45.1 ప్రథమ పరిచ్ఛేదం భక్తులతో శ్రీరామకృష్ణులు
అక్టోబరు 18, 1885
శ్రీరామకృష్ణుల వ్యాధిని గొంతు క్యాన్సర్‌గా డాక్టర్లు నిర్ధారించారు. చికిత్స, సేవాశుశ్రూషలు, పథ్యపానాదులు అవసరం. సర్వదా ఆయన్ను పరీక్షిస్తూ చికిత్స చేసే వైద్యుడి అవసరం ఏర్పడింది. వీటన్నిటికి తగ్గ వసతి దక్షిణేశ్వరంలో లేదు. పైగా, కలకత్తాలోని భక్తులకు అనునిత్యం దక్షిణేశ్వరం వచ్చి ఆయనకు సేవ చేయడం చాలా ఇబ్బంది. అందువల్ల భక్తులు బాగ్‌బజార్‌లో ఒక చిన్న రెండంతస్తుల భవనాన్ని అద్దెకు తీసుకొని శ్రీరామకృష్ణులను అక్కడకు తీసుకువచ్చారు. కాని ఆ ప్రదేశం నచ్చనందున ఆయన వెళ్ళి బలరామ్ బోసు ఇంట్లో బస చేశారు. కొన్నిరోజుల తరువాత భక్తులు కలకత్తాకు ఉత్తరంగా ఉన్న శ్యాంపుకూర్లో వేరే భవనాన్ని అద్దెకు తీసుకొన్నారు. శ్రీరామకృష్ణులను అక్కడకు తరలించి ఆయన్ను డా ॥ మహేంద్రలాల్ సర్కార్ అనే వైద్యుడి పర్యవేక్షణలో ఉంచారు.ఈ భవనం రెండవ అంతస్తులో రెండు పెద్ద పెద్ద గదులు, రెండు చిన్న గదులు ఉన్నాయి. పెద్ద గదులలో ఒక దాన్లో శ్రీరామకృష్ణులు వసించేవారు. మరో గదిని భక్తులు, సందర్శకుల నిమిత్తం హాలులా ఉపయోగించేవారు. చిన్న గదులలో ఒక దాన్ని భక్తులు నిద్రించడానికి వాడేవారు. రెండవ గదిని, మాతృమూర్తి శారదాదేవి అక్కడకు వచ్చాక ఆమె ఉపయోగించేవారు. డాబా పైకి వెళ్ళడానికి తలుపు వద్ద కప్పు ఉన్న కొద్దిపాటి స్థలంలో పగటిపూట ఉంటూ ఆమె శ్రీరామకృష్ణుల కోసం వంట చేసేవారు.
శ్యాంపుకూర్ ఇల్లు
నేడు విజయదశమి. దుర్గాప్రతిమలను నిమజ్జనం చేస్తారు. భక్తులహృదయాలను దుఃఖంతో నింపి దుర్గామాత కైలాస పర్వతానికి తరలిపోతుంది.
45.1.1 సురేంద్రుని భక్తి – ‘జగజ్జనని హృదయంలో వసించుగాక!’
శీతకాలం. సమయం ఉదయం ఎనిమిది గంటలవుతోంది. కొద్దిగా చలివేస్తోంది. శ్రీరామకృష్ణులు అస్వస్థులై పక్కమీద కూర్చుని ఉన్నారు. తల్లిని తప్ప మరేమీ ఎరుగని ఐదేళ్ళ బాలుడిలా ఉన్నారాయన. నవగోపాల్, ‘మ’ మరికొందరు భక్తులు అక్కడ ఉన్నారు. బాల భక్తులెవరూ ఇంకా గృహ త్యాగం చెయ్యలేదు. తమ ఇళ్ళనుండే వచ్చి శుశ్రూషలు చేసిపోతున్నారు.
ఇంతలో సురేంద్ర వచ్చి కూర్చున్నాడు. అతడి ఇంట్లో గత మూడు రోజులు దుర్గాపూజ జరిగింది. వ్యాధి కారణంగా శ్రీరామకృష్ణులు వెళ్ళలేకపోయారు కాని తమ భక్తులు కొందరిని దేవిని దర్శింప పంపారు. సురేంద్ర దుఃఖంలో ఉన్నాడు. నేడు దుర్గాప్రతిమను నిమజ్జనం చేస్తారు. సురేంద్ర దుఃఖానికి అదే కారణం.
సురేంద్ర: ఇంట్లోనుండి పారిపోయి వచ్చాను.
శ్రీరామకృష్ణులు (‘మ’ తో): ప్రతిమను నిమజ్జనం చేస్తే ఏమిటి? తల్లి హృదయంలో వసించుగాక!
సురేంద్ర ‘అమ్మా, అమ్మా’ అంటూ దేవి గురించి మాట్లాడసాగాడు. సురేంద్ర వ్యాకులత చూసి శ్రీరామకృష్ణులకు కన్నీరు ఆగలేదు. గద్గదస్వరంలో, “ఆహా! ఏం భక్తి! ఇతడికి ఎంతటి భక్తి!” అన్నారు.
శ్రీరామకృష్ణులు (సురేంద్రతో): నిన్న సాయంత్రం ఏడు, ఏడున్నర గంటల మధ్య భావావస్థలో మీ పూజామండపాన్ని దర్శించాను. దేవీ ప్రతిమ దేదీప్యమానంగా ప్రకాశిస్తూండటం గాంచాను. ఈ ప్రదేశం, మీ మండపం ఒక కాంతిప్రవాహంతో కలుపబడ్డాయి.
సురేంద్ర: ఆ సమయంలో నేను పూజ మండపంలో అమ్మ వద్ద విలపిస్తూ ఉన్నాను.నా అన్నలందరూ మేడపైకి వెళ్ళి ఉన్నారు. అమ్మ ‘నేను మళ్ళీ వస్తాను’ అని పలికినట్లు మనస్సుకు తోచింది.
45.1.2 శ్రీరామకృష్ణులు – భగవద్గీత
సమయం ఉదయం పదకొండుగంటలు. శ్రీరామకృష్ణులు పథ్యం స్వీకరించారు. ఆయన నోరు కడుక్కోవడానికి ‘మ’ ఆయన చేతిలో నీరు పోశాడు.
శ్రీరామకృష్ణులు (‘మ’ తో): సెనగపప్పు తిని రాఖాల్కు అజీర్ణం చేసిందట. సాత్త్వికాహారం తినడం మంచిది. ఈ విషయం నువ్వు గీతలో చదవలేదా? నువ్వు గీత చదువుతావా ?
‘మ’ : చదువుతానండి. గీతలో యుక్తాహారం గురించి ప్రస్తావించబడింది. సాత్త్వికాహారం, రాజసికాహారం, తామసికాహారం గురించి వివరించబడింది. అదే విధంగా సాత్త్విక దయ, సాత్త్విక అహంకారం మొదలైన వాటి గురించి కూడా చెప్పబడింది.
శ్రీరామకృష్ణులు: నీ వద్ద భగవద్గీత ఉందా?
‘మ’ : ఆ, ఉందండి.
శ్రీరామకృష్ణులు: గీతలో సకల శాస్త్రాల సారం ఉంది.
‘మ’ : అవునండి. భగవత్సాక్షాత్కారానికి ఉన్న అనేక మార్గాల గురించి గీతలో చర్చించబడింది. మీరు కూడా చెబుతుంటారు కదా, నానా మార్గాల ద్వారా భగవంతుణ్ణి చేరవచ్చు అని – జ్ఞానం, భక్తి, కర్మ, ధ్యానం.
శ్రీరామకృష్ణులు: కర్మయోగం అంటే ఏమిటో తెలుసా? అది సమస్తకర్మల ఫలాన్ని భగవంతునికి అర్పించటం.
‘మ’ : అవునండి. ఆ విషయాన్ని నేను గీతలో చదివాను. అదీగాక, కర్మను మూడు విధాలుగా చేయవచ్చని అందులో చెప్పబడింది.
శ్రీరామకృష్ణులు: ఏమిటది?
‘మ’ : మొదటిది – జ్ఞాన సముపార్జన నిమిత్తం కర్మ. రెండవది – లోకశిక్షణార్థం, మూడవది – స్వభావసిద్ధమైన కర్మ.
45.2 ద్వితీయ పరిచ్ఛేదం సర్ హంఫ్రీ డేవీ – అవతారవాదం
శ్రీరామకృష్ణులు నోరు పుక్కిలించి తాంబూలం వేసుకొన్నారు. ‘మ’ తో డా ॥ సర్కార్ గురించి మాట్లాడసాగారు. శ్రీరామకృష్ణుల పరిస్థితి తెలియచేయడానికి క్రితం రోజు ‘మ’ సర్కార్ ఇంటికి వెళ్ళాడు.
శ్రీరామకృష్ణులు: మీరేం మాట్లాడారు?
‘మ’ : డాక్టర్ గారింట్లో చాలా పుస్తకాలున్నాయి. నేనొక పుస్తకాన్ని తీసుకుని, అక్కడే కూర్చుని చదవసాగాను. మధ్యమధ్యలో కొన్ని భాగాలు బిగ్గరగా చదివి డాక్టర్‌కు వినిపించాను. అది సర్ హంఫ్రీ డేవీ వ్రాసిన పుస్తకం, అందులో అవతార పురుషుల ఆవశ్యకత ఏమిటో వ్రాసివుంది.
శ్రీరామకృష్ణులు: నిజంగా! నువ్వు డాక్టర్‌కు ఏమని చెప్పావు?
‘మ’ : ఆ పుస్తకంలో ఒక చోట ఇలా ఉంది. ‘భగవద్వాణి మానవుడి ద్వారా వెలువడకపోతే మనం అర్థం చేసుకోలేం.’ అందుకోసమే భగవదవతారాల ఆవశ్యకత.
శ్రీరామకృష్ణులు: ఆహా! భేషుగ్గా ఉంది!
‘మ’ : గ్రంథకర్త ఒక దృష్టాంతం ఇచ్చాడు. మనం సూర్యుడివంక చూడలేము కానీ సూర్యుడి ప్రతిబింబిత కిరణాలను చూడగలం.
శ్రీరామకృష్ణులు: చక్కటి దృష్టాంతం! ఇంకా ఏమైనా ఉన్నాయా?
‘మ’ : మరోచోట యథార్థ జ్ఞానమే విశ్వాసమని చెప్పబడింది.
శ్రీరామకృష్ణులు: ఇది చాలా చక్కటి మాట! విశ్వాసం కుదిరితే సర్వం సిద్ధించినట్లే.
‘మ’ : గ్రంథకర్త, రోమన్ దేవీ దేవతల గురించి స్వప్నాలు గాంచాడు.
శ్రీరామకృష్ణులు: అలాంటి పుస్తకాలు నిజంగానే ఉన్నాయా? భగవంతుడే అటువంటి వారి ద్వారా పనిచేస్తున్నాడు. ఇంకా ఏమైనా మాట్లాడారా?
45.2.1 పరోపకారం లేదా కర్మయోగం
‘మ’ : డా ॥ సర్కార్ లాంటివారు పరోపకారం చేయాలంటారు. మీ మాటలనే ఆయనకు చెప్పాను.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): ఏ మాటలు?
‘మ’ : మీరు శంభుమల్లిక్తో చెప్పిన మాటలు – ‘నా డబ్బుతో కొన్ని ఆసుపత్రులు, డిస్పెన్సరీలు, స్కూళ్ళు, మొదలైనవి కట్టిస్తాను. దీనివల్ల ఎంతో మందికి ఉపకారం జరుగుతుంది’ అని శంభుమల్లిక్ అన్నప్పుడు మీరు ఆయనతో ఇలా అన్నారు: ‘భగవంతుడు నీ ముందు ప్రత్యక్షమైనప్పుడు వైద్యశాలలు, ఔషధశాలలు, పాఠశాలలు కట్టివ్వమని కోరతావా ఏమిటి?’ ఇదే మాట డాక్టర్‌తో చెప్పాను.
శ్రీరామకృష్ణులు: ఆ, కర్మలు నిర్వర్తింప జన్మించే వాళ్ళు వేరే తరగతికి చెందినవారు. ఇంకా ఏం మాట్లాడారు?
‘మ’ : డాక్టర్‌తో ఇలా అన్నాను: ‘ఆలయంలో కాళీదేవిని దర్శించడం లక్ష్యమైనప్పుడు, సమయమంతా దారిప్రక్కన ఉన్న భిక్షగాళ్లకు దానధర్మాలు చేయడంలోనే గడిపివేస్తే ఏమిటి ప్రయోజనం? ముందుగా వెళ్ళి ఏదో విధంగా కాళీమాతను దర్శించు. తరువాత కావాలంటే నీ ఇచ్ఛమేరకు దానధర్మాలు చేసుకో.’
శ్రీరామకృష్ణులు: ఇంకా ఏం మాట్లాడారు?
45.2.2 శ్రీరామకృష్ణుల భక్తులు కామాన్ని జయించినవారు
‘మ’ : మీవద్దకు వచ్చేవారిలో చాలామంది కామం జయించిన వారని చెప్పాను. అప్పుడు డాక్టర్ ‘ఆ, నాక్కూడా కామం గీమం అంతా పోయిందోయ్’ అన్నాడు. అందుకు నేను ఇలా అన్నాను: ‘మీరు గొప్పవారు, మీలాంటివారు కామం జయించారంటే అందులో ఆశ్చర్యం ఏమీలేదు. కాని ఆశ్చర్యం ఏమిటంటే అల్పజీవులు కూడా ఆయన వద్ద వసించడం వల్ల ఇంద్రియాలను జయిస్తున్నారు.’ పిదప నేను మీరు గిరీశ్ఘోష్కు చెప్పిన మాట చెప్పాను.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): ఏ మాట?
‘మ’ : మీరు గిరీశ్ ఘోష్‌తో ‘డాక్టర్ నిన్ను మించి వెళ్లలేకపోయాడు’ అన్నారు. గిరీశ్ఘోష్ మిమ్మల్ని భగవదవతారం అనడం గురించి మీ రా మాట అన్నారు.
శ్రీరామకృష్ణులు: నువ్వు అవతారవాదం గురించి డాక్టర్‌కు బాగా చెప్పు. జీవులను తరించే వాడే అవతార పురుషుడని చెప్పు. పురాణాలలో దశావతారాలు, ఇరవై నాలుగు అవతారాలు, ఇంకా లెక్కలేనన్ని అవతారాల గురించి చెప్పబడింది.
‘మ’ : ఆయన తరచూ గిరీశ్ ఘోష్ గురించి అడుగుతూ ఉంటాడు. గిరీష్ఘోష్ త్రాగుడు అలవాటును పూర్తిగా వదలిపెట్టేశాడా అంటూ సర్వదా అడుగుతుంటాడు, అతడి మీద నిశితమైన దృష్టి పరపి ఉన్నాడు.
శ్రీరామకృష్ణులు: నువ్వు గిరీశ్ ఘోష్‌కు ఈ సంగతి చెప్పావా?
‘మ’ : ఆ, చెప్పానండి. ఇంకా త్రాగుడు మానడం గురించి కూడా చెప్పాను.
శ్రీరామకృష్ణులు: అతడేమన్నాడు?
‘మ’ : అతడిలా అన్నాడు: ‘ఆ, మీరందరూ చెబుతున్నారు కాబట్టి నేను వాటిని శ్రీరామకృష్ణుల పలుకులుగా శిరసావహిస్తాను. కాని ఎలాంటి వాగ్దానం మాత్రం చేయజాలను.’
