29.1 ప్రథమ పరిచ్ఛేదం సాధారణ బ్రహ్మసమాజ మందిరంలో శ్రీరామకృష్ణులు
శుక్రవారం, సెప్టెంబర్ 26, 1884
శ్రీరామకృష్ణులు కలకత్తాకు వచ్చి ఉన్నారు. నవరాత్రులలో మహాసప్తమి రోజు. సామాన్యంగా కలకత్తాలోని ప్రతి హైందవ కుటుంబంలోను మహాసప్తమి పూజ జరుగుతుంది. శ్రీరామకృష్ణులు అధర్సేన్ ఇంట్లోని దుర్గాదేవి ప్రతిమను అర్చించటానికి, ఆ వేడుకలలో పాల్గొనటానికి వచ్చారు. దానికి తోడు బ్రహ్మ సమాజ భక్తుడైన శివనాథ్‌ను కలుసుకోగోరారు.
అది మిట్ట మధ్యాహ్న సమయం. రెండు గంటలుగా ‘మ’ చేత ఒక గొడుగు పుచ్చుకుని బ్రహ్మసమాజం ఎదుటనున్న కాలిబాటలో అటూ ఇటూ పచార్లు చేస్తున్నాడు. ఒంటి గంట అయింది, రెండు గంటలూ గడచిపోయాయి. శ్రీరామకృష్ణులు ఇంకా రాలేదు. మధ్యమధ్యలో డా ॥ మహలానవీశ్ వైద్యశాల మెట్ల మీద కూర్చుంటున్నాడు ‘మ’. అక్కడ కూర్చునే బ్రహ్మసమాజ మందిరంలో దుర్గాపూజ వేడుకల ఆనందంలో మునిగిపోయిన ఆబాలగోపాలన్నంతా చూస్తూ ఉన్నాడు.
సమయం మూడు గంటలయింది. కాసేపటికి శ్రీరామకృష్ణుల బండి వచ్చి చేరుకుంది. ఆయన బండిలో నుంచి దిగారు. బ్రహ్మసమాజ మందిరాన్ని చూడగానే చేతులు జోడించి నమస్కరించారు. హాజ్రా, మరికొందరు భక్తులు ఆయనతో వచ్చి ఉన్నారు. ‘మ’ శ్రీరామకృష్ణులకు సాష్టాంగ ప్రణామం చేశాడు. “నేను శివనాథ్ ఇంటికి వెళతాను” అన్నారు శ్రీరామకృష్ణులు ‘మ’ తో. శ్రీరామకృష్ణుల రాక తెలిసి కాసేపట్లో బ్రహ్మసమాజ సభ్యులు కొందరు వచ్చారు. వాళ్ళు ఆయన్ను బ్రహ్మపారాలోని శివనాథ్ ఇంటికి తోడ్కొని వెళ్ళారు. శివనాథ్ అప్పుడు ఇంట్లో లేడు. ఏం చెయ్యటం? కాసేపయ్యాక విజయ్ గోస్వామి, మహలానవీశ్ మొదలైన బ్రహ్మసమాజ ప్రముఖులు వచ్చారు. వాళ్ళు ఆయన్ను ఆహ్వానించి బ్రహ్మసమాజ మందిరంలోకి తీసుకువెళ్ళారు. “స్వామీ, ఒకింతసేపు కూర్చోండి. శివనాథ్ కాసేపట్లో వస్తాడు” అని, ఆయన్ను ఆసీనులను చేశారు.
శ్రీరామకృష్ణులు ఆనందంగా ఉన్నారు; ఆయన వదనంలో చిరునవ్వు తొణికిసలాడుతోంది. పీఠానికి కాస్త క్రింద సంకీర్తన జరిగే చోట ఆయన కూర్చుని ఉన్నారు. విజయ్, బ్రహ్మసమాజ ఇతర భక్తులు ఆయనకు ఎదురుగా కూర్చున్నారు.
29.1.1 బ్రహ్మసమాజంలో ‘సైన్బోర్డ్’ – శ్రీరామకృష్ణుల సర్వధర్మ సమన్వయం
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ విజయ్‌తో): లోనికి రావటానికి పరాయి మతస్థులకు అనుమతి లేదని ఇక్కడ సైన్ బోర్డ్ పెట్టారని విన్నాను. నరేంద్రుడు నాతో, ‘బ్రహ్మసమాజానికి పోకండి. శివనాథ్ ఇంటికి వెళ్ళండి’ అన్నాడు.
“కానీ అందరూ భగవంతుణ్ణే ఆరాధిస్తున్నారని నే నంటాను. ద్వేషం, విరోధం ఉండకూడదు. కొందరు సాకారం అంటున్నారు, కొందరు నిరాకారం అంటున్నారు. సాకారంలో విశ్వాసం ఉన్నవారు సాకారాన్నే ధ్యానించనీ, నిరాకారంలో విశ్వాసం ఉన్నవారు నిరాకారాన్నే ధ్యానించనీ అంటాను నేను.
“నేను చెప్పేదేమంటే మత మౌఢ్యం మంచిది కాదు; అంటే నా మతమే సరైనది, పరాయి మతాలు సరైనవి కావు అనే అభిప్రాయం తప్పు. నా మతం సరైనది; పరాయి మతాలు తప్పో ఒప్పో, సత్యమో అసత్యమో నాకు తెలియదు – ఇది మంచి వైఖరి. ఎందుకంటే భగవంతుని అనుభూతం చేసుకోకుండా ఆయన యథార్థ స్వభావం తెలుసుకోవటం సాధ్యం కాదు. ‘సాకారం నా తల్లి, నిరాకారం నా తండ్రి. నేను దేన్ని గర్హించను, దేన్ని ప్రశంసించను? త్రాసులోని సిబ్బులు రెండూ సమానమే’ అంటాడు కబీరుదాసు.
“హిందువులు, మహమ్మదీయులు, క్రైస్తవులు, శాక్తేయులు, శైవులు, వైష్ణవులు, ఋషుల కాలంనాటి బ్రహ్మజ్ఞానులు, ఆధునిక బ్రహ్మసమాజస్థులు అందరూ ఆకాంక్షిస్తూ ఉన్నది ఒకే వస్తువునే. కాని పిల్లల జీర్ణశక్తికి తగినట్లు తల్లి వంట చేస్తుంది. ఇంట్లో ఐదుగురు పిల్లలు ఉన్నారనుకోండి. తల్లి, చేపను కొన్నది. అందరికీ పలావో, మసాలా కూరో చేసిపెట్టదు. అందరి జీర్ణశక్తీ ఒకేలా ఉండదు. కనుకే కొంతమంది కోసం పులుసు వండుతుంది. అయినప్పటికీ ఆమె తన పిల్లలందరినీ సమానంగానే ప్రేమిస్తుంది కదా!
“నా వైఖరి ఏమిటో తెలుసా? చేపతో చేసిన రకరకాల వంటకాలను నేను తినటానికి ఇష్టపడతాను. నాది స్త్రీ స్వభావం. (అందరూ నవ్వారు) చేపల వేపుడు, పసుపు రాచి వండిన చేప, చేప ఊరగాయ, చేప పులుసు అన్నిటిని నేను ఇష్టపడతాను. అది మాత్రమే కాదు; చేప పచ్చడి, పలావు అన్నీ తింటాను.* (అందరూ నవ్వారు)
“విషయం ఏమిటో తెలుసా? దేశ కాలపాత్రల భేదాల ననుసరించే భగవంతుడు విభిన్న మతాలను రూపొందించాడు. అన్ని మతాలూ మార్గాలే, కాని మతమే భగవంతుడు కాజాలదు. హృదయపూర్వకమైన భక్తితో ఏదో ఒక మార్గాన్ని అనుసరిస్తే ఆయన్ను పొందవచ్చు. ఒకడు ఎంచుకున్న మార్గంలో తప్పులు ఉన్నప్పటికీ, ఆతడు భగవంతుడి కోసం నిజంగానే పరితపిస్తే, ఆయనే తప్పులు సరిదిద్ది అనుగ్రహిస్తాడు.
“పూరీ జగన్నాథుని దర్శనానికై ఒకడు చిత్తశుద్ధితో కలకత్తా నుండి బయలుదేరాడనుకోండి. కాని దక్షిణం వైపు వెళ్లటానికి మారుగా ఉత్తరం వైపు వెళతాడు. దారిలో అతణ్ణి కలుసుకున్న వారిలో ఎవరో ఒకరు అతడితో, ‘మిత్రమా, అటువైపు పోవద్దు. దక్షిణం వైపుగా వెళ్ళు’ అని కచ్చితంగా చెబుతారు. అతడూ త్వరలోనో, కాస్త ఆలస్యంగానో జగన్నాథుని దర్శనం చేసుకుంటాడు.
“పరాయి మతాలలో దోషాలు ఉన్నప్పటికీ వాటిని మనం పట్టించుకో నవసరం లేదు. జగత్తును సృష్టించిన వ్యక్తే ఆ విషయం చూసుకుంటాడు. ఎలాగైనాసరే జగన్నాథుని దర్శించుకోవటమే మన కర్తవ్యం. (బ్రహ్మసమాజస్థులతో) మీ మతం మంచిదే. మీరు భగవంతుడు నిరాకారుడు అంటున్నారు, మంచిదే. మిఠాయిని నిలువుగా తిన్నా సరే అడ్డంగా తిన్నా సరే, తియ్యగానే ఉంటుంది.
“కాని మతదురభిమానం మంచిది కాదు. ఊసరవెల్లి కథ వినలేదా? ఒకడు బహిర్భూమికి వెళ్ళినప్పుడు ఒక చెట్టు మీద ఊసరవెల్లి నొకదాన్ని చూశాడు. అతడు తన మిత్రులతో, ‘నే నొక ఎరుపురంగు తొండను చూశాను’ అన్నాడు. ఆ తొండ రంగు ఎరుపే అని అతడి నమ్మకం. అదే చెట్టు క్రింద నుంచి వచ్చిన మరొక వ్యక్తి, ‘నేను ఆకుపచ్చ రంగు తొండను చూశాను’ అన్నాడు. ఆ తొండ రంగు ఆకుపచ్చే అని అతడి దృఢవిశ్వాసం. కాని ఆ చెట్టు క్రిందే వసిస్తూ ఉన్న ఒక వ్యక్తి, ‘మీరు చెబుతున్నదంతా నిజమే. ఆ ప్రాణి ఒక సమయంలో ఎరుపు రంగులోను, మరో సమయంలో ఆకుపచ్చ రంగులోను, మరికొన్ని వేళల్లో ఎటువంటి రంగూ లేకుండా కూడా ఉంటుంది’ అని వివరించాడు.
“వేదాలు భగవంతుని సగుణుడని, నిర్గుణుడని వర్ణించి ఉన్నాయి. మీరు భగవంతుడు నిరాకారు డంటున్నారు; అది ఏకపక్ష పోకడ. ఫరవాలేదు, ఒకదాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే తక్కిన వాటిని కూడా తెలుసుకోవచ్చు. భగవంతుడే తెలియజేస్తాడు. (ఇద్దరు ముగ్గురు బ్రహ్మసమాజస్థులను చూపుతూ) మీ సమాజానికి వచ్చేవారు ఈ పెద్ద మనిషి గురించీ తెలుసుకుంటారు. ఆ పెద్ద మనిషి గురించి కూడా తెలుసుకుంటారు.”
సాధారణ బ్రహ్మసమాజం
29.2 ద్వితీయ పరిచ్ఛేదం విజయ్‌కృష్ణ గోస్వామికి ఉపదేశం
విజయ్ ఇంకా సాధారణ బ్రహ్మసమాజ సభ్యుడే. సమాజంలో వేతనం పుచ్చుకునే ఒక ప్రబోధకుడుగా ఉన్నా డతడు. ఇప్పుడల్లా సమాజ నియమ నిబంధనలన్నిటినీ అతడు పాటించలేక పోతున్నాడు. సాకారవాదులతో కలసిమెలసి ఉండటం కారణంగా అతడికీ, సమాజ నాయకులకూ మధ్య అభిప్రాయభేదాలు తలెత్తాయి. పలువురు బ్రహ్మసమాజస్థులు విజయ్ పట్ల అసంతృప్తితో ఉన్నారు. శ్రీరామకృష్ణులు హఠాత్తుగా విజయ్ను చూసి మాట్లాడసాగారు.
శ్రీరామకృష్ణులు (చిరునవ్వుతో): నువ్వు సాకారవాదులతో మెలగుతున్నందున నిన్ను నిందిస్తున్నారా? భగవంతుడి భక్తుడైన వాడికి కమ్మరి దాగలిలా స్థిరబుద్ధి ఉండాలి. అది అవిరామంగా సమ్మెటపోట్లు తింటూనే ఉంటుంది, అయినప్పటికీ దాన్లో ఏ మార్పూ ఉండదు. దుష్టులు నిన్ను ఎంతో నిందిస్తారు, నిన్ను దుర్భాషలాడతారు! నువ్వు హృదయపూర్వకంగా భగవంతుని ఆకాంక్షిస్తే అన్నిటినీ సహించుకునే ఉండాలి. దుష్టుల నడుమ జీవిస్తే భగవచ్చింతన సాధ్యం కాదా ఏమిటి? చూడు, అరణ్యాలలో నలువంకలా పులులు, ఎలుగుబంట్లు మొదలైన భయంకర మృగాలు నిండి ఉన్నప్పటికీ ఋషులు భగవంతుని ధ్యానించేవారు. దుష్టులలో పులి, ఎలుగుబంట్ల స్వభావమే ఉంది. అటువంటి వాళ్ళు వెనుక నుండి వచ్చి అపకారం తలపెడతారు.
