుకోవటానికి వెళ్లేవాడు.
ఈశాన్చంద్ర ముఖోపాధ్యాయ : శ్రీరామకృష్ణులు ఇతడి ఇంటికి ఒకటి రెండుసార్లు వెళ్లారు. శ్రీరామకృష్ణుల పట్ల ఇతడికి అకుంఠిత భక్తి ప్రపత్తులుండేవి. చివరి రోజుల్లో తీవ్రసాధనలు అనుష్ఠించాడు. ఈయన కుమారులైన శ్రీశ్చంద్ర, సతీష్ చంద్రలు కూడా భక్తిప్రపత్తులు గలవారై మెలగారు. శ్రీశ్చంద్ర, ‘మ’ కు సన్నిహిత మిత్రుడు. సతీష్ చంద్ర, నరేంద్రుని వద్ద చదువుకొన్నాడు. కాలాంతరంలో నరేంద్రుడు పరివ్రాజకుడై వెళ్లినప్పుడు ఘాజీపూర్‌లో సతీష్ ఇంట్లో బస చేయటం జరిగింది.
ఈశ్వరచంద్ర విద్యాసాగర్ (1820–1891) : 19 వ శతాబ్దంలో సుప్రసిద్ధులైన విద్యాబోధకులలో ఒకరు. మానవతా దృక్పథంతో ఒనరించిన కార్యాలలోను, సంఘసేవలోను సాటిలేని మేటి. అతి పేదకుటుంబంలో జన్మించినప్పటికీ అపార విద్యాపారంగతుడైనాడు. చిన్నతనంలోనే అసాధారణ మేధావిగా విరాజిల్లిన విద్యాసాగర్ కావ్యం, వ్యాకరణం, వేదాంతం, పురాణాదులలో రాణించాడు. ఇందుచేత ‘విద్యాసాగర్’ అనే బిరుదును పొందాడు. పేదలకు సహాయం చేయటంలో తనను తానే మరచిపోయేవాడు. పిల్లలకోసం పలు పుస్తకాలు రచించాడు. సంస్కృత కళాశాలలో ప్రధానోపాధ్యాయుడుగా ఉండేవాడు. పిదప ఆ పదవిని విడిచిపెట్టి తానే విద్యాసంస్థలను నిర్వహించాడు. ‘మ’ ప్రోద్బలంతో శ్రీరామకృష్ణులను కలుసుకొన్నాడు. ఈయన పాఠశాలలో స్వామి వివేకానంద చిన్నతనంతో చదువుకొన్నారు. కాలాంతరంలో కొంతకాలం ఉపాధ్యాయునిగా కూడా పనిచేశారు.
ఈశ్వర చక్రవర్తి : ఉన్నత స్థితినొందిన తాంత్రిక సాధకుడు. ఇతడు రాజా ఇంద్ర నారాయణసింహుని ఆస్థాన పండితుడుగా ఉండేవాడు. శ్మశానలలో దీర్ఘకాలం తాంత్రిక సాధనలు అనుష్ఠించాడు. ఒకనాటిరాత్రి కాళీఘాట్‌లో కాళీమాత దర్శనభాగ్యం పొందాడు. కాలాంతరంలో బేలూర్ మఠంలో మొదటిసారిగా దుర్గాపూజ జరిగినప్పుడు ఇతడు పూజకు సహాయకుడుగా వ్యవహరించాడు. మఠంతో సన్నిహిత సంబంధం గలవాడు. ఇతడి కుమారుడైన శశి (కాలాంతరంలో స్వామి రామకృష్ణానంద), శ్రీరామకృష్ణుల యువశిష్యులలో ముఖ్యులైన వారిలో ఒకరు.
ఉపేన్ (1868–1919) : ఉపేంద్రనాథ్ ముఖోపాధ్యాయ్. ‘మాసిక్ వసుమతి’, ‘దైనిక్ వసుమతి’ పత్రికలను నిర్వహించాడు. అనేక పుస్తకాలను ప్రచురించాడు. 1884 లో అధర్ ఇంట్లో శ్రీరామకృష్ణులను మొట్టమొదటిసారి దర్శించుకొన్నాడు. నిరుపేదగా ఉండి పిదప గొప్ప ధనవంతుడయ్యాడు. శ్రీరామకృష్ణుల మహాసమాధి తరువాత బేలూర్ మఠానికి ఎంతో సహాయం అందించాడు.
ఉలోర్ వామన్ దాస్ : శ్రీవామన్దాస్ ముఖోపాధ్యా ఉత్తర కలకత్తాలోని కాశీపూర్‌లో ఒక పెద్ద కాళికాలయం నిర్మించిన వ్యక్తి. ఒకసారి శ్రీరామకృష్ణులను – ఆ ఆలవయానికి తోడ్కొని వెళ్లాడు. నాడు శ్రీరామకృష్ణులు పాడిన పాటలతో ఎంతో ముగ్దుడయ్యాడు.
కర్నల్ అల్కాట్ : థియోసాఫికల్ సొసైటీ (దివ్యజ్ఞాన సమాజం)కి చెందిన వ్యక్తి. కలకత్తా థియోసాఫికల్ సొసైటీ నిర్వాహకుడు.
కాళీ (186–1939) : కాళీప్రసాద్ చంద్ర, శ్రీరామకృష్ణుల యువ శిష్యులలో ఒకరు. కాలాంతరంలో స్వామి అభేదానంద.
కాళీపద ఘోష్ (1849–1905) : అసుర కాళిగా శ్రీరామకృష్ణ సంప్రదాయంలో ఖ్యాతిగాంచిన వ్యక్తి. 1884 లో గిరీశ్‌తో ఇతడు శ్రీరామకృష్ణులను మొదటిసారి దర్శించాడు. ఇతడు రచించిన అనేక పాటలు శ్రీరామకృష్ణ సంగీతం పేరిట పుస్తక రూపంలో వెలువడ్డాయి. నరేంద్రుడు ఇతణ్ణి అసురడని పిలిచేవాడు. శ్రీరామకృష్ణులు ఇతడి నాలుకపై కాళీ నామాన్ని వ్రాసి అనుగ్రహించారు. కల్పతరువు దినాన శ్రీరామకృష్ణుల అనుగ్రహపాత్రులైన వారిలో ఇత నొకడు.
కిశోరీ (1859–1931) : కిశోరీ మోహన గుప్త. ‘మ’ తమ్ముడు బ్రహ్మ సమాజంతో సంబంధం ఉన్న వ్యక్తి. మంచి గాయకుడు. శ్రీరామకృష్ణులు ఇతడి పాటలంటే ఇష్టపడేవారు. ఇతడు అవకాశం దొరికినప్పుడల్లా శ్రీరామకృష్ణులకు సేవలు చేశాడు. చివరి రోజుల్లో తపోమయ జీవితం గడిపాడు.
కుంజబాబు : సుప్రసిద్ధ నటుడు. నవబృందాన్ నాటకంలో ఇతడు భావపురుషునిగా నటించటం శ్రీరామకృష్ణులు చూశారు. అలాటి పాత్రలను పోషించటం మంచిది కాదని ఇతడికి హితవు చెప్పారు.
కుమార్ గజేంద్ర నారాయణ్; కూచ్‌బిహార్ రాజవంశీయుడు. కేశవసేన్ రెండవ కుమార్తెను వివాహం చేసుకొన్న వ్యక్తి. ఇతడు విదేశీ దుస్తులు ధరించటం చూసి శ్రీరామకృష్ణులు ముచ్చటపడేవారు.
కుంవర్ సింగ్ : శ్రీరామకృష్ణులపట్ల అత్యంత ఆకర్షితుడైన సిక్కు ఇతడు. శ్రీరామకృష్ణులను సాక్షాత్తు గురునానక్‌గా పరిగణించి భక్తిప్రపత్తులు నెరపాడు. ఇంట్లో సాధువులకు విందు ఏర్పాటుచేసినప్పుడల్లా శ్రీరామకృష్ణులను ఆహ్వానించేవాడు. శ్రీరామకృష్ణులు కూడా ఆనందంగా ఆ విందుల్లో పాల్గొనేవారు.
కృష్ణ కిశోర్ : అధ్యాత్మ రామాయణం ఆలకించటానికై శ్రీరామకృష్ణులు తరచు ఇతడి ఇంటికి పోయేవారు. రామనామంలోను, శివనామంలోను అచంచల విశ్వాసం గలవాడు.
కృష్ణదాస్ పాల్ (1838–1884) : ప్రఖ్యాత రాజకీయ నాయకుడు, గొప్ప వక్త.
కృష్ణమాయి : బలరాంబోసు కుమార్తె. సాధన కాలంలో శ్రీరామకృష్ణులు ఒకమారు గాంచిన దేవీరూపం ఈ కృష్ణమాయి వలె ఉన్నట్లు తెలిపారు.
కెప్టన్ : కర్నల్ విశ్వనాథ్ ఉపాధ్యాయ. కలకత్తాలో నేపాల్ ప్రభుత్వం ప్రతినిధి. శ్రీరామకృష్ణుల భక్తుడు. ఆయన ఇతడిని ‘కెప్టన్’ అని సంబోధించేవారు.
కెప్టన్ కుక్ (1838–1901) : అమెరికాలోని న్యూ ఇంగ్లండ్ ప్రాటెస్టెంట్ క్రైస్తవ మత ప్రచారకుడు. భారతదేశంలో పర్యటించినప్పుడు కేశవసేన్తో పరిచయం కలిగింది. 1882 ఫిబ్రవరి 23 వ తారీకున శ్రీరామకృష్ణులు, కేశవసేన్తో స్టీమర్లో గంగానదిలో విహరించినప్పుడు ఈతడు వారితో ఉన్నాడు. క్రైస్తవుడైన ఇతడు శ్రీరామకృష్ణుల సమాధి స్థితిని చూసి ఎంతో ఆశ్చర్యపోయాడు. దాన్ని గురించి పత్రికలలోకూడా వ్రాశాడు. కాలాంతరంలో స్వామి వివేకానంద అమెరికా వెళ్లినప్పుడు ఇతణ్ణి కలుసుకొన్నారు.
కేదార్ : కేదార్నాథ్ ఛటోపాధ్యాయ 1880 లో మొదటిసారిగా శ్రీరామకృష్ణులను దర్శించాడు. బ్రహ్మసమాజం, కర్జాభజా, నవరసిక్ వంటి సంప్రదాయాలతో సంబంధం కలిగి ఉన్నాడు. ఆఖరికి శ్రీరామకృష్ణుల వద్ద శరణు పొందాడు. ఢాకాలో నివసించిన కాలంలో విజయకృష్ణ గోస్వామితో శ్రీరామకృష్ణుల గురించి ముచ్ఛటిస్తూ ఆనందించేవాడు.
ఖేలాథ్చంద్ర ఘోష్ : దానశీలియైన జమీందారు. ఈయన పేరిట నేటికీ పాఠశాలలు నిర్వహింపబడుచున్నవి. 1883 లో ఈయన శ్రీరామకృష్ణులను తన ఇంటికి తోడ్కొని వెళ్లాడు.
