16.1 ప్రథమ పరిచ్ఛేదం భక్తియోగం – చైతన్యుల స్థితులు – హఠయోగం – రాజయోగం
ఆదివారం, డిసెంబర్ 9, 1883
అప్పుడు సమయం మధ్యాహ్నం ఒంటిగంట లేదా రెండు గంటలు అయి ఉంటుంది. శ్రీరామకృష్ణులు తమ గదిలో మంచం మీద కూర్చుని భక్తులతో మాట్లాడుతున్నారు. అధర్, మనోమోహన్, ఠన్ఠన్కు చెందిన శివచంద్రుడు, రాఖాల్, ‘మ’, హరీష్ మొదలైన వారు అక్కడ ఉన్నారు.
శ్రీ చైతన్యుల స్థితులను శ్రీరామకృష్ణులు వివరిస్తూ ఉన్నారు.
శ్రీరామకృష్ణులు (భక్తులతో): చైతన్యులకు మూడు దశలు (స్థితులు) కలిగేవి.
1. బాహ్యదశ: ఈ దశలో ఆయన మనస్సు స్థూలసూక్ష్మాలలో నిలిచేది.
2. అర్ధబాహ్యదశ: ఈ దశలో ఆయన మనస్సు కారణ శరీరంలోను కారణానందంలోను ప్రవేశించేది.
3 అంతర్దశ: ఈ దశలో ఆయన మనస్సు మహాకారణంలో లయమై ఉండేది.
“శ్రీ చైతన్యుల ఈ మూడు దశలు వేదాంతం పేర్కొనే పంచకోశాలతో చక్కగా సారూప్యం కలిగి ఉన్నాయి. స్థూలశరీరం అన్నమయ కోశాన్ని, ప్రాణమయ కోశాన్ని సూచిస్తుంది. సూక్ష్మశరీరం మనోమయ, విజ్ఞానమయ కోశాలను సూచిస్తుంది. కారణ శరీరం అనేది ఆనందమయ కోశాన్ని సూచిస్తుంది. మహాకారణం అనేది ఈ పంచకోశాలకు అతీతమైనది. మనస్సు మహాకారణంలో లయమై ఉన్నప్పుడు ఆ వ్యక్తి సమాధిస్థితు డవుతాడు. దీనినే నిర్వికల్ప సమాధి లేక జడసమాధి అంటారు.
“చైతన్యులు బాహ్యదశలో నామసంకీర్తన చేసేవారు. అర్ధబాహ్య దశలో భక్తులతో కలసి నృత్యం చేసేవారు. అంతర్దశలో సమాధి స్థితులయ్యేవారు.”
(‘మ’ స్వగతంలో): శ్రీరామకృష్ణులు తమ మనోస్థితులన్నిటినీ ఈ విధంగా సూచిస్తున్నారా ఏమిటి? చైతన్యదేవులు కూడా ఇటువంటి స్థితులలోనే ఉండేవారా!
శ్రీరామకృష్ణులు: చైతన్యులు భక్తి యొక్క అవతారం. జనులకు భక్తిని బోధించటానికే వచ్చారు ఆయన. భగవంతుని పట్ల భక్తి కలిగినట్లయితే సర్వమూ సిద్ధించినట్లే. హఠయోగ అవసరం ఎంతమాత్రమూ లేదు.
ఒక భక్తుడు: మహాశయా, హఠయోగం అంటే ఏమిటి?
శ్రీరామకృష్ణులు: హఠయోగంలో మనస్సును అధికంగా శరీరం పట్ల కేంద్రీకరిస్తారు. హఠయోగి అపానస్థానం గుండా వెదురుగడ పంపి అంతర ప్రక్షాళనం (అంటే, ప్రేగులను శుద్ధి చేయడం) చేస్తాడు. లింగం ద్వారా పాలు, నేతిని లోపలకు లాక్కొంటాడు. జిహ్వ సిద్ధిని అభ్యసిస్తాడు. ఆసనం వేసుకుని కూర్చుని, ఉన్నపళానే దేహాన్ని గాలిలోకి లేపుతాడు. ఇవన్నీ వాయువు (అంటే, ప్రాణం) యొక్క కార్యాలు. ఒక వ్యక్తి గారడీ చేస్తూండగా అతడి నాలుక అంగుటికి అతుక్కుపోయింది. అంతే! తక్షణమే అతడి శరీరం నిశ్చలమైపోయింది. అతడు మరణించాడని భావించి జనులు అతణ్ణి మట్టిలో పూడ్చి పెట్టారు. ఎన్నో సంవత్సరాలు అతడు అలా మట్టిలో పూడ్చబడే ఉన్నాడు. సుదీర్ఘ కాలం తర్వాత ఆ మట్టి ఎలాగో తొలగిపోయాక ఆ వ్యక్తికి హఠాత్తుగా స్పృహ వచ్చింది. స్పృహ రాగానే అతడు “మాయ చూడు, మంత్రం చూడు; గందరగోళం జరుగుతుంది చూడండి, చూడండి” అంటూ కేకలు పెట్టసాగాడు. (అందరూ నవ్వారు) ఇవన్నీ వాయువు కార్యాలు. వేదాంతవాదులు హఠయోగాన్ని అంగీకరించరు.
“రాజయోగం అంటూ ఒకటి ఉంది. రాజయోగంలో మనస్సు ద్వారా యోగం సిద్ధిస్తుంది. భక్తి ద్వారా, విచారణ ద్వారా యోగం సిద్ధిస్తుంది. ఈ యోగమే శ్రేష్ఠమైనది. హఠయోగం మంచిది కాదు. కలియుగంలో జీవులు అన్నగతప్రాణులు.”
16.2 ద్వితీయ పరిచ్ఛేదం శ్రీరామకృష్ణుల తపస్సు – దక్షిణేశ్వరం భవిష్యత్తులో తీర్థం అవుతుంది
శ్రీరామకృష్ణులు సరుగుడు తోపుకు వెళ్లి కాసేపట్లో ముఖం కడుగుకుని తమ గదికి తిరిగి వస్తూ ఉన్నప్పుడు నహబత్ ప్రక్కనున్న దారిలో ఒకింతసేపు నిలబడి పరికించి చూశారు. నహబత్ వసారాలో కంచెకు ఒక వైపున ‘మ’ ప్రగాఢచింతనామగ్నుడై ఉండటం చూశారు. అతడు భగవత్ చింతన చేస్తున్నాడా?
శ్రీరామకృష్ణులు: ఓ! నువ్వు ఇక్కడ ఉన్నావా? నీకు సత్వరం ఆధ్యాత్మిక చైతన్యం కలుగుతుంది. కాస్త సాధన చేయగానే ఎవరో ఒకరు వచ్చి, ‘ఇలా ఇలా చెయ్యి’ అంటూ సహాయం చేస్తారు.
‘మ’ ఆశ్చర్యచకితుడై శ్రీరామకృష్ణులను తదేకంగా చూడసాగాడు. అట్లే కూర్చుని ఉండిపోయాడు.
శ్రీరామకృష్ణులు: నీకు ఫలితం దక్కుతుంది. తగిన సమయం వచ్చేవరకు తల్లిపక్షి గ్రుడ్డు పైపెంకును పగలకొట్టదు. ఇంతకు మునుపు నీకు ఏం చెప్పానో, అదే నీ ‘మార్గం’.
ఇలా అంటూ శ్రీరామకృష్ణులు మళ్ళీ ‘మ’ కు అతడి ‘మార్గం’ ఏదో విడమరచి తెలిపారు.
శ్రీరామకృష్ణులు: ప్రతి ఒక్కరూ కఠోర తపస్సు చేయాలని ఏమీ లేదు. అయితే నేను మాత్రం ఎంతగానో శ్రమించవలసి వచ్చింది. మట్టిగడ్డపై శిరస్సును ఉంచి అలాగే నేలపై పడిపోయి ఉండేవాడిని. ఎలాగో రోజులు గడచిపోయేవి. కేవలం “అమ్మా, అమ్మా” అని పిలుస్తూ విలపించేవాడిని.
దాదాపు రెండు సంవత్సరాలుగా ‘మ’ శ్రీరామకృష్ణుల వద్దకు వస్తున్నాడు. అతడు ఆంగ్లం అభ్యసించినవాడు. శ్రీరామకృష్ణులు అతణ్ణి అప్పుడప్పుడు ఇంగ్లీష్ మ్యాన్ (అంటే, తెల్లదొర) అని సంబోధిస్తుంటారు. ‘మ’ కళాశాలలో చదువుకున్నవాడు; వివాహం అయింది.
కేశవచంద్రసేన్ తదితర పండితుల ప్రసంగాలు వినటంలోనూ, పాశ్చాత్య తర్క శాస్త్రాలను అధ్యయనం చేయటంలోనూ ‘మ’ కు ఆసక్తి. కాని శ్రీరామకృష్ణుల వద్దకు రాసాగాక అతడికి ఐరోపా పండితుల గ్రంథాలు, ప్రసంగాలు నిస్సారంగా తోచుతున్నాయి. ప్రస్తుతం ఆయన్ను దర్శించి ఆయన ముఖతా వెలువడే అమృతవాక్కులను అహర్నిశలూ శ్రవణం చేయడంలోనే ఆసక్తుడైనాడు.
‘సాధన చేస్తే నిశ్చయంగా భగవంతుణ్ణి దర్శించవచ్చు’ అనీ, ‘మానవ జీవిత లక్ష్యం భగవత్సాక్షాత్కారమే’ అనీ శ్రీరామకృష్ణులు చెబుతుంటారు. ప్రస్తుతం ‘మ’ శ్రీరామకృష్ణుల ఈ ఉపదేశాన్ని గురించే సదా చింతన చేస్తూ ఉన్నాడు.
శ్రీరామకృష్ణులు (‘మ’ తో): నువ్వు ఒకింత ప్రయత్నిస్తేనే, ఎవరో ఒకరు వచ్చి ‘ఇలా, ఇలా చెయ్యి’ అంటూ నీకు సహాయం చేస్తారు.
“నువ్వు ఏకాదశిని పాటించు. మీరందరూ నా వాళ్ళు, నా ఆత్మీయులు. లేకుంటే, ఇక్కడకు ఇంతగా ఎందుకు వస్తారు? ఒక దర్శనంలో సంకీర్తన వింటూ ఉన్నప్పుడు వ్రజభూమిలో శ్రీకృష్ణుని నేస్తాలలో రాఖాల్ కూడా ఒకడై ఉండటం గాంచాను. నరేంద్రుడు అత్యున్నత స్థాయికి చెందినవాడు. ఇకపోతే, హీరానంద్ (సింధ్ ప్రాంతానికి చెందిన భక్తుడు)! అతడిది ఎంతటి పసిబాలుడి స్వభావం! అది ఎంత మధురం! అతణ్ణి కూడా చూడగోరతాను.
16.2.1 చైతన్యుని దర్శనం, తులసి వనం, మథుర్బాబు సేవ మొదలైన సంఘటనలు
“ఒకసారి చైతన్యుని, అనుయాయులతో చూశాను. భావావస్థలో కాదు; సాక్షాత్తూ ఈ కళ్ళతోనే చూశాను. ఇంతకు మునుపు, ఈ కళ్ళతోటే దర్శనాలన్నిటినీ గాంచేవాడిని. కాని, ప్రస్తుతం వాటిని భావావస్థలో మాత్రమే చూడగలుగుతున్నాను.
“గౌరాంగుణ్ణి, ఆయన అనుయాయులను ఈ కళ్ళతోటే దర్శించాను. వారిలో నిన్నూ, బలరామ్బోసునూ చూసినట్లు అనిపిస్తోంది. కొందరిని చూసినప్పుడు మాత్రం నేను తటాలున లేచి నిలబడతాను. ఎందుకో తెలుసా? చాలాకాలం తర్వాత తన సొంత మనుషులను చూసినప్పుడు ఇలాగే జరుగుతుంది.
“అమ్మతో విలపిస్తూ ఇలా ప్రార్థించేవాడిని – ‘అమ్మా! భక్తులను చూడగోరి నా ప్రాణాలు తల్లడిల్లిపోతున్నాయి. వారిని వెంటనే నా వద్దకు తోడ్కొని రా!’ నేను అనుకున్నవన్నీ యథాతథంగా జరిగేవి. పంచవటిలో జపధ్యానాలకై తులసివనం నాటాను. దానికి వెదురు బద్దలతో కంచె కట్టాలన్న సంకల్పం కలిగింది. తరువాత చూస్తే, గంగానది పోటెత్తినప్పుడు ఎక్కడి నుంచో వెదురుబద్దల మోపు, త్రాడు సరిగ్గా పంచవటి వద్దకు కొట్టుకొని వచ్చాయి. ఆలయానికి చెందిన పనివాడొకడు ఎంతో సంబరంతో వచ్చి నాకీ వార్త తెలిపాడు.
“ఆ దివ్యోన్మత్త స్థితిలో పూజాదులు ఏవీ చేయలేకపోయేవాడిని. ‘అమ్మా! నన్ను ఎవరు చూసుకుంటారు?’ అని అమ్మతో అన్నాను. ‘అమ్మా! స్వయంగా నా బాగోగులు చూసుకునే శక్తి కూడా లేదు. నీ గురించిన ప్రసంగాలు వినాలని ఉంది. భక్తులకు భోజనం పెట్టాలన్న కోర్కె కలుగుతోంది. అమ్మా! ఇవన్నీ ఎలా ఒనగూరుతాయి? అమ్మా! ఎవరైనా పెద్ద మనిషిని సహాయకునిగా పంపించు’ అని ప్రార్థించాను. అందుకే మథుర్ బాబు ఇంతటి సేవలు చేశాడు.