“వీళ్ల గురించి అప్రమత్తంగా ఉండాలి: మొదట, అంగబలం, అర్ధబలం ఉన్న వాడు. అటువంటవ్యక్తి తలచుకుంటే నీకు హాని కలిగించగలడు; అతడితో జాగ్రత్తగా మాట్లాడాలి, బహుశా అతడు చెప్పేదానికి నువ్వు తల ఊపవలసి ఉంటుంది. రెండవది, కుక్క. కుక్క నీ వెంటబడి తరిమినప్పుడో, నిన్ను చూసి మొరిగినప్పుడో, నువ్వు ఆగి మృదువుగా మాట్లాడి దాన్ని శాంతింప చేయాలి. మూడవది, ఆబోతు. అది కుమ్మటానికి వస్తూ ఉన్నప్పుడు, నెమ్మదిగా పలుకరించి దాన్ని సమాధాన పరచాలి. నాలుగవది, త్రాగుబోతు. నువ్వు అతడి కోపాన్ని రెచ్చగొడితే అతడు నీ పద్నాలుగు తరాలవారిని తిట్టటం ప్రారంభిస్తాడు, నిన్ను చడామడా తిడతాడు. నువ్వు అతడితో, ‘ఏం మామా! క్షేమంగా ఉన్నావా?’ అంటూ కుశలప్రశ్నలు వేయాలి. అలా చేస్తే, అతడు ఎంతో సంతోషించి నీ ప్రక్కన కూర్చుని స్నేహపూర్వకంగా పొగ త్రాగుతాడు కూడా.
“దుష్టులను చూస్తే నేను ఎంతో జాగ్రత్తగా ఉంటాను. అటువంటి వ్యక్తి నా వద్దకు వచ్చి, ‘ఏమిటి, హుక్కా ఉందా?’ అని అడిగితే, వెంటనే, ‘ఆ, ఉంది’ అంటాను. కొందరిది పాము వంటి స్వభావం. ఎటువంటి సూచనా లేకుండా హఠాత్తుగా వచ్చి కాటువేస్తారు. కాటును తప్పించుకోవాలంటే ఎంతో అప్రమత్తత అవసరం. లేకుంటే, నీకే పట్టరానంత కోపం వచ్చి, మారుగా అతడికే హాని చేయాలన్న సంకల్పం కలుగుతుంది. కనుక అప్పుడప్పుడు సాధుసాంగత్యం ఉండాలి. సత్సాంగత్యం ఫలితంగా సత్యం, అసత్యం గురించిన వివేచన కలుగుతుంది.”
విజయ్: నాకు బొత్తిగా తీరిక లేదు. ఇక్కడి పనులలో చిక్కుకుని ఉన్నాను.
శ్రీరామకృష్ణులు: నువ్వొక ఆచార్యుడివి. ఇతరులకు సెలవులు లభిస్తాయి, కాని ఆచార్యులకు లభించవు. జమీలో ఒక ప్రాంతాన చెలరేగిన అలజడిని జమీ కార్యనిర్వాహకుడు కట్టుదిట్టపరిచాక వెంటనే జమీందారు అతణ్ణి మరొక ప్రాంతానికి పంపుతాడు. ఆ విధంగా నీకూ తీరిక ఉండదు. (అందరూ నవ్వారు)
విజయ్ (చేతులు జోడించుకుని): దయచేసి నన్ను ఆశీర్వదించండి.
శ్రీరామకృష్ణులు: నువ్విప్పుడు అజ్ఞానిలా మాట్లాడుతున్నావు. ఆశీర్వదించేది భగవంతుడు ఒక్కడే.
29.2.1 గృహస్థాశ్రమం – సన్న్యాసం
విజయ్: స్వామీ! మాకు ఏదైనా ఒకింత ఉపదేశం చేయండి.
శ్రీరామకృష్ణులు (బ్రహ్మసమాజ మందిరం అన్నివైపులా తమ దృష్టిని సారిస్తూ, చిరునవ్వుతో): ఇదీ ఒక రకంగా మంచిదే – బెల్లం, పాకమూ; బెల్లమూ ఉంది, పాకమూ ఉంది.* (అందరూ నవ్వారు)
“నేను అధిక సంఖ్యలో పాయింట్లు గడించి బయటకు వచ్చేశాను. ‘నక్స్’ ఆట తెలుసును కదా? అది ఒక రకమైన పేక ముక్కల ఆట. పదిహేడు కంటే ఎక్కువ పాయింట్లు గడించిన వ్యక్తి వైదొలగాలి. పదిహేడు కంటే తక్కువ అంటే ఐదు లేక ఏడు లేక పది పాయింట్లు గడించినవారు తెలివైనవారు. నేను అధికంగా గడించినందున ఆటలో నుండి వైదొలగాను. (అందరూ నవ్వారు)
“ఒకసారి కేశవ్ తన ఇంట్లో ఒక లెక్చర్ ఇచ్చాడు. నేనూ విన్నాను, పలువురు అక్కడ ఉన్నారు. తెర మరుగున స్త్రీలూ కూర్చుని ఉన్నారు. కేశవ్ ఇలా పలికాడు: ‘ఓ భగవంతుడా! మేం భక్తి వాహినిలో ఏకంగా మునిగిపోవ అనుగ్రహించు!’ వెంటనే నేను నవ్వుతూ కేశవ్‌తో, ‘భక్తి వాహినిలో మీ రందరూ ఏకంగా మునిగిపోతే తెర వెనుక ఉన్నవారి గతి ఏమవుతుంది? కనుక ఒక పని చేయండి – మునుక వేయండి, అప్పుడప్పుడు తీరానికీ రండి. ఏకంగా మునిగిపోకండి!’ అని చెప్పాను. ఇది విని కేశవ్, తక్కిన వారు గొల్లున నవ్వారు.
ఫరవాలేదు, నిజమైన తపన ఉంటే సంసారంలో కూడా భగవంతుణ్ణి పొందవచ్చు. ‘నేను’, ‘నాది’ అనుకోవటమే అజ్ఞానం. ‘ఓ భగవంతుడా! సకలం నువ్వే! సమస్తమూ నీదే!’ – ఇది జ్ఞానం. సంసారంలో ఉండండి, కాని ధనవంతుని ఇంటి పనిమనిషిలా వర్తించండి. ఆమె అన్ని పనులూ చేస్తుంది; యజమాని బిడ్డను పెంచుతుంది, ఆ బిడ్డను, ‘నా హరి’ అంటుంది. కాని అంతరాంతరాళాల్లో, ‘ఈ ఇల్లు నా సొంతం కాదు, ఈ బిడ్డా నా బిడ్డ కాదు’ అన్న సంగతి ఆమెకు బాగా తెలుసు. ఆమె పనులన్నీ నిర్వర్తిస్తుంది, కానీ ఆమె మనస్సు సొంత ఊరి మీదనే ఉంటుంది. అదే విధంగా సంసారంలోని కర్తవ్యాలన్నిటినీ నిర్వర్తించండి, కాని మనస్సును మాత్రం భగవంతునిపైనే నిలపండి. ‘ఇల్లు – వాకిలి, కుటుంబం, పిల్లలు – ఏవీ నావి కావు, అన్నీ భగవంతునివే. నేను కేవలం ఆయన దాసుణ్ణి మాత్రమే’ అని తెలుసుకోండి.
“మానసికంగా త్యజించి జీవించండనే నేను చెబుతుంటాను, సంసారాన్ని వదిలివేయమని చెప్పటం లేదు. సంసారంలో అనాసక్తుడవై ఉండి, హృదయ పూర్వకంగా భగవంతుని కోరుకుంటే ఆయన్ను పొందవచ్చు.
29.2.2 ధ్యానయోగం – భగవంతుని శక్తి
(విజయ్‌తో) “నేనూ కళ్ళు మూసుకుని ధ్యానం చేసినవాణ్ణే* . పిదప నాలో నేను, ‘కళ్ళు మూసుకొంటేనే భగవంతుడున్నాడా? కళ్ళు తెరచుకుంటే ఆయన లేడా?’ అనుకునే వాడను. కళ్ళు తెరచి చూశాను – సకల ప్రాణికోటిలోనూ భగవంతుడే ఉన్నాడు. మనిషి, జీవరాశులు, చెట్టు చేమలు, సూర్యుడు, చంద్రుడు, భూమి, నీరు అన్నిటిలోనూ ఆయనే ఉన్నాడు.
“నేను శివనాథ్‌ను ఎందుకు అభిమానిస్తున్నాను? అతడు చాలా రోజులుగా భగవచ్చింతన చేస్తూ ఉన్నాడు. అతడిలో సారం ఉంది, అతడిలో భగవత్ శక్తి ఉంది. ఎవడు బాగా పాడతాడో, వాయిద్యం వాయిస్తాడో, ఏదైనా ఒక దాన్లో నిష్ణాతుడై ఉంటాడో అతడిలో సారం ఉంటుంది, దైవశక్తి ఉంటుంది. అలాగని గీతలో చెప్పబడి ఉంది. (గీత. 10.41)
“దేవీమాహాత్మ్యంలోను, ‘చక్కని అందం గలవారిలో కూడా సారం, భగవంతుడి శక్తి ఉంది’ అని పేర్కోబడి ఉంది. (విజయ్‌తో) ఆహా! కేదార్ స్వభావం ఎంతగా మారిపోయింది! ఇక్కడకు రాగానే అతడి కళ్ళు అశ్రుపూరితాలవుతున్నాయి. రెండు కళ్ళు సర్వదా వాచి ఉన్నట్లుగా తోస్తోంది.”
విజయ్: ఢాకాలో అతడు సదా మీ గురించి మాట్లాడేవాడు, మీ వద్దకు వెళ్ళాలనే ఆతురతతో ఉండేవాడు.
శ్రీరామకృష్ణులు లేచి నిలబడ్డారు. బ్రహ్మసమాజ సభ్యులు ఆయనకు ప్రణమిల్లారు. ఆయన కూడా బదులుగా నమస్కరించారు. పిదప బండి ఎక్కి, జగజ్జనని ప్రతిమను దర్శింప అధర్ ఇంటికి బయలుదేరారు.
29.3 తృతీయ పరిచ్ఛేదం దుర్గాష్టమి పర్వదినాన రామ్ ఇంట్లో శ్రీరామకృష్ణులు
ఆదివారం, సెప్టెంబర్ 28, 1884
దుర్గాష్టమి పండుగ రోజు. దుర్గా దర్శనానికై శ్రీరామకృష్ణులు కలకత్తాకు అరుదెంచారు. అధర్ ఇంట్లో దుర్గాపూజ జరిగింది. శ్రీరామకృష్ణులను అతడు మూడు రోజులూ ఆహ్వానించి ఉన్నాడు.
అధర్ ఇంటికి వచ్చే దారిలో శ్రీరామకృష్ణులు రామ్‌చంద్ర దత్తా ఇంటికి వెళ్ళారు. అక్కడ విజయ్, కేదార్, రామ్, సురేంద్రుడు, ఛునీలాల్, నరేంద్రుడు, నిరంజన్, నారాయణ్, హరీశ్, బాబూరామ్, ‘మ’ తో సహా పలువురు ఉన్నారు. బలరామ్, రాఖాల్లు ఇంకా బృందావనంలోనే ఉన్నారు.
శ్రీరామకృష్ణులు (చిరునవ్వుతో విజయ్, కేదార్లను చూస్తూ): నేడు మళ్ళీ కలుసుకున్నారు. మీ ఇద్దరి మనోవైఖరులు ఒకే రకమైనవి. (విజయ్‌తో) అది సరే, శివనాథ్ సంగతి ఏమైంది? మీరు ––?
విజయ్: అవునండీ. అతడికి కబురు చేశాము. కాని నేను అతణ్ణి కలుసుకోలేదు, విషయం చెప్పి పంపాను. అతడికి కబురు అందింది.
శ్రీరామకృష్ణులు శివనాథ్ ఇంటికి వెళ్ళి ఉన్నారు. కాని అతడు ఇంట్లో లేడు. విజయ్ నుంచి ఈ సంగతి తెలిసినప్పటికీ పనుల ఒత్తిడిచే అతడు నాడు శ్రీరామకృష్ణులను కలుసుకోలేకపోయాడు.
శ్రీరామకృష్ణులు (విజయ్ ప్రభృతులతో): నా మనస్సులో నాలుగు కోర్కెలు జనించాయి. అవి: వంకాయ చేర్చిన చేపల కూర తినటం, శివనాథ్‌ను కలుసుకోవటం, భక్తులు జపమాలను త్రిప్పుతూ జపం చేస్తూంటే చూడటం, ఎనిమిది అణాల ఖరీదు మధువును అష్టమి రోజు తాంత్రిక సాధకులు త్రాగటం చూసి వారికి ప్రణమిల్లడం.
నరేంద్రుడు ఎదురుగా కూర్చుని ఉన్నాడు. అప్పు డతడి వయస్సు ఇరవై రెండేళ్ళు. అలా మాట్లాడుతూ ఉన్నప్పుడే శ్రీరామకృష్ణుల చూపు నరేంద్రునిపై పడింది. వెంటనే లేచి నిలబడి సమాధిమగ్నులైనారు. తమ కాలు నొకదాన్ని నరేంద్రుని మోకాలిపై ఉంచారు. ఈ స్థితిలోనే నిలబడ్డారు, బాహ్యస్మృతి పూర్తిగా కోల్పోయారు, కళ్ళు నిశ్చలమైనాయి.
