46.1 ప్రథమ పరిచ్ఛేదం శ్యాంపుకూర్లో ‘మ’ తో శ్రీరామకృష్ణులు – డా.సర్కార్ ఇంట్లో ‘మ’
శుక్రవారం, అక్టోబర్ 23, 1885
దుర్గాపూజ తరువాతి పౌర్ణమి రోజు. శ్రీరామకృష్ణులు చికిత్స నిమిత్తం శ్యాంపుకూర్లోని ఇంట్లో వసిస్తున్నారు. సమయం ఉదయం పది గంటలు. శ్రీరామకృష్ణులు ‘మ’ తో సంభాషిస్తున్నారు. ‘మ’ ఆయనకు మేజోళ్ళు తొడుగుతున్నాడు.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): నేను ఈ మఫ్లర్‌ను రెండు ముక్కలుగా చేసి కాళ్ళకు చుట్టుకుంటే ఎంత బాగుంటుంది! బాగా వెచ్చగా ఉంటుంది కదూ!
‘మ’ చిన్నగా నవ్వాడు. నిన్న సాయంత్రం శ్రీరామకృష్ణులు, డా.సర్కార్ల మధ్య సుదీర్ఘ సంభాషణ జరిగింది. దాన్ని గురించి ప్రస్తావిస్తూ, శ్రీరామకృష్ణులు నవ్వుతూ ‘మ’ తో ఇలా అన్నారు: “నిన్న ‘తుహు, తుహు’ కథ (ఆవు చర్మం దూది ఏకేవాడి కథ) ఎలా చెప్పాను?”
శ్రీరామకృష్ణులు నిన్న ఇలా అని ఉన్నారు: “జీవుడు త్రితాపాలలో దగ్ధమైపోతుంటాడు. అయినప్పటికీ ‘ఆ, నేను బాగానే ఉన్నాను’ అంటూంటాడు. ముల్లు గుచ్చుకొని చేతి నుండి బొటబొట రక్తం కారుతూ ఉంటుంది. అయినా కూడా ‘చేతికి ఏమీ కాలేదు’ అంటూనే ఉంటాడు. ముల్లును జ్ఞానాగ్నిలో దగ్ధం చేయాలి.” ఈ మాటలను గుర్తు చేసుకుంటూ చిన్న నరేంద్రుడు ఇలా అన్నాడు: “నిన్న మీరు చెప్పిన ‘ముల్లు కథ’ బాగా ఉంది. ముల్లును జ్ఞానాగ్నిలో దగ్ధం చేయాలి.”
శ్రీరామకృష్ణులు: ఆ స్థితులన్నీ నాకు ప్రత్యక్షంగా అనుభూతమయ్యేవి. ఒక రోజు నేను కుఠీ వెనుక వెళుతుండగా నా ఒళ్ళంతా హోమాగ్నిలో దగ్ధమై కాలిపోతున్నట్లు అనిపించింది. పద్మలోచన్ నాతో ఒకసారి ఇలా అన్నాడు: ‘మీ స్థితుల నన్నిటినీ ప్రకటించడానికి నేనో సభను ఏర్పాటు చేస్తాను’. కాని అటు తరువాత అనతికాలంలోనే అతడు దివంగతుడయ్యాడు.
సమయం పదకొండు గంటలయింది. శ్రీరామకృష్ణుల ఆరోగ్య పరిస్థితిని తెలుపడానికి ‘మ’, డా.సర్కార్ ఇంటికి వెళ్ళాడు. శ్రీరామకృష్ణుల గురించి వినడానికి డాక్టరు ఉత్కంఠతో ఉన్నాడు.
డాక్టరు (నవ్వుతూ): నిన్న నేను ఎలా చెప్పాను? ‘తుహు, తుహు’ (నువ్వు, నువ్వు) అనడానికి దూదిఏకేవాడి చేతిలో పడవలసి ఉంటుంది కదా!
‘మ’ : అవునండి. అలాంటి గురువు చేతిలో పడినప్పుడే అహంకారం నశిస్తుంది. నిన్న భక్తి గురించి కూడా ఆయన ఎలా మాట్లాడారు! భక్తి స్త్రీ లాంటిది, అంతఃపురం వరకు పోగలదు.
డాక్టరు: ఆ, అది మంచి మాటే. కాని అందుకోసం జ్ఞానాన్ని వదలిపెట్టలేము కదా!
‘మ’ : పరమహంస దేవులు కూడా అలా చెప్పరు. ఆయన భక్తి – జ్ఞానం, సాకారం – నిరాకారం రెండింటినీ అంగీకరిస్తారు. భక్తి యొక్క శీతల ప్రభావంతో నీరు అక్కడక్కడా గడ్డకడుతుంది, మళ్ళీ జ్ఞాన భాస్కరుడు ఉదయించగానే ఆ మంచు కరిగిపోతుంది అని ఆయన అంటుంటారు. అంటే భక్తియోగంలో సాకారాన్ని దర్శిస్తాం, జ్ఞానయోగం ద్వారా నిరాకారాన్ని సాక్షాత్కరించుకుంటాం.
“ఇంకా, మీరు చూసే ఉంటారు – ఆయన, భగవంతుణ్ణి ఎంత సామీప్యంగా దర్శిస్తారంటే, ఎల్లవేళలా భగవంతుడితో సంభాషిస్తూనే ఉంటారు. గొంతునొప్పితో బాధ పడేటప్పుడు చిన్నపిల్లాడిలా ‘అమ్మా, నొప్పి పుడుతోంది’ అంటారు.
“ఆయన Observation (పరిశీలనా శక్తి) ఎంత సునిశితమైనదని! మ్యూజియంలో జంతువుల అవశేషాలను ఒకసారి చూశారు. అంతే, వెంటనే దాన్ని ఉదాహరణ చేసుకొని సాధుసాంగత్యం యొక్క ప్రయోజనాన్ని వివరించారు. ఒక వస్తువు రాళ్ళ ప్రక్కన ఉండిపోయి రాయిగా మారిపోయిన రీతిలో మనిషికూడా సాధువులతో పాటు వసిస్తూ సాధువే అయిపోతాడు.”
డాక్టరు: ఈశాన్బాబు నిన్న అవతార పురుషుల గురించి ఏదో మాట్లాడాడు. మనిషిని భగవంతు డనడమా! అదేమిటి?
‘మ’ : ఎవరి విశ్వాసం వారిది. దానిలో మనం ఎందుకు Interfere అవ్వాలి? (జోక్యం చేసుకోవాలి?)
డాక్టరు: ఆ! ఆ మాటకూడా నిజమే.
‘మ’ : ఇంకా, ఆ కథ చెప్పి ఆయన మనల్ని ఎంతగా నవ్వించారు! అతగాడు ఇల్లు పడిపోయిందన్న సంగతి స్వయంగా చూసిన వ్యక్తి చెప్పినా సరే, ఆ సమాచారం వార్తాపత్రికలో రాలేదు కాబట్టి ఆ విషయం నమ్మడట.
డాక్టరు మౌనంగా ఉండిపోయాడు. ఎందుకంటే శ్రీరామకృష్ణులు, అతడితో ‘భగవదవతారం గురించిన విషయాలు నీ “సైన్స్” లో లేవు కాబట్టే నువ్వు ఈ మాటలను విశ్వసించవు’ అన్నారు కదా!
మధ్యాహ్నమయింది. డా. సర్కార్, ‘మ’ ను తన బండిలో తోడ్కొని వెళ్ళాడు. కొందరు రోగులను చూసిన పిదప డాక్టరు శ్రీరామకృష్ణుల వద్దకు వెళ్ళనున్నాడు.
కొన్ని రోజుల క్రితం డా.సర్కార్ గిరీశ్ యొక్క బుద్ధలీల అనే నాటకం చూశాడు. దాన్ని గురించి ప్రస్తావిస్తూ డాక్టరు, ‘మ’ తో ఇలా అన్నాడు: “బుద్ధుణ్ణి కరుణావతారంగా పేర్కొనడమే సబబు కదా! విష్ణువు అవతారం అనడం ఎందుకు?”
డాక్టరు, ‘మ’ ను కార్న్వాలిస్ చౌరస్తా వద్ద దిగబెట్టేశాడు.
46.2 ద్వితీయ పరిచ్ఛేదం శ్రీరామకృష్ణుల భావావస్థ – పూర్ణుడు – భగవతీదేవి దర్శనం
సమయం మధ్యాహ్నం మూడు గంటలవుతోంది. శ్రీరామకృష్ణుల ప్రక్కన ఒకరిద్దరు భక్తులు కూర్చుని ఉన్నారు. ఆయన మధ్యమధ్యలో చిన్నపిల్లవాడిలా అసహనం చెందుతున్నారు. “ఏమయ్యింది, డాక్టరు ఇంకా రాలేదా?” “ఎప్పుడు వస్తాడు” అని అడుగుతున్నారు. డాక్టరు సాయంకాలం రావాలి.
శ్రీరామకృష్ణులకు హఠాత్తుగా భావపరివర్తనమయింది. తల్లి వాత్సల్యభావంలో బిడ్డకు పాలిచ్చేట్లు ఆయన దిండును తమ ఒడిలో పెట్టుకున్నారు. భావావస్థలో ఆయన పసిబాలుడిలా నవ్వుతున్నారు. ధోవతిని విచిత్రంగా ధరించి ఉన్నారు! ‘మ’ తదితరులు ఈ దృశ్యాన్ని నివ్వెరపాటుతో చూస్తున్నారు.
కాసేపటి తరువాత శ్రీరామకృష్ణులు మళ్ళీ సాధారణ స్థితికి వచ్చారు. ఆయనకు భోజనం వేళ అయింది. కొద్దిగా రవ్వపాయసం సేవించారు
పిదప ఏకాంతంగా ‘మ’ తో అతి గోప్యమైన విషయాలు మాట్లాడసాగారు.
శ్రీరామకృష్ణులు (‘మ’ తో): ఇంతసేపు భావావస్థలో నేను ఏం చేశానో తెలుసా? శిహోర్కు వెళ్ళేదారిలో మూడు నాలుగు క్రోసులు ఆవరించిన మైదానం ఒకటి ఉంది. ఆ మైదానంలో నేను ఒంటరిగా ఉన్నాను. నేను పంచవటిలో ఆ పదిహేను సంవత్సరాల పరమహంస బాలకుణ్ణి దర్శించానే, మళ్ళీ సరిగ్గా అదే విధంగా దర్శించాను.
“నలువైపులా ఆనందపు పొగమంచు ఆవరించి ఉంది. అందులో నుండి పదమూడు లేక పద్నాలుగు సంవత్సరాల కుర్రవాడొకడు బయటకు వచ్చాడు. అతడి ముఖం కనిపిస్తోంది. పూర్ణుడిలా ఉన్నాడు. మేమిద్దరం దిగంబరంగా ఉన్నాం. అటు తరువాత మేమిద్దరం మైదానంలో ఆనందంతో పరుగెత్తసాగాం, ఆటలాడసాగాం. పరుగులు పెట్టడంతో పూర్ణుడికి దాహం వేసింది. అతడు ఒక గ్లాసులో నుండి నీరు త్రాగి మిగిలివున్న నీటిని నాకు ఇవ్వబోయాడు. అందుకు నేను ‘తమ్ముడూ, నువ్వు ఎంగిలి చేసిన నీటిని నేను త్రాగలేను’ అన్నాను. అతడు నవ్వుతూ వెళ్ళి ఆ గ్లాసును కడిగి మళ్ళీ నీళ్ళు తెచ్చి ఇచ్చాడు.”
శ్రీరామకృష్ణులు మళ్ళీ సమాధి మగ్నులయ్యారు. కాసేపటి తరువాత బాహ్యస్పృహనొంది మళ్ళీ ‘మ’ తో మాట్లాడసాగారు.
శ్రీరామకృష్ణులు: నా మనోస్థితి మారుతోంది. ప్రసాదం స్వీకరించలేక పోతున్నాను. సత్యం, మిథ్య రెండూ ఒక్కటవుతున్నాయి. ఇంకా నేనేం చూశానో తెలుసా? భగవద్రూపం – భగవతీదేవి రూపం! ఆమె గర్భంలో ఒక బిడ్డ ఉన్నది. ఆమె ఆ బిడ్డను కని, మరుక్షణమే మ్రింగివేయసాగింది. అది ఎంతమేరకు లోపలకు వెళుతోందో అంత మేరకు శూన్యమైపోతోంది. సర్వమూ శూన్యమేనని నాకు వెల్లడైంది. అమ్మ, ‘మాయ! మంత్రం! రండి, రండి, ! చూడండి!’ అంటున్నట్లుగా తోచింది.
