23.1 ప్రథమ పరిచ్ఛేదం
ఆదివారం, జూన్ 15, 1884
శ్రీరామకృష్ణులు ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో సురేంద్రుని ఉద్యాన గృహానికి అరుదెంచారు. భక్తుల మధ్యలో ఆనందమే మూర్తీభవించినట్లు ఆయన కానవచ్చారు.
సురేంద్రుని ఉద్యానగృహం కలకత్తా ప్రక్కనున్న కాంకుర్గాఛి గ్రామంలో ఉంది. దానికి సమీపాన రాంబాబు తోట ఉంది. దాదాపు ఆరు నెలల క్రితం శ్రీరామకృష్ణులు ఆ తోటను పావనం చేయడం జరిగింది. నేడు సురేంద్రుని ఉద్యానగృహంలో ఉత్సవం.
ఉదయానే సంకీర్తనం ఆరంభమైంది. గాయకులు శ్రీకృష్ణుని బృందావన లీలలను, గోపికల ప్రేమ, కృష్ణుని వియోగంతో రాధ అనుభవించిన విరహవేదన మొదలైన వాటి గురించి పాడారు. శ్రీరామకృష్ణులు తరచూ భావపారవశ్యం చెందుతున్నారు. గది నిండా భక్తులు గుమిగూడి ఉన్నారు.
నేలమీద జంపఖానా పరిచి అక్కడక్కడ దిండ్లు అమర్చి ఉన్నారు. ఆ పెద్దగది ప్రక్కన తూర్పున, పశ్చిమాన రెండు గదులు, ఉత్తరాన, దక్షిణాన వసారాలు ఉన్నాయి. ఇంటి కెదురుగా, అంటే దక్షిణ దిశలో మెట్లుగల అందమైన కొలను ఒకటి ఉంది. ఇంటికి, కొలనుకు మధ్య తూర్పు పడమరలుగా బాట వెళుతోంది. బాట రెండు వైపులా పువ్వుల మొక్కలు, క్రోటన్లు పెరిగి ఉన్నాయి. ఇంటి తూర్పు చివర నుంచి ఉత్తరాన ఉన్న ద్వారం వరకు మరొక బాట వెళుతోంది. ఆ బాట ఎర్రనిరాళ్లతో అమరి ఉంది. బాట ఇరువైపుల పలురకాల పువ్వుల చెట్లు, క్రోటన్లు బారులుతీరి ఉన్నవి. ద్వారం వద్ద, ఈ బాటకు ఉత్తరాన, మెట్లున్న మరొక కొలను ఉంది. గ్రామస్థులు ఈ కొలనులో స్నానం చేసి, త్రాగటానికి నీళ్లు పట్టుకుపోతారు. ఇంటికి పడమరగా ఒక బాట వెళుతోంది. దాని నైరుతి ప్రాంతంలో వంట గది ఉంది. అక్కడ ఒకటే కోలాహలం, శ్రీరామకృష్ణులకు, భక్తులకు పెద్ద విందు సిద్ధమవుతోంది. సురేంద్రుడు, రాంబాబు అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు.
ఇంటి వసారాలలో భక్తులు గుమిగూడి ఉన్నారు. ఒంటరిగా కొందరు, మిత్రులతో కొందరు కొలను తీరంలో పచార్లు చేస్తున్నారు. మరికొందరు కొలను మెట్ల మీద కూర్చుని విశ్రాంతి తీసుకుంటున్నారు.
గదిలో కీర్తన జరుగుతోంది. అక్కడ భక్తులు ఎక్కువ సంఖ్యలో గుమిగూడి ఉన్నారు. భవనాథ్, నిరంజన్, రాఖాల్, సురేంద్రుడు, రామ్, ‘మ’, మహిమాచరణ్, మణిమల్లిక్, పలువురు బ్రహ్మసమాజ భక్తులు వచ్చి ఉన్నారు.
మొదట గాయకుడు చైతన్యులను గురించి పాడాడు; చైతన్యులు సన్న్యాసం పుచ్చుకున్నారు, కృష్ణప్రేమలో పిచ్చివాడైపోయాడు, అతణ్ణి చూడలేక నవద్వీప భక్తులు వ్యాకులతతో విలపిస్తున్నారు – దీనినే గాయకుడు పాడాడు.
ఓ గౌరాంగా! ఒకమారు నదియాకు తిరిగి రా!
తరువాత కృష్ణ వియోగంలోని రాధ విరహ వేదన గురించి పాడాడు.
శ్రీరామకృష్ణులు భావపారవశ్యం చెందారు. హఠాత్తుగా లేచి నిలబడి, గాద్గదిక స్వరంలో ఈ భావం వచ్చేలా కొన్ని చరణాలు జోడించారు – ‘చెలులారా, నా ప్రాణవల్లభుణ్ణి నా వద్దకు తీసుకురండి; లేకుంటే నన్నే అతని కడకు కొనిపొండి.’
శ్రీరామకృష్ణులు రాధాభావంలో మగ్నులైనారు; శరీరం నిశ్చలమైంది, అర్ధనిమీలిత నేత్రులై ఉన్నారు. బాహ్యస్మృతిని పూర్తిగా కోల్పోయారు – సమాధిస్థితి!
చాలసేపయ్యాక బాహ్యస్మృతిలోకి వచ్చారు. మళ్లీ అదే హృదయం ద్రవించే స్వరంలో, “చెలీ! ఆతడి వద్దకు నన్ను తోడ్కొని పో, బదులుగా నన్ను నీ బానిసగా చేసుకో! నువ్వే కదా నాకు కృష్ణ ప్రేమను నేర్పింది? ఓ కృష్ణా! నా ప్రాణవల్లభా!” అని అన్నారు.
గాయకులు పాటలను కొనసాగిస్తూనే ఉన్నారు –
నెచ్చెలిని గాంచి రాధ అన్నది: ‘చెలీ! నీరు తేవటానికి నేను యమునకు పోను, కదంబ వృక్షం క్రింద కదా నేను నా ప్రియుణ్ణి చూసింది. అక్కడకు వెళితేనే మైమరచిపోతాను.’
శ్రీరామకృష్ణులు మళ్లీ భావపారవశ్యం చెందారు. గాఢంగా నిట్టూర్చి, “ఆహా! ఆహా!” అన్నారు. పాట కొనసాగింది. రాధ అన్నది:
ఒడ లెందుకో జ్వరంలా వెచ్చగనున్నది
పొందగలనా నా ప్రేమ కృష్ణుని నేను
వింతను నే నేమనగలను ఆతడి స్మృతే
శీతల వాయువులా ఒంటి మంటను చల్లార్చినదే
మధ్యమధ్యలో కొన్ని చరణాలు జోడించబడ్డాయి –
నాకొక మారు చూపవా నా కృష్ణుని
నేను నీ దాన్నే అయిపోతాను
ఆభరణానికి ఆభరణమైన ఆతణ్ణి కోల్పోతినే
ఇక ఈ ఆభరణంతో ప్రయోజన మేమి?
నా మంచిరోజులు పోయి కష్టకాలం దాపురించినదో
కష్టకాలం కాస్త జాప్యంగా రాకూడదా?
శ్రీరామకృష్ణులు, “ఆ రోజు ఇంకా రాలేదా?” అన్న చరణం చేర్చారు, పిదప గాయకులు కొన్ని చరణాలు చేర్చారు –
సుదీర్ఘ కాలం గడచిపోయెనో
ఆ రోజు ఇంకా అరుదెంచలేదా?
పిదప పాట కొనసాగింది.
ఓ సఖీ! మరణము చెందుచుంటి
తథ్యము మరణము తప్పదు నాకు
కృష్ణవిరహము దుస్సహమైనది
ఎవరికిత్తు నా అమూల్య సంపద?॥ ఓ ॥
వేడెద మిమ్ము నే మరణించగా
కాల్చవద్దు నా కళేబరంబును
వేయకుండుడు నదిలో దానిని
మంటల నాహుతిచేయకు డమ్మ॥ ఓ ॥
పారవేయకండు నీరము నందున
ఈ తనువుననే నా ప్రియకృష్ణుని
తోడగూడి నేనాడిపాడితిని॥ ఓ ॥
ఈ మృతిజెందిన కళేబరంబును
నీలితమాల తరు శాఖలకు
కట్టివేయుడని గట్టిగవేడెద
తాకి తమాలము, తగులు నీలమది॥ ఓ ॥
కృష్ణుడు నీలి, తమాలము నీలము
నీలవర్ణమునె శైశవమాదిగ
నే వరియించితి ప్రేమించితిని
చెందు నీ దేహము నీ కృష్ణునకు
నీలికి వేరుగ దాని నుంచకుడు॥ ఓ ॥
భరించలేని స్థితిని చేరుకున్న రాధ స్పృహతప్పి పడిపోయింది.
రాధా! రాధా! రాధా! రాధా!
రాధ నేలపై కొరిగిపోయినది
స్మృతి పూర్తిగా కోలుపోయినది
విలువలేని తన కృష్ణనామమును
సంస్మరించుచు కనులు మూసినది
అయ్యో రాధా! రాధా! రాధా!
అకటా నాటకమంతమైనదా?
బాధ ఏమిటే ఓ కృష్ణప్రియ?
క్షణముకు ముందే మాటలాడితివి॥ అయ్యో ॥
స్మృతిని తెచ్చుటకు యత్నము చేయుచు
తాపము బాపెడిచల్లని గంధము
రాధ మేనునకు రాచిరి చెలులు॥ అయ్యో ॥
ఏడ్చుచుండిరి వలవల కొందరు
ఆమె మరణమును సహింపజాలక
చల్లిరి నీరు ముఖమున కొందరు
ఇస్సీ! ఇచ్చునే నీరు ప్రాణము
కృష్ణ ప్రేమకై బాసిన ప్రాణికి॥ రాధా ॥
రాధ చెవులలో చెలులు కృష్ణుని నామాన్ని ఉచ్చరించారు. కృష్ణ నామాన్ని విని రాధ స్పృహలోకి వచ్చింది. ఎదుట ఉన్న తమాల వృక్షాన్ని చూడగానే కృష్ణుడే తన ఎదుటకు వచ్చాడని భావించింది.
కృష్ణనామమున కనులు విప్పినది
తెప్పరిల్లి మరి తేరిచూచినది
కృష్ణ ముఖమును గాంచకుండుటచే
అకటా! ఎంతో విలపించినది
ఎవరి పేరు నా చెవిన పల్కితిరో
ఏడే కృష్ణుడు? ఎక్కడుండెనే?
ఒక్కసారి నా ముందుకాతని
చేకొని రారే చెంతకిప్పుడే?