29.3.1 ఈశ్వరకోటి, జీవకోటి – నిత్యసిద్ధులు
చాలాసేపయ్యాక బాహ్యస్పృహలోకి రాసాగారు. కాని ఆనందపారవశ్యం పూర్తిగా తొలగి పోలేదు. ఆయన తనలో తానే మాట్లాడుకోసాగారు. భావపారవశ్యంలో మునిగి భగవన్నామాన్ని ఉచ్చరించసాగారు – “సచ్చిదానంద! సచ్చిదానంద! సచ్చిదానంద! – ఇది చెప్పనా? లేక, నేడు కారణానందదాయినీ! కారణానందమయీ! స రి గ మ ప ద ని – ‘ని’ లో ఎక్కువ సేపు ఉండటం మంచిది కాదు; అలా ఉండనూ లేము. అందుచే ఒక స్వరం క్రింద ఉంటాను.” తరువాత సంభాషణను ఇలా కొనసాగించారు: “స్థూల, సూక్ష్మ, కారణ, మహాకారణాలు అని వేర్వేరు భూములు ఉన్నాయి. మహాకారణానికి పోతే మౌనం. అక్కడ నోట మాట రాదు.”
“అవతార పురుషుల వంటి ఈశ్వరకోటులు మహాకారణ స్థితికి పోయిన పిదప కూడా తిరిగి రాగలరు. వారు పైకీ పోగలరు, క్రిందికీ దిగి రాగలరు. మేడ మీదకు వెళతారు, పిదప మెట్ల ద్వారా క్రిందికి వచ్చి, క్రింది భాగాన అక్కడా ఇక్కడా సంచరిస్తారు. అనులోమం, విలోమం. ఏడంతస్తుల భవనం, కొందరు దాన్లోని క్రింది భాగం వరకే వెళ్లగలరు. అయితే రాజకుమారునికి అది సొంత భవనం. అతడు ఏడు అంతస్తులకు పోయి రాగలడు.
“ఒక రకం చిచ్చుబుడ్డి ఉంది. మొదట అది ఒక రకమైన పువ్వులను వెదజల్లుతుంది. ఒకింత సేపట్లో మరో రకమైన పువ్వులను కురిపిస్తుంది. తరువాత మరో రకం పువ్వుల వాన. ఈ విధంగా ఎన్నో రకాల పువ్వులను అది వెదజల్లు తుంది. మరో రకం చిచ్చుబుడ్డి ఉంది. వెలిగించిన ఒకింతసేపట్లో బుస్ అంటూ పైకి ఎగసి పిదప ఆరిపోతుంది. ఆ విధంగా కొందరు సాధనలు చేసి అత్యున్నత భూములకు ఎగసిన తరువాత తిరిగి దిగివచ్చి సమాచారం అందించరు. జీవకోటులు సాధనలు చేసి సమాధి స్థితిని పొందవచ్చు. కాని తరువాత క్రిందికి దిగిరావటమో, వచ్చి సమాచారం అందించటమో వారికి సాధ్యం కాదు.
“నిత్యసిద్ధులనబడే ఒక తరగతి వారున్నారు. వాళ్ళు పుట్టినది ఆదిగా భగవంతుణ్ణి కోరతారు; ప్రాపంచిక సుఖాలు ఏవీ వారికి రుచించవు. వేదాలలో హోమపక్షి గురించి పేర్కోబడి ఉంది. ఆ పక్షి ఆకాశంలో ఎంతో ఎత్తులో వసిస్తుంది. ఆకాశంలోనే గ్రుడ్లు పెడుతుంది. ఆకాశంలో ఎంతో ఎత్తులో ఉండటం చేత ఆ గ్రుడ్డు పలురోజుల తరబడి క్రిందికి వస్తూనే ఉంటుంది. మార్గమధ్యంలోనే గ్రుడ్డు పొదగబడుతుంది. పక్షిపిల్ల కూడా పలు రోజులుగా క్రిందికి పడుతూనే ఉంటుంది. క్రింద పడుతూ ఉన్నప్పుడే దాని కళ్ళు తెరచుకుంటాయి. భూమిని సమీపించే సమయంలో అది అప్రమత్తమవుతుంది; నేలమీద పడితే తనకు మరణం తథ్యం అని తెలుసుకుంటుంది. కీచుమంటూ తన తల్లి ఉన్నచోటు కేసి రివ్వున పైకి ఎగిరిపోతుంది. నేలను తాకితే మరణం, అందుకే అది భీతి చెందింది. ఇప్పుడు దానికి తల్లే కావాలి. తల్లి ఆకాశంలో అత్యంత ఎత్తులో వసిస్తూ ఉంది. కనుకనే పక్షిపిల్ల వేరే ఏ వైపూ చూపును నిలుపక పైకి ఎగిరిపోతుంది.
“అవతార పురుషులతో వచ్చేవారు నిత్యసిద్ధులు. వారిలో కొందరికి అదే చివరి జన్మ.
(విజయ్‌తో) “నీకు యోగం, భోగం రెండూ ఉన్నాయి. జనక మహారాజుకు యోగమూ ఉన్నది, భోగమూ ఉన్నది. అందుకే ఆయన ఒక రాజర్షిగా అంటే రాజుగాను, ఋషిగాను వెలుగొందాడు. నారదుడు దేవర్షి. శుకదేవుడు బ్రహ్మర్షి.
“శుకదేవుడు బ్రహ్మర్షి. ఆయన జ్ఞాని కాడు, మూర్తీభవించిన జ్ఞానమే ఆయన. జ్ఞాని అని ఎవరిని పేర్కొంటాం? సాధనలు చేసి ఎవరు జ్ఞానం సంతరించుకున్నాడో ఆతణ్ణి. శుకదేవుడో జ్ఞానమూర్తి; అంటే జ్ఞానమే అపరావతారం అయినవాడు. జ్ఞానం దానంతట అదే వచ్చింది, సాధనలు చేసి సముపార్జించినది కాదు.”
ఇలా మాట్లాడుతూ శ్రీరామకృష్ణులు మామూలు స్థితిలోకి వచ్చారు. తరువాత భక్తులతో సంభాషణ కొనసాగించారు.
శ్రీరామకృష్ణులు కేదార్‌ను పాడమన్నారు. కేదార్ పాడాడు:
మది విప్పి నేనెట్లు చెప్పగలనొ సఖా
చెప్పరాదని నోరు నొక్కబడియుండగా
నా బాధ తెలియగల దయశాలి గనలేక
మరణించు స్థితిలోన మనినాడ నిప్పుడు ॥ మ ॥
అతని చూపులలోకి చూచినంతనె చాలు
నా హృదయసఖుడెవరొ కనిపెట్టజాలుదును
దివ్యప్రేమోత్తుంగ పర్వమున ఆనంద
తన్మయత నీదెడు వాడు గానగ రాడు ॥ మ ॥
కేదార్ మరికొన్ని పాటలు పాడాడు. గానం పూర్తికాగానే శ్రీరామకృష్ణులు మాట్లాడ నారంభించారు. కేశవ్ సోదరుని కుమారుడు నందలాల్, బ్రహ్మసమాజ సభ్యులు కొందరు ఉన్నారు.
శ్రీరామకృష్ణులు (విజయ్, భక్తులతో): మధువు సీసాను ఒక వ్యక్తి తీసుకువచ్చాడు. దాన్ని తాకడానికి ప్రయత్నించాను, సాధ్యం కాలేదు!
విజయ్: ఆహా!
శ్రీరామకృష్ణులు: సహజానంద* స్థితి ఏర్పడితే అప్రయత్నంగానే మత్తు కలుగుతుంది, మధువు పుచ్చుకోనవసరం లేదు. జగజ్జనని పాద తీర్థాన్ని చూడగానే నాకు మత్తు కలుగుతుంది, ఐదు సీసాల మద్యం త్రాగిన వ్యక్తిలా అయిపోతాను. ఆ స్థితిలో, అనుకున్నప్పుడల్లా అనుకున్న పదార్థాలన్నీ తినటం సాధ్యం కాదు.
29.3.2 జ్ఞాని, భక్తుని ఆహార నియమాలు
నరేంద్రుడు: ఆహారం విషయంలో యాదృచ్ఛికంగా లభించేదాన్ని తినటమే మంచిది.
శ్రీరామకృష్ణులు: అదంతా ప్రత్యేకమైన స్థితిని బట్టి ఉంటుంది. జ్ఞానికి ఏమి తిన్నా దోషం లేదు. గీత ప్రకారం జ్ఞాని తాను తినటం లేదు; కుండలినీకి ఆహుతి అర్పిస్తున్నాడు, అంతే. కాని భక్తుని విషయం అలా కాదు. నా ఇప్పటి స్థితిలో బ్రాహ్మణునిచే భగవంతునికి నైవేద్యం గావించబడితే తప్ప, ఆ ఆహారాన్ని తినలేను. మునుపు ఒక స్థితిలో దక్షిణేశ్వరపు ఎదుటి తీరంలో శవాలు తగలబడుతూ ఉన్న దుర్వాసన కలిసిన గాలిని గాఢంగా పీల్చేవాణ్ణి. అది ఎంతో సువాసనగా అనిపించేది. ప్రస్తుతమో, అందరి నుండీ ఆహారాన్ని స్వీకరింప నాకు సాధ్యం కావటం లేదు. కానీ, కొన్ని వేళల్లో అలా తినటానికీ సాధ్యపడుతోంది.
“మునుపు ఒక రోజు కేశవ్ ఇంటికి నాటక ప్రదర్శన తిలకింప నన్ను తోడ్కొని వెళ్ళారు. అక్కడ నాకు పూరీ బంగాళాదుంప కూర పెట్టారు. తీసుకొని వచ్చిన వ్యక్తి రజకుడా లేక క్షురకుడా అని కూడా నాకు తెలియదు. (అందరూ నవ్వారు) దాన్ని బాగా తిన్నాను. ‘కొంచెంగా తినండి’ అన్నాడు రాఖాల్.
(నరేంద్రునితో) “నీ విషయంలో ఇప్పుడది సరి. నువ్వు దీన్లోనూ ఉన్నావు, దాన్లోనూ ఉన్నావు. అందుకే నువ్వు ప్రతిదీ తినవచ్చు. (భక్తులతో) పంది మాంసం తిన్నా కూడా ఎవడు భగవంతుని ఆకాంక్షిస్తాడో అతడు ధన్యజీవి! హవిష్యాన్నం తిని కూడా, మనస్సు కామినీ కాంచనాలపై నెలకొని ఉంటే అంతకంటే నీచమైనది లేదు.
కమ్మరి ఇంట్లో వండిన పప్పు తినాలనే కోర్కె ఒకసారి కలిగింది. ‘బ్రాహ్మణులకు వంట చేయటం వచ్చునా ఏమిటి?’ అని వాళ్ళు అనటం చిన్ననాటి నుంచీ విని ఉన్నాను. అందుకే తిన్నాను. కాని కమ్మరి వంటలో అంతా కమ్మరి వాసనే! (అందరూ నవ్వారు)
“గోవింద్ రాయ్ నుంచి అల్లా మంత్రోపదేశం స్వీకరించాను. కుఠీలో ఉల్లిపాయలు వేసిన ఆహారం వండబడింది. కాస్త తిన్నాను. బారానగర్‌లో మణిమల్లిక్ ఉద్యానగృహంలో ఒకసారి కూర తిన్నాను. కాని అదో మాదిరి వెగటు పుట్టింది.
“తరువాత కామార్పుకూర్కు వెళ్ళినప్పుడు రాంలాల్ తండ్రికి, ‘అయ్యో, వీడు ఎవరు పడితే వారి ఇంట్లో తింటున్నాడే! వీణ్ణి జాతి బహిష్కరణ చేస్తారేమో’ అన్న భయం పట్టుకుంది. అందుచేత అక్కడ ఎక్కువ రోజులు గడపలేకపోయాను, తిరిగి వచ్చేశాను.
“ఆహారం, ఆచరణ విషయంలో సరైనది ఏది అన్న విషయం గురించి వేదాలు, పురాణాలు చెప్పి ఉన్నాయి. వేదాలు, పురాణాలు వేటిని అశుద్ధాలని వచించి, విడనాడమంటున్నాయో, వాటిని తంత్రశాస్త్రాలు మంచివని పేర్కొంటున్నాయి.
“ఆహా! ఎటువంటి స్థితులు గడిచిపోయాయి. ఆకాశాన్ని పాతాళాన్ని తాకేట్లు నోరు తెరిచి, ‘అమ్మా!’ అని పిలిచేవాణ్ణి. వల విసిరి చేపను పట్టుకునే విధంగా అమ్మను లాక్కొచ్చేట్లుగా భావించేవాడను. ఒక పాటలో ఇలా ఉంది:
ఓ కాళీమాయీ నిన్నీమారు మ్రింగుదునే
నా జనన గ్రహరాశి నీ గండంబనినారే ॥ ఓ ॥
తనయుని ఈ గండము తన తల్లికి తప్పదటె
మ్రింగుము నీవే నన్ను లేకున్న మ్రింగుదు నిన్ను ॥ ఓ ॥
ఈ రెంట మనకింక ఏ ఒకటో తప్పదులే ॥ ఓ ॥
నలుపే నా చేతులకు ముఖమునకు అద్దెదను
పూయుదు నా మేనికిని పూర్తిగను నలుపింక ॥ ఓ ॥
పాశముతో యము డెదురై ప్రాణముకై వచ్చినచో
చేతుల నాతని ముఖము పులిమెదను మసిపూసి ॥ ఓ ॥
మ్రింగెద నిన్నో మాతా జీర్ణము కానీయనులే
హృదయములో స్థాపించి మానసపూజ చేత ॥ ఓ ॥
కాళిని నే తినివేయు కాలుడు కాళీ భర్త
కలవరము చెందినచో కాలుని ఆగ్రహమునకు
కాళీ నామముతోనే గట్టిగ నే నెదిరింతు
అసలీ రాంప్రసాదు కాళీ కొడుకని తెలియ ॥ ఓ ॥
ఏమైనా కానీవే నీ పరివారము నిన్ను
తిననైనా తినివేతు లేకున్న మరణింతు ॥ ఓ ॥
“ఆ రోజుల్లో ఒక పిచ్చివాడిలా అయిపోయాను – అంతటి మనోవ్యాకులత!”
