5.1 ప్రథమ పరిచ్ఛేదం సమాధి స్థితిలో శ్రీరామకృష్ణులు
శుక్రవారం, అక్టోబర్ 27, 1882
నేడు లక్ష్మీపూజ పర్వదినం. (విజయదశమి తరువాత వచ్చే పౌర్ణమినాడు వంగదేశంలో లక్ష్మీపూజ చేస్తారు.) పరమహంస శ్రీరామకృష్ణుల కోసం గంగా నదిలో నౌకావిహారాన్ని కేశవ్సేన్ ఏర్పాటు చేశాడు.
మధ్యాహ్నం సుమారు నాలుగు గంటలకు తన బ్రహ్మసమాజ భక్తులతో అరుదెంచిన కేశవ్ నౌక దక్షిణేశ్వర కాళీ ఆలయం ప్రక్కన గంగానదిలో లంగరు దించింది. నౌకలోని ప్రయాణీకులు తమ ఎదుట స్నానఘట్టం, చాందినీలను దర్శించారు. ఆలయ ఆవరణలో తమకు ఎడమ వైపుగా ఆరు శివాలయాలు, కుడి వైపున ఆరు శివాలయాలు నెలకొని ఉండటం వారు చూశారు. కాళికాలయపు తెల్లని గోపురం, పంచవటీ ఫలవృక్షాగ్రాలు, దేవదారు వృక్షాల నీడలు శరత్కాల నీలాకాశానికి ఎదురొడ్డి నిలబడినట్లున్నాయి. రెండు నహబత్తుల (మేళపు చావడులు) నడుమ సుగంధ పుష్పాలతో అలరారే ఉద్యానవనాలు, గంగాతీరంలో వరుస క్రమంలో అమరి ఉన్న పువ్వుల మొక్కలు కన్నులపండువ చేస్తున్నాయి. అతి ప్రాచీన ఆర్య నాగరికతా సంప్రదాయాలతో సాంగత్యం పొందిన పవిత్ర గంగా నదీ జలాలలో వినీలాకాశం ప్రతిబింబిస్తోంది. బాహ్య ప్రపంచం కోమల ప్రశాంతతను సంతరించుకొన్నట్లుగా ఉంది; బ్రహ్మ సమాజ భక్తుల హృదయాలు శాంతితో నిండి పోయాయి.
శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వర కాళికాలయంలో చిరపరిచితమైన తమ గదిలో విజయ్‌కృష్ణ గోస్వామి, హరలాల్తో మాట్లాడుతున్నారు. ఇంతలో కేశవసేన్ శిష్యులు వచ్చి ప్రణామం చేసి, “మహాశయా! స్టీమర్ వచ్చింది. కేశవ్బాబు మిమ్మల్ని అక్కడకు రమ్మని మమ్మల్ని పంపించారు” అని చెప్పారు. శ్రీరామకృష్ణులు ఒక చిన్నపడవలో కేశవ్ స్టీమర్ వద్దకు వెళ్ళవలసి ఉంది. విజయ్‌కృష్ణ గోస్వామి కూడా వారితో ఉన్నాడు. పడవ ఎక్కగానే శ్రీరామకృష్ణులు బాహ్యస్మృతిని కోల్పోయి, సమాధిస్థితి పొందారు.