ఐంద్రజాలకుడే సత్యం, ఇంద్రజాలం అంతా మాయ అన్న శ్రీరామకృష్ణుల ఉపదేశం ‘మ’ కు గుర్తువచ్చింది.
46.2.1 సిద్ధులు హేయమైనవి
శ్రీరామకృష్ణులు: అది సరే, పూర్ణుణ్ణి నేను ఆకర్షించ ప్రయత్నించాను కాని అతడు ఆకర్షితుడు కాలేదు ఎందుకని? దీనితో నా విశ్వాసం కొద్దిగా సడలింది.
‘మ’ : ఒకరిని అలా ఆకర్షించడమంటే సిద్ధులు ప్రదర్శించినట్లే కదా!
శ్రీరామకృష్ణులు: అవును. అదో హేయమైన సిద్ధి.
‘మ’ : మీకు గుర్తుందా – ఒక రోజు మనం అధర్ ఇంటి నుండి దక్షిణేశ్వరానికి తిరిగి వస్తున్నప్పుడు సీసా ఒకటి పగిలిపోయింది. మాలో ఒకరు మిమ్మల్ని ‘దీనివల్ల మనకు ఏదైన కీడు మూడుతుందా? మీరొకసారి చూడండి’ అని అడిగాడు. అందుకు మీరు ‘నాకు అలా చూడాల్సిన అగత్యం లేదు. అవన్నీ సిద్ధులకు సంబంధించిన వ్యవహారాలు’ అన్నారు.
శ్రీరామకృష్ణులు: ఆ, జబ్బుపడ్డ పిల్లలను జనం నేలమీద పడుకోబెడతారు. కొందరు వచ్చి అతడి జబ్బు నయమయ్యేలా హరినామం ఉచ్చరిస్తారు. ఇదే విధంగా అన్యరోగాలను కూడా జనం మంత్రతంత్రాల ద్వారా నయం చేస్తారు. జబ్బు నయం చేయడం మొదలైనవన్నీ సిద్ధులు ప్రదర్శించడమే అవుతుంది. అతి నీచ స్వభావం కలవారు మాత్రమే రోగం బాగు చేయడానికి భగవంతుణ్ణి ప్రార్థిస్తారు.
46.3 తృతీయ పరిచ్ఛేదం ఆత్మ వేరు, దేహం వేరు
సంధ్యాకాలమయింది. శ్రీరామకృష్ణులు పక్కమీద కూర్చుని జగజ్జనని పవిత్ర నామాన్ని ఉచ్చరిస్తున్నారు. పలువురు భక్తులు ఆయనకు దగ్గరగా నిశ్శబ్దంగా కూర్చుని ఉన్నారు. లాటూ, శరత్, శశి, చిన్న నరేంద్రుడు, పల్టు, భూపతి, గిరీశ్ మొదలైన భక్తులు వచ్చి ఉన్నారు. వీనులవిందుగా పాటలు పాడి శ్రీరామకృష్ణులను రంజింపచేయ, స్టార్ థియేటర్‌కు చెందిన రామ్తరణ్, గిరీశ్‌తో పాటు వచ్చి ఉన్నాడు. కాసేపటి తరువాత డా.సర్కార్ కూడా వచ్చాడు.
డాక్టరు (శ్రీరామకృష్ణులతో): నిన్న రాత్రి మూడు గంటలకు నేను మీ గురించి ఎంతో ఆందోళన చెందాను. అప్పుడు వర్షం కురుస్తోంది. వీరందరూ మీ గది కిటికీలు, తలుపులు మూసివేశారో లేదో అని ఆదుర్దాపడ్డాను.
“నిజంగానా?” అన్నారు శ్రీరామకృష్ణులు. తమ పట్ల డాక్టరుకు గల అభిమానం చూసి ఆయన ప్రసన్నులయ్యారు.
శ్రీరామకృష్ణులు: దేహం ఉన్నంతవరకు దాన్ని సంరక్షించవలసిందే. కాని ఇది (దేహం) వేరైనదిగా నేను దర్శిస్తున్నాను. కామినీ కాంచనాల పట్ల గల ఆకర్షణ పూర్తిగా తొలగిపోయినప్పుడు దేహం వేరు, ఆత్మ వేరు అన్నది స్పష్టంగా అర్థమవుతుంది. కొబ్బరికాయలోని నీళ్ళన్నీ ఇంకిపోయినప్పుడు కొబ్బరిచిప్ప, కొబ్బరి రెండూ వేరు వేరుగా అయిపోతాయి. అప్పుడు కాయను ఆడించినట్లయితే అందులోని కొబ్బరి టకటకమని శబ్దం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇది కత్తి, ఒరలాంటిది – కత్తి వేరు, ఒర వేరు. (Katha Upanishad 2.3.17)
“అందుకే నేను శారీరక రుగ్మత విషయమై అమ్మకు ఎక్కువగా చెప్పజాలను.”
గిరీశ్ (భక్తులతో): శశధర పండితుడు ఈయనతో (శ్రీరామకృష్ణులతో) ఇలా అన్నాడు: ‘మీరు సమాధి స్థితిలో ఉన్నప్పుడు మీ మనస్సును దేహం వైపుకు మరల్చండి. అప్పుడు రోగం నయమైపోతుంది.’ అయితే ఈయన భావావస్థలో, దేహమనేది కేవలం మాంసం, ఎముకల రాశిగా దర్శించారు.
46.3.1 వ్యాధి నయానికి, సిద్ధుల నిమిత్తం ప్రార్థించమని హృదయ్ సలహా
శ్రీరామకృష్ణులు: చాలా రోజుల క్రితం నాకొకసారి తీవ్రంగా జబ్బు చేసింది. కాళీ ఆలయంలో కూర్చుని ఉన్నాను. అమ్మను ప్రార్థిద్దామనిపించింది. కాని ప్రత్యక్షంగా నా పేరిట చెప్పలేకపోయాను. అమ్మతో ఇలా అన్నాను: ‘అమ్మా, నీకు నా జబ్బు గురించి విన్నవించమని హృదయ్ చెప్పాడు.’ అంతకంటే ఎక్కువగా మరేమీ చెప్పలేకపోయాను. అలా చెబుతూండగానే నాకు ఉన్నట్టుండి సొసైటీ (ఏసియాటిక్ సొసైటీ మ్యూజియం), అక్కడ తీగతో బిగించబడిన మనిషి అస్థిపంజరం గుర్తుకు వచ్చాయి. వెంటనే నేను అమ్మతో ఇలా అన్నాను: ‘అమ్మా, నీ నామ గుణ కీర్తనలు చేస్తూ తిరుగుతూ ఉంటాను. ఆ అస్థిపంజరంలా ఈ దేహాన్నికూడా తీగతో బిగించి వెయ్యి’. సిద్ధులు కోరుకోవడం మాత్రం నా వల్ల కాదండోయ్!
“మొదట్లో నేను హృదయ్ అదుపులో ఉండేవాడినికదా – అతడు నాతో ‘సిద్ధుల నివ్వమని అమ్మను వేడుకో’ అన్నాడు. సిద్ధులు కోరుకునే నిమిత్తం కాళీ ఆలయంలోకి వెళ్ళాను. ముప్ఫై లేక ముప్ఫై ఐదు సంవత్సరాల వేశ్య ఒకతె మల విసర్జన చేస్తూన్న దృశ్యం నాకు దర్శనీయమైంది. సిద్ధులు కోరుకోమని సలహా ఇచ్చిన హృదయ్ మీద నాకు పట్టరాని కోపం వచ్చింది.”
రామ్తరణ్ పాడసాగాడు:
నా వీణ ఇది ప్రియా
నా వీణ ఇదిగో!
నా ప్రాణప్రద వీణ
ప్రియతమంబగు వీణ
మధుర మంజుల నాద
ముల పలుకు నా వీణ ॥ ॥ నా ॥
మెళకువగ మీటుచు
పల్కింతువేని
నీ స్పర్శచే తంత్రు
లుద్దీపనము చెందు
అపురూప రాగ రాగిణు
లొలుకు నటుల ॥ ॥ నా ॥
అతి సున్నితంబుగా
శ్రుతి మేళవింపు
కలరవము మధుర
మంజులతమ స్వనముతో
వెలువడును వేయేల
లహరులై అందు ॥ ॥ నా ॥
తీగ లేమాత్రము
బిగువు తగ్గించుచో
మూగవోవును వీణ
మూగ తంత్రుల చేత
యే మాత్రమైనను
బిగువు హెచ్చించుచో
తెగలాగుడునకవి
తెగిపోవు నడిమికి ॥ ॥ నా ॥
డాక్టరు (గిరీశ్‌తో): ఈ పాటలన్నీ సొంతంగా రచించినవేనా?
గిరీశ్: ఊహూ, ఎడ్విన్ ఆర్నాల్డ్ భావాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసినవి.
రామ్తరణ్ బుద్ధ చరిత్రలోని గీతం పాడసాగాడు:
విశ్రాంతికై మేము విలపించినాము
అకట ఆ విశ్రాంతి లభ్యమే కాదు
ఎటునుండి వచ్చితిమొ యెరుకయే లేదు
ఎటు కొట్టుకొని మేము ఏగెదమొ కూడ!
చిరునగవు కన్నీరు చక్రమున మేము
మరిమరి పరుగుచు తిరుగుచుండెదము
మా దారి ఎటువైపు మరలునో తెలియ
ఫలశూన్యమగు నాట నేల నాడితిమొ
వ్యర్థ యత్నము చేసి వేసారినాము!
మంత్రముగ్ధునివలె మైమరచి మేము
మేల్కాంచి యుండియు నిదురించినాము
అంధకారము తొలగి వెలుగు కనుపడదా!
చంచలంబుగ మసలు అనిలంబువలెను
చంచలంబుగ ప్రాణి చలియించునెపుడు ।
ఎటనుండి వచ్చితిమొ యెవరమో మేము?
మేమేల వచ్చితిమొ యెందు పోయెదమొ?
వడిదిశల పర్వెత్తు వాడి శరముల వ్యధలు ।
సుఖములో తేలుచు కన్నీట మునిగి
ఒక క్షణము జీవించి మరుక్షణములేక
కొట్టుకొని యెందరో పోవుచున్నారు ।
మేమేల వచ్చితిమొ యేమి చేసితిమొ
యే ఆటలాడితిమొ క్రిత జన్మములను
పారు సలిలము వలె నిలకడయె లేదు
మరి మరి ముందునకు పారుచుండెదము ।
మా స్వప్న గడియలను వడి పగులగొట్టు
ఈ ఖైదు ఎన్నాళ్ళు ఈ వ్యర్థ కలలు
మేల్కాంచి యుంటివా నిజముగా నీవు
అటులైనచో నింక నిదుర సేయకుము!
కోటి కోటుల దుఃఖ తిమిరజాలంబు
దట్టముగ నీపైన బడియున్నదిపుడు
నీ స్వప్నములనుండి లెమ్ము స్వాప్నికుడా
మరి నిద్రలో నీవు మరిగి మునుగకుము ।
కాంతి స్వరూపుడా । కాంతులీనుమురా
కిరణజాలంబుల తరుమరా తమము
నీ ఒక్కడవె మాకు సంరక్షకుడవు
అర్థించెదము పాదముల చెంత ముక్తి ।
పాట వింటూ శ్రీరామకృష్ణులు భావపరవశులయ్యారు.
46.3.2 సూర్యుని దర్శనం
తర్వాత రామ్తరణ్ ‘గాలిదుమారం! ఉద్ధృతంగా రా!’ అనే పాటను పాడాడు. అది విని శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు: “ఇదేమిటి, పాయసం తరువాత వేప పులుసులా ఉంది ఈ పాట. నువ్వు ‘కాంతి స్వరూపుడా! కాంతు లీనుమురా, కిరణజాలంబుల తరుమరా తమము’ అని పాడగానే నాకు సూర్య దర్శనం కలిగింది. సూర్యోదయం అవగానే అంధకారం పారిపోయింది. అందరూ ఆ సూర్యుడి పాదాల వద్ద శరణాగతి నొందారు.”