45.3 తృతీయ పరిచ్ఛేదం యం, లీల – రెండింటినీ అంగీకరింప వలసిందే
మధ్యాహ్నమయింది. డా ॥ సర్కార్, తన కుమారుడు అమృత్‌ను వెంటబెట్టుకొని హేమ్తోపాటు వచ్చాడు. నరేంద్రాది భక్తులు అక్కడ ఉన్నారు.
శ్రీరామకృష్ణులు, అమృత్‌ను పక్కకు పిలిచి మాట్లాడారు. అతడితో “నువ్వు ధ్యానం చేస్తుంటావా?” అని అడిగారు. పిదప ఇలా అన్నారు: “ధ్యానావస్థ ఎలాంటిదో తెలుసా? మనస్సు తైలధారలా అయిపోతుంది. కేవలం ఒక్కటే చింతన. భగవచ్చింతన! అందులోకి ఇతర ఆలోచనలేవీ జొరబడలేవు.”
తరువాత శ్రీరామకృష్ణులు భక్తులతో మాట్లాడసాగారు.
శ్రీరామకృష్ణులు (డాక్టర్‌తో): నీ కుమారుడు అవతారవాదాన్ని అంగీకరించడు. అయినా ఫర్వాలేదు, అతడు అంగీకరించకున్నా ఫర్వాలేదు.
“నీ కుమారుడు మంచి కుర్రవాడు.అలా కాకుండా ఎలా ఉంటాడు? బొంబాయి మామిడి చెట్టుకు పుల్లని పళ్ళు కాస్తాయా ఏమిటి? అతడికి భగవంతుడిపట్ల ఎంతటి విశ్వాసమని! భగవంతుడిపై మనస్సు నిలిపేవాడే అసలైన మనిషి. భగవంతుడొక్కడే సత్యం, సమస్తం అనిత్యం అని నిశ్చయంగా ఎరిగి, ఆధ్యాత్మిక చైతన్యం జాగృతమై ఉన్నవాడే నిజమైన మనిషి. అమృత్, భగవదవతారాలను విశ్వసించడు. అయితే అందులో తప్పు ఏముంది?
“భగవంతుడు ఉన్నాడనీ, ఈ సమస్త జీవజగత్తులు ఆయన ఐశ్వర్యమేననీ (అంటే ఆయన శక్తి వ్యక్తీకరణలేనని) నమ్మితే చాలు – భాగ్యవంతుడు, ఆతడి తోట మాదిరి.
“కొందరు దశావతారాలు ఉన్నవని అంటారు. మరికొందరు ఇరవై నాలుగు అవతారాలు ఉన్నాయంటారు. మరికొందరు, అవతారాలు అసంఖ్యాకం అంటారు. భగవంతుడి శక్తి ఎక్కడైతే విశేషంగా వ్యక్తమవుతుందో, అక్కడ భగవంతుడు అవతరించాడని గ్రహించు. ఇదే నా అభిప్రాయం.
“మరో దృక్పథం కూడా ఉంది. దాని ప్రకారం నువ్వు చూస్తున్నదంతా ఆయనే అయివున్నాడు. మారేడు పండులా గింజలు, తొక్క, గుజ్జు – ఈ మూడు చేరినప్పుడే కదా మారేడు పండు అవుతుంది. దేనిదైతే నిత్యమో, లీలకూడా దానికి సంబంధించినదే. నిత్యాన్ని వదలిపెట్టి కేవలం లీలను అర్థం చేసుకోజాలం. ఎందుకంటే లీల ఉండటం చేతనే దాన్ని క్రమక్రమంగా అతిక్రమిస్తూ నిత్యాన్ని చేరుకోవచ్చు.
“అహం భావన ఉన్నంతవరకు లీలను వదలిపెట్టి పోజాలం. ‘నేతి నేతి’ అంటూ ధ్యానయోగం ద్వారా (లీలను వదలిపెట్టి) నిత్యాన్ని చేరుకోవచ్చు. కాని వదిలేదంటూ ఏదీ లేదు. ఇందాక చెప్పానే, మారేడు పండు మాదిరి.”
డాక్టరు: సరిగ్గా చెప్పారు.
శ్రీరామకృష్ణులు: కచుడు నిర్వికల్ప సమాధిలో ఉండేవాడు. సమాధి స్థితినుండి దిగివచ్చిన తరువాత, ఎవరో అతణ్ణి ‘నువ్విప్పుడు ఏం చూస్తున్నావు’ అని అడిగారు. అందుకు కచుడు ఇలా అన్నాడు: ‘జగత్తు ఆయనలో ఓతప్రేతమై ఉన్నట్టుగా గాంచుతున్నాను. ఆయనే పరిపూర్ణుడై వెలయుచున్నాడు. నేను చూస్తున్నదంతా ఆయనే అయివున్నాడు. వీటిలో దేన్ని స్వీకరించాలో, దేన్ని తృణీకరించాలో నిశ్చయించు కోలేకపోతున్నాను.’
“నిత్యం, లీల రెంటినీ అనుభూతం చేసుకొని పిదప భగవంతుని సేవకునిగా సంసారంలో జీవించాలని నేను అభిప్రాయపడుతున్నాను. హనుమంతుడు సాకార, నిరాకారాలను రెంటినీ దర్శించాడు. పిదప అతడు భగవంతుని భక్తునిగా ఆయన్ను సేవిస్తూ జీవించాడు.”
‘మ’ (స్వగతం): నిత్యం, లీలలు రెండిటినీ అంగీకరించ వలసిందేనన్నమాట. జర్మనీలో వేదాంతాన్ని ప్రచారం చేయడంతో ఐరోపాకు చెందిన తత్త్వవేత్తలు కొందరు కూడా ఈ సిద్ధాంతాన్ని ఒప్పుకుంటున్నారు. కాని కామినీ కాంచనాలను త్యజించకుండా నిత్యం, లీలలు సాక్షాత్కరించుకోలేమని శ్రీరామకృష్ణులు అంటున్నారు. యథార్థ త్యాగం! సంపూర్ణంగా అనాసక్తి! హెగెల్ వంటి పాశ్చాత్య పండితుల సిద్ధాంతాలకు, శ్రీరామకృష్ణుల బోధనలకు నడుమ ఉన్న వ్యత్యాసం ఇదే.
45.4 చతుర్థ పరిచ్ఛేదం అవతారవాదం – డా ॥ సర్కార్, శ్రీరామకృష్ణులు
డా ॥ సర్కార్ అభిప్రాయం ఏమిటంటే – భగవంతుడు, మానవులను సృష్టించాడు కాబట్టి, ఆత్మలన్నిటికీ అనంతమైన ఉన్నతి కలుగుతుంది. ఒక మనిషి మరో మనిషికంటే గొప్పవాడిగా ఉండగలడు అన్నమాటను ఆయన ఒప్పుకోడు. అంటే సృష్టిలో అందరూ సమానమే, హెచ్చుతగ్గులనేవి లేవు అనేదే ఆయన అభిప్రాయం. అందుకే ఆయన అవతార సిద్ధాంతాన్ని అంగీకరించడు.
డాక్టర్: Infinite progress (అనంత ప్రగతి) లేనట్లయితే ఇంకా ఐదారు ఏండ్లు బ్రతికి ఏం లాభం? అంతకంటే ఉరిపోసుకోవడం మేలు.
డా ॥ మహేంద్రలాల్ సర్కార్
“ఒక మనిషిని పట్టుకొని అవతార మనడమా? అందరిలాగే మలమూత్రాలు విసర్జించే వ్యక్తి కాళ్ళకు మ్రొక్కటమా? దీన్ని నేను అంగీకరించను, ఊహూ! కాని Reflection of God’s Light దీనిని అంగీకరిస్తాను. భగవజ్జ్యోతి మనిషిలో ప్రకాశిస్తుంటుందని ఒప్పుకుంటాను.”
గిరీశ్: కానీ, మీరు God’s Light (భగవజ్జ్యోతి)ని దర్శించలేదు కదా!
డాక్టరుకు ఏం జవాబు ఇవ్వాలో తోచలేదు. ప్రక్కనే ఆయన స్నేహితుడొకడు కూర్చుని ఉన్నాడు. అతడు, ఆయన చెవిలో ఏదో గుసగుసలాడాడు.
డాక్టర్ (గిరీశ్‌తో): కాని మీరుకూడా ప్రతిబింబం తప్ప మరేదీ చూడలేదు కదా!
గిరీశ్: I See It! I See the Light (నేను చూస్తున్నాను! నేను జ్యోతిని దర్శిస్తున్నాను!) శ్రీకృష్ణుడు అవతారపురుషుడని prove (ఋజువు) చెయ్యగలను. లేకుంటే నా నాలుక తెగకోసుకుంటాను.
45.4.1 సన్నిపాత రోగి ప్రేలాపనలు – పూర్ణ జ్ఞానంతోనే విచారణ ఆగుతుంది
శ్రీరామకృష్ణులు: ఇవన్నీ నిరర్థక వాదాలు. ఇవి సన్నిపాత రోగి ప్రేలాపనల వంటివి. సన్నిపాత రోగి వికారంతో ఇలా అంటుంటాడు: ‘బిందెడు నీళ్ళు త్రాగుతాను, గుండిగ అన్నం తింటాను.’ వైద్యుడు అంతా వింటూ ‘అలాగే, అలాగే చేద్దువులే’ అంటుంటాడు. వికారం తగ్గాక రోగి ఏం మాట్లాడతాడో వాటిని మాత్రమే వైద్యుడు లక్ష్యపెడతాడు.
“వెన్నను కాచేటప్పుడు చిటపట లాడుతుంటుంది. కాని అది బాగా కాగిన తరువాత ఎలాంటి శబ్దమూ ఉండదు. ఎవరి మనస్సు ఎలా ఉంటుందో భగవంతుడి గురించి వారి భావన కూడా అలాగే ఉంటుంది. నేను సంపన్నుల ఇళ్ళలో క్వీన్(విక్టోరియా రాణి) చిత్తరువు, ఇంకా ఇతర పెద్ద మనుష్యుల చిత్తరువులు ఉండటం చూశాను. కాని భక్తుల ఇళ్ళలో దేవీదేవతల చిత్రాలు ఉంటాయి.
“లక్ష్మణుడు, రాముడితో, ‘రామా! వసిష్ఠ మహర్షి అంతటి వాడే పుత్రశోకంతో దుఃఖీస్తున్నాడే!’ అన్నాడు. అందుకు రాముడు ఇలా విశదపరచాడు: ‘తమ్ముడూ, జ్ఞానం ఉన్నవాడికి అజ్ఞానం కూడా ఉంటుంది. వెలుగును గురించి తెలిసినవాడికి చీకటిని గురించి కూడా తెలిసి ఉంటుంది. అందుకే నువ్వు జ్ఞానాజ్ఞానాలకు అతీతుడవై వెళ్ళు.’ భగవంతుణ్ణి విశేషంగా తెలుసుకున్నట్లయితే ఇలాంటి స్థితి ఏర్పడుతుంది. దీనినే విజ్ఞానం అంటారు.
“కాలికి ముల్లు గుచ్చుకున్నప్పుడు మరో ముల్లును వెదకి తీసుకురావాలి. దానితో కాలిలోని ముల్లును తీసివేయాలి. అటు పిదప రెండింటినీ పారేస్తాం. జ్ఞానమనే ముల్లుతో అజ్ఞానమనే ముల్లును తొలగించాక, జ్ఞానాజ్ఞానాలనే రెండు ముళ్ళనూ పారేయాలి.
“పూర్ణజ్ఞానానికి కొన్ని గుర్తులు ఉన్నాయి. వాటిలో ఒకటి – విచారణ ఆగిపోతుంది. నేనిందాక చెప్పానే – వెన్న చిటపటలాడేది అది పూర్తిగా కాగనంత వరకే.”
డాక్టరు: మనిషి పూర్ణజ్ఞానాన్ని శాశ్వతంగా నిలుపుకోగలడా? సర్వమూ భగవంతుడేనని మీరు అంటుంటారు. మళ్లీ ఈ పరమహంస నిర్వాకం చేయడ మెందుకు? వీరందరూ వచ్చి మీకు సేవలెందుకు చేస్తున్నట్లు? మీరు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండరెందుకు?
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): నీరు స్థిరంగా ఉన్నప్పుడూ నీరే, ప్రవహి స్తున్నప్పుడూ నీరే, తరంగ రూపంలో ఉన్నప్పుడూ నీరే.
45.4.2 మావటి నారాయణుడు – అంతరంగ వాణి
“నీకు మరో సంగతి చెప్పాలి. మావటి నారాయణుని మాట నెందుకు పెడచెవిన పెట్టాలి?
“ఒక గురువు శిష్యుడితో ‘నాయనా, అందరూ నారాయణులే’ అని ఉపదేశించాడు. మదపుటేనుగు ఒకటి శిష్యుడి వైపుకు దూసుకువస్తుంది. శిష్యుడు గురు వాక్యాలపట్ల విశ్వాసం ఉంచి అక్కడనుండి ప్రక్కకు తొలగిపోలేదు. ఏనుగు కూడా నారాయణుడే కదా! ‘ప్రక్కకు పో, ప్రక్కకు పో’ అంటూ మావటి గొంతు చించుకొని అరుస్తున్నాడు. కాని మన శిష్యుడు మాత్రం అక్కడ నుండి కదలనేలేదు. ఏనుగు అతణ్ణి తొండంతో ఎత్తి విసిరి పారేసింది. శిష్యుడికి స్పృహ తప్పింది కానీ ప్రాణం పోలేదు. ముఖంపై నీళ్ళు చల్లేసరికి స్పృహ వచ్చింది. ‘నువ్వు అక్కడినుండి ప్రక్కకు తొలగిపోలేదెందుకని?’ అని అడిగేసరికి అతడు ‘నేను ప్రక్కకు ఎందుకు పోవాలి? అందరూ నారాయణులే అని గురుదేవులు బోధించారు కదా!’ అన్నాడు. అప్పుడు గురువు, ‘నాయనా మరి నువ్వు మావటి నారాయణుడి మాటలను ఎందుకు పెడచెవినపెట్టావు?’ అన్నాడు.
“భగవంతుడే శుద్ధ మనస్సు, శుద్ధ బుద్ధి రూపంలో అంతరంగాన వెలసి ఉన్నాడు. నేను యంత్రం, ఆమె యంత్రాన్ని నడిపేది. నేను గృహం, ఆమె గృహిణి.”
45.4.3 ‘నేను ఎవరిని?’
డాక్టరు: అలాగైతే నేనో ప్రశ్న అడగాలి. మీ జబ్బు నయం చేయమని నన్ను అడుగుతారెందుకు?
శ్రీరామకృష్ణులు: ‘నేను’ అనే కుండ ఉన్నంత వరకు అలాగే మాట్లాడు తుంటాను. నీటితో పరిపూర్ణమై ఉన్న మహాసముద్రాన్నొకదానిని ఊహించుకో. అందులో ఒక కుండ ఉన్నది. కుండ లోపలా, వెలుపలా నీరే. కాని కుండను పగలగొట్టనంత వరకు నీరు ఏకం కాదు. భగవంతుడే ఈ ‘నేను’ అనే కుండను నాలో ఉంచాడు.