కేశవచంద్రసేన్ (1838 – 1884) : 19 వ శతాబ్దపు సుప్రసిద్ధుడైన బ్రహ్మసమాజ నాయకుడు. ఇతడు అనేక రచనలు చేశాడు. శ్రీరామకృష్ణుల గురించి ప్రప్రథమంగా పత్రికలలో వ్రాసి బయటి ప్రపంచానికి ఆయన్ను గురించి చాటించిన వ్యక్తి. శ్రీరామకృష్ణులను కలుసుకోవటం ఇతడి జీవితంలో పెద్దమార్పును తీసుకురావటానికి హేతువైంది. ఇద్దరి మధ్యా ప్రగాఢ స్నేహం నెలకొన్నది. యువకులైన నరేంద్రాదులు శ్రీరామకృష్ణులను దర్శించటానికి మునుపు ఈయన్నే తమ మార్గదర్శిగా చేసుకొన్నారు.
గంగాధర్ (1864–1937) : శ్రీరామకృష్ణుల యువశిష్యులలో ఒకరు, కాలాంతరంలో స్వామి అఖండానంద.
గంగాప్రసాద్ సేన్ : ఆయుర్వేద వైద్యుడు. శ్రీరామకృష్ణులకు చికిత్స చేసిన వ్యక్తి. 1858 లో ప్రప్రథమంగా దక్షిణేశ్వరంలో శ్రీరామకృష్ణులను ఈయన దర్శించాడు. అది శ్రీరామకృష్ణుల సాధనల కాలఘట్టం. మథుర్బాబు ఆహ్వానంపై ఈయన శ్రీరామకృష్ణుల చికిత్స నిమిత్తం రావింపబడ్డాడు. శ్రీరామకృష్ణుల వ్యాధి వైద్య శాస్త్రపు పరిధిని దాటిపోయి ఉండటం చూసి ఈయన, తన అన్నగారైన దుర్గా ప్రసాద్ సేన్‌తో సంప్రతించి శ్రీరామకృష్ణుల వ్యాధి యోగవ్యాధి అని నిర్ణయించాడు. ఐనప్పటికి తన శక్తిమేరకు చికిత్స చేశాడు. శ్రీరామకృష్ణుల చివరి రోజులలోను ఆయనకు గంగాప్రసాద్ చికిత్సచేశాడు. శ్రీరామకృష్ణుల గొంతులో బయలుదేరిన ప్రణాన్ని శోధించి, దానిని నయం చేయలేమని వెంటనే తేల్చి చెప్పాడు.
గంగామాయి : శ్రీరామకృష్ణులు బృందావనానికి వెళ్లినప్పుడు ఈమెను కలుసుకొన్నారు. రాధ జన్మస్థలమైన పర్షానా అనే ఊళ్లో ఆమె వసించేది. రాధ నెచ్చెలియైన లలిత అవతారంగా ఆమెను పరిగణించేవారు. శ్రీరామకృష్ణులు ఈమెతో కలిసి నివసింప ఎంతో ఆతురత కనబరచారు. కాని దక్షిణేశ్వరంలో తమ తల్లి వసిస్తూ ఉండటం జ్ఞాపకం వచ్చి తిరిగి వెళ్లిపోయారు.
గిరీంద్రుడు : గిరీంద్రనాథ్ మిత్ర, శ్రీరామకృష్ణుల పరమభక్తుడైన సురేంద్రుని సోదరుడు. 1881 లో మొదటిసారిగా శ్రీరామకృష్ణులను దర్శించాడు. మొదటిరోజునే శంకరుల బుద్ధుని చైతన్యుల అవతారంగా శ్రీరామకృష్ణులను పరిగణించాడు.
గిరీశ్చంద్ర ఘోష్ (1844–1912) : 19 వ శతాబ్దపు ప్రఖ్యాత నాటక రచయిత, ప్రయోక్తలలో ఒకరు. త్రాగుబోతు, తప్పుదారి పట్టినవాడు ఐనా ఇతడు శ్రీరామకృష్ణుల అనుగ్రహంతో ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నత స్థితిని పొందగలిగాడు.
గోపాల్ సేన్ : యువశిష్యులలో ఒకరు. 1864 లో మొదటిసారిగా శ్రీరామకృష్ణులను దర్శించాడు. భావపారవశ్య స్థితిలో శ్రీరామకృష్ణులు ఇతణ్ణి స్పృశించి, ఆశీర్వదించారు. జీనన్ముక్తుని స్థితిలో ఇతడు ఉన్నాడని శ్రీరామకృష్ణులు పేర్కోవటం జరిగింది. తరువాత ఇతడు ఆత్మహత్య చేసుకొన్నాడు. దీనిని సూచిస్తూ శ్రీరామకృష్ణులు, భగవద్దర్శనానంతరం దేహత్యాగం చేస్తే అది ఆత్మహత్య క్రిందకు రాదని చెప్పారు.
గోపాల్ మా (1822–1906) : అఘోరమణీదేవి తీవ్ర తపస్సాధనలు అనుష్ఠిస్తూ చిన్నతనం నుంచి జీవించింది. కృష్ణుని బాలగోపాలునిగా ఎంచి, పూజించి ఆ రూపంలోనే ఆయన దర్శనం పొందింది. బాలగోపాలుడు ఆమె ముందుకు రావటమూ, ఆడుకోవటమూ, అదీ ఇదీ కావాలని మొండికెత్తటాలతో ఆమె జీవితం గడిచింది. ఈ కారణంగా ‘గోపాలేర్ మా’ (గోపాల్ మా) అని ఈమె పిలువబడింది. శ్రీరామకృష్ణులను 1884 లో మొదటిసారి చూసింది. ఆ పిదప ఈమె జీవితంలో అనేక ఉన్నత ఆధ్యాత్మిక అనుభూతులు కలిగాయి. సర్వత్రా గోపాలునే గాంచే అత్యున్నత స్థితిని పొందినదీమె.
గోలాప్ మా (? – 1924) : శ్రీరామకృష్ణుల శిష్యురాండ్రలో ఒకరు. కాలాంతరంలో మాతృమూర్తి శారదాదేవితో కలిసి జీవించినది. జపతప సాధనలు తీవ్రంగా అనుష్ఠించింది. అనేక ఆధ్యాత్మిక అనుభూతులు పొందిన వ్యక్తి.
గోవిందపాల్ : యువశిష్యులలో ఒకడు. ఉన్నత స్థాయి భక్తులలో ఒకడైన ఇతడు పిన్నతనంలోనే మరణించాడు.
గోవిందా ముఖోపాధ్యాయ : శ్రీరామకృష్ణులతో చెలిమితో మెలగిన వ్యక్తి. దివాన్ పదవిని నిర్వహించాడు. 1883 లో శ్రీరామకృష్ణులు ఈయన గృహాన్ని పావనం చేశారు.
గోవింద రాయ్ : సూఫీ సంప్రదాయానికి చెందిన వాడు. అరబిక్, పారశిక భాషల్లో నిష్ణాతుడు. పలు మత గ్రంథాలు అధ్యయనం చేసి చివరగా ఇస్లాం మతం పుచ్చుకొన్నాడు. 186 లో మొదటిసారి శ్రీరామకృష్ణులను కలుసుకొన్నాడు. పంచవటికి తరచు వచ్చి సాధనలు అనుష్ఠిస్తూ వచ్చిన ఈతడి జీవితం శ్రీరామకృష్ణులను ఎంతగానో ఆకర్షించింది. శ్రీరామకృష్ణుల ఇస్లాం మతసాధనానుష్ఠానానికి ఇతడే మార్గగామి.
గౌరీపండితుడు : గౌరీకాంత భట్టాచార్యుడు తాంత్రిక సాధకుడు. 1865 లో శ్రీరామకృష్ణులను కలుసుకొన్నాడు. శ్రీరామకృష్ణులు ఒక అవతార పురుషుడని శాస్త్రాల సహాయంతో నిరూపించటానికై మథుర్బాబు ఒక పండిత సభను సమావేశ పరిచాడు. ఆ సభలో పాల్గొటానికి గౌరిపండితుని కూడ ఆహ్వానించారు. ఆ తరువాత క్రమంగా శ్రీరామకృష్ణులతో సన్నిహితంగా ఉండసాగాడు. చివరికి ఒక రోజు కంట నీరుపెట్టుకొని శ్రీరామకృష్ణుల వద్దకు వచ్చి తానీ సంసారం త్యజించి సాధనలు అనుష్ఠించబోతున్నానని చెప్పి సెలవు పుచ్చుకొని వెళ్లిపోయాడు. ఆ తరువాత ఎంత వెదకినా ఆతడి గురించి ఎలాటి సమాచారమూ దొరకలేదు.
గౌరీ మా (1857–1938) : ఈమె అసలు పేరు మృడాని. బాల్యంలో ఆమెకు వివాహం చేయడానికి ఇంట్లోనివారు తలపెట్టగా, ఆమె అందుకు తీవ్రంగా నిరాకరిస్తూ ఎదురు తిరిగింది. పద్దెనిమిది ఏళ్ళ వయస్సులో ఇల్లు వీడి, హిమాలయాలకు వెళ్లి తపోమయ జీవితం గడిపిన వ్యక్తి. 1882 లో ఈమె శ్రీరామకృష్ణులను మొట్టమొదటసారి దర్శించింది. కాలాంతరంలో స్వామి వివేకానందుల భావనలను స్వీకరించి స్త్రీలకు, వితంతువులకు విద్య గరపటం, తదితర సంక్షేమ కార్యాలలో నిమగ్నురాలైనది. ఇందు నిమిత్తం ఈమె ప్రారంభించిన శ్రీశ్రీ శారదేశ్వరీ ఆశ్రమం శాఖోపశాఖలతో నేటికీ విరాజిల్లుతూ ఉన్నది.
చంద్ర ఛటర్జీ : శ్రీరామకృష్ణుల తాంత్రిక సాధనలకు గురువైన భైరవీబ్రాహ్మణి వద్ద దీక్ష పొందిన వ్యక్తి. తన సాధనల ఫలితంగా కొన్ని సిద్ధులు గడించాడు. వాటి కారణంగా జీవిత ఉన్నత లక్ష్యాన్ని విస్మరించి తప్పుదారి పట్టాడు. తరువాత శ్రీరామకృష్ణుల సహచర్యంతో ఆధ్యాత్మికంగా పురోగమించాడు.
చంద్రమణీదేవి (1791–1876) : శ్రీరామకృష్ణుల తల్లి.
చంద్ర హల్దార్ : మథుర్బాబు కులగురువు.
చిన్నగోపాల్ : గోపాల్ చంద్రఘేష్, హఠాత్తు హఠాత్తుగా శ్రీరామకృష్ణుల వద్దకు వెళ్లటం వలన ఆయన ఇతణ్ణి చిగో (హఠాత్తు) గోపాల్ అని పిలిచేవారు.