5.2 ద్వితీయ పరిచ్ఛేదం ఆత్మ అవినాశి – పవహారీ బాబా
వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరో-పరాణి ।
తథా శరీరాణి విహాయ జీర్ణా న్యన్యాని సంయాతి నవాని దేహీ ॥(గీత 2 :22)
ప్రయాణీకులలో ‘మ’ కూడా ఉన్నాడు. పడవ, స్టీమర్ ప్రక్కకు వస్తూ ఉండగానే అందరూ శ్రీరామకృష్ణులను చూడటానికై స్టీమర్ అంచుకేసి పరుగుపెట్టారు. శ్రీరామకృష్ణులను సురక్షితంగా స్టీమర్లోకి తీసుకు రావటానికి కేశవ్ ఆతురపడుతున్నాడు. ఎంతో కష్టం మీద శ్రీరామకృష్ణులను బాహ్యస్మృతిలోకి కొనివచ్చి, స్టీమర్‌లోని ఒక గదిలోకి తీసుకు వెళ్ళారు. ఇంకా ఆయన పూర్తిగా బాహ్యస్మృతిలోకి రాని కారణంగా ఒక భక్తుని ఆసరా చేసుకొని యాంత్రికంగా నడిచారు. కేశవ్, తదితరులు ఆయనకు ప్రణామాలు చేశారు; కాని ఆయనకు వారి ఎరుకే లేదు. ఆ గదిలో ఒక మేజా, కొన్ని కుర్చీలు ఉన్నాయి. శ్రీరామకృష్ణులను ఒక కుర్చీలో ఆసీనులను చేసి, కేశవ్, విజయ్ కూడా చెరొక కుర్చీలో కూర్చున్నారు. కొందరు భక్తులూ కూర్చున్నారు, అనేకులు నేల మీదనే కూర్చున్నారు. చాలామంది బయట నిలబడవలసి వచ్చింది. వాళ్ళు ఆతురతతో తలుపుగుండా, కిటికీలగుండా తొంగి చూస్తున్నారు. శ్రీరామకృష్ణులు మళ్ళీ సమాధి మగ్నులైనారు; పూర్తిగా బాహ్యస్మృతిని కోల్పోయారు.
గదిలో జనం క్రిక్కిరిసి ఉండటంతో గాలి ప్రసరణకై కేశవ్ కిటికీలు తెరిచాడు. విజయ్‌తో ఈ అనుకోని కలయికకు కేశవ్ ఇబ్బందికి లోనైనాడు. కొన్ని బ్రహ్మసమాజ సిద్ధాంతాల పట్ల కేశవ్‌తో భేదాభిప్రాయాలు ఏర్పడి విజయ్‌కృష్ణ గోస్వామి, కేశవ్ సమాజం నుండి విడిపోయి వేరే సమాజంలో చేరటమే ఇందుకు కారణం.
బ్రహ్మసమాజ భక్తులు తదేక దృష్టితో శ్రీరామకృష్ణులనే చూస్తూ ఉన్నారు. క్రమంగా శ్రీరామకృష్ణులు బాహ్యచైతన్యంలోకి రాసాగారు; కాని దైవోన్మత్తత ఇంకా నెలకొని ఉంది. మెల్లగా అస్పష్టంగా తమలో ఇలా అనుకొంటున్నారు: “అమ్మా! నన్ను ఇక్కడకు ఎందుకు తీసుకువచ్చావు? వారు చుట్టూ దడిగట్టుకొని ఉన్నారు. నేను వీరిని ముక్తులను గావించగలనా?” అక్కడ సమావేశమైన వ్యక్తులు సంసార కుడ్యాల నడుమ బందీలై ఉన్నట్లు శ్రీరామకృష్ణులు చూస్తున్నారా? వారి నిస్సహాయత శ్రీరామకృష్ణులను, జగన్మాతతో ఇలా ప్రార్థింప చేసినదా?
క్రమంగా శ్రీరామకృష్ణులకు బాహ్యస్మృతి కలుగసాగింది. ఘాజీపూర్ వాస్తవ్యుడైన నీలమాధవ్, మరో బ్రహ్మసమాజ భక్తుడు, పవహారీబాబా గురించి ముచ్చటించుకొంటున్నారు. మరో బ్రహ్మసమాజ భక్తుడు శ్రీరామకృష్ణులతో ఇలా అన్నాడు: “మహాశయా! ఈ పెద్దమనుషులు పవహారీబాబాను దర్శించారు. ఆయన ఘాజీపూర్‌లో నివసిస్తున్నారు. మీలాంటి పవిత్రమూర్తులే ఆయన కూడా.”
శ్రీరామకృష్ణులు ఇంకా మాట్లాడలేకున్నారు; మందహాసం మాత్రం చేశారు. ఆ భక్తుడు కొనసాగించాడు: “మహాశయా! పవహారీబాబాగారు తమ గదిలో మీ ఛాయాచిత్రాన్ని ఉంచుకున్నారు.” తమ శరీరాన్ని చూపిస్తూ శ్రీరామకృష్ణులు మందహాసం చేస్తూ “ఇది కేవలం దిండు గలీబు మాత్రమే” అన్నారు.