రామ్తరణ్ మళ్ళీ పాడసాగాడు:
దీనరక్షణివి, పాపహారిణివి, త్రిగుణ ధారిణివి జననీ
లోకకర్తవు, లోకభర్తవు, లోకహర్తవు జననీ ॥
గుణ సంబద్ధవు, గుణాతీతవు, సర్వ స్వరూపిణి నీవు
తారా, కాళీ, పరాప్రకృతివి, ధారిత దశయవతారిణివి ॥
భూమివి నీవు, జలములు నీవు, అనలానల గగనంబులు నీవు
నీవే మాతా, నీవే సర్వము, నీవే సర్వాధారిణివి
న్యాయము, సాంఖ్యము, పాతంజలమును, మీమాంసాదులు నిన్ను
నీ ఆంతర్యమును, నీ నిజతత్వము, అనయము అన్వేషించును జననీ
వైశేషికము, వేదాంతమును, నీ విచారణే చేయును జననీ
అయిననేదియును తెలియలేదు నీ తత్వమేమిటో జననీ
ఎట్టి హద్దులును, ఆది అంతములు లేకయున్నను నీవు
భక్తిపరులపై యున్న ప్రేమచే బహుళరూపములు దాల్చెదవు
మహా భయంకరమగు భవ భయములు పారద్రోలుదువు జననీ
వర్తమానమున, భూతకాలమున, భవిష్యత్తులో నుండెదవు ॥
రూపము తోడుత దర్శనమిత్తువు రూపిగ నిను ప్రేమించువారికి
నిరాకారిణిగ నిను ధ్యానించెడు వారికి నీవు నిరాకారివి ॥
బ్రహ్మమొక్కటే అద్వితీయమని కొందరందు రిలను
అదియును నీవే బ్రహ్మమయీ నీ కన్న అన్యము లేదొకటి
ఎంత కొలతలో కొలువజాలుదురొ అంతమాత్రమే కొలచి సత్యము
అదే వారలు పరబ్రహ్మయని అల్పచిత్తులై పల్కుచుందురు ॥
దీని కెగువగా ఊహకందక వెల్గుచున్నది తురీయంబు
సర్వరూపిణివి, జగద్వ్యాపినివి, గాన నన్నియును నీవు మాత్రమే ॥
మడిమైలలు నా మతముతొగూడ స
మాప్తమయ్యె సఖుడా
అమ్మ శ్యామకును అర్చన నేనిక
ఆచరింపగా జాలనురా ॥ ॥ మ ॥
చెప్పలేను నా మది నిగ్రహము
చేయ నెదురు తిరిగె
సిగ్గు సిగ్గు నే నవమానముచే
చిమిడిపోదు నకటా । ॥ మ ॥
కరమున ఖడ్గము యురమున శిరముల
హారము దాల్చిన కాళిధ్యానమున
కరిగినప్పుడే విరుల దామమును
యురమున దాల్చుచు మురళిమోవిపై
మోపెడు మోహన శ్యామమోహనుడు
కన్నుల ముందట కన్పడు కాంతితో ॥ మ ॥
త్రిలోచనిని నే తలచుచుండగా
వాలుకన్నుల వాడు గానబడ
పరవశనై నే మరతు సర్వమును
సిగ్గుచెంది నే చిమిడి పోవుదును । ॥ మ ॥
మాత పాదముల నెత్తావి గొల్పు సుమ
మంజరు లర్పణ చేయబోవగా
మదన మోహనుని మోహ భావమున
మది పరవశయై బెదరిపోవురా । ॥ మ ॥
కాంచన చేలము గాంచినంతనే
శ్యామ గూర్చి నే చేయు ధ్యానములు
చల్లగ మెల్లగ కాంచనచేలుడు
ఒకటి నొకటిగా దాటవేసెరా । ॥ మ ॥
ఈ పాట వింటూ శ్రీరామకృష్ణులు మళ్ళీ భావపరవశులయ్యారు. రామ్తరణ్ మళ్ళీపాడసాగాడు:
ఎవరమ్మా నీ పదముల మీదను
అర్పణ చేసి రీ మందార సుమంబులు ॥ ఎ ॥
మనవిని గైకొని మాతా నా శిర
మున నిడుమా సుమ మొకటో రెండో ॥ ఎ ॥
అమ్మా, అమ్మా అని నే నప్పుడు
పిలుతును నిను నే బిగ్గరగాను ॥ ఎ ॥
చేతులు తట్టుచు చేయుదు నృత్యము
అమ్మను చుట్టుచు ఆనందముతో ॥ ఎ ॥
నన్నాస్థితిలో గనుగొని నవ్వుచు
ముడుతువు నా శిఖలోన పూవులను ॥ ఎ ॥
46.4 చతుర్థ పరిచ్ఛేదం త్యాగం – సన్న్యాసి, గృహస్థులు
గానం పూర్తయింది. పలువురు భక్తులు మైమరచి స్తబ్ధులై కూర్చుండిపోయారు. చిన్న నరేంద్రుడు ధ్యానమగ్నుడై స్థాణువులా ఉన్నాడు. అతణ్ణి డాక్టరుకు చూపుతూ శ్రీరామకృష్ణులు “ఇతడు అతి పవిత్రుడు. విషయబుద్ధి నీడ కూడా ఇతడిపై పడనేలేదు” అన్నారు.
మనోమోహన్ (నవ్వుతూ, డాక్టరుతో): ఈయన (శ్రీరామకృష్ణులు) మీ కుమారుడి గురించి ప్రస్తావిస్తూ ‘అబ్బాయి దొరికినట్లయితే తండ్రిని నేను ఖాతరు చేయను’ అన్నారు.
డాక్టరు: ఓ, నేను చెప్పేది కూడా అదే. మీరందరూ ‘కుమారుణ్ణి’ పట్టుకొని తక్కినవన్నీ మరిచిపోతారు. (కుమారుణ్ణి అంటే భగవదవతారాన్ని పట్టుకొని భగవంతుణ్ణి మరిచిపోతారు అని ఇక్కడ డాక్టరు చెబుతున్నాడు.)
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): తండ్రి అక్కరలేదని నేను చెప్పడం లేదు.
డాక్టరు: ఆ, అర్థమయింది. ఆ విధంగా ఒకటి రెండు మాటలు చెప్పకుంటే పని ఎలా జరుగుతుంది?
శ్రీరామకృష్ణులు: నీ కుమారుడు సరళ హృదయుడు. ఒక రోజు శంభు ఎర్రబారిన ముఖంతో ‘సరళ భావంతో కనుక భగవంతుణ్ణి ప్రార్థించినట్లయితే ఆయన తప్పక ఆలకిస్తాడు’ అన్నాడు.
“నేను ఈ కుర్రవాళ్ళను ఎందుకు ఇంతగా ప్రేమిస్తానో తెలుసా? నీరు కలపని సిసలైన పాలవంటివారు వీరు; ఒకసారి వేడిచేస్తే చాలు – పైగా భగవంతుడికి నైవేద్యంగా సమర్పించవచ్చు. కాని నీళ్ళు కలిపిన పాలను చాలాసేపు మరగబెట్ట వలసి ఉంటుంది. అందుకు ఎంతో వంటచెరకు వ్యయం చేయాలి.
“కుర్రవాళ్ళు క్రొత్తకుండలాంటివారు; సరైన పాత్రలు అవి. వాటిలో నిశ్చింతగా పాలను పెట్టవచ్చు. జ్ఞానోపదేశం ఇచ్చినప్పుడు వారికి సత్వరమే చైతన్యం కలుగుతుంది. కాని విషయాసక్తులకు అలా కాదు. పెరుగు తోడు పెట్టబడిన కుండలో పాలు పెట్టాలంటే భయమే సుమా! ఎందుకంటే, పాలు చెడిపోయే ప్రమాదం ఉంది.
“నీ కుమారుడిలోకి విషయబుద్ధి – కామినీ కాంచనాలు ఇంకా ప్రవేశించ లేదు.”
డాక్టరు: తండ్రి సంపాదించినది తింటున్నాడు కదా – అందుకనే. స్వయంగా సంపాదిస్తూ కూడా, విషయబుద్ధికి దూరంగా ఉంటాడా లేదా అన్నది చూడాలి.
46.4.1 కామినీ కాంచన త్యాగం – సన్న్యాసులు
శ్రీరామకృష్ణులు: అవునవును, అది నిజమే. కాని విషయం ఏమిటో తెలుసా? భగవంతుడు విషయబుద్ధికి బహుదూరం. విషయబుద్ధి లేనట్లయితే ఆయన మన అరచేతిలో ఉన్నట్లే. (డా. సర్కార్, డా.దొకరీలతో) కామినీ కాంచన త్యాగం మీకు ఉద్దేశించబడింది కాదు. మీరు వాటిని మానసింగా త్యజించాలి. గోస్వాములకు కూడా నేను అదే విషయం చెప్పాను. వారితో ఇలా అన్నాను: ‘మీరు త్యాగం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు పరిత్యజించినట్లయితే మీ పని జరుగదు. మీరు శ్యామసుందరునికి నిత్యపూజలు చేయాలి కదా!’
“త్యాగమనేది సన్న్యాసులకు సంబంధించిన విషయం. వారు స్త్రీల చిత్రపటం కూడా చూడరు. స్త్రీలు వారికి విషంలాంటి వారు. వారు స్త్రీల నుండి కనీసం పదిమూరల దూరంలో ఉండాలి. ఇక తప్పనిసరి పరిస్థితి ఏర్పడినప్పుడు కనీసం ఒక మూర దూరంలోనైనా ఉండాలి. స్త్రీ అపార భక్తిసంపన్నురాలైనప్పటికీ సన్న్యాసి ఆమెతో ఎక్కువగా మాట్లాడరాదు.
“అంతేకాక స్త్రీల ముఖం కనిపించని లేదా బహు అరుదుగా కనిపించే చోటును ఎన్నుకొని సన్న్యాసి అక్కడ వసించాలి.
“సన్న్యాసికి ధనంకూడా విషంలాంటిది. ధనం దగ్గర ఉంటే చాలు – కలతలు, అహంకారం, క్రోధం, దేహసుఖాల పట్ల ఆసక్తి – ఇవన్నీ వచ్చి పడతాయి. రజోగుణం అధికరిస్తుంది. ఇంకా, రజోగుణం ఉన్నట్లయితే దానికి తోడు తమోగుణం కూడా చేరుతుంది. అందుకే సన్న్యాసి కాంచనాన్ని తాకరాదు. కామినీ కాంచనాలు భగవంతుణ్ణి మరిచిపోయేలా చేస్తాయి.
46.4.2 కామినీ కాంచనాలు – గృహస్థులు
“ధనం ద్వారా తినడానికి తిండి, కట్టుకొనేందుకు బట్ట, ఉండడానికి చోటు, దైవరాధన, సాధువుల భక్తుల సేవ – ఇవన్నీ ఒనగూరుతాయని మీకు తెలుసు.
డబ్బు కూడబెట్ట ప్రయత్నించడం నిష్ప్రయోజనం. తేనెటీగ అతి కష్టంతో తేనెపట్టును నిర్మిస్తుంది. కాని ఎవరో వ్యక్తి వచ్చి ఆ పట్టును విచ్ఛిన్నం చేసి తేనెను పట్టుకుపోతాడు.”
డాక్టరు: ధనాన్ని ఎవరి కోసం కూడబెట్టాలి? పనికిమాలిన కుమారుల కోసమా?
శ్రీరామకృష్ణులు: కేవలం పనికిమాలిన కుమారులే కాదు. బహుశా భార్య శీలం కూడా సరైనది కాకపోవచ్చు, పరాయివాడితో సంబంధం కలిగి ఉండవచ్చు. అతగాడికి భర్త గడియారం, గొలుసు ఇచ్చివేయవచ్చు.
“మీరు స్త్రీలను పూర్తిగా త్యజించనక్కరలేదు. గృహస్థు తన భార్యతో రమించడంలో తప్పులేదు. కాని ఒకరిద్దరు పిల్లలు పుట్టిన తరువాత భార్యా భర్తలు అన్నా చెల్లెళ్ళవలె మెలగాలి.
