20.1 ప్రథమ పరిచ్ఛేదం దక్షిణేశ్వరంలో మణిలాల్ ప్రభృత భక్తులతో
ఆదివారం, మార్చ్ 9, 1884
శ్రీరామకృష్ణులు తమ గదిలో కూర్చుని ఉన్నారు. మణిలాల్ మల్లిక్, సింథీకి చెందిన వైద్యుడు మహేంద్ర కవిరాజ్, బలరామ్, ‘మ’, భవనాథ్, రాఖాల్, లాటూ, హరీశ్, కిశోరీ, శివచంద్రుడు మొదలైన భక్తులు ఉన్నారు. గిరీశ్, కాళీ, సుబోధ్, పూర్ణుడు, చిన్న నరేన్ ప్రభృతులు ఇంకా శ్రీరామకృష్ణుల సాన్నిధ్యం పొందలేదు. శరత్, శశి మాత్రం ఒకటి రెండుసార్లు ఆయనను దర్శించి ఉన్నారు.
శ్రీరామకృష్ణుల చేతికి కట్టు కట్టబడి ఉంది. భావపారవశ్యంలో ఉన్నప్పుడు కంచె ప్రక్కన పడిపోవటంతో ఆయన చేయి విరిగింది. దానితో సదా బాధ, ఈ స్థితిలోనూ ఆయన అధికపాలు సమాధి స్థితిలోనే మగ్నులై ఉన్నారు, భక్తులకు నిగూఢ తత్త్వాలను ఉపదేశిస్తున్నారు.
ఒక రోజు బాధతో విలపిస్తూ ఉన్నప్పుడు సమాధి మగ్నులైనారు. కాస్త బాహ్యస్మృతి రాగానే మహిమాచరణ్ తదితర భక్తులతో ఇలా అన్నారు: “నాయనా, సచ్చిదానంద స్వరూపుని పొందకుంటే ఏమీ పొందనట్లే. మనోవ్యాకులత లేకుండా ఏదీ సంభవించదు. నేను వెక్కి వెక్కి ఏడుస్తూ భగవంతునితో ఇలా మొరపెట్టుకొనేవాడిని: ‘ఓ దీననాథా! నేను సాధన – భజన హీనుడను. నువ్వు నాకు దర్శనం ఇచ్చి తీరాలి.”
నాటి రాత్రి మహిమాచరణ్, అధర్, ‘మ’ మొదలైన వారు ఉన్నారు.
శ్రీరామకృష్ణులు మహిమాచరణ్తో “అహేతుక భక్తి అని ఒకటి ఉంది. అభ్యాసం ద్వారా దాన్ని పొంద ప్రయత్నించు” అన్నారు. తరువాత అధర్తో, “ఈ చేతిని కాస్త ఒత్తు నాయనా” అన్నారు.
మణిలాల్ మల్లిక్, భవనాథ్లు ఎగ్జిబిషన్ (వస్తుప్రదర్శనశాల) గురించి మాట్లాడుకుంటున్నారు. దానిని 1883–84 సం ॥ లో ఏసియాటిక్ మ్యూజియమ్ సమీపాన నిర్వహించారు. వారు ఇలా అంటున్నారు: “బంగారు మంచం మొదలైన అమూల్య వస్తువులను ఎందరో రాజులు ప్రదర్శనశాలకు పంపి ఉన్నారు. అది తప్పక చూడవలసిన ప్రదర్శనే.”
20.1.1 భగవంతుడు, ఆయన ఐశ్వర్యం
శ్రీరామకృష్ణులు (భక్తులను చూసి నవ్వుతూ): అవును. వాటిని చూడడం వల్ల ప్రయోజనం ఉంది. రాజాధిరాజులు పంపించిన ఇటువంటి బంగారు వస్తువులన్నీ కేవలం చెత్త అని అప్పుడు అనుభూతం చేసుకోవచ్చు. ఈ అనుభవం ఒక గొప్ప లాభం కాదా? నేను కలకత్తాకు వెళ్లేటప్పుడు, లాట్ సాహెబ్ (అంటే, వైస్రాయి) భవనాన్ని నాకు చూపిస్తూ హృదయ్, “మామయ్యా, ఇదుగో చూడు – లాట్ సాహెబ్ భవనం, పెద్ద పెద్ద స్తంభాలు!” అనేవాడు. కాని అవి కేవలం ఒక దానిపై ఒకటిగా పేర్చబడిన ఇటుకలు మాత్రమే అని అమ్మ నాకు వెల్లడించింది.
“భగవంతుడు, ఆయన ఐశ్వర్యాలు – ఐశ్వర్యం ఒకటి రెండు రోజులది మాత్రమే, భగవంతుడే సత్యం. ఐంద్రజాలికుడు, ఆతని ఇంద్రజాలం – ఇంద్రజాలం చూసి జనం సంభ్రమం చెందుతారు; కాని అదంతా మిథ్య, ఐంద్రజాలికుడే సత్యం. యజమాని, ఆతడి తోట – తోటను చూసి తోట యజమానికోసం వెదకాలి.”
మణిమల్లిక్ (శ్రీరామకృష్ణులతో): ప్రదర్శనశాలలో ఎంత పెద్ద ఎలక్ట్రిక్ లైట్లు అమర్చి ఉన్నారని! దాన్ని చూసిన పిదప అది తయారుచేసిన వ్యక్తి ఎంతో ప్రతిభావంతుడు అయివుండాలని తోచింది.
శ్రీరామకృష్ణులు (మణిమల్లిక్తో): భగవంతుడే ఇలా సమస్తమూ అయి ఉన్నాడు; ఇంకా ఇలా చెప్పేవాడు కూడా ఆయనే – ఇటువంటి దృక్పథం ఒకటి ఉంది. భగవంతుడు, మాయ, జీవజగత్తులు అన్నీ ఆయనే, భగవంతుడే.
20.1.2 సాధుసాంగత్యం – శ్రీరామకృష్ణులు చూడగోరిన చిత్తరువులు
మళ్లీ వస్తుప్రదర్శనశాల గురించిన ప్రస్తావన వచ్చింది.
శ్రీరామకృష్ణులు (భక్తులతో): నేనొకసారి మ్యూజియం చూడడానికి వెళ్లాను. నాకు శిలాజాలను చూపారు. ఒక జంతువు అట్లే శిలగా మారిపోయి ఉంది! చూశారా, సాంగత్య ఫలితం ఎలా ఉంటుందో! ఆ విధంగా సర్వదా సాధుసాంగత్యం ఉంటే సాధువు కావచ్చు.
మణిమల్లిక్ (నవ్వుతూ): మీరు ఒకసారి ఆ వస్తుప్రదర్శనశాలను సందర్శిస్తే, పది పదిహేను ఏళ్ళు మాకు ఉపదేశం ఇవ్వడానికి కావలసిన దృష్టాంతాలు సిద్ధం చేసుకుంటారు.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): నేను వాటి నన్నిటిని ఉదాహరణలుగా చెబుతాననే గదా నువ్వు అంటున్నావు!
బలరామ్: వద్దు, మీరు వెళ్లవద్దు. ఇక్కడ అక్కడ తిరిగితే మీ చెయ్యి నయం కాదు.
శ్రీరామకృష్ణులు: నేను రెండు చిత్తరువులను చూడగోరుతున్నాను. ఒక యోగి ధుని (బైరాగులు వేసుకొనే మంట) రగిలించి దాని ప్రక్కన కూర్చున్న తీరులోని చిత్తరువు ఒకటి; మరొకటి యోగి గంజాయి త్రాగటానికి హుక్కాను నోటపెట్టి పీల్చటం, అది గుప్పున అంటుకోవటం. ఇటువంటి చిత్తరువులు నాలో ఆధ్యాత్మిక ఉద్దీపనను కలిగిస్తాయి, బొమ్మ పండును చూస్తే నిజమైన పండు జ్ఞాపకం వచ్చినట్లు.
“కాని కామినీ కాంచనాలే యోగానికి ప్రతిబంధకాలు. ఇదే మనస్సు కనుక పరిశుద్ధమైతే యోగం సిద్ధిస్తుంది. మనస్సు కపాలంలో (అంటే భ్రూమధ్యంలో) నెలకొని ఉంటుంది. కాని దాని దృష్టి లింగం, అపానం, నాభి పైనే, అంటే కామినీ కాంచనాల మీదనే ఉంటుంది. సాధనలు అనుష్ఠిస్తే అదే మనస్సు ఊర్ధ్వదృష్టిని సంతరించుకుంటుంది.
“ఏ సాధనలు అనుష్ఠిస్తే మనస్సుకు ఊర్ధ్వదృష్టి కలుగుతుంది? సర్వదా సాధుసాంగత్యం ఉన్న పక్షంలో అన్నిటినీ తెలుసుకోవచ్చు. ఋషులు సర్వదా ఏకాంతవాసం చేసేవారు, లేకుంటే సాధు సాంగత్యంలో ఉండేవారు. అందుచేతనే వారు అలవోకగా కామినీ కాంచనాలను త్యజించి భగవంతునిపై మనస్సును నిలుప గలిగారు; వారిలో భయంగాని, ఇతరులు విమర్శిస్తారన్న జంకుగాని ఉండేది కాదు.
“పరిత్యజించాలంటే, అందుకు కావలసిన మనోసంకల్పం అనుగ్రహించమని భగవంతుణ్ణి ప్రార్థించాలి. దేనినైతే మిథ్య అని భావిస్తామో దాన్ని తక్షణమే పరిత్యజించాలి. ఋషులకు ఇటువంటి మనోసంకల్పం ఉండేది. ఈ సంకల్పశక్తి ద్వారా వారు జితేంద్రియులయ్యారు. తాబేలు తన అవయవాలను లోనికి లాగుకున్న పిదప దాన్ని ముక్కలు ముక్కలుగా నరికినప్పటికీ అవయవాలను బయటకు తీసుకోదు. (BG 2.58)
“సంసారి కపటియై ఉంటాడు; నిష్కపటిగా ఉండడు. భగవంతుణ్ణి ప్రేమిస్తున్నట్లు చాటుతాడు; కాని విషయ వస్తువుల పట్ల అతడికి ఉన్న ఆకర్షణ, కామినీ కాంచనాలపట్ల గల ఆసక్తిలో స్వల్పాంశం కూడా భగవంతుని పట్ల చూపడు. వారు భగవంతుణ్ణి ప్రేమించటం నోటి మాటల్లోనే. (మణిమల్లిక్తో) కాపట్యం వదలిపెట్టు. (BG 3.6)
మణిమల్లిక్: మనుష్యుల పట్లా లేక భగవంతుని పట్లా?
శ్రీరామకృష్ణులు: అందరిపట్లా. కాపట్యం మనుష్యుల పట్లా ఉండరాదు, భగవంతుని పట్లా ఉండరాదు; మొత్తం మీద కాపట్యమే ఉండరాదు.
“భవనాథ్ను చూడు. ఎంత సరళ హృదయుడు! వివాహానంతరం నా వద్దకు వచ్చి, ‘భార్యపట్ల నాకు ఇంత ప్రేమ కలుగుతూ ఉన్నదే, ఎందుకు?’ అని అడిగాడు. ఆహా! ఎంతటి సరళ స్వభావం!