5.3 తృతీయ పరిచ్ఛేదం జ్ఞాన, భక్తి, కర్మ యోగాల సమన్వయం
యత్సాంఖ్యైః ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ।
ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి ॥(గీత 5 : 5)
శ్రీరామకృష్ణులు ఇలా కొనసాగించారు: “కాని భక్తుడి హృదయం భగవంతుడి నివాసస్థానం అని గుర్తుంచుకోవాలి. ఆయన సకల భూతాలలోనూ విరాజిల్లటం సందేహాతీతమే; కాని భక్తుల హృదయాలలో ఆయన విశేషంగా వ్యక్తమౌతాడు. ఒక జమీందారు అప్పుడప్పుడు తన జమీలోని అన్ని చోట్లకు పోతూ ఉంటాడు; కాని సామాన్యంగా అతడు ఫలానా చావడిలో ఉంటాడని ప్రజలంటారు. భక్తుడి హృదయం భగవంతుడి చావడి.
5.3.1 భగవంతుడు ఒక్కడే – జ్ఞాని, యోగి, భక్తుడు
“బ్రహ్మమని జ్ఞానులు ఎవరిని పేర్కొంటారో, ఆయనే యోగులచే ఆత్మగా పిలువబడుచున్నాడు; భక్తులు ఆయనేన్ భగవంతుడని పిలుస్తారు. దేవాలయంలో పూజించేటప్పుడు పూజారి అనీ, అదే బ్రాహ్మణుడు వంట చేసేటప్పుడు వంట బ్రాహ్మణుడనీ పిలువబడుచున్నాడు కదా! జ్ఞానమార్గావలంబి అయిన జ్ఞాని, ‘ఇది కాదు, అది కాదు’ అంటూ విచక్షణాయుతంగా సత్యాన్వేషణ చేస్తాడు. బ్రహ్మం ‘ఇది కాదు, అదీ కాదు’ ; అది ఈ జగత్తు కాదు, దాన్లోని జీవరాశీ కాదు. ఈ తీరులో విచారణ చేయగా చేయగా మనస్సు స్థిరపడుతుంది. తరువాత అది లయమై సాధకుడు సమాధిలోకి వెళతాడు. అప్పుడు బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. ‘బ్రహ్మ సత్యం, జగన్మిథ్య’ – ఇదే జ్ఞాని నిశ్చితాభిప్రాయం. ఈ నామరూపాలన్నీ స్వప్నతుల్యాలు. బ్రహ్మం అంటే ఏమిటో నోటితో వర్ణించలేం. బ్రహ్మం వ్యక్తిమాత్రుడని కూడా ఎవరూ చెప్పలేరు. వేదాంతాన్ని అనుసరించే జ్ఞానుల అభిప్రాయం ఇది.
“కాని భక్తులు అన్ని స్థితులను అంగీకరిస్తారు. వారు జాగ్రదవస్థను కూడా యథార్థంగానే భావిస్తారు. స్వప్నం మాదిరి, జగత్తు కూడా ఒక మిథ్యగా భావించరు. ఈ జగత్తు భగవంతుడి శక్తి, వైభవాల వ్యక్తీకరణే అని వారంటారు. ఆకాశం, నక్షత్రాలు, సూర్యచంద్రులు, పర్వతాలు, సముద్రాలు, మనుష్యులు, జంతువులు – ఇవన్నీ భగవంతుడి సృష్టి. ఇవి అతడి వైభవాన్ని వ్యక్తీకరిస్తాయి. అతడు మనలోనే, మన హృదయాలలో నెలకొని ఉన్నాడు. అతడు బాహ్యంలోనూ ఉన్నాడు. భగవంతుడే చతుర్వింశతి తత్త్వాలు* , జీవ జగత్తులుగా అయి ఉన్నాడని ఉత్తమ భక్తుడు పలుకుతాడు. భక్తుడు చక్కెర తినాలని ఆకాంక్షిస్తాడు గాని చక్కెరగా మారిపోవాలని కోరుకోడు. (అందరూ నవ్వారు)
“భక్తుడి భావం ఎలాంటిదో తెలుసునా? ‘ఓ భగవంతుడా! నువ్వు ప్రభువ్వి. నేను నీ దాసుణ్ణి. నువ్వు నా తల్లివి. నేను నీ బిడ్డను. నువ్వే నా తండ్రివీ, తల్లివీ. నువ్వు పూర్ణుడవు, నేను అంశమాత్రుణ్ణి’ అని అంటాడేగాని, ‘నేను బ్రహ్మాన్ని’ అని పలుక ఇచ్ఛగించడు.”