“కామినీ కాంచనాలపట్ల ఆసక్తి ఉన్నట్లయితే పాండిత్యముందన్న అహంకారం, ధనం ఉందన్న అహంకారం, ఉన్నత పదవికి చెందిన వాడినన్న అహంకారం – ఇవన్నీ వచ్చి పడతాయి.
46.5 పంచమ పరిచ్ఛేదం అహంకారం – లోకశిక్షణ
“అహంకారం తొలగిపోనిదే జ్ఞానం సిద్ధించదు. ఎత్తుగా ఉన్న దిబ్బమీద నీరు నిలువదు. కాని పల్లపు ప్రదేశానికి నీరు నలువైపులనుండి వడివడిగా ప్రవహిస్తూ వస్తుంది.”
డాక్టరు: కాని పల్లపు ప్రదేశానికి నలువైపులనుండి వచ్చే నీటిలో మంచి నీరూ ఉంటుంది, మురికి నీరు కూడా ఉంటుంది. పర్వతాలపైన కూడా పల్లపు ప్రదేశాలు ఉంటాయి. నైనితాల్, మానససరోవర్లలో కేవలం ఆకాశంనుండి కురిసిన పరిశుద్ధ జలం మాత్రమే ఉంటుంది.
శ్రీరామకృష్ణులు: కేవలం ఆకాశం నుండి వచ్చే నీరు మాత్రమేనా! ఆహా! అది చాలామంచిది.
డాక్టరు: ఇంకా, ఎత్తులోవున్న నీటిని నలువైపులకూ పంపిణీ చేయవచ్చు.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): ఎవరికో సిద్ధమంత్రం లభించిందట. అతడు ఒక కొండపై నుండి బిగ్గరగా కేకపెడుతూ ఇలా అన్నాడు: ‘మీరందరూ ఈ మంత్రాన్ని జపించి భగవంతుణ్ణి సాక్షాత్కరించుకోండి.’
డాక్టరు: ఊ.
శ్రీరామకృష్ణులు: కాని మీరు ఓ సంగతి గుర్తుంచుకోవాలి. భగవంతుడి కోసం ప్రాణాలు తల్లడిల్లిపోయినప్పుడు మంచినీరు, మురికి నీరు అన్న పట్టింపు ఉండదు. భగవంతుడి గురించి తెలుసుకోడానికి అటువంటి వ్యక్తి ఒక్కోసారి మంచివాడివద్దకు వెళ్తాడు, ఒక్కోసారి పరిణతినొందని వ్యక్తులవద్దకు కూడా వెళ్తాడు. అయితే ఆయన కృప కలిగినట్లయితే ఆ వ్యక్తికి మురికినీరు కూడా ఎలాంటి హానీ చెయ్యజాలదు. ఆయన జ్ఞానం ప్రసాదించినప్పుడు ఏది మంచి, ఏది చెడు అన్న విషయాలన్నీ తెలియజేస్తాడు. కొండమీద పల్లపు ప్రదేశం ఉండవచ్చు కాని ‘దుష్ట – నేను’ అనే కొండ మీద మాత్రం ఉండజాలదు. అది ‘విద్యా నేను’, ‘భక్తుడి నేను’ అయినప్పుడు మాత్రమే ఆకాశంనుండి పరిశుద్ధజలం అక్కడ చేరుతుంది.
“ఎత్తుగావున్న ప్రదేశం నుండి నీరు నలువైపులకు ప్రవహిస్తుందన్న మాట నిజమే కాని అది ‘విద్యా–నేను’ అనే కొండ మీద నుండే సాధ్యం.
“భగవదాదేశం లేకుండా లోకశిక్షణ చేయజాలం. శంకరాచార్యులు జ్ఞానోపలబ్ధి తరువాత లోకశిక్షణార్థం ‘విద్యా–నేను’ ను నిలుపుకున్నారు. భగవంతుణ్ణి ప్రాప్తించుకోకుండానే లెక్చర్లు ఇవ్వడమా! దానివల్ల లోకులకు ఏం ఉపకారం జరుగుతుంది?
46.5.1 సమాధ్యాయి లెక్చరు
“ఒకసారి నేను నందన్బాగాన్ బ్రహ్మ సమాజానికి వెళ్ళాను. ఉపాసన ముగిశాక వారి ఆచార్యుడు వేదికనెక్కి లెక్చరు ఇచ్చాడు. అతడు ఆ లెక్చరును ఇంట్లో వ్రాసుకొని తెచ్చాడు. అది చదువుతున్నంతసేపూ అతడు నలువైపులా చూస్తున్నాడు. ధ్యానం చేస్తున్నప్పుడు కూడా అతడు మధ్యమధ్యలో కళ్ళు తెరిచి జనం వంక చూస్తున్నాడు.
“భగవద్దర్శనం పొందనివాడి ఉపదేశాలు సరైన ప్రభావం కలిగించవు. ఒక విషయం సరిగానే చెప్పవచ్చు కాని మరో విషయం తలక్రిందులైపోతుంది.
“సామాధ్యాయి లెక్చరు ఇస్తూ ఇలా అన్నాడు: ‘భగవంతుడు మనోవాక్కులకు అతీతుడు. ఆయనలో ఎలాంటి రసమూ లేదు. మీరందరూ ప్రేమభక్తి అనే రసంద్వారా ఆయన్ను భజించండి.’ చూశారా, ఎవరైతే రస స్వరూపుడో, ఆనంద స్వరూపుడో ఆయన్ను అలా వర్ణించడమా! ఇలాంటి లెక్చర్లతో ఒరిగేదేముంది? ఇలాంటి వాటి వల్ల లోకశిక్షణ అవుతుందా ఏమిటి?
“మా మామగారి ఇంటి గోశాలనిండా గుర్రాలు ఉన్నాయని ఎవరో అన్నారట. గోశాలలో గుర్రాలు ఉండడమేమిటి? (అందరూ నవ్వారు) దీనితో వారి ఇంట్లో గుర్రాలనేవే లేవని తేటతెల్లమవుతోంది.”
డాక్టరు (నవ్వుతూ): గుర్రాలే కాదు, ఆవులుకూడా లేవన్నమాటే. (అందరూ నవ్వారు)
భావపారవశ్యంలో మునిగివున్న భక్తులందరూ క్రమంగా బాహ్యస్పృహలోకి వస్తున్నారు. భక్తులను చూస్తూ డాక్టరు ఆనందంతో పొంగిపోతున్నాడు. ‘ఇతడెవరు, ఇతడెవరు’ అని ఆయన ‘మ’ ను అడుగుతున్నాడు. పల్టు, చిన్న నరేంద్రుడు, భూపతి, శరత్, శశి మొదలైన బాలభక్తుల నందరినీ ‘మ’ డాక్టరుకు పరిచయం చేశాడు.
శశి గురించి ‘మ’ చెబుతున్నది డాక్టరు వినసాగాడు.
శ్రీరామకృష్ణులు (‘మ’ ను చూపుతూ డాక్టరుతో): ఇతడు స్కూలు పిల్లలందరికి ఉపదేశిస్తుంటాడు.
డాక్టరు: ఆ, ఆ సంగతి నేనూ విన్నాను.
శ్రీరామకృష్ణులు: ఎంత ఆశ్చర్యమో చూడు! నేనా మూర్ఖుణ్ణి. అయినా కూడా విద్యావంతులైన వారందరూ ఇక్కడకు వస్తుంటారు. ఎంత ఆశ్చర్యమో చూడు! ఇదంతా భగవంతుడు ఆడుతున్న ఆట అని మాత్రమే చెప్పాలి.
సమయం రాత్రి తొమ్మిదిన్నర గంటలు అవుతోంది. డాక్టరు ఆరు గంటల నుండి ఇక్కడే కూర్చుని ఉన్నాడు.
గిరీశ్ (డాక్టరుతో): అది సరే కాని, మహాశయా! మీక్కూడా అలా అవుతుంటుందా? ఇక్కడకు రావద్దనుకున్నా సరే ఏదో అదృశ్యశక్తి మిమ్మల్ని లాగుతున్నట్లు అనిపించదా? నాకు మాత్రం అలా అనిపిస్తూ ఉంటుంది. అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను. (BG 6.44)
డాక్టరు: అలాగని చెప్పలేను కాని హార్ట్ (హృదయం) విషయాలు హార్ట్‌కు మాత్రమే తెలుస్తాయి కదా! (శ్రీరామకృష్ణులతో) వీటన్నిటి గురించి చర్చించడంలో కూడా ప్రయోజనమేమీ లేదు.
46.6 షష్ఠ పరిచ్ఛేదం నరేంద్రుడు, డా. సర్కార్, మహిమా తదితరులతో శ్రీరామకృష్ణులు
అక్టోబర్ 24, 1885
సమయం మధ్యాహ్నం ఒంటి గంట అవుతోంది. శ్రీరామకృష్ణులు శ్యాంపుకూర్ ఇంట్లో రెండవ అంతస్తులోని గదిలో కూర్చుని ఉన్నారు. నరేంద్రుడు, డా.సర్కార్, మహిమాచరణ్ చక్రవర్తి, ‘మ’ మొదలైన భక్తులు గదిలో ఉన్నారు. డా.సర్కార్ చేస్తున్న హోమియోపతి వైద్యం గురించి ప్రస్తావిస్తూ శ్రీరామకృష్ణులు ఆయనతో “నీ హోమియోపతి వైద్యం బాగా ఉంది” అన్నారు.
డాక్టరు: హోమియోపతి వైద్యంలో వైద్యుడు రోగియొక్క రోగ సూచనలను పుస్తకంలోవున్న విషయాలతో సరిపోల్చవలసి ఉంటుంది. పాశ్చాత్య సంగీతంలో స్వరలిపి చదువుతూ పాడుతుంటారు కదా – ఇది కూడా అలాంటిదే.
“గిరీశ్ఘోష్ ఎక్కడ? సరేలే, ఉండనివ్వండి. అతణ్ణి పిలువవద్దు. నిన్న రాత్రంతా మేల్కొనే ఉన్నాడు.”
శ్రీరామకృష్ణులు: అదిసరే, నేను భావావస్థలో ఉన్నప్పుడు భంగు సేవించినట్లు మత్తెక్కుతుంది. దీన్ని గురించి నువ్వేమంటావు?
డాక్టరు (‘మ’ తో): ఆ స్థితిలో Nerve centers (నాడీ కేంద్రాలు) పని చేయడం ఆగిపోతుంది. అందుకే శరీరావయవాలు అచేతనమైపోతాయి. మళ్ళీ, కాళ్ళు కొట్టుకుంటాయి. ఎందుకంటే energy (శక్తి) అంతా మెదడు వైపుకు ప్రవహిస్తుంది. జీవం nervous system (నాడీ వ్యవస్థ)ను కలిగి ఉంటుంది. మెడవెనుక Medulla Oblongata (మెడుల్లా అబ్లాంగాటా) అనే నాడీ కేంద్రం ఉంది. అది గాయపడితే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది.
మహిమా చక్రవర్తి కుండలినీ శక్తి గురించి వివరిస్తూ ఇలా అన్నాడు: “సుషుమ్నానాడి Spinal cord (వెన్నుపూస)లో సూక్ష్మరూపంలో ఉంటుంది. దాన్ని ఎవరూ చూడలేరు. ఇవి శివుడు చెప్పిన మాటలు.”
డాక్టరు: శివుడు పూర్తిగా ఎదిగిన మనిషిని మాత్రమే పరీక్షించాడు. కాని ఐరోపియన్లు మనిషి జీవితాన్ని Embryo (గర్భావస్థ) నుండి ఎదిగివున్న దశవరకు అన్ని దశలనూ పరీక్షించారు. Comparative History (తులనాత్మక చరిత్ర) గురించి తెలుసుకోవడం మంచిది. సంథాల్‌ల (ఉత్తరభారతానికి చెందిన గిరిజనులు) చరిత్ర అధ్యయనం చేసినట్లయితే కాళీమాత ఒక సంథాల్ స్త్రీ అని తెలియవస్తుంది. ఆమె సాహసియైన యోధురాలు కూడా. (అందరూ నవ్వారు)
మీరందరు అలా నవ్వకండి. ఇంకా Comparative Anatomy (తులనాత్మక శరీర నిర్మాణ శాస్త్రం) గురించి అధ్యయనం చేయడం ద్వారా ఎంతటి ఉపకారం కలిగిందో చూడండి. మొదట్లో Pancreatic Juice, Bile (జఠరరసం, పిత్తం)ల మధ్య ఉన్న తేడా ఏమిటో తెలిసేది కాదు. పిదప Claude Bernard (క్లాడ్ బెర్నార్డ్) అనే శాస్త్రజ్ఞుడు కుందేలు యొక్క Stomach, Liver (ఉదరం, కాలేయం) మొదలైన వాటిని పరీక్షించాక జఠర రసం, పిత్తం యొక్క ప్రభావం వేరువేరుగా ఉంటుందన్న సంగతి కనుగొన్నాడు. కాబట్టి కేవలం మానవదేహాన్ని మాత్రమే పరిశీలించినట్లయితే సరిపోదు, తక్కిన జంతుజాలాన్ని కూడా పరిశీలించా లన్నది నిర్ధారితమవుతోంది.