నరేంద్రుడు పాడ నారంభించాడు.
వెర్రివానిని చేయవే । నీ ప్రేమలోన
పిచ్చివానిని చేయవే । నను గన్న తల్లీ……
పాట వింటూ ఉండగానే శ్రీరామకృష్ణులు మళ్ళీ సమాధిమగ్నులైనారు. బాహ్యచైతన్యం కలిగాక, ఉమాదేవి తల్లియైన గిరిరాణి మనోభావనను ఆరోపించుకొని ప్రేమోన్మాదిలా ఆగమని పాటలు పాడారు:
మా యమ్మ ఉమ నాకు మనసిచ్చి చెప్పు
నే నడుగు విషయముల విశదంబుగాను…..
పాట పూర్తికాగానే శ్రీరామకృష్ణులు భక్తులతో, “నేడు మహాష్టమి కదా! అమ్మ వచ్చింది. అందుకే నాలో ఇంత భావావేశం పొంగుతూ ఉన్నది” అన్నారు.
కేదార్: ప్రభూ! మీరే ఇక్కడకు ఏతెంచారు! మీరూ జగజ్జననీ వేర్వేరా ఏమిటి?
భావపారవశ్యంలో శ్రీరామకృష్ణులు పాడసాగారు:
ఆ పాటభావం: ‘సఖీ, ఎవరికోసమైతే నేను వెర్రివాడిని అయ్యానో, ఆతడిని పొందలేదే….’
29.4 చతుర్ధ పరిచ్ఛేదం భక్తులతో శ్రీరామకృష్ణులు
శ్రీరామకృష్ణులు పాడుతూ ఉన్నారు. విజయ్ హఠాత్తుగా, ‘హరిబోల్, హరిబోల్’ అంటూ లేచి నిలబడ్డాడు. శ్రీరామకృష్ణులూ విజయ్తోను, తక్కిన భక్తులతోను భక్తిపారవశ్యంలో నృత్యం చేశారు. పాట పూర్తికాగానే అందరూ కూర్చున్నారు. అందరి దృష్టి శ్రీరామకృష్ణుల మీదనే ఉంది. సంధ్యాసమయం కాబోతూ ఉన్నది. శ్రీరామకృష్ణులు భక్తులతో మాట్లాడసాగారు. వారి యోగక్షేమాలు విచారిస్తున్నారు. కేదార్ చేతులు జోడించుకుని వినమ్రంగా శ్రీరామకృష్ణులతో ఏదో చెబుతున్నాడు. నరేంద్రుడు, ఛునీలాల్, సురేంద్రుడు, రామ్, ‘మ’, హరీశ్, శ్రీరామకృష్ణుల ప్రక్కన కూర్చుని ఉన్నారు.
కేదార్: తల తిరగటం ఎలా నయమవుతుంది?
శ్రీరామకృష్ణులు (మృదువుగా): తల తిరుగుతుండటం కద్దు. నాకూ వచ్చింది. కొంచెం బాదం తైలం వాడు. నయమవుతుందని విని ఉన్నాను.
కేదార్: అట్లే చేస్తానండీ.
శ్రీరామకృష్ణులు (ఛునీలాల్తో): ఏమిటోయ్! మీ రంతా ఎలా ఉన్నారు?
ఛునీలాల్: క్షేమంగా ఉన్నామండీ. బృందావనంలోబలరామ్బాబు, రాఖాల్ క్షేమంగానే ఉన్నారు.
శ్రీరామకృష్ణులు: అన్ని మిఠాయిలు ఎందుకు పంపించావు?
ఛునీలాల్: బృందావనం నుంచి తిరిగి వచ్చాను కదా!
ఛునీలాల్, బలరామ్‌తో బృందావనం వెళ్ళి కొన్ని నెలలు అక్కడ గడిపి వచ్చాడు. సెలవులు తీరిపోవటంతో కలకత్తాకు తిరిగి వచ్చేశాడు.
శ్రీరామకృష్ణులు (హరీశ్‌తో): నువ్వు దక్షిణేశ్వరానికి ఒకటి రెండు రోజులు తరువాత రా. నీ ఆరోగ్యం బాగాలేదు, అక్కడకొచ్చి పడకబెడతావు. (నారాయణ్‌తో వాత్సల్యంగా) కూర్చో, ప్రక్కన వచ్చి కూర్చో. రేపు అక్కడికి రా, అక్కడే భోజనం చేయవచ్చు. (‘మ’ ను చూపుతూ) ఇతడితోవస్తావా? (‘మ’ తో) ఏం సరేనా?
‘మ’ నాడే శ్రీరామకృష్ణులతో వెళ్లాలనుకున్నాడు. అందుకే ఆలోచనలో మునిగిపోయాడు.
సురేంద్రుడు చాలాసేపు అక్కడ ఉండిపోయాడు. మధ్యలో ఒకసారి ఇంటికి వెళ్ళాడు. తిరిగి వచ్చి శ్రీరామకృష్ణుల ప్రక్కన నిలబడ్డాడు. అతడికి త్రాగుడు అలవాటు ఉంది. మితిమీరి త్రాగుతాడు. శ్రీరామకృష్ణులు అతడి ఈ దుఃస్థితికి చాలా బాధపడ్డారు. కాని ఒకేసారిగా దాన్ని మానివేయమని చెప్పలేదు. “సురేంద్రా! ఇలా చూడు, త్రాగేటప్పుడు దాన్ని దేవికి నివేదనం చేయి. మరొకటి, తల తిరగనంతవరకు కాళ్ళు తడబడనంతవరకు మాత్రమే పుచ్చుకో. దేవిని గురించి చింతన చేయగా చేయగా, నీకు త్రాగటంలోని ఆనందం పోతుంది. ఆమె కారణానందదాయిని. ఆమెను సాక్షాత్కరించుకుంటే సహజానందం కలుగుతుంది” అని చెప్పారు.
సురేంద్రుడు ప్రక్కనే నిలబడి ఉన్నాడు. శ్రీరామకృష్ణులు అతణ్ణి చూసి, “నువ్వు త్రాగి ఉన్నావా?” అని అడుగుతూ భావపారవశ్యంలో మునిగిపోయారు.
మునిమాపు వేళ అయింది. ఒకింత బాహ్యచైతన్యం కలుగగానే శ్రీరామకృష్ణులు జగజ్జనని నామాన్ని ఉచ్చరించి, ఆనందంగా పాడసాగారు:
అదిగో! అల్లదిగో! అమ్మదిగో! చూడదిగో!
పరమేశ్వరునితో నాడుచున్నది ॥
పారవశ్యమున ఒడలు మరచితా
త్రాగి గ్రుక్కెడు దేవ మద్యము
ఊగి ఊగి తా తూగుచున్నను
ఆగి నేలపై తూలి వాలదు…..
29.4.1 ప్రార్థన ఎలా చేయాలి? – శ్రీరామకృష్ణుల ప్రార్థన
తరువాత శ్రీరామకృష్ణులు హరినామం ఉచ్చరించారు. మధ్యమధ్య చేతులు తడుతూ తాళం వేశారు. సుమధుర గాత్రంతో ‘హరిబోల్, హరిబోల్, హరిమయ, హరిబోల్, హరి హరి, హరిబోల్’ అంటూ సంకీర్తన చేశారు. పిదప, ‘రామ్ రామ్ రామ్, రామ్ రామ్ రామ్ రామ్, రామ్ రామ్ రామ్!’ అంటూ రామనామం ఉచ్చరించారు. తరువాత ఇలా ప్రార్థించారు: “ఓ రామా! రామా! నేను భజనహీనుడను, సాధనహీనుడను, జ్ఞానహీనుడను, భక్తిహీనుడను; నేను క్రియా విహీనుడను. ఓ రామా! శరణాగతో-హం, శరణాగతో-హం. రామా! దేహసుఖాలు వద్దు, పేరుప్రతిష్ఠలు వద్దు, రామా! అష్టసిద్ధులూ అక్కర్లేదు, శతసిద్ధులూ వద్దు, రామా! శరణం శరణం. రామా! నీ పాదపద్మాల పట్ల శుద్ధభక్తి కలిగేట్లు అనుగ్రహించు; రామా, నీ భువనమోహన మాయలో నేను సమ్మోహితుణ్ణి అవకుండేలా చూడు. రామా! ఓ రామా! శరణాగతోఽహం.” (BG 18.66)
శ్రీరామకృష్ణులు ప్రార్థిస్తూన్నప్పుడు అందరూ ఆయన్నే చూస్తూ ఉన్నారు. ఆయన కారుణ్యపూరిత ప్రార్థన విని పలువురు కన్నీరు ఆపుకోలేకపోయారు. రామ్ ఆయన ప్రక్కన నిలబడి ఉన్నాడు.
శ్రీరామకృష్ణులు (రామ్‌తో): రామ్, నువ్వు ఎక్కడున్నావు?
రామ్: మేడ మీద ఉన్నానండీ.
శ్రీరామకృష్ణుల, భక్తుల భోజనాలకై రామ్ మేడ మీద ఏర్పాట్లు చేస్తూ ఉన్నాడు.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ రామ్‌తో): పైన ఉండటం కంటే క్రింద ఉండటం మంచిది కదా! పల్లపు భూముల్లోనే నీళ్ళు నిలుస్తాయి, మెట్ట ప్రదేశం నుంచి జారి క్రిందికి పోతాయి.
రామ్ (నవ్వుతూ): అవునండీ!
మేడ మీద ఆకులు వేశారు. శ్రీరామకృష్ణులను, భక్తులను రామ్ మేడ మీదకు తోడ్కొని వెళ్ళి విందు చేశాడు.
ఉత్సవం పూర్తికాగానే నిరంజన్, ‘మ’ ప్రభృతులతో శ్రీరామకృష్ణులు అధర్ ఇంటికి వెళ్ళారు. అక్కడా జగజ్జనని వెలసి అనుగ్రహిస్తూ ఉంది. నేడు మహాష్టమి. ఈ రోజు శ్రీరామకృష్ణులు విచ్చేసి తన ఇంటిని పావనం చేయమని అధర్ వేడుకొని ఉన్నాడు. లేకుంటే, పూజ సార్థకం కాదని అతడు భావించాడు.
29.5 పంచమ పరిచ్ఛేదం నరేంద్రుడు, బాబూరామ్, నిరంజన్, భవనాథ్ ప్రభృతులతో శ్రీరామకృష్ణులు
సోమవారం, సెప్టెంబర్ 29, 1884
మహానవమి పర్వదినం. తెల్లవారింది. కాళికాలయంలో దేవికి మంగళహారతి పూర్తయింది. నహబత్ నుంచి ఉదయ రాగాలు వినవస్తున్నాయి. బ్రాహ్మణులు బుట్టలతోను, తోటమాలులు పెద్దబుట్టలతోను దేవి పూజార్థం పువ్వులు సేకరింప వేగంగా వెళ్ళారు.
వేకువనే శ్రీరామకృష్ణులు నిద్ర లేచారు. భవనాథ్, బాబూరామ్, నిరంజన్, ‘మ’ మొదలైనవారు గత రాత్రి నుంచి అక్కడే ఉన్నారు. వాళ్ళు శ్రీరామకృష్ణుల గదికి ఆనుకుని ఉన్న వసారాలో నిద్రించారు. నిద్రలేవగానే వాళ్ళు శ్రీరామకృష్ణులు, ‘జయ జయ దుర్గా, జయ జయ దుర్గా, జయ జయ దుర్గా’ అని ఉచ్చరిస్తూ పారవశ్యంలో నృత్యం చేస్తూ ఉండటం చూశారు. ఒక పిల్లవాడి వంటి స్థితి! నడుంపై బట్ట లేదు. జగజ్జనని నామాన్ని ఉచ్చరిస్తూ గదిలో చుట్టూ తిరుగుతూ నృత్యం చేస్తూ ఉన్నారు.
కాసేపయ్యాక, ‘సహజానందం! సహజానందం!’ అన్నారు. చివరగా, ‘గోవిందా, ప్రాణవల్లభా! గోవింద మమజీవన’ అని అన్నారు.
భక్తులు లేచి కూర్చున్నారు; తదేక దృష్టితో శ్రీరామకృష్ణుల పారవశ్య స్థితినే చూస్తూ ఉన్నారు. హాజ్రా కూడా కాళికాలయంలోనే బసచేసి ఉన్నాడు. శ్రీరామకృష్ణుల గదికి ఆగ్నేయం వైపున ఉన్న వసారాలోనే అతడు ఉంటాడు. లాటూ కూడా అక్కడ బసచేసి శ్రీరామకృష్ణులకు సేవలొనరిస్తూ ఉన్నాడు. రాఖాల్ బృందావనంలో ఉన్నాడు. నరేంద్రుడు అప్పుడప్పుడు వచ్చి శ్రీరామకృష్ణులను దర్శించేవాడు. నేడు నరేంద్రుడు రానున్నాడు.
శ్రీరామకృష్ణుల గదికి ఉత్తరం వైపునున్న వసారాలో భక్తులు పడుకుని ఉన్నారు. శీతకాలం కావటంతో దడి వ్రేలాడతీయబడి ఉంది. అందరూ ముఖాలు కడుగుకున్న పిదప శ్రీరామకృష్ణులు ఆ ఉత్తరపు వసారాలోకి వచ్చి ఒక చాప మీద ఆసీనులయ్యారు. భవనాథ్, ‘మ’ లు ప్రక్కన కూర్చున్నారు. తక్కిన భక్తులూ మధ్యమధ్యలో అక్కడకు వచ్చి కూర్చుంటున్నారు.