“యోగులు పరమాత్మ సాక్షాత్కారం పొంద యత్నిస్తారు. జీవాత్మను పరమాత్మలో ఐక్యం చేయటమే వారి ఆదర్శం. విషయాల బారినుంచి మనస్సును మరలించి, పరమాత్మలో కేంద్రీకరించటానికే ప్రయత్నిస్తారు. అందుచేతనే సాధన ప్రారంభదశలో ఏకాంత ప్రదేశానికి వెళ్ళి, స్థిర ఆసనంలో అనన్య చిత్తంతో ధ్యాన చింతనలు చేయాలి.”
“వస్తువు ఒక్కటే, పేర్లు మాత్రం వేరు. బ్రహ్మమే ఆత్మా, భగవంతుడూను. జ్ఞానులకు ఆయన బ్రహ్మం, యోగులకు పరమాత్మ, భక్తులకు భగవంతుడుగా వెలయుచున్నాడు.”
5.4 చతుర్థ పరిచ్ఛేదం వేదాల తంత్రాల సమన్వయం – ఆద్యాశక్తి ఐశ్వర్యం
త్వమేవ సూక్ష్మా త్వం స్థూలా వ్యక్తావ్యక్తస్వరూపిణీ ।
నిరాకారాపి సాకారా కస్త్వాం వేదితుమర్హతి ॥(మహానిర్వాణతంత్రం, చతుర్థోల్లాసం – 15)
స్టీమరు కలకత్తా వైపుగా సాగిపోతోంది. కాని స్టీమరు చేస్తూన్న శబ్దం ప్రయాణీకుల చెవులకు సోకలేదు. వారు తదేక దృష్టితో ఆ పరమహంస దేవులనే చూస్తూ, వారి అమృతవాక్కులను ఆలకిస్తూండటంలో పరిసరాలనే విస్మరించారు. దేవాలయాలతో, ఉద్యానవనాలతో కూడుకొన్న దక్షిణేశ్వరం వెనక్కు వెళ్ళిపోతూంది. మర్మర ధ్వనులు చేస్తూ స్టీమరు గంగాజలాలను చీల్చుకొంటూ సాగిపోతూంది. కాని భక్తులకు ఇవేవీ పట్టినట్లు లేదు. వారు మంత్రముగ్ధులై దైవీ దరహాస వదనుడూ, ప్రియదర్శనుడూ, ఆనందమయుడూ, హర్షప్రకాశ నయనుడూ, భగవంతుణ్ణి తప్ప సమస్తాన్ని త్యజించినవాడూ, అన్యం ఏదీ ఎరుగనివాడూ అయిన ఒక మహాయోగిని చూస్తున్నారు. ఆయన పెదవుల నుండి ధారాపాతంగా కథామృత ప్రవాహం జాలువారుతోంది.
శ్రీరామకృష్ణులు: వేదాంతంలోని అద్వైతశాఖకు చెందిన జ్ఞానులు, సృష్టి స్థితి లయాలు, జీవ జగత్తులన్నీ శక్తి లీలలని పేర్కొంటారు. విచారణ చేసి చూస్తే ఇవన్నీ స్వప్నతుల్యాలని బోధపడుతుంది. బ్రహ్మమే యథార్థం, తక్కినవన్నీ యథార్థం కావు. చివరికి ఈ శక్తి కూడా అవాస్తవమే, కల వంటిదే!
“నువ్వు వెయ్యిసార్లు విచారణ సలుపు. అయినప్పటికీ సమాధి స్థితిని పొందకుంటే శక్త్యావరణాన్ని దాటిపోలేవు. ‘నేను ధ్యానిస్తున్నాను’, ‘నేను చింతిస్తున్నాను’ అని అంటున్నప్పటికీ నువ్వు శక్తి అధీనంలోనే ఉన్నవాడివి.”
“అందుచేత బ్రహ్మం, శక్తి అభిన్నాలు. ఒకదాన్ని అంగీకరిస్తే రెండవదాన్నీ అంగీకరించి తీరవలసిందే. అగ్ని, దాని దాహకశక్తి వంటిది. ఒకదాన్ని వదలి రెండవదాన్ని భావించలేం. సూర్యుణ్ణి వదలి సూర్యరశ్మిని లేక సూర్యరశ్మిని వదలి సూర్యుణ్ణి ఊహించలేం.”