నీలి తమాల తరువాలోకించుచు
భోరుభోరున ఏడువసాగె
‘అదిగో పింఛము! బాగుగ చూచితి’
రాధా! రాధా! ఎంత బేలవే
ఆమె చూచినది నెమలి మాత్రమే
దాని బర్హమును తూలియాడు తన
కృష్ణ పింఛముగ పొరపడిపోయెను
చేడియలారా! చూడరె మీరు
అదిగో రాధ కృష్ణుచెంతనే
ఒరిగిపోయినది కృష్ణుని ఎదపై
ఎడమ ప్రక్కగా నిలచె చూడుడు
నీలితమాల తనువుకు చుట్టును
అల్లుకొనిన బంగారు వల్లరిగ ।
చెలులు సత్వరం యోచించి ఒక గోపికను మథురకు దూతగా పంపించారు. ఆమె మథురకు వెళ్లి అక్కడ వసిస్తూ ఉన్న తన ఈడుదైన ఒక స్త్రీని పరిచయం చేసుకున్నది; ‘నేను వెళ్లి కృష్ణుని పిలువ నక్కరలేదు. ఆతడు తనకు తానే వస్తాడు’ అని చెప్పింది. అయినప్పటికీ మనస్సు నిలువక ఆ మథుర వాసి స్త్రీతో కృష్ణుని వెదక్కుంటూ పోయింది. వీథుల వెంట వెళుతూ ఉన్నప్పుడే దుఃఖం ఆపుకోలేక విలపిస్తూనే కృష్ణుని ప్రార్థించసాగింది: ‘నా హరి ఎందున్నాడు? గోపికల ప్రాణమా! ప్రాణవల్లభా! రాధావల్లభా! భక్తుల లజ్జను తొలగించే హరీ! ఒకమారు దర్శనం ఇవ్వు. నీ అంతట నువ్వే వస్తావని గర్వంతో చెప్పానే!’ మథురవాసి స్త్రీ కోపం పట్టలేకపోయింది. ఆమె ఇలా అంది:
మథుర లోపలి మగువయిట్టుల
మాటలాడెను నిందజేయుచు
చల్లనమ్మే గొల్లదాన ।
చింకిపుట్టమూ గట్టుదాన ।
చూడగలవే ప్రభుని కృష్ణుని
ఎటుల చూతువె వెర్రిదానా?
ఎక్కడో వెనకాల యేడు తలుపులు దాటి
అతని అంతఃపురము అలరారుచున్నది
ఏలాగు లోనికి ఏగగల వీవు?
పోలేవు లోనికి పోలేవు నీవు
సిగ్గుపడుచున్నాము నీ తెగువ చూచి
ఏ యుక్తితో లోన చేరుదువొ చెప్పవే!
పిలచెను గోపీ, “ప్రియతమ కృష్ణా”
గోపీజీవన యెందుంటివిరా?
నా దరిజేరి నను కాపాడర
గోపీరమణా! ఎందుంటివిరా?
మథురానాథా! మరి రారా దరి
పరమవ్యాకులము పడు చెలి ప్రాణము
కాపాడగ నా కడకు చేరరా!
రాధారమణా! ఎందుంటివిరా?
ప్రాణసఖా! మా ప్రియరమణా
ఓ హరి మా అభిమానహరా ।
మా గోపీహృది కమూల్యనిధివి
వేగమె నా దరి చేరగరారా!
కాపాడర నీ చెలి మర్యాద!
‘గోపీ రమణా! ఎందుంటివిరా?’ అన్న చరణాన్ని వినగానే శ్రీరామకృష్ణులు సమాధిమగ్నులైనారు. సంకీర్తన ముగిసే తరుణం. గాయకులు బిగ్గరగా పాడసాగారు. సమాధిమగ్నులైన శ్రీరామకృష్ణులు లేచి నిలబడ్డారు. ఒకింత బాహ్యస్మృతి రాగానే అస్పష్టంగా, “కిష్ట, కిష్ట!” (కృష్ణ, కృష్ణ) అని అన్నారు. ఆయన భావపారవశ్య స్థితిలో ఉండటం చేత నామాన్ని స్పష్టంగా ఉచ్చరించలేకపోయారు.
రాధాకృష్ణుల సమాగమం జరిగింది. గాయకులు దాని గురించి పాడసాగారు. శ్రీరామకృష్ణులు కొన్ని చరణాలు జోడించారు –
చేడియలారా! చూడరె మీరు
అదిగో రాధ కృష్ణు చెంతనే
ఒరిగిపోయినది కృష్ణుని యెదపై
ఎడమ ప్రక్కగా నిలచె చూడుడు
నీలితమాల తరువుకు చుట్టును
అల్లుకొనిన బంగారు వల్లరిగ
పిదప ‘రాధే గోవింద జై’ అంటూ నామసంకీర్తనం కొనసాగింది. మద్దెల, తాళం మ్రోగాయి. భక్తులు ఉన్మత్తులే అయ్యారు.
శ్రీరామకృష్ణులు నాట్యం చేయసాగారు. ‘రాధే గోవింద జై, రాధే గోవింద జై’ అంటూ బృందగానం చేస్తూ భక్తులు ఆయన చుట్టూ తిరుగుతూ నాట్యం చేశారు.
23.2 ద్వితీయ పరిచ్ఛేదం సరళ స్వభావంతోనే భగవత్ప్రాప్తి – భగవత్సేవ, ప్రాపంచిక సేవ
సంకీర్తన ముగిసింది. శ్రీరామకృష్ణులు భక్తులతో క్రింద కూర్చున్నారు. అప్పుడు నిరంజన్ వచ్చి ఆయనకు సాష్టాంగ ప్రణామం చేశాడు. అతణ్ణి చూడగానే శ్రీరామకృష్ణులు లేచి నిలబడ్డారు. ఆనందం తొణికిసలాడే దృక్కులతో, దరహాస వదనంతో అతణ్ణి చూసి, “ఓ! నుమ్వా వచ్చావా?” అన్నారు. (‘మ’ తో) “ఇదుగో చూడు, ఈ యువకుడు సరళ (నిష్కపట) స్వభావం కలవాడు. గత జన్మలలో అనేక తపస్సులు చేయనిదే సరళ స్వభావం రాదు. కాపట్యం, వంచన ఉంటే భగవంతుని పొందలేం. కల్లాకపటం లేని చోటనే భగవంతుడు అవతరిస్తాడు. చూడు, దశరథుడు, నందగోపుడు కల్లాకపటం ఎరుగనైనా ఎరుగరు. ‘ఆహా, నందగోపునిలా ఎంత నిరాడంబరుడు!’ అనే లోకోక్తి కూడా ఉన్నది కదా” అన్నారు.
భక్తులు నిరాడంబరులు. భగవంతుడు మళ్లీ అవతరించాడని శ్రీరామకృష్ణులు సూచిస్తూ ఉన్నారా?
శ్రీరామకృష్ణులు (నిరంజన్‌తో): ఇదుగో చూడు, ఏదో నల్లని తెర ఒకటి నీ ముఖాన్ని మూసి ఉన్నట్లుగా నాకు తోస్తోంది. నువ్వు ఆఫీసులో ఉద్యోగం చేయటమే దానికి కారణమని భావిస్తాను. అక్కడ జమాఖర్చులు చూసుకోవాలి, ఇంకా పలురకాల పనులు చేస్తూండాలి. ఎప్పుడు చూసినా ఆ ఆఫీసు వ్యవహారాల గురించిన చింతనే ఉంటుంది.
“భార్యాబిడ్డల కోసం పనిచేసే వారిలా నుమ్వా పని చేస్తున్నావు; కాని కాస్త వ్యత్యాసం ఉంది. నువ్వు నీ తల్లి నిమిత్తం ఉద్యోగం చేస్తున్నావు.
“తల్లి పూజనీయురాలు, బ్రహ్మమయ స్వరూపిణి. నువ్వు భార్యాబిడ్డలకై పనిలో చేరి ఉంటే నిన్ను నేను ఛీ, ఛీ! అని ఏవగించుకుని ఉండేవాణ్ణి. నూరుసార్లు ఛీఛీ! వేయిసార్లు ఛీఛీ! (మణిమల్లిక్తో) ఇదుగో చూడు, ఈ యువకుడు బొత్తిగా కల్లాకపటం లేనివాడు. కాని కొన్ని రోజులుగా ఒకటి రెండు అబద్ధాలు చెబుతున్నాడు, ఇదే అతడి లోపం. ఆ రోజు ‘మళ్లీ వస్తాను’ అని చెప్పి వెళ్ళాడు, కాని రాలేదు. (నిరంజన్‌తో) ‘నువ్వు ప్రక్కనే ఉన్న అరియదాహాకు వచ్చీ ఇక్కడకు వచ్చి చూడలేదే?’ అని రాఖాల్ అడగటానికి అదే కారణం.
నిరంజన్: నేను అరియదాహాలో రెండు రోజులే బస చేశాను.
శ్రీరామకృష్ణులు (నిరంజన్‌తో, ‘మ’ ను చూపుతూ): ఇతడు హెడ్మాష్టరు. నిన్ను చూడమని ఇతణ్ణి పంపించి ఉన్నాను. (‘మ’ తో) నాడు నువ్వు బాబూరామ్ను నా వద్దకు పంపించావా?
23.3 తృతీయ పరిచ్ఛేదం శ్రీరాధాకృష్ణులు – గోపికల ప్రేమ
పిదప శ్రీరామకృష్ణులు పశ్చిమంగా ఉన్న గదిలోకి వెళ్లి ఒకరిద్దరు భక్తులతో మాట్లాడసాగారు. అక్కడ కొన్ని బల్లలు, కుర్చీలు ఉన్నాయి. ఆయన బల్లపై చేతులు ఆనించి ఒరిగి నిలబడ్డారు.
శ్రీరామకృష్ణులు (‘మ’ తో): ఆహా! గోపికలకు ఎంతటి ప్రేమ! తమాల వృక్షాన్ని చూడగానే ప్రేమోన్మత్తులైపోయారు. విరహ తాపంతో కలిగిన వ్యాకులతతో రాధ కంట తడారిపోయింది. కన్నీరు ధారలు కట్ట అది ఆవిరిగా మారిపోతూనే ఉన్నది. కొన్ని సమయాల్లో ఆమె గాఢ పారవశ్యతను ఎవరూ తెలుసుకోనూ లేకపోయారు. బాగా లోతుగల కొలనులో ఏనుగు మునిగితే అది జనం దృష్టిలో పడదు. (BG 2.70)
‘మ’ : అవునండీ. చైతన్యులకూ ఇటువంటి స్థితి ఏర్పడింది. ఆయన వనాన్ని చూసి బృందావనంగా పొరబడ్డాడు, సముద్రాన్ని చూసి యమునగా భావించారు.
శ్రీరామకృష్ణులు: ఆహా! ఆ ప్రేమ సాగరంలో ఒక బొట్టు లభిస్తే చాలు! ఎంతటి ప్రేమ! ఎటువంటి అనురాగం! అది నూటికి నూరు పాళ్ళ ప్రేమ కాదు, నూటికి నూటపాతిక పాళ్ళ ప్రేమ. అదే ప్రేమోన్మాదం. విషయం ఏమిటంటే భగవంతుని ప్రేమించాలి, ఆయనకై వ్యాకులత చెందాలి. ఏ మార్గంలో పయనించినా సరే – సాకారంలో విశ్వాసం ఉన్నా సరే, నిరాకారంలో విశ్వాసం ఉన్నా సరే; భగవంతుడు మానవరూపంలో అవతరించాడని విశ్వసించినా సరే, లేకున్నా సరే – ఆయన పట్ల ప్రేమ జనిస్తే చాలు. అప్పుడు తాను ఎవరు అన్న విషయం భగవంతుడు స్వయంగా తానే బోధపరుస్తాడు. పిచ్చివాడివి కావాలంటే సంసార విషయాల నిమిత్తం ఎందుకు కావాలి? ఆ భగవంతుడి కోసమే పిచ్చివాడివవు.