మరి భార్య పట్ల ప్రేమ కలుగదా ఏమిటి? జగజ్జనని భువనమోహన మాయ అంటే ఇదే. ‘భార్య వలె నాకు సన్నిహితులైన వారు లోకంలో ఎవరూ ఉండరు; బ్రతుకులోను చావులోను, ఇహపరాల్లో నాకు సొంతమైన మనిషి ఈమే’ అనే భావన కలుగుతుంది.
“ఈ భార్య కారణంగా మనిషి ఎన్ని దుఃఖాలను అనుభవిస్తాడు! అయినప్పటికీ ఆమెలా తనకు సన్నిహితులు మరెవరూ లేరని భావిస్తాడు. ఎంతటి దురవస్థ! నెల జీతం ఇరవై రూపాయలు, దానికి తోడు ముగ్గురు పిల్లలు. వారికి కడుపునిండా తిండి పెట్టడానికి కూడా తాహతు లేదు. ఇంటి పైకప్పు కారుతోంది, మరమ్మతు చేయటానికి డబ్బు లేదు. పిల్లలకు కొత్త పుస్తకాలు కొనియివ్వలేడు. కుమారుడికి ఉపనయనం చేయించలేకపోతున్నాడు; ఇక్కడ ఎనిమిది అణాలు, అక్కడ ఎనిమిది అణాలు బిచ్చమెత్తుతున్నాడు.
“కాని విద్యాస్వరూపిణియైన భార్యే నిజమైన జీవిత భాగస్వామిని. భర్త భగవన్మార్గంలో పురోగమించటంలో ఆమె విశేషంగా సాయపడుతుంది. ఒకరిద్దరు పిల్లలు పుట్టాక, ఇద్దరూ అన్నాచెల్లెళ్లుగా జీవిస్తారు; ఇద్దరూ భగవంతుని భక్తులు – సేవకుడు, సేవిక. వారి సంసారం విద్యాసంసారం. భగవంతుడితోనూ, భక్తులతోనూ వారు సదా ఆనందం పొందుతూ ఉంటారు. భగవంతుడు మాత్రమే తమ సొంతమనిషి, ఎప్పటికీ తమకు సొంతమని తెలుసుకుంటారు. పాండవుల వలె వారు సుఖదుఃఖాలలో భగవంతుణ్ణి విస్మరించరు.
20.1.3 సంసారుల భక్తి – త్యాగ భక్తి
“భగవంతుని పట్ల సంసారుల ప్రేమ క్షణికమే. ఎర్రగా కాలిన పెనంపై నీటి బిందువు పడితే ‘సుయ్’ అని పొంగి వెంటనే మాయమైపోతుందే – అటువంటి దన్నమాట. సంసారుల మనస్సు విషయ సుఖాల వైపు మరలి ఉంటుంది. అందుచేతనే వారికి భగవంతునిపట్ల అటువంటి ప్రేమ, వ్యాకులతలు జనించవు.
“ఏకాదశిని మూడు రకాలుగా పాటిస్తారు. మొదటి రకం నిర్జల ఏకాదశి – నీరు కూడా త్రాగకుండా ఉపవసించటం. పూర్ణత్యాగియైన పరివ్రాజకుడు కూడా అదేమాదిరి అన్ని రకాల భోగాలను పూర్తిగా పరిత్యజిస్తాడు. రెండవ రకం, పాలు ఫలహారం పుచ్చుకోవటం. ఇటువంటి భక్తుడు సంసారంలోని సామాన్య సుఖాలను అనుభవిస్తాడు. మూడవ రకం భక్తుడు పూరి, బంగాళదుంపల కూరతో కడుపు నిండా తింటూ ఏకాదశిని పాటిస్తాడు. పైగా వీలుపడితే రెండు రొట్టెలను పాలలో నానబెడతాడు – పిదప వచ్చి ఒక పట్టుపట్టటానికి.
“లోకులు సాధన భజనలు చేస్తూ ఉంటారు. కాని మనస్సో, కామినీ కాంచనాలపైనే. మనస్సు భోగాలను వాంఛించటం వల్లనే సాధన భజనలు సత్ఫలితాలను కలిగించవు.
“హాజ్రా ఇక్కడ జపతపాలు ఎంతో అనుష్ఠించేవాడు. కాని గ్రామంలో అతడికి భార్య, పిల్లలు, పొలం ఉన్నాయి. అందుకే జపతపాలకు తోడుగా దళారి పని కూడా చేస్తాడు. ఇటువంటి వారి మాటలు నిలకడగా ఉండవు. ఇక చేపలు తినం అంటారు, అంతలోనే తినటమూ జరుగుతుంది.
“ధనం కోసం జనులు దేనికైనా ఒడిగడతారు. బ్రాహ్మణులతో, సాధువులతో కూడా కూలీపని చేయించుకుంటారు.
“మిఠాయిలు చెడిపోవ నారంభించినా సరే, వాటిని అటువంటి వారికి ఇవ్వడానికి నాకు మనస్కరించదు. ఇతరులు శౌచానికి ఉపయోగించే చెంబులోని నీటిని కూడా స్వీకరించగలను, కాని ఇటువంటి వ్యక్తుల చెంబును నేను స్పృశించనైనా లేను.
“ధనికులను చూస్తే హాజ్రా ప్రక్కకు పిలుస్తాడు, సుదీర్ఘ ఉపదేశాల నిస్తాడు. పిదప వారితో, ‘ఇదుగో ఇక్కడ చూస్తున్నారే రాఖాల్ మొదలైన యువకులు, వీరు జపతపాలు ఏమీ చేయరు. ఊరకే అటూ ఇటూ పరుగులు పెడుతూ ఉంటారు, అంతే’ అంటాడు.
“కొందరు కొండ గుహలో వసిస్తూ ఉంటారు, ఒంటికి విభూతి పూసుకుంటారు, ఉపవాసం చేస్తారు. పలురకాల కఠోర తపస్సులు ఒనరిస్తారు. కాని లోలోన మనస్సు విషయసుఖాలను వాంఛిస్తూ ఉంటుంది, కామినీ కాంచనాలను ఆకాంక్షిస్తూ ఉంటుంది. అటువంటి వారిని నేను ‘ఛీ’ అంటాను. ఎవరైతే కామినీ కాంచనాలను ఆశించక, తింటూ త్రాగుతూ ఆనందంగా తిరుగుతూ ఉంటారో వారిని నేను ధన్యులంటాను. (మణిమల్లిక్ను చూపుతూ) ఈతడి ఇంట్లో సాధువుల చిత్తరువు ఒక్కటీ లేదు. సాధువుల చిత్తరువులను ఉంచితే భగవదుద్దీపన కలుగుతుంది.”
మణిమల్లిక్: ఉన్నది. ప్రార్థిస్తూ ఉన్న ఒక క్రైస్తవ భక్తురాలి చిత్తరువు నందిని* గదిలో ఉంది. మరో చిత్తరువు ఉంది – దాన్లో విశ్వాసమనే కొండను ఒకడు పట్టుకుని ఉన్నాడు, క్రింద అగాధమైన మహాసముద్రం. విశ్వాసాన్ని విడిచిపెడితే సముద్రంలో పడిపోవటమే. మరో పటంలో వరుడు వస్తాడని కన్యలు పలువురు దీపాలలో నూనె పోసి, నిద్రించక నిరీక్షిస్తూ ఉంటారు. ఒక కన్య నిద్రపోతూ ఉంది, చివరకు ఆమె వరుణ్ణి చూడలేకపోయింది. ఇక్కడ భగవంతుడే వరునిగా అభివర్ణించబడి ఉన్నాడు.*
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): ఓ! అది మంచిది.
మణిమల్లిక్: ‘విశ్వాస వృక్షం’, ‘పాపపుణ్యాల చిత్తరువు’* లాంటి చిత్తరువులు కొన్ని ఉన్నాయి.
శ్రీరామకృష్ణులు (భవనాథ్తో): అన్నీ మంచి చిత్తరువులు. ఒకసారి వెళ్లి చూసిరా.
శ్రీరామకృష్ణులు కొంతసేపు మౌనంగా ఉండిపోయారు. ఆ తరువాత మాట్లాడసాగారు.
శ్రీరామకృష్ణులు: కొన్ని సమయాలలో ఇటువంటి విషయాలను గురించి ఆలోచిస్తూ ఉంటాను – అప్పుడు ఇవన్నీ నాకు నచ్చవు. ఆరంభంలో సాధకుడు పాపం గురించీ, దాని నుండి విడివడటం ఎట్లా అన్నదీ కాస్త యోచించాలి. కాని భగవత్కృపతో ఆయన పట్ల భక్తి జనిస్తే, రాగభక్తి కలిగితే అప్పుడు పాపపుణ్యాలన్నిటినీ మరచిపోతాడు. దాని తరువాత శాస్త్ర విధివిహితాలకు అతీతమై పోతాడు. అటుపై పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం లాంటి భావాలు తలెత్తవు. వంపులు తిరిగి ప్రవహించే నది గుండా శ్రమకోర్చి చాలా సమయం తరువాత గమ్యానికి చేరటం లాంటిది ఇది. కాని వరదలొచ్చి సర్వత్రా నీరు నిండి ఉన్నప్పుడు చుట్టు తిరిగి వెళ్లకుండా తిన్నగా వెళ్లవచ్చు. పొలాలు అప్పుడు వెదురుగడ లోతులో మునిగి ఉంటాయి.
“ఆరంభ దశలో ఎక్కువగా తిరుగవలసి ఉంటుంది, ఎంతో కష్టపడవలసి ఉంటుంది. రాగభక్తి ఉదయిస్తే మార్గం సుగమమవుతుంది. కోతలు పూర్తయ్యాక పొలానికి అడ్డంగా నడిచి సులభంగా వెళ్లటం లాంటిది ఇది. కోతకు మునుపు గట్ల వెంట చుట్టుతిరిగి వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏ దారిలోనైనా వెళ్లవచ్చు. దారిలో ఒకటి రెండు పరిగ మోళ్లు నిలచి ఉండవచ్చు; కనుక కాళ్లకు చెప్పులు వేసుకుంటే ఎలాంటి కష్టం ఉండదు. వివేకం, వైరాగ్యం, గురువాక్యాల పట్ల విశ్వాసం కుదిరితే ఏ కష్టమూ ఉండదు.”
20.1.4 ధ్యానయోగం – శివయోగం – విష్ణుయోగం
మణిమల్లిక్: స్వామి, ధ్యానానికి నియమాలు ఏమిటి? ధ్యానం ఎక్కడ చేయాలి?
శ్రీరామకృష్ణులు: హృదయమే భేషయిన స్థానం. హృదయంలో ధ్యానం చేయవచ్చు లేక సహస్రారంలో ధ్యానం చేయవచ్చు. ఇవి విధి విహితంగా చేయదగిన ధ్యానాలు, ఇవి శాస్త్రాలలో పేర్కోబడి ఉన్నాయి. కాని నీకు ఎక్కడ నచ్చితే అక్కడ ధ్యానించవచ్చు. అన్ని చోట్లూ బ్రహ్మమయమైనవే కదా! ఆయన ఎక్కడ మాత్రం లేడు?