“ఇదే విధంగా Comparative Religion (తులనాత్మక మత సిద్ధాంతాలు) అధ్యయనం చేయడం వల్ల ఎంతో మేలు ఒనగూరుతుంది.
“ఈయన (శ్రీరామకృష్ణులు) మాట్లాడే మాటలన్నీ మనకు ఎందుకు అలా గుండెలకు హత్తుకుపోతున్నట్లు అనిపిస్తాయి? ఎందుకంటే, ఈయన అన్ని మతాలనూ – హిందూ, ఇస్లాం, క్రైస్తవం, శాక్తం, వైష్ణవం – వీటన్నిటినీ అనుష్ఠించారు కాబట్టి. తేనెటీగలు పలురకాల పువ్వులనుండి తేనెను సేకరించి నప్పుడు మాత్రమే మంచి తేనె తయారవుతుంది.”
‘మ’ (డాక్టరుతో): ఈయన (మహిమాచరణ్) సైన్సు గురించి ఎంతో అధ్యయనం చేశాడు.
డాక్టరు (నవ్వుతూ): ఏ సైన్సు? మాక్స్‌ముల్లర్ Science of Religion (సైన్స్ ఆఫ్ రిలిజియన్) చదివాడా?
మహిమా (శ్రీరామకృష్ణులతో): మీకు జబ్బు చేసింది. కాని దాని గురించి డాక్టర్లు ఏం చేయగలరు? మీకు జబ్బు చేసిందన్న సంగతి విన్నప్పుడు మీరు డాక్టర్ల అహంకారాన్ని పెంచనున్నారని తోచింది.
శ్రీరామకృష్ణులు (డా.సర్కార్‌ను చూపుతూ): ఈయన మంచి డాక్టరు. బాగా చదువుకున్నవాడు.
మహిమా: అవునండి. ఈయన పెద్ద ఓడలాంటివాడు. మేమందరం చిన్న పడవలవంటవారం. డా.సర్కార్ వినయపూర్వకంగా చేతులు జోడించాడు.
శ్రీరామకృష్ణులు, నరేంద్రుణ్ణి పాడమన్నారు. నరేంద్రుడు పాడసాగాడు:
నా జీవమునకు నిన్ను ధ్రువతారగ జేసికొంటి
పెడదారిని పట్టనిక ఘోర భవాబ్ధినుండి…..
ధన్యుడవు ధన్యుడవు ధన్యుడవు దేవ నీవు
అంతులేదు అద్భుతంబు
జగము నీదు చేతిపనియె
దేవ దేవ ఈ విశ్వము…..
మహితోన్నత సింహాసనంబుపై
ఓ జగత్పితా! నీ వానందింతువు
విశ్వసృష్టి విస్తారపు ప్రస్తుతి
మధురగానమున జగములు పొగడగ ॥ మ ॥
పుడమిన పుట్టిన వాడనైనను
హీనస్వరముతో గానమొనర్చుచు
నేను గూడ నీ సౌధబహిః
ప్రాంగణమునకు చేరితి చూడుము ॥ మ ॥
నీ దర్శనమొకటే కోరితి నో ప్రభో
అన్య కోరికల కోరనె కోరను
నిన్ను గూర్చి నా పాట పాడుటకు
చేరినాను నిట చిన్న గానముతో ॥ మ ॥
సూర్యచంద్రులే మహాకూట
సందోహమందు నిను సంస్తుతించెదరొ
అందెంతో దూరపు మారుమూలలో
నేను గూడ నిను ప్రస్తుతించెదను ॥ మ ॥
ఈ దీన సేవకుని ప్రార్థనమిదియే ॥ మ ॥
తెలిపింపవా నాకు! నీ తత్త్వము
రాజాధిరాజ రాజ రాజేశ ॥ తె ॥
ప్రసరింపవా కరుణ లొలికించు చూపుతో
నీ కరుణ కాంక్షించి కలవరించెడు నాకు ॥ తె ॥
సంసార వహ్నిలో । సమసిపోయిన నేను
అర్పింతు నా బ్రతుకు । నీ పాదముల మ్రోల ॥ తె ॥
పాపమున నా గుండె । మరకపడిపోయినది
మాయలో చిక్కి నే । మరణించుచుంటి ॥ తె ॥
స్పృహతప్పి మృతినొందు । నా యాత్మను బ్రతికింపు
నీ దయాపూర్ణ । సంజీవితో తాకి ॥ తె ॥
హే దయామయ ప్రభో । రాజాధిరాజ ॥ తె ॥
బ్రహ్మానందపు మధుమత్తతలో
మత్తిలుచండవె ఓ మనసా…….
శ్రీరామకృష్ణులు: ఇంకా, ఆ పాట పాడు – ‘ఈ సర్వము నీ మయమే’
డాక్టరు: ఆహా!
నరేంద్రుడు పాడసాగాడు:
ఉండేది నీ వొకడవె
ఈ సర్వము నీ మయమే
నా హృదయము నీతోనే
తన్మయముగ గావించితి….
పాటలు పూర్తయ్యాయి. డాక్టరు ముగ్ధుడైపోయాడు. కాసేపటి తరువాత డాక్టరు ఎంతో భక్తిభావంతో శ్రీరామకృష్ణులతో “అయ్యా, నేనిక వెళతాను. మళ్ళీ రేపు వస్తాను” అన్నాడు.
శ్రీరామకృష్ణులు: కాసేపు ఆగరాదూ? గిరీశ్ ఘోష్‌ను రమ్మని కబురు పంపాము. (మహిమాను చూపుతూ) ఇతడు గొప్ప విద్వాంసుడు. హరి నామం ఉచ్చరించగానే నాట్యంచేయ నారంభిస్తాడు. అహంకారశూన్యుడు. మేము ఇక్కడ ఉన్నామని మాకు దగ్గరగా కొన్నగర్లో ఉంటున్నాడు. పైగా సంపన్నుడు కూడా; స్వతంత్రుడు – ఎవరికీ చాకిరీ చేయనవసరం లేదు. (నరేంద్రుణ్ణి చూపుతూ) ఇతడి గురించి నీ అభిప్రాయం ఏమిటి?
డాక్టరు: అత్యుత్తముడు.
శ్రీరామకృష్ణులు (ఒక భక్తుణ్ణి చూపుతూ): మరి ఇతడో?
డాక్టరు: ఆహా!
మహిమా: హిందూ తత్త్వశాస్త్రం చదవకుండా తత్త్వశాస్త్ర అధ్యయనం పూర్తి కానేరదు. ఐరోపా తత్త్వవేత్తలు సాంఖ్యంలోని చతుర్వింశతి తత్త్వాల గురించి ఎరుగరాయె. వారు వాటిని అర్థం చేసుకోనేలేరు.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): నువ్వు మాట్లాడే మూడు మార్గాలు ఏవి?
మహిమా: సత్పథం అంటే జ్ఞాన పథం. చిత్పథం యోగానికి చెందినది, అంటే కర్మయోగం. నాలుగు ఆశ్రమాల క్రియలు, కర్తవ్యాలు ఇందులో చేరుతవి. మూడవది, ఆనంద పథం అంటే భక్తి, ప్రేమల పథం – మీరు మూడు పథాలలోను నిష్ణాతులు. వీటన్నిటి గురించి సాధికారికంగా మీరే వివరించగలరు. (శ్రీరామకృష్ణులు నవ్వారు) ఇక నేను చెప్పేదేముంది? జనకుడు వక్త, శుక మహర్షి శ్రోత – అలా ఉంది వ్యవహారం.
డాక్టరు సెలవు తీసుకున్నాడు.
46.6.1 సంధ్యా కాలంలో సమాధి – జపం గురించి శ్రీరామకృష్ణులు
సంధ్యాకాలం అయింది. చంద్రుడు ఉదయించాడు. శ్రీరామకృష్ణులు సమాధి మగ్నులై ఉన్నారు. నిలబడి ఉన్నారు. నిత్యగోపాల్కూడా ఆయనకు సమీపంగా భక్తి భావంతో నిలబడి ఉన్నాడు. కాసేపటి తరువాత బాహ్యస్పృహ కలిగాక శ్రీరామకృష్ణులు కూర్చున్నారు. నిత్యగోపాల్ ఆయన పాదాలను సేవించసాగాడు. దేవేంద్ర, కాళీపదుడు ప్రభృత భక్తులు దగ్గరగా కూర్చుని ఉన్నారు.
శ్రీరామకృష్ణులు (దేవేంద్రాదులతో): నిత్యగోపాల్ ప్రస్తుత స్థితి మారనున్నదని నాకు తోస్తోంది. అతడి మనస్సు కేంద్రీకృతమై సంపూర్ణంగా నా పైనే నిలువనున్నది – ఇందులో ఉన్న వ్యక్తిపైనే. నరేంద్రుణ్ణి చూస్తున్నావు కదా! అతడి మనస్సు యావత్తూ నా మీదనే లగ్నమౌతోంది.
పలువురు భక్తులు సెలవు పుచ్చుకుంటున్నారు. శ్రీరామకృష్ణులు లేచి నిలబడ్డారు. ఒక భక్తుడికి జపం గురించి ఇలా తెలుపుతున్నారు. “జపం చేయడమంటే అర్థం ఏకాంతంలో మౌనంగా భగవన్నామాన్ని ఉచ్ఛరించడం. మనస్సు ఏకాగ్రంచేసి నామం ఉచ్చరిస్తూ పోగా పోగా, జపం చేయగా చేయగా ఆయన రూపదర్శనం కలుగుతుంది, ఆయన సాక్షాత్కారం అవుతుంది. గొలుసుతో కట్టబడిన కొయ్యదుంగ ఒకటి గంగానదిలో మునిగి ఉందనుకో. గొలుసు ఒక కొన ఒడ్డుకు కట్టబడి ఉంది. గొలుసును పట్టుకొని నీటిలోకి దుమికి కొక్కేలను ఒకదాని తరువాత ఒకటిగా పట్టుకొంటూ ఆ కొయ్యదుంగను చేరవచ్చు. సరిగ్గా ఇదే విధంగా జపం చేస్తూ చేస్తూ మగ్నమై పోయినప్పుడు క్రమంగా భగవత్సాక్షాత్కారం కలుగుతుంది.”
కాళీపదుడు (నవ్వుతూ, భక్తులతో): మన ప్రభువు భలేవారే సుమా! జపధ్యానాలు, తపస్సులు ఏమీ చేయాల్సిన అవసరం లేదు.
ఆ సమయంలో ఉన్నట్టుండి శ్రీరామకృష్ణులు “ఇక్కడ (గొంతులో) ఏమో అవుతోంది” అన్నారు. దేవేంద్ర “ఆ, ఇక మీదట మీ మాటలతో మేం మోసపోతా మనుకున్నారా?” అన్నాడు. కేవలం భక్తుల కళ్ళు కప్పడానికే శ్రీరామకృష్ణులు ఈ రోగాన్ని ప్రదర్శిస్తున్నారన్నది దేవేంద్రుడి భావన.
భక్తులు సెలవు తీసుకున్నారు. వంతులవారీగా యువభక్తులు అక్కడే ఉంటూ శ్రీరామకృష్ణులను సేవించేలా ఏర్పాటు చేయడమైనది. ‘మ’ కూడా ఆ రాత్రికి అక్కడే బస చేయనున్నాడు.