డాక్టరు: అయితే మీరు అంటున్న ఈ ‘నేను’, తతిమ్మా విషయాలన్నిటి అర్థం ఏమిటి? వీటి అర్థం మీరు వివరించాలి. భగవంతుడు మనతో ఆట లాడుతున్నాడా ఏమిటి?
గిరీశ్: మహాశయా, ఇవి భగవంతుని ఆటలు కావని ఎందు కనుకుంటున్నారు?
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): మనలో ఈ ‘నేను’ ఉంచింది ఆయనే. ఇదంతా ఆయన ఆట, ఆయన లీల. ఒక రాజుకు నలుగురు కుమారులు ఉండేవారు. వారందరూ రాకుమారులే కదా! కాని ఆటలాడేటప్పుడు వారిలో ఒకరు మంత్రిగానూ, ఇంకొకరు కొత్వాలుగానూ, మరొకరు మరోలానూ – ఆ విధంగా ఆటలాడుతుంటారు. రాకుమారుడే అయినప్పటికీ కొత్వాలు వేషం వేస్తాడు!
(డాక్టరుతో) “విను. నీకు ఆత్మసాక్షాత్కారం కలిగినట్లయితే నేను చెప్పిన వాటన్నిటిలోని సత్యాన్ని గ్రహించగలిగి ఉండేవాడివి. భగవద్దర్శనం కలిగితే సంశయాలన్నీ సమసిపోతాయి.”
45.4.4 శ్రీకృష్ణార్జునులు – ఇంద్రజాల ప్రదర్శన – ‘దొంగలు, దిష్టిబొమ్మ’ దృష్టాంతం – విభీషణడు
డాక్టరు: సమస్త సంశయాలూ తొలగిపోతాయా ఏమిటి?
శ్రీరామకృష్ణులు: నా వద్దనుండి ఎంతగా నేర్చుకోగలవో అంతగా నేర్చుకొని వెళ్ళు. అటుపైన ఇంకా తెలుసుకోవాలనుకుంటే, ఏకాంతంలో భగవంతుణ్ణి ప్రార్థించు. ఆయన ఇలా ఎందుకు చేశాడని ఆయన్నే అడుగు.
“ఇంటికి ఎవరైనా భిక్షగాడు వస్తే ఇంటి కుర్రవాడు అతడికి పిడికెడు బియ్యం పెట్టవచ్చు. కాని భిక్షగాడు రైలు ఛార్జీ అడిగితే అందుకు ఇంటి యజమానిని అడగవలసి వస్తుంది. (డాక్టరు మౌనంగా ఉండిపోయాడు.)
“అది సరే, నీకు తర్కించడమంటే ఇష్టం కదా! కాసేపు తర్కించుకుందాం, విను. జ్ఞానుల దృక్పథం ప్రకారం అవతార మనేది ఉండదు. కృష్ణుడు, అర్జునుడితో ఇలా అన్నాడు: ‘ఓ అర్జునా, నువ్వు నన్ను ఎప్పుడూ అవతారం అంటూంటావు కదా! నీకో విషయం చూపించాలి. రా, చూద్దువుగాని.’ ఇలా పలికి కృష్ణుడు అర్జునుణ్ణి తన వెంట తీసుకువెళ్ళాడు. కొంతదూరం వెళ్ళాక అర్జునుణ్ణి ‘ఏం చూస్తున్నావు?’ అని అడిగాడు. అర్జునుడు ఇలా అన్నాడు ‘గుత్తులు గుత్తులుగా నల్లని నేరేడు పళ్ళు వ్రేలాడుతున్న ఒక పెద్ద వృక్షం’. ‘అవి నేరేడుపళ్ళు కాదు. ఇంకాస్త ముందుకు వెళ్ళి చూడు’ అన్నాడు కృష్ణుడు. అర్జునుడు ముందుకు వెళ్లి చూసేసరికి, అవి నేరేడు పళ్ళు కాదు, గుత్తులు గుత్తులుగా శ్రీకృష్ణులు వ్రేలాడుతున్నారు. అప్పుడు కృష్ణుడు ఇలా అన్నాడు: ‘ఇప్పుడు చూశావు కదా – అక్కడ నాలాగే ఎంతమంది కృష్ణులు ఉన్నారో!’
“శ్రీకృష్ణుడి గురించి కబీర్ దాస్, ఇలా అన్నాడు: ‘గోపికలు చప్పట్లు చరుస్తూంటే నువ్వు కోతిలా నాట్యం చేశావు.’
నువ్వు ఎంతగా ముందుకు వెళతావో, అంత తక్కువగా నువ్వు భగవంతుడి ఉపాధులను దర్శిస్తావు. భక్తుడు ప్రథమంగా దశభుజమూర్తిని దర్శిస్తాడు. ముందుకు వెళ్ళిచూస్తే ద్విభుజ గోపాలుణ్ణి చూస్తాడు. అతడు ఎంతగా ముందుకు వెళతాడో, ఉపాధులను దర్శించడం అంతగా తగ్గిపోతుంది. మరింత ముందుకు వెళితే, కేవలం జ్యోతి దర్శనం – ఎలాంటి ఉపాధులు ఉండవు.
“కాస్త వేదాంత విచారణను విను. ఐంద్రజాలికుడొకడు రాజుకు తన ఇంద్రజాలం ప్రదర్శింప వచ్చాడు. ఐంద్రజాలికుడు కొద్దిగా ప్రక్కకు తప్పుకోగానే, ఎవరో రౌతు గుర్రంమీద రావడం రాజు చూశాడు. అతడు యోధుని దుస్తులు ధరించి అస్త్రశస్త్రాలను చేబూని ఉన్నాడు. రాజుతోపాటు సభాసదులందరూ ‘ఇందులో ఏది సత్యం’ అంటూ విచారణ చేయసాగారు. గుర్రమైతే సత్యంకాదు, యోధుని దుస్తులు, అస్త్రశస్త్రాలు కూడా సత్యం కాదు. చివరగా చూసేసరికి, రౌతు ఒక్కడే అక్కడ ఉన్నట్లు వారికి పూర్తిగా అవగాహనకు వచ్చింది. ఎందుకంటే బ్రహ్మ సత్యం, జగన్మిథ్య విచారణ చేసేకొద్దీ ఏమీ మిగలదు.
డాక్టరు: ఆ, దీనితో నేను ఏకీభవిస్తాను.
శ్రీరామకృష్ణులు: కాని ఈ భ్రమ అంత సులువుగా పోదు. జ్ఞానం కలిగిన పిదపకూడా ఉంటుంది. ఒక వ్యక్తి కలలో పులిని చూశాడు. కాని కల చెదిరిపోయాక కూడా అతడి గుండె దడదడలాడుతూనే ఉంది.
ఒక పొలంలో దొంగతనం చేయడానికి కొందరు దొంగలు వచ్చారు. దొంగలను భయపెట్టే నిమిత్తం గడ్డితో చేసిన దిష్టిబొమ్మ ఒకటి పొలంలో నిలిపి ఉంచబడింది. దొంగలు దిష్టిబొమ్మను చూసి మనిషి అనుకొని భయపడుతున్నారు. పొలంలోకి ప్రవేశించలేకున్నారు. వారిలో ఒకడు దిష్టిబొమ్మకు సమీపంగా వెళ్లి చూశాడు. అది కేవలం గడ్డితో చేసిన దిష్టిబొమ్మేనని గ్రహించాడు. అతడు తోటి వారివద్దకు తిరిగి వచ్చి వారితో ‘భయపడే పనిలేదు’ అన్నాడు. కాని వారు పొలంలోకి ప్రవేశించడానికి సంశయిస్తూనే ఉన్నారు. ‘మా గుండెలు దడదడలాడుతున్నాయి బాబూ!’ అన్నారు. అప్పుడా సాహసియైన దొంగ దిష్టిబొమ్మను తీసి నేలమీద పడేసి ‘ఇది ఏమీ కాదు, ఇది ఏమీ కాదు’ అనసాగాడు. ‘నేతి, నేతి’ విధానం అంటే ఇదే.
డాక్టరు: చక్కని మాటలు!
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): ఎలాంటి మాటలు?
డాక్టరు: చక్కని మాటలు!
శ్రీరామకృష్ణులు: మరైతే ఒక ‘థ్యాంక్యూ’ ఇవ్వవయ్యా.
డాక్టరు: మీరు నా మనోభావాన్ని అర్థం చేసుకోరా? మిమ్మల్ని చూడడానికి నేను ఇక్కడకు ఎంతగా కష్టపడి వస్తున్నానని!
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): నేను చెప్పేది అది కాదు. కనీసం మూర్ఖులకోసమైనా ఏమైనా చెప్పాలి. రావణుడి మరణానంతరం, విభీషణుడు లంకకు రాజవడానికి ఇష్టపడలేదు. రాముడితో ‘ఓ రామా! నేను నిన్ను పొందాను కదా! ఇక ఈ రాజ్యంతో ఏం చేసుకోను?’ అన్నాడు. అందుకు రాముడు ఇలా అన్నాడు: ‘విభీషణా! నువ్వు మూర్ఖుల కోసం రాజువి కావాలి. నువ్వు రాముణ్ణి ఇంతగా సేవించావు. అందువల్ల నీకు ఏం దక్కింది? అని అడుగుతారు వారు. వారికి పాఠం నేర్పడానికై నువ్వు రాజువి అవ్వాలి.’
డాక్టరు: అటువంటి మూర్ఖులు ఇక్కడ ఎక్కడ ఉన్నారు?
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): ఆ లేకేం! ఇక్కడ అన్ని రకాలవారూ ఉన్నారు. ముత్యపు చిప్పలూ ఉన్నాయి, నత్త గుల్లలూ ఉన్నాయి. (అందరూ నవ్వారు.)
45.5 పంచమ పరిచ్ఛేదం ప్రకృతి, పురుషుడు – ఉత్తమ అధికారి
డా.సర్కార్ హోమియోపతి డాక్టరు. శ్రీరామకృష్ణులకు రెండు గుళికలు హోమియోపతి మందు ఇచ్చాడు.
డాక్టరు (నవ్వుతూ): నేను ఈ రెండు గుళికలు ఇస్తున్నాను. వీటిలో ఒకటి పురుషుడు, మరొకటి ప్రకృతి. (అందరూ నవ్వారు.)
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): అవును, ప్రకృతి పురుషులెప్పుడూ ఒకే చోట ఉంటారు. పావురాళ్ళను చూడలేదా? అవి విడివడి ఉండలేవు. ప్రకృతి ఉన్నచోటనే పురుషుడు, పురుషుడు ఉన్నచోటనే ప్రకృతి.
నేడు విజయ దశమి. శ్రీరామకృష్ణులు, డాక్టరును ఏమైనా ఉపాహారం తీసుకోమన్నారు. భక్తులు డాక్టరుకు ఉపాహారం సమర్పించారు.
డాక్టరు (ఉపాహారం తింటూ): ఉపాహారం పెట్టినందుకుగాను ‘థ్యాంక్యూ’ ఇస్తాను. మీరిచ్చిన ఉపదేశాలకు మాత్రం కాదు. ఆ ‘థ్యాంక్యు’ నోటితో చెప్పను.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): భగవంతుడిపై మనస్సు నిలుపు, అంతకంటే వేరే ఏం చెప్పాలి? ఇంకా కాస్త ధ్యానం చేస్తూ ఉండు. (చిన్న నరేంద్రుణ్ణి చూపిస్తూ) చూడు, ఇతడి మనస్సు భగవంతుడిలో సంపూర్ణంగా లీనమైపోతుంది. నీకు చెప్పిన మాటలన్నీ –
డాక్టరు: ఆ మాటలు వీరిక్కూడా చెప్పండి.
శ్రీరామకృష్ణులు: వ్యక్తి జీర్ణశక్తికి తగ్గట్టు అతడికి ఆహారం ఇవ్వాలి. నీకు చెప్పిన విషయాలను అందరూ అర్థం చేసుకోగలరా ఏమిటి? నీకు చెప్పిన మాటలను నేను అందరికీ చెప్పజాలను. తల్లి ఇంటికి ఒక చేపను తీసుకువచ్చిందనుకుందాం. బిడ్డలందరి జీర్ణశక్తీ ఒకేలా ఉండదు కదా! కొంతమందికోసం ఆమె పలావ్ చేస్తుంది. మరికొందరి కోసం పులుసు చేస్తుంది. – వీరికి జీర్ణశక్తి తక్కువ. (అందరూ నవ్వారు.)
డా. సర్కార్ సెలవు పుచ్చుకున్నాడు. నేడు విజయదశమి. ఈ సందర్భంగా పెద్దలకు, స్నేహితులకు సముచిత రీతిలో గౌరవం, శుభాకాంక్షలు తెలుపుకోవడం వంగ సమాజంలో ఆనవాయితీ. భక్తులందరూ శ్రీరామకృష్ణులకు సాష్టాంగ ప్రణామం చేసి ఆయన పాదధూళిని స్వీకరించారు. పిదప వారందరూ పరస్పరం ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. వారి ఆనందానికి హద్దులేకపోయింది. శ్రీరామకృష్ణులకు సుస్తీగా ఉంది. కాని నేడు ఆయన వారి నందరినీ దానిని మరచిపోయేలా చేశారు. ఆలింగనాలు, నోరు తీపి చేసుకోవడం చాలాసేపటి వరకు కొనసాగింది. చిన్న నరేంద్రుడు, ‘మ’ తదితర భక్తులు శ్రీరామకృష్ణులకు సమీపాన కూర్చున్నారు. ఆయన వారితో ఉల్లాసంగా మాట్లాడసాగారు. డా.సర్కార్ గురించిన ప్రస్తావన వచ్చింది.
శ్రీరామకృష్ణులు: డాక్టరుకు ఇంతకంటే ఎక్కువగా చెప్పే అవసరం లేదు. చెట్టు కొట్టడం దాదాపు పూర్తయ్యాక ఆ వ్యక్తి ప్రక్కకు తప్పుకుంటాడు. కాసేపట్లో ఆ చెట్టు దానంతట అదే పడిపోతుంది.
చిన్న నరేంద్రుడు (నవ్వుతూ): ఇక్కడ ప్రతిదీ Principle (ఆదర్శమే)!
శ్రీరామకృష్ణులు (‘మ’ తో): డాక్టరు చాలా వరకు మారిపోయాడు కదా, ఏమంటావ్? ఔషధం ఇవ్వాలన్న సంగతే మరిచిపోతాడు. నేను జ్ఞాపకం చేసినప్పుడు ‘ఓ! అవునవును, ఔషధం ఇవ్వాలి’ అంటాడు.
ఇంటి ముంగిలిలో కొందరు భక్తులు పాడుతున్నారు. వారు శ్రీరామకృష్ణుల గదిలోకి తిరిగి వచ్చారు. ఆయన వారితో ఇలా అన్నారు: “ఏమోయ్, ఇందాక మీరు పాడారు కదా, కాని అన్నీ అపస్వరాలే! అపస్వరాలు పాడడంలో నిష్ణాతుడైన వ్యక్తి ఒకడు ఉన్నాడు. ఇందాక మీరు పాడింది కూడా అలాగే తోచింది.” (అందరూ నవ్వారు)
చిన్న నరేంద్రుడికి బంధువైన అబ్బాయి ఒకడు వచ్చాడు. బాగా షోకుగా ఉడుపులు ధరించి, కళ్ళజోడు పెట్టుకొని ఉన్నాడు. శ్రీరామకృష్ణులు చిన్న నరేంద్రుడితో మాట్లాడసాగారు.