23.4 చతుర్థ పరిచ్ఛేదం భవనాథ్, మహిమాచరణ్ ప్రభృతులతో
శ్రీరామకృష్ణులు మళ్ళీ వసారాలోకి వచ్చారు. ఆయన ఆసనానికి ప్రక్కన ఒక దిండు ఉంచారు. ఆయన కూర్చునేటప్పుడు ‘ఓం తత్సత్’ అని ఉచ్చరిస్తూ ఆ దిండును తాకారు. సంసారంలో ఉన్నవారు ఆ ఉద్యానగృహానికి రావటం కద్దు; వారు వాటిని ఉపయోగించి ఉంటారు; కనుకనే మంత్రం జపించి దాన్ని పవిత్రం చేసుకున్నారు కాబోలు. భవనాథ్, ‘మ’ మొదలైనవారు ప్రక్కన కూర్చుని ఉన్నారు. చాలాసేపు అయినప్పటికీ భోజనాలు సిద్ధం కాలేదు. శ్రీరామకృష్ణులది పసిపిల్లవాని మనస్తత్వం. సహనం కోల్పోయి, “ఏమోయ్, ఏదీ ఇస్తున్నట్లు కనబడటం లేదే! నరేంద్రు డెక్కడ?” అని అడిగారు.
ఒక భక్తుడు (శ్రీరామకృష్ణులను చూసి, నవ్వుతూ): మహాశయా, రాంబాబే ఇక్కడ పెత్తనం. ఏర్పాట్లనీ ఆయనే చూస్తున్నాడు. (అందరూ నవ్వారు)
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): రామ్దా పెత్తనం? అలాగైతే మనం తిన్నట్లే!
ఒక భక్తుడు (నవ్వుతూ): రాంబాబు పెత్తనం వహిస్తేనే ఇలా అవుతుంది. (అందరూ నవ్వారు)
శ్రీరామకృష్ణులు (భక్తులతో): సురేంద్రు డెక్కడ? ఆహా, సురేంద్రుని స్వభావం ఎంత మంచిది! ఉన్నదున్నట్లు మాట్లాడతాడు; ఎవరికీ భయపడడు. అతడు ఉదారమనస్కుడు. సహాయం కోసం అతడి వద్దకు వెళ్లేవాళ్లు ఎవరూ రిక్తహస్తాలతో తిరిగిరారు. (‘మ’ తో) నువ్వు భగవాన్ దాస్ వద్దకు వెళ్లి ఉన్నావు కదా, అతడెలాంటి వాడు?
‘మ’ : కాల్నాకు వెళ్లి చూశాను, ఆయన వయోవృద్ధుడైనాడు. ఆయనను రాత్రిపూటే చూశాను, చిరిగిన గుడ్డ మీద పరుండి ఉన్నాడు. ఎవరో ఒకరు ప్రసాదం తెచ్చి ఆయన చేత తినిపించారు. బిగ్గరగా మాట్లాడితేనే ఆయనకు వినబడుతుంది. మీ పేరు వినగానే, ‘మీకు ఇక చింత ఎందుకు?’ అని అన్నారు. ఆ ఇంట్లో నామబ్రహ్మోపాసన జరుగుతూ వస్తోంది.
భవనాథ్ (‘మ’ తో): మీరు చాలా రోజులుగా దక్షిణేశ్వరానికి రాలేదు. ఈయన (శ్రీరామకృష్ణులు) మిమ్మల్ని గురించి నన్ను, ‘ఏమిటి, ‘మ’ కు ఈ చోటుపట్ల అభిరుచి పోయిందా?’ అని అడిగారు.
ఇలా అంటూ భవనాథ్ నవ్వసాగాడు. శ్రీరామకృష్ణులు ఇద్దరి సంభాషణా వింటూ ఉన్నారు. తరువాత ‘మ’ ను ఆప్యాయంగా చూస్తూ, “అవునూ, చాలా రోజులుగా అక్కడకు రాలేదు, కారణం ఏమిటి?” అని అడిగారు.
‘మ’ జవాబు చెప్పటానికి తడబడ్డాడు. ఆ సమయంలో మహిమాచరణ్ వచ్చాడు. అతడు కాశీపూర్‌లో వసిస్తున్నాడు. శ్రీరామకృష్ణుల పట్ల అమిత భక్తి ప్రపత్తులు గలవాడు, దక్షిణేశ్వరానికి తరచూ వస్తూ ఉంటాడు. బ్రాహ్మణుడు; పెద్దలు సంపాదించి పెట్టిన ఆస్తి కొంత ఉంది. స్వతంత్రంగా జీవిస్తున్నాడు. చేతులు కట్టుకుని ఎవరి వద్దా ఉద్యోగం చేయలేదు! శాస్త్రాధ్యయనంలోను, భగవత్ చింతనలోను సదా కాలం గడుపుతూ ఉంటాడు. అతడికి కొంత పాండిత్యం ఉంది. ఆంగ్లంలోను, సంస్కృతంలోను అనేక గ్రంథాలు చదివి ఉన్నాడు.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ, మహిమాచరణ్తో): ఇదేమిటి! ఇక్కడి కొక ఓడ వచ్చేసిందే! (అందరూ నవ్వారు) మహా అయితే ఇక్కడకు ఏవో చిన్న పడవలు మాత్రమే వస్తాయి, కాని ఏకంగా ఓడ వచ్చేసింది. (అందరూనవ్వారు) కాని ఒక సంగతి – ఇది ఆషాఢ మాసం, వానాకాలం కదా! (అందరూ నవ్వారు)
మహిమాచరణ్తో అనేక విషయాలు మాట్లాడారు.
శ్రీరామకృష్ణులు (మహిమాచరణ్తో): అది సరే, జనులకు అన్నదానం చేయటం ఒక రకంగా భగవత్సేవే కదా, నీ అభిప్రాయం ఏమిటి? సకల ప్రాణులలో ఆయన అగ్నిరూపంలో వెలసి ఉన్నాడు. జనులకు అన్నదానం చేయటం భగవంతునికి ఆహుతి ఇవ్వటమే అవుతుంది.
“అలా అని దుష్టులకు భోజనం పెట్టరాదు. వ్యభిచారం వంటి మహాపాతకాలకు పాల్పడినవారు, తీవ్రమైన విషయాసక్తులు – ఇటువంటి వారు కూర్చుని భోజనం చేసిన చోటు ఏడు మూరల లోతు వరకు అపవిత్రమైపోతుంది.
“ఒకసారి హృదయ్, సిహోర్‌లో పలువురికి భోజనం పెట్టాడు. వారిలో అధిక సంఖ్యాకులు దుష్టులు. నేను అతడితో, ‘హృదూ, ఇదుగో చూడు. నువ్వు వీరికి భోజనం పెడితే నేను నీ ఇంట్లో నుంచి వెళ్లిపోతాను’ అని చెప్పాను. (మహిమాచరణ్తో) నువ్వు మునుపు తరచూ అన్నదానం చేస్తూ వచ్చినట్లు విని ఉన్నాను. ఇప్పుడేమిటి ఖర్చు ఎక్కువయిందా?” (అందరూ నవ్వారు)
23.5 పంచమ పరిచ్ఛేదం బ్రహ్మసమాజ భక్తులతో
దక్షిణ వసారాలో ఆకులు వేశారు. శ్రీరామకృష్ణులు మహిమాచరణ్తో, “అక్కడ వాళ్లు ఏం చేస్తున్నారో కాస్త మీరు వెళ్లి చూసి రండి. ఇకపోతే, నేను మీకు చెప్పజాలను; మీరూ కాస్త వడ్డించవచ్చునే” అన్నారు. అందుకు మహిమాచరణ్, “వాళ్లు తీసుకురానివ్వండి, పిదప చూద్దాం” అని చెప్పి ‘హూం’ అంటూ వంటశాల వైపు వెళ్లాడు. కాసేపట్లోనే తిరిగి వచ్చేశాడు.
శ్రీరామకృష్ణులు ఎంతో ఆనందంగా భక్తులతో భోజనానికి కూర్చున్నారు.
భోజనం కాగానే, గదికి తిరిగి వచ్చి కాసేపు విశ్రమించారు. భక్తులూ కొలను దక్షిణంవైపు మెట్లు దిగి చేతులు కడుగుకున్నారు. పిదప తాంబూలాలు వేసుకొని శ్రీరామకృష్ణుల వద్ద కూర్చున్నారు. రెండు గంటలప్పుడు ప్రతాప్ వచ్చాడు. అతడొక బ్రహ్మసమాజ భక్తుడు. రాగానే శ్రీరామకృష్ణులకు ప్రణామం చేశాడు. ఆయన తలవంచి నమస్కరించారు. ఇద్దరూ మాటల్లో పడ్డారు.
ప్రతాప్: నేను డార్జిలింగ్ కొండలకు గాలి మార్పు కోసం వెళ్లి ఉన్నాను.
శ్రీరామకృష్ణులు: అక్కడకు వెళ్లినా నీ ఆరోగ్యం పెద్దగా మెరుగైనట్లు కనబడటం లేదే, ఎందుకు?
కేశవ్ ప్రస్తావన వచ్చింది.
ప్రతాప్: కేశవ్‌కు చిన్నతనంలోనే వైరాగ్యం కలిగింది. అతడు ఆటలాడి, వేడుకలలో పాల్గోటం సామాన్యంగా ఎవరూ చూసి ఉండరు. హిందూ కళాశాలలో చదువుతూన్నప్పుడు సత్యేంద్రుడితో అతడికి మంచి స్నేహం ఉండేది. తద్ద్వారా ఆతడి తండ్రి దేవేంద్రనాథ్ టాగూర్‌తో పరిచయం కలిగింది. కేశవ్‌లో భక్తి, యోగం రెండూ ఉన్నాయి. కొన్ని సమయాలలో అతడు భక్తి కారణంగా మూర్ఛనొందేవాడు. గృహస్థులలో ధార్మికతను ప్రచారం చేయటమే అతడి జీవిత లక్ష్యం.
23.5.1 ‘నేను’ ‘నేను’ తోనే కష్టాలు – భగవద్దర్శనానికి లక్షణాలు
తరువాత ఒక మహారాష్ట్ర మహిళను గురించి ప్రస్తావన వచ్చింది.
ప్రతాప్: ఆ ప్రాంతానికి చెందిన కొందరు స్త్రీలు ఇంగ్లండుకు వెళ్లి ఉన్నారు. బాగా చదువుకున్న మహారాష్ట్ర స్త్రీ ఒకామె విదేశాలకు వెళ్లింది. తరువాత ఆమె క్రైస్తవ మతం పుచ్చుకుంది. మహాశయా, ఆమె పేరు విని ఉన్నారా?
శ్రీరామకృష్ణులు: లేదు, కాని నీ మాటలను బట్టి ఆమెకు పేరుప్రతిష్ఠలపై మోజు ఉందని తోస్తోంది. ఇటువంటి అహంకారం మంచిది కాదు. ‘నేను కర్తను’ అనటం అజ్ఞాన జనితం. ‘భగవాన్, నువ్వే కర్తవు’ అనటం జ్ఞానం. భగవంతుడే కర్త, తక్కిన వారందరూ అకర్తలే.