“అమ్మతో ఇంకా ఇలా అన్నాను: ‘అమ్మా! నాకు సంతానం అయితే ఉండబోదు. అయితే శుద్ధభక్తుడైన బాలుడు ఒకడు సదా నాతోబాటే ఉండాలని కోరుకుంటున్నాను. అటువంటి బాలుని ఒకరిని నాకు అనుగ్రహించు.’ అందుచేతనే రాఖాల్ వచ్చాడు. ఎవరైతే నా సొంత మనుషులో వారిలో కొందరు నాలో ఒక అంశ, కొందరు ఒక కళ.”
శ్రీరామకృష్ణులు మళ్ళీ ‘మ’ తో పంచవటి వైపు వెళ్లసాగారు. మరెవరూ వారితో లేరు. ఆయన దరహాసవదనులై వివిధ విషయాలు చెబుతున్నారు.
16.2.2 అద్భుతమూర్తి దర్శనం – వటవృక్షపు కొమ్మ
శ్రీరామకృష్ణులు (‘మ’ తో): ఇలా చూడు, ఒక రోజు కాళీమందిరం నుండి పంచవటి వరకు వ్యాపించి ఉన్న ఒక అద్భుతమూర్తిని గాంచాను. దీన్ని నువ్వు విశ్వసిస్తావా?
‘మ’ సంభ్రమంతో మౌనంగా ఉండిపోయాడు. అతడు పంచవటి కొమ్మ నుండి ఒకటి, రెండు ఆకులు కోసి జేబులో పెట్టుకున్నాడు.
శ్రీరామకృష్ణులు: ఇక్కడ విరిగిపోయిన ఈ కొమ్మను చూస్తున్నావు కదా! నేను దాని క్రింద కూర్చునేవాడను.
‘మ’ : నేను దీని పచ్చికొమ్మ ఒకటి పట్టుకెళ్ళి ఇంట్లో పెట్టాను.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): ఎందుకు?
‘మ’ : దాన్ని చూస్తూ ఉన్నప్పుడు మనస్సంతా ఆనందంతో నిండిపోతుంది. మొత్తం పరిసమాప్తమైన తరువాత ఈ చోటు గొప్ప తీర్థమవుతుంది.
శ్రీరామకృష్ణులు (మందహాసంతో): ఎటువంటి తీర్థం? పానీహాటీ లాంటిదా?
పానిహాటీలో రాఘవ పండితుడు ఏటా మహోత్సవం జరుపుతాడు. శ్రీరామకృష్ణులు దాదాపు ప్రతి ఏడూ ఆ ఉత్సవాన్ని తిలకించ వెళ్ళేవారు. అక్కడ సంకీర్తన జరుగుతుంది. అప్పుడు శ్రీరామకృష్ణులు ప్రేమానందంలో ఒడలు మరచి నృత్యం చేసేవారు. భక్తుల ఆలాపన విని ప్రశాంతంగా ఉండలేక సాక్షాత్తూ శ్రీ చైతన్యులే అరుదెంచి సంకీర్తనలో పాల్గొని తమ ప్రేమమూర్తిమత్వాన్ని ప్రదర్శిస్తున్నట్లుగా ఉండేది అది.
16.3 తృతీయ పరిచ్ఛేదం హరికథా ప్రసంగం
మునిమాపువేళ అయింది. శ్రీరామకృష్ణులు తమ గదిలో చిన్నమంచం మీద కూర్చుని జగన్మాత నామాన్ని స్మరిస్తున్నారు. క్రమంగా, ఆలయంలో వివిధ దేవతామూర్తుల హారతి ప్రారంభమయింది. శంఖనాదం వినవచ్చింది, గంటలు మ్రోగసాగాయి. ‘మ’ ఈ రోజు రాత్రి ఇక్కడే బసచేసే ఉద్దేశంతో ఉన్నాడు.
16.3.1 మహారాజు జయమల్లుని చరిత్ర
కాసేపయ్యాక శ్రీరామకృష్ణులు ‘మ’ ను భక్తమాల అనే గ్రంథంలో నుంచి చదివి వినిపించమన్నారు. ‘మ’ చదవసాగాడు.
జయమల్లుడనే రాజు శ్రీకృష్ణునిపట్ల హృదయపూర్వక భక్తి కలిగి ఉన్నాడు. అతడు శ్రీకృష్ణుని శ్యామసుందర నామంతో ఆరాధించేవాడు. శ్రీకృష్ణుని పూజకు తగ్గ నియమనిష్ఠల నన్నిటినీ విధివిహితంగా పాటించేవాడు. తన ఇష్టదైవం పట్ల అమిత భక్తి గల అతడు తక్కిన దేవీదేవతలను గురించి యోచించేవాడు కాడు. అనునిత్యం ఉదయం పది గంటల వరకు పూజాదికాలలోనే గడిపేవాడు. దీన్ని అతడు ఏ కారణంగానూ విడువక కొనసాగిస్తూ వచ్చాడు. రాజ్యమే నాశనమై పోయినా సరే, సంపదలన్నీ హరించుకొనిపోయినా సరే, మిన్ను విరిగి మీదపడ్డా సరే పూజసమయంలో అతడు మరేదీ చేయడు.
ఈ రహస్యాన్ని తెలుసుకొన్నాడు పొరుగు రాజు. అందుచేత ఉదయం వేళ జయమల్లుని రాజ్యంపై దండెత్తాడు. జయమల్లుని ఆదేశం లేనందున అతడి సైనికులు యుద్ధంలో పాల్గోలేకపోయారు. కాబట్టి వారు కింకర్తవ్యతా మూఢులై చూస్తూ నిలబడిపోయారు. మెల్లమెల్లగా శత్రువులు కందకం (అగడ్త) వరకు వచ్చేశారు. కాని జయమల్లుని మనస్సు దానివైపు కాస్త కూడా పోలేదు.
జయమల్లుని తల్లి భీతిచెంది అమిత వేదనతో అతడి వద్దకెళ్లి, ‘సర్వనాశనం అయిపోయింది. నువ్వు ఇంకా ఇలా కదలక మెదలక కూర్చున్నావే!’ అంటూ విలపించింది. అందుకు జయమల్లు ప్రశాంతంగా ఆమెతో, ‘అమ్మా! నువ్వెందుకు విచారిస్తున్నావు? నాకు ఈ రాజ్యాన్ని ప్రసాదించినవారే దాన్ని తిరిగి తీసుకోవాలని అనుకుంటే, నేను ఏం చేయగలను? అదే విధంగా ఆయన నన్ను రక్షింపదలిస్తే ఎవరూ దాన్ని నా నుండి లాగుకోలేరు. నా ప్రయత్నంతో ఏం జరుగుతుంది?’ అన్నాడు.
ఆ సమయంలో శ్యామసుందరుడే జయమల్లుని అశ్వాన్ని అధిరోహించి యుద్ధానికి వెళ్లాడు. తానొక్కడే శత్రువులను ఎదుర్కొని శత్రుసైన్యాన్ని ధ్వంసం చేశాడు. ఆ తరువాత ఆలయం ప్రక్కన అశ్వాన్ని నిలిపి, మాయమైపోయాడు.
జయమల్లుడు పూజ ముగించి బయటకు వచ్చినప్పుడు, ఆలయం ప్రక్కన తన అశ్వం కట్టివేయబడి ఉండటమూ, అది స్వేదించటమూ చూశాడు. ‘నా అశ్వం మీద స్వారీచేసింది ఎవరు? ఆలయం ప్రక్కన దాన్ని తీసుకువచ్చి నిలబెట్టింది ఎవరు?’ అని కాపలావారిని గద్దిస్తూ అడిగాడు. తమకు ఆ సంగతి ఏదీ తెలియదని కాపలావారు ముక్తకంఠంతో చెప్పారు.
తికమకపడి, రాజు తన సైన్యంతో యుద్ధభూమికి వెళ్లాడు. అక్కడ శత్రుసైనికులందరూ నిర్జీవులై పడివున్నారు. శత్రురాజు మాత్రం సజీవుడై ఉన్నాడు. జరిగింది ఏమిటో ఏదీ అర్థం కాక దిగ్భ్రమచెంది నిలబడి ఉన్న జయమల్లుని వద్దకు వచ్చాడు శత్రురాజు. అతడు జయమల్లునికి ప్రణామం చేసి, ‘దయచేసి కొన్ని సంగతులు మీకు నివేదింప అనుమతించండి. లోకాన్ని నిర్జించగల పరాక్రమశాలి అయిన యుద్ధవీరుడు మీ వద్ద ఉన్నాడు. నేనెలా యుద్ధం చేయగలను? మీ సంపదలు, రాజ్యం నాకు వద్దు. మీ మిత్రుడైన ఆ నీలవర్ణ యుద్ధవీరుని గురించి మాత్రం నాకు తెలిపితే చాలు, నా రాజ్యాన్ని కూడా ఆనందంగా మీకే సమర్పిస్తాను. నా దృష్టి ఆ యుద్ధవీరుడిపై పడటమే ఆలస్యం, ఆతడు నా మనస్సునూ, ప్రాణాన్నీ హరించివేశాడు’ అని చెప్పాడు.
శ్యామసుందరుడే యుద్ధభూమికి వెళ్ళిన వ్యక్తి అన్న సంగతి జయమల్లుకు క్షణంలో తెలిసిపోయింది. శత్రురాజుకూ ఆ నిజం తెలిసింది. అతడు జయమల్లునికి నమస్కరించి, ఆతడి మూలంగా శ్రీకృష్ణుడి దయకు పాత్రుడైనాడు.
‘మ’ చదవి ముగించగానే శ్రీరామకృష్ణులు మాట్లాడసాగారు.
16.3.2 భక్తమాల ఏకపక్షమే – ఆంతరంగిక భక్తులు – జనకుడు, శుకదేవుడు
శ్రీరామకృష్ణులు: దీన్లో నీకు విశ్వాసం ఉందా? శ్రీకృష్ణుడే అశ్వాన్ని అధిరోహించి శత్రువులను సంహరించాడన్న విషయం నువ్వు విశ్వసిస్తావా?
‘మ’ : భక్తుడు వ్యాకులతతో భగవంతుణ్ణి పిలుస్తాడని విశ్వసిస్తాను. కాని ఆయన అశ్వాన్ని అధిరోహించి రావటం, ఎల్లరూ చూశారనటం అర్థం కావటం లేదు. ఆయన అశ్వాన్ని అధిరోహించి అక్కడకు రాగలడు, కాని అక్కడ ఉన్న వారు నిజంగానే ఆయనను చూశారో ఏమో?
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): ఈ పుస్తకంలో భక్తుల గురించిన కథలు చాలా ఉన్నాయి. కాని అవి దురభిమానపూరితమైనవి. ఈ పుస్తకం, తన దృక్పథాలకు విభిన్నులైన వారిని నిందిస్తూ ఉన్నది.
మరునాడు ఉదయం. తోటలో శ్రీరామకృష్ణులు, ‘మ’ నిలబడి మాట్లాడుకుంటున్నారు.
‘మ’ : అలా అయితే నేను ఇక్కడకు వచ్చి బస చేస్తాను.
శ్రీరామకృష్ణులు: సరి. మీరందరూ ఈ విధంగా ఇక్కడకు వస్తూ ఉన్నారే, దీని అర్థం ఏమిటి? సామాన్యంగా సాధువును దర్శింప జనం ఒకసారి వెళతారు. మీరందరూ ఇలా తరచూ వస్తూ ఉన్నారే! దీని అర్థం ఏమిటి?
‘మ’ బదులు చెప్పక మౌనం వహించాడు. శ్రీరామకృష్ణులే జవాబిచ్చారు.
శ్రీరామకృష్ణులు (‘మ’ తో): ఆంతరంగిక భక్తులలో ఒకనిగా ఉండకపోతే ఇలా వస్తావా ఏమిటి? ఆంతరంగికుడు అంటే స్వజనం; తండ్రి, కుమారుడు, సోదరుడు, సోదరి వలె నాకు సొంతమైనవాడు. నేను అన్నిటి గురించీ చెప్పను. అన్ని విషయాలు చెప్పివేస్తే మీరంతా మళ్లీ వస్తారా ఏమిటి?
“శుకదేవుడు బ్రహ్మజ్ఞానార్థం జనకుని వద్దకు వెళ్ళాడు. అయితే ముందుగానే గురుదక్షిణ సమర్పించమన్నాడు జనకుడు. ఉపదేశం స్వీకరించకుండానే దక్షిణ ఎలా ఇవ్వగలనని శుకదేవుడు అన్నాడు. జనకుడు నవ్వుతూ ఇలా అన్నాడు: ‘బ్రహ్మజ్ఞానం కలిగిన తర్వాత గురువు, శిష్యుడు అన్న ఎరుక ఉంటుందా? అందుకే ముందుగానే దక్షిణ నివ్వమంటున్నాను.’”
16.4 చతుర్థ పరిచ్ఛేదం ‘మ’ తనలో తాను…
శుక్లపక్షం. చంద్రోదయమయింది. ‘మ’ కాళికాలయం తోట దారిలో అటూ ఇటూ పచార్లు చేస్తున్నాడు. దారికి ఒక ప్రక్కగా శ్రీరామకృష్ణుల గది, నహబత్తు, పొగడ చెట్టు, పంచవటి ఉన్నాయి. మరో వైపు చంద్రకాంతిని దేదీప్యమానంగా ప్రతిఫలింపజేస్తూ ప్రవహిస్తూ ఉన్న పావన గంగానది.