శ్రీరామకృష్ణులు: ఈ దారిలో ఓ కుర్రవాడు వెళుతూండగా చూశాను. బాగా మడతలు పెట్టివున్న చొక్కా ధరించాడు. ఎంతగా వగలుపోతూ నడుస్తున్నాడని! మధ్యమధ్యలో శాలువాను ప్రక్కకు తొలగించి తన చొక్కా అందరికీ కనిపించేలా చేస్తాడు. తనను ఎవరైనా చూస్తున్నారా లేదా అని గమనిస్తూ ఉంటాడు. అతడు నడుస్తుంటే మోకాళ్ళు వంకర అని తెలిసిపోతోంది. (అందరూ నవ్వారు.) నెమలి పురివిప్పి తన అందాన్ని ప్రదర్శిస్తుంది. కాని దాని కాళ్ళు మురికిగా ఉంటాయి. (అందరూ నవ్వారు.) ఒంటె అనాకారి. దానికి సంబంధించిన విషయాలన్నీ అలాగే ఉంటాయి.
చిన్న నరేంద్రుడి బంధువు: అయితే దాని నడత మంచిదే కదా!
శ్రీరామకృష్ణులు: మంచిదే. కాని అది ముళ్ళకంపలు తింటూ ఉంటుంది. నోటి నుండి రక్తం కారుతూంటుంది. అయినప్పటికీ ముళ్ళకంపలు తినడం మాత్రం మానదు. సంసారులూ అంతే! బిడ్డలు మరణించినా ఇంకా బిడ్డలు కావాలంటూ వెంపర్లాడుతూనే ఉంటారు.
45.6 షష్ఠ పరిచ్ఛేదం శ్రీరామకృష్ణులు, ఈశాన్ – గృహస్థాశ్రమం
అక్టోబరు 22 1885
గురువారం సాయంత్రం. దుర్గాపూజ తరువాత కొన్ని రోజులు గడిచాయి. శ్రీరామకృష్ణులు శ్యాంపుకూర్ భవనం రెండవ అంతస్తులోని తమ గదిలో పక్కమీద కూర్చుని ఉన్నారు. బలరామ్ బోసు ఇంట్లో ఉండేటప్పుడు సుప్రసిద్ధ ఆయుర్వేద వైద్యుడైన గంగాప్రసాద్‌కు ఆయన్ను చూపించడం జరిగింది. ఈ వ్యాధి నయమవుతుందా అని శ్రీరామకృష్ణులు అడిగినప్పుడు గంగాప్రసాద్ బదులుచెప్పలేదు. మరికొందరు అలోపతి డాక్టర్లుకూడా చూసి ఈ వ్యాధి నయమవదని నిర్ధారణ చేశారు. ప్రస్తుతం శ్రీరామకృష్ణులు హోమియోపతి వైద్యుడైన డా ॥ సర్కార్ పర్యవేక్షణలో ఉన్నారు. ఆయనకు శ్రీరామకృష్ణుల పట్ల అమిత శ్రద్ధాభక్తులు. బొత్తిగా తీరిక లేకపోయినప్పటికీ, వచ్చినప్పుడల్లా ఆయన ఒక్కోసారి దాదాపు ఆరు, ఏడు గంటలపాటు ఇక్కడే ఉండిపోతాడు. దగ్గరి చుట్టంలా భక్తులందరితో కలిసిమెలసి ఉంటాడు.
గదిలో శ్రీరామకృష్ణులతోపాటు ఈశాన్చంద్ర ముఖోపాధ్యాయ, డా ॥ సర్కార్ తదితర భక్తులు ఉన్నారు. ఈశాన్ దానశీలి. పెన్షన్ పుచ్చుకొని జీవితం గడుపుతూ ఉన్నాడు. అయినప్పటికీ దానాలు చేయడం మాత్రం మానడు. సమయమంతా భగవచ్చింతనలోనే గడుపుతుంటాడు. శ్రీరామకృష్ణులకు జబ్బు చేసిందని విని ఆయన్ను చూడడానికి వచ్చాడు. భక్తులందరు శ్రీరామకృష్ణుల వచనామృతాన్ని గ్రోలడానికి ఆతురతతో ఉన్నారు. శ్రీరామకృష్ణులు, ఈశాన్ను ఉద్దేశిస్తూ మాట్లాడసాగారు.
45.6.1 నిర్లిప్త సంసారానికి మార్గం
శ్రీరామకృష్ణులు: సంసారంలో ఉంటూ భగవంతుడి పాదపద్మాలపై భక్తిని కలిగివుండి సంసారం చేసేవాడు నిజంగానే ధన్యుడు సుమా! అతడే వీరుడు. నెత్తిమీద రెండు మణుగుల బరువు పెట్టుకొని కూడా దారిన వెళ్ళే పెళ్ళివారి ఊరేగింపును చూసే వ్యక్తి లాంటి వాడు. అతడు ఎంతో శక్తి ఉంటే తప్ప అలా జీవించలేడు. అలాంటి సంసారి బురదచేప లాంటివాడు. బురదలో ఉంటుంది కాని దాని ఒంటికి కాస్తయినా బురద అంటుకోదు. నీటిపక్షి (Water Fowl) సర్వదా నీటిలో మునిగి ఉంటుంది కాని అది ఒక్కసారి రెక్కలు విదిలించగానే దాని ఒంటిపై నీరనేదే నిలువదు.
“కాని సంసారంలో నిర్లిప్తభావంతో ఉండడానికిగాను కొన్ని సాధనలు చేయవలసి ఉంటుంది. కొంతకాలంపాటు ఏకాంతంలో ఉండడం అవసరం – అది ఏడాదిపాటు కావచ్చు, ఆరు నెలలు కావచ్చు, మూడు నెలలు కావచ్చు; లేకుంటే ఒక నెలయినా కావచ్చు. ఆ ఏకాంతంలో భగవచ్చింతన చేయాలి, వ్యాకులచిత్తంతో భగవంతుణ్ణి భక్తి కోసం ప్రార్థించాలి. హృదయాంతరాళాలలో ఇలా అనుకోవాలి: ‘ఈ సంసారంలో నా వారంటూ ఎవరూ లేరు. ఎవరినయితే నా వారు అంటున్నానో వారు ఉండేది రెండు రోజులకు మాత్రమే. భగవంతుడొక్కడే నా వాడు. ఆయనే నా సర్వస్వం. ఓహ్! నే నాయన్ను ఎలా పొందగలను?’
“భక్తిని సంపాదించుకొన్న తరువాత సంసారం చేయవచ్చు. ఇది చేతులకు నూనె రాచుకొని పనసతొనలు వొలవడం లాంటిది. అప్పుడు చేతులకు జిగురు అంటదు. సంసారం నీటి వంటిది, మనస్సు పాల లాంటిది. నీటిలో పాలను కనుక పోస్తే రెండూ కలిసిపోతాయి. అందుకే పాలను ఏకాంత ప్రదేశంలో (అంటే ఎవరూ పాలను కదపకుండా ఉంటేటట్లు) పెట్టి తోడుబెట్టవలసి ఉంటుంది. పెరుగు తోడుకొన్న తరువాత వెన్నను తీయవలసి ఉంటుంది. వెన్నను తీశాక దాన్ని నీటిలో కనుక వేసినట్లయితే అది నీటిలో కలసిపోదు; నిర్లిప్తంగా నీటి మీద తేలుతూ ఉంటుంది.
“బ్రహ్మసమాజ భక్తులు నాతో ఇలా అన్నారు. ‘మహాశయా! మాది జనక మహారాజు మతం. ఆయన లాగానే మేము కూడా నిర్లిప్తభావంతో సంసారం చేస్తాము.’ అందుకు నేను ఇలా అన్నాను: ‘నిర్లిప్తభావంతో సంసారం చెయ్యడం ఎంతో కష్టం. ఊరకే నోటితో చెప్పినంత మాత్రాన ఎవరూ జనక మహారాజులైపోరు. జనకుడు తల క్రిందులుగా ఎన్ని తపస్సులు చేశాడని! మీకు ఆ విధంగా తలక్రిందులవ్వాల్సిన పనిలేదు.
“కాని సాధనలు చేయాలి, ఏకాంతంలో వసించాలి. ఏకాంతంలో జ్ఞానాన్ని, భక్తిని పొందాక వెళ్ళి సంసారం చెయ్యాలి. పాలను కదపకుండా తోడు బెట్టవలసి ఉంటుంది. అటూ ఇటూ కదుపుతూ ఉంటే పెరుగు తోడుకోదు.”
“జనక మహారాజు నిర్లిప్తుడుగా ఉండేవాడు. అందుచేత ఆయనకు విదేహుడనే ప్రత్యేకమైన పేరుకూడా ఉండేది. ఎందుకంటే, ఆయనకు దేహభావన ఉండేది కాదు కాబట్టి. సంసారంలో ఉంటూకూడా జీవన్ముక్తుడై తిరుగుతూండేవాడు. కాని దేహభావన పోవడమనేది సుదూర విషయం. అందుకు ఎంతగానో సాధనలు అవసరం.
“జనకుడు మహావీరుడు. రెండు కత్తులతోనూ సాము చేసేవాడు – ఒకటి జ్ఞానం, మరొకటి కర్మ.
45.6.2 గృహస్థాశ్రమ జ్ఞాని – సన్న్యాసాశ్రమ జ్ఞాని
“గృహస్థాశ్రమంలో ఉన్న జ్ఞానికి, సన్న్యాసాశ్రమంలో ఉన్న జ్ఞానికి మధ్య ఏమైనా తేడా ఉందా అని అడిగితే దానికి సమాధానం – ఇద్దరూ ఒకే తరగతికి చెందిన వారే. ఇతడూ జ్ఞానే, అతడూ జ్ఞానే. కాని గృహస్థాశ్రమంలో ఉన్న జ్ఞానికి భయం ఉండనే ఉంటుంది. కామినీ కాంచనాల నడుమ వసిస్తున్నట్లయితే కాస్తోకూస్తో భయం ఉండనే ఉంటుంది. మసిబారిన ఇంట్లో వసిస్తున్నప్పుడు నువ్వు ఎంత జాగ్రత్త వహించినప్పటికీ శరీరం మీద కాస్తోకూస్తో నల్లని మరక పడే తీరుతుంది. (BG 2.67, BG 2.68)
“వెన్న తీశాక దాన్ని కొత్త కుండలో కనుక పెడితే అది చెడిపోవడానికి ఆస్కారం ఉండదు. కాని దాన్ని పెరుగు పెట్టిన కుండలో పెట్టినట్లయితే, సందేహమే. (అందరూ నవ్వారు)
“పేలాలు వేయించేటప్పుడు మూకుడు నుండి ఒకటి రెండు ఎగిరి నేలమీద పడతాయి. అవి ఏమాత్రం మరక లేకుండా మల్లెపువ్వుల్లా ఉంటాయి. మూకుడులోనే ఉన్న పేలాలుకూడా మంచివే. కాని అవి అలా మల్లెపువ్వుల్లాగా ఉండవు. వాటికి కొద్దిగా మరక అంటివుంటుంది. అదే విధంగా సన్న్యాసి జ్ఞానోపలబ్ధి పొందాక మల్లెపువ్వులా ఎలాంటి మరకలూ లేకుండా ఉంటాడు. అయితే జ్ఞానం పొందాక సంసారమనే మూకుడులో ఉండేవాడికి కొద్దిగా ఎర్ర మరక పడే అవకాశం ఉంది. (అందరూ నవ్వారు)
“ఒకసారి జనకమహారాజు సభలోకి ఒక భైరవి వచ్చింది. స్త్రీని చూడగానే జనకుడు, తలను క్రిందకు దించుకొని నేలచూపులు చూడసాగాడు. అది చూసి భైరవి ఇలా అంది. ‘ఓ జనకా, స్త్రీని చూసి నీ కింకా భయం వేస్తోందా?’ పూర్ణజ్ఞానం కలిగినప్పుడు ఐదు సంవత్సరాల బాలుడి స్వభావం ఏర్పడుతుంది. అప్పుడు స్త్రీ పురుషులనే భేదభావం ఉండదు.
“గృహస్థాశ్రమంలో ఉన్న జ్ఞానికి దేహం మీద కొన్ని మరకలు పడవచ్చు కాని వాటితో అతడికి కలిగే నష్టమేమీ లేదు. చంద్రునిలో మచ్చలు ఉన్నాయి కాని వాటివల్ల చంద్రుని ప్రకాశానికి లోటేమీ లేదు.
45.6.3 జ్ఞానం, కర్మ, లోకశిక్షణ
“జ్ఞాన సముపార్జనానంతరం కొందరు లోకశిక్షణార్థం కర్మలు చేస్తుంటారు. జనకుడు, నారదుడు మొదలైనవారు ఈ కోవకు చెందుతారు. కాని ఆ విధంగా లోకులకు ఉపదేశం చేయాలంటే ఎంతో శక్తి అవసరం. ఋషులు కేవలం తమ వరకే జ్ఞానం సంపాదించుకోవడంలోనే తలమునకలై ఉండేవారు. కాని నారదాది ఆచార్యులు లోకకళ్యాణం గురించి యోచించేవారు. వారు వీర పురుషులు.
“(తేలికైన) పనికిరాని కర్ర నీటిపై తేలుతూ పోతున్నప్పుడు దానిమీద ఒక పక్షి వ్రాలినా అది మునిగిపోతుంది. కాని భారీగా ఉన్న కొయ్యదుంగ నీటిపై తేలుతున్నప్పుడు ఆవు, మనిషి చివరకు ఒక ఏనుగునుకూడా అది మునిగిపోకుండా నిభాయించుకోగలదు. స్టీమర్ తనంతట తాను ఆవలి ఒడ్డుకు చేరడమే గాక ఎంతో మందిని చేరవేస్తుంది కూడా. నారదుడు మొదలైన ఆచార్యులు ఇలాంటి భారీగా ఉన్న కొయ్యదుంగలు, స్టీమర్లవంటి వారు.
“కొందరు ఏదైనా రుచిగల పదార్థాన్ని తిన్న తరువాత మరెవరికీ అది తెలియకుండా – తువ్వాలుతో మూతి తుడుచుకొని కూర్చుంటారు. (అందరూ నవ్వారు.) మరి కొందరు ఉంటారు – అలాంటి వ్యక్తికి మామిడిపండు లభించినప్పుడు దాన్ని కోసి అందరికీ పంచుతాడు, తానుకూడా తింటాడు. నారదాది ఆచార్యులు జనులందరి మేలుకోసం జ్ఞానోపలబ్ధి తరువాత కూడా భక్తిని ఆశ్రయించి ఉండేవారు.”
45.7 సప్తమ పరిచ్ఛేదం జ్ఞానం, భక్తి – యుగధర్మం
డాక్టరు: జ్ఞానంతో మనిషి అవాక్కయిపోతాడు. కళ్ళు మూసుకుంటాడు. కన్నీరు స్రవిస్తుంది. అప్పుడు భక్తి అవసరం ఏర్పడుతుంది.
శ్రీరామకృష్ణులు: భక్తి, స్త్రీలాంటిది. అందుకే అంతఃపురం వరకు వెళ్ళగలదు. జ్ఞానం బయట ఉన్న గదుల వరకు మాత్రమే పోగలదు. (అందరూ నవ్వారు.)