29.5.1 విశ్వాసం – జీవకోటి, ఈశ్వరకోటి
శ్రీరామకృష్ణులు (భవనాథ్తో): విషయం ఏమిటో తెలుసా? జీవకోటులకు సులభంగా విశ్వాసం కలుగదు. కాని ఈశ్వరకోటులకు విశ్వాసం స్వతస్సిద్ధం. ‘క’ అని వ్రాస్తేనే కృష్ణుని జ్ఞాపకం వచ్చి విలపించే వాడట ప్రహ్లాదుడు. సామాన్య జీవులది సంశయాత్మకమైన బుద్ధి – ‘అవును, నిజమే, కానీ…..’ అంటూ నానుస్తూ ఉంటారు వాళ్ళు.
“బ్రహ్మం – శక్తి, శక్తి – శక్తిమంతుడు. వీటి నడుమ వ్యత్యాసం లేదు అన్న విషయం హాజ్రా విశ్వసించడు. నిష్క్రియ స్థితిలో దాన్ని నేను బ్రహ్మం అంటాను; సృష్టి స్థితి లయాలు చేస్తూ ఉన్నప్పుడు దాన్నే శక్తిగా పేర్కొంటాను. కాని ఉన్నది ఒక్కటే. అది అభిన్నం. అగ్ని అనగానే దాని దాహకశక్తి జ్ఞప్తికి వస్తుంది; దాహకశక్తి అనగానే అగ్ని జ్ఞప్తికి వస్తుంది. ఒకదాన్ని వదలి ఇంకోదాన్ని ఊహించలేం.
“అప్పుడు దేవిని, ‘అమ్మా! హాజ్రా ఇక్కడి (అంటే శ్రీరామకృష్ణుల) దృక్పథాన్ని తలక్రిందులు చేయ ప్రయత్నిస్తున్నాడు. అతడికి విషయం అర్థమయ్యేలా చెయ్యి. లేకుంటే అతణ్ణి ఇక్కడ నుండి పంపించివెయ్యి’ అని ప్రార్థించాను. మరునాడు అతడు నా వద్దకొచ్చి, ‘అవును, నేను దీన్ని ఒప్పుకుంటున్నాను, బ్రహ్మమే సర్వాంతర్యామి’ అని చెప్పాడు.”
భవనాథ్ (నవ్వుతూ): హాజ్రా పలుకులు మీకు ఇంత బాధ కలిగించాయా?
శ్రీరామకృష్ణులు: నా స్థితి ఇప్పుడు మారిపోయింది. బిగ్గరగా కేకలు పెట్టి వాదించటం నా కిప్పుడు సాధ్యం కాదు. హాజ్రాతో దెబ్బలాడి వాదించే స్థితిలో ఇప్పుడు నేను లేను. యదుమల్లిక్ తోటలో హృదయ్ నాతో, ‘మామా, నీతో పాటు నేను ఇక్కడ ఉండడం నీకు ఇష్టంలేదా?’* అని అడిగాడు. ‘లేదు, ఇప్పుడు ఆ స్థితిలో నేను లేను. నీతో వాదులాడటం నా వల్ల కాదు’ అన్నాను.
29.5.2 పిల్లవాని విశ్వాసం – శ్రీరామకృష్ణుల స్థితి
“దేన్ని జ్ఞానం అంటారు, దేన్ని అజ్ఞానం అంటారు? భగవంతుడు దూరంగా ఉన్నాడనే భావన ఉంటే అది అజ్ఞానం; భగవంతుడు ఇక్కడ, అక్కడ, సర్వత్రా ఉన్నాడనే భావన ఉంటే, అది జ్ఞానం.
“యథార్థ జ్ఞానం కలిగినప్పుడు సమస్త వస్తువులు చైతన్యమయంగా గోచరమవుతాయి. కామార్పుకూర్లో ఉన్నప్పుడు నేను శివరామ్‌తో మాట్లాడుతుండే వాడిని. వాడొక పిల్లవాడు, నాలుగైదేళ్ళు ఉంటాయి. ఒకసారి ఉరుములు ఉరిమాయి, మెరపులు మెరిసాయి. దాన్ని చూసి వాడు ‘చిన్నాన్నా, అదో వాళ్ళు అగ్గిపుల్లను గీస్తున్నారు’ అన్నాడు. (అందరూ నవ్వారు) ఒక రోజు వాడు ఒంటరిగా మిడతలు పట్టుకోడానికి ప్రయత్నిస్తున్నాడు. ప్రక్కనున్న చెట్టు ఆకులు కదిలాయి, వెంటనే ఆకులను చూస్తూ, ‘హుష్! హుష్! నేను మిడతలు పట్టుకోవాలి’ అన్నాడు.
“పిల్లలు అన్నిటిని చైతన్యమయంగా గాంచుతారు! అమాయక విశ్వాసం, అంటే పిల్లవాని విశ్వాసం కలుగకుంటే భగవంతుణ్ణి పొంద సాధ్యం కాదు. ఆహా! నాకు అట్టి స్థితి ఉండేది! ఒక రోజు పచ్చికలో కూర్చున్నప్పుడు ఏదో నన్ను కుట్టింది. పామై ఉంటుందా అని భయపడ్డాను. ఏం చెయ్యటం? మళ్ళీ అది కాటు వేస్తే తన విషాన్ని లాక్కొంటుందని విని ఉన్నాను. అందుకే మళ్ళీ కాటు వేయించుకోవటానికై పాము పుట్ట ఎక్కడని ఆ పచ్చిక బయలులో వెదుకసాగాను. అప్పుడొక వ్యక్తి, ‘ఏం వెదకుతున్నారు?’ అని అడిగాడు. విషయం చెప్పేసరికి అతడు ‘అరెరె! మొదట కాటువేసిన ప్రదేశంలోనే కదా అది మళ్ళీ కాటు వేయాలి?’ అని అన్నాడు. ఏమీ మాట్లాడక తిరిగి వచ్చేశాను. బహుశా తేలో, మరేదో పురుగో కుట్టి ఉండవచ్చు.
“శరదృతువులో పడే మంచు ఆరోగ్యానికి మంచిదని రామ్‌లాల్ చెప్పి ఉన్నాడు; దాన్ని సమర్థిస్తూ ఏదో ఒక శ్లోకాన్నీ ఉదహరించాడు. ఆ తరువాత ఒక రోజు కలకత్తా నుంచి బండిలో వస్తున్నాను. అప్పుడు మంచు నా మీద పడాలనే ఉద్దేశంతో తలను బయటకు చాచి ఉంచాను. దానితో ఆరోగ్యం పాడయింది.” (అందరూ నవ్వారు)
29.5.3 శ్రీరామకృష్ణులు – ఔషదం
శ్రీరామకృష్ణులు తమ గదిలోకి వచ్చి కూర్చున్నారు. ఆయన కాళ్ళు ఒకింత వాచి ఉన్నాయి. వ్రేలు పెట్టి అదిమితే గుంటలు పడుతున్నాయేమో చూడమని భక్తులతో చెప్పారు. వాళ్ళు అదిమి చూసినప్పుడు చిన్న గుంట పడటం చూశారు. ‘అయితే దాన్ని పెద్దగా పట్టించుకోనక్కర్లేదు’ అని ఆయనతో చెప్పారు.
శ్రీరామకృష్ణులు (భవనాథ్తో): నువ్వు సింథీకి చెందిన మహేంద్రుని పిలుచుకుని రా. అతడు చెబితేనే నాకు స్థిమితం కలుగుతుంది.
భవనాథ్ (నవ్వుతూ): మీకు ఔషధాలపై గట్టినమ్మకం. అయితే మాకు అంతగా నమ్మకం లేదు.
శ్రీరామకృష్ణులు: ఔషధం కూడా భగవంతునిదే. ఆయనే ఒక రకంగా వైద్యుడుగా ఉన్నాడు. గంగాప్రసాద్, ‘మీరు రాత్రి పూట నీళ్ళు త్రాగకూడదు’ అన్నాడు. దీన్ని నేను వేదవాక్కుగా పాటించాను. ఆయన్ను సాక్షాత్తూ ధన్వంతరిగానే భావించాను.
29.6 షష్ఠ పరిచ్ఛేదం నరేంద్రుడు తదితర భక్తుల మధ్య సమాధి, నృత్యం
ఇంతలో హాజ్రా వచ్చి కూర్చున్నాడు. అనేక విషయాలు మాట్లాడిన తరువాత శ్రీరామకృష్ణులు హాజ్రాతో ఇలా అన్నారు: “ఇలా చూడు, నిన్న రామ్ ఇంటికి విజయ్, కేదార్ మొదలైన వారెందరో వచ్చారు. కాని నరేంద్రుని చూసి నా కెందుకు అంతటి భావపారవశ్యం కలిగింది? కేదార్‌ను కారణానందపు భూమికి చెందినవాడిగా గాంచాను.”
నిన్నటి మహాష్టమి రోజున దుర్గాదేవి దివ్యమంగళ విగ్రహాన్ని దర్శింప శ్రీరామకృష్ణులు కలకత్తాకు వెళ్ళి ఉన్నారు. అధర్ ఇంట్లో దుర్గాదర్శనానికి మునుపు రామ్ ఇంటికి వెళ్ళారు. అక్కడ పలువురు భక్తులు హాజరై ఉన్నారు. నరేంద్రుణ్ణి చూడగానే శ్రీరామకృష్ణులు సమాధిమగ్నులైనారు. నరేంద్రుని మోకాలిపై ఒక కాలును ఆన్చి ఉంచి, నిలబడ్డ స్థితిలోనే సమాధి స్థితులైనారు.
ఇలా మాట్లాడుతూ ఉన్నప్పుడు నరేంద్రుడు వచ్చాడు; శ్రీరామకృష్ణులు పరమానందం పొందారు. నరేంద్రుడు ఆయనకు ప్రణామం చేసి, భవనాథ్ మొదలైనవారితో మాటల్లోపడ్డాడు. అతడి ప్రక్కన ‘మ’ ఉన్నాడు. గదిలో పొడవైన చాప పరిచి ఉంది. నరేంద్రుడు మాట్లాడుతూ చాప మీద బోర్లా పడుకున్నాడు. నరేంద్రుని చూస్తూ ఉన్న శ్రీరామకృష్ణులకు హఠాత్తుగా సమాధిస్థితి కలిగింది, ఆయన ఆ స్థితిలోనే వెళ్ళి నరేంద్రుని వీపు మీద కూర్చున్నారు. సమాధి మగ్నులయ్యారు.
భవనాథ్ పాడసాగాడు:
ఆనందమయి మాత వెనుకాడకే । నీ
నిర్భాగ్య శిశువునకు ఆనంద మీయగ…..
శ్రీరామకృష్ణులు బాహ్యస్పృహలోకి వచ్చి ఈ పాట పాడారు:
స్మరణ సేయవే మనసా!
భజన సేయవే మనసా!
దుర్గామాయీ పావన నామము…..
హాజ్రా ఈశాన్యపు వసారాలో కూర్చుని, చేత జపమాల పుచ్చుకుని జపం చేసుకుంటున్నాడు. శ్రీరామకృష్ణులు వచ్చి అతడి ప్రక్కన కూర్చుని, అతడి జపమాలను తన చేతిలోకి తీసుకున్నారు. ‘మ’, భవనాథ్ అక్కడే ఉన్నారు. అప్పుడు సమయం ఉదయం దాదాపు పది గంటలు.
శ్రీరామకృష్ణులు (హాజ్రాతో): ఇలా చూడు! నేను జపం చేయలేకున్నాను – ఆ, చేయగలనులే. ఎడమచేత్తో, కాని నామోచ్చారణ చేయలేకపోతున్నాను.
ఇలా అంటూ శ్రీరామకృష్ణులు జపం చేయ ప్రయత్నించారు. కానీ అలా ప్రయత్నించిన మరుక్షణంలోనే సమాధిమగ్నులైనారు. చాలాసేపు ఆ స్థితిలోనే ఉండిపోయారు. చేతిలో మాల వ్రేలాడుతూనే ఉంది. భక్తులు ఆ దృశ్యాన్ని అచ్చెరువుతో చూస్తూ ఉన్నారు. విస్మయంతో కళ్ళు విచ్చుకోగా, హాజ్రా తను కూర్చున్న చోటునుంచే శ్రీరామకృష్ణులను చూస్తూ ఉన్నాడు. చాలాసేపు గడిచాక ఆయనకు బాహ్యచైతన్యం కలిగింది. “నాకు ఆకలి వేస్తూన్నది” అన్నారు. పూర్తిగా బాహ్యచైతన్యంలోకి రావటానికి ఆయన సమాధిస్థితి తరువాత సామాన్యంగా ఇలా అనటం పరిపాటి.
‘మ’ ఆహారం తీసుకురావటానికి వెళ్లబోయాడు. వెంటనే శ్రీరామకృష్ణులు, “వద్దు నాయనా, ముందు కాళికాలయానికి వెళ్ళి వస్తాను” అన్నారు.