చిన్న నరేంద్రుడు : నరేంద్రనాథ్ మిత్ర. ‘మ’ కు విద్యార్థి. బాలభక్తులలో ఒకడు. శ్రీరామకృష్ణులు ఇతణ్ణి ఉన్నతుడని పేర్కొనేవారు. ఇతణ్ణి చూడటానికై ఎంతో వ్యాకులత చెందేవారు. ఇతణ్ణి చూడగానే ఆయన సమాధి స్థితులవటం కద్దు. చిన్ననరేంద్రుడు తరచు భావపారవశ్యం పొందేవాడు. కాలాంతరంలో ఉన్నత న్యాయస్థానంలో వకీలుగా ఉండేవాడు; శ్రీరామకృష్ణ మఠానికి చట్ట సంబంధమైన వ్యవహారాలలో సహాయ సహకారాలు అందించాడు. ఇతడి సంసార జీవితం సుఖప్రదంగా సాగలేదు.
చునీలాల్ (1849–1936) : చునీలాల్ బసు. కల్పతరువు నాడు శ్రీరామకృష్ణుల అనుగ్రహానికి పాత్రులైన వారిలో ఒకడు. శ్రీరామకృష్ణుల సలహా మేరకు యోగాభ్యాసం అలవరచుకొని రోగ విముక్తుడైన వ్యక్తి. కాలాంతరంలో బేలూర్ మఠంతో సన్నిహిత సంబంధం కలిగి ఉన్నాడు.
జయగోపాల్ సేన్ : బ్రహ్మసమాజ భక్తుడు. ఇతడి ఉద్యానగృహంలోనే శ్రీరామకృష్ణులు కేశవసేన్ను చూడటానికి వెళ్లారు. ఇతడి ఇంటికి శ్రీరామకృష్ణులు తరచు వెళ్లటం కద్దు.
జయనారాయణ పండితుడు (1804–1873) : సంస్కృత కళాశాలలో న్యాయశాస్త్ర ఉపాధ్యాయుడుగా పనిచేశాడు. దాదాపు పదకొండు సంస్కృత గ్రంథాలు రచించాడు. గొప్ప పండితుడై ఉండీ, నిగర్వి. గొప్ప భక్తుడు. ఈయన్ను చూడటానికి శ్రీరామకృష్ణులే స్వయంగా వెళ్లారు.
జయ ముఖర్జీ : శ్రీరామకృష్ణుల భక్తుడు. ఒకరోజు ఇతడు గంగాతీరంలో జపం చేసుకొంటున్నాడు. కాని మనస్సు మరోచోట తిరుగాడుతోంది. కాకతాళీయంగా అక్కడకు వచ్చిన శ్రీరామకృష్ణులు ఇతడి చెంప ఛళ్లుమనిపించారు.
జ్ఞాన్ చౌదరి : బ్రహ్మసమాజ భక్తుడు. అత్యంత విద్యాసంపన్నుడు. భార్య మరణంతో మనస్సు విరిగిపోయి జీవితంలో విరక్తి చెందిన ఇతడు శ్రీరామకృష్ణులను దర్శించాడు. ఇందుచేత జీవితంలో ఆలంబనం ఏర్పడి సాధనలు కూడా అనుష్ఠించాడు. ఇతడి ఇంట్లో జరిగిన బ్రహ్మసమాజ వార్షికోత్సవంలో శ్రీరామకృష్ణులు పాల్గొన్నారు.
టాగూర్ దాదా : నారాయణదాస్ బంధోపాధ్యాయ. 1884 లో మొదటిసారిగా శ్రీరామకృష్ణులను దర్శించాడు. అప్పుడతడికి 27 లేక 28 ఏళ్లు ఉండవచ్చు. ఎన్నో సాధనలు అనుష్ఠించినప్పటికీ మనశ్శాంతి కలుగలేదని ఇతడు శ్రీరామకృష్ణులతో వాపోయినప్పుడు, ఉదయం వేళ సాయంత్రం పూట చప్పట్లు చరుస్తూ హరినామ భజన చేయమని శ్రీరామకృష్ణులు తెలిపారు.
టాగూర్ దాస్ సేన్ : బ్రహ్మసమాజ భక్తుడు. కేశవసేన్ శిష్యుడు. ఒకసారి కేశవసేన్ ఏసుక్రీస్తు గురించి ప్రశంసిస్తూ ఉపన్యసించటం చూసి ఆతడి నుంచి విడిపోయాడు. అప్పుడప్పుడు శ్రీరామకృష్ణులను దర్శించేవాడు.
తారక్ (1854–1934) : తారక్ ఘేషాల్. శ్రీరామకృష్ణుల శిష్యులలో ఒకరు. కాలాంతరంలో స్వామి శివానంద.
తారక్ ముఖర్జీ : ఉన్నతస్థితి నొందిన భక్తుడు. శ్రీరామకృష్ణులు ఇతడిపట్ల అపరిమిత ప్రేమను కనబరచారు. తమ నుంచి ఒక జ్యోతి బయల్వెడలి తారక్ కేసి వెళుతూ ఉన్నట్లు తాము చూశామని ఒకసారి శ్రీరామకృష్ణులు ‘మ’ తో చెప్పారు.
తులసి (1863–1938) : తులసీచరణ్ దత్త. యువ భక్తులలో ఒకరు. కాలాంతరంలో స్వామి నిర్మలానంద.
తులసిరామ్ : శ్రీరామకృష్ణుల యువ శిష్యులలో ఒకరైన బాబూరాం సోదరుడు. బాబూరాంకు శ్రీరామకృష్ణుల పరిచయం కల్పించినది ఇతడే.
తేజ్ చంద్ర (1863–1912) : ‘మ’ కు విద్యార్థి. శ్రీరామకృష్ణుల పట్ల, మాతృమూర్తి శారదాదేవి పట్ల చిన్నతనం నుంచే భక్తిప్రపత్తులు గలవాడు.
తోతాపురి : నాంగ్టా – చూడండి.
త్రైలోక్యనాథ్ సాన్యాల్ (1840–1916) : బ్రహ్మసమాజ భక్తుడు; కేశవసేన్ అనుయాయి. మంచి గాయకుడు. దక్షిణేశ్వరానికి అనేకసార్లు వచ్చి శ్రీరామకృష్ణుల సమక్షంలో పాడాడు. కేశవసేన్ ఇతడికి చిరంజీవి శర్మ అనే బిరుదాన్ని ఇచ్చాడు. ఇతడు సామాన్యంగా తనను ప్రేమ్‌దాస్ అని చెప్పుకొంటాడు. ఈ రెండు పేర్లతోను ఇతడు వేలాది పాటలు, నాటకాలు రచించాడు. ఇతడు రచించిన ‘నవబృందావనం’ అనే నాటకాన్ని శ్రీరామకృష్ణులు తిలకించారు. దీన్లో నరేంద్రుడు ‘పహడి బాబా’ అనే నాటకాన్ని చదవమని శ్రీరామకృష్ణులు భక్తులకు చెప్పటం కద్దు.
త్రైలోక్య విశ్వాస్ : మథుర్బాబు కుమారుడు. 1871 నుంచి దక్షిణేశ్వర ఆలయాల నిర్వహణాబాధ్యతను చేపట్టాడు.
త్రైలింగస్వామి (1607–1887) : కాశీలో జీవించిన మహాయోగి. ఈయన దాదాపు మూడు వందల ఏళ్లు జీవించినట్లు చెప్పుకొంటారు. శివుని అవతారంగా ఈయన్ను లోకులు ఆరాధిస్తారు. శ్రీరామకృష్ణులు ఈయనను 1868 లో కాశీలో దర్శించారు. ఈయన ఒక పరమహంస అని శ్రీరామకృష్ణులు హృదయ్‌తో చెప్పారు. కాలాంతరంలో మాతృమూర్తి శారదాదేవి కాశీకి వెళ్లినప్పుడు ఈయన్ను దర్శించారు.
దయానంద సరస్వతి (1824–1883) : ఆర్యసమాజ వ్యవస్థాపకుడు. వేద వేదాంగ పారంగతుడు. శ్రీరామకృష్ణులు ఈయనను కలకత్తాలోని సింథీ అనే చోట కలుసుకొన్నారు.
దుకొరి డాక్టర్ : శ్యాంపుకూర్లో శ్రీరామకృష్ణులకు చికిత్స చేసిన వ్యక్తి. శ్రీరామకృష్ణులు రాజేంద్ర మిత్ర ఇంట్లో సమాధి స్థితిని పొందినప్పుడు ఆయన కళ్లమీద చేతులు పెట్టి ఆయన స్థితిని ఇతడు పరిశోధించాడు.
దేవేంద్రుడు (1817–1905) : మహర్షి దేవేంద్రనాథ్ టాగూర్. రవీంద్రనాథ్ టాగూర్ తండ్రి. గొప్ప సాధకుడు. ఆది బ్రహ్మసమాజ స్థాపకుడు. బ్రహ్మ సమాజ ఉపాసనా పద్ధతిని రూపొందించాడు. ఈయన గురించి విని శ్రీరామకృష్ణులు ఈయనను చూడవెళ్లారు. ఈయనను ‘కలియుగ జనకు’ డని ప్రశంసించారు. ఈయన్ను వేదమంత్రాలు కొన్నిటిని ఉచ్చరించమని, ఆలకించారు. శ్రీరామకృష్ణులు. అవి తమ ఆత్మానుభూతులతో సరిపోలినాయని తెలిపారు.
దేవేంద్రుడు (1844–1911) : దేవేంద్రనాథ్ మజుందార్. గృహస్థ భక్తుడు. చిన్నతనంలో పేదరికం కారణంగా ఎంతో కష్టం అనుభవించాడు. చిన్నతనంలోనే యోగాభ్యాసం అలవరచుకొన్నాడు. దాని కారణంగా దివ్యదృశ్యాలు గాంచాడు. ‘పరమహంస రామకృష్ణ’ అనే పుస్తకంలో శ్రీరామకృష్ణులను గురించి చదివి 1884 లో మొట్టమొదటిసారిగా ఆయన్ను దర్శించాడు. వెళ్లిన రోజు అతడి ఆరోగ్యం బాగాలేనందున వెంటనే ఇంటికి తిరిగి వెళ్లిపోయాడు. ఇంటికి వచ్చి పడుకొన్నప్పుడు శ్రీరామకృష్ణుల దివ్యదర్శనం కలిగింది. తరువాతి రోజుల్లో సన్యాసం స్వీకరింపగోరి శ్రీరామకృష్ణుల అనుమతిని అడిగినప్పుడు ఆయన ఆమోదించలేదు. శ్రీరామకృష్ణుల మహాసమాధి తరువాత ‘శ్రీ శ్రీరామకృష్ణ అర్చనాలయం’ అనే సంస్థను నెలకొల్పి శ్రీరామకృష్ణుల మహత్వాన్ని ప్రచారం చేయసాగాడు. శ్రీరామకృష్ణులపై అనేక పాటలు రచించి ‘దేవగీతి’ అనే పేర పుస్తక రూపంలో వెలువరించాడు. ఈయన రచించిన ‘భవసాగర తారణ కారణహే’ అనే పాట సుప్రసిద్ధమైనది.