డాక్టర్: అయితే స్త్రీలందరికీ అంతఃపురంలో ప్రవేశించడానికి అనుమతి లభించదు కదా – ఉదాహరణకు వేశ్యలు. అందుకే జ్ఞానం యొక్క అవసరం!
45.7.1 భక్తి – దారి తప్పిన పూరీ భక్తుని దృష్టాంతం
శ్రీరామకృష్ణులు: ఒక వ్యక్తికి సరైన మార్గం తెలియకుండా ఉండవచ్చు; కాని ఆతడికి భగవంతుడి పట్ల భక్తి ఉన్నది, ఆయన్ను తెలుసుకోవాలనే ఆకాంక్ష ఉన్నది. అలాంటి వ్యక్తి కేవలం తన భక్తియొక్క బలిమి చేతనే భగవంతుణ్ణి పొందగలడు. ఒకసారి ఒక చిత్తశుద్ధి గల భక్తుడు పూరీ జగన్నాథస్వామిని దర్శించడానికి బయలుదేరాడు. పూరీకి వెళ్ళే మార్గం ఏదో అతడికి తెలియదు. దక్షిణదిశగా వెళ్ళడానికి బదులుగా అతడు పశ్చిమంగా వెళ్లసాగాడు. దారి అయితే తప్పాడుకాని అతడు ఎంతో ఆరాటంగా జనాన్ని సరైన దారి చూపమని అడుగుతున్నాడు. వారు అతడితో ‘ఇది కాదు సరైన దారి. ఆ దారిగుండా వెళ్ళు’ అన్నారు. ఆ భక్తుడు చివరకు పూరీ చేరుకొని జగన్నాథ స్వామిని దర్శించాడు. చూశావా, నీకు తెలియకపోయినప్పటికీ ఎవరో ఒకరు తెలియపరుస్తారు.
డాక్టర్: కాని ఆ భక్తుడు అజ్ఞానంచే దారి మరిచిపోవడమైతే జరిగింది కదా!
శ్రీరామకృష్ణులు: ఆ, అతడు మరిచిపోవడమైతే జరిగింది కాని చివరకు తన గమ్యాన్ని చేరుకున్నాడు.
45.7.2 భగవంతుడు సాకారుడూ, నిరాకారుడూనూ
ఒక భక్తుడు: భగవంతుడు సాకారుడా లేక నిరాకారుడా?
శ్రీరామకృష్ణులు: భగవంతుడు సాకారుడు, నిరాకారుడు కూడా. ఒక సన్న్యాసి జగన్నాథస్వామి దర్శింప వెళ్ళాడు. స్వామిని దర్శించుకున్న తరువాత అతడికి భగవంతుడు సాకారుడా లేక నిరాకారుడా అనే సందేహం కలిగింది. అతడి చేతిలో దండం ఉన్నది. జగన్నాథస్వామి దేహాన్ని స్పృశిస్తుందా లేదా అని అతడు ఆ దండంతో పరీక్షించసాగాడు. ఒకసారి అతడు దండాన్ని ఇటువైపునుండి అటువైపుకు తిప్పాడు. ఆ సమయంలో అది జగన్నాథుని దేహాన్ని స్పృశించడం లేదని అతడు గమనించాడు; తన ఎదుట భగవంతుని విగ్రహం లేదని భావించాడు. మళ్ళీ, దండాన్ని అటువైపు నుండి ఇటువైపుకు తిప్పేటప్పుడు అది భగవంతుడి విగ్రహాన్ని తాకింది. అప్పుడు ఆ సన్న్యాసి ‘భగవంతుడు నిరాకారుడు, సాకారుడూ కూడా’ అని అర్థం చేసుకున్నాడు.
“కాని ఈ విషయాన్ని అవగతం చేసుకోవడం చాలా కష్టం. నిరాకారుడైన భగవంతుడు మళ్ళీ సాకారుడెలా అవుతాడు? ఇంకా, ఆయన సాకారుడైన పక్షంలో ఆయనకు నానారూపాలు ఎందుకు ఉన్నాయి అన్న సందేహాలు మనస్సులో తలెత్తుతాయి.”
45.7.3 ‘అద్దకపు ద్రావణం రంగు’, ‘చెట్టు మీద ప్రాణి రంగు’ దృష్టాంతాలు
డాక్టరు: ఆయన ఈ ప్రపంచంలో నానా రూపాలను సృష్టించాడు. అందుకే ఆయన సాకారుడు. ఇంకా, ఆయన మనస్సును సృష్టించాడు. అందుకే ఆయన నిరాకారుడు. ఆయన సర్వమూ కాగలడు.
శ్రీరామకృష్ణులు: భగవంతుణ్ణి సాక్షాత్కరించుకోకుండానే ఈ విషయాలన్నిటినీ అర్థంచేసుకోలేము. సాధకుల కోసం ఆయన పలు విధాలుగా పలు రూపాలలో దర్శనమిస్తాడు. ఒక వ్యక్తి వద్ద ఒక తొట్టెలో అద్దకపు ద్రావణం ఉంది. అనేకులు తమ వస్త్రాలకు రంగు వేయించుకోవడానికి అతడి వద్దకు వచ్చేవారు. ఆ వ్యక్తి వారితో ‘మీ వస్త్రాన్ని ఏ రంగులో అద్దమంటారు’ అని అడుగుతాడు. వారిలో ఒకరు బహుశా ఎరువు రంగులో అద్దమని అడుగుతాడనుకుందాం. ఆ వ్యక్తి వెంటనే ఆ వస్త్రాన్ని తొట్టెలో ముంచి ‘ఇదిగో నీకు కావలసిన ఎరుపు రంగు వస్త్రం తీసుకో’ అంటాడు. వేరే ఎవరయినా ‘నా వస్త్రాన్ని పసుపురంగులో అద్దాలి’ అంటారనుకుందాం. ఈ వ్యక్తి వెంటనే ఆ వస్త్రాన్ని అదే తొట్టెలో ముంచి ‘ఇదుగో, నీకు కావలసిన పసుపురంగు వస్త్రం తీసుకో’ అంటాడు. నీలంరంగులో అద్దాలని అడిగితే మళ్ళీ అదే తొట్టెలోనే దాన్ని ముంచి మళ్ళీ అదే మాట – ‘ఇదుగో నీకు కావలసిన నీలం రంగు వస్త్రం తీసుకో’. ఈ విధంగా ఎవరికి ఏ రంగులో కావాలనుకుంటే, ఆ వ్యక్తి వారి వస్త్రాన్ని అదేరంగులో ఆ తొట్టెలోనే ముంచి అద్దకం చేసియిస్తాడు. మరో వ్యక్తి ఈ వ్యవహారాన్నంతా ఆశ్చర్యంతో చూస్తున్నాడు. అప్పుడు ఆ అద్దకం వేసే ఆ వ్యక్తి ఇతడితో ‘ఏమయ్యా నీ వస్త్రాన్ని ఏ రంగులో అద్దమంటావు?’ అని అడిగాడు. అప్పుడా రెండవ వ్యక్తి ఇలా అన్నాడు: ‘అయ్యా! నువ్వు ఏ రంగుతోనైతే ఈ వస్త్రాలన్నిటికీ అద్దకం వేస్తున్నావో, నా వస్త్రానికి కూడా అదే రంగులో అద్దకం వేసి ఇవ్వు.’
“ఒక వ్యక్తి బహిర్భూమికి పోయినప్పుడు చెట్టుమీద ఒక అందమైన ప్రాణిని చూశాడు. అతడు మరో వ్యక్తితో ‘సోదరా, ఫలానా చెట్టు మీద నేను ఎరుపు రంగులో ఉన్న ఒక ప్రాణిని చూశాను’ అన్నాడు. ఆ రెండవ వ్యక్తి ‘నేను కూడా ఆ ప్రాణిని చూశాను, కాని అది ఎరుపు రంగులో లేదు. అది ఆకుపచ్చ రంగులో ఉన్నది’ అన్నాడు. ఇంకో వ్యక్తి ‘లేదు, లేదు. ఆకుపచ్చ కాదు, అది పసుపుపచ్చ రంగులో ఉన్నది’ అన్నాడు. ఈ విధంగానే ఇతరులు కూడా ఆ ప్రాణిరంగు ఏమిటో చెప్పసాగారు – ఒకరు నీలం రంగు అంటారు, మరొకరు నలుపు రంగు అంటారు. – ఇలా కొనసాగుతూనే ఉంది. చివరకు వారు దెబ్బలాడుకోసాగారు. వారందరూ చెట్టువద్దకు వెళ్ళి ఒక వ్యక్తి అక్కడ కూర్చుని ఉండడం గమనించారు. వారి ప్రశ్నలకు సమాధానంగా ఆ వ్యక్తి ఇలా అన్నాడు: ‘నేను ఈ చెట్టు క్రిందనే వసిస్తుంటాను. నాకు ఆ ప్రాణి గురించి బాగా తెలుసు. మీరందరూ చెబుతున్నదంతా నిజమే. అది ఒక్కోసారి ఎరుపు రంగులోనూ, ఒక్కోసారి ఆకుపచ్చరంగులోనూ, ఒక్కోసారి పసుపురంగులోనూ, ఒక్కోసారి నీలం రంగులోనూ – ఇంకా ఎన్నెన్నో రంగుల్లో ఉంటుంది. పైగా ఒక్కోసారి అది వర్ణ రహితంగా ఉండటం కూడా చూస్తుంటాను.’
“సదా సర్వదా భగవచ్చింతన చేసేవ్యక్తి మాత్రమే భగవత్ స్వరూపం ఏమిటో అర్థం చేసుకోగలుగుతాడు. ఆ వ్యక్తే భగవంతుడు నానారూపాల్లో, నానాభావాల్లో దర్శనమిస్తాడని తెలుసుకుంటాడు. ఆయన సగుణుడు, మళ్ళీ నిర్గుణుడు కూడా. ఊసరవెల్లి పలు రంగుల్లో ఉంటుందనీ, మళ్ళీ కొన్ని సమయాల్లో ఏ రంగూ లేకుండా కూడా ఉంటుందనీ ఆ చెట్టు క్రింద వసించే వ్యక్తికి మాత్రమే తెలుసు. తక్కిన వారంతా కేవలం వాదోపవాదాలతో కలహించుకొంటారు.
“భగవంతుడు సాకారుడు, నిరాకారుడుకూడా. ఇది ఎలాంటిదో తెలుసా? సచ్చిదానందం తీరమంటూ లేని సాగరం వంటిది. భక్తి యొక్క శీతల ప్రభావంతో (ఆ సాగరంలోని) నీరు అక్కడక్కడా ఘనీభవిస్తుంది – నీరు మంచు గడ్డల ఆకారంలో ఘనీభవించినట్లుగా. అంటే ఆయన భక్తుడికి సాక్షాత్కరిస్తాడు. ఒక్కోసారి సాకార రూపంలో దర్శనమిస్తాడు. మళ్ళీ జ్ఞాన భాస్కరుడు ఉదయించినప్పుడు ఆ మంచు అంతా కరిగిపోతుంది.”
డాక్టరు: సూర్యుడు ఉదయించాక మంచు అంతా కరగిపోయి నీరైపోతుంది. మళ్ళీ సూర్యుడి వేడిమి కారణంగా ఆ నీరు నిరాకారమైన ఆవిరిగా మారుతుందన్న విషయం తెలుసునా?
శ్రీరామకృష్ణులు: అంటే బ్రహ్మసత్యం, జగన్మిథ్య. ఈ విచారణ తరువాత సమాధిస్థితి కలిగినప్పుడు రూపం గీపం అన్నీ ఎగిరిపోతాయి. అప్పుడు భగవంతుడు ఒక వ్యక్తి అన్న బోధ ఉండదు. అప్పుడు భగవంతుడు ఏమిటో మాటల్లో చెప్పలేము. ఆ స్థితిలో, చేప్పేవారెవరు? ఎవరు చెబుతారో అతడే లేడు. అతడి ‘నేను’ ను వెదకినా కూడా కానరాదు. అప్పుడు బ్రహ్మం నిర్గుణం. ఆ స్థితిలో బ్రహ్మం గురించిన బోధ కేవలం బోధరూపంలో ఉంటుంది. మనోబుద్ధులతో ఆయన్ను ఇముడ్చు కోలేము.(అంటే అర్థం చేసుకోలేము.)
“అందుకే జనం భక్తి చంద్రుడనీ, జ్ఞానం సూర్యుడనీ అంటారు. ఉత్తర, దక్షిణ దిశలుగా సుదూరంలో సముద్రం ఉంటుందని విన్నాను. అక్కడ వాతావరణం ఎంత చల్లగా ఉంటుందంటే, నీరు గడ్డకట్టి అక్కడక్కడా పెద్దపెద్ద బండలుగా మారుతుంది. అక్కడ ఓడలు పయనించజాలవు, అవి అక్కడకు వెళ్ళి ఆగిపోతాయి.”
డాక్టరు: అలాగయితే భక్తిమార్గంలో, మనిషి ఆగిపోతాడు.
శ్రీరామకృష్ణులు: ఆ, ఆగిపోతాడు. కాని దీనివల్ల వాటిల్లే హాని ఏమీ లేదు. ఆ సచ్చిదానంద సాగరపు నీరే గడ్డకట్టి మంచుగా తయారయింది. ఇంకా విచారణ కొనసాగించాలంటే, ఉదాహరణకు ‘బ్రహ్మ సత్యం జగన్మిథ్య’ అంటూ విచారణ చేస్తూ ఉన్నప్పటికీ హానీ ఏమీ ఉండదు. ఈ విచారణ నీలో జ్ఞానాన్ని జాగృతం చేస్తుంది; ఆ జ్ఞానం సూర్యునిలా దైవీస్వరూపాలనే మంచును కరిగించి మళ్లీ సచ్చిదానందసాగరాన్ని రూపొందజేస్తుంది.
45.7.4 భక్తుని ‘నేను’ – బాలుడి ‘నేను’
“జ్ఞాన విచారణ అంతంలో సమాధిస్థితి ఏర్పడినప్పుడు ‘నేను’ లాంటిది ఏదీ ఉండదు. కాని ఈ సమాధిస్థితిని పొందడం బహుకష్టం. ‘నేను’ అనేది ఏ విధంగానూ వెళ్ళాలనుకోదు. అది వెళ్ళాలనుకోదు కాబట్టే మనిషి తిరిగి తిరిగి మళ్ళీ ఈ సంసారంలోకి రావలసి వస్తుంది.
“ఎద్దు ‘హంబా, హంబా (నేను, నేను)’ అని అరుస్తుంది. అందుకనే దానికి అంతటి దురవస్థ! రోజంతా అది నాగటితో దున్నవలసి ఉంటుంది – ఎండయినా, వానయినా సరే. దానికి తోడు, దాన్ని కసాయివాడు నరుకుతాడు. అయినప్పటికీ దానికి ముక్తి లేదు. చర్మకారులు దాని చర్మాన్ని ఒలిచి జోళ్ళు తయారుచేస్తారు. చిట్టచివరగా దాని ప్రేగులతో తంత్రిని తయారుచేస్తారు. అప్పుడు దూది ఏకేవాడి చేతిలో పడి అది ‘తుహు, తుహు (నువ్వు, నువ్వు)’ అన్నప్పుడే దానికి ముక్తి.