46.7 సప్తమ పరిచ్ఛేదం భక్తులతో సంభాషణ
ఆదివారం, అక్టోబర్ 25, 1885
సమయం ఉదయం ఆరున్నర గంటలు కావస్తోంది. ‘మ’ శ్యాంపుకూర్ వచ్చి శ్రీరామకృష్ణులకు ప్రణామం చేశాడు. ఆయన ఆరోగ్యం ఎలా ఉందని అడిగాడు. అతడు శ్రీరామకృష్ణుల పరిస్థితిని తెలుపడానికి డా.సర్కార్ ఇంటికి వెళ్ళనున్నాడు. శ్రీరామకృష్ణులు, ‘మ’ తో ఇలా అన్నారు: “తెల్లవారు జామున నోరంతా నీటితో నిండిపోతుంది. దానికి తోడు దగ్గు కూడా – డాక్టరుకు ఈ సంగతి తెలియచెయ్యి. ఇంకా నేను స్నానం చేయవచ్చునా లేదా అన్న విషయం కూడా అడుగు.”
ఏడు గంటలకు ‘మ’ డా.సర్కార్ ఇంటికి చేరుకొని ఆయనకు శ్రీరామకృష్ణుల పరిస్థితిని తెలియపరిచాడు. డాక్టరుకు విద్య నేర్పించిన వృద్ధ అధ్యాపకుడు, మరి ఇద్దరు మిత్రులు అక్కడ ఉన్నారు. డాక్టరు తన అధ్యాపకునితో ఇలా అన్నాడు: “మహాశయా, రాత్రి మూడు గంటలనుండి నాకు పరమహంస దేవుల గురించి ఒకటే ఆలోచన. తరువాత నిద్ర పట్టనే లేదు. ఇప్పుడు కూడా ఆయన గురించిన ఆలోచనలు మదిలో మెదలుతూనే ఉన్నాయి.”
డాక్టరు మిత్రులలో ఒకరు ఆయన్ను ఇలా అడిగాడు: “కొందరు ఆయన్ను అవతార పురుషుడని అంటారని విన్నాను. మీరు ఆయన్ను రోజూ చూస్తున్నారు కదా! ఆయన గురించి మీరు ఏమనుకుంటున్నారు?”
డాక్టరు: As a man I have the greatest regard for him (వ్యక్తిగా ఆయనపట్ల నాకు అత్యున్నత గౌరవం ఉంది.)
‘మ’ (డాక్టరు మిత్రులతో): డాక్టరుగారు ఎంతగానో దయచూపి ఆయనకు చికిత్స చేస్తున్నారు.
డాక్టరు: దయా? ఏమిటి నువ్వు మాట్లాడేది?
‘మ’ : దయంటే పరమహంసదేవుల మీద కాదు. మా మీద.
డాక్టరు: నాకు ఎంతగా నష్టం కలుగుతోందో మీకు తెలియడం లేదు. అక్కడకు రావడం మూలాన ప్రతిరోజూ ఇద్దరు ముగ్గురు రోగులను చూడలేక పోతున్నాను. మరుసటి రోజు, నా అంతట నేనే వారి ఇళ్ళకు వెళ్ళినప్పుడు ఎలాంటి రుసుము పుచ్చుకోలేను. నా అంతట నేను వెళ్ళి రుసుం ఎలా పుచ్చుకోగలను?
మహిమా చక్రవర్తి గురించిన ప్రస్తావన వచ్చింది. గత శనివారం నాడు డాక్టరు, శ్రీరామకృష్ణులను సందర్శించినప్పుడు అతడు కూడా అక్కడ ఉన్నాడు. డాక్టరును చూపుతూ అతడు శ్రీరామకృష్ణులతో ఇలా అని ఉన్నాడు: ‘అయ్యా, డాక్టర్ల అహంకారం తలకెక్కించడానికని ఈ రోగాన్ని మీ అంతట మీరే కల్పించుకున్నారు.’
‘మ’ (డాక్టరుతో): గతంలో మహిమా చక్రవర్తి మీ వద్దకు వచ్చి వైద్య శాస్త్రంపై మీరు ఇచ్చే ఉపన్యాసాలను వినేవాడు.
డాక్టరు: అవునా? అతడు ఎంతటి తమస్సుతో నిండి ఉన్నాడో చూశావా? అతడికి నేను God’s Lower Third (భగవంతుడి మూడవ రూపం)గా నమస్కారం చేశాను. భగవంతుడిలో సత్త్వరజస్తమో గుణాలున్నవి. తమస్సు అనేది మూడవ గుణం, హీనమైన గుణం. ‘మీరు డాక్టర్ల అహంకారం తలకెక్కించడానికే ఈ రోగాన్ని కల్పించుకున్నారు’ అని అతడు పరమహంస దేవులతో అనడం విన్నావు కదా?
‘మ’ : పరమహంస దేవులు కావాలనుకుంటే తమ రోగాన్ని నయం చేసుకోగలరన్నది అతడి విశ్వాసం.
డాక్టరు: ఆహా! రోగాన్ని తనంతట తానే నయం చేసుకోవడమా? అది సాధ్యమయ్యే పనేనా? మేము వైద్యులం, క్యాన్సర్ ఎలాంటి వ్యాధో మాకు బాగా తెలుసు. మేమే దానికి చికిత్స చేయలేకపోతున్నాము. ఆయన తనంతట తానే నయం చేసుకోవడమా? ఆయనకు క్యాన్సర్ గురించి ఏమి తెలియదు కూడా. (మిత్రులతో) రోగం నయం కాదన్న మాట నిజమే కాని వీరందరూ ఆయన్ను అమిత శ్రద్ధాభక్తులతో సేవిస్తున్నారు.
వచ్చి శ్రీరామకృష్ణులను చూడమని ‘మ’ డాక్టరును అభ్యర్థించి వెళ్ళిపోయాడు.
46.8 అష్టమ పరిచ్ఛేదం విజయ్ తదితర భక్తులతో ప్రేమానందంలో శ్రీరామకృష్ణులు
మధ్యాహ్నం సమయం మూడు గంటలు. ‘మ’ శ్రీరామకృష్ణుల వద్దకు వచ్చి డా.సర్కార్‌తో తను జరిపిన సంభాషణను అప్పచెప్పాడు. ఆయనతో “ఇవాళ డాక్టరు నన్ను ఇబ్బందిలో పెట్టేశాడు” అన్నాడు.
శ్రీరామకృష్ణులు: ఏమయింది?
‘మ’ : డాక్టర్ల అహంకారం తలకెక్కించడానికే మీరు ఈ రోగాన్ని కల్పించు కున్నారన్న మాటను ఆయన నిన్న ఇక్కడ విన్నాడు.
శ్రీరామకృష్ణులు: ఆ మాట ఎవరన్నారు?
‘మ’ : మహిమా చక్రవర్తి.
శ్రీరామకృష్ణులు: అయితే?
‘మ’ : ఆయన మహిమా చక్రవర్తిని భగవంతుడి తమోగుణ రూపంగా అభివర్ణించాడు. భగవంతుడిలో సత్త్వరజస్తమో గుణాలు మూడు ఉన్నాయన్న మాటను ప్రస్తుతం ఆయన అంగీకరిస్తున్నాడు. (శ్రీరామకృష్ణులు నవ్వారు) రాత్రి మూడుగంటలకు ఆయనకు మెలకువ వచ్చిందట. అప్పటి నుండి ఆయన మీ గురించే ఆలోచిస్తున్నాడట. నేను ఆయన్ను ఎనిమిది గంటలకు చూసినప్పుడు కూడా ‘పరమహంసదేవుల గురించిన ఆలోచన ఇంకా నా మదిలో మెదలుతూనే ఉంది’ అన్నాడు.
శ్రీరామకృష్ణులు(నవ్వుతూ): అతడు ఆంగ్ల విద్యలు అభ్యసించిన వ్యక్తి. నా గురించి చింతన చేయమని నేను అతడితో చెప్పజాలను. కాని అతడే తన ఇచ్ఛమేరకు చేస్తున్నాడు.
‘మ’ : ఇంకా మీ గురించి ఇలా అన్నాడు: As a man I have the greatest regard for him. దీని అర్థం – ‘ఆయన్ను అవతార పురుషుడని చెప్పలేను కాని ఒక వ్యక్తిగా మాత్రం ఆయనకు అత్యున్నత గౌరవాన్నిస్తాను.’
శ్రీరామకృష్ణులు: ఇంకా ఏమైనా మాట్లాడారా?
‘మ’ : ‘ఇవాళ రోగికి ఏమైనా సలహాలున్నాయా!’ అని అడిగాను. అందుకు బదులుగా ఆయన ‘సలహాలా! వాటిని అలా ఉండనివ్వు. మళ్ళీ ఇవాళ వచ్చి రోగిని చూడవలసి ఉంది.’ (అందరూ నవ్వారు) ఇంకా ఇలా అన్నాడు: ‘నా సంపాదన రోజూ ఎంతగా తగ్గిపోతోందో మీకు తెలియడం లేదు. రోజూ రెండు మూడు పిలుపులను వదులుకోవలసి వస్తోంది.’
గదిలో నరేంద్రుడితో పాటు మహిమాచక్రవర్తి, నవగోపాల్, భూపతి, లాటూ, చిన్న నరేంద్రుడు మొదలైన భక్తులు ఉన్నారు. విజయ్‌కృష్ణ గోస్వామి గదిలోకి వచ్చి ఎంతో భక్తి భావంతో శ్రీరామకృష్ణుల పాదధూళిని స్వీకరించాడు. అతడితో పాటు అనేకమంది బ్రహ్మసమాజ భక్తులు కూడా వచ్చారు. విజయ్, బ్రహ్మసమాజంతో తన సంబంధాలను తెగతెంపులు చేసుకొని స్వతంత్రంగా ఆధ్యాత్మిక సాధనలు అనుష్ఠిస్తున్నాడు. అతడి శ్రద్ధాభక్తుల కారణంగా శ్రీరామకృష్ణులకు అతడంటే ఎంతో ప్రీతి. శ్రీరామకృష్ణులకు శిష్యుడు కాకపోయినప్పటికీ విజయ్, ఆయనంటే ఎంతో గౌరవం చూపుతాడు. చాలా కాలం ఆతడు ఢాకాలో వసించాడు. ఈ మధ్యనే ఉత్తర భారతదేశంలో పలు తీర్థాలు సేవించి కలకత్తాకు తిరిగి వచ్చాడు.
46.8.1 సర్వం శ్రీరామకృష్ణుల వద్దనే! – విజయ్ దర్శనం
మహిమా (విజయ్‌తో): మహాశయా, మీరు తీర్థయాత్రలు చేసి వచ్చారు. పలు ప్రదేశాలు సందర్శించారు. మీ అనుభవాలేమిటో కాస్త తెలియచెయ్యండి.
విజయ్: నేనేం చెప్పను? ప్రస్తుతం మనం కూర్చున్న చోటనే సర్వం ఉన్నట్లుగా దర్శిస్తున్నాను. అటూ ఇటూ తిరగడం అంతా వ్యర్థమే. అన్య ప్రదేశాలలో ఈయనకు సంబంధించినదే ఒక అణా, రెండు అణాలు, మరీ ఎక్కువంటే నాలుగు అణాలు మాత్రమే దర్శించాను. కాని ఇక్కడ మాత్రం మొత్తం పదహారు అణాలు (అంటే నూటికి నూరు పాళ్ళు) ప్రస్ఫుటమవుతోంది.
మహిమా: సరిగ్గా చెప్పారు. పైగా ఇలా పరిభ్రమింపచేసేది ఈయనే, ఒకచోట స్థిరంగా కూర్చోబెట్టేది కూడా ఈయనే.
శ్రీరామకృష్ణులు (నరేంద్రుడితో): విజయ్ మనోస్థితిలో ఎలాంటి మార్పు వచ్చిందో చూడు. ప్రస్తుతం అతడి లక్షణాలన్నీ మారిపోయి ఉన్నాయి. పాలను బాగా మరగబెట్టాక, నీళ్ళన్నీ ఇంకిపోగా మిగిలిన చిక్కటి పాలలా ఉన్నా డిప్పుడు. మెడ, నుదురు చూసి నేను పరమహంసను గుర్తించగలను. అవును, ఫలానా వ్యక్తి పరమహంసా కాదా అన్న సంగతి చెప్పగలను.