ద్వారికా బాబు : ద్వారికానాథ్ విశ్వాస్. మథుర్బాబు పెద్ద కుమారుడు, శ్రీరామకృష్ణుల పట్ల అత్యంత భక్తిప్రపత్తులు గలవాడు. ఇతడి భక్తిని శ్రీరామకృష్ణులు ప్రశంసించటం కద్దు. ఇతడు తన నలభయ్యో ఏట మరణించాడు.
ద్విజుడు : ద్విజసేన్. ‘మ’ భార్య తమ్ముడు. ఇతడు దక్షిణేశ్వరం రావటం పట్ల ఇంట్లో ఎంతో వ్యతిరేకత ఉండేది. ఈ విషయంగా ఇతడి తండ్రి శ్రీరామకృష్ణులతో మాట్లాడటానికి వచ్చాడు. అప్పుడు శ్రీరామకృష్ణులు అతడితో ఎంతో మధురంగా మాట్లాడి, ద్విజుని ప్రశంసించి అతడు దక్షిణేశ్వరానికి రావటానికి వ్యతిరేకత లేకుండా చేశారు.
ధని కామారిణి : శ్రీరామకృష్ణుల ఉపనయన సమయంలో ప్రథమ భిక్ష ఒసగిన మహిళ.
నందలాల్ బోస్ : గొప్ప సంపన్నుడు. ఈయన ఇంట్లో అనేక దేవీదేవతల అందమైన చిత్తరువులు ఉన్నవని విని శ్రీరామకృష్ణులు ఒకసారి వాటిని చూడగోరి అక్కడకు వెళ్లారు. చాలసేపు వాటిని తిలకించి ఆనందించారు; ఆయనతో చాలసేపు మాట్లాడారుకూడా.
నందలాల్ సేన్ : కేశవసేన్ బంధువు. ఆయన ద్వారా శ్రీరామకృష్ణులను దర్శించుకొనే భాగ్యం కలిగింది. కాలాంతరంలో ఇతడు కేశవసేన్, శ్రీరామకృష్ణుల మిత్రుడైన హీరానంద్తో సింధు ప్రాంతానికి వెళ్లి గొప్ప సమాజ సేవకునిగా ఖ్యాతి గాంచాడు.
నందిని : మణిమల్లిక్ వితంతు కుమార్తె. ధ్యానసమయంలో మనస్సును ఏకాగ్రంచేయలేకున్నానని శ్రీరామకృష్ణులతో మొరపెట్టుకొన్నది. అప్పుడు ఆయన, నందిని ఎంతో ఆప్యాయంగా చూసుకొంటూ ఉన్న ఆమె మేనల్లుడినే బాలగోపాలునిగా ఎంచి సేవించమని తెలిపారు. ఈ ఉపదేశం అనుసరించి నందిని ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నత స్థితిని పొందగలిగింది.
నకుట్ ఆచార్య : మంచి గాయకుడు. కామార్పుకూర్కు చెందినవాడు. ఇతడు పాడుతూ నృత్యం చేయడాన్ని శ్రీరామకృష్ణులు ఎంతో ప్రశింసించేవారు.
నకుట్ బాబాజీ : వైష్ణవ భక్తుడు, మంచి గాయకుడు, కామార్పుకూర్కు చెందినవాడు. జామాపుకూర్లో ఒక దుకాణం పెట్టుకొన్నాడు. శ్రీరామకృష్ణులు జామాపుకూర్లో వసించిన రోజుల్లో తరచు ఇతడి దుకాణానికి పోవటం కద్దు.
నగేంద్రనాథ్ గుప్త (1862–1940) : బీహార్‌కు చెందినవాడు. నరేంద్రుడి మిత్రుడు, సహాధ్యాయి. శ్రీరామకృష్ణులు స్టీమర్లో కేశవసేన్తో విహారానికి వెళ్లినప్పుడు ఇతడు శ్రీరామకృష్ణులను మొదటిసారి దర్శించాడు. ఆయన పట్ల ఎంతో ఆకర్షితుడైనాడు. శ్రీరామకృష్ణుల గురించి అనేక వ్యాసాలు వ్రాశాడు.
నరేంద్రుడు (1863–1902) : స్వామి వివేకానందులు.
నవగోపాల్ ఘేష్ (1832–1909) : శ్రీరామకృష్ణులను చైతన్యులుగా ఎంచి ఆరాధించిన వ్యక్తి ఇతడు. కల్పతరువు దినాన శ్రీరామకృష్ణుల ఆశీర్వాదాలను పొందిన భాగ్యశాలి. నాడు శ్రీరామకృష్ణులు పారవశ్య స్థితిలో ఇతడితో తమ నామాన్నే జపించమన్నారు. నాటి నుంచి ఇతడు సదా ‘జయ రామకృష్ణ’ అంటూ ఉచ్చరిస్తూ ఉండటం భక్తులకు సువిదితం. ఈయన ఇంట్లో 1898 లో స్వామి వివేకానందులు శ్రీరామకృష్ణులు విగ్రహ ప్రతిష్ఠ గావించారు. అక్కడే ‘ఓం స్థాపకాయచ’ అని ప్రారంభమయ్యే శ్రీరామకృష్ణ ప్రణామ మంత్రాన్ని ఆయన రచించారు. నవగోపాల్ భార్య పరమ పవిత్రురాలని మాతృదేవి శారదాదేవి చెప్పేవారు.
నవాయ్ చైతన్య : నవగోపాల్ మిత్ర. శ్రీరామకృష్ణుల గృహస్థ భక్తుడైన మనోమోహన్ అన్నగారుతీ. అతడు తరచు దక్షిణేశ్వరం వచ్చి శ్రీరామకృష్ణుల సమక్షంలో గానం చేయటం కద్దు. పానీహాటి ఉత్సవంలో శ్రీరామకృష్ణుల విశిష్ట అనుగ్రహాన్ని పొందిన వ్యక్తి. కాలాంతరంలో సకలం త్యజించి ఆధ్యాత్మిక జీవితం గడిపాడు.
నవీన్ నియోగి : దక్షిణేశ్వర వాస్తవ్యుడు. 1884 లో ఇతడి ఇంట్లో నీలకంఠ ముఖర్జీ నాటక ప్రదర్శన జరిగింది. ఆ ప్రదర్శన చూడగోరి శ్రీరామకృష్ణులు అక్కడకు వెళ్లారు. ఇతడి, ఇతడి భార్య భక్తి ప్రపత్తులను శ్రీరామకృష్ణులు ప్రశంసించారు.
నాంగ్టా : తోతాపురి. శ్రీరామకృష్ణులచే అద్వైత సాధనలు అనుష్ఠింప చేసిన గురువు. పంజాబ్‌లో గల లూథియానాలోని అద్వైత మఠ సన్యాసి. నాగా సంప్రదాయానికి చెందినవాడు. ఈయన నర్మదా నదీ తీరాన నలభై ఏళ్ళపాటు కఠోర సాధనలను అభ్యసించి నిర్వికల్ప సమాధిని పొందిన వ్యక్తి.
నాగమహాశయ్ (1846–1899) : దుర్గాచరణ్ నాగ్. శ్రీరామకృష్ణుల అతిముఖ్య గృహస్థ భక్తులలో ఒకరు. ‘శ్రీరామకృష్ణులను ఎవరూ అర్థం చేసుకోలేదు. ఆయన్ను ఒకింత అర్థం చేసుకొన్న వ్యక్తులు ఎవరన్నా ఉన్నారంటె వారు నరేంద్రుడు, నాగమహాశయ్లు మాత్రమే’ అని గిరీశ్చంద్ర ఘోష్ చెప్పటం కద్దు. గృహస్థ జీవనం సాగిస్తూ ఉన్నప్పటికీ ఆధ్యాత్మికోన్నతి పొందనగును అని చెప్పటానికి ఈయన జీవితం ఒక సోదాహరణ. ‘నాగమహాశయ’ పేరిట ఈయన జీవిత చరిత్ర పుస్తకం తెలుగులో వెలువడింది.
నారాయణ్ : ‘మ’ విద్యార్థి. ఇతడి పవిత్రత, నిష్కళంకతల కారణంగా శ్రీరామకృష్ణులు ఇతణ్ణి ఎంతగానో ప్రేమించారు. ఇతడు శ్రీరామకృష్ణుల దర్శనార్థం రావటం ఇంట్లోవారు వ్యతిరేకించారు. ఐనప్పటికీ ఇతడు రావటం కొనసాగించాడు. అతి పిన్నవయస్సులోనే మరణించాడు.
నారాయణ శాస్త్రి : రాజస్థాన్‌కు చెందినవాడు. గొప్ప పండితుడు. శ్రీరామకృష్ణుల సాధనానుష్ఠాన కాలంలో ఆయన్ను కలుసుకొన్నాడు. కాలాంతరంలో శ్రీరామకృష్ణుల వద్ద సన్యాసదీక్ష స్వీకరించి, ఎటో వెళ్లిపోయాడు.
నిత్యగోపాల్ (185–1911) : కాలాంతరంలో జ్ఞానానంద అవధూత నామధేయుడు. తులసికి బంధువు. చిన్నతనంలోనే ఇతడు పరమహంస స్థితి పొంది ఉన్నాడని శ్రీరామకృష్ణులు చెప్పేవారు. పలురకాల సాధనలు అనుష్ఠించిన వ్యక్తి. ఈ కారణంగానే శ్రీరామకృష్ణులు తక్కిన భక్తులను ఇతడితో సన్నిహితంగా మెలగవద్దనేవారు. శ్రీరామకృష్ణుల మహాసమాధి పిదప ఆయన అస్థులు కాంకూర్ గాచ్ఛి అనే చోట కొంతకాలం పదిలపరచటం జరిగింది. నిత్యగోపాల్ అక్కడ కొన్ని నెలలు శ్రీరామకృష్ణులకు పూజలు నిర్వర్తించాడు. కాలాంతరంలో జ్ఞానానంద అవధూత నామాన్ని స్వీకరించాడు. ఆ తరువాత మహానిర్వాణ మఠ మనే సంస్థను రూపొందించాడు. పానీహాటీలో కైవల్య మఠాన్ని ప్రారంభించాడు. దాదాపు 25 పుస్తకాలు రచించాడు. వాటిలో కొన్ని ఆంగ్లంలోకి అనువదించబడ్డాయి.
నిరంజన్ (1862–1904) : యువభక్తులలో ఒకరు. కాలాంతరంలో స్వామి నిరంజనానంద.