“బలిచక్రవర్తి సమక్షంలో శ్రీమన్నారాయణుడు మూడు అడుగులలో స్వర్గం, భూలోకం, పాతాళాలను ఆక్రమించి వేశాడు. అప్పుడు ఆక్రమించబడని స్థలం అంటూ ఏదన్నా మిగిలి ఉందా? గంగాతీరం ఎంత పవిత్రమైనదో, మురికిగా ఉన్న చోటు కూడా అంతే పవిత్రమైనది. ఇదంతా భగవంతుని విరాట్ స్వరూపమని పేర్కోబడుతోంది.
“ధ్యానం రెండు రకాలు: నిరాకార ధ్యానం, సాకార ధ్యానం. నిరాకార ధ్యానం ఎంతో కష్టం. దేనినంతా చూస్తూ ఉన్నావో, వింటూ ఉన్నావో అవన్నీ ఆ ధ్యానంలో లీనం అయిపోతాయి; కేవలం స్వస్వరూపాన్ని గురించిన చింతన మాత్రమే ఉంటుంది. ఆ స్వస్వరూపాన్ని చింతన చేస్తూ శివుడు నృత్యం చేస్తాడు, ‘నే నేమిటి, నే నేమిటి?’ అంటూ నృత్యం చేస్తాడు. దీనిని శివయోగం అంటారు. ఈ రీతి ధ్యాన సమయంలో దృష్టి కపాలం కేసి పరపి ఉండాలి; ‘నేతి, నేతి’ అంటూ సంసారాన్ని విడిచిపెట్టి, స్వస్వరూపాన్ని చింతన చేయాలి.
“విష్ణుయోగం అని మరో యోగం ఉంది. నాసికాగ్రంపై దృష్టి – సగం బయట, సగం లోపల ఉంటుంది. సాకార ధ్యానం కుదిరేది ఇలాగే.
“శివుడు కొన్ని సమయాలలో సాకార చింతన చేస్తూ నృత్యం చేస్తాడు; రామ్ రామ్ అంటూ నృత్యం చేస్తాడు.
20.2 ద్వితీయ పరిచ్ఛేదం
మణిలాల్మల్లిక్ ప్రధాన బ్రహ్మసమాజానికి చెందినవాడు. భవనాథ్, రాఖాల్, ‘మ’ లు అప్పుడప్పుడు బ్రహ్మసమాజానికి వెళ్లటం కద్దు. ఓంకారం వివరణ, యథార్థమైన బ్రహ్మజ్ఞానం, బ్రహ్మదర్శనానంతర స్థితి మొదలైన వాటిని భక్తులకు వివరించసాగారు.
శ్రీరామకృష్ణులు: “శబ్ద బ్రహ్మం. ఋషులు, మునులు ఈ శబ్ద బ్రహ్మాన్ని పొందటానికి తపస్సులు చేసేవారు. సిద్ధస్థితిని చేరుకున్నాక దాన్ని ఆలకించవచ్చు. నాభి నుండి ఆ శబ్దం తనంతట తానుగా పైకి ఎగసి వస్తుంది – అదే అనాహత శబ్దం.
“కేవలం శబ్దం మాత్రం వినటం వలన ఏం ప్రయోజనమని కొందరు అడుగుతారు. దూరం నుంచి అలల ఘోష వింటాము. ఆ ఘోషను వెన్నంటి పోతే సముద్రాన్ని చేరుకోవచ్చు. అలల ఘోష ఉంటే సముద్రమూ ఉంటుంది. అదే విధంగా అనాహత శబ్దాన్ని వెన్నంటి పోతే ఆ శబ్దం సూచించే బ్రహ్మం వద్దకు చేరుకోవచ్చు. దానినే పరమపదం అంటారు. ‘నేను’ ఉన్నంత వరకు ఇటువంటి దర్శనం కాదు. ఎక్కడ ‘నేను’ ఉండదో, ‘నువ్వు’ ఉండదో, ‘ఒకటి’ ఉండదో, ‘అనేకం’ ఉండదో అక్కడే ఇటువంటి దర్శనం కలుగుతుంది.
20.2.1 సూర్యుడు, ప్రతిబింబం – జీవాత్మ, పరమాత్మ – జ్ఞానం, అజ్ఞానం; ముల్లు ఉపమానం
“సూర్యుడు, నీటితో నిండిన పది కుండలు ఉన్నాయనుకో. ప్రతి కుండలోను సూర్యబింబం కనిపిస్తుంది. మొదట ఒక సూర్యుడు, పది ప్రతిబింబాలు కనిపిస్తాయి. తొమ్మిది కుండలను పగులగొడితే మిగిలి ఉన్నది ఒక సూర్యుడు, ఒక ప్రతిబింబమూ. ప్రతి కుండ ఒక జీవుని సూచిస్తుంది. ప్రతిబింబ సూర్యుని ద్వారా నిజమైన సూర్యుణ్ణి కనుగొనవచ్చు. జీవాత్మ ద్వారా పరమాత్మను పొందవచ్చు. జీవుడు (జీవాత్మ) సాధన భజనలు చేస్తే పరమాత్మ దర్శనాన్ని పొందవచ్చు. చివరి కుండను కూడా పగులగొడితే ఏం మిగిలి ఉంటుందో నోటితో చెప్పలేము.
“జీవుడు తొలుత అజ్ఞాన స్థితిలో ఉంటాడు. అతడిలో భగవంతుడి గురించిన ఎరుక ఉండదు. నానా వస్తువుల గురించిన ఎరుక ఉంటుంది, తన చుట్టూ అనేక వస్తువులను చూస్తాడు. అతడికి జ్ఞానం సిద్ధించినప్పుడు భగవంతుడు సకల భూతకోటిలోనూ నెలకొని ఉన్నట్లు ఎరుక కలుగుతుంది. ఉదాహరణకు, కాలులో ముల్లు గుచ్చుకొంటే మరొక ముల్లుతో ఆ ముల్లును తీసివేస్తాం. అంటే జ్ఞానమనే ముల్లుతో అజ్ఞానమనే ముల్లును బయటకు తీసివేస్తాం. తరువాతిదైన విజ్ఞాన స్థితిని పొందినప్పుడు అజ్ఞానమనే ముల్లు, జ్ఞాన మనే ముల్లు రెంటినీ పారవేస్తాం. అప్పుడు భగవద్దర్శనం మాత్రమే కాదు, రేయింబవళ్లు ఆయనతో మాట్లాడటం, ముచ్చటించటం కూడా జరుగుతుంది.
“ఎవడు పాలను గురించి వినటం మాత్రమే చేసివుంటాడో అతడు అజ్ఞాని. ఎవడు పాలను చూసివున్నాడో అతడికి జ్ఞానం కలిగింది. కాని ఎవడు పాలను త్రాగి పుష్టికరంగా తయారవుతాడో అతడికే విజ్ఞానం సిద్ధించింది.”
శ్రీరామకృష్ణులు భక్తులకు తమ స్థితిని వివరిస్తూ ఉన్నారా? విజ్ఞాని స్థితిని వర్ణించటం ద్వారా తమ స్థితిని తెలుపుతున్నారా?
20.2.2 శ్రీరామకృష్ణుల స్థితి – భగవద్దర్శనానంతర స్థితి
శ్రీరామకృష్ణులు (భక్తులతో) : జ్ఞానియైన సాధువుకు విజ్ఞానియైన సాధువుకు మధ్య తారతమ్యం ఉంది. జ్ఞానియైన సాధువు కూర్చునే పద్ధతే వేరు; మీసాన్ని కాస్త మెలిత్రిప్పి ఉంచుకుంటాడతడు. ఎవరైనా వస్తే ‘ఏమయ్యా? నువ్వు ఏమైనా అడగాలనుకుంటున్నావా?’ అని అతణ్ణి అడుగుతాడు. కాని సర్వదా భగవంతుని దర్శిస్తూ, ఆయనతో మాట్లాడుతూ ఉన్న విజ్ఞాని సాధువు స్వభావమే వేరు. అతడు కొన్ని సమయాల్లో జడునిలా, కొన్ని సమయాల్లో పిశాచంలా, కొన్ని సమయాల్లో బాలుడిలా, కొన్ని సమయాల్లో ఉన్మాదిలా ఉంటాడు. కొన్ని సమయాల్లో సమాధిమగ్నుడై బాహ్యస్మృతిని కోల్పోయి జడుని వలె ఉంటాడు.
“సర్వం బ్రహ్మమయంగా చూస్తాడు కనుకనే పిశాచి వంటి స్థితి; శుచి అశుచి –వీటి ఎరుక ఉండదు, బహుశా బయలుకు పోతున్నప్పుడు నేరేడుపండును తింటూ ఉండవచ్చు – పసి పిల్లవానివలె. వీర్యం నుంచే కదా ఈ దేహం ఉత్పన్నమైనదనే భావం కారణంగా, స్వప్నస్ఖలనం జరిగిపోవటాన్ని కూడా అశుద్ధంగా ఎంచడు. మలమూత్రాల విచక్షణా అతడికి ఉండదు; సకలం బ్రహ్మమయం. అన్నం, పప్పులను కొన్ని రోజులు నిల్వ ఉంచితే అవీ మలం వలె మారిపోతాయి.
“మళ్లీ ఉన్మాదిలా ఉంటాడు. అతడు వ్యవహరించే తీరు చూసి ప్రజలు అతణ్ణి పిచ్చివాడంటారు. కొన్ని సమయాల్లో అతడు ఒక పసిపిల్లవాడిలా ఉంటాడు. అతడికి లజ్జ, ద్వేషం, సంకోచం – ఇత్యాదుల బంధనం ఏదీ ఉండదు.
“భగవద్దర్శనానంతరం ఈ స్థితి ఏర్పడుతుంది. అయస్కాంత పర్వతానికి సమీపంగా ఓడ వెళ్లటం జరిగితే దాని మరమేకులు, మేకులు అన్నీ ఊడిపోతాయి. భగవద్దర్శనం పిదప కామక్రోధాదులు ఉండవు.
“కాళికాలయం మీద పిడుగు పడ్డప్పుడు అనేక మరమేకుల తలలు ఎగిరి పోవటం చూశాను.
“భగవద్దర్శనం పొందిన వ్యక్తి, పిల్లలను కనటం వంటి సృష్టికార్యాలలో పాల్గోలేడు. విత్తును నాటితే మొక్క మొలుస్తుంది, కాని ఉడకబెట్టిన విత్తనాలను నాటితే మొలకెత్తవు.
“భగవద్దర్శనం పొందిన వ్యక్తిలో ‘నేను’ నామమాత్రంగానే ఉంటుంది; దానితో అతడు ఎటువంటి అన్యాయానికీ పాల్పడలేడు. కొబ్బరిచెట్టు నుండి మట్ట రాలిపడిపోయాక అక్కడ ఒక మచ్చమాత్రం ఉండేట్లు, అతడిలో అహం నామమాత్రంగానే ఉంటుంది.