“పాలు ఎలా ఉంటాయి? ఓ, నువ్వు అంటావు తెల్లగా ఉంటాయని. తెలుపుదనం వదలి పాలను, పాలను వదలి తెలుపుదనాన్ని నువ్వు భావించుకోలేవు.”
“అదే రీతిలో బ్రహ్మాన్ని వదలి శక్తిని, శక్తిని వదలి బ్రహ్మాన్ని భావించుకోలేము; నిత్యాన్ని వదలి లీలను, లీలను విడిచి నిత్యాన్ని ఊహించుకోలేం.”
“ఆద్యాశక్తి లీలామయి, సృష్టి స్థితి ప్రళయాలను గావిస్తోంది. ఆ శక్తినే కాళికాదేవి అంటారు. బ్రహ్మమే కాళి, కాళియే బ్రహ్మం. వాస్తవానికి ఈ రెండూ ఒక్కటే. నిష్క్రియస్థితిలో ఉన్నప్పుడు, అంటే సృష్టి స్థితి ప్రళయ కార్యాలలో పాల్గొననప్పుడు ఆ శక్తిని మనం బ్రహ్మమంటాం. ఆ కార్యకలాపాలలో పాల్గొన్నప్పుడు ఆ బ్రహ్మాన్ని కాళి లేక ఆద్యాశక్తిగా పేర్కొంటాం. వస్తువు ఒక్కటే కాని నామరూపాలు వేరు.
“అదెలా అంటే: నీరు విభిన్న భాషల్లో విభిన్నంగా పిలువబడుతోంది – జలం, వాటర్, పానీ మొదలైన పేర్లతో. ఒక చెరువుకు నాలుగు గట్లు ఉన్నాయనుకోండి. ఒక గట్టునుండి నీరు త్రాగే హిందువులు ‘జలం’ అంటారు. మరొక గట్టు నుండి నీరు త్రాగే మహమ్మదీయులు ‘పానీ’ అని పేర్కొంటారు. మూడవ గట్టునుండి నీరు త్రాగే ఆంగ్లేయులు ‘వాటర్’ అంటారు. పై ముగ్గురూ ఒకే వస్తువును సూచిస్తున్నారు; భేదం కేవలం పేరులోనే ఉంది. అదే తీరులో భగవంతుణ్ణి కొందరు ‘అల్లా’ అని పిలుస్తారు; కొందరు ‘గాడ్’ అనీ, కొందరు ‘బ్రహ్మ’ మనీ, కొందరు ‘కాళి’ అనీ, తక్కినవారు ‘రామ’, ‘ఏసు’, ‘దుర్గా’, ‘హరి’ మొదలైన పేర్లతో పిలుస్తున్నారు.”
కేశవ్ (చిరునవ్వుతో): జగజ్జనని కాళి ఎన్ని విధాల లీలలు గావిస్తూన్నదో మాకు వివరించండి మహాశయా!
5.4.1 కేశవ్‌తో సంభాషణ – మహాకాళి, సృష్టిప్రకరణం
శ్రీరామకృష్ణులు (చిరునవ్వుతో): ఓ, ఆమె పలురకాల లీలలను చేస్తూన్నది. ఆమే మహాకాళి, నిత్యకాళి, శ్మశానకాళి, రక్షాకాళి, శ్యామాకాళి. మహాకాళి, నిత్యకాళి గురించి తంత్రాలలో ప్రస్తావించబడి ఉంది. సృష్టికి పూర్వం సూర్యచంద్రాదులు, పృథ్వి లేని కాలంలో గాఢాంధకారం ఆవరించి ఉన్నప్పుడు తల్లి, నిరాకార రూపిణి, మహాకాళి – మహాకాళుడితో విరాజిల్లుతూ ఉండేది.
“శ్యామాకాళి చాలావరకు కోమల ప్రకృతి. ఇళ్ళల్లో ఈమెను పూజిస్తూంటారు. ఈమె వరాభయదాయిని.”