‘మ’ ఇలా ఆలోచిస్తున్నాడు: “మనిషి నిజంగానే భగవంతుణ్ణి దర్శించగలడా? ‘తప్పక దర్శించగలడు’ అంటారు శ్రీరామకృష్ణులు. కొద్దిగా ప్రయత్నం చేయగానే ఎవరైనా వచ్చి ‘ఇలా, ఇలా చెయ్యి’ అని సహాయ పడతారు అని కూడా చెప్పారు. నే నో వివాహితుడను, పైగా పిల్లలు. నాకు భగవత్ ప్రాప్తి సాధ్యమేనా?…” అతడి ఆలోచనలు కొనసాగాయి. “తప్పక సాధ్యమే. లేకుంటే ఆయన చెబుతారా? భగవత్కృప కలిగితే సాధ్యం కానిది ఏముంది?
“ఎదురుగా కనిపించే ఈ జగత్తు, సూర్యచంద్రులు, నక్షత్రాలు, జీవులు, చతుర్వింశతి తత్త్వాలు – ఇవన్నీ ఎక్కడ నుండి ఉద్భవించాయి? వీటన్నింటికీ కర్త ఎవరు? నేను ఎవరు? నాకూ ఆయనకూ ఉన్న సంబంధం మేమిటి? ఇది తెలిసికోనట్లయితే, జీవితం వ్యర్థమే.
“శ్రీరామకృష్ణులు సర్వోత్తమ పురుషులు. ఇటువంటి మహాపురుషుణ్ణి ఇంతవరకు నా జీవితంలో చూడలేదు. ఈయన ఆ భగవంతుణ్ణి తప్పక దర్శించి ఉంటారు. లేకుంటే ‘అమ్మా, అమ్మా’ అంటూ అహర్నిశలూ ఎవరితో సంభాషిస్తున్నారు? పైగా, భగవత్ సాక్షాత్కారం కలగకుండానే, భగవంతునిపట్ల ఇంతటి ప్రేమ ఎలా జనిస్తుంది? ఆమె పట్ల గల ప్రేమతో బాహ్యస్పృహనే కోల్పోతారు; సమాధిమగ్నులై, పూర్తిగా నిశ్చలులైపోతారు. కదలికలేని జడునిలా ఉంటారు. ఒక్కోసారి ప్రేమానందంలో ఉన్మత్తులై నవ్వుతారు, విలపిస్తారు, నాట్యం చేస్తారు, గానం చేస్తారు.”
16.5 పంచమ పరిచ్ఛేదం ‘మ’, రామ్‌లాల్, డాక్టర్ శ్యామ్, కాంసారిపాడా భక్తులు
శుక్రవారం, డిసెంబర్ 14, 1883
నేడు పూర్ణిమ. సమయం ఉదయం దాదాపు తొమ్మిది గంటలు. శ్రీరామకృష్ణులు తమ గదికి ఆగ్నేయంలోని వసారాలో నిలబడి ఉన్నారు. ప్రక్కన రామ్‌లాల్ నిలబడి ఉన్నాడు. శ్రీరామకృష్ణులకు ఇరువైపుల రాఖాల్, లాటూలు నిలబడి ఉన్నారు. అక్కడకు వచ్చిన ‘మ’ శ్రీరామకృష్ణులకు సాష్టాంగ ప్రణామం చేశాడు.
శ్రీరామకృష్ణులు అతడితో “వచ్చేశావా! నేడు సుదినం” అన్నారు.
శ్రీరామకృష్ణుల వద్ద కొన్ని రోజులు ఉండి, సాధనలు చేయదలచుకున్నాడు ‘మ’. శ్రీరామకృష్ణులు అతడితో, “నువ్వు రోజూ ఇక్కడి అతిథి శాలలో భోజనం చేయటం మంచిది కాదు. ఈ అతిథిశాల సన్న్యాసులకు, పేద సాదలకు ఏర్పాటు చేయబడినది. కాబట్టి నీకు వంటచేసి పెట్టడానికి ఒక వంట వాణ్ణి తోడ్కొనిరా” అన్నారు. అందుకే ‘మ’ ఒక మనిషిని తోడ్కొనివచ్చాడు. ఆ మనిషికి వంటచేసే స్థలం చూపించారు. ‘మ’ పాలు త్రాగుతాడు కనుక పాలవాడితో చెప్పి పాలకు ఏర్పాటు చేయమని శ్రీరామకృష్ణులు రామ్‌లాల్‌తో చెప్పి ఉన్నారు.
కాసేపయ్యాక రాంలాల్ అధ్యాత్మ రామాయణం పఠింప నారంభించాడు. శ్రీరామకృష్ణులు, ‘మ’ వింటున్నారు.
తరువాత శ్రీరాముడు సీతను వివాహం చేసుకొని అయోధ్యకు తిరిగివస్తున్నాడు. శ్రీరాముడు శివధనుస్సును విరిచాడని విని, పరశురాముడు దారిలో ఆతణ్ణి ప్రతిఘటించాడు. దశరథుడు భయపడిపోయాడు. పరశురాముడు ఒక విల్లును శ్రీరాముడికి అందించి నారి సంధించమని సవాలు చేశాడు. ఇదంతా చూసి దశరథుడు భయంతో వణికిపోయాడు. కాని శ్రీరాముడు చిరుదరహాసంతో ఆ విల్లును అలవోకగా తన వామహస్తంతో పట్టి సునాయాసంగా నారిని సంధించాడు. పిదప బాణాన్ని గురిపెట్టి నారిని లాగి, ‘ఈ బాణానికి లక్ష్యం ఎక్కడ? చెప్పండి’ అని పరశురాముణ్ణి అడిగాడు. దానితో పరశురాముడి గర్వం అణగిపోయింది. ఆతడు శ్రీరాముణ్ణి సాక్షాత్తూ పరబ్రహ్మంగా స్తుతించ నారంభించాడు.
పరశురాముడి స్తుతిని వింటూనే శ్రీరామకృష్ణులు భావపారవశ్యంలో మునిగిపోయారు.మధ్యమధ్యలో ‘రాం రాం’ అంటూ రామనామాన్ని సుమధురంగా జపించారు.
శ్రీరామకృష్ణులు (రాంలాల్‌తో): ఇప్పుడు గుహుణ్ణి గురించి కాస్త చదువు, వింటాం.
నిమ్నజాతికి చెందిన గుహుడు శ్రీరాముడి సన్నిహిత మిత్రుడు. తండ్రి దశరథుని సత్యవాక్య పరిపాలన కోసం శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతుడై అరణ్యాలకు వెళుతూ ఉన్నప్పుడు దారిలో గుహుడు పడవ నడిపి సహాయం చేశాడు. శ్రీరాముడు గుహుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు. గుహుడు శ్రీరామచంద్రునికి తనను ఆత్మసమర్పణం గావించుకున్నాడు. జటావల్కలాలను ధరించి, కందమూలాలను తింటూ పద్నాలుగేళ్ల కాలం తాము అరణ్యవాసం చేయనున్నట్లు శ్రీరాముడు, గుహుడికి తెలిపాడు. అయోధ్యకు తిరిగి వచ్చేటప్పుడు గుహుణ్ణి మళ్లీ కలుసుకుంటానని వాగ్దానం కూడా చేశాడు. వెంటనే తానూ జటావల్కలాలను ధరించి, కందమూలాలనే ఆహారంగా చేసుకుని ఆయన రాకకై ఎదురుచూస్తూ నిరీక్షించాడు గుహుడు.
పద్నాలుగేళ్లు పూర్తి అయ్యాక కూడా శ్రీరాముడు తిరిగి రాకపోవటం చూసి గుహుడు అగ్నిని రగిలించాడు. అగ్ని ప్రవేశం చేయబోతున్నప్పుడు శ్రీరాముని దూతగా ఆంజనేయుడు అక్కడకు వచ్చి చేరుకున్నాడు. కాసేపట్లో శ్రీరాముడు, సీతాదేవి పుష్పక విమానంలో అక్కడకు వచ్చేశారు. వారిని చూడగానే గుహుడు పరమానందభరితుడయ్యాడు.
16.5.1 కేశవ్‌ది యాదృచ్ఛికలాభం – తీవ్ర వైరాగ్యం
మధ్యాహ్న భోజనానంతరం శ్రీరామకృష్ణులు కాసేపు విశ్రమించారు. ‘మ’ ప్రక్కనే కూర్చుని ఉన్నాడు. అప్పుడు డాక్టర్ శ్యామ్, మరికొందరు వచ్చారు. శ్రీరామకృష్ణులు లేచి కూర్చుని మాట్లాడసాగారు.
శ్రీరామకృష్ణులు: కర్మలు సదా చేస్తూనే ఉండాలని ఏమీ లేదు. పిందె కానరాగానే పువ్వు తనంతట తానే రాలిపోయేట్లు భగవదనుభూతి లభించాక కర్మలు తొలగిపోతాయి.
“భగవదనుభూతి ప్రాప్తించిన వ్యక్తికి సంధ్యావందనాది కర్మలు ఉండవు. సంధ్యావందనం గాయత్రిలో లయం అవుతుంది. అప్పుడు గాయత్రీ జపం చేస్తేనే చాలు. గాయత్రి ఓంకారంలో లయిస్తుంది. ఆ స్థితిలో గాయత్రీ మంత్రాన్ని కూడా జపించే అవసరం లేదు, కేవలం ఓంకార ధ్యానమే చాలు.
“సంధ్యావందనాదులు ఎంతకాలం ఆచరించాలి? హరినామాన్నో, రామనామాన్నో ఉచ్చరించేటప్పుడు దేహం రోమాంచితం కానంతవరకే, కళ్లవెంట అశ్రువులు స్రవించనంతవరకే. జనులు ధనం కోసమో, వ్యాజ్యాలలో నెగ్గటం కోసమో పూజాదికాలు నిర్వర్తిస్తుంటారు. అది మంచిది కాదు.”
ఒక భక్తుడు: ధనం నిమిత్తం ఎల్లరూ ప్రయత్నిస్తూ ఉన్నారే! కేశవ చంద్రసేన్ కూడా తన కుమార్తెను ఒక రాజకుమారునికిచ్చి వివాహం చేశాడు గదా!
శ్రీరామకృష్ణులు: కేశవ్ విషయం వేరు. నిజమైన భక్తుడు స్వప్రయత్నం చేయకున్నా అతడికి అవసరమైనవి భగవంతుడే సమకూరుస్తాడు. నిజంగా రాజకుమారుడైన వ్యక్తికి, అడక్కుండానే అన్నీ లభిస్తాయి. కష్టించి, పరులకు దాస్యం చేసి ధనం సంపాదించే వకీళ్ల గికీళ్ల సంగతి గురించి నేనిక్కడ చెప్పటం లేదు. నేను చెప్పేది, ‘నిజమైన రాకుమారుడి’ గురించి. ఏ కోరికా లేని వ్యక్తికి ధనం అక్కర్లేదు. ధనం దానంతట అదే అతడి వద్దకు చేరుతుంది. భగవద్గీత అలాంటి భక్తుని ‘యదృచ్ఛాలాభ’* అని పేర్కొంటుంది.
“ఏ కోరికా లేని సద్బ్రాహ్మణుడు చండాలుని ఇంటి నుండి కూడా ఆహార పదార్థాలను స్వీకరిస్తాడు. దొరికినది పుచ్చుకుని తృప్తి చెందుతాడతడు. అతడు దేన్నీ కాంక్షించడు, అతడికి అవసరమైనది దానంతట అదే లభిస్తుంది.”
ఒక భక్తుడు: మహాశయా! మేం సంసారంలో ఎలా జీవించాలి?
శ్రీరామకృష్ణులు: బురద చేపలా జీవించు. కుటుంబం నుండి వైదొలగి అప్పుడప్పుడు నిర్జన ప్రదేశంలోకి వెళ్లి భగవచ్చింతనలో గడపాలి. అప్పుడు భక్తి జనిస్తుంది. ఆ పిదప నిర్లిప్తంగా జీవించవచ్చు. బురద చేప ఉందే, అది బురదలోనే బ్రతకాల్సి ఉంటుంది. కాని దాని ఒంటికి బురద అంటుకోదు. అటువంటి వ్యక్తి కూడా అదే విధంగా అనాసక్తుడై సంసార జీవితం గడుపుతాడు.
‘మ’ ఏకాగ్రచిత్తంతో వింటూ ఉండటం శ్రీరామకృష్ణులు గమనించారు.
శ్రీరామకృష్ణులు (‘మ’ ను చూస్తూ): తీవ్ర వైరాగ్యం కలిగితేనే భగవంతుని పొందగలం. తీవ్ర వైరాగ్యం జనించిన వ్యక్తికి సంసారం దావానలంలా తోస్తుంది; అన్నీ తగలబడుతూ ఉన్నట్లు భావన! భార్యాపిల్లలందరూ మృత్యుకూపాల్లా కానవస్తారు. అట్టి వైరాగ్యం జనించిన వ్యక్తి, ఇంటిని వదలిపెట్టి వెళ్లిపోతాడు; కేవలం అనాసక్తుడై ఉండడమే అతడికి చాలదు.