20.2.3 భగవద్దర్శనానంతరం ‘అహం’ – శ్రీరామకృష్ణులు, కేశవ్సేన్
“నే నొకసారి కేశవ్సేన్తో, ‘అహంను అంటే ‘నేను కర్తను, నేను జనానికి బోధిస్తున్నాను’ అనే భావనను విడిచి పెట్టండి’ అన్నాను. అందుకు అతడు, ‘మహాశయా, అలా అయితే ఈ సమాజం గిమాజం ఏదీ నిలచి ఉండదే’ అన్నాడు. అప్పుడు నేను, ‘దుష్ట–అహంను విడిచిపెట్టు. భగవంతుడి దాసుడను నేను, భగవంతుడి భక్తుడను నేను అన్న అహాన్ని వదిలిపెట్టనవసరం లేదు. ‘దుష్ట – అహం ఉన్నందుననే దైవీ – అహం జనించదు. సరకుల గదిని ఒకడు బాధ్యతతో చూసుకుంటే ఇంటి యజమాని దాని వ్యవహారాన్ని పట్టించుకోడు.
20.2.4 శ్రీరామకృష్ణులు – నరలీల, అవతార తత్త్వం
“ఇదుగో చూడండి, నా చేతికి దెబ్బ తగిలాక నా స్వభావం మారిపోతూ ఉంది. ఇప్పుడు, మనిషిలో భగవంతుడు అధికంగా అభివ్యక్తీకరించడం నాకు కానవస్తోంది. ‘మనుష్యులలో నేను వసిస్తాను. కనుక మనుష్యులతో నువ్వు ఆనందంగా ఉండు’ అని భగవంతుడు చెబుతూ ఉన్నట్లు తోస్తోంది.
“భగవంతుడు శుద్ధభక్తులలో అధికంగా అభివ్యక్తమవుతాడు. కాబట్టే నరేంద్రుడు, రాఖాల్లను చూడడానికి ఇంత ఆరాటం కలుగుతోంది. చెరువు గట్టు ప్రక్కన చిన్న చిన్న బొరియలు ఉంటాయి; వాటిలో చేపలు, పీతలు మొదలైనవి చేరుకొంటాయి. అదే విధంగా మనిషిలో భగవంతుడు అధికంగా విరాజిల్లుతాడు.
“సాలగ్రామం కంటే కూడా మనిషి ఉన్నతుడని చెబుతారు. నరుడే నారాయణుడు. ప్రతిమలో భగవంతుడు వెలసి ఉన్నప్పుడు, మనిషిలో వెలసి ఉండడా ఏమిటి?
“భగవంతుడు నరలీల జరిపే నిమిత్తం మానవ రూపంలో, అంటే రాముడు, కృష్ణుడు, చైతన్యుడు మొదలైన రూపాలలో అవతరిస్తున్నాడు. అవతార పురుషుని స్మరించటం భగవంతుని స్మరించటమే అవుతుంది.”
ఆ సమయంలో బ్రహ్మసమాజ భక్తుడైన భగవాన్ దాస్ వచ్చాడు.
శ్రీరామకృష్ణులు (భగవాన్ దాస్‌తో): ఋషుల మతం సనాతన ధర్మం. అది అనాది కాలం నుంచీ వస్తూ ఉన్నది, ఇంకా ఉంటుంది కూడా. ఈ సనాతన ధర్మంలో సాకారోపాసన, నిరాకారోపాసన – అన్ని రకాల ఉపాసనలు చోటుచేసుకొని ఉన్నాయి; జ్ఞానమార్గం, భక్తిమార్గం అన్నీ ఉన్నాయి. క్రొత్తగా ఎన్నో మతాలు ఉద్భవించాయి, అవి కొంతకాలం ఉండి తరువాత మటుమాయమైపోతాయి.
20.3 తృతీయ పరిచ్ఛేదం దక్షిణేశ్వరంలో రాఖాల్, రామ్, నిత్యగోపాల్, అధర్, ‘మ’, మహిమ ప్రభృతులతో
ఆదివారం, మార్చ్ 23, 1884
మధ్యాహ్న భోజనానంతరం రాఖాల్, రామ్ తదితర భక్తులతో శ్రీరామకృష్ణులు తమ గదిలో కూర్చుని ఉన్నారు. ఇంకా ఆయన పూర్తిగా కోలుకోలేదు. చేతికట్టు ఇంకా విప్పలేదు. అనారోగ్యంతో ఉన్నప్పటికీ తమ ప్రేమపూరిత వచనాలతో, భగవత్ ప్రసంగాలతో భక్తుల హృదయాలను ఆనందంలో ఓలలాడిస్తూ ఉన్నారు. భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు. కొన్ని సమయాల్లో భజనానందం, మరికొన్ని సమయాల్లో సమాధిమగ్నులై బ్రహ్మానందం అనుభవిస్తూ ఉన్నారు పరమహంస శ్రీరామకృష్ణులు. భక్తులు దీనినంతా ఆశ్చర్యచకితులై చూస్తూ ఉన్నారు. శ్రీరామకృష్ణులతో సంభాషిస్తూ రామ్, నరేంద్రుడి ప్రస్తావన తెచ్చాడు.
20.3.1 నరేంద్రుని వివాహ ప్రస్తావన – నరేంద్రుడు నాయకుడౌతాడు
రామ్: ఆర్. మిత్రగారి కుమార్తెను నరేంద్రునికిచ్చి వివాహం చేయాలనే మాటలు జరుగుతున్నాయట. బోలెడు కట్నం కూడా ఇస్తారట.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): అవును, అతడు అలాగే ఒక సమాజ నాయకుడే అయిపోతాడు. అతడు దేనిని ఎంచుకుంటాడో దాన్లో గొప్పగా రాణిస్తాడు.
నరేంద్రుని గురించిన ప్రస్తావనను శ్రీరామకృష్ణులు పొడిగించలేదు.
శ్రీరామకృష్ణులు (రామ్‌తో): అది సరే, అస్వస్థత కలిగితే నే నెందుకు ఇంత అశాంతికి గురి అవుతాను? నాకు ఎలా నయం అవుతుందని వచ్చేపోయే వాళ్లను అడుగుతున్నాను. ఎందుకు అలా? ఒకటి, అందరినీ విశ్వసించనైనా విశ్వసించాలి, లేకుంటే ఎవరినీ విశ్వసించకూడదు. భగవంతుడే డాక్టర్లుగాను, కవిరాజ్లుగాను అయి ఉన్నాడు. అందుచేతనే వైద్యులను విశ్వసించాలి. వారిని కేవలం మానవులుగా భావిస్తే విశ్వాసం చేకూరదు.
20.3.2 శంభుమల్లిక్, హలధారి అస్వస్థత
“శంభుమల్లిక్కు తీవ్రంగా జ్వరం వచ్చింది. డాక్టర్ సర్వాధికారి వచ్చి పరీక్షించి, అది ఎక్కువ మోతాదులలో ఔషధం సేవించడం వల్ల వచ్చిన తీవ్రత అని తెలిపాడు.
“హలధారి తన చేతిని చాపి, నాడి పరీక్షించమని అడిగాడు. డాక్టరు, ‘కళ్లు చూపండి, మీ ప్లీహం వాచి ఉంది’ అన్నాడు. అందుకు హలధారి, ‘ప్లీహమూ వాయలేదు, గ్లీహమూ వాయలేదు’ అన్నాడు. డాక్టర్ మధు ఇచ్చే మందులు బాగా పనిచేస్తాయి.”
రామ్: మందులు దేహ ప్రవృత్తికి ఎంతో సహాయం చేస్తున్నప్పటికీ వాటితో ప్రయోజనం లేదు.
శ్రీరామకృష్ణులు: మందుల వలన ప్రయోజనం లేదంటే నల్లమందు ఎలా విరేచనాలను అరికట్టుతోంది?
20.3.3 ‘సులభ్ సమాచార్’ పత్రికలో శ్రీరామకృష్ణుల గురించి ప్రచురించడం
కేశవ్ సేన్ మరణం గురించి రామ్ ప్రస్తావించాడు.
రామ్: మీరన్నది నిజమే – మంచి జాతి గులాబీ మొక్కను తోటమాలి వేరు దాకా బాగా త్రవ్వి ఉంచుతాడు; అప్పుడే మంచుబిందువులు పడి అది బాగా ఎదుగుతుంది. మీమాట అట్లే ఫలించింది. మహాత్ముల మాట కదా!
శ్రీరామకృష్ణులు: అరె నాయనా, నాకు తెలిసింది ఏమిటి? నేను లెక్కలు కట్టి అలా చెప్పి ఉండలేదు. మీరే అంతా ఇలా అంటున్నారు.
రామ్: బ్రహ్మసమాజస్థులు మీ గురించి తమ పత్రిక (సులభ్ సమాచార్)లో ప్రచురించి ఉన్నారు.
శ్రీరామకృష్ణులు: ప్రచురించారా? అది ఎందుకు? ఇప్పుడు ఎందుకు వ్రాయటం? నేను ఏదో తింటూ త్రాగుతూ జీవిస్తున్నాను. మరేదీ నాకు తెలియదు. కేశవ్‌తో ఒకసారి, ‘ఎందుకు ప్రచురించావు?’ అని అడిగాను. అందుకు అతడు, ‘మీ వద్దకు జనులు వస్తారని’ అన్నాడు.
20.3.4 భగవత్ శక్తితోనే బోధన – హనుమాన్ సింగ్ కుస్తీపోటీ
(రామ్ ప్రభృతులతో) “మానవశక్తితో జనులకు బోధించలేము. భగవంతుని శక్తి లేకుండా అవిద్యను జయించలేం.
“ఇద్దరు వ్యక్తుల మధ్య కుస్తీ పోటీ జరిగింది; ఒకడు హనుమాన్ సింగ్, మరొకడు పంజాబీ మహమ్మదీయుడు. మహమ్మదీయుడు దార్ఢ్యగా ఉన్నాడు; కుస్తీపోటీకి పదిహేను రోజుల ముందు నుండి మాంసం, నెయ్యి బాగా లాగించాడు. పోటీ రోజున కూడా బాగా తిన్నాడు. అతడే గెలుస్తాడని అందరూ తలచారు. హనుమాన్సింగ్ మాసిపోయిన బట్టలు వేసుకునేవాడు; పోటీకి కొన్ని రోజుల ముందు నుండి ఆహారం తగ్గించి ఆంజనేయస్వామి నామస్మరణ చేయసాగాడు. పోటీ నాడు కఠోర ఉపవాసం! అతడు నిశ్చయంగా ఓడిపోతాడనే అందరూ తలచారు. కాని అతడే గెలిచాడు. పదిహేను రోజులుగా పొట్టపగిలేట్లు తిన్నవాడు ఓడిపోయాడు.