నీలకంఠుడు (1841–1911) : ప్రఖ్యాత నటుడు. గోవింద అధికారి నాటకబృందంలో ఉండేవాడు. ఆతడి మరణానంతరం ఆ నాటక బృందం బాధ్యతలు చేపట్టాడు. దక్షిణేశ్వరానికి వచ్చి శ్రీరామకృష్ణుల సమక్షంలో చాలసార్లు గానం చేశాడు. ఈతడి నాటక ప్రదర్శనలు తిలకింప శ్రీరామకృష్ణులు వెళ్లటం కూడ జరిగింది.
నీలమాధవ్ సేన్ : కాశీపూర్‌కు చెందిన వ్యక్తి. కేశవసేన్తో స్టీమర్లో మొదటిసారి శ్రీరామకృష్ణులను దర్శించాడు. పిదప తరచు దక్షిణేశ్వరంలో ఆయన్ను దర్శించేవాడు. ఘాజీపూర్‌లో వసించిన మహాజ్ఞాని పవహారిబాబా తమ గదిలో శ్రీరామకృష్ణుల ఛాయాచిత్రాన్ని ఉంచుకొని ఉన్నారని శ్రీరామకృష్ణులకు తెలిపింది ఇతడే.
పద్మలోచన్ : పండిత పద్మలోచన తర్కాలంకార్. అద్వైతం, న్యాయం మొదలైన తత్త్వశాస్త్రాలలో గొప్ప పండితుడు. బర్డ్వాన్ రాజాస్థాన పండితుడుగా ఉండేవారు. ఈయనను శ్రీరామకృష్ణులు కలుసుకోవటానికి ఎంతో ఇష్టం చూపారు. కలుసుకోగానే ఇద్దరూ ఆనందించారు. ఈయనలోని సిద్ధిని తాముగా తెలుసుకొని శ్రీరామకృష్ణులు వెల్లడించారు. ఆ పిదప ఈయన శ్రీరామకృష్ణులను ఇష్టదైవంగా ఎంచి ఆరాధించారు.
పల్టు : ప్రమథనాథ్కర్. కాలాంతరంలో ‘మ’ విద్యార్థి. శ్రీరామకృష్ణులు ఇతడితో, ‘నీకు అన్నీ సమకూరుతాయి, కాని కొంత ఆలస్యం అవుతుంది’ అని చెప్పారు. కాలాంతరంలో ఇతడు ప్రజాసంక్షేమ, దీనజనోద్ధరణ కార్యాలలో తీవ్రంగా పాల్గొన్నాడు.
పవహారీ బాబా (1840–1898) : కాశీకి సమీపంలోని ఘాజీపూర్‌లో వసించిన యోగిపుంగవుడు. భూమికి క్రిందనున్న ఒక గుహలో జీవించాడు. ఆయన గుహలో శ్రీరామకృష్ణుల ఛాయాచిత్రాన్ని ఉంచుకొన్నాడు. 1890 లో స్వామి వివేకానందులు వెళ్లి ఈయనను కలుసుకొన్నారు.
పూర్ణుడు (1871–1913) : పూర్ణచంద్ర ఘోష్. గృహస్థ భక్తులలో ఇతణ్ణి మాత్రమే శ్రీరామకృష్ణులు ఈశ్వరకోటిలోని వాడని ప్రకటించారు. ‘మ’ ప్రోద్బలంతో చిన్నతనంలోనే శ్రీరామకృష్ణుల వద్దకు వచ్చాడు. స్వామి వివేకానందులతో సన్నిహితంగా మెలగిన వ్యక్తి. తదనంతర కాలంలో వివేకానంద సొసైటీని స్థాపించి పలురకాల కార్యక్రమాలను నిర్వహించాడు.
పెద్దగోపాల్ (1829–1909) : కాలాంతరంలో స్వామి అద్వైతానంద. శ్రీరామకృష్ణుల సన్యాస శిష్యులందరికంటె, ఆయన కంటె వయస్సులో పెద్దవాడు.
ప్రతాప్‌చంద్ర మజుందార్ (1840–1905) : బ్రహ్మసమాజ నాయకులలో ఒకడు. బ్రహ్మసమాజ లక్ష్యాల ప్రచారార్థం ఐరోపా, అమెరికా, జపాన్లలో ఇతడు పర్యటించాడు. 1875 లో శ్రీరామకృష్ణులను దర్శించాడు. కేశవసేన్ మరణానంతరం నవవిధాన్ బ్రహ్మసమాజపు నాయకుడైనాడు. శ్రీరామకృష్ణులను గురించి ఇతడు రచించిన ‘ Hindu Saint, Orient Christ, Paramahamsa Ramakrishna’ గ్రంథాలు ప్రసిద్ధి కెక్కాయి. 1893 లో చికాగోలో జరిగిన సర్వమత మహాసభలో ప్రతినిధిగా పాల్గొన్నాడు. అక్కడ స్వామి వివేకానందులను కలుసుకొన్నాడు.
ప్రతాప్ డాక్టర్ (1851–1922) : హోమియోపతి డాక్టర్. కాశీపూర్‌లో శ్రీరామకృష్ణులకు చికిత్స చేశాడు. 1893 చికాగోలో జరిగిన సర్వమత మహాసభకు ఇతడు ఆహ్వానితుడు.
ప్రసన్న (1865–1915) : శారదాప్రసన్న మిత్ర. యువ శిష్యులలో ఒకరు. కాలాంతరంలో స్వామి త్రిగుణాతీతానంద.
ప్రాణకృష్ణుడు : భారీకాయం కలిగి ఉండటంతో శ్రీరామకృష్ణులు ఇతణ్ని ‘లావు బ్రాహ్మణుడు’ అని పిలిచేవారు. వేదాంత చర్చల పట్ల అమిత ఆసక్తి గలవాడు.
ప్రియనాథ్ ముఖోపాధ్యాయ : నరేంద్రుని పొరుగింటి వ్యక్తి, మిత్రుడు, బ్రహ్మ సమాజ భక్తుడు. కాలాంతరంలో చక్కని శిల్పిగా పేరుగాంచాడు. గురుదాస్ వర్మ అనే మారుపేరిట ‘శ్రీరామకృష్ణ చరితమ్’ అనే గ్రంథం రచించాడు. చిన్నతనం నుండీ శ్రీరామకృష్ణుల వద్దకు రాసాగాడు. ఇతడు స్వామి వివేకానందులతో చేసిన సంభాషణలు ‘వివేకానంద సాహిత్య సర్వస్వంలో’ చూడవచ్చు.
ఫకీర్ : యజ్ఞేశ్వర భట్టాచార్య, బలరాం పురోహిత వంశజుడు. ఇతడు స్తోత్రాలు వల్లించే పద్ధతిని శ్రీరామకృష్ణులు ఎంతో ఇష్టపడేవారు.
బంకిమ్ : ‘మ’ మిత్రుడు. అతడు ఇక్కడకు రాకున్నప్పటికీ నిన్ను చూడటం వల్లనే అతడికి ఆధ్యాత్మిక చైతన్యం కలుగుతుందని శ్రీరామకృష్ణులు ‘మ’ తో ఇతణ్ణి గురించి చెప్పారు.
బంకించంద్ర ఛటోపాధ్యాయ (1838–1894) : గొప్ప సాహితీవేత్త. సుప్రసిద్ధ ‘వందేమాతరం’ గీత రచయిత. ఈయన రచించిన ‘దేవి చైధురాణి’ అనే పుస్తకాన్ని ‘మ’ చేత చదివించుకొని శ్రీరామకృష్ణులు వినటం ‘కథామృతం’ లో చూడవచ్చు.
బలరాం బోసు (1842–1890) : శ్రీరామకృష్ణుల గృహస్థ భక్తులలో అతి ముఖ్యులలో ఒకరు. ఈయన ఇంటికి శ్రీరామకృష్ణులు వందసార్లకు పైనే వెళ్లారు. కాలాంతరంలో శ్రీరామకృష్ణ మఠ సన్యాసులు పలువురు ఈయన ఇంట్లో బస చేయటం జరిగింది. ఈయన ఇంటి భోజనం ‘అతి పవిత్రమైనది’ అనేవారు శ్రీరామకృష్ణులు. ఈయన ఇల్లు ‘బలరాం మందిర్’ అన్న పేరిట ప్రస్తుతం రామకృష్ణ మిషన్ శాఖలలో ఒకటిగా విరాజిల్లుతూ ఉన్నది.
బాబూరాం (1861–1918) : యువ శిష్యులలో ఒకరు. కాలాంతరంలో స్వామి ప్రేమానందం.
భగవాన్‌దాస్ బాబాజీ : వైష్ణవ సంప్రదాయంలో మహానుభావుడుగా కీర్తింపబడ్డాడు. ఈయన భక్తి గురించి విని శ్రీరామకృష్ణులు వెళ్లి ఈయనను చూశారు.
భగవాన్ రుద్ర; డాక్టర్. 1885 లో శ్రీరామకృష్ణుల చికిత్స నిమిత్తం వచ్చాడు. శ్రీరామకృష్ణుల జీవితం గురించి విని, ఆయనను శోధింప ఒక రూపాయ నాణేన్ని ఆయన చేతిలో పెట్టాడు. మరుక్షణంలోనే శ్రీరామకృష్ణుల చెయ్యి వంకర్లు తిరిగి, ఊపిరి ఆగిపోయినట్లయింది. నాణేన్ని తీసివేశాక ఆయన సాధారణ స్థితిలోకి వచ్చాడు.
భవనాథ్ (1863–1896) : నరేంద్రుని సన్నిహిత మిత్రుడు. శ్రీరామకృష్ణులు వీరిద్దరిని హరిహరాత్ములనేవారు. మంచి గాయకుడు. పలు పుస్తకాలు రచించి ఉన్నాడు.
భాస్కరానందుడు (1833–1899) : కాశీలో వసించిన మహాపురుషుడు. ఈయనను దర్శించిన వైనం గురించి మణిమల్లిక్ శ్రీరామకృష్ణులకు తెలిపాడు. కాలాంతరంలో మాతృమూర్తి శారదాదేవి కూడా (1886 లో) ఈయనను కలుసుకొన్నారు. స్వామి వివేకానందులు కూడ ఈయనను కలుసుకోవటం జరిగింది.
భువనేశ్వరీ దేవి : నరేంద్రుని తల్లి. శ్రీరామకృష్ణులు కాశీపూర్‌లో గడిపిన రోజుల్లో నరేంద్రుడు అక్కడే బసచేసి ఆయన సేవలలో నిమగ్నుడైనాడు. కుమారుని చూడటానికై భువనేశ్వరీదేవి తరచు అక్కడకు వెళ్లటం జరిగింది.
భూపతి : శ్రీరామకృష్ణులు భావపారవశ్య స్థితిలో ఒకరోజు ఇతణ్ణి స్పృశించినప్పుడు, ఆధ్యాత్మికోన్నత అనుభూతిని చవిచూశాడు. తదనంతర కాలంలో ఇతడి శిష్యులు ఋషభ ఆశ్రమాన్ని నిర్వహించారు.
భైరవీ బ్రాహ్మణి : శ్రీరామకృష్ణుల తాంత్రిక సాధనల గురువు.