“జీవుడు ‘నాఽహం, నాఽహం, నాఽహం (నేను కాదు) ఓ భగవంతుడా, నేను ఏమీ కాదు. నేను దాసుడను, నువ్వు ప్రభువ్వి’ అన్నప్పుడే విమోచన, అప్పుడే ముక్తి.”
డాక్టరు: కాని దూది ఏకేవాడి చేతిలో పడాలి కదా! (అందరూ నవ్వారు)
శ్రీరామకృష్ణులు: ‘నేను’ అనేది వెళ్ళకపోతే, ఆ వెధవను ‘భగవంతుడి దాసుడి’ గా పడి ఉండనివ్వు. (అందరూ నవ్వారు.)
“సమాధిస్థితి పిదప కూడా కొందరికి ‘నేను’ అనేది ఉంటుంది – ‘దాసుడి నేను’ ‘భక్తుడి నేను’ అనే రూపంలో. శంకరాచార్యులు లోకశిక్షణార్థం ‘విద్యా నేను’ ను నిలుపుకున్నారు. ‘దాసుడి నేను’, ‘విద్యా నేను’, ‘భక్తుడి నేను’ – దీనినే ‘పరిపక్వమైన నేను’ అంటారు. ‘అపరిపక్వమైన నేను’ అంటే ఏమిటో తెలుసా? నేను కర్తను, నేను ఫలానా గొప్పవ్యక్తి కుమారుణ్ణి, నేను విద్వాంసుణ్ణి, నేను ధనవంతుణ్ణి, నాతో అలాంటి మాటలు మాట్లాడుతావా – మనిషిని ఇలా తలచేలా చేసేదే ‘అపరిపక్వమైన నేను.’ అలాంటి వ్యక్తి ఇంట్లో ఎవరైనా దొంగతనం చేసి పట్టుబడ్డాడనుకోండి. అప్పుడా వ్యక్తి ముందుగా ఆ దొంగనుండి వస్తువులన్నిటినీ లాక్కొంటాడు. తరువాత అతడికి బాగా దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించి, ఇలా అంటాడు: ‘ఏమిటీ! ఎవరి ఇంట్లో దొంగతనం చేశాడో వాడికి తెలియదు!’
“భగవల్లబ్ధి పొందాక ఐదు సంవత్సరాల బాలుడి స్వభావం ఏర్పడుతుంది. అటువంటి వ్యక్తి ‘నేను’ ను ‘బాలుడి నేను’, ‘పరిపక్వమైన నేను’ అంటారు. బాలుడు ఏ గుణం వశంలోనూ ఉండడు – త్రిగుణాతీతుడు. సత్త్వరజస్తమో గుణాలలో ఏ గుణానికీ వశవర్తి కాడు. మీరే చూడండి, పిల్లలు తమోగుణం వశంలో ఉండరు. పిల్లవాడు ఈ క్షణంలో తమ నేస్తంతో తగవులాడతాడు, పోట్లాడతాడు. మరుక్షణమే అతణ్ణి ఆలింగనం చేసుకొని అతడిపట్ల ఎంతటి ప్రేమ చూపిస్తాడు! అతడితో ఎన్ని ఆటలు ఆడతాడు! పిల్లవాడు రజోగుణం వశంలో కూడా ఉండడు. ఈ నిమిషంలో అతడు ఎంతో కష్టపడి బొమ్మరిల్లు కడతాడు. కాసేపట్లోనే అన్నిటినీ వదిలిపెట్టి అమ్మ వద్దకు పరుగెడతాడు. ఇంకా, అతడు బహుశా ఒక ఖరీదైన వస్త్రం ధరించి తిరుగుతూ ఉంటాడు. కాసేపటి తరువాత చూస్తే, అది ఎక్కడో జారిపోయివుంటుంది. అతడు దాని గురించి బహుశా మరిచిపోయి ఉంటాడు. లేకుంటే దాన్ని చంకలో పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు. (నవ్వులు) ఆ పిల్లవాడితో ‘ఈ వస్త్రం ఎంచక్కా ఉంది, ఎవరిది?’ అని అడిగితే అతడు ‘ఈ వస్త్రం నాది. మా నాన్నగారు ఇచ్చారు’ అంటాడు. ‘నాయనా, నువ్వు నా బుజ్జివి కదా, ఈ వస్త్రాన్ని నా కివ్వమా?’ అని అడిగితే అతడు ‘ఊహూ, ఇది నా వస్త్రం. మా నాన్నగారు ఇచ్చింది, నేను ఇవ్వను’ అంటాడు. కాసేపటి తరువాత ఏదైనా బొమ్మనో, పిల్లనగ్రోవినో అతడి చేతిలో పెట్టి మురిపింపచేస్తే, అతడు ఐదు రూపాయాల విలువ చేసే ఆ వస్త్రాన్ని నీకు ఇచ్చి వెళ్ళిపోతాడు. అంతే కాదు, ఐదు సంవత్సరాల బాలుడికి సత్త్వగుణం పట్ల కూడా ఆసక్తి ఉండదు. ఇవాళ అతడు తన ఇరుగు పొరుగు నేస్తాలతో ఎంతో చెలిమి నెరపుతాడు, వారిని చూడకుండా ఒక్క క్షణమైనా ఉండలేడు. కాని, తల్లిదండ్రులతో పాటు వేరే ప్రాంతానికి వెళ్ళిపోయినప్పుడు అతడికి అక్కడ కొత్త స్నేహితులు ఏర్పడతారు. అప్పుడు అతడు తన ప్రేమనంతా ఆ కొత్త స్నేహితుల మీదనే కురిపిస్తాడు. పాత స్నేహితులను పూర్తిగా మరిచిపోతాడు. పైగా అతడికి జాత్యహంకారం అంటూ ఏదీ ఉండదు. ‘ఫలానావాడు నీ అన్న’ అని తల్లి చెప్పిందనుకోండి. అంతే, అతడు తన అన్నే అని ఆ బాలుడు నూటికి నూరుపాళ్ళు నమ్ముతాడు. వారిద్దరిలో ఒకడు బ్రాహ్మణుడు, మరొకడు కమ్మరి వాడయినప్పటికీ, ఇద్దరు కలిసి ఒకే కంచంలో అన్నం తింటారు. ఇంకా, బాలుడికి శుచి, అశుచి అంటూ భేదం ఉండదు. బయలుకు వెళ్ళి వచ్చాక అలాగే వచ్చి భోజనానికి కూర్చుంటాడు. లజ్జకూడా ఉండదు. బయలుకు పోయాక ‘చూడు, నేను బాగా పోయానా?’ అంటాడు.
“ ‘ముసలివాడి నేను’ అనికూడా ఒకటి ఉంది. (డాక్టరు నవ్వాడు). ముసలి వాడికి అనేక పాశాలు ఉంటాయి – కులం, అహంకారం, సిగ్గు, ద్వేషం, భయం, విషయాసక్తి, లెక్కలు కట్టే బుద్ధి, కాపట్యం. అతడికి ఎవరి మీదైనా కోపం వస్తే అది అంత సులువుగా పోదు. బహుశా అది జీవితాంతం వరకూ అట్లే ఉండిపోతుంది. ఇంకా ‘పండితుడిననే అహంకారం’, ‘ధనికుడిననే అహంకారం’ ఉన్నవి. ‘ముసలివాడి నేను’ అపరిపక్వమైన ‘నేను’.
45.7.5 జ్ఞానానికి అవరోధాలైన ‘అహంకారాలు’
(డాక్టరుతో) “నాలుగైదు రకాలైన మనుష్యులు ఉంటారు. వారికి జ్ఞానం కలుగదు. పాండిత్యం ఉందన్న అహంకారం, విద్యలు అభ్యసించానన్న అహంకారం, డబ్బుందన్న అహంకారం ఉన్నవారికి జ్ఞానం లభించదు. వీరిని ‘ఫలానా చోట ఒక మంచి సాధువు ఉన్నాడట. రా, వెళ్ళి చూద్దాం’ అని పిలిస్తే వీరు వెంటనే ఎన్నో కుంటిసాకులు చెబుతారు. సాధువును చూడడానికి రారు. పైగా మనస్సులో ఇలా తలపోస్తారు: ‘నేను ఇంత గొప్ప వ్యక్తిని! నేను వెళ్ళడమా! హు!’
45.7.6 మూడు గుణాలు – కామాది శత్రువుల దిశ మార్చే విధానం – ఇంద్రియ సంయమనం
“అహంకారం తమోగుణ స్వభావం. అహంకారం అజ్ఞానం వల్ల కలుగుతుంది, తమోగుణం వల్ల కలుగుతుంది.
“రావణుడికి రజోగుణం, కుంభకర్ణుడికి తమోగుణం, విభీషణుడికి సత్త్వగుణం ఉండేవని పురాణాల్లో చెప్పబడింది. అందుకే విభీషణుడు శ్రీరామచంద్రుణ్ణి పొందగలిగాడు. తమోగుణానికి మరో లక్షణం ఉంది – అది క్రోధం. క్రోధంలో ఏది మంచి, ఏది చెడు అన్న జ్ఞానం ఉండదు. హనుమంతుడు లంకకు నిప్పంటించాడు. అయితే ఆ నిప్పు సీతాదేవి ఉన్న కుటీరానికి కూడా హాని చేస్తుందన్న జ్ఞానం అతడికి లేకపోయింది.
“తమోగుణానికి ఉన్న మరో లక్షణం – కామం. పాథురియాఘాటాకు చెందిన గిరీంద్ర ఘోష్ ఒకసారి ఇలా అన్నాడు: ‘కామక్రోధాది శత్రువులు వదిలిపోవు కాబట్టి వాటి దిశను మార్చివేయండి, ప్రాపంచిక సుఖాలను కోరుకునే బదులు భగవంతుణ్ణి కోరుకో. సచ్చిదానందుడితో రమించు. క్రోధం వదలకపోతే, తామసిక భావంతో కూడిన భక్తిని ఆరోపించుకొని ఇలా పలుకు: ‘ఏమిటీ, నేను దుర్గానామాన్ని ఉచ్చరించాను. మరి నాకు ముక్తి కలుగదా ఏమిటి? ఇక నాకు పాపమేమిటి, బంధనమేమిటి?’ అటు పైన భగవల్లబ్ధిని పొందాలన్న లోభం కలిగి ఉండు. భగవంతుడి రూపాన్ని మోహించు. అహంకారం నిలుపుకోవాలంటే ‘నేను భగవంతుడి దాసుడను’, ‘నేను భగవంతుడి బిడ్డను’ అనే అహంకారం నిలుపుకో. ఈ విధంగా ఆర్గురు శత్రువుల దిశను భగవంతుడి వైపుకు మరల్చాలి.”
డాక్టరు: ఇంద్రియాలను సంయమం చేయడమనేది ఎంతో కష్టమైన వ్యవహారం. గుర్రం కళ్ళకు రెండువైపులా గంతలు కట్టాలి. కొన్ని గుర్రాలకు, కళ్ళను పూర్తిగా మూసివేయవలసి వస్తుంది కూడా.
శ్రీరామకృష్ణులు: భగవంతుడి కటాక్ష వీక్షణం ఒక్కసారి ప్రసరించినట్లయితే, భగవంతుడి దర్శనం కనుక ఒక్కసారి లభించినట్లయితే, ఒక్కసారి ఆత్మ సాక్షాత్కారం కలిగినట్లయితే ఇక ఏ భయమూ ఉండదు. అప్పుడు ఆర్గురు శత్రువులూ ఏమీ చేయజాలరు. నారదుడు, ప్రహ్లాదుడులాంటి నిత్యసిద్ధ మహాపురుషులకు కళ్ళకు గంతలు కట్టుకోవాల్సిన అవసరం ఏర్పడలేదు. తండ్రి చేయిని తానే స్వయంగా పట్టుకొని పొలం గట్టుమీద నడిచే పిల్లవాడు కాస్త ఏమరుపాటుతో ఉంటే, అతడు తండ్రి చేయిని వదలిపెట్టి గోతిలో పడిపోయే ప్రమాదం ఉంది. కాని తండ్రి పిల్లవాడి చేతిని పట్టుకొన్నప్పుడు ఆ పిల్లవాడు ఎన్నటికీ గోతిలో పడడు.
డాక్టరు: కాని తండ్రి, పిల్లవాడి చేయిని పట్టుకోవడం మంచిది కాదు.
శ్రీరామకృష్ణులు: అలాగని కాదు. మహాపురుషులు బాలక స్వభావం కలిగి ఉంటారు.భగవంతుడి వద్ద వారు సర్వదా బాలకులే. వారికి అహంకారం ఉండదు. వారికి ఉన్న శక్తి అంతా భగవంతుడి శక్తే, తండ్రిగారి శక్తే, తనదంటూ ఏమీ ఉండదు. ఆ విషయమై వారికి దృఢవిశ్వాసం ఉంటుంది.
45.7.7 జ్ఞాన, భక్తి యోగాలు – జ్ఞాన యోగం కఠినమైనది
డాక్టరు: గుర్రం కళ్ళకు గంతలు కట్టకుండా దాన్ని ముందుకు ఎలా నడిపించగలం? ఆర్గురు శత్రువులు వశంలోకి రాకుండానే భగవంతుణ్ణి సాక్షాత్క రించుకోగలమా?
శ్రీరామకృష్ణులు: నువ్వు చెబుతున్నదాన్ని ‘విచారణ మార్గం’ అంటారు. దాన్ని జ్ఞానయోగం అనే పేరుతో పిలుస్తారు. ఆ మార్గం గుండా కూడా భగవంతుణ్ణి ప్రాప్తించుకోవచ్చు. జ్ఞానులు ‘మొట్టమొదట చిత్తశుద్ధి కలగడం అవసరం’ అని చెబుతారు. ముందుగా సాధనలు చేయాలి, అటు పిదప జ్ఞానోదయం అవుతుంది.
“భక్తిమార్గంగుండా కూడా భగవంతుణ్ణి ప్రాప్తించుకోవచ్చు. భగవంతుడి పాదపద్మాలపై ఒకసారి భక్తి కనుక కలిగినట్లయితే, ఆయన నామగుణ కీర్తనలు చేయడం రుచించినట్లయితే, అప్పుడు ఇంద్రియసంయమం కోసం ప్రత్యేకంగా ప్రయత్నించ వలసిన పనిలేదు. శత్రువులు తమంతట తామే వశంలోకి వస్తారు.
“ఎవరైనా వ్యక్తి కుమారుడు మరణించిన దుఃఖంలో ఉన్నాడనుకుందాం. అదే రోజున అతడు మరో వ్యక్తితో పోట్లాటకు దిగుతాడా? లేకుంటే స్నేహితుడి ఇంటికి విందు భోజనానికి వెళతాడా? జనం ముందు దర్పం ప్రదర్శిస్తూ తిరుగుతాడా? సుఖాలు, సంభోగాలు అనుభవిస్తాడా?
“దీపపు పురుగు ఒకసారి ప్రకాశాన్ని కనుక చూసినట్లయితే అటుపైన అది అంధకారంలో ఉండగలదా?”
డాక్టరు (నవ్వుతూ): కాలిపోయినా సరే, అది వెలుగును మాత్రం వదలదు.