“ ‘నేను! నేను!’ అనటం వల్ల ఏర్పడే కష్టాలు ఆవుదూడ స్థితిని చూసి తెలుసుకోవచ్చు. దూడ, ‘హమ్మా, హమ్మా’ (నేను, నేను) అంటూ అరుస్తుంది. దాని కష్టాలను చూడు. ఎండ అయినా, వాన అయినా ఉదయం నుంచి సాయంత్రం వరకు కాడి లాగాలి. ఒకవేళ కసాయివాని చేతుల్లో నరకబడనూ వచ్చు. దాని మాంసాన్ని మనుష్యులు తింటారు. తోలును శుభ్రం చేస్తారు. ఆ తోలు నుంచి చెప్పులు మొదలైనవి తయారవుతాయి. జనం వాటిని కాళ్లకు వేసుకొని నడుస్తారు. దీనితో దాని కష్టం తీరటం లేదు. తోలుతో తబలా చేస్తారు. దానిమీద కర్రతో కొడతారు. చివరకు దాని నరాలనూ విడిచిపెట్టక నారిగా చేస్తారు. దాన్ని దూది ఏకే విల్లుకు కట్టి, దూదిని ఏకినప్పుడు ‘తుహు, తుహు’ (నువ్వు, నువ్వు) అంటుంది. ఆ తరువాత ‘నేను, నేను’ అని పలకదు. ‘నువ్వు, నువ్వు’ అన్న పిదపే దాని దుఃఖం తొలగిపోతుంది. అప్పుడే ముక్తి. ఆ తరువాత కర్మభూమికి రానవసరం లేదు.
“మనుష్యులూ, ‘భగవాన్, నేను కర్తను కాను, నువ్వే. నేను యంత్రాన్ని, నువ్వు దాన్ని నడిపేవాడవు’ అని చెబితే ఆ తరువాత వారి సంసార కష్టాలు తొలగిపోతాయి. అప్పుడు వారికి ముక్తి లభిస్తుంది. ఆ తరువాత వాళ్లు ఈ కర్మభూమికి రానవసరం లేదు.”
ఒక భక్తుడు: జీవుని అహంకారం ఎలా నశిస్తుంది?
శ్రీరామకృష్ణులు: భగవద్దర్శనం కానంత వరకు అహంకారం నశించదు. ఎవరికైనా అహంకారం నశించిపోయినట్లయితే, నిశ్చయంగా అతడికి భగవద్దర్శనం కలిగి ఉంటుంది.
ఒక భక్తుడు: స్వామీ, ఒకరికి భగవద్దర్శనం లభించిందని ఎలా తెలుసుకోవటం?
శ్రీరామకృష్ణులు: భగవద్దర్శనానికి కొన్ని లక్షణాలున్నాయి. భగవద్దర్శనం పొందిన వ్యక్తిలో నాలుగు లక్షణాలు ఉంటాయని శ్రీమద్భాగవతం చెబుతోంది – అతడు 1. పిల్లవానివలె, 2. పిశాచిలా, 3. జడునిలా, 4. పిచ్చివానిలా ఉంటాడు.
“భగవంతుని దర్శించిన వ్యక్తి నైజం పిల్లవానివలె మారిపోతుంది. అతడు త్రిగుణాతీతుడు, అతడికి ఏ గుణం పట్లా అనురక్తి ఉండదు. శుచి, అశుచులు రెండూ అతడికి సమానమే – అందుకే పిశాచిలా ఉంటాడు. ఇక, పిచ్చివానిలా కొన్ని సమయాల్లో నవ్వుతాడు, కొన్ని సమయాల్లో ఏడుస్తాడు. ఇప్పుడు సంపన్నుడిలా దుస్తులు ధరించి ఉంటాడు, మరుక్షణమే దిగంబరంగా తిరుగుతాడు. పంచెను చంకలో అదిమి పెట్టుకుని ఉంటాడు. అందుకే పిచ్చివానిలా ఉంటాడు, కొన్ని సమయాల్లో జడునిలా మౌనంగా కూర్చుని ఉంటాడు.
ఒక భక్తుడు: భగవద్దర్శనానంతరం అహంకారం అడుగంటా నశించి పోతుందా?
శ్రీరామకృష్ణులు: కొన్ని సమయాల్లో భగవంతుడు అతడి అహంకారాన్ని అడుగంటా నశింపచేస్తాడు – సమాధి స్థితిలో మాదిరి. కాని సామాన్యంగా జాడ మాత్రంగా అహంకారాన్ని వదలి ఉంచుతాడు. కాని ఈ అహంకారం వలన ఏ హానీ జరుగదు. ఇది పిల్లవాని అహంకారం వంటిది. ఐదేళ్ల పిల్లవాడు, ‘నేను, నేను’ అంటాడు. కాని ఎవరికీ హాని కలిగించటం పిల్లవాడికి తెలియదు.
“పరుసవేది తాకితే ఇనుము బంగారంగా మారిపోతుంది. ఇనుపకత్తి బంగారు కత్తిగా మారిపోతుంది. కత్తివంటి రూపం ఉంటుంది; కాని ఎవరికీ దాని మూలంగా హాని వాటిల్లదు. బంగారు కత్తితో నరకడానికి, పొడవటానికి సాధ్యం కాదు. (ప్రతాప్‌తో) నువ్వు విదేశాలకు వెళ్లి ఉన్నావు కదా, అక్కడ ఏం చూశావు? అన్నీ చెప్పు.”
23.6 షష్ఠ పరిచ్ఛేదం విదేశాలలో విషయాసక్తి – జీవితోద్దేశం ఏమిటి?
ప్రతాప్: మీరు కాంచనం అంటూ ఉన్నారే, దాన్నే ఇంగ్లండు దేశస్థులు పూజిస్తున్నారు. కాని మంచివారు, అనాసక్తులు నిశ్చయంగా ఉండనే ఉంటున్నారు. అయినప్పటికీ సామాన్యంగా, ఆది మొదలు అంతం వరకు అంతా రజోగుణ క్రీడయే, అమెరికాలోనూ దీన్నే చూశాను.
23.6.1 విదేశీయుల కర్మ యోగం – కలియుగంలో భక్తి యోగమే శ్రేష్ఠం
శ్రీరామకృష్ణులు (ప్రతాప్‌తో): లౌకిక విషయానురక్తి విదేశాలలో (ఇంగ్లండు) మాత్రమే ఉన్నదనలేం, సర్వత్రా ఉండనే ఉంది. కాని సంగతి ఏమిటో తెలుసా? కర్మకాండను ఆదికాండ అంటారు. సత్త్వగుణం (భక్తి, వివేకం, వైరాగ్యం, దయ మొదలైనవి) లేకుండా భగవంతుణ్ణి పొందలేవు. రజోగుణంతో కర్మకలాపాల పటాటోపం జనిస్తుంది. రజోగుణంతో తమోగుణం చేరుకుంటుంది. అనేక పనులలో మునిగి ఉన్నప్పుడది భగవంతుని మరచిపోయేట్లు చేస్తుంది; అందుచేత కామినీకాంచనాల పట్ల అనురక్తి అధికరిస్తుంది.
“కాని సంపూర్ణ కర్మత్యాగం చేయలేం. నీ అభీష్టం ఉన్నా, లేకున్నా నీ స్వభావమే నిన్ను కర్మలను నిర్వర్తింప చేస్తుంది. అందుచేతనే నిర్లిప్తతతో కర్మలు నిర్వర్తించమని చెబుతారు. నిర్లిప్తతతో కర్మను నిర్వర్తించటమంటే, ఫలాపేక్ష లేకుండా చేయటమే. ఉదాహరణకు, పూజ, జపం, తపస్సు అన్నీ చేస్తున్నావనుకో; పలువురు మనల్ని ప్రశంసిస్తారనో, పుణ్యం గడించటానికో వాటిని చేయకూడదు.
“ఈ రీతిలో అనాసక్తతతో పనిచేయటమే కర్మయోగం. ఇది చాలా కష్టమైనది. ఇది కలియుగం, స్వభావసిద్ధంగానే ఫలాపేక్ష వచ్చివేస్తుంది. నిష్కామకర్మను చేస్తూ ఉన్నామనే అనుకుంటాం. కాని ఎక్కడ నుంచో ఫలాపేక్ష వచ్చేస్తుంది; అది ఎక్కడ నుంచి వచ్చిందో మనలను తెలుసుకోనివ్వదు కూడా. పూజలు, ఉత్సవాలు జరిపిస్తూ ఉంటాం, అనేకమంది పేదలకు అన్నదానం చేస్తూ ఉంటాం – అన్నిటిని ఫలాపేక్ష లేకుండా చేస్తున్నామనే భావించుకుంటాం. కాని నలుగురు దాన్ని ప్రశంసించాలనే భావం వచ్చేస్తుంది. ఎక్కడ నుంచి వచ్చిందో మనకు తెలియను కూడా తెలియదు. కాని పూర్తిగా ఫలాపేక్ష లేకుండా ఉండటమన్నది భగవద్దర్శనం అయిన వ్యక్తికే సాధ్యం.”
ఒక భక్తుడు: భగవంతుని దర్శనం కానివారికి మార్గాంతరం ఏమిటి? వారు లౌకిక కర్మలను పూర్తిగా వదలివెయ్యాలా?
శ్రీరామకృష్ణులు: కలియుగానికి తగిన మార్గం భక్తియోగమే; నారదుని భక్తిమార్గం. భగవంతుని నామ మహిమలను కీర్తించటం, ‘ఓ భగవాన్, నాకు జ్ఞానం ప్రసాదించు, భక్తిని ప్రసాదించు, నీ దర్శనం ఇవ్వు’ అని వ్యాకుల చిత్తంతో ప్రార్థించటం. కర్మయోగం ఎంతో కష్టం. కనుకనే భగవంతుణ్ణి ఇలా ప్రార్థించాలి: ‘ఓ భగవంతుడా! నా కర్మలు తగ్గించు. నా కోసం వేటిని కేటాయించావో, వాటిని నీ దయ వలన నేను అనురక్తి లేకుండా నిర్వర్తించేట్లు అనుగ్రహించు. అధికంగా పనులలో చిక్కుకోవాలనే ఇచ్ఛ నాకు రానివ్వకు’ అని ప్రార్థించు.
“కర్మత్యాగం చేయటం సాధ్యం కాదు. ‘నేను ఆలోచిస్తున్నాను, నేను ధ్యానం చేస్తూ ఉన్నాను’ – ఇవి కూడా కర్మలే. భక్తి జనిస్తే ఐహిక కర్మలు వాటంతట అవే తగ్గిపోతాయి; అప్పుడు అవి మనకు రుచించవు కూడా. కలకండ పానకం లభిస్తే బెల్లం పానకాన్ని ఎవరు కోరతారు?
ఒక భక్తుడు: ఆంగ్లేయులు సదా కర్మ చేయమనే ప్రబోధిస్తారు. అలా అయితే కర్మలు చేయటం జీవిత లక్ష్యం కాదా?
శ్రీరామకృష్ణులు: జీవిత లక్ష్యం భగవత్సాక్షాత్కారమే. కర్మ తొలిమెట్టు మాత్రమే. అది జీవిత లక్ష్యం కాబోదు. నిష్కామకర్మ ఒక మార్గమే కాని లక్ష్యం కాదు.