“మహామారి, దుర్భిక్షం, భూకంపం, అతివృష్టి, కరవు మొదలైనవి చెలరేగినప్పుడు రక్షాకాళిని పూజించాలి. శ్మశానకాళి సంహారమూర్తి. శాకిని, డాకిని మొదలైన పిశాచాలు తనను పరివేష్టించి ఉండగా ఆమె శ్మశానాలలో నివసిస్తుంది. ఆమె నోటిగుండా రక్తం ప్రవహిస్తూ ఉంటుంది, కంఠాన మానవ శిరస్సుల మాల వ్రేలాడుతూ ఉంటుంది; నడుమున మానవ హస్తాలతో రూపొందిన ఒడ్డాణం ఉంటుంది.”
“ఈ జగత్తు నాశనమైనప్పుడు, మహాప్రళయాంతంలో దివ్యజనని, బీజములను తదనంతర సృష్టికోసం పదిలపరుస్తుంది – ఇల్లాలు ఒక ముంతలో అన్ని రకాల గృహోపయోగ వస్తువులను ఏరి దాచివుంచే రీతిలో.” (అందరూ నవ్వారు)
“గృహిణుల వద్ద ఒక ముంత ఉంటుంది! దాన్లో వారు ఆల్చిప్పలు, నీలి గుళికలు, చిన్నిచిన్ని మూటలలో దోస గుమ్మడి గింజలు మొదలైనవి దాచి ఉంచుకొంటారు. కావలసినప్పుడు వాటిని బయటకు తీస్తారు. అదే విధంగా జగత్తు నాశనమైన తరువాత బ్రహ్మమయీ, దివ్యజననీ నానారకాల బీజాలను తదనంతర సృష్టికోసం సేకరించి, దాచి ఉంచుతుంది. సృష్ట్యానంతరం ఆద్యాశక్తి జగత్తులోనే వసిస్తుంది.”
“వేదాలలో ‘ఊర్ణనాభి’ (సాలెపురుగు, దాని గూడు)ని వర్ణించారు. సాలెపురుగు తన లోపలి నుండి వెలువడిన పదార్థంతో గూడు అల్లుతుంది; తరువాత దాన్లోనే ఉండిపోతుంది. అదే రీతిలో భగవంతుడు జగత్తుకు ఆధారమూ, ఆధేయమూ కూడా.”
5.4.2 కాళియే బ్రహ్మం – కాళి సగుణా, నిర్గుణా
“కాళీమాత, నలుపు వర్ణంలో ఉంటుందా? చాలాదూరం నుంచి చూడటం వల్ల ఆమె నలుపురంగులో ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ ఆమెను సన్నిహితంగా తెలుసుకుంటే అలా అగుపడదు. దూరం నుంచి చూసినప్పుడు ఆకాశం నీలి రంగులో కానవస్తుంది; కాని దగ్గర నుంచి చూసినప్పుడు అది వర్ణరహితం. సాగరాన్ని దూరం నుంచి చూసినప్పుడు నీలిరంగులో ఉన్నట్లు కనిపిస్తుంది. కాని దాని వద్దకెళ్లి నీటిని చేతుల్లో తీసుకొంటే, అది వర్ణరహితం అని తెలుస్తుంది.”
ఇలా పలికి శ్రీరామకృష్ణులు దివ్యప్రేమోన్మత్తతలో ఇలా పాడసాగారు:
నా మాయీ నల్లనిదా?
కాళరూపి దిగంబరి
హృదయాబ్జపు ఉద్దీపని….
5.5 పంచమ పరిచ్ఛేదం ఈ సంసారం ఎందుకు?
త్రిభిర్గుణమయైర్భావైరేభిః సర్వమిదం జగత్ ।
మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయమ్ ॥(గీత 7 : 13)
శ్రీరామకృష్ణులు (కొనసాగిస్తూ): బంధం, ముక్తి ఈ రెంటికి కర్త్రి ఆమే. ఆమె మాయ వల్లనే సంసార జీవులు కామినీ కాంచనాలలో చిక్కువడుతున్నారు; మళ్ళీ ఆమె కటాక్షంతోనే ముక్తిని పొందుతున్నారు. ఆమె భవబంధాలను ఛేదించే ముక్తిప్రదాయిని.
తరువాత శ్రీరామకృష్ణులు తమ సుమధుర స్వరంలో ఇలా పాడ నారంభించారు:
ఎగురవేయుచున్నావు గాలి
పడగలను శ్యామా!