శ్రీరామకృష్ణులు: ఆ, అది కాదు. అయితే భక్తుడు దీపపు పురుగులాగా కాలి చనిపోడు. భక్తుడు ఏ ప్రకాశం వెంటయితే పడతాడో, అది వజ్ర ప్రకాశం. వజ్రప్రకాశం ఉజ్వలంగా ఉంటుంది కాని అది సమశీతలంగా, ఉపశమనంగా ఉంటుంది. ఆ ప్రకాశంతో దేహం దగ్ధం కాదు. దానితో శాంతి లభిస్తుంది, ఆనందం కలుగుతుంది.
“విచారణ మార్గంలో, జ్ఞానయోగ మార్గంలో భగవంతుణ్ణి ప్రాప్తించుకోవచ్చు. కాని ఈ మార్గం కష్టతరమైనది. నేను దేహం కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు; నేను రోగం కాదు, శోకం కాదు, అశాంతి కాదు; నేను సచ్చిదానంద స్వరూపుణ్ణి, నేను సుఖదుఃఖాలకు అతీతుడను, నేను ఇంద్రియాల వశంలో లేను. ఈ మాటలన్నీ నోటితో చెప్పడం చాలా సులభం. కాని వీటిని కార్యరూపంలోకి తీసుకురావడం, అవగతం చేసుకోవడం చాలా కష్టం. చేతికి ముల్లు గుచ్చుకుని రక్తం ఎగజిమ్ము తోందనుకోండి. అయినప్పటికీ ఎక్కడిది, చేతికి ముల్లు గుచ్చుకోలేదే! నేను బాగానే ఉన్నాను, అంటూనే ఉంటా డా వ్యక్తి. అలా మాట్లాడ గలగాలంటే మొదట నేను ఆ ముల్లునే జ్ఞానాగ్నిలో దగ్ధం చేయాలి.
45.7.8 పుస్తక జ్ఞానం – చదరంగం ఆట ఆడుతున్న, చూస్తున్న వ్యక్తులు
“పుస్తకాలు చదవకుండానే భగవంతుణ్ణి గురించిన జ్ఞానం లభించదనీ, ఆయన్ను అర్థం చేసుకోలేమనీ చాలామంది భావిస్తారు. కాని చదవడం కంటే వినడం మంచిది. వినడంకంటే చూడడం మంచిది. కాశీ గురించి వినడానికి కాశీని చూడడానికి ఎంతో తేడా ఉంది.
“స్వయంగా చదరంగం ఆడుతున్న వ్యక్తి, ఎత్తులను అంత బాగా వేయలేడు. కాని, ఆడకుండా ప్రక్కనుండి ఆటను చూస్తూన్న వ్యక్తి ఎత్తులను బాగా నిర్ధారణ చేయగలడు. మేం చాలా బుద్ధిమంతులమని తలపోస్తూ ఉంటారు సంసారులు. కాని వారు విషయాసక్తులు. వారు స్వయంగా ఆట ఆడుతున్నారు, తమ ఎత్తులను సరిగా అవగాహన చేసుకోలేరు. కాని సంసారాన్ని పరిత్యజించిన సాధువులు విషయ సుఖాలపట్ల ఆసక్తి శూన్యులు. వారు గృహస్థులకంటే వివేకవంతులు. వారు స్వయంగా ఆటలో పాల్గోరు కాబట్టే వారు ప్రక్కనుండి సరిగ్గా ఎత్తులు చెప్పగలరు.”
డాక్టరు (భక్తులతో): పుస్తకాలు చదివివుంటే ఈయన (శ్రీరామకృష్ణులు) ఇంత జ్ఞానం సంపాదించి ఉండేవారు కాదు. Faraday communed with Nature ఫారడే స్వయంగా ప్రకృతిని దర్శించేవాడు. అందుకే అతడు అన్ని Scientific truths discover చెయ్యగలిగాడు (వైజ్ఞానిక సత్యాలను కనుగొన గలిగాడు.) కేవలం పుస్తక పఠనం ద్వారా జ్ఞానం లభించి ఉంటే ఇంతటి జ్ఞానం సంపాదించడం సాధ్యమయ్యేది కాదు. Mathematical formulae only throw the brain into confusion. (గణితసిద్ధాంతాలు మస్తిష్కాన్ని అయోమయంలో పడవేస్తాయి) – అవి Original inquiry (మౌలిక ఆవిష్కరణ) మార్గంలో అవరోధాలు కల్పిస్తాయి.
45.7.9 శ్రీరామకృష్ణులు – భగవత్ప్రసాదిత జ్ఞానం
శ్రీరామకృష్ణులు (డాక్టరుతో): ఒకప్పుడు పంచవటిలో నేలమీద పడిపోయి నేను అమ్మను ఇలా ప్రార్థించాను: ‘అమ్మా కర్మకాండ ఆచరించే వాళ్లు ఆ కర్మలు అనుష్ఠించడం ద్వారా ఏం పొందారో, యోగులు యోగం అభ్యసించడం ద్వారా ఏం దర్శించారో, జ్ఞానులు జ్ఞాన విచారణ ద్వారా ఏం తెలుసుకున్నారో, వాటిని నాకు వెల్లడిచెయ్యి’. ఇంకా ఏమేమి మాట్లాడేవాడినో, ఎలా వివరించగలను?
“ఆహా! ఎలాంటి స్థితులను అనుభవించానని! నిద్ర నన్ను పూర్తిగా వదలి పెట్టేసింది.” ఇలా అంటూ శ్రీరామకృష్ణులు పాడసాగారు:
నిద్ర నాకు భగ్నమయ్యె నిద్ర నెట్లు పోగలను?
నిద్రలేని యోగమందు మేలుకొంటి తెలివితోడ
యోగనిద్రలోన తల్లి ఐక్యమైతి మిరువురము
నిద్రపుచ్చినాడ నాదు నిద్ర కింక శాశ్వతముగ
రాత్రిలేని ఊరినుండి వచ్చి కలసె నొక్క మనిషి
విధినిషేధములను భక్తి పూజపునస్కారములును
నిరుపయోగమనెడు భావమిపుడు నాకు ప్రబలమయ్యె.
మళ్ళీ సంభాషణ కొనసాగించారు: “నేను పుస్తకాలు గిస్తకాలు అంటూ ఏమీ చదవలేదు. కాని చూడండి, నేను అమ్మ నామాన్ని ఉచ్చరిస్తాను. అందుకే అందరూ నన్ను గౌరవిస్తారు. శంభు మల్లిక్ నా గురించి ఒకసారి ఇలా అన్నాడు: ‘డాలు లేదు, కత్తిలేదు; అయినప్పటికీ శాంతి రామసింహుడు!’” (అందరూ నవ్వారు.)
గిరీశ్ రచించిన బుద్ధ చరిత్ర అనే నాటకం గురించిన ప్రస్తావన వచ్చింది. గిరీశ్ ఆహ్వానం మేరకు డాక్టరు వెళ్ళి ఆ నాటకం చూడడం జరిగింది. అది చూసి డాక్టరు ఎంతో ఆనందించాడు.
డాక్టరు (గిరీశ్‌తో): ఏమయ్యా, భలేవాడివేనే నువ్వు! నేనిక రోజూ థియేటరుకు వెళ్ళాలా ఏమిటి?
శ్రీరామకృష్ణులు (‘మ’ తో): అతడేమంటున్నాడు? నాకు అర్థం కావడం లేదు.
‘మ’ : ఈయనకు నాటకం చాలా బాగా నచ్చిందట.
45.8 అష్టమ పరిచ్ఛేదం అవతారం – జీవుడు
శ్రీరామకృష్ణులు (ఈశాన్తో): నువ్వు ఏమీ మాట్లాడడం లేదేమిటి? ఇతడు (డాక్టరు) అవతార వాదాన్ని అంగీకరించడు.
ఈశాన్: అయ్యా, నన్నేం చెప్పమంటారు? వాదించడం నాకు ఇష్టం లేదు.
శ్రీరామకృష్ణులు (విసుగ్గా): అదేమిటి, మంచి విషయం కూడా చెప్పవా?
ఈశాన్ (డాక్టరుతో): అహంకారం కారణంగానే మనకు విశ్వాసం తక్కువగా ఉంటుంది. భూశుండి అనే కాకి మొదట్లో శ్రీరాముణ్ణి అవతార పురుషుడిగా అంగీకరించేది కాదని రామాయణంలో చెప్పబడింది. ఒకసారి అది రాముడి ఆగ్రహానికి గురయింది. ఆ ఆగ్రహంనుండి తప్పించుకోవడానికి ఇది చంద్రలోకం, దేవలోకం, కైలాసం మొదలైన లోకాలన్నీ పరిభ్రమించింది. కాని అది రాముడి చేతినుండి తప్పించుకోజాలనని గ్రహించింది. అప్పుడు వచ్చి రాముడి పాదాల వద్ద శరణు వేడింది. రాముడు దాన్ని చేతిలోకి తీసుకొని మ్రింగివేశాడు. తరువాత చూసేసరికి భూశుండి చెట్టుమీద తన గూటిలోనే కూర్చుని ఉంది. ఆ విధంగా దాని అహంకారం అణగిపోయాకనే, అది ‘రాముడు చూడడానికి సామాన్య వ్యక్తిలాగానే కనిపిస్తాడు కాని అతడి ఉదరంలోనే ఆకాశం, చంద్రుడు, నక్షత్రాలు, సూర్యుడు. సముద్రాలు, పర్వతాలు, జీవ జంతువులు, చెట్లు – సమస్త బ్రహ్మాండమూ ఉన్నట్లు’ గ్రహించింది.
45.8.1 జీవునిది అల్ప బుద్ధి
శ్రీరామకృష్ణులు (డాక్టరుతో): భగవంతుడు స్వరాట్, మళ్ళీ ఆయనే విరాట్ అని అర్థం చేసుకోవడం కూడా కష్టమే. నిత్యం, లీలలు రెండూ ఆయనకు చెందినవే. భగవంతుడు మానవరూపం ధరించలేదని మన అల్పబుద్ధితో ఎలా నొక్కి చెప్పగలం? మన అల్పబుద్ధితో ఈ విషయాలనన్నిటినీ అవగతం చేసుకోగలమా ఏమిటి? ఒక సేరు పాత్రలో నాలుగు సేర్లు పాలు పడతాయా ఏమిటి?
“అందుకే భగవత్సాక్షాత్కారం పొందిన సాధువుల, మహాత్ముల పలుకులలో విశ్వాసం ఉంచాలి. వకీలు వ్యాజ్యాలలో నిమగ్నమై ఉన్నట్లు సాధువు భగవచ్చింతనలోనే నిమగ్నమై ఉంటాడు. భూశుండి కాకి కథ మీద నీకు విశ్వాసం కలుగుతోందా?
డాక్టరు: నాకు ఎంతవరకు మంచిదని తోస్తుందో అంతవరకు మాత్రమే విశ్వసిస్తాను. భగవంతుడు తన స్వరూపాన్ని తెలియపరచినప్పుడే కష్టాలన్నీ తీరిపోతాయి. ఇక గందరగోళం అంటూ ఏదీ ఉండదు. అయితే రాముణ్ణి అవతార పురుషుడిగా ఎలా అంగీకరించగలను? ఉదాహరణకు, వాలి వధనే తీసుకోండి. రాముడు దొంగలా చెట్టుమాటున నక్కి వాలిపై బాణం ప్రయోగించి వధించాడు. ఇలాంటి పనులు మనుషులు చేస్తారు కాని భగవంతుడు కాదు.
గిరీశ్ ఘోష్: మహాశయా, అలాంటి పనులు భగవంతుని కొక్కడికే సాధ్యం.
డాక్టరు: తరువాత చూడండి, అతడు సీతాదేవిని అడవులకు పంపివేశాడు.
గిరీశ్: అది కూడా భగవంతునికే సాధ్యం.
45.8.2 ‘సైన్సు’ – ‘వార్తా పత్రికలో లేదే!’ కథ
ఈశాన్ (డాక్టర్‌తో): మీరు అవతార పురుషులను ఎందుకు విశ్వసించరు? ఈ సమస్త రూపాలనూ సృష్టించాడు కాబట్టి భగవంతుడు సాకారుడనీ, మనస్సును సృష్టించాడు కాబట్టి నిరాకారుడనీ ఇందాక మీరే కదా చెప్పారు! భగవంతుడికి సమస్త కార్యాలూ సుసాధ్యమేనని ఇందాక మీరు చెప్పారు!
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): భగవంతుడు మానవ రూపం ధరించగలడన్న విషయం అతడి ‘సైన్స్’ లో లేదు. మరి అలాంటప్పుడు అతడు ఆ విషయాన్ని ఎలా విశ్వసిస్తాడు? (అందరూ నవ్వారు)
“ఒక కథ చెప్తాను వినండి: ఒకడు తన స్నేహితుడి వద్దకు వచ్చి ‘ఆ పేటలో ఫలానా ఇల్లు దభీమని కూలి పడిపోవడం ఇప్పుడే చూసి వస్తున్నాను’ అన్నాడు. అయితే ఆ స్నేహితుడు ఆంగ్ల విద్యలు అభ్యసించిన వ్యక్తి. అతడు ‘కాస్త ఆగవోయి. నేను ఇప్పుడే వెళ్ళి వార్తాపత్రిక చూసివస్తాను’ అన్నాడు. కాని వార్తా పత్రికలో ఆ ఇల్లు పడిపోయిందన్న సమాచారం కనబడలేదు. అప్పుడు ఆ స్నేహితుడు మొదటి వ్యక్తితో ఇలా అన్నాడు: ‘ఎక్కడిది, ఇల్లు కూలిపోయిందన్న వార్త, పత్రికలో లేదే? ఆ వార్తను నేను నమ్మను, అదంతా అబద్ధం’ (అందరూ నవ్వారు.)
గిరీశ్(డాక్టరుతో) : మీరు శ్రీకృష్ణుణ్ణి భగవంతునిగా అంగీకరించవలసిందే. ఆయన్ను మనిషంటే మాత్రం నేను ఒప్పుకోను. ఆయన Demon or God (రాక్షసుడో లేక భగవంతుడో అని) ఏదో ఒకటి అంగీకరించవలసిందే.
45.8.3 భగవంతునిపై విశ్వాసం – సరళ స్వభావం
శ్రీరామకృష్ణులు: మనిషి సరళ స్వభావి కానిదే భగవంతుని మీద వెంటనే విశ్వాసం కుదరదు. భగవంతుడు విషయబుద్ధికి బహూదూరం. విషయబుద్ధి ఉండడంవల్ల నానా సంశయాలు తలెత్తుతాయి, నానావిధాలైన అహంకారాలు వచ్చి చేరుతాయి – అంటే పండితుడిననే అహంకారం, ధనవంతుడిననే అహంకారం ఇత్యాది. ఇతడు (డాక్టరు) సరళ స్వభావి.
గిరీశ్ (డాక్టరుతో): మహాశయా, ఏమంటారు? కుటిలబుద్ధులకు జ్ఞానం కలుగుతుందంటారా?
డాక్టరు: రామ! రామ! అది ఎన్నటికయినా సాధ్యమయ్యే పనేనా?