మహిమా (విజయ్‌తో): మహాశయా, మీరు అహారం తగ్గించినట్టున్నారు, ఏమంటారు?
విజయ్: ఆ, అలాగే ఉన్నట్టుంది. (శ్రీరామకృష్ణులతో) మీకు జబ్బు చేసిందని విని చూడడానికి వచ్చాను. మళ్ళీ, ఢాకాలో…
శ్రీరామకృష్ణులు: ఏమిటీ?
విజయ్ ఏమి బదులు చెప్పకుండా కాసేపు మౌనంగా ఉండిపోయాడు.
విజయ్: ఈయన తన దివ్యత్వాన్ని తానే స్వయంగా ప్రదర్శించనిదే అర్థం
చేసుకోవడం కష్టం. పదహారు అణాల అభివ్యక్తీకరణ ఇక్కడే ఉంది.
శ్రీరామకృష్ణులు: కేదార్ ఒకసారి ఇలా అన్నాడు: ‘తక్కిన చోట్లలో తినడానికి ఏమీ దొరకదు. కాని ఇక్కడ మాత్రం కడుపునిండా తినడానికి లభిస్తుంది.’
మహిమా: కేవలం కడుపునిండా మాత్రమేనా ఏమిటి? బయటకు పొంగి పొరలుతూంటేనూ!
46.8.2 శ్రీరామకృష్ణుల వద్ద విజయ్ శరణాగతి – శ్రీరామకృష్ణుల సమాధి స్థితి
విజయ్ (చేతులు జోడించి, శ్రీరామకృష్ణులతో): మీ రెవరో ఇప్పుడు నేను అర్థం చేసుకున్నాను. మీరు మరేమీ చెప్పనక్కరలేదు.
శ్రీరామకృష్ణులు (భావావస్థలో): అలా అయినట్లయితే అదే.
విజయ్: అర్థమయింది.
ఇలా పలికి విజయ్, శ్రీరామకృష్ణుల కాళ్ళపై పడ్డాడు. ఆయన పాదాలను తన వక్షస్థలంపై మోపి, వాటిని పట్టుకొన్నాడు. శ్రీరామకృష్ణులు బాహ్యజ్ఞాన శూన్యులై శిలావిగ్రహంలా కూర్చుండిపోయారు. ప్రేమావేశపూరితమైన ఈ అద్భుతదృశ్యాన్ని చూసి అక్కడ కూర్చుని ఉన్న భక్తులలో కొందరికి కన్నీరు స్రవించసాగింది. మరికొందరు స్తవస్తోత్రాలు పఠించసాగారు. తమ తమ భావాలకు అనుగుణంగా భక్తులందరూ తదేక దృష్టితో శ్రీరామకృష్ణులవంకే చూడసాగారు. కొందరు పరమ భక్తుడిగాను, కొందరు సాధువుగాను, మరికొందరు మానవరూపం ధరించిన సాక్షాత్తూ భగవంతునిగానూ ఆయన్ను దర్శిస్తున్నారు.
మహిమాచరణ్ అశ్రునయనాలతో “చూడండి, చూడండి ప్రేమమూర్తిని” అంటూ పాడాడు. మధ్యమధ్యలో పరబ్రహ్మాన్ని దర్శిస్తున్నట్లుగా “తురీయ సచ్చిదానందం, ద్వైతాద్వైత వివర్జితమ్” అంటున్నాడు. నవగోపాల్ కూడా విలపిస్తున్నాడు. భూపతి పాడసాగాడు.
(పర) బ్రహ్మ మఖండ, మనంత, మగాధం
ఉన్నతోన్నతం, అత్యంత మగాధం
నీవే కాదా సత్యప్రకాశం
ప్రేమ నిధాన మానంద నికేతం ॥ ప ॥
(ఈ) విభిన్న పావన రీతుల విశ్వం
(నీ) అనంత భావమనోహర కావ్యం
దిశలన్నిటిలో దాని సోయగం
పొంగిపొరలు నత్యంత పూర్ణమై ॥ ప ॥
మహాకవీ! ఓ ఆదికవీ! నీ
భావ తాళమున ఉద్భవించి యా
సోమసూర్యులు అస్తమింపగ
జరుగుచుందురు అంతరిక్షమున ॥ ప ॥
వజ్రతునకలుగ వెలుగు తారలు
విస్తారమైన యా నీలిగగనమున
వ్రాయబడిన నీ గీతమందలి
ముద్దులొల్కు నీ ముక్తాక్షరంబులు ॥ ప ॥
సంవత్సరము ఆరు ఋతువులతొ
ఈ శుభ భువితో శ్రుతి జోడించి
అఖండమగు నీ అనంత కీర్తిని
ఆలాపించును అనంత కాలము ॥ ప ॥
సార్థకమగు నీ సౌందర్యమును
పుష్పవర్ణములు ప్రకటన చేయును
నీరంబులు తమ నిశ్శబ్దతలో
అగాధ శాంతిని వ్యక్తము చేయును ॥ ప ॥
ఉరుముల ధ్వని నీ శాసన మందలి
భీషణత్వమును ప్రకటన చేయును ॥ ప ॥
అగాధమగు నీ నిజతత్త్వంబును
జూడజాలునే మూఢమానసము
అచ్చెరువందుచు యుగయుగాంతము
నిన్నే ధ్యానము చేయుచుండును ॥ ప ॥
నరనారుల నీ సృష్టిగాంచుచు
విలపింతు రానందాభిలాషులై
దేవదేవులు గంధర్వాదులు
సర్వవ్యాపక సన్నిధానమగు, ని
న్నర్చన సల్పుదు రారాధింతురు ॥ ప ॥
ఓ సౌశీల్య సౌజన్యనిధీ!
మా కొసగుము నీ నిర్మల జ్ఞానము
శుద్ధభక్తిని, శుద్ధప్రేమను
పూర్ణప్రశాంతిని మాపై బరపుచు
నీ చరణాశ్రయ దాన మొసంగుము ॥ ప ॥
పరమానందపు ఎరుక సాగ రో
పరిభాగంబున పైపై కెగయుచు
పరమానంద ప్రేమతరంగాల్
లేచు టెంతటి పారవశ్యమో!
పరమేశ్వరుని చిద్విలాసమో!….
అంతరించెనిట భయభ్రాంతులు
మంచి కార్యములు నియమనిష్ఠలు
అంతరించెనిట జాత్యభిమానము
అంతరించెనిట నా కుల గర్వము ॥ అం ॥
ఎందునుంటి నీ వెందునుంటి, నే
నెందునుంటి మన మిరువురమో హరి
దొంగిలించి నా ప్రాణమానములు
వదలివేసితివి ఇపుడు నీవు నను ॥ అం ॥
ఎంత మందమతి నిటకు వచ్చితిని
ప్రేమసాగరపు చెలియలికట్టకు?
(నా) అల్పప్రాణి ఇట నింపివేయబడె
అంచువరకు ఆనందభరితముగ ॥ అం ॥
ప్రేమదాసు పలు కాలకించుడీ
దైవ విధానంబిదే నిజముగా ॥ అం ॥
చాలాసేపటి తరువాత శ్రీరామకృష్ణులు మళ్ళీ బాహ్యస్పృహలోకి వచ్చారు.
46.8.3 శ్రీరామకృష్ణుల లెక్క – అవతార ప్రయోజనం
శ్రీరామకృష్ణులు (‘మ’ తో): భావావస్థలో నాకు ఏదో అవుతోంది. ఇప్పుడు నాకు సిగ్గు వేస్తోంది. ఆ స్థితిలో నన్నేదో భూతం ఆవహించినట్లు అనిపిస్తుంది. నేను నేనుగా ఉండను. ఆ స్థితినుండి దిగివచ్చేటప్పుడు, నాకు లెక్కపెట్టడం చేతకాదు. లెక్కించాలని ప్రయత్నిస్తూ, ‘ఒకటి, ఏడు, ఎనిమిది’ – లేకుంటే అలాంటిదే ఏదో అంటూంటాను.
నరేంద్రుడు: అంతా ఒక్కటే కదా!
శ్రీరామకృష్ణులు: ఊహూ, అది ఒకటి రెండులకు అతీతమైనది.
మహిమా: అవునవును, ‘ద్వైతాద్వైత వివర్జితమ్.’
శ్రీరామకృష్ణులు: అక్కడ విచారణ క్షయిస్తుంది. పాండిత్యం ద్వారా భగవంతుణ్ణి పొందలేము. ఆయన వేదాలు, పురాణాలు, తంత్రాలు – శాస్త్రాలన్నిటికీ అతీతుడు. జ్ఞాని అయినప్పటికీ ఎవరైనా చేత పుస్తకం పట్టుకొని ఉంటే అతణ్ణి నేను రాజర్షి అంటాను. కాని బ్రహ్మర్షికి ఎలాంటి బాహ్యచిహ్నం ఉండదు.
“శాస్త్రాల ప్రయోజనం ఏమిటో తెలుసా? ఐదు సేర్ల మిఠాయి, ఒక ధోవతి పంపమని ఎవరో ఉత్తరం వ్రాశారు. ఆ ఉత్తరాన్ని అందుకొన్న వ్యక్తి దాన్ని చదివి ఐదు సేర్ల మిఠాయి, ధోవతిని జ్ఞాపకం పెట్టుకున్నాడు. తరువాత ఉత్తరాన్ని పారేశాడు. ఇక ఉత్తరం ప్రయోజనం ఏముంది?
విజయ్: మిఠాయిలు పంపించాడని అర్థమవుతోంది.
శ్రీరామకృష్ణులు: మానవరూపాన్ని ధరించి భగవంతుడు అవతరిస్తాడు. ఆయన సర్వస్థానాలలోనూ, సర్వ భూతాలలోనూ ఉన్నాడన్న మాట నిజమే కాని ఆయన్ను అవతార పురుషుడిగా చూడనిదే జీవుని ఆకాంక్ష పూర్తికాదు. ఆతడి అవసరం తీరదు. ఇది ఎలాంటిదో తెలుసా? ఆవు దేహంలో నువ్వు ఏ భాగాన్ని తాకినా సరే, అది ఆవును తాకినట్లే అవుతుంది కదా! దాని కొమ్ములను తాకినా అది ఆవును తాకినట్లే అవుతుంది. కాని పాలు మాత్రం ఆవు పొదుగు నుండే లభ్యమవుతాయి. (అందరూ నవ్వారు.)
మహిమా: కావలసిన వస్తువు పాలు అయినప్పుడు నోటిని పొదుగు వద్ద పెట్టాలి. కొమ్ములను చప్పరిస్తే ఏమిటి ప్రయోజనం? (అందరూ నవ్వారు.)
విజయ్: కాని మొదట్లో దూడ, ఆవుయొక్క ఇతర భాగాలను నాకుతూ ఉంటుంది కదా!
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): నిజమే. కాని దూడ అలా చేయడం చూసి బహుశా ఎవరో ఒకరు దానికి పొదుగును అందిస్తారు. (అందరూ నవ్వారు)
46.9 నవమ పరిచ్ఛేదం శ్రీరామకృష్ణులు – డా.సర్కార్ తదితర భక్తులు
ఈ విధంగా సంభాషణ నడుస్తుండగా డా.సర్కార్ గదిలోకి వచ్చి కూర్చున్నాడు. శ్రీరామకృష్ణులతో ఇలా అన్నాడు. “నిన్న రాత్రి మూడు గంటలకు నాకు మెలకువ వచ్చింది. మీకు జలుబు చేస్తుందేమోనని కేవలం మీ గురించే ఆలోచిస్తూ ఉన్నాను. ఇంకా, మీ గురించి ఎంతగా ఆలోచించానని.”
శ్రీరామకృష్ణులు: బాగా దగ్గు వస్తోంది. గొంతు నొప్పిగా ఉంది. తెల్లవారు జామున నోరంతా నీటితో నిండిపోయి ఉంటుంది. పైగా, ఒళ్ళంతా ఒకటే నొప్పులు.
డాక్టరు: ఆ, నాకు ఆ సమాచారమంతా ఉదయమే తెలిసింది.