“ముద్రించినందున, ప్రకటించడం వలన ఏం ప్రయోజనం? జనులకు బోధించవలసిన వ్యక్తికి అందుకైన శక్తి భగవంతుని నుండి సిద్ధిస్తుంది. త్యాగ భావన లేకుండా బోధించ సాధ్యం కాదు. నే నో మూర్ఖాతిమూర్ఖుడను.” (అందరూ నవ్వారు)
ఒక భక్తుడు: అలా అయితే మీ ముఖతా వేదవేదాంతాలు, ఇలాంటివి మరెన్నో వెలువడుతూ ఉన్నవే, అదెలా?
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): నా చిన్నప్పుడు (కామార్పుకూర్లో) లాహాల ఇంటికి ఏతెంచే సాధువులు చదివేవన్నీ నేను అర్థం చేసుకునేవాణ్ణి. అక్కడక్కడా కాస్త అర్థం అయ్యేది కాదు, అంతే. ఎవరైనా పండితులు సంస్కృతంలో మాట్లాడితే అర్థం చేసుకోగలను. కాని స్వయంగా సంస్కృతం మాట్లాడటం రాదు.
20.3.5 పాండిత్యం జీవితోద్దేశ్యమా? – మూర్ఖునిపై కూడా భగవత్కృప
“భగవంతుని ప్రాప్తించుకోవడమే జీవిత లక్ష్యం. గురి చూసి బాణం ప్రయోగించేటప్పుడు అర్జునుడు, ‘నాకు మరేదీ కనిపించటం లేదు, పక్షికన్ను మాత్రమే కనిపిస్తోంది. రాజులు కనబడటం లేదు, చెట్టు కానరావటం లేదు; పక్షి కూడా కనబడటం లేదు’ అన్నాడు.
“భగవంతుని ప్రాప్తించుకుంటే చాలు. సంస్కృతం తెలియకపోతే ఏం? భగవంతుని కొరకు వ్యాకులపడుతున్న బిడ్డలందరిపైనా ఆయన కటాక్షం సమానంగానే ప్రసరిస్తుంది. పండితుడు, పామరుడు అన్న తేడా ఉండదు. తండ్రికి అందరి బిడ్డలపట్ల సమానమైన ప్రేమే.
“ఒక తండ్రికి ఐదుమంది పిల్లలు. ఒకరిద్దరు పిల్లలు ‘నాన్నా’ అని పిలువగలరు. కొందరు ‘నానా’ అని మాత్రమే పిలువగలరు, పూర్తిగా ఉచ్చరించలేరు. ‘నానా’ అని పిలిచే బిడ్డ కంటే ‘నాన్నా’ అని పిలిచే బిడ్డ పట్ల తండ్రి ప్రేమ అధికంగా ఉంటుందా ఏమిటి? ఆఖరి పిల్లలు పసివారు, వారు ‘నాన్నా’ అని స్పష్టంగా పిలువలేరు అన్న విషయం తండ్రికి తెలుసు.
20.3.6 శ్రీరామకృష్ణులు – నరలీలాభిలాష
“ఈ చెయ్యి విరిగినప్పటి నుండి నా మనోస్థితిలో ఒక మార్పు కలుగుతూ ఉన్నది; నరలీలను మనస్సు ఎంతో అభిలషిస్తూ ఉంది. భగవంతుడే మానవ రూపంలో లీలలు సలుపుతున్నాడు. మట్టి ప్రతిమలో ఆయనను పూజించవచ్చునంటే మనిషిలో పూజించలేమా?
“ఒక వర్తకుని ఓడ లంక సమీపాన సముద్రంలో మునిగిపోయింది. అతడు ప్రవాహంలో కొట్టుకుంటూ ఒడ్డును చేరుకున్నాడు. తమ రాజైన విభీషణుని ఆజ్ఞ మేరకు కావలివారు వర్తకుని ఆయన ముందు నిలబెట్టారు. అతణ్ణి చూసి విభీషణుడు ఆనందాతిశయంతో, ‘ఆహా! ఇతడు నా రాముడిలా ఉన్నాడు, అదే మానవరూపం’ అని, ఆ వర్తకుని అమూల్య వస్త్రాలతో, ఆభరణాలతో ముంచెత్తాడు. ఈ కథను ప్రప్రథమంలో విన్నప్పుడు నేను పొందిన ఆనందం వర్ణనాతీతం.
20.3.7 వైష్ణవచరణ్ – కర్తాభజా శాఖ
“వైష్ణవచరణ్ను అడిగినప్పుడు అతడు, ‘తాను ప్రేమిస్తూ ఉన్న వ్యక్తిని తన ఇష్టదైవంగా చూడగలిగితే అతడి మనస్సు సులభంగా భగవంతుని వైపుకు మరలుతుంది’ అని అంటూండేవాడు. కామార్పుకూర్ వద్ద గల శ్యాంబజార్లోని ఒక ఫలానా శాఖలోని* స్త్రీ పురుషులు, ‘నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు?’ అని అడుగుతారు. ‘ఫలానా వ్యక్తిని’ అంటే ‘మంచిది, అతణ్ణే నీ ఇష్టదైవంగా ఎంచి జీవించు’ అంటారు. నేను ఈ విషయం విన్నప్పుడు, ‘ఇది నా మార్గం కాదు, నాది మాతృభావం’ అన్నాను. వీళ్లు పెద్ద పెద్ద మాటలే మాట్లాడుతుంటారు, మళ్ళీ వ్యభిచారం కూడా చేస్తూ ఉంటారు. ఆ స్త్రీలు నాతో, ‘మాకు ముక్తి లభిస్తుందా?’ అని అడిగారు. అందుకు నేను, ‘లభిస్తుంది, ఒక్కరిని మాత్రమే భగవంతునిగా ఎంచి అతడితో విశ్వసనీయంగా జీవిస్తే ముక్తి లభిస్తుంది. కాని ఐదుమంది పురుషులతో జీవిస్తే లభించదు’ అన్నాను.
రామ్: కేదార్బాబు కర్తాభజాల వద్దకు వెళ్లినట్లు ఉందే!
20.3.8 హలధారి తండ్రి – శ్రీరామకృష్ణుల తండ్రి – బృందావనంలో పారవశ్యం
శ్రీరామకృష్ణులు: అతడు అయిదు రకాల పువ్వుల నుండి తేనెను సేకరిస్తున్నాడు. (రామ్, నిత్యగోపాల్ ప్రభృతులను చూస్తూ) ఇదే నా ఇష్టదైవమని ఒక దైవం పట్ల నూటికి నూరుపాళ్లు విశ్వాసం కలిగిన వ్యక్తి భగవంతుని పొందటం తథ్యం, అతడు భగవద్దర్శనం పొందుతాడు.
“పూర్వకాలంలో జనంలో ప్రగాఢ విశ్వాసం ఉండేది. హలధారి తండ్రికి ఎంతటి విశ్వాసం ఉండేదో! ఒకమారు కుమార్తె ఇంటికి వెళుతూ ఉన్నాడు. దారిలో అందమైన పువ్వులను, బిల్వదళాలను చూశాడు. దేవతా పూజార్థం వాటిని సేకరించుకుని ఐదారు మైళ్లు నడిచి ఇంటికే తిరిగి వచ్చేశాడు.
“ఒకసారి రామాయణం వీథి నాటకం జరిగింది. కైకేయి రాముని వనవాసానికి పంపే దృశ్యం. నాటకాన్ని తిలకిస్తూ ఉన్న హలధారి తండ్రి హఠాత్తుగా లేచి నిలబడ్డాడు. తిన్నగా వేదిక పైకెక్కి, కైకేయి వేషం కట్టిన వ్యక్తి వద్దకెళ్లి, అతణ్ణి ‘తుచ్ఛుడా’ అని తిట్టి, తన చేతనున్న దీపంతో అతడి ముఖాన్నే కాల్చబోయాడు.
“స్నానం చేశాక చెరువు నీటిలో నిలబడే ‘రక్తవర్ణం చతుర్ముఖం’ అంటూ శ్లోకాలు వల్లిస్తూ ధ్యానం చేసేవాడు. అప్పుడు ఆయన కళ్లవెంట కన్నీరు ధారలు కట్టేది.
“పాదాలకు పావుకోళ్లు ధరించి మా తండ్రి వీథి వెంట వెళ్లేటప్పుడు దుకాణదారు లందరూ, ‘అదుగో ఆయన వస్తున్నారు’ అంటూ మర్యాదపూర్వకంగా లేచి నిలబడేవారు. హల్దార్పుకూర్ చెరువులో ఆయన స్నానం చేసేటప్పుడు ఇతరులు చెరువులో దిగటానికి కూడా భయపడేవారు. ‘ఆయన స్నానం చేసి వెళ్లిపోయారు’ అని నిర్ధారించుకున్న తరువాతనే దిగేవారు. ‘రఘువీరా! రఘువీరా!’ అని ఉచ్చరించేటప్పుడు ఆయన ఛాతీ ఎర్రగా కందిపోయేది. నాకూ అలా అవటం కద్దు. బృందావనంలో గోవులు గడ్డిమేసి తిరిగి వస్తూ ఉన్నప్పుడు పారవశ్య స్థితిలో నాకూ అట్లే అయింది.
“ఆనాటి జనులలో ప్రగాఢ విశ్వాసం ఉండేది. భగవంతుడు కాళీ రూపంలో వచ్చి నృత్యం చేస్తాడు, సాధకుడు చప్పట్లు చరచి తాళం వేస్తాడు – ఇటువంటి కథలనూ నేను వినివున్నాను.”
20.3.9 పంచవటీలో బసచేసిన హఠయోగి
పంచవటి కుటీరంలో ఒక హఠయోగి వచ్చి బసచేశాడు. అరియదాహకు చెందిన కృష్ణకిశోర్ కుమారుడు రామప్రసన్నుడు, మరికొందరు అతడి పట్ల అమిత భక్తి కలిగి ఉన్నారు. నల్లమందుకు, పాలకు అతడికి నెలకు ఇరవై ఐదు రూపాయలు అవసరం. రామప్రసన్నుడు శ్రీరామకృష్ణులను, “మిమ్మల్ని దర్శింప పలువురు భక్తులు వస్తూ ఉన్నారు. వారితో కాస్త చెబితే, ఈయనకు కొంచెం ధనం లభిస్తుంది” అని అడిగాడు. శ్రీరామకృష్ణులూ కొందరు భక్తులతో, “పంచవటిలో ఒక హఠయోగి బసచేసి ఉన్నాడు. అతడు ఎటువంటి వ్యక్తో చూసి రండి” అన్నారు.
20.4 చతుర్థ పరిచ్ఛేదం ఠాకూర్ దాదా, మహిమాచరణ్లకు ఉపదేశం
అప్పుడు ఠాకూర్ దాదా ఒకరిద్దరు మిత్రులతో వచ్చి శ్రీరామకృష్ణులకు ప్రణామం చేశాడు. అతడి వయస్సు ఇరవై ఏడు లేక ఇరవై ఎనిమిది సం ॥ ఉండవచ్చు. బారానగర్ (వరాహనగరం) వాసి. ఒక బ్రాహ్మణ పండితుని కుమారుడు. హరికథ చెప్పటంలో శిక్షణ పొందాడు. సంసారంలో చిక్కువడి ఉన్నాడు. వైరాగ్యం కారణంగా ఒకసారి ఇల్లు వదలి ఎక్కడికో వెళ్లిపోయాడు. ఇప్పుడూ సాధనలు చేస్తూనే ఉన్నాడు.