శ్రీరామకృష్ణులు: కేశవ్ సేన్ ఎంతటి సరళ హృదయుడిగా ఉండేవాడు. ఒక రోజు అక్కడకు (దక్షిణేశ్వర కాళీ ఆలయం) వచ్చాడు. సాయంకాలం నాలుగు గంటలకు అతిథిశాలకు వెళ్ళి ‘ఏమయ్యా, అతిథులకు, భిక్షగాళ్ళకు భోజనం ఎప్పుడు పెడతారు?’ అని అడుగుతున్నాడు. (భోజనం పెట్టడానికి అప్పటికే సమయం మించి పోయిందని అతడు ఎరుగడు) విశ్వాసం ఎంతగా పెరుగుతుందో జ్ఞానం కూడా అదేలా పెరుగుతుంది. చాలా పట్టింపులతో ఇది తినాలి, ఇది తినకూడదు అని బాగా పరిశీలించి మరీ గడ్డి మేసే ఆవు ఉందనుకోండి. అది ఇచ్చే పాలు కూడా అంతంతమాత్రమే. ఆకులు, తవుడు, గడ్డి మొదలైనవన్నీ ఆవురావురుమంటూ మేసే ఆవు కడవల కొద్దీ పాలు ఇస్తుంది. (అందరూ నవ్వారు)
“పసిపిల్లవాడిలా విశ్వాసం కలుగనిదే భగవంతుణ్ణి పొందజాలం. అలాంటి పిల్లవాడితో ‘ఫలానా వాడు నీ అన్న’ అని తల్లి చెప్పిందనుకోండి. అతడు తనకు నిజంగానే అన్నే అని ఆ పిల్లవాడు నూటికి నూరుపాళ్ళు విశ్వసిస్తాడు. గదిలో బూచి ఉందని తల్లి చెప్పిందనుకోండి. ఆ పిల్లవాడు యదార్థంగానే గదిలో బూచి ఉందని పూర్తిగా విశ్వసిస్తాడు. పసిపిల్లవాడికున్న ఇలాంటి విశ్వాసం చూడగానే భగవంతుడికి ఆ వ్యక్తిపైన దయ కలుగుతుంది. సాంసారిక బుద్ధితో భగవంతుణ్ణిపొందలేం.”
డాక్టరు (భక్తులతో): అయితే ఆవుకు ఏది పడితే అది తినిపించి కడవల కొద్దీ పాలు పిండడం కూడా మంచిది కాదు. మేము కూడా ఇలాగే ఒక ఆవుకు ఏది పడితే అది పెట్టేవాళ్ళం. తర్వాత నేను జబ్బునపడ్డాను. ఆ జబ్బుకు కారణం ఏమిటో మొదట్లో అర్థం చేసుకోలేకపోయాను. ఎంతగానో విచారించిన పిదప తెలిసింది, మా ఆవుకు ఏదిపడితే అది తినిపించారని. అప్పుడు నేను పెద్ద ఇబ్బందిలో పడ్డాననుకోండి. వాతావరణం మార్పు కోసం లక్నో వెళ్లవలసి వచ్చింది. చివరకు పన్నెండు వేల రూపాయలు ఖర్చయ్యాయి. (అందరూ నవ్వారు.)
“దేని వల్ల ఏం జరుగుతుందో ఎప్పటికీ చెప్పలేం. ఒక సంపన్నుల కుటుంబానికి చెందిన ఏడు నెలల అబ్బాయికి ఒకసారి జబ్బు చేసింది. ఎడతెరిపి లేకుండా దగ్గుతున్నాడు. నేను చూడడానికి వెళ్ళాను. ఎంత పరీక్షించినా జబ్బుకు కారణం ఏమిటో బోధపడలేదు. తీరా చూస్తే, ఆ అబ్బాయికి గాడిదపాలు పట్టేవారట. అది వానలో తడిసింది.” (అందరూ నవ్వారు)
శ్రీరామకృష్ణులు: ఏమంటున్నావ్? చింతచెట్టు క్రింద నుండి నేను కూర్చున్న బండి పోవడంతో నాకు ఆమ్లశూల ఏర్పడింది అన్నట్టుంది వ్యవహారం. (అందరూ నవ్వారు)
డాక్టరు (నవ్వుతూ): ఒకసారి ఒక ఓడ కెప్టనుకు బాగా తలనొప్పి పుట్టింది. డాక్టర్లు బాగా యోచించిన పిదప అతడి తలనొప్పి ఉపశమించడానికై ఓడకు ఔషధం పూశారు. (అందరూ నవ్వారు)
45.8.4 సాధుసాంగత్యం – విషయభోగ త్యాగం
శ్రీరామకృష్ణులు (డాక్టరుతో): సాధుసాంగత్యం సర్వదా ఆవశ్యకం. రోగం దీర్ఘకాలికమైనది కదా! సాధువులు ఎలా చెబితే అలా నడుచుకోవాలి. ఊరకే విన్నంత మాత్రాన ఏమిటి ప్రయోజనం? ఔషధం సేవించాలి. పైగా తినే ఆహారంలో కూడా నియమం పాటించాలి. పథ్యం చేయాలి.
డాక్టరు: పథ్యంలోనే సారం ఉంది.
శ్రీరామకృష్ణులు: వైద్యులు మూడు రకాలుగా ఉంటారు: ఉత్తమ వైద్యుడు, మధ్యమ వైద్యుడు, అధమ వైద్యుడు. నాడిని పరీక్షించి ‘ఔషధం పుచ్చుకో’ అని చెప్పి వెళ్ళిపోయే వైద్యుడు అధమ వైద్యుడు. రోగి ఔషధం పుచ్చుకున్నాడా లేదా అన్న సంగతి అతడు పట్టించుకోడు.మధ్యమ వైద్యుడు రోగిని ఔషధం సేవించమని ఎన్నో విధాలుగా నచ్చచెబుతాడు. మధురమైన మాటలతో ‘నాయనా, ఔషధం తీసుకోకుండా రోగం ఎలా నయం కాగలదు? నాయనా, నా బుజ్జివి కదూ! లే, ఔషధం పుచ్చుకో. నేనే స్వయంగా ఔషధం నూరాను’ అంటాడు. మరో రకం వైద్యుడు కూడా ఉన్నాడు. ఎంత చెప్పినా రోగి ఔషధం పుచ్చుకోకపోవడం చూసి ఆ వైద్యుడు రోగి ఛాతీమీద మోకాలునుంచి అతడితో బలవంతంగా ఔషధం సేవించేలా చేస్తాడు. అతడే ఉత్తమ వైద్యుడు.
డాక్టరు: కొన్ని రకాల ఔషధాలు ఉన్నాయి. రోగి చేత వాటిని సేవింప చేయడానికి ఛాతీమీద మోకాలు పెట్టే అవసరం ఉండదు. ఉదాహరణకు, హోమియోపతి ఔషధాలు.
శ్రీరామకృష్ణులు: ఉత్తమ వైద్యుడు ఛాతీపైన మోకాలు పెడితే ఏ భయం ఉండదు.
“వైద్యులలాగే ఆచార్యులలోకూడా మూడు రకాల వారు ఉంటారు. శిష్యులకు ధర్మాన్ని ఉపదేశించి, అటు తరువాత వారి గురించి పట్టించుకోని వాడు అధమ రకానికి చెందిన ఆచార్యుడు. శిష్యుల మేలుకోరి వారు విషయాన్ని జీర్ణించుకునేలా మాటామాటికీ వివరిస్తూ, పలురకాల అనునయ వాక్యాలతో ప్రేమ చూపించేవాడు మధ్యమ రకానికి చెందిన ఆచార్యుడు. కాని శిష్యుడు ఎన్ని విధాలుగా నచ్చచెప్పినా వినకపోవడం చూసి, అవసరమయితే బలప్రయోగం కూడా చేసేవాడు ఉత్తమ ఆచార్యుడు.
45.8.5 సన్న్యాసులకు కఠిన నియమాలు
(డాక్టరుతో) “సన్న్యాసులకు కామినీ కాంచనాల త్యాగం కేటాయించబడినది. సన్న్యాసి, స్త్రీల చిత్రపటం వైపుకూడా చూడరాదు. (పురుషులకు) స్త్రీలు ఎలాంటి వారో తెలుసా? వారు ఊరగాయ, చింతపండులాంటి వారు. వాటి గురించిన ఆలోచన మనస్సులో మెదలగానే నోరూరుతుంది. వాటిని దగ్గరగా తీసుకురావలసిన అవసరం కూడా ఉండదు.
“కాని ఈ సంగతి (కామినీ కాంచన త్యాగం) మీకు (గృహస్థులకు) వర్తించదు. ఇది సన్న్యాసులకు మాత్రమే వర్తిస్తుంది. మీరు వీలున్నంతవరకు స్త్రీలతో పాటు అనాసక్తులై జీవించాలి. మధ్యమధ్యలో ఏకాంత ప్రదేశాలకు వెళ్ళి భగవచ్చింతన ఒనరించండి. అక్కడ స్త్రీలు ఎవరూ ఉండరాదు. భగవంతుడి పట్ల భక్తి విశ్వాసాలు కలిగినట్లయితే చాలా వరకు అనాసక్తులై జీవించవచ్చు. ఒకరిద్దరు సంతానం కలిగిన తర్వాత భార్యాభర్తలు ఇరువురూ అన్నాచెల్లెళ్ళ వలె జీవించాలి.ఇంద్రియ సుఖాల వెంట మనస్సు పోకుండేలా, అటు పిల్లలు కలుగకుండేలా వారు భగవంతుణ్ణి ప్రార్థించాలి.
45.8.6 ‘కర్మనాశిని’ – అహేతుక భక్తి
గిరీశ్ (నవ్వుతూ, డాక్టరుతో): మీరు మూడు నాలుగు గంటలు నుండి ఇక్కడే ఉన్నారు. మరి మీ రోగుల సంగతి ఏమయ్యేట్లు?
డాక్టరు: ఇంకా నా వైద్యం, రోగులు ఎక్కడ ఉన్నారు? ఈ పరమహంసగారు ఒకరు దొరికారు కదా, ఈయన కారణంగా నా సర్వస్వం స్వాహా అయిపో యింది. (అందరూ నవ్వారు)
శ్రీరామకృష్ణులు: ‘కర్మనాశిని’ అనే నది ఒకటి ఉంది. ఆ నదిలోకి దూకటం మహా ప్రమాదమే సుమా! అందులోకి దూకితే కర్మనాశనమైపోతుంది. ఆ వ్యక్తికి మరే కర్మలు మిగలవు. (డాక్టరుతో పాటు అందరూ నవ్వారు.)
డాక్టరు (మ, గిరీశ్ తదితరులతో): మిత్రులారా, నన్ను మీలో ఒకణ్ణిగా భావించండి. నేను ఈ మాటలను వైద్యుడిననే ఉద్దేశంతో అనటం లేదు. కాని మీరు నన్ను మీ వాడిగా భావించినట్లయితే నేను మీ వాడినే.
శ్రీరామకృష్ణులు (డాక్టరుతో): అహేతుక భక్తి అని ఒకటి ఉంది. ఈ భక్తి కనుక జనిస్తే చాలా మంచిది. ప్రహ్లాదుడు ఈ భక్తిని కలిగి ఉండేవాడు. అలాంటి భక్తుడు భగవంతుడితో ఇలా అంటాడు: ‘హే భగవాన్! నేను ధనం, కీర్తి ప్రతిష్ఠలు, దేహసుఖాలు మొదలైనవేవీ కోరుకోను. నాకు నీ పాదపద్మాలపట్ల శుద్ధభక్తి కలిగేలా మాత్రం చెయ్యి.’
డాక్టరు: ఆ, కాళీ మాత ఎదుట జనం ప్రణామం చేస్తుండగా చూశాను. వారి మనస్సు కేవలం ‘అది కావాలి, ఇది కావాలి’ అనే కోరికలతోనే నిండి ఉంటుంది– నాకు ఉద్యోగం దొరికేలా చెయ్యి, నా రోగం నయమయ్యేలా చెయ్యి – అన్నీ ఇలాంటి ప్రార్థనలే.
(శ్రీరామకృష్ణులతో) “మీకు కలిగిన రోగం కారణంగా మీరు ఎవరితోనూ మాట్లాడరాదు. కాని నేను వచ్చినప్పుడు మాత్రం నాతో మాట్లాడుతూ ఉండండి. (అందరూ నవ్వారు)
శ్రీరామకృష్ణులు : రోగాన్ని నయం చెయ్యి. దీని కారణంగా భగవంతుడి నామగుణకీర్తనలు చేయలేకపోతున్నాను.
డాక్టరు: ధ్యానం చేస్తే చాలుకదా!
శ్రీరామకృష్ణులు: అదేం మాట? మొహం మొత్తిపోయేలా ఒకేదాన్ని ఆశ్రయించుకొని నేను ఎలా ఉండగలను? నేను చేపను పలు రకాలుగా వండి తింటాను. పులుసు, వేపుడు, ఊరగాయ ఇలా అన్ని రకాలుగా తింటాను. నేను ఒక్కోసారి పూజ, ఒక్కోసారి జపం, ఒక్కోసారి ధ్యానం, లేకుంటే ఆయన నామ గుణ కీర్తనలు చేస్తుంటాను. ఒక్కోసారి ఆయన నామం ఉచ్చరిస్తూ నాట్యం చేస్తాను.
డాక్టరు: నా స్వభావం కూడా అలాంటిదే.
45.8.7 అవతారాన్ని విశ్వసించకపోతే దోషమా?
శ్రీరామకృష్ణులు: నీ కుమారుడు అమృత్ భగవదవతారాన్ని విశ్వసించడు. అయితే అందులో తప్పేం ఉందిలే? భగవంతుణ్ణి నిరాకారుడిగా విశ్వసించినా కూడా ఆయన్ను ప్రాప్తించుకోవచ్చు. సాకారుడిగా విశ్వసించినా కూడా ఆయనను ప్రాప్తించుకోవచ్చు. ఆయన పట్ల విశ్వాసం కలిగి ఉండడం, ఆయనకు శరణాగతి గావడం – ఇవి రెండే కావలసినవి. మనిషి అజ్ఞాని; అతడి ద్వారా తప్పులు జరిగే అవకాశం ఉంది. ఒక సేరు పాత్రలో నాలుగు సేర్ల పాలు పెట్టగలమా? అందుకే నువ్వు ఏ మార్గం అనుసరించినా సరే, వ్యాకుల మనస్కుడవై భగవంతుణ్ణి ప్రార్థించాలి. ఆయన అంతర్యామి. ఆయన నీ హృదయపూర్వక ప్రార్థనలను తప్పక వింటాడు. నువ్వు సాకారవాదుల మార్గాన్ని అనుసరించు. లేకుంటే నిరాకారవాదుల మార్గాన్నయినా అనుసరించు. వ్యాకులత పొందినట్లయితే భగవంతుణ్ణి పొందగలవు. కలకండ ముక్కను నువ్వు నిలువుగా తిన్నా సరే, అడ్డంగా తిన్నా సరే, అది తియ్యగానే ఉంటుంది.
“నీ కుమారుడు అమృత్ చాలా మంచివాడు.
డాక్టరు: అతడు మీ శిష్యుడేనండోయ్.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ, డాక్టరుతో) : నాకు శిష్యుడంటూ ఎవరూ లేరు. నేను అందరికీ శిష్యుణ్ణి. అందరూ భగవంతుని బిడ్డలే, అందరూ భగవంతుని దాసులే. నేను కూడా భగవంతుని బిడ్డనే, భగవంతుని దాసుడనే. ‘చందమామ అందరికీ మామే కదా!’
ఆ మాటలు విని భక్తులందరూ హాయిగా నవ్వుకున్నారు.