16.5.2 కామినీ కాంచనాలే మాయ – పురుషులందరూ శ్రీరాముడే, స్త్రీలందరూ సీతాదేవియే
“కామినీ కాంచనాలే మాయ. మాయను కనుక గుర్తించగలిగితే అది సిగ్గుపడి పారిపోతుంది. ఒకడు పులితోలు కప్పుకొని భయపెట్టాలని వచ్చాడు. కాని రెండవ వ్యక్తి, ‘ఒరేయ్! నువ్వెవరో నాకు తెలుసు. నువ్వు మా హరివే కదా!’ అన్నాడు. అంతే ఆ పులితోలు కప్పుకున్న వ్యక్తి నవ్వుతూ మరొకరిని భయపెట్టడానికి వెళ్ళిపోయాడు.
“స్త్రీలందరూ శక్తి యొక్క రూపాలే. ఆ ఆద్యాశక్తియే స్వయంగా స్త్రీమూర్తులుగా విరాజిల్లుతూ మనకు స్త్రీ రూపాలలో దర్శనమిస్తోంది. అధ్యాత్మ రామాయణంలో ఇలా ఉంది: శ్రీరాముణ్ణి నారదాదులు ఇలా స్తుతిస్తున్నారు – ‘ఓ రామా! పురుషులందరూ నువ్వే అయివున్నావు, స్త్రీలందరూ సీతాదేవియే అయివున్నారు; నువ్వు ఇంద్రుడివి, సీత ఇంద్రాణి; నువ్వు శివుడివి, సీత పార్వతి. నువ్వు నరుడివి, సీత నారి. పురుషత్వం ఉన్నచోటల్లా నువ్వు ఉన్నావు. స్త్రీత్వం ఉన్నచోటల్లా సీత ఉన్నది. ఇక ఇంతకంటే ఏం చెప్పగలం.’
16.5.3 త్యాగం – ప్రారబ్ధ కర్మ – వామాచార సాధన మంచిది కాదు
(భక్తులతో) “ఊరకే తలచుకున్నంత మాత్రాన త్యజించలేరు. ప్రారబ్ధ కర్మ, సంస్కారం – ఇటువంటివి కూడా ఉన్నాయి. యోగి ఒకరు ఒక రాజుతో ఇలా అన్నాడు: ‘నువ్వు నా దగ్గర ఉంటూ భగవత్ చింతన చెయ్యి.’ దానికి రాజు ఇలా బదులు పలికాడు: ‘స్వామీ! నాకు అది ఇంకా చాలాకాలం వరకు సాధ్యపడదు. నేను మీతోపాటు ఉండగలను. అయితే, నాకు ఇంకా భోగేచ్ఛ ఉంది. నేను అడవిలో వసించినట్లయితే, ఆ చోట కూడా ఒక రాజ్యం ఏర్పరుస్తాను. నాకు ఇంకా భోగేచ్ఛ ఉంది.’
“నటవర్ పాంజా బాలుడిగా ఉండేటప్పుడు అతడు ఇక్కడి తోటలోనే తన ఆవులు కాచేవాడు. అయితే అతడికి ఎంతో భోగేచ్ఛ ఉండేది. అందుకే అతడు ఆముదం నూనె మిల్లు పెట్టాడు. ప్రస్తుతం చాలా డబ్బు సంపాదించాడు. ఆలంబజార్లో అతడి ఆముదం వ్యాపారం బాగా సాగుతోంది.
“స్త్రీ సహచర్యంతో సాధన చేయమనే సంప్రదాయం ఒకటి ఉంది. ఒకసారి నన్ను కర్తాభజా సంప్రదాయానికి చెందిన స్త్రీల వద్దకు తీసుకెళ్ళారు. అందరు నా వద్దకు వచ్చి కూర్చున్నారు. నేను వారిని ‘అమ్మా, అమ్మా’ అంటూ సంబోధించడంతో వారు తమలో తాము ఇలా మాట్లాడుకోసాగారు: ‘ఇతడు ఇంకా ప్రవర్తకుడే. ఇంకా ‘గట్టు’ ను (మార్గాన్ని) కనుగొనలేదు.’ వారి సంప్రదాయంలో ప్రాథమిక దశలో ఉన్నవాడిని ప్రవర్తకుడంటారు; పిమ్మట సాధకుడు; తరువాత సిద్ధ సిద్ధుడు.
“ఒక స్త్రీ వచ్చి వైష్ణవచరణ్ ప్రక్కన కూర్చుంది. తరువాత వైష్ణవచరణ్ని దాన్ని గురించి అడిగేసరికి, ‘ఆమెది బాలికా భావం’ అన్నాడు. స్త్రీభావంలో మనిషి సత్వరం పతనమైపోతాడు. మాతృభావం శుద్ధభావం.”
కాంసారిపాడా నుంచి వచ్చిన భక్తులు లేచి నిలబడి, “మేమిక వెళ్తాం. కాళీమాతను, తక్కిన దైవాలను దర్శించుకొని వెళతాం” అని చెప్పి శ్రీరామకృష్ణుల నుండి సెలవు పుచ్చుకున్నారు.
16.6 షష్ఠ పరిచ్ఛేదం విగ్రహారాధన – తీవ్ర వ్యాకులత
పంచవటి, కాళికాలయంలోని ఇతర చోట్లలో ఏకాంతంగా ‘మ’ విచారణ చేస్తున్నాడు. పరమహంసదేవులు ఇలా అంటూంటారు: ‘కొద్దిగా సాధన చేయగానే భగవత్ దర్శనం లభిస్తుంది.’ దాన్ని గురించే ఆలోచిస్తూ ఉన్నాడా? పైగా తీవ్ర వైరాగ్యం సంగతీ ఉన్నది; మాయను తెలుసుకుంటే అది తనంతట తానే పలాయనం చేస్తుందట!
సమయం అప్పుడు దాదాపు మూడున్నర గంటలు అయివుంటుంది. ‘మ’ మళ్ళీ పరమహంసదేవుల గదిలోకి వెళ్ళి కూర్చున్నాడు. బ్రౌటన్ ఇన్స్టిట్యూషన్ నుండి ఒక ఉపాధ్యాయుడు పలువురు విద్యార్థులను శ్రీరామకృష్ణుల దర్శనార్థం తీసుకువచ్చాడు. ఆయన వారితో సంభాషిస్తున్నారు. ఉపాధ్యాయుడు మధ్య మధ్యలో ఏవో ప్రశ్నలు అడుగుతున్నాడు. విగ్రహారాధన గురించి సంభాషణ నడుస్తోంది.
శ్రీరామకృష్ణులు (ఉపాధ్యాయునితో): విగ్రహారాధనలో తప్పేముంది? అస్తి, భాతి, ప్రియం (అస్తిత్వం, ప్రకాశం, ప్రియం) ఉన్నచోటనే ఆయన అభివ్యక్తీకరణ ఉంటుందని వేదాంతం పేర్కొంటోంది. అందుకే భగవంతుడు తప్ప మరేదీ లేదు.
“ఇంకో సంగతి చూడండి. బాలికలు ఎంత కాలం బొమ్మలతో ఆడుకుంటారు? వివాహం కానంతవరకే కదా! వివాహం కాగానే బొమ్మలన్నిటినీ ఒక పెట్టెలో పెట్టి మూసివేస్తారు. అదేవిధంగా భగవత్ లబ్ధి కలిగిన పిమ్మట, ఇక విగ్రహారాధన అవసరమేముంది?
(‘మ’ ను చూస్తూ) “అనురాగం ఏర్పడినప్పుడు భగవల్లాభం సిద్ధిస్తుంది. తీవ్ర వ్యాకులత కావాలి. తీవ్ర వ్యాకులత కలిగినట్లయితే, మనస్సంతా భగవంతుని మీదే లగ్నమవుతుంది.
16.6.1 గోవిందుడే భర్త – జటిలుడు – నైవేద్యం పెట్టిన పిల్లవాని కథ
“ఒక వ్యక్తి కుమార్తె పిన్న వయస్సులోనే వితంతువు అయింది. భర్త ముఖం ఎన్నడూ చూడనైనా లేదు. తక్కిన బాలికల భర్తలు రావడం చూసి ఒకనాడు తన తండ్రిని ఇలా అడిగింది: ‘నాన్నగారూ, నా భర్త ఎక్కడ ఉన్నాడు?’ అందుకు ఆమె తండ్రి ఇలా బదులు పలికాడు: ‘అమ్మా, నీ భర్త గోవిందుడు. ఆయనను పిలిస్తే నీ వద్దకు వస్తాడు.’ ఈ మాట విని ఆ బాలిక గదిలోకి వెళ్ళి తలుపులన్నీ మూసుకుని గోవిందుని పిలువసాగింది. ఇలా విలపించసాగింది: ‘గోవిందా! నువ్వు వచ్చి నాకు దర్శనం ఇవ్వు. నువ్వు ఎందుకని రావు?’ ఆ అమ్మాయి వ్యాకులతకు భగవంతుడు చెవి ఒగ్గక ఉండలేకపోయాడు. ఆమెకు దర్శనం అనుగ్రహించాడు.
“పిల్లలకున్న విశ్వాసం కావాలి. పిల్లవాడు తల్లిని చూడడానికి పడే వ్యాకులత ఎటువంటిదో, అటువంటిది. అటువంటి వ్యాకులత కలిగినట్లయితే అరుణోదయమైనట్లే. సత్వరం సూర్యోదయం అవుతుంది. ఇటువంటి వ్యాకులత ఏర్పడిన తరువాత భగవత్ దర్శనం లభిస్తుంది.
“జటిలుడనే చిన్నపిల్లవాడి కథ ఒకటి ఉంది. అతడు పాఠశాలకు కొంతదూరం అడవి మార్గం గుండా వెళ్ళవలసి వచ్చేది. అలా వెళ్తున్నప్పుడు అతడికి భయం కలుగుతూండేది. అతడు తన భయం గురించి తల్లికి చెప్పాడు. అందుకు ఆమె ‘నువ్వు ఎందుకు భయపడుతున్నావు? మధుసూదనుణ్ణి పిలువు’ అన్నది. అందుకు ఆ పిల్లవాడు, ‘అమ్మా, ఆ మధుసూదనుడెవరు?’ అని అడిగాడు. ‘అతడు నీ అన్న’ అని తల్లి బదులు చెప్పింది.
“మరునాడు జటిలుడికి అడవి మార్గంలో భయం వేయగానే ‘ఓ అన్నా! మధుసూదనా!’ అంటూ పిలువసాగాడు. అయితే ఎవరూ రాలేదు. అంతే, ఉచ్ఛస్వరంలో ఇలా పిలువసాగాడు: ‘అన్నా, మధుసూదనా! నువ్వెక్కడ ఉన్నావు? ఇక్కడకు రా, నాకు భయం వేస్తోంది.’ ఆ తరువాత మధుసూదనుడు రాకుండా ఉండలేకపోయాడు. ‘ఇదిగో, నేనిక్కడే ఉన్నాను! నీకు భయమెందుకు?’ అంటూ, మాట్లాడుతూ వెళ్ళి పాఠశాల దారివద్ద వదలిపెట్టి మధుసూదనుడు ఇలా అన్నాడు: ‘తమ్ముడూ! భయపడవద్దు. నువ్వు పిలిస్తే, వచ్చేస్తాను.’ ఇలా అని వెళ్లిపోయాడు. ఇదే పిల్లవాడి విశ్వాసం! ఇదే వ్యాకులత!
“ఒక బ్రాహ్మణుడి ఇంట రోజూ భగవంతుడికి నిత్యపూజ జరుగుతూ ఉండేది. ఒకనాడు ఏదో కార్యార్థం అతడు పొరుగూరు వెళ్ళవలసి వచ్చింది. కాబట్టి తన చిన్న కుమారునితో ‘ఈ రోజు దేవుడికి నువ్వు నైవేద్యం పెట్టు, దేవుడికి ఆహారం తినిపించు’ అని చెప్పి, వెళ్లిపోయాడు.
“పిల్లవాడు దేవుడికి నైవేద్యం సమర్పించాడు. కాని స్వామి ఉన్నచోటు నుంచి కదల్లేదు; నోరు తెరచి అతడితో మాట్లాడనూ లేదు, ఆహారాన్ని తిననూ లేదు. స్వామి తన పీఠం నుండి లేచివచ్చి తినలేదు. అంతవరకూ పిల్లవాడు అక్కడే కూర్చుని చాలాసేపు వేచి ఉన్నాడు. సమయమైతే అయిందేగాని, స్వామి తన పీఠం నుండి లేవనేలేదు.
“ఆయన నిశ్చయంగా వచ్చి ఆసనంలో కూర్చుని ఆరగిస్తాడన్న ప్రగాఢ విశ్వాసం ఆ పిల్లవాడికి ఉన్నది. కాబట్టి అతడు, ‘స్వామీ! వచ్చి ఆరగించండి. ఎంతో సమయం అయింది. ఇంకా నేను నిరీక్షిస్తూ ఉండలేను’ అంటూ మళ్లీ మళ్లీ ప్రార్థించాడు.
“కాని స్వామి ఏం పలుకలేదు. పిల్లవాడు ఏడవసాగాడు. ‘భగవాన్! నీకు ఆహారం తినిపించమని నా తండ్రి చెప్పి వెళ్లారు. నువ్వెందుకు రాకున్నావు? ఎందుకు నా నుండి తిననంటున్నావు?’ అంటూ కన్నీరుమున్నీరై విలపిస్తూ ప్రార్థించాడు. ఇలా అతడు వ్యాకులతతో విలపించగానే స్వామి వచ్చేశాడు. వికసిత వదనంతో కూర్చుని ఆరగించసాగాడు. ఆయన భుజించాక పిల్లవాడు బయటకు వచ్చాడు. వెంటనే ఇంట్లోవాళ్లు, ‘నాయనా, నైవేద్యం పూర్తయిందా? ప్రసాదాన్ని పట్టుకురా’ అన్నారు. పిల్లవాడు, ‘నైవేద్యం పూర్తయింది, స్వామి అంతా ఆరగించి వెళ్లిపోయాడ’ ని చెప్పాడు. ‘అదెలా నాయనా?’ అని ఇంట్లోవాళ్లు అతణ్ణి అడిగారు. పిల్లవాడు కల్లాకపటం లేకుండా ‘ఏం, భగవంతుడే ఆరగించాడు’ అని చెప్పాడు. పూజామందిరంలోకి వెళ్లి చూసి వారందరూ దిగ్భ్రాంతులయ్యారు.”