సందడైన లోక సంతలోన
మాయ దారముగను
ఆశ గాలి మీద లేచి
ఎగసిపోవు నింగిపైకి॥ ఎ ॥
గాలిపడగ చట్రములును
మానవాళి ఎముకగూళ్ళు
దానికున్న కాగితములు
త్రిగుణములచె నిర్మితములు॥ ఎ ॥
ఐహికాశ గాజు జిగురు
రుద్దినావు దారములకు
లాగినపుడు పురులు పేని
గట్టిపడుచు వాడి యగును॥ ఎ ॥
లక్షలోన ఏదొ ఒకటి
తెంచుకొనుచు ఎగిరిపోవు
దానిచూచి నవ్వుకొనుచు
చప్పట్లను చరతు వీవు॥ ఎ ॥
అనువైన గాలిపైన
తెగిన గాలిపటము భవము దాటి
అఖండమందు చేరుననుచు
రాంప్రసాదు పలికె॥ ఎ ॥
శ్రీరామకృష్ణులు: ఆమె లీలామయి. ఈ సంసారం ఆమె లీల. ఆమె ఇచ్ఛామయి, ఆనందమయి. లక్షలో ఏ ఒక్కరికో ఆమె ముక్తిని ప్రసాదిస్తుంది.
ఒక బ్రహ్మసమాజ భక్తుడు: కాని మహాశయా! ఆమె ఇచ్ఛగిస్తే అందరికీ ముక్తిని ఇవ్వగలదు. అలాంటప్పుడు మమ్మల్ని ఇలా ఎందుకు సంసారంలో బంధించి ఉంచింది?
శ్రీరామకృష్ణులు: అది ఆమె ఇష్టం. తాను సృష్టించిన జీవులతో ఆటను కొనసాగించటం ఆమె ఇష్టం. దాగుడు మూతలాటలో చూడలేదా? తల్లిని తాకితే పిల్లవాడు మరి దొంగ కాడు. అందరూ వచ్చి తల్లిని తాకితే ఆట ఎక్కువసేపు సాగదు. అది ఆమెకు ఇష్టం ఉండదు. ఆటను కొనసాగించటం లోనే ఆమె ఆనందిస్తుంది. అందుకే కవి ఇలా అన్నాడు:
లక్షలోన ఏదొ ఒకటి
తెంచుకొనుచు ఎగిరిపోవు
దాని చూచి నవ్వుకొనుచు
చప్పట్లను చరతు వీవు.
“జగజ్జనని కనుసైగతో మనస్సుకు ‘వెళ్ళు, వెళ్ళి సంసారసుఖం అనుభవించు’ అన్నట్లుగా ఉంది. అలాంటప్పుడు మనస్సును నిందించటం ఏం భావ్యం? ఆమె కటాక్షంతో మనస్సును తన వైపుకు త్రిప్పుకొంటే తప్ప మనస్సు ఈ విషయాసక్తి నుండి విడివడదు. అప్పుడే మనస్సు జగజ్జనని పాదపద్మాలపట్ల భక్తిప్రపత్తులను పొందుతుంది.”
తరువాత శ్రీరామకృష్ణులు సంసారులు అనుభవించే నానాబాధలను తమపైన ఆరోపించుకున్నట్లు జగజ్జననికి ఫిర్యాదు చేసే ధోరణిలో ఇలా పాడారు:
అమ్మా! అమ్మా! నన్నీ ఖేదము
వ్యధతో హృదయము పిండుచున్నదే॥ అ ॥
(నా) అమ్మవు నీవై ఉండియు కూడ
మెళకువతో నేనున్ననుకూడ
నా నట్టింటనె, నా గృహముననె
దొంగలు దోపిడి చేయగవలెనా॥ అ ॥
నిన్నే తలచగ వలెనని మదిలో
ఎన్నోమారులు బాసలుచేసి
సరియగు సాధన సమయము రాగనె
నిను పిలచుట నే మరచిపోతినే॥ అ ॥
ఇది యంతయు నీ చాతురియేనని
అమ్మ ఇపుడే అర్థంబైనదె॥ అ ॥
ఇవ్వక పోతివి ఎన్నడు దేనిని
ఇచ్చియున్నచో ఇవ్వనా నీకు
(నీ) విచ్చునవేగా నే నిచ్చునది
తప్పేమున్నదే దీనిలో నాది?॥ అ ॥
యశమే యైనను, అపయశమైనను
సద్రసమైనను, చెడురసమైనను
రస సర్వేశ్వరి వయ్యును నీవే
రసభంగంబిట చేయగనేల?॥ అ ॥
ఈ మనసును నా కిచ్చుచు దానిని
కనుసైగలచే కాంక్ష గొల్పుచు
భవ సుఖములనే అనుభవింపుమని
ఆంక్షను పెట్టితి వనును ప్రసాదు॥ అ ॥
కావున గతియే మాలి నీ సృష్టిలో
ఎవ్వరిదో చెడుదృష్టిని సోకి
ఎండుకు పోవుచు నెరుగుచునుంటి
చెడు సౌఖ్యముగ, భ్రాంతి సత్యముగ॥ అ ॥
శ్రీరామకృష్ణులు (కొనసాగిస్తూ) : ఆమె మాయలో భ్రమించి మనుష్యులు సంసారంలో చిక్కుకుంటున్నారు.