“శంభుమల్లిక్ ఒకసారి నాతో ఇలా అన్నాడు: ‘నా వద్దనున్న ధనాన్నంతా ఆసుపత్రులు నిర్మించటం, డిస్పెన్సరీలు కట్టించటం, బాటలు వేయటం, బావులు త్రవ్వటం మొదలైన పనులలో సద్వినియోగపరచేట్లు నన్ను ఆశీర్వదించండి.’ అందుకు నేను ఇలా అన్నాను: ‘వీటిని ఫలాపేక్ష లేకుండా చేస్తే మంచిది. కాని అది ఎంతో కష్టం. ఏది ఏమైనా నువ్వు మనిషిగా జన్మనెత్తిన లక్ష్యం భగవత్సాక్షాత్కారమే: అంతే కాని ఆసుపత్రులు, డిస్పెన్సరీలు నిర్మించటం కాదు అన్న విషయం సదా మనస్సులో జ్ఞప్తి పెట్టుకో. భగవంతుడు నీ ఎదుట ప్రత్యక్షమై, ఒక వరం కోరుకోమంటే, అప్పుడు ‘ఓ – భగవంతుడా, నాకు ఆసుపత్రులు, డిస్పెన్సరీలు కట్టించి ఇవ్వ’ మని కోరుకుంటావా? లేక ‘ఓ భగవంతుడా, నాకు నీ పాదపద్మాలపట్ల శుద్ధభక్తిని ప్రసాదించు, సదా నీ దర్శనం నాకు లభించేట్లు అనుగ్రహించు’ అని కోరుకొంటావా? ఆసుపత్రులు, డిస్పెన్సరీలు – ఇవన్నీ అశాశ్వతాలు. భగవంతు డొక్కడే యథార్థ వస్తువు; తక్కినవన్నీ అస్తిత్వం లేనివి. ఆయనను సాక్షాత్కరించుకుంటే ఆయనే కర్త, మనం అకర్తలం అన్న భావన కలుగుతుంది. అటువంటప్పుడు ఆయనను విడనాడి పలు కర్మలలో చిక్కువడి ఎందుకు ఈ క్షోభ ననుభవించటం? ఆయనను పొందితే ఆయన కృపాకటాక్షంతో అనేక ఆసుపత్రులు, డిస్పెన్సరీలు ఏర్పడతాయి. అందుకే కర్మ అనేది తొలిమెట్టు మాత్రమే అని చెబుతున్నాను. కర్మ చేయటం జీవిత లక్ష్యం కాబోదు. సాధనలు అనుష్ఠించి పురోగమించండి. సాధనలు అనుష్ఠించి మరింతగా పురోగమిస్తే చివరకు భగవంతుడే యథార్థ వస్తువు, తక్కినవన్నీ అస్తిత్వం లేనివి, భగవత్సాక్షాత్కారమే జీవితోద్దేశం అని తెలుసుకుంటారు.
“ఒక కట్టెలు కొట్టేవాడు కట్టెలుకొట్టే నిమిత్తం అడవిలోకి వెళ్లాడు. హఠాత్తుగా అతనికి ఒక బ్రహ్మచారి తారసపడ్డాడు. ఆ బ్రహ్మచారి అతడితో ‘నాయనా, ముందుకు వెళ్లు’ అన్నాడు. ఇంటికి వెళ్లిన తరువాత కట్టెలుకొట్టే వాడు, ‘ఆ బ్రహ్మచారి నన్నెందుకు ముందుకు వెళ్లమన్నాడు?’ అని యోచించసాగాడు.
“రోజులు గడిచాయి. ఒక రోజు అతడు తీరిగ్గా కూర్చుని ఉన్నప్పుడు ఆ బ్రహ్మచారి మాటలు గుర్తుకు వచ్చాయి. వెంటనే, ‘నేనీ రోజు ఇంకా ముందుకుపోతాను’ అని అనుకున్నాడు. అడవిలోకి వెళ్లి ఇంకా ముందుకు పోయి చూశాడు. అసంఖ్యాకమైన చందన వృక్షాలు! ఆనందంతో వాటిని కొట్టి బండ్ల కొద్దీ తెచ్చుకున్నాడు; సంతలో విక్రయించి గొప్ప ధనవంతుడైపోయాడు. కొన్ని రోజులు గడచాయి. బ్రహ్మచారి చెప్పిన ‘ముందుకు వెళ్లు’ అన్న మాటలు మళ్లీ అతడికి జ్ఞప్తికి వచ్చాయి. ఆ రోజు అడవిలో చాలా దూరం ముందుకు వెళ్లాడు, అక్కడ నదీతీరంలో వెండి గని! ఇటువంటి పెన్నిధిని అతడు కలలో కూడా ఊహించలేదు. గనిలో నుండి వెండిని త్రవ్వి తీసుకువచ్చి విక్రయించాడు. చాలా ధనం వచ్చింది, అతడు కోటికి పడగలెత్తాడు. ఈ విధంగా కొన్ని రోజులు గడిచాయి. ఒక రోజు కూర్చుని ఆలోచింపసాగాడు. ‘బ్రహ్మచారి నన్ను వెండి గనులున్న ప్రాంతం వరకు మాత్రమే వెళ్లమని చెప్పలేదే, ఆయన నన్ను ముందుకు వెళ్లమని కదా చెప్పారు?’ అని అనుకున్నాడు. ఈసారి నదిని దాటి వెళ్లాడు; అక్కడ బంగారు గని! ‘ఓహో! ఇందుకేనా బ్రహ్మచారి ముందుకు వెళ్ళు అని చెప్పారు’ అని అనుకున్నాడు. కొన్ని రోజులు గడిచాక ఇంకా ముందుకు పోగా రత్నాలు, మాణిక్యాలు కుప్పలు కుప్పలుగా పడి ఉండటం చూశాడు. అతడికి కుబేరుడంతటి ఐశ్వర్యం కలిగింది.
“అందుకే ఏది చేసినా ముందుకు పోగా పోగా సద్వస్తువులు లభిస్తాయని చెబుతున్నాను. కాస్త జపం చేసి కాస్త చైతన్యం కలుగగానే, సాధించవలసిన దంతా సాధించివేశాను అని భావించకు. కర్మ చేయటం జీవిత లక్ష్యం కాదు. ఇంకా ముందుకు వెళ్లు, అప్పుడు నువ్వు నిష్కామకర్మ చేయగలవు. కాని నిష్కామకర్మ చేయటం చాలా కష్టం. అందుచేత భక్తితో, వ్యాకులచిత్తంతో, ‘భగవాన్! నీ పాదపద్మాల పట్ల భక్తిని ప్రసాదించు. నా కర్మలు తగ్గించివేయి. ఉన్న కర్మలను నేను నిష్కామభావంతో చేసేట్లు అనుగ్రహించు’ అంటూ ప్రార్థించు. ఇంకా ముందుకు పోతే భగవదనుభూతి కలుగుతుంది; ఆయన దర్శనం లభిస్తుంది. క్రమక్రమంగా ఆయనతో మాట్లాడీ అనందించవచ్చు.”
కేశవ్సేన్ మరణానంతరం, బ్రహ్మసమాజ ఉపాసనావేదిక గురించి తలెత్తిన అభిప్రాయభేదాల ప్రస్తావన వచ్చింది.
శ్రీరామకృష్ణులు (ప్రతాప్‌తో): ఉపాసనా వేదిక గురించి నీతో ఏదో గొడవ జరిగిందని విన్నాను. గొడవలు చేసినవారు కేవలం అల్పులు. (అందరూ నవ్వారు)
(భక్తులతో) “ఇలా చూడండి, ప్రతాప్, అమృతుడు వంటివారు శంఖనాదం చేస్తూ ఉన్నారు. ఈ వాగ్యుద్ధం చేసే తతిమ్మా జనం శబ్దం బయటకు కూడా వినిపించదు. (అందరూ నవ్వారు)
ప్రతాప్: స్వామీ, శబ్దాన్ని గురించి మాట్లాడితే కేవలం మామిడి టెంకతో కూడా శబ్దం చేయవచ్చు.
23.7 సప్తమ పరిచ్ఛేదం బ్రహ్మసమాజం, శ్రీరామకృష్ణులు – ప్రతాప్‌కి ఉపదేశం
శ్రీరామకృష్ణులు (ప్రతాప్‌తో): ఇదుగో, మీ బ్రహ్మసమాజ లెక్చర్లు వింటున్నప్పుడు, ప్రబోధకుడు ఎటువంటి వాడో బాగా అర్థం చేసుకోవచ్చు. హరిసభ ఒకదానికి నన్ను తోడ్కొని వెళ్లారు. ఒక పండితుడు ఉపదేశకుడుగా ఉన్నాడు. అతడి పేరు సమాధ్యాయి. అతడు ఏం చెప్పాడో తెలుసా? ‘భగవంతుడు నీరసుడు; మన ప్రేమభక్తితో ఆయనను సరసునిగా చేయాలి’ అన్నాడు. ఈ మాటలు విని నేను నిర్ఘాంతబోయాను! ఒక పిల్లవాడు కోసిన కోతలే నాకు జ్ఞప్తికి వచ్చాయి; ‘మా మామగారి ఇంట్లో అనేక గుర్రాలున్నాయి. అవును, ఒక ఆవుల కొట్టం నిండా గుర్రాలు!’ అన్నాడతడు. ఆవుల కొట్టంలో ఆవులు ఉంటాయి కాని గుర్రాలు ఎలా ఉంటాయి? ఇటువంటి అసంబద్ధ ప్రకటన వింటే జనం, ‘ఇతడి వద్ద గుర్రాలు గిర్రాలు ఏవీ లేవు’ అనే కదా అనుకుంటారు! (అందరూనవ్వారు)
ఒక భక్తుడు: గుర్రాలు లేవన్నది నిజమే; అయితే ఆవులు కూడా లేవు. (అందరూ నవ్వారు)
శ్రీరామకృష్ణులు: కాస్త యోచించండి, ఎవరయితే రసస్వరూపుడో ఆయనను ‘నీరసుడు’ అని పేర్కోవటమా! దీని నుంచే ఇతడికి భగవంతుని గురించిన ఎటువంటి అనుభవమూ లేదని తెలుస్తోంది.
23.7.1 ‘నేను కర్త’ అనే భావమే అజ్ఞానం – భగవత్ప్రేమలో మునిగిపోవడమే కర్తవ్యం
(ప్రతాప్‌తో) “ఇలా చూడు, నీ కొక మాట చెబుతున్నాను. నువ్వు విద్యాధికుడవు, మేధావి, గంభీరుడవు. కేశవ్, నువ్వు చైతన్య నిత్యానందుల వలె సోదరుల్లా ఉన్నారు. లెక్చర్, తర్కం, కలహం, చర్చలు, వాదోపవాదాలు అన్నీ జరిగిపోయాయి. ఇంకా వీటిలో నీకు ఆసక్తి ఉందా? ఇక పూర్తిగా మనస్సును భగవంతునిపై ఏకాగ్రం చేయి, భగవంతునిలో మునిగిపో.
ప్రతాప్: అలాగేనండీ. మీరన్నది వాస్తవమే. దాన్లో సందేహం లేదు. ఇక ఇదొక్కటే నా కర్తవ్యం. కాని నేను చేస్తూన్న లెక్చర్ మొదలైనవన్నీ కేశవ్ పేరు నిలబెట్టటానికే.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): అతడి పేరు నిలబెట్టటానికే అన్నీ చేస్తున్నానని నువ్వంటున్నావు, సరే. కాని కొన్ని రోజులు గడిచాక ఈ భావన పోతుంది. ఒక కథ చెబుతాను విను.