మథుర్బాబు (1817–1871); మథుర్మోహన్ విశ్వాస్. రాణి రాస్మణి అల్లుడు. దక్షిణేశ్వర కాళికాలయ నిర్వాహకుడు. శ్రీరామకృష్ణుల పట్ల అత్యంత భక్తిప్రపత్తులు ఉన్నవాడు. శ్రీరామకృష్ణుల సాధన కాలంలో ఆయన అవసరాలన్నిటిని సమకూర్చి శాశ్వతకీర్తి గాంచాడు.
మనోమోహన్ మిత్ర (1851–1903) : రాఖాల్, రామ్‌ల బంధువు. బ్రహ్మ సమాజస్థుడు. శ్రీరామకృష్ణులను కలుసుకొన్న తరువాత ఆయన్ను గురువుగా స్వీకరించాడు. కాలాంతరంలో బారానగర మఠంలో వసించిన సన్యాస శిష్యులతో సన్నిహిత సంబంధం కలిగి ఉన్నాడు. శ్రీరామకృష్ణులను గురించి పుస్తకాలు రచించాడు. శ్రీరామకృష్ణులను గురించి తెలుసుకోగోరి అనేకులు ఇతడి ఇంటికి వెళ్లేవారు.
మహిమాచరణ్ చక్రవర్తి : వేదాంత చర్చలపట్ల అమిత ఆసక్తి గలవాడు. శ్రీరామకృష్ణులపట్ల భక్తి ప్రపత్తులు ఉన్నవాడు. సంస్కృతాంగ్లాలలో పాండిత్యం గలవాడు. ఉదారుడు. తన పాండిత్యం, వివేకం, ధార్మిక చింతన, ఉదారతలను ఇతరులకు తెలియచేయటంలో పాటుపడతాడు; ఇది కొన్ని సమయాల్లో అతణ్ణి పరిహాసా స్పదుని గావించటం కద్దు. ఇతడి ఇంట్లో అన్నపూర్ణాదేవి ప్రతిష్ఠింపబడి ఉంది.
మహేంద్ర గోస్వామి : వైష్ణవ సంప్రదాయి. రామ్, సురేంద్రుల పొరుగింటి వ్యక్తి. శ్రీరామకృష్ణులు రామ్ ఇంటికి విచ్చేసినప్పుడల్లా ఇతడు వెళ్లి ఆయనను దర్శించేవాడు. శ్రీరామకృష్ణుల మతసామరస్య భావన ఇతడిని ఎంతో ఆకట్టుకొంది.
మహేంద్రనాథ్ గుప్త (1854–1932) : ‘మ’. శ్రీరామకృష్ణుల అమృత వచనాలను లోకానికి అందచేయటం ద్వారా మానవాళి చరిత్రలో శాశ్వతకీర్తి గాంచాడు. ఈయన జీవిత చరిత్ర ‘శ్రీరామకృష్ణ కథామృతం’ మూడవ సంపుటంలో పొందుపరచబడింది. మహేంద్ర ముఖోపాధ్యాయ; పలురకాల వ్యాపారాలు చేసేవాడు. పిండి మిల్లు, వస్త్ర వ్యాపారం లాటివి ముఖ్యమైనవి. శ్రీరామకృష్ణులు ఇతడి మిల్లుకు వెళ్లి ఉన్నారు. కాలాంతరంలో మఠ సన్యాసులకు అవసరమైన పిండి, వస్త్రాలు వంటివాటిని ఇతడు ఇవ్వటం జరిగింది.
మహేంద్రలాల్ సర్కార్ (1833–1904) : మథుర్బాబు కుటుంబ వైద్యుడు. శ్రీరామకృష్ణులు శ్యాంపుకూర్లో ఉన్నప్పుడు ఆయన చికిత్స నిమిత్తం వచ్చాడు. శ్రీరామకృష్ణులు సమాధిమగ్నులై ఉన్నప్పుడు ఆయన శరీరంలోని మార్పులను పరిశోధించాడు. ఆయన్ను ఎంతో గౌరవించాడు. ఆయన ఒక పూర్ణపురుషుడని ప్రశంసించిన ఈతడు ఆయన్ను ఇతరులు అవతార పురుషుడని పేర్కోటం అంగీకరించలేదు.
మణిమల్లిక్ : మణిమోహన్ మల్లిక్; మణిలాల్ మల్లిక్. అరవై లేక అరవై ఐదేళ్ల మణి మల్లిక్ బ్రహ్మసమాజ భక్తుడు. కడు పిసినారి. చిన్న కుమారుణి మరణ శోకంతో శ్రీరామకృష్ణులను కలుసుకొన్నాడు. ఇతడి ఇంటికి శ్రీరామకృష్ణులు పలుమార్లు వెళ్లటం జరిగింది.
మణిసేన్ : మణిమోహన్ సేన్. విడిగాను, సంగీత బృందంతోను పలుమార్లు దక్షిణేశ్వరం వచ్చిన వ్యక్తి. మథుర్బాబు మరణానంతరం శ్రీరామకృష్ణుల దైనందిన ఖర్చులు భరించాడు.
మణింద్ర గుప్త (1871–1939) : తన 11 వ ఏటనే శ్రీరామకృష్ణులను దర్శించాడు. తన సోదరుడైన ఉపేంద్ర కిశోర్‌తో ఇతడు దక్షిణేశ్వరానికి వచ్చేవాడు. పిదప ఉద్యోగార్థం బయట ఊరికి వెళ్లిపోవటం జరిగింది. తరువాత 1885 లో తన 15 వ ఏట శారదాప్రసన్నునితో కలిసి వచ్చి శ్రీరామకృష్ణులను దర్శించాడు. పిదప గృహస్థుడైనాడు; శ్రీరామకృష్ణుల సన్యాస శిష్యులతో సన్నిహిత సంబంధం కలిగి ఉన్నాడు.
మానమయి : ‘మ’ కుమార్తె. కుమారుడు మరణించినప్పుడు శోకతప్తురాలైన ‘మ’ భార్యను ఈ పిల్లతో మాతృదేవి వద్ద కలిసి ఉండమని శ్రీరామకృష్ణులు పంపించారు.
మిశ్ర : ప్రభుదయాళ్ మిశ్ర. భారతదేశ వాయవ్య ప్రాంతానికి చెందినవాడు. ఒక సోదరుని వివాహ సమయంలో అతడు, మరో సోదరుడు హఠాత్తుగా మరణించారు. అందుచేత విరక్తి చెంది సన్యాసి అయినాడు. బ్రాహ్మణుడై ఉండీ క్రైస్తవ మతం పుచ్చుకొన్నాడు. కాని క్రైస్తవమత ఉడుపుల క్రింద కాషాయవస్త్రం ధరించేవాడు. తన ముఫై ఐదవ ఏట శ్రీరామకృష్ణులను శ్యాంపుకూర్లో కలుసుకొన్నాడు. అంతకు మునుపుకూడా శ్రీరామకృష్ణులను అతడు దర్శించి ఉన్నాడు. శ్రీరామకృష్ణులను సాక్షాత్తు ఏసుక్రీస్తుగా భావించాడు.
మైకేల్ మధుసూదన్ దత్త (1824–1873) : వంగదేశపు పునర్జాగృతీ కాలపు ప్రముఖుడు. హైందవుడుగా ఉండి క్రైస్తవమతం పుచ్చుకొన్నాడు. ఉన్నత న్యాయస్థానంలో న్యాయవాది. ఇతడు రచించిన నాటకాలు, కావ్యాలు ఎంతో ప్రసిద్ధి గాంచాయి. ముఖ్యంగా ‘మేఘనాథ వధ’ కావ్యం వంగ సాహిత్యపు పునరుజ్జీవనానికి బీజమై ఒప్పారింది. ఏదో కార్యార్థం ఇతడు మథుర్బాబు కుమారుడైన ద్వారికా బాబును కలుసుకోటానికి దక్షిణేశ్వరానికి వచ్చాడు. అప్పుడు ద్వారికాబాబు ఇతడిని శ్రీరామకృష్ణులకు పరిచయం చేశాడు. శ్రీరామకృష్ణులు అతడితో మాట్లాడలేకపోయారు. ఆ సమయంలో ఎవరో తమ గొంతును నొక్కిపట్టినట్లుగా ఉండినదని పిదప ఆయన తెలిపారు. అతడు మతం మార్చుకోవటం తప్పు అని ఆయన చెప్పారు.
యంతీంద్రుడు (1831–1908) : యతీంద్ర మోహన్ టాగూర్. కలకత్తాలోని పెద్ద జమీందార్లలో ఒకడు, మహారాజు బిరుదాంచితుడు. ధర్మశీలుడు. హైందవ మతాభిమాని. యదుమల్లిక్ ఇంట్లో మొదటిసారి శ్రీరామకృష్ణులను దర్శించాడు.
యదులాల్ మల్లిక్ (1844–1894) : గొప్ప సంపన్నుడు. దానశీలుడు. శ్రీరామకృష్ణులు 1883 లో ఇతడి ఇంటికి వెళ్లి అక్కడ అనునిత్యం ఆరాధింపబడుతూ ఉన్న సింహవాహినీదేవిని గాంచి సమాధిమగ్నులైనారు. దక్షిణేశ్వర కాళికాలయం సమీపంలో ఇతడికి ఒక ఇల్లు ఉంది. ఆ ఇంట్లో గోడకు వ్రేలాడుతూన్న మేరీమాత చిత్రపటాన్ని చూసి శ్రీరామకృష్ణులు సమాధి స్థితినొందారు. పిదప పంచవటిలో ఏసుక్రీస్తు దర్శనాన్నీ పొందారు. ఆ ఇంటి వసారాలోనే శ్రీరామకృష్ణులు ఒకసారి నరేంద్రుణ్ణి తాకి, అతడిని బాహ్యస్పృహను కోల్పోయేట్లు చేయటం జరిగింది; అప్పుడు నరేంద్రుడి గురించి, ఆతడి ఆవిర్భావం గురించీ తెలుసుకొన్నారు. ఆ ఇంటికి శ్రీరామకృష్ణులు పలుమార్లు వెళ్లారు. అక్కడ ప్రస్తుతం సుందరమైన శ్రీరామకృష్ణ దేవాలయం వెలసి ఉంది.
యోగీన్ (1861–1899) : యోగీంద్రనాథ్ రాయ్ చౌధురి. యువ శిష్యులలో ఒకరు. కాలాంతరంలో స్వామి యోగానంద.
యోగిన్ మా (1851–1924) : యోగీంద్ర మోహినీ విశ్వాస్. యోగీన్ మా పేరిట పరిచితురాలు. శ్రీరామకృష్ణుల శిష్యురాండ్రలో ఒకరు. తీవ్రసాధనలు అనుష్ఠించి ఉన్నత ఆధ్యాత్మిక అనుభూతులు పొందిన వ్యక్తి. కాలాంతరంలో ఈమె జీవితమంతా మాతృమూర్తి శారదాదేవి సాన్నిధ్యంలో గడిచిపోయింది.