శ్రీరామకృష్ణులు: నువ్వు నడిచే వచ్చావా? నీ ఇల్లు ఎక్కడ ఉంది?
ఠాకూర్ దాదా: అవునండీ, నడిచే వచ్చాను. ఇల్లు బారానగర్‌లో ఉంది.
శ్రీరామకృష్ణులు: ఇక్కడకు ఏ పని మీద వచ్చావు?
ఠాకూర్ దాదా: మీ దర్శనార్థం వచ్చాను. భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను, కాని అప్పుడప్పుడు అశాంతితో మనస్సు ఆందోళన చెందుతోంది, అది ఎందుకు? నాలుగైదు రోజులు ఆనందంగా గడిచిపోతాయి. మళ్ళీ ఈ అశాంతి ఎందుకు తలెత్తుతుంది?
20.4.1 హరిభక్తి – జ్ఞానికి గల రెండు లక్షణాలు
శ్రీరామకృష్ణులు: నీ స్థితి నాకు అర్థమవుతోంది. సరిగ్గా అమరలేదు, చక్రాలలో పళ్లు సరిగ్గా అమరి ఉంటే అది సుగమంగా పనిచేస్తుంది. నీలో ఎక్కడో ప్రతిబంధకం ఉంది.
ఠాకూర్ దాదా: అవునండీ, పరిస్థితి అట్లే ఉంది.
శ్రీరామకృష్ణులు: మంత్రోపదేశం పొందావా?
ఠాకూర్ దాదా: అవునండీ, పొందాను.
శ్రీరామకృష్ణులు: మంత్రంలో విశ్వాసం ఉందా?
ఆ సమయంలో ఠాకూర్దాదా మిత్రుడు, “ఇతడు బాగా పాడతాడు” అన్నాడు. శ్రీరామకృష్ణులు అతణ్ణి పాడమని కోరారు. దాదా పాడసాగాడు.
యోగి నగుచు నే నివసించెద
ప్రేమ పర్వతపు కొండకోనలో
మునిగిపోయెదను యోగమందునే
బ్రహ్మవారి ఘనధార తీరమున॥ యో ॥
తీర్చుకొందు నే జ్ఞానాకలిని
సత్యఫలంబుల నాస్వాదించుచు
పూజసేతునే దైవపాదములు
వైరాగ్య గంధ సంభరిత సుమంబుల॥ యో ॥
ఆర్చుచున్న నా హృదయ దాహమును
తీర్చుకొనుటకై నూయి త్రవ్వను
ఆత్మ ఘటముతో శాంతినీరముల
తోడుకొందు సంతృప్తి తీరగ॥ యో ॥
నీదు భవ్యపద పద్మరాజముల
దివ్యమైన సుధ నాస్వాదించుచు
ఆడి పాడెదను, నవ్వెద, నేడ్చెద
ఆనందోన్నత శిఖరతలంబుల॥ యో ॥
శ్రీరామకృష్ణులు: ఆహా, ఎంత చక్కటి పాట! ‘బ్రహ్మవారి ఘనధార తీరమున’, ‘సత్యఫలంబుల నాస్వాదించుచు’, ‘ఆడిపాడెదను, నవ్వెద; నేడ్చెద’ – నీ హృదయం నుంచి పొంగి వస్తూన్న ఈ పాట నాకు ఎంతో నచ్చింది. ఇక ఏం కావాలి?
“సంసారజీవితంలో సుఖదుఃఖాలు అనివార్యం. ఒకింత దిగులు ఉండనే ఉంటుంది. మసిబారిన గదిలో వసిస్తే కొంత మసి అంటుకోక తప్పదు. (BG 2.14)
ఠాకూర్ దాదా: స్వామీ, ఇప్పుడు నేను ఏం చేయాలో మీరే సెలవియ్యండి.
శ్రీరామకృష్ణులు: ఉదయం, సాయంత్రం చేతులతో తాళం వేస్తూ హరిబోల్, హరిబోల్, హరిబోల్* అంటూ హరినామం కీర్తించు. నా చెయ్యి కాస్త నయం అయ్యాక, ఒకసారి ఇక్కడకు రా.
అప్పుడు మహిమాచరణ్ వచ్చి శ్రీరామకృష్ణులకు ప్రణమిల్లాడు. శ్రీరామకృష్ణులు ఠాకూర్దాదాను చూపుతూ మహిమాచరణ్తో, “ఆహా! ఇతడొక చక్కని పాట పాడాడు” అన్నారు. తరువాత దాదాతో, “మరోసారి ఆ పాట పాడు. విందాం” అన్నారు. ఠాకూర్దాదా ‘యోగి నగుచు నే నివసించెద……’ పాటను మళ్ళీ పాడాడు.
పాట పూర్తికాగానే శ్రీరామకృష్ణులు మహిమాచరణ్తో హరిభక్తి శ్లోకాలను వల్లించమన్నారు. మహిమాచరణ్ ‘నారద పంచరాత్రములు’ వల్లించాడు:
“అంతర్బహిర్యది హరిస్తపసా తతః కిమ్”…….
శ్రీరామకృష్ణులు: దానినీ వల్లించు – లభ లభ హరిభక్తిం.
మహిమాచరణ్ వల్లించాడు –
విరమ విరమ బ్రహ్మన్ కిం తపస్యాసు వత్సా ।
వ్రజ వ్రజ ద్విజ శీఘ్రం శంకరం జ్ఞానసింధుమ్ ॥
లభ లభ హరిభక్తిం వైష్ణవోక్తాం సుపక్వామ్ ।
భవ – నిగడ – నిబంధచ్ఛేదనీం కర్తరీం చ ॥
శ్రీరామకృష్ణులు: అవును, పరమశివుడు హరిభక్తిని అనుగ్రహిస్తాడు.
మహిమాచరణ్: పాశముక్తః సదా శివః.
శ్రీరామకృష్ణులు: భయం, అసహ్యం, సిగ్గు, సంకోచం – ఇవన్నీ పాశాలు, ఏమంటావ్?
మహిమాచరణ్: అవునండీ, గోప్యతా స్వభావం, ప్రశంసలో సిగ్గుపడటమూ పాశాలే.
శ్రీరామకృష్ణులు: జ్ఞానికి రెండు లక్షణాలు ఉన్నాయి. మొదటిది కూటస్థ బుద్ధి. (కూటస్థం అంటే కమ్మరి దాగలి.) పలు కష్టాలు, విపత్తులు, విఘ్నాలు ఎదురైనప్పటికీ కమ్మరి దాగలిలా నిర్వికారంగా ఉండటం. దాగలి మీద ఎన్ని సమ్మెటపోట్లు పడుతున్నాయి! అయినప్పటికీ దాగలి ఎలాంటి మార్పూ చెందదు.
“రెండవ లక్షణం పురుషకారం, ప్రగాఢ పట్టుదల. కామక్రోధాదులు హాని కలిగిస్తాయి; కనుక వాటిని సమూలంగా వర్జించి వేస్తాడతడు. తాబేలు తన అవయవాలను లోపలికి లాగుకుంటే, పిదప దాన్ని నాలుగు ముక్కలుగా నరికినా అవయవాలను బయటకు రానీయదు.
20.4.2 తీవ్ర, మంద, మర్కట వైరాగ్యాలు
(ఠాకూర్ దాదా ప్రభృతులతో) “వైరాగ్యం రెండు రకాలు – తీవ్రవైరాగ్యం, మంద వైరాగ్యం. జరిగేదేదో జరుగుతుంది అనే విలంబం చేసే వైఖరి మంద వైరాగ్యం. తీవ్రవైరాగ్యం పదును పెట్టిన కత్తి మొన వంటిది. ఇది మాయాపాశాలను పరపరమని కోసివేస్తుంది.
“ఏటి నుంచి పొలానికి నీరు పారించటానికి ఒక రైతు పలురోజులుగా ప్రయత్నించాడు, కాని ఫలితం లేకపోయింది. కారణం, అతడికి గట్టి పట్టుదల లేదు. మరో రైతు రెండు మూడు రోజులు శ్రమించాక, ‘నేడు నీరు పారించిన తరువాతనే మరో పని’ అని ప్రతిజ్ఞ పట్టాడు. స్నానం, తిండి అన్నిటినీ మరచిపోయాడు. రోజంతా శ్రమించాడు. సాయంత్రం నీరు గలగలమంటూ పొలంలోకి పారింది; రైతు ఆనందంతో పరవశుడయ్యాడు. ఆ తరువాత ఇంటి కెళ్లి భార్యతో, ‘కొంచెం నూనె ఇవ్వు. నేను స్నానానికి వెళుతున్నాను’ అన్నాడు. స్నానం చేశాక భోజనం చేశాడు. పిదప నిశ్చింతగా నిద్రపోయాడు.
“ఒక స్త్రీ తన భర్తతో, ‘ఆ ఫలానా వాణ్ణి చూడండి, అతడికి తీవ్రవైరాగ్యం జనించింది. మీకు అటువంటిది ఏమీ లేదు. అతడికి పదహారుమంది భార్యలు. వారిని ఒక్కొక్కతెనుగా వదలివేస్తూన్నాడు’ అని చెప్పింది. అప్పుడతడు భుజం మీద తుండుగుడ్డ వేసుకొని స్నానానికి వెళుతున్నాడు. భార్య మాటలు విని ఆమెతో, ‘ఒసే వెర్రిముఖమా! అతడు పరిత్యజించలేడు. కొంచెం కొంచెంగా త్యజించటం సాధ్యమా ఏమిటి? నేను పరిత్యజించి వేయగలను. ఇదుగో చూడు, నేను వెళ్లిపోతున్నాను’ అంటూ వెళ్లిపోయాడు. ఇంటి వ్యవహారాలు చక్కబెట్టి వెళ్దామని కూడా ఆగలేదు; ఆ పరిస్థితిలోనే, భుజం మీద తుండుగుడ్డను వేసుకొని గృహత్యాగం చేసి వెళ్లిపోయాడు. దీనినే తీవ్రవైరాగ్యం అంటారు.
“ఇంకొక రకమైన వైరాగ్యం ఉంది – దానిని మర్కట వైరాగ్యం అంటారు. సంసార జ్వాలను భరించలేక కాషాయ వస్త్రాలు ధరించి కాశీకి పోయాడు ఒకడు. చాలారోజులు వరకు అతడి గురించి ఎటువంటి సమాచారం అందలేదు. ఆ తరువాత ఒక ఉత్తరం వచ్చింది. దాన్లో, ‘మీరు దిగులు చెందకండి. ఇక్కడ నాకు ఒక ఉద్యోగం దొరికింది’ అని వ్రాసి ఉన్నాడు.