“ఒక వ్యక్తికి కొండ మీద ఇల్లు ఒకటి ఉంది. అదొక పూరిగుడిసె. ఎంతో శ్రమించి అతడు ఆ గుడిసెను కట్టుకున్నాడు. కొన్ని రోజులు గడిచాక ఒక పెద్ద తుపాను వీచింది. గుడిసె అటూ ఇటూ ఊగిసలాడసాగింది. ఇంటిని ఎలా కాపాడాలో పాలుబోక అతడు దిగులుపడ్డాడు. ‘ఓ వాయుదేవా, ఈ ఇంటిని కూల్చివేయబోకు తండ్రీ!’ అని ప్రార్థించాడు. కాని వాయుదేవుడు అతడి ప్రార్థనలను పట్టించుకున్నట్లు లేదు! ఇల్లు కూలటానికి సిద్ధంగా ఉంది. అప్పుడతడికి ఒక యోచన తట్టింది, హనుమంతుడు వాయుదేవుని పుత్రుడని జ్ఞాపకం వచ్చింది. వెంటనే చిత్తశుద్ధితో, ‘తండ్రీ వాయుదేవా! ఈ గుడిసెను కూల్చి వేయకు, ఇది హనుమంతుని గృహం. నిన్ను ప్రార్థిస్తున్నాను’ అన్నాడు. ఇల్లు మరింతగా ఊగిపోతూ ఉన్నది. అతడి మొరలను ఎవరు ఆలకిస్తారు? ‘హనుమంతుని గృహం, హనుమంతుని గృహం’ అంటూ పలుమార్లు కేకపెట్టినప్పటికీ ఏ ప్రయోజనమూ కలుగలేదు. అప్పుడు, ‘ఓ వాయుదేవా! ఇది లక్ష్మణుని ఇల్లు, లక్ష్మణుని ఇల్లు’ అని చెప్పి చూశాడు, కాని లాభం లేకపోయింది. ‘ఓ వాయుదేవా! ఇది రాముని గృహం, రాముని గృహం. దీన్ని కూల్చివేయకు. నిన్ను బ్రతిమాలుకొంటున్నాను’ అన్నాడు. అందువల్లా ఏ ప్రయోజనమూ లేకపోయింది. గుడిసె కూలిపోసాగింది. మరే దారీ లేదు, ప్రాణం కాపాడుకొంటే చాలుననుకొని గుడిసె నుండి బయటకు వచ్చాడు; ‘ఇది దయ్యం కొంప. ఎలాగైనా పోనీ’ అంటూ పరుగుపెట్టాడు.
“కేశవ్ పేరు నువ్వు నిలబెట్ట నవసరం లేదు. అతడు సాధించినవన్నీ భగవదేచ్ఛ వల్లనే జరిగినవని తెలుసుకో. భగవత్సంకల్పం మూలంగానే జరిగింది, ఆయన సంకల్పం కారణంగానే జరుగుతూ ఉన్నది. నువ్వు ఏం చేయగలవు? భగవంతునికి నీ నిండు మనస్సును ఒప్పగించటమే ఇప్పటి నీ కర్తవ్యం, ఆయన ప్రేమ సాగరంలోకి దుమికి వెయ్యి.”
ఇలా అంటూ శ్రీరామకృష్ణులు సుమధుర కంఠంతో పాడసాగారు:
మునుగవే లోతుకు మునుగవే మనసా
సర్వేశు సౌందర్య సంద్రము నందు……
(ప్రతాప్‌తో) “పాట విన్నావు కదా? లెక్చర్, కలహాలన్నీ చాలా చేశావు. ఇక లోతుగా మునుగు. ఈ సముద్రంలో మునిగితే మరణిస్తామనే భయం ఉండదు. ఇది అమృతసాగరం. దీని వల్ల బుర్ర పాడైపోతుందని భావించనక్కర్లేదు. భగవంతుని గురించి అధికంగా చింతన చేయటం వల్ల మనిషి పిచ్చివాడైపోతాడని భావించకు! ఒకసారి నేను నరేంద్రుడికి చెప్పాను –
ప్రతాప్: మహాశయా, నరేంద్రు డెవరు?
శ్రీరామకృష్ణులు: ఆ పేరిట ఒక యువకుడున్నాడు. నేను అతడితో, ‘ఇలా చూడు, భగవంతుడు ఆనందసాగరుడు. ఆ ఆనంద సాగరంలో మునిగిపోవాలని నువ్వు కోరుకోవా? సరే. ఒక గిన్నె నిండా పానకం ఉందనుకో. నువ్వొక ఈగవైతే ఎక్కడ కూర్చుని దాన్ని త్రాగుతావు?’ అని అడిగాను. అందుకు అతడు, ‘నేను గిన్నె అంచున కూర్చుని తలను సాచి త్రాగుతాను’ అని చెప్పాడు. ‘ఎందుకు అంచున కూర్చుంటావు?’ అని అడిగాను. అందు కతడు, ‘మరీ ప్రక్కన కూర్చుంటే మునిగిపోతాను, మునిగిపోతే ప్రాణం పోతుందే’ అన్నాడు. వెంటనే నేను, ‘నాయనా, సచ్చిదానంద సాగరంలో ఆ భయం లేదు. అది అమృతసాగరం, దాన్లో మునిగితే మరణించవు; మనిషి అమరుడవుతాడు. భగవదోన్మాదం కలిగితే మనిషి పిచ్చివాడు కాబోడు’ అని చెప్పాను.
(భక్తులతో) “ ‘నేను’, ‘నాది’ – ఇదే అజ్ఞానం. ‘రాణీ రాస్మణి కాళికాలయాన్ని నిర్మించింది’ అనే అంటున్నారు జనులు, భగవంతుడే దాన్ని నిర్మించాడని ఎవరూ అనటం లేదు. ‘బ్రహ్మసమాజాన్ని ఫలానా వ్యక్తి స్థాపించాడు’ అంటున్నారు, దైవసంకల్పంతో ఇది సంభవించింది అని ఎవరూ చెప్పటం లేదు! ‘నేను కర్తను’ అనుకోవటం అజ్ఞానం. ‘భగవాన్, నువ్వు కర్తవు, నేను కాదు. నువ్వు యంత్రాన్ని నడిపించే వాడవు, నేను యంత్రాన్ని’ అనుకోవటం జ్ఞానం. ‘ఓ భగవంతుడా, నాదంటూ ఏదీ లేదు. ఈ దేవాలయం నాది కాదు, ఈ కాళికాలయం నాది కాదు, ఈ సమాజం నాది కాదు; అన్నీ తమరివే. భార్యాపిల్లలు, కుటుంబ సభ్యులు ఎవరూ నా వారు కారు, అన్నీ తమరివే’ – ఇదే జ్ఞానం.
“ ‘నా సొంతం, నా సొంతం’ అనుకుని వారిని ప్రేమించటం మాయ. అందరినీ ప్రేమించటం దయ. బ్రహ్మసమాజస్థులను మాత్రం ప్రేమించటం, కుటుంబంలోని వారిని మాత్రమే ప్రేమించటం – దీని పేరు మాయ. తన దేశ ప్రజలను మాత్రం ప్రేమించటం – దీని పేరు మాయ. సమస్త దేశ ప్రజలను ప్రేమించటం, అన్ని మతాలవారిని ప్రేమించటం అనేది దయ నుంచి జనిస్తుంది; భక్తితో ఏర్పడుతుంది. మాయచే మనిషి బద్ధుడవుతున్నాడు; భగవంతుని నుండి వైదొలగుతున్నాడు. దయతో భగవదనుభూతి కలుగుతుంది. శుకదేవుడు, నారదుడు వంటి వారు దయను కలిగివున్నారు.”
23.8 అష్టమ పరిచ్ఛేదం ప్రతాప్‌కి ఉపదేశం – బ్రహ్మసమాజం – కామినీకాంచనాలు
ప్రతాప్: మహాశయా! మీ వద్దకు వచ్చేవారు ఆధ్యాత్మికంగా క్రమక్రమంగా పురోగమిస్తున్నారు కదా?
23.8.1 గృహస్థుల సాధన
శ్రీరామకృష్ణులు: సంసార జీవితం గడపటంలో తప్పు ఏముందని నే నడుగుతాను. కాని పనిమనిషిలా మెలగాలి. ఆమె యజమాని ఇంటి గురించి మాట్లాడేటప్పుడు, ‘మా ఇల్లు’ అని నోటితో అంటుంది. కాని ఆమె సొంత ఇల్లు ఏదో ఒక గ్రామంలో ఉండి ఉండవచ్చు. యజమాని ఇంటిని చూపి, ‘మా ఇల్లు’ అని నోటితో చెబుతుంది, కాని అది నిజానికి తన ఇల్లు కాదనీ, తన ఇల్లు గ్రామంలో ఉందనీ మనస్సులో ఆమెకు బాగా తెలుసు. యజమాని పిల్లలను చూసుకుంటూ ఉంటుంది; ‘నా హరి తుంటరి’, ‘నా హరికి తీపి ఇష్టం లేదు’ – అంటుంది. ‘నా హరి’ అని నోటితో చెప్పినా, హరి తన బిడ్డ కాడు, యజమాని బిడ్డ అన్న విషయం ఆమెకు స్పష్టంగా తెలిసే ఉంది.
“అందుకే ఇక్కడకు వచ్చేవారితో నేను, ‘సంసారంలో ఉండండి, దాన్లో తప్పు లేదు. కాని భగవంతునిపై మనస్సు నిలిపి జీవించండి. ‘ఇల్లు, వాకిలి, భార్య బిడ్డలు – ఏవీ నావి కావు; అన్నీ భగవంతునివే! నా ఇల్లు భగవంతుని వద్ద ఉంది’ అన్న విషయం అర్థం చేసుకోండి. ఆయన పాదపద్మాల పట్ల భక్తి కలిగేట్లు వ్యాకులచిత్తంతో సర్వదా ప్రార్థించండి’ అని చెబుతున్నాను.”
పాశ్చాత్య దేశస్థుల గురించిన ప్రస్తావన మళ్లీ వచ్చింది. “ఈ రోజుల్లో పాశ్చాత్య పండితులు, భగవంతుని ఉనికిని అంగీకరించటం లేదట, అవునా?” అని ఒక భక్తుడు అన్నాడు.
ప్రతాప్: మీరు ఏమన్నా సరే, వారిలో ఎవరూ నాస్తికుల్లా నాకు తోచటం లేదు. ఈ జగత్ వ్యాపారాలకు వెనుక ఒక మహాశక్తి ఉందనటం పలువురు అంగీకరించి తీరవలసిందే.
శ్రీరామకృష్ణులు: అది చాలు! శక్తిని అంగీకరిస్తున్నారే! వారెలా నాస్తికులవుతారు?
ప్రతాప్: అదికాక ఐరోపియన్ మేధావులు moral government (మంచికి సత్ఫలం, పాపానికి శిక్ష ఈ లోకంలో ఉన్నాయి) అనే వాదాన్ని అంగీకరిస్తున్నారు.
చాలాసేపు మాట్లాడిన పిదప ప్రతాప్ సెలవు పుచ్చుకోవటానికి లేచి నిలబడ్డాడు.
శ్రీరామకృష్ణులు (ప్రతాప్‌తో) : నీకు మరేం చెప్పగలను? ఇకపై వాదోపవాదాలు, కొట్లాటలలో పాల్గోవద్దు!
“మరో మాట. ‘కామినీ కాంచనాలే మనిషిని భగవంతుని నుండి విముఖుని చేసివేస్తున్నాయి. ఆయన వైపు పోనివ్వకుండా అడ్డుకుంటున్నాయి. నువ్వే ఆలోచించి చూడు. ప్రతి ఒక్కరూ తన భార్య గురించి బడాయిలు చెబుతుంటారు. (అందరూ నవ్వారు) ఆమె మంచిదైనా సరే, కాకున్నా సరే; ఎవరినైనా, ‘అవును, నీ భార్య ఎటువంటిది?’ అని అడిగితే, ‘ఆమె చాలామంచిది’ అనే చెబుతారు.”
ప్రతాప్: నేను సెలవు పుచ్చుకొంటానండీ.