యోగేంద్ర బసు (1854–1905) : ‘వంగవాసి’ పత్రికా సంపాదకుడు. 1884 లో అధర్ ఇంట్లో మొట్టమొదటిసారి శ్రీరామకృష్ణులను దర్శించాడు. అనేక పుస్తకాలు రచించాడు.
రతన్ : యదుమల్లిక్ దక్షిణణేశ్వర గృహ నిర్వాహకుడు. శ్రీరామకృష్ణుల పట్ల అమిత భక్తిప్రపత్తులు గలవాడు. యదుమల్లిక్ ఇంట్లో యాత్ర, సంకీర్తన జరిగేటప్పుడు శ్రీరామకృష్ణులను ఆహ్వానించటానికి వెళ్లేవాడు. శ్రీరామకృష్ణులు ఇతణ్ణి ఎంతో అభిమానించారు.
రతి తల్లి : కర్తాభజా సంప్రదాయానికి చెందిన తీవ్రవైష్ణవ సాధకురాలు. అప్పుడప్పుడు దక్షిణేశ్వరం వచ్చి శ్రీరామకృష్ణులను దర్శించేది. శ్రీరామకృష్ణులు ఒకసారి కాళీమాతను ఈమె రూపంలో దర్శించినట్లు చెప్పారు. మత దురభిమానపూరితురాలైన ఈమె ఒకసారి శ్రీరామకృష్ణులు కాళీ ఆలయానికి వెళ్లి మ్రొక్కటమూ, కాళీప్రసాదం స్వీకరించటమూ చూసిన పిదప శ్రీరామకృష్ణులు దర్శించటం మానివేసింది.
రవీంద్రనాథ్ టాగూర్ (1861–1949) : నోబెల్ బహుమతి పొందిన సుప్రసిద్ధ కవీంద్రుడు. మహర్షి దేవేంద్రనాథ్ టాగూర్ కుమారుడు. ఈయన బ్రహ్మ సమాజ ఉత్సవంలో శ్రీరామకృష్ణులను చూశారు. దక్షిణేశ్వరం వెళ్లి కూడ ఆయన్ను దర్శించారు.
రవీంద్రుడు : యువ భక్తుడు. ఇతడి నాలుకపై శ్రీరామకృష్ణులు వ్రాసి ఆశీర్వదించారు. తదనంతరకాలంలో బారానగర్ మఠానికి తరచు వెళ్లేవాడు. కాని చివరకు దుర్జన సాంగత్యంలో పడి భ్రష్టుడయ్యాడు.
రసిక్ : దక్షిణేశ్వర కాళికాలయంలో చెత్తాచెదారం ఊడ్చే పనివాడు. శ్రీరామకృష్ణులను పూర్తిగా శరణుజొచ్చిన వ్యక్తి. శ్రీరామకృష్ణులను ‘బాబా’ అని పిలిచేవాడు. శ్రీరామకృష్ణుల మహాసమాధి తరువాత రెండు సం ॥ లో ఇతడి అంత్యకాలం సమీపించింది. మరణ సమయంలో ‘అదుగో బాబా వచ్చేశాడు, బాబా వచ్చేశాడు’ అంటూ రామకృష్ణా రామకృష్ణా అని జపిస్తూ ప్రాణం వదిలాడు.
రాంచంద్ర ముఖోపాధ్యాయ : మాతృమూర్తి శారదాదేవి జనకుడు.
రాం ఛటర్జీ : కథామృతంలో రాం చక్రవర్తిగా పేర్కోబడ్డాడు. రాధాకాంత ఆలయపూజారిగా వ్యవహరించిన ఇతడు శ్రీరామకృష్ణుల పట్ల ఎంతో భక్తిప్రపత్తులతో మెలగేవాడు.
రాజేంద్రనాథ్ మిత్ర : సహాయ న్యాయమూర్తి. వైస్రాయి మంత్రి మండలి సభ్యుడు. రాంచంద్ర దత్త, మనోమోహన్ మిత్రల స్నేహితుడు. మనోమోహన్ ఇంట్లో ఇతడు శ్రీరామకృష్ణులను దర్శించాడు. ఇతడి ఇంటికి శ్రీరామకృష్ణులు వెళ్లటం జరిగింది.
రాజేంద్రుడు (1818–1889) : హోమియోపతి వైద్యుడు. ఈయన శ్రీరామకృష్ణులకై కొనియిచ్చిన మృదువైన వస్త్రంతో చేయబడిన చెప్పులు ఇప్పటికీ బేలూర్ మఠంలో పూజింపబడుచున్నవి.
రాందయాళ్ చక్రవర్తి : బలరాం పురోహిత వంశజుడు. కేశవసేన్ ప్రసంగాలలో శ్రీరామకృష్ణులను గురించి విని దక్షిణేశ్వరానికి రాసాగాడు. శ్రీరామకృష్ణుల భక్తుడు. తదనంతరకాలంలో రామకృష్ణ మిషన్‌తో సన్నిహిత సంబంధం కలిగి ఉన్నాడు. స్వామి వివేకానందుల లేఖల్లో ఈయన గురించి ప్రస్తావన పలుచోట్ల చూడవచ్చు.
రాంప్రసన్న భట్టాచార్య : కృష్ణకిశోర్ కుమారుడు. శ్రీరామకృష్ణులు ఇతణ్ణి ఎంతగానో అభిమానించారు. తల్లికి సేవలు చేయకుండా ఇతడు దక్షిణేశ్వరంలో వసిస్తూ ఉన్న ఒక ఙహఠయోగికి సేవలు చేయటాన్ని శ్రీరామకృష్ణులు గర్హించారు..
రాంలాల్ : శ్రీరామకృష్ణుల అన్నగారైన రామేశ్వర్ కుమారుడితడు. తండ్రి మరణానంతరం ఇతడు దక్షిణేశ్వర కాళికాలయంలో పూజారిగా నియమించబడ్డాడు. తన జీవితాంతం ఆ పనిలో కొనసాగాడు. మంచి గాయకుడు. కల్పతరువు దినాన శ్రీరామకృష్ణుల అనుగ్రహపాత్రులైనవారిలో ఒకడు.
రాఖాల్ (1863–1922) : రాఖాల్చంద్ర ఘోష్. యువ శిష్యుడు. కాలాంతరంలో స్వామి బ్రహ్మానంద.
రాణి రాస్మణి (1793–1861) : దక్షిణేశ్వర కాళికాలయ నిర్మాత. శ్రీరామకృష్ణుల దివ్యత్వాన్ని కనుగొన్న ప్రథముల్లో ఒకరు.
రాధికప్రసాద్ గోస్వామి (1863–1924) : వైష్ణవ భక్తుడు. చైతన్యదేవుల భక్తుడైన అద్వైత గోస్వామి వంశజుడు. అందుచేత శ్రీరామకృష్ణులు ఈయనకు చేతులు జోడించి నమస్కరించేవారు. తదనంతరకాలంలో సుప్రసిద్ధ సంగీత విద్వాంసుడైనాడు.
రామ్ (1851–1899) : రాంచంద్ర దత్త. ముఖ్యులైన గృహస్థ భక్తుల్లో ఒకరు. ప్రారంభంలో నాస్తికుడిగా ఉండేవాడు. హఠాత్తుగా ఒక కుమారుడు మరణించగా పుత్రశోకంతో కుమిలిపోయి శ్రీరామకృష్ణులను దర్శించాడు. దర్శించగానే మనశ్శాంతి పొందాడు. శ్రీరామకృష్ణులను కలవటం కొనసాగేకొద్దీ మనస్సు పూర్తిగా మారిపోయి, ఆయన్ను అవతారపురుషుడిగా ప్రచారం చేయసాగాడు. ఈ విషయంగా అక్కడక్కడ కొన్ని ప్రసంగాలు ఏర్పాటు చేయించాడు. శ్రీరామకృష్ణులు జీవించి ఉన్నప్పుడే ఆయన్ను గురించి కొన్ని పుస్తకాలు ప్రచురించాడు. ఆయన అనుమతితో కంకూర్గాచ్ఛి అనే చోట ఒక ఉద్యాన గృహాన్ని కొలుగోలు చేసి అక్కడ యోగోద్యాన్ నిర్వహించాడు. శ్రీరామకృష్ణులు ఆ ఉద్యానగృహాన్ని సందర్శించి ఉన్నారు. కాలాంతరంలో శ్రీరామకృష్ణుల అస్థులు ఇక్కడ పదిలపరచబడి, పూజింపబడినవి. ఇప్పుడు ఈ స్థలం రామకృష్ణ మిషన్ శాఖల్లో ఒకటిగా విరాజిల్లుతూ ఉంది.
లక్ష్మీ దీది (1864–1926) : శ్రీరామకృష్ణుల అన్నగారైన రామేశ్వర్ కుమార్తె. పదకొండవ ఏటనే వితంతువు అయింది. మాతృమూర్తి శారదాదేవికి తోడుగా నహబత్లో నివసించింది. ఉత్తర భారతదేశానికి చెందిన ఒక సాధువు నుంచి శక్తిమంత్రదీక్ష పొంది ఉన్నప్పటికీ, శ్రీరామకృష్ణులు ఈమెకు రాధా కృష్ణ మంత్రాన్ని, పూజమంత్రాన్ని నాలుగమీద వ్రాసి దీక్ష ఒసగారు. శ్రీరామకృష్ణులను ఇష్టదైవంగా భావించుకొన్న ఈమె భక్తి సాధనల్లో ఉన్నత స్థితులనూ, పారవశ్య స్థితులనూ పొందినది. దక్షిణేశ్వరంలో భక్తులు చూపించిన ఒక ఇంట్లో దాదాపు పదేళ్లు నివసించిన ఈమె కాలాంతరంలో పలువురికి మంత్ర దీక్ష ఒసగింది. పూరీ క్షేత్రంలో ఈమెకు ఎంతో సంబంధం ఉంది. అక్కడకూడా భక్తులు చూపించిన ఒక ఇంట్లో వసించి, అక్కడే కాలధర్మం చెందింది.
లాటూ (?– 1920) : యువ భక్తులలో ఒకరు కాలాంతరంలో స్వామి అద్భుతానంద. నిరక్షరాస్యుడై గొడ్డుగోదలను మేపుకొంటూ బీహార్‌లో జీవించిన వ్యక్తి. శ్రీరామకృష్ణుల అనుగ్రహంతో కాలాంతరాన గొప్ప పండితులు, విద్వాంసులుకూడా అవగాహన చేసుకోలేని ఆధ్యాత్మిక విషయాలను చక్కగా ఆకళింపు చేసుకొనే ఉన్నత స్థితికి ఎదిగాడు. ‘శ్రీరామకృష్ణులు కనుగొన్న మహాద్భుతం అద్భుతానంద’ అని స్వామి వివేకానందులు ఈయనను పేర్కోటం కద్దు.