సంధ్యాకాలానికి ఇంకా సమయం ఉంది. శ్రీరామకృష్ణులు నహబత్తుకు దక్షిణం వైపు నిలబడి ‘మ’ తో మాట్లాడుతున్నారు. ఎదురుగా పావన గంగానది ప్రవహిస్తోంది. శీతకాలం కావడంతో శ్రీరామకృష్ణులు ఉన్ని శాలువ కప్పుకుని ఉన్నారు.
శ్రీరామకృష్ణులు: ఎక్కడ పడుకుంటావు? పంచవటిలో ఉన్న గుడిసెలో పడుకోబోతున్నావా?
‘మ’ : నహబత్తు మేడ మీది గది ఇవ్వరా?
ఆలయ అధికారితో ‘మ’ ను గురించి తెలిపి అతడు బస చేయటానికి ఒక స్థలం ఏర్పాటు చేయదలచుకున్నారు శ్రీరామకృష్ణులు.
ఆ గది ‘మ’ కు నచ్చింది. అతడిది కవితాహృదయం. ఆ గది నుండి నిర్మల గంగానదీ, నీలాకాశం, వెన్నెల కాంతి, పువ్వుల చెట్లు అన్నింటినీ ఒకేసారిగా చూడవచ్చు.
శ్రీరామకృష్ణులు: ఎందుకు ఇవ్వరు? అయితే పంచవటిలోని గుడిసెలో ఎంతగానో హరినామ స్మరణ, భగవత్ చింతన జరిగింది; అందుచేతనే ఆ స్థలం నీకు సూచించాను.
16.7 సప్తమ పరిచ్ఛేదం భగవంతుని పట్ల ప్రేమే జీవితోద్దేశం
శ్రీరామకృష్ణుల గదిలో సాంబ్రాణిధూపం వేయబడింది. చిన్నమంచం మీద కూర్చుని ఆయన ధ్యానం చేయసాగారు. రాఖాల్, లాటు, రామ్‌లాల్, ‘మ’ లు నేల మీద కూర్చున్నారు.
శ్రీరామకృష్ణులు ‘మ’ తో “అసలు విషయం ఇదే – భగవంతుని పట్ల భక్తి కలిగి ఉండాలి, ఆయనను ప్రేమించాలి” అన్నారు. తరువాత రామ్‌లాల్‌ను పాడమన్నారు.
రామ్‌లాల్ మొదట చైతన్యుల సన్న్యాసం గురించి పాడాడు:
ఏమాదర్శనం ఏమి దర్శనం
కేశవభారతి ఆశ్రమంబున
అనుపమేయమగు అనుగ్రహముతో
గోరా కన్నుల గారు ధారలు….
ముక్తి నొసగ వెరువగాని
(శుద్ధ) భక్తి నొసగ వెరతు నేను….
శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు: “రామ్‌లాల్, ఆ పాట పాడు.”
ఓ గౌరు ఓ నిత్తాయి మీరు
ధన్యజీవులు, పావన జన్ములు
కరుణాపూరితులని విని నే మీ
చెంత జేరితిని చింతను మాని॥ ఓ ॥
కాశీక్షేత్రము గాంచినప్పుడు
కాశీనాథుడు నాకు చెప్పెను
శచీ గృహమున, మానవరూపున
పరబ్రహ్మమే అవతరించునని॥ ఓ ॥
పరబ్రహ్మమా! నిను కనుగొంటిని
సాధు లెందరినొ సందర్శించితి
నిన్నుబోలు కరుణు లెందున
లేరు ఒకరు, లేరు ఎందున॥ ఓ ॥
అప్పుడు వ్రజమున అవతరించితివి
కృష్ణచంద్రుడుగ, బలరాముడుగ
ఇప్పుడు నదియా యందు పుట్టితివి
గౌరునిత్తాయిగ మార్చి వేషములు॥ ఓ ॥
అప్పుడు వ్రజమున పచ్చిక బయలున
పరుగులెత్తితిరి కేరింతలతో
ఇప్పుడు నదియా నడివీథులలో
హరిని పాడుచు పొరలి దొరలితివి॥ ఓ ॥
అప్పుడు వ్రజమున గోపాలురతో
అరచుచు నెగురుచు తిరుగుచుంటివి
ఇప్పుడు భక్తుల తోడ గూడుచు
ప్రభు హరి నామము పాడియాడితివి॥ ఓ ॥
ఎంత గుట్టుగా దాచితి విప్పుడు
వ్రజమున దాల్చిన నీలి రూపమును
(నీ) వెంత దాచిన చెప్పక చెప్పును
వాలు కనులు నీ వసలు ఎవరవొ॥ ఓ ॥
(నీ) పావన నామము పాపిని ముక్తుని
చేసి వేయునని చెప్పుదు రందరు
అందువలన నా డెందము ఆశతొ
నిండిపోయి నన్నీడ్చె నీ దరికి॥ ఓ ॥
పరుగు పరుగు నీ పదముల జేరితి
దేవదేవ నను కాపాడుమురా
కరుణావర్షము గురియుచు నాపై
పదముల నీడన పదిల పరచరా॥ ఓ ॥
పరమపాపులగు జగాయి మధాయి
కావగలేదా కరుణాసాగర
ఆ దయ నాపై బరపుట కొరకై
ప్రార్థన చేసెద పతితపావనా॥ ఓ ॥
అంత్యజునైనను అనుజుని విధమున
కౌగిట జేర్చుచు కర్ణపుటంబుల
ప్రాణప్రదంబగు ప్రభు హరినామము
ఉపదేశించితివని వినియుంటిని॥ ఓ ॥
16.7.1 శ్రీరామకృష్ణులపై ‘మ’ ధ్యానం
నహబత్తు పైనున్న గదిలో ‘మ’ ఒంటరిగా కూర్చుని ఉన్నాడు. రాత్రి చాల ప్రొద్దుపోయింది. నాడు పౌర్ణమి. ఆకాశం, గంగానది, కాళికాలయం, ఆలయ శిఖరం, ఉద్యాన వాటిక, పంచవటి – ఇవన్నీ చంద్రుని చల్లని వెన్నెలలో తేలియాడుతున్నాయి. ఆ ఏకాంతంలో ‘మ’ శ్రీరామకృష్ణులను ధ్యానిస్తూ ఉన్నాడు.
నలువైపులా నిశ్శబ్దం రాజ్యం చేస్తోంది. రాత్రి పదకొండు గంటలకు గంగలో పోటు ప్రారంభమైంది. ఎదురుగా ప్రవహిస్తున్న నది హోరు అప్పుడప్పుడు వినవస్తోంది. నాలుగు వైపులా దట్టంగా వ్యాపించిన వృక్షాల ఆకుల గుండా వెన్నెల నేల మీద ప్రసరిస్తోంది. ‘మ’ పంచవటి కేసి వెళ్లాడు. ఆ ప్రశాంత వాతావరణంలో పంచవటి వృక్షసమూహాల నుండి, “అన్నా, మధుసూదనా! నువ్వు ఎక్కడ ఉన్నావు?” అనే ఆర్తనాదం ‘మ’ కు వినబడింది.
‘మ’ మరికొంత దూరం ముందుకు వెళ్లాడు. అక్కడ పంచవటి మధ్యలో శ్రీరామకృష్ణుల భక్తుడొకరు (లాటూ) ఒంటరిగా కూర్చుని, “అన్నా మధుసూదనా! ఎక్కడ ఉన్నావు?” అని ప్రార్థిస్తూ విలపిస్తూ ఉన్నాడు. ‘మ’ ఆ దృశ్యాన్ని ప్రశాంతంగా చూస్తూ నిలబడిపోయాడు.
వేకువజాము మూడు గంటలు అయివుంటుంది. ‘మ’ లేచి పంచవటికేసి బయలుదేరాడు. శ్రీరామకృష్ణులు పంచవటి గురించి చెప్పి ఉన్నారు. నహబత్తు మేడ మీది గది అంత విశిష్టంగా ‘మ’ కు ఇప్పుడు అనిపించలేదు. పంచవటి గుడిసెలోనే ఇక బస చేయాలని తీర్మానించుకున్నాడు.
16.8 అష్టమ పరిచ్ఛేదం దక్షిణేశ్వరంలో ఆంతరంగిక భక్తులతో
శనివారం, డిసెంబర్ 15, 1883
16.8.1 ప్రహ్లాద చరిత్ర శ్రవణం, భావపారవశ్యం
ఉదయం సుమారు ఎనిమిది గంటల సమయం. దక్షిణేశ్వర కాళికాలయంలోని శ్రీరామకృష్ణుల గది. శ్రీరామకృష్ణులు నేల మీద కూర్చుని ఉన్నారు. భక్తమాల గ్రంథం నుండి ప్రహ్లాద చరిత్రను రామ్‌లాల్ పఠిస్తున్నాడు. శ్రీరామకృష్ణులు ఆలకిస్తున్నారు. ఆయన పాదపద్మాల చెంత వసిస్తూ ఉన్న ‘మ’ కూడా ప్రక్కన కూర్చుని వింటున్నాడు. గదిలో రాఖాల్, లాటూ, హరీశ్ ప్రభృతులూ ఉన్నారు. మరికొందరు అటూ ఇటూ తిరుగుతున్నారు. హాజ్రా వసారాలో కూర్చుని ఉన్నాడు.
శ్రీరామకృష్ణులు ప్రహ్లాద చరిత్ర వింటూ భావపరవశులైనారు.
హిరణ్యకశిపుడు వధింపబడ్డాడు. నృసింహస్వామి భీకర రూపాన్ని, సింహగర్జనను చూసి బ్రహ్మాది దేవతలు వణకిపోయారు. జగత్తు యావత్తు ప్రళయంలో మునిగి పోతుందేమో అని భీతిల్లి వారు ప్రహ్లాదుణ్ణి, నరసింహస్వామి సమీపానికి పంపారు. ప్రహ్లాదుడు శ్రీహరిని స్తుతించసాగాడు. ఆ బాలుని ప్రేమమయ స్తోత్రాలను విని భక్తవత్సలుడైన భగవంతుడు అతణ్ణి అనురాగంతో తన నాలుకతో నాకాడు.
ఈ ఘట్టాన్ని వినగానే శ్రీరామకృష్ణులు భావపారవశ్యంలో “ఆహా! ఆహా! భక్తుని పట్ల ఎంత వాత్సల్యం! ఎంత వాత్సల్యం!” అంటూ భావసమాధిగతులైనారు. కనుకొలకుల నుండి ప్రేమాశ్రువులు స్రవిస్తున్నాయి.
పారవశ్యస్థితి ఉపశమించిన తరువాత శ్రీరామకృష్ణులు చిన్నమంచం మీద కూర్చున్నారు. ‘మ’ నేల మీద ఆయన పాదాల చెంత కూర్చున్నాడు. ఆయన ‘మ’ తో మాట్లాడసాగారు.
16.8.2 స్త్రీ సాంగత్యంపై నిరసన
భగవన్మార్గంలో పయనించేవారి స్త్రీల సాంగత్యాన్ని నిరసిస్తూ తమ కోపాన్ని వెలిబుచ్చారు శ్రీరామకృష్ణులు.
శ్రీరామకృష్ణులు (‘మ’ తో): సిగ్గు లేదూ? పిల్లలు పుట్టారు, ఇంకా భార్యతో సాంగత్యమా? పశుప్రాయమైన ఈ జీవితం పట్ల నీకు ఇంకా ఏవగింపు కలగటం లేదా? ఉమ్మి, నెత్తురు, మలం, మూత్రం – ఇత్యాదుల పట్ల నీకు ఇంకా ఏవగింపు కలగటం లేదా? భగవంతుని పాదపద్మాలపై చింతన చేసే వారికి జగదేకసుందరి కూడా చితాభస్మంలా తోచుతుంది. అశాశ్వతమై ఉండి, క్రిములు, పేగులు, పిత్తం, కఫం మొదలైన అపరిశుద్ధ వస్తువులతో నిండివున్న శరీరంలోనా ఆనందం చూస్తున్నావు? సిగ్గుచేటు!
‘మ’ సిగ్గుతో తలవంచుకొని మౌనంగా ఉండిపోయాడు. శ్రీరామకృష్ణులు కొనసాగించారు:
“భగవంతుడి ప్రేమామృతంలో ఒక్క బిందుమాత్రం ఆస్వాదించినా కామినీ కాంచనాలు అతి తుచ్ఛాలుగా తోస్తాయి. కలకండ పానకం లభిస్తే బెల్లం పానకం అల్పంగా కనిపిస్తుంది. వ్యాకులచిత్తంతో భగవంతుణ్ణి ప్రార్థిస్తే, సదా ఆయన నామగుణ కీర్తన గానం చేస్తే క్రమక్రమంగా ఆయన పట్ల ప్రేమ జనిస్తుంది.”