ప్రతాప్ వెళ్ళిపోయాడు. శ్రీరామకృష్ణుల అమృత వచనాలు, కామినీకాంచన త్యాగం గురించిన మాటలు కొనసాగాయి. సురేంద్రుని తోటలోని చెట్లు పిల్లగాలిలో ఊగిసలాడినందున, వాటి ఆకులు మర్మరధ్వనిని పుట్టించాయి; శ్రీరామకృష్ణుల అమృత వచనాలు ఆ ధ్వనిలో కలిసిపోయాయి; ఒకసారి భక్తుల హృదయాలను స్పృశించి చివరకు అనంతాకాశంలో విలీనమైనాయి. ఈ పలుకులు ప్రతాప్ హృదయంలో ప్రతిధ్వనించలేదా?
కాసేపయ్యాక మణిలాల్ మల్లిక్ శ్రీరామకృష్ణులతో, “మహాశయా, మీరు దక్షిణేశ్వరానికి వెళ్ళవలసిన సమయమైంది. కేశవ్ తల్లి, ఆతడి కుటుంబ స్త్రీలు మిమ్మల్ని దర్శింప అక్కడకు వస్తారు. మీరు అక్కడ కనపడకపోతే వాళ్లు నిరాశతో ఇంటికి వెళ్లవలసి వస్తుంది” అన్నాడు.
కేశవ్ కాలధర్మం చెంది కొన్ని నెలలే అయింది. అందుకే ఆతడి ముదుసలి తల్లి, భార్య, ఆ ఇంటి స్త్రీలు శ్రీరామకృష్ణులను దర్శింప దక్షిణేశ్వరానికి వెళ్లారు.
శ్రీరామకృష్ణులు (మణిమల్లిక్తో): ఉండవయ్యా, ఉండు! తొందర పరచకు. నేను సరిగ్గా నిద్రపోనైనా లేదు; దీనికి తోడు పరుగులెత్తుకుంటూ వెళ్ళడం నా వల్ల కాదు. వాళ్లు అక్కడకు పోతారంటే అందుకు నేనేం చేయగలను? వాళ్లు అక్కడ తోటలో పచార్లు చేస్తూ, ఆనందిస్తారులే.
ఒకింతసేపు విశ్రమించాక శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వరం వెళ్ళడానికి సిద్ధమయ్యారు. బయలుదేరేటప్పుడు సురేంద్రుని హితానికై ప్రార్థించారు. ఇంట్లో ప్రతి గదిలోకి వెళ్లి మెల్లగా భగవన్నామాన్ని ఉచ్చరించారు. ఏ కొరతా ఉండకూడదని, “నే నప్పుడు పూరీ తినలేదు. కాస్త పట్టుకురండి” అన్నారు. నిలబడే ఒకే ఒక ముక్క తిని, “దీన్లో గొప్ప అంతరార్థం ఉన్నది. పూరీ తినలేదని మనస్సుకు తోస్తే మళ్లీ ఇక్కడకు రావాలని కోర్కె కలుగుతుంది” అన్నారు. (అందరూ నవ్వారు)
మణిమల్లిక్ (నవ్వుతూ): అది మంచిదే! మేమూ వస్తాం కదా! (అందరూ నవ్వారు)
23.9 నవమ పరిచ్ఛేదం బాబూరామ్, రాఖాల్, లాటూ, నిరంజన్, నరేంద్రుడు ప్రభృతుల గురించి శ్రీరామకృష్ణులు
శుక్రవారం, జూన్ 20, 1884
శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వర కాళికాలయంలోని తమ గదిలో భక్తులతో కూర్చుని ఉన్నారు. మునిమాపు వేళ, జగజ్జనని నామాన్ని జపిస్తూ, ఆమె చింతనలో మునిగి ఉన్నారు. గదిలో రాఖాల్, అధర్, ‘మ’, ఒకరిద్దరు భక్తులు ఉన్నారు. రథయాత్ర ఉత్సవం జరగటానికి ఇంకా ఐదు రోజులే ఉన్నవి.
కాసేపటి తరువాత ఆలయాలలో సాయంకాల హారతులు ప్రారంభమయ్యాయి. అధర్ హారతులు తిలకింప వెళ్లాడు. శ్రీరామకృష్ణులు ‘మ’ తో మాట్లాడసాగారు. భక్తుల గురించి ఆనందంతో చెప్పసాగారు.
శ్రీరామకృష్ణులు: బాబూరామ్ చదువు కొనసాగించాలనుకుంటున్నాడా? ‘ఇతరులకు ఉదాహరణగా ఉండటం కోసం చదువు’ అని అతడికి చెప్పాను. సీతను చెరవిడిపించాక, రాజ్యం పాలించటానికి విభీషణుడు సమ్మతించలేదు. అప్పుడు రాముడు ఆతడితో, ‘మూఢులు అర్థం చేసుకోవటానికైనా నువ్వు రాజ్యం పాలించాలి. లేకుంటే రామునికి సేవచేసి విభీషణుడు ఏ ప్రయోజనం పొందాడని వారంటారు. నీకు రాజ్యం లభించడం చూసి ఆనందిస్తారు’ అన్నాడు.
“నీ కొక మాట చెబుతాను; బాబూరామ్, భవనాథ్, హరీశ్లలో ప్రకృతి భావం ఉండటం నేను ఆ నాడు గమనించాను. మెడలో మాల ధరించిన దేవి వలె బాబూరామ్ను చూశాను; చుట్టూ చెలికత్తెలు ఉన్నారు. కలలో అతడు ఏదో పొందాడు. అతడి దేహం పరిశుద్ధమైనది. అతడు కాస్త ప్రయత్నిస్తే చాలు, సకలం సిద్ధిస్తుంది.
“ఇలా చూడు, నా అవసరాలను చూసుకోవటంలో కాస్త ఇబ్బంది వచ్చింది. బాబూరామ్ ఇక్కడకు వచ్చి ఉంటే బాగుంటుంది. వీరి మనోస్థితులన్నీ ఒకే రీతిలో మారిపోతూ ఉన్నాయి. నోటూ (లాటూ) ఉన్నత స్థితిలో ఉన్నాడు. సదా భావపారవశ్యంలోనే ఉంటున్నాడు. క్రమక్రమంగా దాన్లో విలీనం అయ్యే స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు రాఖాల్ స్థితి ఎలా ఉందంటే నేనే అతడికి నీళ్లు అందించవలసి వస్తోంది. అతడు పెద్దగా (నాకు) ఏమీ చేయలేడు.
నిరంజన్ (స్వామి నిరంజనానంద)
లాటూ (స్వామి అద్భుతానంద)
బాబూరామ్ (స్వామి ప్రేమానంద)
“బాబూరామ్, నిరంజన్లు తప్ప మరే యువకులున్నారు? మరెవరైనా వస్తే ఉపదేశం పొంది, వచ్చిన దారినే వెళ్లిపోతారు.
“కాని బాబూరామ్ బలవంతంగా సమస్తం వదలిపెట్టి రావాలని నేను చెప్పడంలేదు, అలా చేస్తే అతడి ఇంట్లో గొడవలు తలెత్తవచ్చు. (నవ్వుతూ) ‘ఇక్కడకు వచ్చేయి’ అని అతడితో చెబితే అతడు, ‘మీరే లాక్కోండి’ అంటాడు. రాఖాల్ను చూసి విలపిస్తాడు; ‘రాఖాల్ ఇక్కడ ఎంత ఆనందంగా ఉన్నాడు’ అంటాడు.
“రాఖాల్ ఇంట్లో మనిషిలా ఇక్కడున్నాడు. అతడు ఒక సంసారానురక్తుడు కాజాలడని తెలుసు; ‘అవన్నీ చప్పగా, రుచిహీనంగా అయిపోయాయి’ అంటాడు. ఒకసారి అతడి భార్య ఇక్కడకు వచ్చింది. ఆమెకు పద్నాలుగేళ్లు ఉండొచ్చు. ఇక్కడ నుంచి కొన్నగర్ వెళ్లింది. రాఖాల్ను అక్కడకు రమ్మని పిలిచారు. కాని అతడు పోలేదు. ‘ఆ వేడుకలు, వినోదాలు నాకు నచ్చవు’ అంటాడు.
“నిరంజన్ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు?”
‘మ’ : అందగాడు!
శ్రీరామకృష్ణులు: ఊహూ, అందమే కాదు. అతడు సరళహృదయుడు. సరళహృదయం ఉంటే భగవంతుని సులువుగా పొందగలరు. సరళ హృదయులకు ఉపదేశం సత్వరం ప్రయోజనకారి అవుతుంది. రాళ్లు లేని, దున్నిన నేలలో విత్తనాలు నాటితే సత్వరం మొలకెత్తుతాయి, తొందరగా ఫలం దక్కుతుంది.
“నిరంజన్ వివాహం చేసుకోడు. నువ్వేమనుకుంటున్నావు? కామినీ కాంచనాలే మనిషిని బద్ధుణ్ణి చేస్తాయి!”
‘మ’ : అవునండీ.
శ్రీరామకృష్ణులు: తాంబూలం, పొగాకు వదలివేయటం వల్ల ఏం లాభం? కామినీ కాంచనాల త్యాగమే త్యాగం.
“నిరంజన్ ఉద్యోగం చేస్తూ ఉన్నా అతణ్ణి ఏ కళంకమూ అంటుకోదని భావపారవశ్య స్థితిలో గాంచాను. అతడు తన తల్లి కోసం ఉద్యోగం చేస్తున్నాడు. దాన్లో తప్పు లేదు.
“నువ్వు చేసే పనిలోనూ దోషం లేదు, అది మంచిపని. క్లర్కు (గుమాస్తా) పని చేసేవాడొకడు చెరసాలపాలయ్యాడు, చేతులకు సంకెళ్లు వేశారు. కొంతకాలం తరువాత అతణ్ణి విడుదల చేశారు. బయటకు వచ్చాక అతడు కుప్పిగంతులు వేస్తూ తిరుగుతాడా ఏమిటి? మళ్లీ క్లర్కు పనినే చేస్తాడు. నీకు ధనార్జనలో ఆసక్తి లేదు. భార్యాబిడ్డలకు కూడు గుడ్డ అందించాలి, లేకుంటే వాళ్లు ఎక్కడకు పోతారు?
‘మ’ : మరెవరన్నా వారి బాధ్యత తీసుకొంటే నేను ఉద్యోగం మానేయవచ్చు.
శ్రీరామకృష్ణులు: అది సరే, కాని ప్రస్తుతం ఇదీ చెయ్యి, అదీ చెయ్యి.
‘మ’ : సర్వసంగ పరిత్యాగం చేయటం మహద్భాగ్యం.
శ్రీరామకృష్ణులు: అది నిజమే. కాని జనులు సంస్కారాలను బట్టి ఉంటారు. నీకు ఇంకా కొంత కర్మ బాకీ ఉంది. అదీ తీరిపోతే నువ్వు ప్రశాంతంగా ఉండవచ్చు. నీకు ముక్తి లభిస్తుంది. ఆసుపత్రిలో పేరు నమోదు చేస్తే సులువుగా వదలిపెట్టరు. రోగం పూర్తిగా నయమయ్యాకే బయటకు వదలుతారు.