మహిమాచరణ్ తన ‘భారతదేశ యాత్ర’ విశేషాలు చెప్పసాగాడు. లంకలో ఎవరూ నవ్వరని చెప్పాడు. అది విని డా. సర్కార్ “ఆ, అలా అయివుండవచ్చు. కాని నేను దాని గురించి enquiry (విచారణ) చేయవలసి ఉంది” అన్నాడు. (అందరూ నవ్వారు)
46.9.1 డాక్టరు వృత్తి – శ్రీరామకృష్ణులు
డాక్టరు వృత్తికి సంబంధించిన ప్రస్తావన వచ్చింది.
శ్రీరామకృష్ణులు (డాక్టరుతో): డాక్టరు వృత్తి చాలా ఉన్నతమైనదిగా పలువురు భావిస్తారు. డబ్బు పుచ్చుకోకుండా, ఇతరుల దుఃఖాలను చూచి దయతలచి చికిత్స చేసినట్లయితే అది మహత్కార్యాలలో కూడా మహత్కార్యమే. కాని ధనం స్వీకరిస్తూ అలాంటి పని చేయగా చేయగా మనిషి నిర్దయుడైపోతాడు. ధనార్జన నిమిత్తం మలమూత్రాదులను పరీక్షించడం నీచమైన పని.
డాక్టరు: మీరు చెప్పేది నిజమే. కేవలం ఆ దృష్టితోనే డాక్టరు వృత్తి నిర్వర్తించడం అనుచితం. మీ ఎదుట నేను బడాయికి పోను కాని –
శ్రీరామకృష్ణులు: ఆ, అయితే నిస్వార్థభావంతో కనుక డాక్టరు వృత్తి ద్వారా ఇతరులకు ఉపకారం చేసినట్లయితే అది చాలా ఉదాత్తమైనది.
“గృహస్థుకు వృత్తి ఏదయినప్పటికీ మధ్యమధ్యలో సాధు సాంగత్యం నెరపడం అతడికి ఎంతైనా అవసరం. భగవంతుడిపై ప్రేమ ఉన్నట్లయితే అలాంటి వ్యక్తి తనంతట తానే సాధుసాంగత్యం కోసం వెదకుతాడు. నేను గంజాయి సేవించేవారి ఉదాహరణ చెబుతుంటాను కదా! గంజాయి త్రాగేవాడు మరో గంజాయి త్రాగేవాడి సాంగత్యాన్ని ఇష్టపడతాడు. గంజాయి త్రాగని వ్యక్తులు తారసపడినట్లయితే అతడు తల క్రిందకు దించుకొని వెళ్ళిపోతాడు, లేకుంటే ఒక మూలన నక్కి ఉంటాడు. కాని మరో గంజాయి త్రాగేవాడిని చూసినట్లయితే అతడు మహదానందపడిపోతాడు. (అందరూ నవ్వారు.) రాబందుకు నచ్చేది రాబందు సాంగత్యమే.”
డాక్టరు: ఇంకా, కాకిని చూసి రాబందు భయంతో పారిపోతుంది. నా ఉద్దేశంలో కేవలం మానవులను మాత్రమే కాదు. సమస్త ప్రాణులను సేవించాలి. తరచూ నేను మైదాపిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి పిచ్చుకలకు పెడుతుంటాను. డాబా మీద నేనా ఉండలను విసిరేసరికి పిచ్చుకలు గుంపులు గుంపులుగా వచ్చి ఆనందంతో వాటిని తింటాయి.
శ్రీరామకృష్ణులు: ఆహా! అది ఎంత మంచి విషయం! సాధువులు ప్రాణులకు ఆహారాన్ని తినిపించాలి. సాధువులు చీమలకు చక్కెర తినిపిస్తారు.
46.9.2 భక్తుల భావోన్మత్తత
డాక్టరు: ఇవాళ పాటలు ఉండవా?
శ్రీరామకృష్ణులు (నరేంద్రుడితో): కాస్త పాడరాదూ?
నరేంద్రుడు తంబురా చేత పట్టుకొని పాడసాగాడు. ప్రక్కవాయిద్యాలు జతకలిశాయి.
మధురం మధురం నీ శుభనామం
మధురం మధురం నీ నామం
దీనజనావన దీనశరణ్యా
మధురం మధురం నీ శుభనామం
మధురం మధురం నీ నామం….
వెర్రివానిని చేయవే నీ ప్రేమలోన
పిచ్చివానిని చేయవే ననుగన్న తల్లి
ఏల జ్ఞానము ఏల తర్కము
చాలుచాలివి ఏల నాకు
బాలుడను నీ ప్రేమ మద్యము
గ్రోలజేయుము కొల్లకొల్లగ ॥ వె ॥
నను తప్ప త్రాగింపవే నీ ప్రేమ మధువు
నను బాగ త్రాగింపవే….
గానం ముగిశాక భక్తులలో అనూహ్యమైన భావ పరివర్తనం కలిగింది. వారందరూ దివ్యభావంలో ఉన్మత్తులైపోయారు. పండితుడు తన పాండిత్యాభిమానాన్ని వదలిపెట్టి లేచి నిలబడి ఇలా అరిచాడు:
వెర్రివానిని చేయవే నీ ప్రేమలోన
పిచ్చివానిని చేయవే నను గన్నతల్లి
ఏల జ్ఞానము ఏల తర్కము
చాలు చాలివి ఏల నాకు.
అందరి కంటే ముందుగా విజయ్ భావోన్మత్తుడై లేచి నిలబడ్డాడు. ఎదురుగా కూర్చుని ఉన్న డాక్టరు కూడా లేచి నిలబడ్డాడు. నరేంద్రుడి గానంతో గదంతా ప్రగాఢ ఆధ్యాత్మిక తరంగాలతో ఓలలాడింది. చిన్న నరేంద్రుడు, లాటూ భావసమాధి మగ్నులయ్యారు. ‘సైన్సు’ లో నిష్ణాతుడైన డాక్టరు కూడా ఈ అద్భుత దృశ్యాన్ని దర్శిస్తూ అవాక్కయిపోయాడు. భావసమాధి మగ్నులయిన భక్తులందరూ బాహ్యజ్ఞానరహితులుగా ఉండడం ఆయన గమనించాడు. వారందరూ స్తంభీభూతులై ఉన్నారు. కాసేపటి తరువాత సాధారణ స్థాయికి వస్తూ వారిలో కొందరు నవ్వుతున్నారు, మరికొందరు విలపిస్తున్నారు. ఆ సమయంలో అపరిచిత వ్యక్తి ఎవరైనా గదిలోకి వస్తే త్రాగుబోతులందరూ ఒకచోట సమావేశమై ఉన్నారని భావించడం తథ్యం.
46.10 దశమ పరిచ్ఛేదం శ్రీరామకృష్ణుల క్రోధ జయం
కొంతసేపటి తరువాత శ్రీరామకృష్ణులు సంభాషణను కొనసాగించారు. భక్తులు తిరిగి తమ తమ ఆసనాలలో కూర్చున్నారు. సమయం రాత్రి ఎనిమిది గంటలవుతోంది.
శ్రీరామకృష్ణులు (డాక్టరుతో): ఇందాక నువ్వు వీరందరి భావపారవశ్యతలను చూశావుకదా! వీటి గురించి నీ ‘సైన్సు’ ఏం చెబుతుంది? ఇదంతా బూటక మంటావా?
డాక్టరు: ఇంత మందికీ అలాంటి స్థితి కలుగుతున్నప్పుడు అది వాస్తవమనే చెప్పాలి. అది బూటకం కానేరదు. (నరేంద్రుడితో) నువ్వు “వెర్రివానిని చేయవే నీ ప్రేమలోన । పిచ్చివానిని చేయవే ననుగన్న తల్లి” అని పాడుతున్నప్పుడు నేను స్థిరంగా ఉండలేక లేచి నిలబడ్డాను. పిదప అతికష్టంతో నా భావాన్ని నిగ్రహించుకున్నాను. ‘నా భావాలను ఇలా వెలుపలకు ప్రదర్శించకూడదు’ అనుకున్నాను.
శ్రీరామకృష్ణులు (డాక్టరుతో): నువ్వు మేరు పర్వతంలా నిశ్చలంగా ఉండేవాడివి (అందరూ నవ్వారు). నీ స్వభావం అగాధమైనది. రూప సనాతనుల భావాన్ని ఎవరూ పసిగట్టలేకపోయేవారు. ఏనుగు ఒక చిన్న మడుగులో కనుక దిగినట్లయితే అంతా అల్లకల్లోలమైపోతుంది. కాని అది పెద్ద చెరువులోకి ప్రవేశించినట్లయితే అలా జరుగదు. అది ఎవరికీ ఇంచుకకూడా తెలియరాదు. (BG 2.70)
“ఒకసారి రాధాదేవి తన చెలితో ఇలా అంది: ‘ఓ చెలీ, కృష్ణుడి విరహంతో నువ్వెంతగా రోదిస్తున్నావు! కాని నా వంక చూడు. నా హృదయం రాతిలా ఎంతటి కఠోరమైనదో చూడు. నా కళ్ళలో ఒక్క చుక్కకూడా నీరు రాలేదు.’ అప్పుడు ఆమె చెలి బృంద ఇలా అన్నది: ‘నీ కళ్ళలో నీరు లేదన్నమాట నిజమే. అయితే అందులో ఒక అంతరార్థం ఉంది. నీ హృదయంలో విరహాగ్ని సర్వదా ప్రజ్వలిస్తూనే ఉంది. కళ్ళలో నీరు రావడమే తడవు అది ఆ విరహాగ్ని తాపానికి ఇంకిపోతోంది.’”
డాక్టరు: మాటలు చెప్పడంలో మిమ్మల్ని మించిన వారెవరూ లేరు. (నవ్వులు)
సంభాషణ అన్య విషయాలవైపుకు మరలింది. శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వరంలో తమకు ప్రథమంలో కలిగిన భావావస్థలను డాక్టరుకు వర్ణించి చెప్పసాగారు. కామక్రోధాదులను వశం చేసుకోవడమెలాగో కూడా చెప్పారు.
డాక్టరు: మీరు భావావస్థలో వివశులై పడిపోయినప్పుడు ఎవరో దుష్టుడు వచ్చి బూటుకాలితో మిమ్మల్ని తన్నాడని విన్నాను.
శ్రీరామకృష్ణులు: నువ్వా సంగతి ‘మ’ నుండి వినివుంటావు. ఆ వ్యక్తి చంద్ర హల్దార్, కాళీఘాట్‌లోని కాళీ మందిర పూజారి. మథుర్బాబు వద్దకు తరచూ వస్తూండే వాడు. ఒక రోజు నేను భావావస్థలో నేలపై పడిఉన్నాను. గదంతా చీకటిగా ఉంది. మథుర్బాబు వద్ద ప్రాపకం సంపాదించడానికై నేను అటువంటి స్థితులు కలిగినట్లు నటిస్తుంటానని అతడు భావించేవాడు. అతడు గదిలోకి వచ్చి బూటుకాలితో పలుమార్లు నన్ను తన్నాడు. దానితో శరీరంపై నల్లగా గుర్తులు పడ్డాయి. మథుర్బాబుకు ఈ విషయం చెబుదామని అందరూ అన్నారు. కాని నేను వద్దని చెప్పాను.
డాక్టరు: ఇది కూడా భగవంతుడి లీలే. దీన్ని చూసి కోపాన్ని అదుపులో పెట్టుకోవడం ఎలాగో, క్షమించే గుణాన్ని అలవర్చుకోవడం ఎలాగో లోకులు నేర్చుకుంటారు.
46.10.1 విజయ్, నరేంద్రుల దర్శనాలు
ఈలోపు విజయ్ పలువురు భక్తులతో సంభాషిస్తున్నాడు.
విజయ్: ఎవరో ఒక వ్యక్తి సర్వదా నాతోపాటు తిరుగుతున్నట్లు నాకు తోస్తుంది. ఎక్కడో దూరంగా జరుగుతున్న విషయాలు అతడు నాకు తెలియచేస్తాడు.
నరేంద్రుడు: Guardian angel (సంరక్షించే దేవత) లాగా.
విజయ్: నేను ఈయన్ను(శ్రీరామకృష్ణులను) ఢాకాలో చూశాను.ఈయన్ను స్పృశించాను కూడా.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): అతడు మరెవరో అయివుంటాడు.
నరేంద్రుడు: నేను కూడా ఈయన్ను పలుమార్లు చూశాను (విజయ్‌తో) అందుకే మీరు చెప్పేది నమ్మనని నేనెలా చెప్పను?