ఇలా అంటూ శ్రీరామకృష్ణులు ప్రేమోన్మత్తులై గదిలో చుట్టూ తిరుగుతూ నాట్యం చేస్తూ పాడసాగారు:
ఎవరోయీ వారెవరోయీ
చల్లని గాలులు చిలుకరించగా
మధుపములైన సుమరులు గొల్పగా
వినుపించునదీ సుమధుర గీతము
హరి హరి హరీ యనె నామకీర్తనతో…….
ఉదయం దాదాపు పది గంటలు అయింది. రామ్‌లాల్ కాళికాలయంలో నిత్యపూజలు ముగించాడు. శ్రీరామకృష్ణులు జగజ్జననిని దర్శింప ఆలయానికి బయలుదేరారు. ‘మ’ కూడా వెళ్లాడు. గర్భగుడిలోకి వెళ్లిన శ్రీరామకృష్ణులు జగజ్జనని ముందు కూర్చున్నారు. ఆమె పాదపద్మాలకు ఒకటి రెండు పుష్పాలను సమర్పించారు. తరువాత తమ శిరస్సుపై ఒక పుష్పాన్ని ఇడుకొని ధ్యానం చేయసాగారు. తరువాత జగజ్జననిపై ఒక స్తవాన్ని గానం చేశారు:
ఓం శంకరీ! నీ నామము భయ నాశకరమని విని
నా భారము పడవైచితి ననుగావుము కరుణామయి…..
కాళికాలయం నుండి తిరిగి వచ్చి శ్రీరామకృష్ణులు తమ గదికి ఆగ్నేయ మూలనున్న వసారాలో కూర్చున్నారు. అప్పుడు సమయం పది గంటలు అయివుంటుంది. ఆలయంలోని దేవతామూర్తులకు నివేదన ఇంకా కాలేదు, హారతి కూడా జరగలేదు. జగజ్జననికి, రాధాకాంతునికి నివేదన అయిన ప్రసాదం వెన్న, పళ్లు కాస్త పుచ్చుకున్నారు శ్రీరామకృష్ణులు. రాఖాలాది భక్తులూ ఆ ప్రసాదం ఒకింత స్వీకరించారు.
రాఖాల్ శ్రీరామకృష్ణుల ప్రక్కన కూర్చుని లార్డ్ ఎర్స్కైన్ (Lord Erskine) గురించి స్మయిల్స్ (Smiles) రచించిన సెల్ఫ్–హెల్ప్ (Self-Help) అనే పుస్తకాన్ని చదువుతున్నాడు.
16.8.3 నిష్కామ కర్మ – పూర్ణజ్ఞాని – పుస్తక పఠనం
శ్రీరామకృష్ణులు (‘మ’ తో): అందులో ఏం చెప్పబడి ఉంది?
‘మ’ : పాశ్చాత్యు డొకరు ప్రతిఫలాపేక్ష లేకుండా కర్తవ్యాలను నిర్వర్తించేవాడని వ్రాయబడి ఉంది. అంటే నిష్కామకర్మ గురించి చెప్పబడి ఉంది.
శ్రీరామకృష్ణులు: అలా అయితే మంచిదే! కాని పూర్ణజ్ఞాని లక్షణం ఏమిటో తెలుసా? వాళ్లు ఒక్క పుస్తకాన్నీ తమతో ఉంచుకోరు. శుకదేవుడు ఇలాంటి వాడు. ఆతడికి సమస్తం కంఠస్థం. పుస్తకాలలో, అటువంటి శాస్త్రాలలో చక్కెర, ఇసుక కలిసి ఉంటాయి. సాధువు, చక్కెర మాత్రం గ్రహించి ఇసుకను వదలివేస్తాడు; అంటే సారం మాత్రం స్వీకరిస్తాడు.
శుకదేవాదులను సూచిస్తూ శ్రీరామకృష్ణులు తమ స్థితిని సూచిస్తున్నారా?
వైష్ణవచరణుడనే గాయకుడు వచ్చి కొన్ని పాటలు పాడాడు. కాసేపయ్యాక రామ్‌లాల్, శ్రీరామకృష్ణులకై ఒక పళ్లెంలో ప్రసాదం తీసుకువచ్చాడు. ప్రసాదం ఆరగించాక ఆయన కాసేపు విశ్రమించారు.
‘మ’ నాటి రాత్రి నహబత్లో నిద్రించాడు. మాతృదేవి శారదామాత, శ్రీరామకృష్ణుల సేవార్థం వచ్చినప్పుడు ఈ నహబత్లోనే వసించేవారు. ఆమె ప్రస్తుతం కొన్ని నెలలుగా కామార్పుకూర్లో ఉంటున్నారు.
16.9 నవమ పరిచ్ఛేదం రాఖాల్, లాటు, ముఖర్జీ ప్రభృత భక్తులతో
ఆదివారం, డిసెంబర్ 16, 1883
ఉదయం దాదాపు పది గంటల వేళ. శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వర కాళికాలయంలోని తమ గదికి పశ్చిమంగా ఉన్న అర్ధచంద్రాకార మొగసాలలో ‘మ’ తో కూడా కూర్చుని ఉన్నారు. ఎదురుగా గంగానది దక్షిణాభిముఖంగా ప్రవహిస్తూ ఉంది. సమీపంలోని పూతోటలో విరబూచిన గన్నేరు, మల్లె, గులాబి మొదలైన పువ్వుల పరిమళాలు గుబాళిస్తూ ఉన్నాయి.
శ్రీరామకృష్ణులు ‘మ’ ను చూస్తూ పాడసాగారు:
తప్పదే నను గావ నా తల్లి నీకు
నీ శరణు జొచ్చి నే దరిచేరినాను
పంజర స్థితమైన పక్షి రీతిగను॥ త ॥
అగణితంబైనట్టి అపరాధములు చేసి
దిక్కుతోచక నేను తిరుగాడుచున్నాను॥ త ॥
మాయ తంత్రము చేత మతి తప్పి విజ్ఞాన
దీప్తి గోల్పోయి నే తిరుగాడుచున్నాను॥ త ॥
తన దూడ గోల్పోయి ఓదార్పు నేరని
ఆవువలె ఆర్తితో అల్లాడుచున్నాను॥ త ॥
16.9.1 రామస్మరణం – సీతకు ఉన్నటువంటి వ్యాకులత
తరువాత ఇలా అన్నారు: “పంజరంలోని పక్షిలా నేనెందుకు ఉండాలి? యాక్, థూ!” ఇలా అంటూ శ్రీరామకృష్ణులు భావావిష్టులైనారు. శరీరం నిశ్చేష్టమైంది, మనస్సు స్తంభించిపోయింది. నయనాల నుండి అశ్రుధార. కాసేపటికి, “అమ్మా! నన్ను సీతలా చేయి. సమస్తమూ అడుగంటా మరచిపోతాను – ఆమె దేహాన్ని పూర్తిగా విస్మరించింది. యోని, కాళ్లు, చేతులు, స్తనాలు – ఎటువంటి ఎరుకా లేదు. కేవలం ఏకైక చింతన ‘శ్రీరాముడెక్కడ?’ అని –” అన్నారు.
ఎంతటి వ్యాకులచిత్తం ఉంటే భగవదనుభూతి కలుగుతుందో అన్న విషయం ‘మ’ కు బోధించటానికే శ్రీరామకృష్ణులకు సీతాదేవి ఉద్దీపన కలిగిందా? శ్రీరామమయంగానే జీవించింది సీత. ఆయన్నే చింతన చేస్తూ ఉన్మాదిని అయినది ఆమె. అతిప్రియమైన దేహాన్ని కూడా విస్మరించింది!
నాలుగు గంటలు అయింది. శ్రీరామకృష్ణులు భక్తులతో గదిలో కూర్చుని ఉన్నారు. ప్రాణకృష్ణుని బంధువైన ముఖర్జీ అనే వ్యక్తి ఒక బ్రాహ్మణ పండితుడితో కలసి వచ్చాడు. ‘మ’, రాఖాల్, లాటు, హరీష్, యోగీన్ మొదలైన భక్తులూ అక్కడ ఉన్నారు.
యోగీన్ దక్షిణేశ్వర వాస్తవ్యుడైన సావర్ణ చౌధరీ కుమారుడు. అవివాహితుడు. కొన్ని రోజులుగా అనుదినం సాయంత్రం శ్రీరామకృష్ణుల దర్శనార్థం వస్తూ ఉన్నాడు. రాత్రి ఇంటికి తిరిగి వెళ్లిపోతాడు.
ముఖర్జీ (శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి): మీ దర్శనం కలిగినందుకు ఎంతో ఆనందిస్తున్నాను.
శ్రీరామకృష్ణులు: భగవంతుడు అందరిలోనూ విరాజిల్లుతున్నాడు. అందరిలోనూ అదే మేలిమి బంగారం ఉంది; కొన్నిచోట్ల ప్రకాశం అధికం, లౌకికులలో ఎక్కువ మట్టితో కప్పబడి ఉంది.
ముఖర్జీ (నవ్వుతూ): మహాశయా! ఐహికాముష్మికాల మధ్యగల వ్యత్యాసం ఏమిటి?
శ్రీరామకృష్ణులు: సాధన దశలో, ‘నేతి, నేతి’ (ఇది కాదు, ఇది కాదు) అంటూ త్యజించి వేయాలి. భగవంతుణ్ణి ప్రాప్తించుకున్న పిదప సర్వమూ ఆయనే అయి ఉన్నాడని తెలిసివస్తుంది.
“ఒకానొక సందర్భంలో శ్రీరామునికి వైరాగ్యం జనించింది; దశరథుడు చింతాక్రాంతుడై వెంటనే వసిష్ఠుని శరణు జొచ్చాడు. రాముడు సంసారం త్యజించకుండేలా చూడమని వసిష్ఠుణ్ణి వేడుకున్నాడు. వసిష్ఠుడు రాముని వద్దకు వెళ్లాడు. అక్కడ రాముడు అన్యమనస్కుడై కూర్చుని ఉన్నాడు; ఆతడిలో తీవ్ర వైరాగ్యం రగులుకొని ఉంది. వసిష్ఠుడు ఇలా అన్నాడు: ‘రామా! ఎందుకు నువ్వు సంసారాన్ని త్యజించాలి? సంసారం భగవంతుని నుండి వేరై ఉన్నదా? నాతో విచారణ చేయి, చూద్దాం.’ సంసారం ఆ పరబ్రహ్మం నుండే ఆవిర్భవించినదని ఎరిగి, రాముడు మౌనం వహించాడు.
“దేని నుండి మజ్జిగ తయారయినదో దాన్నుండే వెన్న కూడా తయారయింది. కనుకనే మజ్జిగకు చెందినదే వెన్న, వెన్నకు చెందినదే మజ్జిగ. శ్రమ పడి వెన్నను తీశాక, వెన్న ఉంటే మజ్జిగ ఉండే తీరుతుంది అని బోధపడుతుంది. ఎక్కడ వెన్న ఉన్నదో అక్కడ మజ్జిగ ఉంది. పరబ్రహ్మం ఉంది అనే ఎరుక ఉంటేనే జీవజగత్తులు, ఇరవై నాలుగు తత్త్వాలు మొదలైనవీ ఉన్నాయిని తెలుస్తుంది.
16.9.2 బ్రహ్మజ్ఞానానికి ఏకైక మార్గం
“బ్రహ్మం అంటే ఏమిటో నోటితో చెప్పలేము. తక్కిన పదార్థాలన్నీ (ఉచ్చరింపబడ్డాయి కాబట్టి) ఎంగిలి అయిపోయాయి. కాని బ్రహ్మం అంటే ఏమిటో మాత్రం ఎవరూ నోటితో చెప్పలేకపోయారు. అందుకే అది ఎంగిలి కాలేదు. ఈ మాట నేను విద్యాసాగర్‌తో చెప్పాను. అది విని విద్యాసాగర్ ఎంతో ఆనందించాడు.
“విషయబుద్ధి లేశం ఉన్నా కూడా బ్రహ్మజ్ఞానం కలుగదు. మనస్సులో కామినీ కాంచనాలు ఆవగింజంత అయినా ఉండకూడదు, అప్పుడే బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. పార్వతీదేవి, హిమవంతునితో, ‘తండ్రీ! మీరు బ్రహ్మజ్ఞానం కోరుకునే పక్షంలో సాధుసాంగత్యం చేయండి’ అన్నది.”
గృహస్థుడికైనా, సన్న్యాసికైనా, కామినీ కాంచనాలపై లేశమాత్రమైనా మనస్సు పోతే బ్రహ్మజ్ఞానం కలుగదు అని శ్రీరామకృష్ణులు సూచిస్తున్నారా?
16.9.3 యోగభ్రష్టుడు – భగవంతుని ఇచ్ఛ – జీవజగత్తులు
శ్రీరామకృష్ణులు (మళ్లీ ముఖర్జీని చూస్తూ): నీకు సిరిసంపదలు ఉన్నాయి, అయినప్పటికీ భగవంతుని పట్ల భక్తిప్రపత్తులు ఉన్నాయి. ఇది చాలా మంచిది. యోగభ్రష్టుడైన వ్యక్తి సంపన్నుని ఇంట భక్తుడుగా జన్మిస్తాడని గీతలో (6.41) చెప్పబడి ఉంది.
ముఖర్జీ (నవ్వుతూ మిత్రులతో): ‘శుచీనాం శ్రీమతాంగేహే యోగభ్రష్టో-భిజాయతే!’
శ్రీరామకృష్ణులు: భగవంతుడు ఇచ్ఛగిస్తే జ్ఞానిని కూడా సంసారంలో ఉంచుతాడు. ఆయన ఇచ్ఛతోనే జీవజగత్తులన్నీ ఉద్భవించాయి. ఆయన ఇచ్ఛామయుడు.