“సంసారంలో కష్టాలు ఉండనే ఉంటాయి. చెప్పిన మాట వినని భార్య, నెల జీతం ఇరవై రూపాయలే, చంటిబిడ్డకు అన్నప్రాశన చేయటానికి డబ్బులేదు, కుమారుణ్ణి చదివించలేడు, శిథిలావస్థలో కొంప, పైకప్పు కారుతూ ఉంది, మరమ్మతులు చేయ డబ్బు లేదు. అందుచేతనే ఇక్కడకు వస్తున్న యువకులకు, ‘నీకు ఇంట్లో ఎవరెవరు ఉన్నారు?’ అని అడుగుతాను.
(మహిమాచరణ్తో) “మీరంతా సంసారం త్యజించవలసిన అవసరం ఏముంది? సన్న్యాసులు ఎన్నో కష్టాలను ఎదుర్కోవలసి ఉంటుంది! ఒక భార్య తన భర్తను, ‘నువ్వు సంసారాన్ని త్యజిస్తావా? ఎందుకు? ఎనిమిది ఇళ్ల చుట్టూ తిరిగి భిక్షమెత్తి తినటానికి మారుగా ఇక్కడ ఒకే ఇంట్లో భోజనం చేస్తూన్నావే, ఇదే మేలు కదా?’ అని అడిగింది.
“ధర్మ సత్రాలను వెదుకుతూ సన్న్యాసులు కొన్ని సమయాలలో ఐదారు మైళ్లు కూడా పోవలసి ఉంటుంది. పూరీ జగన్నాథుని దర్శించుకుని వారు రహదారిలో వస్తూ ఉంటారు. ధర్మసత్రాలకై రహదారిని వీడి మరో మార్గంలో వారు వెళ్లటం నేను కామార్పుకూర్లో చూసి ఉన్నాను.
“నువ్వు సంసార జీవితం గడుపుతున్నావు. ఇది మంచిది – కోట లోపలి నుండే పోరాడుతున్నావు. యుద్ధరంగంలో నిలబడి పోరాడటంలో పలు కష్టాలు, ప్రమాదాలు ఎదురవుతాయి. గుళ్లు తిన్నగా వచ్చి తగులుతాయి.
“కాని ఒక విషయం. కొన్నాళ్లు ఏకాంతవాసం చేసి జ్ఞానాన్ని సముపార్జించుకుని తిరిగి వచ్చి సంసారంలో జీవించు. జనకుడు జ్ఞానం పొందాక సంసార జీవితం గడిపాడు. జ్ఞానం పొందాక ఎక్కడ ఉంటే ఏమిటి?”
మహిమాచరణ్: మహాశయా, మనిషి విషయసుఖాలలో ఎందుకు భ్రమించిపోతాడు?
శ్రీరామకృష్ణులు: భగవదనుభూతి పొందక ముందే విషయ వస్తువుల నడుమ జీవించటం చేతనే. అనుభూతి పొందిన పిదప మనస్సు విషయసుఖాలలో భ్రమించిపోదు. శలభాలు ఒకసారి దీపపు వెలుగు చూశాక మరి చీకటిలో ఉండనొల్లవు.
20.4.3 ఊర్ధ్వరేతస్కులు, ధైర్యరేతస్కులు – సన్న్యాసికి కఠిన నియమాలు
“భగవంతుని పొందగోరితే వీర్యధారణ చేయవలసి ఉంటుంది. శుకదేవాదులు ఊర్ధ్వరేతస్కులుగా ఉన్నారు. వీరు వీర్యాన్ని ఎన్నడూ కోల్పోలేదు. ధైర్యరేతస్కులంటూ మరొక కోవకు చెందినవారు ఉన్నారు. వీరు తొలుత వీర్యాన్ని కోల్పోయారు, పిదప నియంత్రించుకున్నారు. పన్నెండేళ్లు ధైర్యరేతస్కులుగా ఉంటే ఒక విశేష శక్తి ఉద్భవిస్తుంది, లోపల ఒక క్రొత్త నాడి జనిస్తుంది. దాని పేరు మేధానాడి. ఈ నాడి జనిస్తే అంతా జ్ఞాపకం ఉంటుంది, అన్నిటినీ తెలుసుకోవచ్చు.
“వీర్యనష్టం వలన బలం క్షీణిస్తుంది. కాని స్వప్న స్ఖలనంలో ఏదైతే వెళ్ళిపోతుందో, అందులో దోషం లేదు. ఆహార గుణం కారణంగా అలా జరుగుతుంది. ఈ విధంగా కోల్పోయింది పోగా మిగిలి ఉన్నదే సరిపోతుంది. అయితే స్త్రీ తోటి కలయిక మాత్రం చేయనే రాదు. ఈ విధంగా మిగిలి ఉన్నది రిఫైన్ చేయబడినదై (అంటే సారపదార్థమై) ఉంటుంది. లాహాల గృహంలో జాడీలలో బెల్లం నిల్వచేసి ఉంచేవారు. జాడీల క్రింద భాగంలో ఒక రంధ్రం ఉంటుంది. ఒక సంవత్సరం తరువాత తీసి చూస్తే బెల్లం పటికబెల్లంగా మారిపోయి ఉండేది. నీటివంటి అనావశ్యకమైనవి రంధ్రం గుండా బయటకు వచ్చేసేవి.
“సన్న్యాసులు స్త్రీలను పూర్తిగా వర్జించాలి. మీకు వివాహం అయిపోయింది, అయినా ఫరవాలేదు. సన్న్యాసి స్త్రీ చిత్రపటాన్ని కూడా చూడరాదు. సాధారణ వ్యక్తులు అలా చేయలేరు. సరిగమపదని; ‘ని’ లో చాలాసేపు నిలిచి ఉండలేవు.
“సన్న్యాసికి వీర్యం కోల్పోవటమన్నది ఘోరమైన తప్పు. అందుచేతనే వారు స్త్రీలను చూడకుండేలా అప్రమత్తంగా ఉండాలి. భక్తురాలై ఉన్నప్పటికీ ఆమె నుండి విడివడి దూరంగా ఉండిపోవాలి. అతడికి స్త్రీరూపం చూడటం కూడా తప్పే. జాగ్రదావస్థలో ఏమీ జరుగకున్నప్పటికీ స్వప్నంలో వీర్యనష్టం సంభవిస్తుంది.
“సన్న్యాసి జితేంద్రియుడై ఉన్నప్పటికీ జనులకు ఆదర్శంగా ఉండే నిమిత్తం స్త్రీలతో సంభాషించరాదు. భక్తురాలై ఉన్నప్పటికీ ఎక్కువసేపు మాట్లాడుతూ ఉండరాదు.
“సన్న్యాసి జీవితం నిర్జల ఏకాదశి లాంటిది (అంటే ఒక చుక్క నీరు కూడా త్రాగకుండా ఏకాదశి పాటించటం వంటిది). కొంతమంది ఇంకా రెండు రకాలుగా ఏకాదశిని పాటిస్తారు. పళ్లు, కందమూలాలు తినటం ఒక రకం. మరొకటి పూరీ, బంగాళాదుంపల కూరతో సహా అన్నీ తినటం. (అందరూ నవ్వారు) పూరీ, బంగాళాదుంపలతో సహా వీలుంటే పాలలో నానబెట్టిన ఒకటి రెండు రొట్టె ముక్కలనూ ఆరగిస్తారు. (అందరూ నవ్వారు) నిర్జల ఏకాదశిని మీరు పాటించలేరు.
20.4.4 కృష్ణకిశోర్ ఏకాదశి – రాజేంద్ర మిత్ర
“కృష్ణకిశోర్ ఏకాదశి తిథులలో పూరీ, బంగాళాదుంపల కూర తినటం నేను చూసి ఉన్నాను. హృదయ్‌తో, ‘హృదూ, నాకూ కృష్ణకిశోర్లా ఏకాదశిని పాటించాలనే అభిలాష కలుగుతోంది’ అన్నాను. (అందరూ నవ్వారు) ఒకసారి అదే విధంగా పాటించాను కూడా. కడుపునిండా ఆరగించాను, మర్నాడు ఏమీ తినలేకపోయాను.” (అందరూ నవ్వారు)
పంచవటిలోని హఠయోగిని చూడటానికి వెళ్ళిన భక్తులు తిరిగి వచ్చారు. శ్రీరామకృష్ణులు వారితో, “ఏమయ్యా, ఎలా? ఏం చూశారు? మీ కొలబద్దతో అతణ్ణి కొలిచి ఉంటారే!” అన్నారు. వారిలో ఎవరూ ఆ హఠయోగికి ధన సహాయం చేయ ఇష్టపడలేదని శ్రీరామకృష్ణులు గ్రహించారు.
శ్రీరామకృష్ణులు: ఒక సాధువుకు ధనం ఇవ్వాలంటేనే మీరు అతణ్ణి ఇష్టపడరు. రాజేంద్ర మిత్రకు నెల జీతం ఎనిమిది వందల రూపాయలు. అతడు ప్రయాగలో కుంభమేళా సందర్శించి తిరిగి వచ్చాడు. నేను అతడితో, ‘ఏమయ్యా, కుంభమేళాలో సాధువుల నందరిని దర్శించావా?’ అని అడిగాను. అందుకు అతడు, ‘ఎక్కడిది; మంచి సాధువు నెవరినీ చూడలేకపోయాను. ఒకరిని చూశాను, కాని ఆయన కూడా ధనం స్వీకరిస్తున్నాడు’ అని అన్నాడు.
“నాకు అనిపిస్తూ ఉంటుంది, ‘సాధువులకు ఎవరూ ధనం ఇవ్వకుంటే వారు ఎలా తినగలరు?’ అని. ఇక్కడ ఏ విధమైన కానుకలూ చెల్లించ నవసరం లేదు, అందుచేతనే అందరూ వస్తున్నారు. ‘అయ్యో! వీళ్లు ధనాన్ని అమితంగా ప్రేమిస్తున్నారు! మరి దానితోనే జీవించనీ’ అని అనుకుంటాను. (BG 18.66)
శ్రీరామకృష్ణులు కాసేపు విశ్రమించారు. ఒక భక్తుడు చిన్నమంచం మీద ఉత్తరాభిముఖంగా కూర్చుని ఆయన పాదాలు ఒత్తసాగాడు. శ్రీరామకృష్ణులు ఆతడితో మెల్లగా చెబుతున్నారు:
“ఎవరు నిరాకారమో అతడే – సాకారమూను. సాకార దైవాన్నీ అంగీకరించ వలసిందే. కాళీ రూపాన్ని చింతన చేసి సాధకుడు కాళీమాత దర్శనం పొందుతాడు, పిదప అదే రూపం అఖండంలో లీనమైపోవటం గాంచుతాడు. ఎవరు అఖండ సచ్చిదానందమో ఆతడే కాళీ.”
20.5 పంచమ పరిచ్ఛేదం మహిమాచరణ్, మణిసేన్, అధర్
శ్రీరామకృష్ణులు పడమటి వైపున ఉన్న అర్ధచంద్రాకార మొగసాలలో కూర్చుని మహిమా చరణ్తోను, తక్కిన భక్తులతోను హఠయోగిని గురించి మాట్లాడసాగారు. రామప్రసన్నుడు కృష్ణకిషోర్ కుమారుడు. అందుచేత శ్రీరామకృష్ణులు అతణ్ణి ఎంతగానో అభిమానిస్తారు.