29.6.1 నవమి రోజు శ్రీరామకృష్ణుల కాళీపూజ
శ్రీరామకృష్ణులు విశాల ప్రాంగణం గుండా దక్షిణంగా కాళికాలయం వైపు నడవసాగారు. దారిలోని పన్నెండు శివాలయాలలో కొలువుదీరిన శివుణ్ణి స్మరిస్తూ ప్రణామాలు చేశారు. ఎడమ వైపున ఉన్న రాధాకాంత ఆలయానికి వెళ్ళి అక్కడి మూర్తికి ప్రణామం చేశారు. కాళికాలయానికి వెళ్ళి జగజ్జననికి ప్రణమిల్లి ఆసనంలో కూర్చున్నారు. పిదప ఆమె పాదపద్మాలకు కుసుమాలు సమర్పించారు. తమ తలపైనా పువ్వులు ఇడుకొన్నారు. తిరిగి వస్తూ ఉన్నప్పుడు భవనాథ్తో, “కొబ్బరి బొండాం ప్రసాదం, చరణామృతం పట్రా” అన్నారు. భవనాథ్, ‘మ’ వెంటరాగా శ్రీరామకృష్ణులు తమ గదికి తిరిగి వచ్చేశారు. రాగానే హాజ్రా ముందుకు వెళ్ళి నమస్కరించారు. హాజ్రా ఉలికిపడి, “ఏం చేస్తున్నారు! ఏం చేస్తున్నారు!” అంటూ కేకపెట్టాడు. అందుకు శ్రీరామకృష్ణులు, “ఇది తప్పెలా అవుతుంది? నువ్వే చెప్పు” అన్నారు.
‘భగవంతుడు అందరిలోనూ ఉన్నాడు. సాధనల ద్వారా ఎల్లరూ బ్రహ్మజ్ఞానం పొందగలరు’ అంటూ వాదిస్తుంటాడు హాజ్రా.
మిట్టమధ్యాహ్న నైవేద్యానికై హారతి గంటలు మ్రోగాయి. బ్రాహ్మణులు, వైష్ణవులు, బిచ్చగాళ్ళు అందరూ ధర్మశాలకు వెళుతున్నారు. జగజ్జనని ప్రసాదం, రాధాకాంతుని ప్రసాదం అందరికి పంచబడుతుంది. భక్తులకూ జగజ్జనని ప్రసాదం ఇస్తారు. ధర్మశాలలో బ్రాహ్మణ పనివాళ్ళు తినేచోట భక్తులు ప్రసాదం తింటారు. శ్రీరామకృష్ణులు భక్తులతో, “మీరు అక్కడకు వెళ్ళి ప్రసాదం తినండి. సరేనా?” అన్నారు. (నరేంద్రుని చూస్తూ) “నువ్వు వెళ్ళవద్దు. నువ్వు ఇక్కడే తింటావా? ఊ… నరేంద్రుడూ నేనూ ఇక్కడే తింటాం” అన్నారు.
భవనాథ్, బాబూరామ్, ‘మ’ మొదలైన భక్తులు ప్రసాదం ఆరగింప వెళ్ళారు.
మధ్యాహ్న భోజనానంతరం శ్రీరామకృష్ణులు కాసేపు విశ్రమించారు. భక్తులు వసారాలో కూర్చుని మాట్లాడుతున్నారు. శ్రీరామకృష్ణులు అక్కడకు వచ్చి కూర్చుని భక్తులతో ఆనందంగా మాట్లాడసాగారు. అప్పుడు సమయం రెండు గంటలు అయింది. అందరూ ఈశాన్య వసారాలో ఉన్నారు. భవనాథ్ బ్రహ్మచారి వేషంలో ఆగ్నేయ వసారాలో నుంచి హఠాత్తుగా వచ్చాడు. కాషాయవస్త్రం, చేత కమండలం, దరహాస వదనం. శ్రీరామకృష్ణులూ భక్తులూ నవ్వారు.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): అతడి మనోభావం ఇదే కదా! అందుకే ఈ వేషం వేసుకున్నాడు.
నరేంద్రుడు: అతడు బ్రహ్మచారిలా వేషం వేసుకున్నాడు; నేను వామాచారిలా వేషం కట్టనా? (నవ్వులు)
హాజ్రా: అలాగైతే నువ్వు పంచ మకారాలు, చక్రం మొదలైన సాధనలు అనుష్ఠించాలే!
వామాచారం గురించి వినగానే శ్రీరామకృష్ణులు మౌనం వహించారు. ఆ మాటలు పెడచెవిని పెట్టారు. హఠాత్తుగా ఉన్మాదిలా నృత్యం చేస్తూ పాడసాగారు:
‘నీ పాదకమలాలను దర్శించాను. నువ్వు నన్నింక మరపించలేవు….’
29.6.2 రాజ్నారాయణుని చండీ పారాయణం – నకుర్ ఆచార్యుని పాటలు
శ్రీరామకృష్ణులు: ఆహా! రాజ్‌నారాయణ్ ఎంత అద్భుతంగా దేవీమాహాత్మ్యం గానం చేస్తాడు! ఈ విధంగానే అతడు నృత్యం చేస్తూ పాడతాడు. కామార్పుకూర్కు చెందిన నకుర్ ఆచార్యుని పాట కూడా అద్భుతంగా ఉంటుంది! ఆహా! ఏం నాట్యం, ఏం పాట!
పంచవటిలో ఒక సాధువు బసచేసి ఉన్నాడు. అతడు ముక్కోపి. కనబడ్డ వారినందరినీ తిడతాడు, శపిస్తాడు. కాళ్ళకు పావుకోళ్లు ధరించి అక్కడకు వచ్చాడు. “ఇక్కడ నిప్పు దొరుకుతుందా?” అని అడిగాడు. శ్రీరామకృష్ణులు చేతులు జోడించి ఆ సాధువుకు నమస్కరించారు. ఆ సాధువు గదిలోనుంచి వెళ్ళిపోయే వరకు ముకుళిత హస్తాలతోనే నిలబడ్డారు. అతడు వెళ్ళిపోయాక భవనాథ్ నవ్వుతూ శ్రీరామకృష్ణులతో, “ఆ సాధువు పట్ల మీ కెంత భక్తి!” అన్నాడు.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): అతడు తమోగుణ నారాయణుడు! తమోగుణ వ్యక్తులను ఈ విధంగానే సంతుష్టులను చేయాలి. పైగా అతడు సాధువు కూడా!
29.6.3 గోలోకధామ ఆట – “గెలుపు ధార్మికునిదే”
భక్తులు గోలోకధామం* ఆట ఆడారు. హాజ్రా కూడా ఆటలో పాల్గొన్నాడు. శ్రీరామకృష్ణులు అక్కడకు వచ్చి నిలబడ్డారు. ‘మ’, కిశోరీల పావులు స్వర్గాన్ని చేరుకున్నాయి. శ్రీరామకృష్ణులు ఇద్దరికీ నమస్కరించారు. “మీ సోదరు లిద్దరు ధన్యులు” అన్నారు. మెల్లగా ‘మ’ తో, “ఇక ఆడవద్దు” అన్నారు. మళ్ళీ ఆటను చూడసాగారు. హాజ్రా పావు నరకంలో పడింది. “అరెరె! మళ్ళీ హాజ్రాకు ఏమైంది!” అన్నారు శ్రీరామకృష్ణులు. హాజ్రా పావు మరోసారి నరకంలో పడిపోయింది. అందరూ గొల్లున నవ్వారు.
లాటూ పావు సంసారం నుంచి విడివడి, ఒకేమారుగా ఏడవ మజిలీ అయిన ముక్తి స్థానం పొందింది. లాటూ ‘తైతై’ అంటూ గెంతులు వేశాడు. “లాటూ సంతోషాన్ని చూడు! ఇలా జరుగకుంటే అతడు దుఃఖంలో మునిగి ఉండేవాడు” అన్నారు శ్రీరామకృష్ణులు. పిదప భక్తుల కేసి తిరిగి, “దీనికీ అర్థం ఉంది. హాజ్రాకు దురహంకారం ఎక్కువ, దీన్లోనూ తానే గెలుస్తాననే గర్వం. భగవంతుని నియమం మేరకు ఇట్లా ముగిసింది. ధార్మికుణ్ణి ఆయన ఎన్నడూ, ఏ స్థితిలోనూ అవమానం పాలుచేయడు. అతడు అందరితోనూ గెలుస్తాడు” అన్నారు.
29.7 సప్తమ పరిచ్ఛేదం వామాచారం, స్త్రీలతో కలిసి చేసే తదితర సాధనల పట్ల విముఖత
శ్రీరామకృష్ణులు చిన్న మంచం మీద కూర్చుని ఉన్నారు. నరేంద్రుడు, భవనాథ్, బాబూరామ్, ‘మ’ మొదలైన వారు నేల మీద కూర్చుని ఉన్నారు. ఘోష్పారా, పంచనామి వంటి సంప్రదాయాల ప్రస్తావన తెచ్చాడు నరేంద్రుడు. శ్రీరామకృష్ణులు వాటిని గురించి వివరించి, వాటిని నిరసించారు. “వాళ్ళు సరైన మార్గంలో సాధనలు చేయటం లేదు. మతం పేరిట ఇంద్రియసుఖాలు అనుభవిస్తూ ఉన్నారు” అన్నారాయన.
29.7.1 కాశీలో భైరవీ చక్రం – శ్రీరామకృష్ణుల సంతానభావం
శ్రీరామకృష్ణులు (నరేంద్రునితో): వీటిని వినటంలో నీకేం ప్రయోజనం? భైరవి – భైరవ సంప్రదాయం సంగతీ ఇంతే. కాశీకి వెళ్ళి ఉన్నప్పుడు నన్ను భైరవీ చక్రానికి ఒక రోజు తోడ్కొని వెళ్ళారు. ఒకణ్ణి భైరవు డన్నారు, ఒకతెను భైరవి అన్నారు. నివేదించిన మద్యాన్ని త్రాగమని నాతో చెప్పారు. ‘అమ్మా, నేను మద్యాన్ని తాకను కూడా లేను’ అన్నాను నేను. అప్పుడు వాళ్ళు త్రాగడం మొదలుపెట్టారు. ఇక జపధ్యానాలు చేస్తారనుకున్నాను. కాని అలా ఏమి జరుగలేదు; పిదప నృత్యం చేయసాగారు. వాళ్ళు గంగలో ఎక్కడ పడిపోతారో అని నేను భయపడ్డాను: వాళ్ళు అలా వృత్తంగా గుమిగూడింది గంగానది తీరంలోనే. భార్యాభర్తలు భైరవీ – భైరవులుగా ఉంటే అది వారికి గౌరవాస్పదం.
(నరేంద్రాదులతో) “విషయం ఏమిటో తెలుసా? నాది మాతృభావం; సంతాన భావం. ఇది అతి పవిత్రమైనది. దీన్లో ఏ ప్రమాదమూ లేదు. సోదరి భావం కూడా తక్కువైనది ఏమీ కాదు. భార్యభావం – వీరభావం ఎంతో కఠినమైనది. తారక్ తండ్రి ఈ భావంలో సాధనలు చేశాడు. చాలా కఠినమైన మార్గం; ఈ భావంలో స్థిరంగా నెలకొని ఉండడం సాధ్యం కాదు.
“అనేక మార్గాలు ఉన్నాయి; అన్నీ భగవంతుని చేరటానికే! ఒక్కో మతం ఒక్కో మార్గం. ఉదాహరణకు కాళికాలయాన్ని విభిన్న మార్గాల ద్వారా చేరుకోవచ్చు. కొన్ని మార్గాలు పరిశుభ్రంగా ఉంటాయి, కొన్ని అపరిశుభ్రమైనవి. పరిశుభ్రమైన మార్గం గుండా పోవటం మంచిది.
“అనేక మతాలు, అనేక మార్గాలు; అన్నిటిని చూసేశాను. వాటిలో ఇప్పుడు నాకు ఆసక్తి లేదు. అన్నీ పరస్పరం కలహించుకుంటున్నాయి. ఇక్కడ ఎవరూ అన్యులు లేరు, మీరు నా సొంత మనుష్యులు. మీతో చెబుతున్నాను. నేను చివరగా తెలుసుకున్నది ఇదే: భగవంతుడు పూర్ణుడు, నేను ఆయన అంశం. ఆయన ప్రభువు, నేను ఆయన దాసుడను. మళ్ళీ, కొన్ని వేళల్లో ఆయనే నేను, నేనే ఆయన అనీ భావిస్తాను.” (BG 6.5, BG 9.4, BG 9.5)
భక్తులు నిశ్చలంగా కూర్చుని వింటున్నారు.
29.7.2 అందరినీ ప్రేమించ వలసిందే!
భవనాథ్ (వినమ్రంగా): ఎవరితోనైనా అపార్థాలు కలిగితే మనశ్శాంతి కోల్పోతున్నాను. ఆ స్థితిలో నేను అందరినీ ప్రేమించ లేకపోతున్నానే!
భవనాథ్
శ్రీరామకృష్ణులు: మొదట వారితో మాట్లాడి సుహృద్భావం నెలకొల్ప ప్రయత్నించు. అలా ప్రయత్నించాక కూడా సఫలం కాకుంటే దాన్ని గురించి చింతించకు. భగవంతుణ్ణి శరణు వేడుకో, ఆయన్ను ధ్యానించు; ఆయన తప్ప మరెవరి కోసమూ మనస్సు కలత చెందనవసరం లేదు.
భవనాథ్: ఏసుక్రీస్తు, చైతన్యాదుల వంటివారు అందరినీ ప్రేమించమని చెప్పి ఉన్నారు కదా!
శ్రీరామకృష్ణులు: సకల భూతాలలోనూ భగవంతుడు నెలకొని ఉన్నాడు, అందుకే అందరినీ ప్రేమించ వలసిందే. కాని దుష్టులకు దూరం నుంచే నమస్కరించు. చైతన్యులను గురించి చెప్పావు కదా! ఆయన కూడా తన మనో వైఖరికి సరిపడని వారిని చూస్తే తన ఆధ్యాత్మిక భావాలను నిరోధించుకునేవారు. శ్రీవాసుని ఇంట్లో చైతన్యులు, శ్రీవాసుని అత్తగారిని జుట్టు పట్టి వీథిలోకి గెంటడం కూడా జరిగింది.