ముఖర్జీ (నవ్వుతూ): భగవంతుడికీ ఇచ్ఛయా? ఆయనకు ఏదన్నా కొరత ఉందా?
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): దాన్లో తప్పేమిటి! నీరు నిశ్చలంగా ఉన్నా నీరే, అలల రూపంలో ఉన్నప్పటికీ నీరే. చుట్టచుట్టుకొని పడుకొని ఉన్నప్పటికీ పామే, మెలికలు తిరిగి ప్రాకుతున్నా పామే. ఒక మనిషి ఊరక కూర్చున్నప్పటికీ, పనిలో నిమగ్నుడై ఉన్నప్పటికీ అదే వ్యక్తి.
“జీవజగత్తులను విడిచి భగవంతుణ్ణి ఏ విధంగా మదింపు చేయగలం? అలా చేస్తే అది నిజానికి భగవంతుని మదింపు చేయటం కాబోదు. పైపెంకు, గింజలు వీటిని తీసివేసి బిల్వఫలాన్ని తూచితే పూర్తిపండు బరువు తెలుస్తుందా?
“బ్రహ్మం నిర్లిప్తమైనది. వాయువులో సుగంధం, దుర్గంధం రెండు ఉన్నాయి. అయితే వాయువు నిర్లిప్తం. బ్రహ్మమూ శక్తీ అభేదాలు. ఆ ఆద్యాశక్తి నుండే జీవజగత్తులు ఆవిర్భవించాయి.”
ముఖర్జీ: మనిషి ఎందుకు యోగభ్రష్టుడవుతాడు?
శ్రీరామకృష్ణులు: ఒక లోకోక్తి ఉంది – తల్లి గర్భంలో యోగావస్థలో ఉన్నాను. భూమ్మీద పడగానే మట్టిని తిన్నాను. మంత్రసాని బొడ్డును త్రెంచింది. కాని ఈ మాయా ఆవరణాన్ని త్రెంచటం ఎలా?
16.9.4 యోగ సిద్ధికి మార్గం – వ్యాకులచిత్తంతో విలపించడం – భక్తి, ధ్యానం
“కామినీ కాంచనాలే మాయ. మనస్సులో నుండి ఈ రెంటినీ తొలగించి వేస్తేనే యోగం సిద్ధిస్తుంది. ఆత్మ, అంటే పరమాత్మ అయస్కాంతం, జీవాత్మ సూది. పరమాత్మయైన అయస్కాంతం (మనిషియైన సూదిని) ఆకర్షించితే యోగం సిద్ధిస్తుంది. కాని సూదికి మట్టి అంటుకుని ఉంటే అయస్కాంతం దాన్ని ఆకర్షించదు; మట్టిని కడిగివేస్తే ఆకర్షిస్తుంది. కామినీ కాంచనాలనే మట్టిని కడిగి శుభ్రం చేయాలి.
ముఖర్జీ: వాటిని ఎలా తొలగించుకోవాలి?
శ్రీరామకృష్ణులు: భగవంతునికై వ్యాకుల చిత్తంతో విలపించండి. ఆ కన్నీరు, సూదిని ఆవరించిన మట్టిపై పడితే మట్టి కరిగిపోతుంది. బాగా పరిశుద్ధం అయ్యాక సూదిని, అయస్కాంతం ఆకర్షిస్తుంది. అప్పుడు యోగం సిద్ధిస్తుంది.
ముఖర్జీ: ఆహా! ఎంత అమూల్య వచనాలు!
శ్రీరామకృష్ణులు: భగవంతునికై విలపిస్తే ఆయన దర్శనం కలుగుతుంది, సమాధిస్థితి ఏర్పడుతుంది. యోగంలో సిద్ధి పొందితేనే సమాధిస్థితి కలుగుతుంది. విలపిస్తే కుంభకం అప్రయత్నంగా ఏర్పడుతుంది, ఆ తరువాత సమాధి.
“ఇంకో మార్గం ఉంది – ధ్యానం. సహస్రారంలో శివుడు విశిష్ట రీతిలో అభివ్యక్తమై ఉంటాడు. ఆయనను ధ్యానించాలి. శరీరం ఒక గిన్నె, మనోబుద్ధులు దాన్లోని నీరు. ఈ నీటిలో సచ్చిదానంద భాస్కరుడి రూపం ప్రతిబింబిస్తుంది. ఈ ప్రతిబింబ సూర్యుని ధ్యానం చేయగా చేయగా, భగవత్కృపతో యథార్థ సూర్యుని దర్శనం కలుగుతుంది.
16.9.5 సాధుసాంగత్యం – ముఖ్త్యార్నామా
“అయితే సంసారులు సర్వదా సాధు సాంగత్యం నెరపాలి. సన్న్యాసులతో సహా అందరికీ ఇది అవసరం. కాని గృహస్థులకు మరీ ముఖ్యంగా ఆవశ్యకం. కామినీ కాంచనాల నడుమ ఎల్లప్పుడూ వసించవలసి నందున వారికి రోగం ముదిరింది.”
ముఖర్జీ: అవునండీ, రోగం ముదిరే ఉంది.
శ్రీరామకృష్ణులు: భగవంతుడికి ముఖ్త్యార్నామా* ఇచ్చివేయండి. ఆయనను తన ఇచ్ఛానుసారమే చేయనివ్వు. కేవలం భగవంతుణ్ణే పిలుస్తూవుండు – తల్లిపిల్లి తనను ఎక్కడ ఉంచుతుందో పిల్లికూనకు తెలియదు. కొన్ని సందర్భాలలో పరుపు మీద ఉంచుతుంది, కొన్ని సమయాల్లో వంటగదిలో ఉంచుతుంది.
16.9.6 ప్రవర్తకుడు శాస్త్రాధ్యయనం చేస్తాడు – సాధన తరువాతే సిద్ధుడు
ముఖర్జీ: భగవద్గీత మొదలైన శాస్త్ర గ్రంథాలు చదవటం మంచిది.
శ్రీరామకృష్ణులు: ఊరక చదవటం వల్లా, వినటం వల్లా ఏం ప్రయోజనం? కొందరు పాలను గురించి విని ఉంటారు, కొందరు పాలను చూసి ఉంటారు, కొందరు త్రాగి ఉంటారు. భగవంతుణ్ణి దర్శించవచ్చు. ఆయనతో మాట్లాడనూ వచ్చు.
“మొదట్లో ప్రవర్తకుడు – ఇతడు శాస్త్రాధ్యయనం చేస్తాడు, శ్రవణం చేస్తాడు. తరువాత సాధకుడు – ఇతడు భగవంతుణ్ణి ప్రార్థిస్తాడు, ధ్యానిస్తాడు, చింతన చేస్తాడు, నామగుణ కీర్తన చేస్తాడు. ఆ తరువాత సిద్ధుడు; ఇతడు భగవంతుణ్ణి అంతర చైతన్యంలో అనుభూతం చేసుకుంటాడు, ఆయన దర్శనం పొందుతాడు. దీని తరువాత సిద్ధసిద్ధుడు; శ్రీ చైతన్యుల వంటి స్థితి – కొన్ని సమయాల్లో వాత్సల్య భావంలోను, కొన్ని సందర్భాలలో మధుర భావంలోను ఉండే స్థితి.”
దేవదుర్లభమైన ఈ తత్త్వోపదేశాన్ని ‘మ’, రాఖాల్, యోగీన్, లాటు మొదలైన భక్తులు విస్తుబోతూ వింటున్నారు. ముఖర్జీ, ఆతడి మిత్రుడు ప్రణమిల్లి సెలవు పుచ్చుకున్నారు. శ్రీరామకృష్ణులు కూడా మర్యాద సూచకంగా లేచి నిలబడ్డారు.
ముఖర్జీ (నవ్వుతూ): మీరు కూడా లేచి నిలబడటమా?
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): నిలబడ్డా, కూర్చున్నా తప్పేమిటి? నీరు నిశ్చలంగా ఉన్నప్పుడూ నీరే, అటూ ఇటూ కదలుతూ ఉన్నప్పుడూ నీరే. పారవేసిన విస్తరాకు పెనుగాలి ఎటు వీచితే అటువైపు వెళుతుంది. నేను యంత్రం, భగవంతుడు దాన్ని నడిపేవాడు.
16.10 దశమ పరిచ్ఛేదం వేదాంత సంభాషణ – విశిష్ట, అద్వైత వాదాలు – జగత్తు మిథ్యా?
ముఖర్జీ, అతడి మిత్రుడు వెళ్లిపోయారు.
‘అంతా స్వప్నం వంటిదని వేదాంతం చెబుతుంది. అలా అయితే జీవజగత్తులు, నేను – అంతా మిథ్యయేనా?’ అని ‘మ’ ఆలోచిస్తున్నాడు.
‘మ’ ఏదో స్వల్పంగా వేదాంతం అధ్యయనం చేశాడు. వేదాంతతత్త్వాన్ని అస్పష్టంగా ప్రతిధ్వనింపచేసే కాంట్, హెగెల్ వంటి జర్మన్ తాత్త్వికుల తత్త్వాలను ఏదో కొంత చదివి ఉన్నాడు. కాని శ్రీరామకృష్ణులు సామాన్య పండితుల్లా విచారణ చేయలేదు. జగజ్జననియే ఆయనకు సకల శాస్త్ర మర్మాలను సాంగోపాంగంగా తెలియచేసింది. ‘మ’ ఈ విషయాన్ని గురించే ఆలోచిస్తున్నాడు.
కాసేపయ్యాక శ్రీరామకృష్ణులు అర్ధచంద్రాకార మొగసాలలో ‘మ’ తో మాట్లాడసాగారు. ఎదురుగా గలగల ధ్వనితో గంగ దక్షిణదిశగా ప్రవహిస్తోంది. శీతకాలం. సాయం సంధ్యాసమయం. సూర్యుడు పశ్చిమాద్రికి ఇంకా చేరుకోలేదు, నైఋతిమూల ప్రకాశిస్తూ ఉన్నాడు.
ఎవరి జీవితం వేదమయమై ఒప్పారుతోందో, ఎవరి నోటిగుండా వెలువడే వచనాలన్నీ వేదాంత వచనాలో, ఎవరి ముఖతా భగవంతుడే మాట్లాడుతున్నాడో, ఎవరి వచానామృతం వేదవేదాంత భాగవతాదులుగా అలరారుచున్నాయో ఆ కృపాసింధువైన పురుషుడే గురువు రూపంలో మాట్లాడుతూ ఉన్నారు.
‘మ’ : జగత్తు మిథ్యయా?
శ్రీరామకృష్ణులు: మిథ్య ఎందుకు? అవన్నీ విచారణకు సంబంధించిన విషయాలు. ప్రథమంలో ‘నేతి, నేతి’ అంటూ విచారణ చేసేటప్పుడు, బ్రహ్మం జీవుడు కాదు, జగత్తు కాదు, ఇరవై నాలుగు తత్త్వాలూ కాదు అని తెలియవస్తుంది; ఇదంతా స్వప్నతుల్యం అని తోస్తుంది. తరువాత అనులోమ విలోమాలు. అప్పుడు భగవంతుడే జీవజగత్తులుగా అయివున్నాడనే బోధ కలుగుతుంది.
“మెట్లు ఎక్కుతూ డాబా మీదకు వెళ్లావు అనుకుందాం. డాబా గురించిన ఎరుక ఉన్నంతవరకూ మెట్ల గురించిన ఎరుక కూడా ఉంటుంది. ‘ఎత్తు’ ను గురించిన ఎరుక ఉన్నంతవరకు ‘పల్లం’ గురించిన ఎరుకా ఉండనే ఉంటుంది. డాబాను చేరుకున్నాక ఇటుక, సున్నం, బంకమట్టి మొదలైన ఏ వస్తువులతో డాబా కట్టబడిందో, అవే వస్తువులతో మెట్లూ కట్టబడ్డాయి అన్న సంగతి బోధపడుతుంది.
“బిల్వఫలం ఉదాహరణ ఇదివరకే చెప్పి ఉన్నాను కదా.
“క్రియాతత్త్వం, నిష్క్రియాతత్త్వం ఒకే వస్తువుకు చెందిన తత్త్వాలు.
“ ‘నేను – భావం’ అంత సులువుగా పోదు. ‘నేను – భావం’ నెలకొని ఉన్నంత వరకూ జీవజగత్తుల భావమూ ఉండే ఉంటుంది. భగవద్దర్శనానంతరం, ఆయనే జీవజగత్తులుగా అయివున్నట్లు గాంచవచ్చు. కేవలం విచారణ ద్వారా దీన్ని తెలుసుకోలేం.
“శివుడికి రెండు స్థితులు ఉన్నాయి. సమాధి స్థితుడై మహాయోగంలో ఉన్నప్పుడు ఆత్మారాముడుగా విరాజిల్లుతాడు. ఆ స్థితి నుండి, దిగి వస్తూ ఉన్నప్పుడు, స్వల్పంగా ‘నేను – భావం’ ఉన్నప్పుడు ‘రామ, రామ’ అంటూ నృత్యం చేస్తాడు!”
శివుడి స్థితులను వర్ణిస్తూ శ్రీరామకృష్ణులు తమ స్థితులను వివరిస్తున్నారా ఏమిటి?