“ఇక్కడకు వచ్చే భక్తులను రెండు తరగతులుగా విభజించవచ్చు. ఒక తరగతి వారు, ‘ఓ పరమేశ్వరా! మమ్ము ఉద్ధరించు’ అంటారు. రెండవ తరగతివారు, ఆంతరంగికులు. వీరు ఇలా మాట్లాడరు. వీరు రెండు విషయాలు గ్రహిస్తేనే చాలు: మొదటిది, నేను (శ్రీరామకృష్ణులు) ఎవర్ని? రెండవది, వారెవరు, వారికీ నాకూ ఏమిటి సంబంధం?
“నువ్వు ఈ రెండవ తరగతికి చెందిన వాడివి, లేకుంటే ఇంతగా చేయగలవా……
23.9.1 నరేంద్ర, రాఖాల్, నిరంజన్లది పురుషభావం; బాబూరామ్, భవనాథ్లది ప్రకృతిభావం
“భవనాథ్, బాబూరామ్లది ప్రకృతి భావం. హరీశ్ స్త్రీల దుస్తులు ధరించి నిద్రిస్తాడు. ఈ భావన తనకు నచ్చినట్లుగా బాబూరామ్ చెబుతున్నాడు. దీని గురించి నేను అనుకున్నది సరిపోయింది. భవనాథ్ కూడా అట్లే; కాని నరేంద్రుడు, రాఖాల్, నిరంజన్లు పురుష స్వభావం కలవారు.
23.9.2 చెయ్యి విరగడంలో అర్థం ఏమిటి? – సిద్ధులు, శ్రీరామకృష్ణులు
“అది సరే, చెయ్యి విరిగిందే, దీనికి అర్థం ఏమిటి? మునుపు ఒకసారి భావపారవశ్య స్థితిలో పన్ను విరిగింది, ఈసారి చెయ్యి విరిగింది.”
‘మ’ మౌనంగా ఉండటం చూసి శ్రీరామకృష్ణులే ఇలా అన్నారు: “అహంకారాన్ని పూర్తిగా నిర్మూలించటానికే చెయ్యి విరిగింది. ఇప్పుడు లోపల ఎంతగా వెదికినా ‘నేను’ కానరాదు. వెదకి వెదకి చూస్తున్నాను; అక్కడ భగవంతుడే వ్యాపించి ఉన్నాడు, ఆయననే చూస్తున్నాను. అహంకారం అడుగంటా నశించకుంటే భగవంతుని పొందటం అనే మాటే లేదు. చాతకపక్షిని చూడు, దాని గూడు భూమ్మీద, కాని అది ఎంతో ఎత్తులో ఎగురుతుంది.
“చేపలు తినటం చేతనే నాకు సిద్ధులు లభించలేదని కెప్టెన్ అంటున్నాడు. ఈ సిద్ధులు ఎక్కడ వచ్చిపడతాయో అనే భయంతో కొన్ని సమయాల్లో నేను గడగడ వణకిపోతాను. సిద్ధులు కలిగితే ఈ చోటు ఒక ఆసుపత్రి అయిపోతుంది. జనం ‘నా రోగాన్ని నయం చేయండి’ అంటూ వచ్చిపడతారు. సిద్ధులు లభించటం మంచిదా?”
‘మ’ : లేదండీ. అష్టసిద్ధులలో ఒక్కటి అబ్బినా భగవంతుని పొందలేమని మీరే కదా సెలవిచ్చారు!
శ్రీరామకృష్ణులు: సరిగ్గా చెప్పావు. అల్పబుద్ధులే సిద్ధులను కోరతారు. గొప్పవారిని ఏదైనా ఖర్మచాలక అడిగితే ఆ పిదప మర్యాద ఉండదు. అతడితో కలిసి ఒకే బండిలో పోలేము. అలా పోయినా కూడా ప్రక్కన కూర్చోనివ్వడు. అందుకే నిష్కామభక్తి, అహేతుక భక్తి శ్రేష్ఠమైనది.
23.9.3 సాకార నిరాకారాలు రెండూ సత్యమే – భక్తుని ఇల్లు భగవంతుని నివాసస్థానం
“సాకారం, నిరాకారం – రెండూ సత్యాలే. నువ్వేమంటావు? నిరాకారోపాసనలో మనస్సును చాలాసేపు నిలుపలేం. అందుచేతనే భక్తుడు సాకారాన్ని పూజిస్తూ ఉంటాడు.
“కెప్టెన్ బాగా చెప్పాడు. పక్షి చాలాసేపు ఎంతో ఎత్తులో ఎగిరి అలసిపోగానే చెట్టుకొమ్మ మీద కూర్చుని విశ్రాంతి తీసుకుంటుంది. నిరాకారం తరువాత సాకారం.
“నేను ఒక రోజు నీ ఇంటికి రావాలి. అధర్ ఇల్లు, సురేంద్రుని ఇల్లు, బలరామ్ ఇల్లు – ఇవన్నీ నా అతిథి గృహాల్లా ఉండటం ఒక రోజు భావపారవశ్య స్థితిలో గాంచాను. కాని వాళ్ళు ఇక్కడకు రాకపోయినా నాకు బాధ లేదు.”
23.9.4 గారడీవాడు, అతడి గారడీ – దయ చూపగలిగేది భగవంతుడొక్కడే
‘మ’ : నిజమేనండీ. మీకు బాధ ఎక్కడిది? ఆనందం చెందుతున్న భావన ఉంటేనే కదా బాధపడుతున్న భావన వస్తుంది! మీరు ఆనందానికీ, బాధలకూ అతీతులు గదా!
శ్రీరామకృష్ణులు: అవును. గారడీవాడు, అతడి గారడీ – రెంటినీ నేను చూస్తున్నాను. గారడీవాడే సత్యం, అతడి గారడీలన్నీ భ్రాంతి, కల వంటివి. చండీ (దుర్గా సప్తశతి) శ్రవణం చేసినప్పుడు ఇది గ్రహించాను. ఇదుగో శుంభ నిశుంభులు పుట్టారు; కాసేపట్లో మరణించారు.
‘మ’ : స్వామీ, నే నొకసారి గంగాధర్‌తో కలసి స్టీమర్లో కాల్నాకు పోతూన్నప్పుడు ఒక పడవ స్టీమరును ఢీకొన్నది. దాన్లోని ఇరవై, ఇరవై ఐదు మంది ప్రయాణీకులు నదిలో మునిగిపోయి మరణించారు. నదీ తరంగాల నురుగులా వారందరూ నీళ్లలో మునిగి మాయమైపోయారు. మిమ్మల్ని ఒకటి అడగాలి: ఈ జగత్తును గారడీలా చూసే వ్యక్తిలో దయ ఉంటుందా? అప్పుడు అతడిలో కర్తృత్వ భావన ఉంటుందా? ఆ భావన ఉంటేనే కదా దయ జనిస్తుంది?
శ్రీరామకృష్ణులు: జ్ఞాని ఒకే సమయంలో భగవంతుడు, మాయ, జీవజగత్తులు అన్నిటినీ చూస్తున్నాడు. మాయ (విద్యామాయ, అవిద్యామాయ), జీవజగత్తులు అన్నీ ఉన్నాయనీ, అదే సమయంలో అవి లేవు అని కూడా అతడు చూస్తున్నాడు. ‘నేను’ ఉన్నంత వరకు ‘ఇతరులు’ కూడా ఉన్నారు. జ్ఞానఖడ్గంతో ఖండించిన తరువాత ఏదీ ఉండదు. ఆ స్థితిలో స్వకీయ ‘నేను’ భావన కూడా గారడీవాడి గారడీ అయిపోతుంది.
‘మ’ ఆలోచించసాగాడు.
శ్రీరామకృష్ణులు: అదెలాగో తెలుసా? పాతిక రేకులున్న ఒక పువ్వు, దాన్ని ఒకే వేటుతో ఖండించినట్లు.
“కర్తృత్వ భావనా? రామ, రామ! శుకదేవుడు, శంకరులు వంటివారు ‘విద్యా నేను’ ను నిలుపుకున్నారు. మనిషి దయ చూపగలడా? దయ చూపగలవాడు భగవంతు డొక్కడే. దయ అనేది ఉన్నది ‘విద్యా నేను’ లోనే. ‘విద్యా నేను’ గా ఉంటోంది ఆ భగవంతుడే.
23.9.5 కాళీయే బ్రహ్మం – కల్కి అవతారం
“కాని వేయిసార్లు అన్నిటిని ఇంద్రజాలంగా చూసినప్పటికీ అందరూ ఆమె పిడికిలిలోనే ఉన్నారు. ఆమె నుండి తప్పించుకుని పారిపోలేరు. నువ్వు స్వతంత్రుడవు కావు; ఆమె ఎలా చేయిస్తే, అలాగే చేయాలి. బ్రహ్మజ్ఞానాన్ని ఆ ఆద్యాశక్తి అనుగ్రహిస్తేనే మనకు లభించేది. అప్పుడే గారడీలా చూడగలవు, లేకుంటే సాధ్యం కాదు. కించిత్తు ఐనా ‘నేను’ ఉన్నంత వరకు మనం ఆద్యాశక్తి ఇలాకాలోని వారమే; ఆమె అధీనులమే. ఆమెను దాటి పోలేము.
“ఆద్యాశక్తి సహాయంతో భగవంతుడు అవతార లీలలను జరుపుతున్నాడు. ఆయన తన శక్తితో అవతారం ఎత్తుతాడు. అప్పుడే అవతారపురుషుడు తన కార్యాలను నిర్వర్తించగలడు. అంతా తల్లి శక్తే.
“కాళికాలయపు మునుపటి కోశాధికారిని ఎవరైనా కొంచెం అధికంగా డబ్బు అడిగితే, ‘రెండు మూడు రోజుల తర్వాత రా. యజమానిని అడగాలి’ అంటాడు.
“కలియుగాంతాన భగవంతుడు కల్కి అవతారం ఎత్తుతాడు – బ్రాహ్మణ కులంలో జన్మిస్తాడు. అతడికి ఏమీ తెలియదు. హఠాత్తుగా అతడి వద్దకు గుర్రం, ఖడ్గం చేరుతాయి…..”
23.9.6 కేశవ్సేన్ తల్లి, సోదరి – భువనమోహిని
ఇంతలో అధర్ కాళికాలయంలో హారతి తిలకించి తిరిగి వచ్చి కూర్చున్నాడు. భువనమోహిని అనే నర్స్ అప్పుడప్పుడు శ్రీరామకృష్ణుల దర్శనార్థం వచ్చేది. అందరూ తీసుకు వచ్చే పదార్థాలను ఆయన తినలేకపోయేవారు; ముఖ్యంగా డాక్టర్లు, నర్స్‌లు రోగుల కష్టాలను చూస్తూ ఉన్నప్పటికీ వారి నుండి డబ్బు పుచ్చుకోవటం వలన వీరు తీసుకువచ్చే పదార్థాలను ఆయన తినలేకపోయేవారు.
శ్రీరామకృష్ణులు (అధర్ తదితర భక్తులతో): భువన వచ్చింది. పాతిక బొంబాయి మామిడిపళ్లు, రసగుల్లాలు పట్టుకొచ్చింది. ‘మీరు ఒక మామిడి పండు తినండి’ అని నాతో అంది. అందుకు నేను, ‘నా కడుపు బాగా లేదు’ అనేశాను. ఇప్పుడు చూడండి పూరీ, మిఠాయి తిన్నందున నిజంగానే కడుపు అదోలా ఉంది.
“కేశవ్ తల్లి, సోదరి వచ్చారు. కొంచెం నాట్యం చేసి, పాడి వారిని సంతోష పెట్టవలసి వచ్చింది. ఏం చేయను? వారు ఎంతో దుఃఖంలో ఉన్నారు.”