భవనాథ్: కాని అలా గెంటివేసింది చైతన్యులు కాదు. ఎవరో వేరే వ్యక్తులు.
శ్రీరామకృష్ణులు: ఆయన ఆమోదం లేకుండా మరెవరైనా చేసి ఉంటారా? ఏం చేస్తాం? ఎవరో ఒకరి ప్రేమ తనకు లభించలేదన్న కారణాన రాత్రింబవళ్ళు దాన్ని గురించే చింతిస్తూ ఉండాలా ఏమిటి? భగవంతునికి అర్పించ వలసిన మనస్సును వ్యర్థ చింతనలలో ఖర్చు పెడతామా ఏమిటి? ‘అమ్మా, నాకు నరేంద్రుడు, భవనాథ్, రాఖాల్ వీరెవరూ అక్కర్లేదు. నాకు నువ్వే కావాలి’ అన్నాను నేను. మనుష్యులను ఉంచుకొని ఏం చేయాలి?
‘చండికాదేవి నా ఇంటికి అరుదెంచితే చండికాస్తవాలు వింటాను. అప్పుడు ఎంతమంది సాధువులు – జటాధారులు ఇక్కడకు వస్తారు’ అనే అర్థం వచ్చే పాటను శ్రీరామకృష్ణులు పాడారు.
“భగవంతుణ్ణి పొందితే అన్నిటినీ పొందగలం. ‘ధనమే మట్టి, మట్టే ధనం; బంగారమే మట్టి, మట్టే బంగారం’ అని భావించి అన్నిటినీ త్యజించాను; గంగలో పారేశాను. దానివల్ల ఒకవేళ మహాలక్ష్మికి కోపం వస్తుందేమో అని భయపడ్డాను. ఆమె సిరిని ధిక్కరించాను కదా, ఆమె నా భుక్తిని నిలిపివేస్తుందేమో అనే భావన నాలో మెదలింది. వెంటనే, ‘అమ్మా! నువ్వే కావాలి, మరేదీ వద్దు’ అని అన్నాను. ఆమెను పొందగలిగితే సమస్తాన్ని పొందవచ్చు.
భవనాథ్ (నవ్వుతూ): ఇది వ్యాపారస్థుని ధోరణి.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): అవును, నిజమే. ఒకప్పుడు ఒక సాధకుని ఎదుట భగవంతుడు సాక్షాత్కరించి, ‘నీ తపస్సుకు మెచ్చాను. ఒక వరం కోరుకో’ అన్నాడు. అందుకు సాధకుడు, ‘ఓ ప్రభూ! వరం ఇవ్వగోరితే, నేను నా మనుమడితో బంగారు కంచంలో భోజనం చేసేట్లు అనుగ్రహించు’ అని అడిగాడు. చూశావా, ఒకే వరంలో పలు వరాలు కోరుకున్నాడు! సంపద, సంతానం, మనుమలు అన్నీ అమరిపోయాయి. (అందరూ నవ్వారు)
29.8 అష్టమ పరిచ్ఛేదం భగవంతుని బాధ్యత – మాతృభక్తి
భక్తులు గదిలో ఉన్నారు. హాజ్రా వసారాలో కూర్చుని ఉన్నాడు.
శ్రీరామకృష్ణులు: హాజ్రాకు ఏం కావాలో తెలుసా? డబ్బు కావాలి, కుటుంబంలో ఇబ్బంది. కొంత అప్పు కూడా ఉంది. జపధ్యానాలు చేస్తున్నందున భగవంతుడు డబ్బు ఇస్తాడని అతడు అనుకుంటాడు.
ఒక భక్తుడు: భగవంతుడు మన కోర్కెలను నెరవేర్చడా?
శ్రీరామకృష్ణులు: అది ఆయన ఇచ్ఛ. కాని మరో విషయం; భక్తుడు ప్రేమోన్మాదుడు కానంత వరకు ఆయన, భక్తుడి భారాన్ని యావత్తూ తన మీద వేసుకోడు. చిన్నపిల్లలను చేతులు పుచ్చుకుని లాక్కువచ్చి భోజనాల పంక్తిలో తమ ప్రక్కన కూర్చో పెట్టుకుంటారు. పెద్దవాళ్ళను అలా ఎవరు పిలుచుకు వస్తారు? భగవచ్చింతనలో నిమగ్నమై తన భారాన్ని తాను వహించలేని స్థితిలో ఉన్న వ్యక్తి భారాన్ని భగవంతుడు వహిస్తాడు. (గీత, 9.22)
“హాజ్రా, తన కుటుంబం గురించి బొత్తిగా పట్టించుకోడు. అతడి కుమారుడు, రామ్‌లాల్‌తో, ‘నాన్నను ఇంటికి రమ్మని చెప్పండి, ఆయన్ను మేం ఏమీ అడగం’ అన్నాడు. ఇది విని నాకు కళ్ళనీళ్ళ పర్యంతమైంది. హాజ్రా తల్లి రామ్‌లాల్‌తో, ‘ప్రతాప్ (హాజ్రా)ను ఒకసారి ఇంటికి రమ్మని చెప్పు. వాణ్ణి ఇంటికి పంపించమని నీ చిన్నాన్నను నేను అడిగినట్లుగా చెప్పు’ అన్నది. ఆ సంగతి నేను హాజ్రాతో చెప్పాను. అయితే అతడు నా మాట పెడచెవిన పెట్టాడు.
“తల్లి అంటే సామాన్యమా? ఎన్నో విధాల తల్లికి నచ్చచెప్పిన తరువాతనే చైతన్యులు ఇంటిని వీడగలిగాడు. శచీదేవి, ‘కేశవ భారతిని నరికేస్తాను’ అంది. చైతన్యులు అనేక విధాల ఆమెకు నచ్చచెప్పాడు: ‘అమ్మా! నీ అనుమతి లేకుండా నేను పోను. కాని సంసారం చేయమని నన్ను బలవంతపెడితే మాత్రం ఈ దేహం నిలబడదు. అమ్మా! నువ్వు కోరినప్పుడల్లా నన్ను చూడవచ్చు. నేను సమీపంలోనే వసిస్తాను. మధ్యమధ్యలో వచ్చి నిన్ను చూసిపోతాను.’ ఆపైనే శచీదేవి అనుమతించింది.
“తల్లి జీవించి ఉన్నంత వరకు నారదుడు తపోమయ జీవితాన్ని ప్రారంభించలేదు. తల్లికి సేవ లొనరించాలి కదా! అందుకే ఆమె మరణానంతరమే ఆయన తపస్సు చేసుకోవటానికి వెళ్ళాడు.
“బృందావనం నుంచి తిరిగి రావటానికి నాకు ఎంతమాత్రమూ మనస్కరించలేదు. అక్కడే గంగామాయితో వసించేట్లు తీర్మానమైంది. అందుకైన ఏర్పాట్లు కూడా గావించబడ్డాయి – నా పడక ఎక్కడ, గంగామాయి పడక ఎక్కడ అన్నదీ నిర్ణయించబడింది. ‘ఇంకా ఎంతకాలం ఆ బెస్తవాళ్ళ* అన్నం తినటం’ అనుకున్నాను. ఇక కలకత్తాకు పోకూడదన్న తీర్మానానికి వచ్చేశాను. కానీ హృదయ్ ‘నువ్వు కలకత్తాకు రావాలి’ అన్నాడు. ఒకవైపు వాడు లాగుతూ ఉంటే మరో వైపు గంగామాయి లాగసాగింది. అక్కడే ఉండిపోవాలని నేను కోరుకున్నాను. ఆ సమయంలో నా తల్లి జ్ఞాపకానికి వచ్చింది. అంతే, అన్నీ మారిపోయాయి. ‘ఆమె వృద్ధురాలు. ఆమెను గురించే యోచిస్తూ ఉంటే దేవుడు – గీవుడు చింతనలన్నీ తలక్రిందులే. దాని కంటే ఆమె వద్దకు వెళ్ళటమే ఉత్తమం. అక్కడకు వెళ్ళి ప్రశాంతచిత్తంతో భగవచ్చింతన చేసుకోవచ్చు’ అని నిర్ణయించుకున్నాను.
(నరేంద్రునితో) “నువ్వు హాజ్రాకు కాస్త నచ్చ చెప్పరాదా? నాతో ఆ రోజు, ‘నేను ఊరికి పోతాను, మూడు రోజులు ఉండి వస్తాను’ అన్నాడు. అయితే, మళ్ళీ పాతకథే మొదలుపెట్టాడు.
29.8.1 భక్తులతో సంకీర్తన, నృత్యం
(భక్తులతో) “ఈ రోజు ఘోష్పారా గీష్పారా అంటూ ఎన్నో పనికిమాలిన విషయాలు మాట్లాడుకున్నాం! గోవిందా, గోవిందా, గోవిందా! ఇక కాస్త హరినామ సంకీర్తన చేద్దాం. పప్పు గిప్పు తిన్న తరువాత కొంచెం పాయసం రావాలి.”
నరేంద్రుడు పాడాడు:
పరిశుద్ధాత్ముడు పురాణపురుషుడుకారణ
కారణు డనాది నిత్యుడు
నరుడా నీ మది నాతని యందు
చేర్చి గట్టిగా బిగియగట్టుము ॥ ప ॥
ప్రాణరూపుడై చెలగి సర్వమున
అనంత విశ్వము నావరించును
శ్రద్ధామయుడు సందర్శించును
సజీవదీప్తుని సర్వకారణుని ॥ ప ॥
ప్రేమ జ్ఞాన పవిత్రాలంకృతుడై
చేతన ఘనితా సదా వెల్గును
విషయ వర్జమౌ హృదయ కుహరమున
ముక్తుడగుచు నరుడాతని ధ్యానమున ॥ ప ॥
సదా శాంతమగు వదనాకృతి గల
అపార సద్గుణ పారావారుని
లోతులెరుగ లేరెవరే గాని
ఐనను దయచే ఆతడు తెలుపును ॥ ప ॥
అతని పాదముల నాశ్రయమొంది
దరిని చేరిన నరుల కాతడు
నిరాటంకముగ నిండు కరుణచే
తననే తాను తెలియపరచును ॥ ప ॥
సదా తప్పులను మరచెడువాడు
ఆనందంబును పంచెడువాడు
దుఃఖాంబుధిలో సిద్ధసహాయుడు
నిస్సహాయులకు కరుణ చూపును ॥ ప ॥
తిరుగులేని తన న్యాయము చూపుచు
మంచి చెడుగులగు ఫలములె యొసగును
మన మొనరించెడు మంచి చెడుగులకు
ఐన నాతడు కరుణ వాహినియె ॥ ప ॥
ప్రేమ పొరలెడు కరుణాసింధువు
అతని ఘనతను వినిన చాలును
అశ్రుపూరితము లగును నేత్రములు
ముఖ వీక్షణచే ధన్యత గల్గును ॥ ప ॥
నీ హృదయ మతనికై ఆర్తి చెందినది
అద్వితీయము అతినిర్మలము
కాంతివంతము అతని అందము
వర్ణనంబునకు వాక్కునకందదు ॥ ప ॥
బిచ్చగాడవై అతని గడపలో
బిచ్చము కొరకై కాచియుండుము
అర్చన చేయుచు దివారాత్రములు
యాచన చేయుము కరుణ భిక్షను ॥ ప ॥
* * *
విజ్ఞాన గగనమున
ప్రేమ చంద్రుడు పూర్ణ
బింబమున ఉదయించెను…..
శ్రీరామకృష్ణులు పాడారు, నృత్యం చేశారు, చుట్టూ తిరుగుతూ నృత్యం చేశారు. భక్తులూ పాడుతూ ఆయనతో నృత్యం చేశారు. వర్ణనాతీతమైన ఆనందం. పాట పూర్తికాగానే శ్రీరామకృష్ణులు పాడసాగారు:
అదిగో! అల్లదిగో, అమ్మదిగో, చూడదిగో
పారవశ్యమున ఒడలు మరచి తా……
‘మ’ కూడా జతకలిపి పాడటం చూసి శ్రీరామకృష్ణులు ఎంతో ఆనందించారు. పాట ముగిసింది. శ్రీరామకృష్ణులు నవ్వుతూ ‘మ’ తో, “మృదంగమూ ఉండి ఉంటే బాగా రక్తికట్టి ఉండేది – తక్ తక్ తా ధిన్; తక్ తక్ తా ధిన్ అని చెప్పి వాయించాలి” అన్నారు.
కీర్తనలు పూర్తయ్యేప్పటికి మునిమాపు వేళ అయింది.
29.9 నవమ పరిచ్ఛేదం అధర్ ఇంట్లో భక్తులతో
బుధవారం, అక్టోబర్ 1, 1884
నేడు ఏకాదశి. శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వరం నుంచి అధర్ ఇంటికి వెళుతున్నారు. నారాయణ్, గంగాధర్ ఆయన వెంట ఉన్నారు. దారిలో శ్రీరామకృష్ణులకు హఠాత్తుగా భావపారవశ్య స్థితి కలిగింది. ఆ స్థితిలో, “నేను జపమాల పుచ్చుకుని జపం చేయటమా? థూ థూ! ఈ శివలింగం పాతాళాన్ని చీల్చుకొని వచ్చింది, స్వయంభూలింగం” అన్నారు.