16.10.1 అంతా చిన్మయం – ఆలయ నిర్వహణాధికారి మథుర్కి లేఖ
సాయంకాలం అయింది. శ్రీరామకృష్ణులు జగజ్జనని నామాన్ని స్మరిస్తూ ఆమె చింతనలో మునిగిపోయి ఉన్నారు. భక్తులూ వేరు వేరు తావులలో తమ ఇష్టదేవతల ధ్యానంలో నిమగ్నులై ఉన్నారు. కాళీ, రాధాకాంత, శివాలయాలలో సాయంత్ర హారతి ప్రారంభమైంది.
నేడు కృష్ణపక్ష ద్వితీయ తిథి. సాయంత్రం గడిచి నెలవంక ఉదయించింది. ఆలయ గోపురాలపై, నలువైపులా ఉన్న వృక్షాలపై, చెట్టుచేమలపై, ఆలయానికి పశ్చిమంగా ప్రవహిస్తూ ఉన్న గంగానదిపై చంద్రకాంతి ప్రసరించి అపూర్వ శోభను ఆవిష్కరించింది. ఆ సమయంలో శ్రీరామకృష్ణులు తమ గదిలో కూర్చుని ఉన్నారు, ‘మ’ నేల మీద కూర్చుని ఉన్నాడు. సాయంత్రం వేదాంతం గురించి ‘మ’ ప్రారంభించిన సంభాషణ మళ్ళీ కొనసాగింది.
శ్రీరామకృష్ణులు (‘మ’ తో): జగత్తు మిథ్య ఎందుకు అవుతుంది? అవన్నీ తాత్త్వికుల ఊహాకల్పనలు. భగవద్దర్శనం కలిగితే ఆయనే జీవజగత్తులుగా అయివున్నాడన్న సంగతి తెలియవస్తుంది. తానే సమస్తమూ అయి ఉండటం నా తల్లి జగజ్జనని కాళికాలయంలో నాకు చూపించింది, సర్వం చిన్మయమని చూపించింది. ప్రతిమ చిన్మయం, వేదిక చిన్మయం, పూజపాత్రలు చిన్మయం, ద్వారం గడప చిన్మయం, చలవరాళ్ల నేల చిన్మయం – ఇలా సర్వమూ చిన్మయం. గదిలోకి చూశాను – అన్నీ రసంలో, సచ్చిదానందరసంలో మునిగి ఉన్నట్లు తోచింది. కాళీ ఆలయం సమీపంలో ఒక దుష్టుణ్ణి చూశాను. అయితే అతడిలోనూ జగజ్జనని శక్తియే ప్రకంపించటం చూశాను.
“అప్పుడే నైవేద్యంగా అర్పించవలసిన పూరీని పిల్లికి పెట్టాను. పిల్లితో సహా సమస్తం అమ్మే అయి ఉన్నట్లు చూశాను. అప్పుడు ఆలయ నిర్వహణాధికారి మథుర్బాబుకు ఇలా ఉత్తరం రాశాడు: ‘భట్టాచార్య మహాశయుడు భగవంతునికి నివేదించవలసిన పూరీని పిల్లికి పెడుతున్నాడు.’ మథుర్బాబు నా పరిస్థితిని అర్థం చేసుకునేవాడు. ఆ లేఖకు ఇలా బదులిచ్చాడు: ‘ఆయన ఏం చేసినా ఎవరూ ఏమీ ఆక్షేపించరాదు.’
“భగవంతుణ్ణి ప్రాప్తింపజేసుకుంటే ఆయనే ఈ జీవజగత్తులు, ఇరవై నాలుగు తత్త్వాలు, సమస్తమూ అయి ఉన్నాడని గాంచవచ్చు. కాని ఈ ‘నేను’ అనే భావాన్ని భగవంతుడు అడుగంటా తుడిచివేస్తే ఏం జరుగుతుందో నోటితో చెప్పలేం. ‘అప్పుడు నువ్వు మంచివాడివా, నేను మంచివాడినా అన్న విషయం నీకు తెలుస్తుంది’ అంటున్నాడు రాంప్రసాదు. కొన్ని సమయాల్లో ఆ స్థితీ నాకు కలుగుతుంది.
“విచారణ ద్వారా ఒక విధంగా చూస్తాం; స్వయంగా భగవంతుడే చూపించినప్పుడు వేరే విధంగా కనబడుతుంది.”
16.11 ఏకాదశ పరిచ్ఛేదం జీవిత ఉద్దేశం భగవద్దర్శనమే! – పరమ వ్యాకులతే మార్గం
సోమవారం, డిసెంబర్ 17, 1883
దక్షిణేశ్వర కాళికాలయం. ఉదయం ఎనిమిది గంటలు. శ్రీరామకృష్ణులు తమ గదిలో మంచం మీద కూర్చుని ఉన్నారు. రాఖాల్, లాటు మొదలైన భక్తులు ప్రక్కనే కూర్చుని ఉన్నారు. ‘మ’ నేల మీద కూర్చుని ఉన్నాడు. డాక్టర్ మధు వచ్చి ఉన్నాడు. వయోవృద్ధుడైన అతడు చమత్కారంగా మాట్లాడతాడు. అతడూ మంచం మీద శ్రీరామకృష్ణుల ప్రక్కన కూర్చుని ఉన్నాడు. శ్రీరామకృష్ణులకు సుస్తీ చేసినప్పుడు సామాన్యంగా అతడే చికిత్స చేసేవాడు.
16.11.1 శ్రీరామకృష్ణులకు సీతామాత దర్శనం – గౌరీపండితుడు
శ్రీరామకృష్ణులు (‘మ’ తో): అసలు సంగతి ఇదే. సచ్చిదానందుని పట్ల ప్రేమ కలిగి ఉండాలి. ఎటువంటి ప్రేమ? భగవంతుణ్ణి ఎలా ప్రేమించాలి? ‘రాముణ్ణి అవగతం చేసుకోవాలంటే సీతగా మారిపోవాలి! భగవంతుణ్ణి తెలుసుకోవాలంటే భగవతిగా అయిపోవాలి. శివుణ్ణి పొందగోరి పార్వతి ఎంత కఠోర తపస్సు ఆచరించింది! అదే విధంగా తపస్సు చేయాలి. పురుషుణ్ణి తెలుసుకోగోరితే ప్రకృతి భావం ఆరోపించుకోవాలి; అంటే సఖీభావం, దాసీ భావం, మాతృభావం ఏదో ఒకటి చేగొనాలి’ అంటాడు గౌరీ పండితుడు.
“నేను సీతామాతను దర్శించాను. ఆమె మనస్సు సంపూర్ణంగా రాముడిలో లయించి ఉన్నది. యోని, కాళ్లు, చేతులు, వస్త్రాలు, ఆభరణాలు – దేనిపైనా ఆమెకు దృష్టిలేదు. ఆమె జీవితమే రామమయమైపోయింది. రాముడు లేకుంటే, రాముని పొందకుంటే ప్రాణం నిలిచేటట్లుగా లేదు.”
‘మ’ : అవునండీ. ఉన్మాదం వంటి స్థితి.
శ్రీరామకృష్ణులు: ఉన్మాదిని! ఆహా! భగవంతుని పొందగోరితే పిచ్చివాళ్లం అయిపోవాలి. మనస్సు కామినీ కాంచనాలపై ఉండే పక్షంలో అది జరుగదు. స్త్రీ సంభోగం – దాన్లో ఏం సుఖం ఉంది? భగవద్దర్శనం కలిగితే స్త్రీ సంభోగం కంటే కోటిరెట్లు ఆనందం లభిస్తుంది. ‘మహాభావం ఏర్పడినప్పుడు, రోమ కూపాల పర్యంతం శరీరంలోని ప్రతి ఛిద్రమూ మహాయోని అయిపోతుంది. ప్రతి ఛిద్రం వద్దా ఆత్మతో రమిస్తున్న సుఖం అనుభూతమవుతుంది’ అని గౌరీపండితుడు చెప్పేవాడు.
16.11.2 పూర్ణజ్ఞానే గురువు
“పరమ వ్యాకులతతో భగవంతుని పిలవాలి. ఏం చేస్తే ఆయనను పొందనగునో గురువు నుండి తెలుసుకోవాలి. గురువు పరిపూర్ణ జ్ఞానియై ఉంటేనే మార్గం చూపగలడు.
“పరిపూర్ణ జ్ఞానం కలిగితే కోర్కెలు నశిస్తాయి. ఐదేళ్ల బాలకుని స్వభావం ఏర్పడుతుంది. దత్తాత్రేయుడు, జడభరతుడు వంటి మునులు బాలక స్వభావులై ఉండేవారు.”
‘మ’ : అవునండీ, వీరిని గురించి లోకానికి తెలుసు. ఇటువంటి ఎందరో మునులు ఉండి ఉండవచ్చు.
శ్రీరామకృష్ణులు: అవును. జ్ఞానులకు సకల వాసనలు నశించిపోతాయి. ఏదైనా మిగిలి ఉన్నా కూడా అది ఎటువంటి హాని కలిగించదు. పరుసవేదిచే స్పృశించబడిన ఇనుప కత్తి, బంగారు కత్తిగా మారిపోతుంది. ఆ పిదప అది ఇనుప కత్తిలా నరకలేదు. అదే విధంగా జ్ఞానుల కామక్రోధాది గుణాలు నామమాత్రాలే. అవి పొడసూపినా ఎటువంటి హాని కలుగదు.
‘మ’ : అవునండీ. మీరు చెబుతూ ఉన్నట్లే జ్ఞాని త్రిగుణాతీతుడు. ఆతడు సత్త్వ రజస్తమోగుణాలు – వీటిలో ఏ గుణానికీ వశవర్తుడై ఉండడు. ఈ మూడు గుణాలు ముగ్గురు దోపిడీ దొంగలు.
శ్రీరామకృష్ణులు: అవును. దీన్ని మనస్సులో చక్కగా పదిలం చేసుకోవాలి.
‘మ’ : పూర్ణజ్ఞానులు లోకంలో ముగ్గురు నలుగురి కంటే ఎక్కువ లేరని నేను అనుకుంటున్నాను.
శ్రీరామకృష్ణులు: ఎందుకు? బెంగాలుకు పశ్చిమంగా ఉన్న ప్రాంతాలలోని మఠాలలో అనేకమంది సాధువులనూ సన్న్యాసులనూ చూడగలుగుతున్నాం!
‘మ’ : ఆ, అటువంటి సన్న్యాసిగా అవటం నాకూ సాధ్యమే.
‘మ’ ఇలా అనగానే శ్రీరామకృష్ణులు అతణ్ణి తదేక దృష్టితో కాసేపు చూశారు. తరువాత అతడితో, “ఏమిటి, అన్నీ త్యజించి వెళ్ళగలవా?” అని అడిగారు.
‘మ’ :మాయ తొలగిపోకుంటే ఏం సాధించగలం? మాయను జయించకుండా ఊరకే సన్న్యాసం పుచ్చుకుని ఏం ప్రయోజనం?
ఇద్దరూ కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోయారు.
16.11.3 త్రిగుణాతీత భక్తుడు బాలక స్వభావి
‘మ’ : మహాశయా, త్రిగుణాతీత భక్తి అంటే ఏమిటి?
శ్రీరామకృష్ణులు: ఆ భక్తి జనిస్తే అతడు సమస్తాన్నీ చిన్మయంగానే దర్శిస్తాడు. చిన్మయ శ్యాముడు, చిన్మయ ధామం, భక్తుడూ చిన్మయమే, సర్వం చిన్మయమే! ఇట్టి భక్తి చాలా అరుదుగా కలుగుతుంది.
డా ॥ మధు (నవ్వుతూ): త్రిగుణాతీత భక్తి – అంటే భక్తుడు ఏ గుణం వశంలోను లేడు.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): అవును! ఐదేళ్ల బాలుడు ఏ గుణం వశంలోను ఉండడు కదా, ఆ విధంగా.
మధ్యాహ్నం భోజనానంతరం శ్రీరామకృష్ణులు కాసేపు విశ్రమించారు. మణిమల్లిక్ వచ్చి ఆయనకు ప్రణామం చేసి నేల మీద కూర్చున్నాడు. ‘మ’ కూడా నేల మీద కూర్చుని ఉన్నాడు. శ్రీరామకృష్ణులు పడుకునే మణిమల్లిక్తో ఒకటి రెండు మాటలు మాట్లాడసాగారు.
మణిమల్లిక్: మీరు కేశవ్‌ను చూడటానికి వెళ్లారట!
శ్రీరామకృష్ణులు: అవును. ఆతడికి ఇప్పుడెలా ఉంది?
మణిమల్లిక్: ఎలాంటి మెరుగు లేదు!
శ్రీరామకృష్ణులు: అతడిలో రాజసిక గుణం అధికం. చాలాసేపు నిరీక్షించిన పిదపే ఆతణ్ణి చూడగలిగాను.
శ్రీరామకృష్ణులు లేచి కూర్చుని భక్తులతో మాట్లాడసాగారు.
శ్రీరామకృష్ణులు (‘మ’ తో): నేను ‘రామ, రామ’ అంటూ జపిస్తూ పిచ్చివాడినే అయిపోయాను. ఒక సన్న్యాసి ఇచ్చిన ‘రామ్‌లాలా’ ను* వెంటబెట్టుకుని తిరిగే వాణ్ణి. దానికి స్నానం చేయించేవాణ్ణి, అన్నం తినిపించేవాణ్ణి, నిద్రబుచ్చేవాణ్ణి. ఎక్కడకు పోయినా అక్కడకు దానినీ వెంట తీసుకువెళ్లేవాణ్ణి. ‘రామ్‌లాలా, రామ్‌లాలా’ అంటూ పిచ్చివాడినే అయిపోయాను.