శంభుచరణ్ మల్లిక్ : మథుర్బాబు మరణానంతరం తమ అవసరాలను నెరవేర్చటానికై జగజ్జననిచే నియుక్తుడైన వ్యక్తిగా ఇతణ్ణి శ్రీరామకృష్ణులు పరిగణించేవారు. శ్రీరామకృష్ణులను ఇతడు ‘గురూజీ’ అని పిలిచేవాడు. ఇతడు, తన భార్యతో పాడు మాతృమూర్తి శారదాదేవిని సాక్షాత్తు జగజ్జననిగా ఎంచి ఆరాధించేవాడు. ఆమె నహబత్లో శ్రమపడటం చూసి ఆమెకై దక్షిణేశ్వరంలో ఒక ఇల్లు కట్టించాడు. మాతృదేవి ఈ ఇంట్లో కొంతకాలం వసించటం జరిగింది. దాదాపు నాలుగు సం ॥ శ్రీరామకృష్ణులకు సేవ లొనరించిన శంభు 1877 లో శ్రీరామకృష్ణులు జీవించి ఉన్నప్పుడే మరణించాడు.
శరత్ (1865–1927) : శరత్చంద్ర చక్రవర్తి. యువ శిష్యులలో ఒకరు. కాలాంతరంలో స్వామి శారదానంద. వంగభాషలో శ్రీరామకృష్ణుల జీవిత చరిత్రను ‘శ్రీరామకృష్ణ లీలాప్రసంగం’ పేరిట రచించిన మహానుభావుడు.
శశధర్ తర్కచూడామణి (1850–1928) : గొప్ప పండితుడు. హైందవ మతం గురించి వంగదేశంలో అనేకచోట్ల ధర్మోపన్యాసాలు చేసిన వ్యక్తి. కాశింబజార్ రాజాస్థాన పండితుడు. ఈయనను గురించి విని ఉన్న శ్రీరామకృష్ణులు 1884 లో ఈయనను కలుసుకొన్నారు. పిదప ఈయనే శ్రీరామకృష్ణుల పట్ల గాఢంగా ఆకర్షితుడైనాడు.
శశి (1863–1911) : శశిభూషణ్ చక్రవర్తి. ఇతడు శరత్ దాయాది. యువ సన్యాసులలో ఒకరు. కాలాంతరంలో స్వామి రామకృష్ణానంద. ఈ పేరు తాను స్వీకరించగోరానని, కాని శశికి శ్రీరామకృష్ణుల పట్ల గల అచంచల భక్తిప్రపత్తుల కారణంగా ఆతడికి ఆ పేర నామకరణం చేసినట్లు స్వామి వివేకానందులు పేర్కొన్నారు. చెన్నై శ్రీరామకృష్ణ మఠ నిర్మాత ఈయన. నేడు దక్షిణ భారతదేశంలో మనం చూస్తూ ఉన్న శ్రీరామకృష్ణ ఉద్యమ కార్యక్రమాలన్నిటికీ నాంది పలికింది ఈయనే.
శివనాథ్ శాస్త్రి (1847–1919) : బ్రహ్మసమాజ నాయకులలో ఒకడు. గొప్ప రచయిత, విద్యావేత్త. ఆరంభంలో కేశవసేన్తో కలిసి ఉండేవాడు. పిదప అభిప్రాయ భేదాల కారణంగా సాధారణ బ్రహ్మసమాజాన్ని ప్రారంభించాడు. శాస్త్రి అన్నది ఈయన విద్యార్హతను సూచిస్తుంది. ఒక పాఠశాలలో పనిచేస్తున్న ఈయన ‘ఇండియన్ మిర్రర్’ పత్రికలో శ్రీరామకృష్ణులను గురించి చదివి ఆయన్ను దర్శించాడు. అనేక పుస్తకాలు రచించాడు.
శివరామ్ (1866–1933) : శ్రీరామకృష్ణుల అన్నగారైన రామేశ్వర్ కుమారుడు.
శీను శాఖారి : శ్రీనివాస్ శాఖారి, శ్రీరామకృష్ణుల చిన్ననాటి నేస్తం. తన చిన్ననాటే శ్రీరామకృష్ణులను చైతన్యుల అవతారంగా ఎంచి, ఆరాధించాడు.
శ్యామసుందరీ దేవి : శ్రీరామకృష్ణుల భక్తురాండ్రలో ఒకరు. మనోమోహన్ తల్లి. ఈమె నలుగురు కుమార్తెలు, ముగ్గురు అల్లుళ్లు శ్రీరామకృష్ణుల అనుగ్రహానికి పాత్రులైనారు. ఈమె మూడవ అల్లుడే శ్రీరామకృష్ణుల మానస పుత్రునిగా పేర్కోబడే రాఖాల్.
సుబోధ్ (1867–1932) : యువ శిష్యులలో ఒకరు. కాలాంతరంలో స్వామి సుబోధానంద.
సురేంద్రుడు (1850–1890) : సురేంద్రనాథ్ మిత్ర శ్రీరామకృష్ణుల అవసరాలను చూసుకొన్న గృహస్థ భక్తులలో ఒకడు. నాస్తికుడుగా వ్యవహరించిన ఇతడు మిత్రులైన రామ్, మనోమోహన్ల ప్రోద్బలంతో దక్షిణేశ్వరానికి వెళ్లాడు. ఎలాటి ప్రగాఢ విశ్వాసం లేకుండానే శ్రీరామకృష్ణులను దర్శించాడు. కాని ఆ తరువాత తన జీవితాన్నే శ్రీరామకృష్ణుల పాదపద్మాల వద్ద సమర్పించాడు. ఈతడి ఇంటికీ శ్రీరామకృష్ణులు అనేకసార్లు వెళ్లటం జరిగింది. కాశీపూర్‌లో శ్రీరామకృష్ణులు వసించిన రోజుల్లో అధికపాలు వ్యయాన్ని ఇతడే భరించాడు. 1881 లో శ్రీరామకృష్ణులు జన్మదినోత్సవం వేడుకలు ఇతడి ఖర్చుతోనే గొప్పగా జరుపుకోబడినవి. శ్రీరామకృష్ణుల మహాసమాధి తరువాత ఆయన యువ శిష్యులు బారానగర్‌లో శిథిలమైన గృహంలో పేదరికంతో పోరాడుతూ జీవించారు. అప్పుడొక రోజు శ్రీరామకృష్ణులు ఇతడి ముందు ప్రత్యక్షమై తన బిడ్డలకు అవసరమైన ఏర్పాట్లు చేయమని చెప్పారు. అందుమేరకు తన జీవితాంతం వరకు ఆ సన్యాసుల అవసరాలు తీరుస్తూ వచ్చాడితడు. ఈ విధంగా శ్రీరామకృష్ణ ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయుడై నిలిచిపోయాడు సురేంద్రుడు.
హరమోహన్ మిత్ర : నరేంద్రుని మిత్రుడు. ఇతడి తల్లికూడా శ్రీరామకృష్ణుల అనుగ్రహానికి పాత్రురాలైంది. తల్లి ద్వారానే ఇతడు మొట్టమొదట ఆయనను దర్శించాడు. కల్పతరువు దినాన శ్రీరామకృష్ణుల అనుగ్రహానికి పాత్రుడైనాడు. శ్రీరామకృష్ణుల, స్వామీజీల ఉపదేశాలను స్వంత ఖర్చుతో పుస్తకాలుగా అచ్చువేయించి ఉచితంగా పంచిపెట్టటం ఇతడి సేవాకార్యక్రమాల్లో ఒకటి. ఆ పుస్తకాలను, శ్రీరామకృష్ణుల ఉపదేశాలను ఇంటింటికి తీసుకువెళ్లి వారికి ఆయన గురించి తెలియచేసిన వ్యక్తి.
హరి (1863–1922) : హరినాథ్ ఛటోపాధ్యాయ. యువశిష్యులలో ఒకరు. కాలాంతరంలో స్వామి తురీయానంద.
హరి : శ్రీరామకృష్ణుల అనుగ్రహపాత్రుడైన యువకులలో ఒకడు. ‘ముఖర్జీలలో హరి’ అని ఇతడు కథామృతంలో పేర్కోబడ్డాడు. కొన్ని రోజులు ఇతడు దక్షిణేశ్వరానికి రాకుంటే శ్రీరామకృష్ణులు ఇతడి గురించి వాకబు చేసేవారు. ఇతడి భక్తిని ఆయన ఎంతో ప్రశంసించేవారు. కాని ఇతడు మంత్రదీక్ష కోరినప్పుడు ఆయన తిరస్కరించారు.
హరిపదుడు : ‘మ’ ద్వారా శ్రీరామకృష్ణులను దర్శించిన యువకుడితడు. చాలసేపు ధ్యానం చేసేవాడు.
హరిప్రసన్న (1863–1938) : యువ శిష్యులలో ఒకరు. కాలాంతరంలో స్వామి విజ్ఞానానంద.
హలధారి : రాంతారక్ ఛటోపాధ్యా. శ్రీరామకృష్ణులకు వరసకు సోదరుడు. దక్షిణేశ్వర కాళికాలయంలోను పిదప విష్ణ్వాలయంలోను పూజారిగా ఉండేవాడు. శ్రీరామకృష్ణుల సాధనకాలపు సంఘటనలు అనేకం ప్రత్యక్షంగా చూసిన వ్యక్తి ఇతడు.
హాజ్రా : కామార్పుకూర్ సమీపంలో ని ఒక గ్రామానికి చెందిన వ్యక్తి. హృదయ్ ఇంట్లో మొట్టమొదటిసారి శ్రీరామకృష్ణులను దర్శించాడు. ఇంటివద్ద భార్యా బిడ్డలను, ముదుసలి తల్లిని విడిచిపెట్టి శ్రీరామకృష్ణుల వద్దకు వచ్చేశాడు. నిరాకారం గురించి సుదీర్ఘంగా మాట్లాడతాడు. ఇందుచేత నరేంద్రాదులు ఇతడిపట్ల ఆకర్షితులైనారు.
హీరానంద్ : సింధు ప్రాంతీయుడు. విద్యాధికుడు. నవవిధాన్ బ్రహ్మసమాజానికి చెందిన వ్యక్తి. సింధు ప్రాంతంలోని రెండు పత్రికలకు సంపాదకుడుగా వ్యవహరించాడు. ఇతడి పత్రికను శ్రీరామకృష్ణులు మెచ్చుకొనేవారు.
హృదయ్ : శ్రీరామకృష్ణులకు వరుసకు సోదరి కుమారుడు. శ్రీరామకృష్ణుల జీవితంలో చెరిగిపోని స్థానం పొందిన వ్యక్తి. 1855 లో దక్షిణేశ్వరానికి వచ్చిన 25 ఏళ్లు శ్రీరామకృష్ణులకు సేవలు ఒనరించాడు. శ్రీరామకృష్ణుల సాధనలు, ఆ కాలంలో జరిగిన పలు సంఘటనల గురించి ఇతడి నుండే తెలుసుకోబడ్డాయి.