అధర్ ఇంటికి వచ్చారు. అప్పటికే అక్కడ పలువురు భక్తులు సమావేశమై ఉన్నారు. కేదార్, విజయ్, బాబూరామ్ మొదలైన వారు వచ్చి ఉన్నారు. గాయకుడైన వైష్ణవచరణ్ కూడా వచ్చి ఉన్నాడు. శ్రీరామకృష్ణుల ఆదేశానుసారం, అధర్ ప్రతినిత్యం తన ఆఫీసు నుంచి తిరిగి రాగానే వైష్ణవచరణ్ను పాడమని, కీర్తనలు వింటాడు. వైష్ణవచరణ్ పాటలు ఎంతో శ్రావ్యంగా ఉంటాయి. నేడు కూడా అతడు పాడనున్నాడు.
శ్రీరామకృష్ణులు, అధర్ ఇంట్లోని అతిథుల గదిలోకి వచ్చారు. భక్తులు లేచి నిలబడి ఆయన పాదపద్మాలకు ప్రణమిల్లారు. ఆయన దరహాసవదనులై ఒప్పారుతున్నారు. ఆయన కూర్చోగానే భక్తులూ కూర్చున్నారు.
కేదార్, విజయ్‌లు శ్రీరామకృష్ణులకు ప్రణామం చేశాక ఆయన నారాయణ్‌ను బాబూరామ్ను పిలిచి వారిద్దరికీ ప్రణామం చేయమన్నారు. “భక్తి కలిగేట్లు వీరిని ఆశీర్వదించండి” అని ఆయన కేదార్ విజయ్‌లతో చెప్పారు. నారాయణ్‌ను చూపుతూ, “ఇతడు కల్లాకపటం లేనివాడు” అన్నారు. భక్తులు బాబూరామ్, నారాయణ్‌ల వంక తదేకంగా చూస్తూ ఉన్నారు.
శ్రీరామకృష్ణులు (కేదార్ ప్రభృతులతో): మిమ్మల్ని త్రోవలో చూడటం మంచిదైంది. లేకుంటే మీరు కాళికాలయానికి వెళ్లుండేవారు. భగవదేచ్ఛ మూలంగా మిమ్మల్ని కలుసుకోవటం జరిగింది.
కేదార్ (చేతులు జోడించుకుని వినమ్రంగా): భగవంతుని ఇచ్ఛ – అది మీ ఇచ్ఛ.
శ్రీరామకృష్ణులు నవ్వారు.
సంకీర్తన ప్రారంభమైంది. వైష్ణవచరణ్, రాధాకృష్ణుల గురించిన కీర్తనలు పాడాడు. చివరగా, రాసలీల గీతాలతో గానం పరిసమాప్తమయింది.
రాధాకృష్ణుల సంయోగ గీతాలతో సంకీర్తన పూర్తి అవుతున్నప్పుడు శ్రీరామకృష్ణులు ప్రేమోన్మాదంతో నృత్యం చేయసాగారు. భక్తులూ పాడుతూ ఆయన్ను చుట్టివస్తూ నృత్యం చేయసాగారు. సంకీర్తనం పూర్తికాగానే అందరూ కూర్చున్నారు.
శ్రీరామకృష్ణులు (వైష్ణవ చరణ్‌ను చూపుతూ, విజయ్‌తో): ఇతడు చక్కగా పాడుతున్నాడు!
పిదప, ‘మేలు బంగరు కాంతి’ అనే పాట పాడమన్నారు.
వైష్ణవచరణ్ పాడాడు.
పాట పూర్తికాగానే శ్రీరామకృష్ణులు విజయ్‌తో, “ఎలా ఉంది?” అని అడిగారు. విజయ్, “అద్భుతం” అని బదులు చెప్పారు. శ్రీరామకృష్ణులు చైతన్యుల భావనలో మునిగి పాడారు. ‘మ’ ఆయనతో జత కలిపి పాడాడు. పాట పూర్తికాగానే వైష్ణవచరణ్ మరొక పాట ప్రారంభించాడు:
పాడవే! ఓ వీణా! ప్రభు నామ గానము
శ్రీహరి నామ గానము
హరి చరణ కృపలేక
పరతత్వ మగుపడదు ॥ పా ॥
అవగతము కాదసలు
హరిభజన దుఃఖహరము
పలికించు హరి భజన
పలికించు కృష్ణభజన ॥ పా ॥
హరి దయ నా మీద
బరపిన భయపడను
ఒకమారు హరిభజన
గావింపుమొ వీణ ॥ పా ॥
ఈ మణులు దిగదుడుపు
హరినామ మణి ముందు
వ్యర్థముగ కాలము
గడచెనని గోవింద ॥ పా ॥
వగచి దుఃఖాబ్ధినిక
పయనించనని పలికె
గతిలేని మార్గముల
పయనించనని పలికె ॥ పా ॥
శ్రీరామకృష్ణులు గాయకులవలె పాటతోపాటు రాగాన్నీ ఆలాపన చేశారు. వైష్ణవచరణ్తోను అట్లే గాయకుల్లా ఆలాపనతో పాడమన్నారు.
శ్రీరామకృష్ణులు అతడితో కలిసి చివరి నాలుగు చరణాలు మళ్లీ మళ్లీ పాడారు.
29.10 దశమ పరిచ్ఛేదం సాకార, నిరాకారాలు – చక్కెర గుట్ట, చీమ
కేదార్, మరికొందరు భక్తులు ఇళ్ళకు తిరిగి వెళ్ళటానికి లేచారు. శ్రీరామకృష్ణులకు ప్రణమిల్లి కేదార్, “స్వామీ, ఇక సెలవు పుచ్చుకుంటాను” అన్నాడు.
శ్రీరామకృష్ణులు: అధర్కి చెప్పకుండా వెళ్ళిపోతావా? అది అమర్యాద కాదా?
కేదార్: ‘తస్మిన్ తుష్టే జగత్ తుష్టమ్’.* మీరు ఇక్కడ ఉన్నారు, అది మేమంతా ఉన్నందుకు సమానం. నాకు ఒంట్లో నలతగా ఉంది. సామాజిక కట్టుబాట్లకు భయపడవలసి వస్తోంది. ఇంతకు మునుపే ఇటువంటి సమస్యలో చిక్కుకున్నాను.*
విజయ్ (శ్రీరామకృష్ణులను చూపుతూ): వీరిని వదలిపెట్టిపోవటమా?
అప్పుడు శ్రీరామకృష్ణులను భోజనానికి తోడ్కొనిపోవటానికి అధర్ వచ్చాడు. లోపల విస్తళ్ళు వేశారు. శ్రీరామకృష్ణులు లేచారు. విజయ్, కేదార్లను చూస్తూ “నాతో రండి” అన్నారు. విజయ్, కేదార్, తక్కిన భక్తులు శ్రీరామకృష్ణులతో పాటు కూర్చుని ప్రసాదం ఆరగించారు.
భోజనానంతరం శ్రీరామకృష్ణులు మళ్ళీ అతిథుల గదిలోకి వచ్చి కూర్చున్నారు. విజయ్, తక్కిన భక్తులు ఆయన చుట్టూ కూర్చున్నారు.
కేదార్ చేతులు జోడించుకుని వినమ్రంగా శ్రీరామకృష్ణులతో, “భోజనం చేయటానికి సంకోచించి నందుకు నన్ను క్షమించండి” అన్నారు.
‘శ్రీరామకృష్ణులే భోజనం చేసినప్పుడు నేను ఏపాటివాణ్ణి?’ అని కేదార్ అనుకున్నాడు కాబోలు.
కేదార్ ఢాకాలో పనిచేస్తున్నాడు. అక్కడ పలువురు భక్తులు అతడి వద్దకు వస్తారు. సందేష్ వంటి పలురకాల తీపిపదార్థాలను అతడి కోసం తీసుకువస్తారు. ఆ సంగతులన్నీ అతడు శ్రీరామకృష్ణులకు చెప్పాడు.
కేదార్ (నమ్రతతో): అనేకులు నాకు ఆహారం సమర్పింప ముందుకు వస్తున్నారు. ఈ విషయమై ఏం చెయ్యాలో మీరు ఆజ్ఞాపించండి.
శ్రీరామకృష్ణులు: భక్తుడైన పక్షంలో అతడు చండాలుడై ఉన్నప్పటికీ అతడు సమర్పించే ఆహారం తినవచ్చు. ఏడు సంవత్సరాల కాలం పాటు భగవదున్మాదస్థితి తరువాత నేను కామార్పుకూర్కు వెళ్ళాను. అప్పుడు ఏ ఏ స్థితులను గడపవలసి వచ్చిందో! ఒక వెలయాలు కూడా నాకు ఆహారం సమర్పించింది. కాని ఇప్పుడు అది సాధ్యం కాదు.
కేదార్ సెలవు పుచ్చుకొనే ముందు మెల్లని స్వరంలో, “స్వామీ! నాకు శక్తిని ప్రసారం చేయండి. చాలామంది నా వద్దకు వస్తూ ఉన్నారు, నాకు ఏం తెలుసు!” అన్నాడు.
శ్రీరామకృష్ణులు: అంతా సరి అవుతుంది. భగవంతుని పట్ల యథార్థమైన భక్తి కలిగితే అంతా సరి అవుతుంది.
కేదార్ వెళ్ళబోయే ముందు వంగవాసి పత్రిక సంపాదకుడు యోగేంద్ర వచ్చాడు; శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి కూర్చున్నాడు. సాకార, నిరాకారాల గురించిన ప్రస్తావన వచ్చింది.
శ్రీరామకృష్ణులు: భగవంతుడు సాకారుడు, నిరాకారుడు; ఇంకా ఎన్నో! అవి మనకు తెలియవు. ఆయన నిరాకారుడని మాత్రమే చెప్పటం ఎలా పొసగుతుంది?
యోగేంద్ర: బ్రహ్మసమాజంలోని అద్భుతం అదే! పన్నెండేళ్ళ బాలుడూ నిరాకార బ్రహ్మాన్ని గాంచుతాడట! ఆది బ్రహ్మసమాజంలో సాకారోపాసనకు అంత అభ్యంతరం లేదు. వాళ్ళు భక్తుల ఇళ్ళలో జరిగే పూజలలో పాల్గోవచ్చు.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): ఇతడు చక్కగా చెబుతున్నాడు – కుర్రవాడూ నిరాకారాన్ని గాంచుతాడట!
అధర్: శివనాథ్ బాబు సాకారాన్ని అంగీకరించడు.
విజయ్: అది అతడి అజ్ఞానజనిత దోషం. ఈయన చెబుతూ ఉన్నట్లు ఊసరవెల్లి కొన్ని వేళల్లో ఈ రంగులో ఉంటుంది, మరికొన్ని వేళల్లో మరో రంగును సంతరించుకుంటుంది; చెట్టు క్రింద వసించే వ్యక్తే దాన్ని సరిగ్గా అవగతం చేసుకోగలడు. కిత్తనారబట్టపై చిత్రించినట్లు ఎందరో దేవీ దేవతలను ధ్యాన సమయంలో కాంచాను. వాళ్ళు ఏమేమో మాట్లాడారు. శ్రీరామకృష్ణుల వద్దకు వెళితే ఆయన నాకు సకలం వివరిస్తారు అని నాకు నేను చెప్పుకున్నాను.
శ్రీరామకృష్ణులు: నువ్వు చూసింది యథార్థమే!
కేదార్: భక్తుల కోసమే భగవంతుడు రూపం ధరిస్తున్నాడు. భక్తుడు ప్రేమపారవశ్యంలో భగవంతుని సాకారమూర్తిగా దర్శిస్తాడు. ధ్రువుని ఎదుట మహావిష్ణువు సాక్షాత్కరించినప్పుడు అతడు ఆయనతో, ‘ప్రభో! మీ కుండలాలు ఎందుకు కదలటం లేదు?’ అని అడిగాడు. అందుకు ఆయన ‘నువ్వు కదిలిస్తే కదులుతాయి’ అని జవాబిచ్చాడు.
శ్రీరామకృష్ణులు: అన్నిటిని ఒప్పుకోవలసిందే – సాకారం, నిరాకారం అన్నిటిని కూడా. కాళికాలయంలో ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు రమణి అనే వెలయాలిని చూశాను; ‘అమ్మా, నువ్వు ఈ రూపాన్నీ ధరించావా!’ అని అన్నాను. అందుకే, అన్నిటిని ఒప్పుకోవలసిందే అంటాను. భగవంతుడు ఎప్పుడు ఏ రూపంలో దర్శనం ఇస్తాడో, మన ఎదుటకు వస్తాడో చెప్పలేం.
ఇలా అంటూ శ్రీరామకృష్ణులు ‘భావోన్మత్తుడైన ఫకీ రొకడు వచ్చెనోయీ…..’ అంటూ పాడారు.
విజయ్: భగవంతుడు అనంతశక్తి స్వరూపుడు. ఆయన తనకు ఇష్టం వచ్చిన రూపంలో దర్శనం ఇవ్వలేడా ఏమిటి? మనిషి ధూళిలోని ఒక్క రేణువు లాంటివాడు మాత్రమే! భగవంతుని గురించి తీర్మానింప అతడు సాహసిస్తున్నాడు. ఔరా! ఏం విడ్డూరం!
శ్రీరామకృష్ణులు: ఏదో కాస్త భగవద్గీత, భాగవతం, వేదాంతం పఠించి, తాను సమస్తం తెలుసుకొన్నాననుకొంటాడు మనిషి. ఒక చీమ చక్కెర గుట్ట వద్దకు వెళ్ళింది. ఒక కణం తినగానే దాని కడుపు నిండిపోయింది. మరొక కణాన్ని నోట కరచుకొని తన పుట్టకేసి బయలుదేరింది. దారిలో, ‘ఈసారి వచ్చి ఈ మొత్తం గుట్టను పట్టుకుపోతా’ ననుకొంది! (అందరూ నవ్వారు).