శ్రీరామకృష్ణులు: రామప్రసన్నుడు ఊరకే అటూ ఇటూ తిరుగుతుంటాడు. ఆ రోజు ఇక్కడకు వచ్చి కూర్చున్నాడు, ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ముక్కు మూసుకుని ప్రాణాయామమో ఏదో చేస్తూ ఉన్నాడు. తినటానికి ఏదో ఇచ్చాను, అతడు తినలేదు. మరొక రోజు అతణ్ణి పిలిపించి కూర్చోమన్నాను. కెప్టెన్ కేసి కాలు చాపి, కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నాడు. అతడి తల్లి దుఃఖాన్ని చూసి నేను విలపించేవాణ్ణి.
(మహిమాచరణ్తో) “ఈ హఠయోగి గురించి రామప్రసన్నుడు నీతో చెప్పమన్నాడు. హఠయోగి దైనందిన ఖర్చు ఆరున్నర అణాలట. ఈ మాటను అతడు స్వయంగా ఇక్కడ చెప్పడట.
మహిమాచరణ్: అతడు చెప్పినా ఎవరు వింటారు? (శ్రీరామకృష్ణులు, తక్కిన వారు నవ్వారు)
శ్రీరామకృష్ణులు గదిలోకి వచ్చి కూర్చున్నారు. పానీహాటీలో ఒక ఆలయం యజమాని మణిసేన్. అతడు ఒకరిద్దరు మిత్రులతో వచ్చాడు. అతడు శ్రీరామకృష్ణుల చేతిని గురించి వాకబు చేశాడు. అతడితో ఒక డాక్టరు కూడా వచ్చి ఉన్నాడు.
డాక్టర్ ప్రతాప్ మజుందార్ ఔషధం శ్రీరామకృష్ణులు పుచ్చుకుంటున్నారు. కాని మణిసేన్ మిత్రుడు ఆ ఔషధం అంత మంచిది కాదన్నాడు. శ్రీరామకృష్ణులు అతడిని, “ప్రతాప్ తెలివితక్కువవాడు ఏమీ కాడు. నువ్వెందుకు అలా అంటున్నావు?” అని అడిగారు.
ఆ సమయంలో, “సీసా క్రిందపడి పగిలిపోయింది” అంటూ బిగ్గరగా అరిచాడు లాటు. హఠయోగి గురించిన మాటలు విన్న మణిసేన్, “ఎవరిని హఠయోగి అంటారు? ‘హాట్’ అంటే ఆంగ్లంలో వేడి అని అర్థం కదా?” అన్నాడు.
మణిసేన్ మిత్రుడైన డాక్టర్ గురించి శ్రీరామకృష్ణులు పిదప భక్తులతో ఇలా అన్నారు: “ఇతణ్ణి నేను ఎరుగుదును. యదుమల్లిక్తో ఒకసారి, ‘ఇతడు నీ కంటే అతిగా వాగుతాడు, ఫలానా డాక్టర్ కంటే కూడా కుశాగ్రబుద్ధి’ అని అన్నాను.”
20.5.1 ‘మ’ తో శ్రీరామకృష్ణుల ఏకాంత సంభాషణ
ఇంకా సంధ్యాకాలం కాలేదు. శ్రీరామకృష్ణులు మంచం మీద కూర్చుని ‘మ’ తో మాట్లాడుతున్నారు. ‘మ’ మంచానికి ప్రక్కన కాలిపట్టాపై పశ్చిమాభిముఖంగా కూర్చుని ఉన్నాడు. మహిమాచరణ్ పశ్చిమాన ఉన్న అర్ధచంద్రాకార మొగసాలలో కూర్చుని మణిసేన్తోపాటు వచ్చిన డాక్టర్‌తో బిగ్గరగా శాస్త్రచర్చలు చేస్తూ ఉన్నాడు. శ్రీరామకృష్ణులు తాము ఉన్నచోటు నుండే అది విని, నవ్వుతూ ‘మ’ తో, “అతడు వాగుతున్నాడు! ఇది రజోగుణం; ఈ గుణం కారణంగా తన పాండిత్యాన్ని ప్రదర్శించాలనే, లెక్చర్ ఇవ్వాలనే వాంఛ కలుగుతుంది. సత్త్వగుణం అంతర్ముఖ దృష్టిని ఒనగూరుస్తుంది, స్వకీయ ప్రతిభను గోప్యంగా ఉంచుకునేట్లు చేస్తుంది. కాని మహిమాచరణ్ ఉత్తముడు. భగవత్ప్రసంగాలలో ఎంత ఆసక్తి!” అని అన్నారు.
ఇంతలో అధర్ వచ్చి శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి, ‘మ’ ప్రక్కన కూర్చున్నాడు. అతడొక డిప్యూటీ మేజిస్ట్రేటు; వయస్సు ముప్ఫై ఏళ్లు. పగలంతా కార్యాలయంలో పనిచేసి, సామాన్యంగా సాయంత్రం వేళ ప్రతిరోజు శ్రీరామకృష్ణుల వద్దకు వస్తాడు. అతడి ఇల్లు కలకత్తాలోని శోభాబజార్ ప్రాంతపు బేనేటోలాలో ఉంది. ఇటీవల కొన్ని రోజులుగా అతడు రాలేదు.
శ్రీరామకృష్ణులు: ఏమోయ్, ఇన్ని రోజులుగా ఎందుకు రాలేదు?
అధర్: రాలేకపోయానండీ! ఎన్నో పనులలో మునిగి ఉన్నాను. స్కూలు సమావేశాలు, ఇంకా అదీ ఇదీ పలు మీటింగులు.
శ్రీరామకృష్ణులు: మీటింగ్, స్కూల్ వీటిలో మునిగి తక్కిన వన్నిటినీ పూర్తిగా మరచి పోయినట్లున్నావు!
అధర్ (వినమ్రంగా): అవునండీ, కొన్ని రోజులు అన్నిటినీ మరచిపోవటం జరిగింది. మీ చెయ్యి ఇప్పుడెలా ఉంది?
శ్రీరామకృష్ణులు: ఇదుగో, నువ్వే చూడు. ఇంకా నయం కాలేదు. ప్రతాప్ ఔషధం పుచ్చుకుంటున్నాను.
కాసేపయ్యాక శ్రీరామకృష్ణులు హఠాత్తుగా అధర్ను చూసి, “ఇదుగో చూడు, ఇవన్నీ అనిత్యాలు. మీటింగ్, స్కూల్, ఆఫీస్ – ఇవన్నీ అనిత్యాలు. భగవంతుడు ఒక్కడే సత్యం, తక్కినవన్నీ మిథ్యే. మనస్ఫూర్తిగా ఆయనను ఆరాధించటమే కావలసింది” అన్నారు.
అధర్ మౌనంగా ఉండిపోయాడు.
శ్రీరామకృష్ణులు: ఇవన్నీ అనిత్యాలు. శరీరం, ఇదుగో ఈ క్షణం ఉంటుంది, అంతలోనే కనుమరుగైపోతుంది. జాప్యం చేయకుండా వెంటనే భగవంతుని ప్రార్థించాలి.*
“మీరు సర్వస్వమూ పరిత్యజించవలసిన అవసరం లేదు. తాబేలు వలె సంసారంలో జీవించండి. తాబేలు నీటిలో తిరుగాడుతూ ఉంటుంది, కాని గ్రుడ్లను గట్టు మీద పెడుతుంది. దాని మనస్సంతా గ్రుడ్ల మీదనే ఉంటుంది.
“కెప్టన్ స్వభావం చాలా చక్కగా తయారయింది! పూజకు కూర్చున్నప్పుడు ఒక ఋషిలా కానవస్తాడు! స్తోత్రాలు ఇంపుగా పఠిస్తూ కర్పూర హారతి ఇస్తాడు. పూజ ముగించి లేచేటప్పుడు అతడి కళ్లు చీమలు కుట్టినట్లు ఎర్రబారి ఉంటాయి. సర్వదా గీత, భాగవతాదులు పఠిస్తూ ఉంటాడు. నేను ఒకటి రెండు ఆంగ్ల పదాలు అతడి ముందు అన్నాను. అందుకు అతడు ఎంతో కోపగించుకుని, ‘ఆంగ్లం చదివినవాడు భ్రష్టుడవుతాడు’ అన్నాడు.”
కాసేపయ్యాక అధర్ ఎంతో వినయంగా, “స్వామీ, మీరు మా ఇంటిని పావనం చేసి చాలా రోజులయింది. ఇల్లు దుర్గంధభూయిష్ఠమైనట్లుగా ఉంది, అంతా అంధకారబంధురంగా తోస్తోంది” అన్నాడు.
భక్తుని ఈ పలుకులు విని, శ్రీరామకృష్ణుల ప్రేమసాగరం ఉప్పొంగింది. హఠాత్తుగా లేచి నిలబడి భావపారవశ్యంలో మునిగిపోయారు. అధర్, ‘మ’ ఇద్దరి శిరస్సులను, హృదయాలను స్పృశించి ఆశీర్వదించారు. “నేను మిమ్మల్ని నారాయణునిగా గాంచుతున్నాను. మీరే నా వాళ్లు” అన్నారు వాత్సల్యంతో.
ఇంతలో మహిమాచరణ్ గదిలోకి వచ్చి కూర్చున్నాడు.
శ్రీరామకృష్ణులు (మహిమాచరణ్తో): ధైర్యరేతస్కుల గురించి అప్పుడు నేను చెప్పింది సత్యం. వీర్య నియంత్రణ లేకుంటే ఈ ఉపదేశాలను అవగాహన చేసుకోలేవు.
“ఒక భక్తుడు చైతన్యులతో, ‘స్వామీ, మీరు భక్తులకు ఇన్ని ఉపదేశాలు చేస్తూ ఉన్నారు, కాని వాళ్లు అంతగా పురోగమించలేదే, ఎందుకు?’ అని అడిగాడు. అందుకు చైతన్యులు, ‘వీళ్లు స్త్రీ సాంగత్యంలో యావత్తూ వ్యర్థం చేసుకుంటున్నారు. అందుచేతనే వారికి ఇవ్వబడిన ఉపదేశాలను ఆకళింపు చేసుకోలేరు. చిల్లి కుండలో నీరు పోస్తే నీరంతా మెల్లమెల్లగా కారిపోతుంది’ అని జవాబిచ్చారు.”
మహిమాచరణ్ తదితరులు మౌనంగా ఉండిపోయారు. కొంతసేపైన పిదప మహిమాచరణ్, “ఆ శక్తిని మేము పొందేట్లుగా మీరు భగవంతుని ప్రార్థించండి” అన్నాడు.
శ్రీరామకృష్ణులు: ఇప్పటికీ మించిపోలేదు. అప్రమత్తంగా ఉండు. వర్షాకాలపు వెల్లువను నిరోధించటం కష్టం అన్నది నిజమే. కానీ చాలా నీరు కొట్టుకొనిపోయింది. ఇప్పుడు గట్టు నిర్మిస్తే నిలుస్తుంది.