ఈ మనసును నా కిచ్చుచు దానిని
కనుసైగలచె కాంక్ష గొల్పుచు
భవ సుఖములనే అనుభవింపుమని
ఆంక్షను పెట్టితి వనును ప్రసాదు.
5.5.1 కర్మయోగంపై ఉపదేశం – సంసారం, నిష్కామకర్మ
బ్రహ్మసమాజ భక్తుడు: సర్వసంగ పరిత్యాగం చేయకుండా భగవంతుని పొందలేమా?
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): సర్వస్వాన్ని మీ రెందుకు త్యజించాలి? మధ్యే మార్గాన్ని అనుసరిస్తూ ఇప్పుడున్న స్థితిలో మీరు బాగానే ఉన్నారు. నీకు నక్స్ ఆట* తెలుసా? ఆ ఆటలో నేను గరిష్ఠ సంఖ్యను సాధించి, ఆటనుంచి విరమణ పొందాను. ఆ ఆటపట్ల ఇక ఆసక్తి లేదు. కాని మీరు చాలా తెలివైన వాళ్ళు. మీలో కొందరు పది సంఖ్యను, కొందరు ఆరు, మరికొందరు ఐదు పొందారు. మీరు సరైన సంఖ్యనే పొందివున్నారు. కనుకనే మీరు నాలాగా ఆటలో నుండి విరమణ చెందలేదు. ఆట కొనసాగుతుంది. అది మంచిది కదా! (అందరూ నవ్వారు)
“నేను నిజం చెబుతున్నాను. మీరు సంసారంలో ఉండటంలో దోషం ఏమీ లేదు. కాని మనస్సును భగవంతుడి వైపు మళ్ళించాలి సుమా! అలాకాకుంటె మీరు ఏమీ సాధించలేరు. ఒక చేత మీరు విధ్యుక్తధర్మాన్ని నిర్వర్తించండి, మరొక చేత భగవంతుణ్ణి పట్టుకోండి. మీ విధ్యుక్తధర్మ నిర్వహణానంతరం రెండు చేతులతో భగవంతుణ్ణి పట్టుకోండి.”
“బంధానికి, ముక్తికి అంతటికీ మనస్సే మూలం. మనస్సును నువ్వు ఏ రంగులో ముంచితే ఆ రంగే అంటుకుంటుంది. చాకలినుంచి అప్పుడే వచ్చిన తెల్లని వస్త్రం లాంటిది మనస్సు. ఆ వస్త్రాన్ని నువ్వు ఎరుపు రంగులో ముంచితే, అది ఎరుపు రంగును సంతరించుకుంటుంది. నీలం లేక ఆకుపచ్చ రంగులలో ముంచితే అది నీలం లేక ఆకుపచ్చ రంగును సంతరించుకుంటుంది. నువ్వు ఆ వస్త్రాన్ని ఏ రంగులో ముంచితే ఆ రంగునే పొందుతుంది. ఏదో కాస్త ఆంగ్లం నేర్వగానే ‘వాట్ గీట్’ అంటూ మాట్లాడటం మీరు గమనించే ఉంటారు. అంతేగాక బూట్లు ధరించి ఈలవేస్తూ పోతూంటారు. ఇవన్నీ తోడుగానే వస్తాయి. లేక ఒక పండితుడు సంస్కృతం అధ్యయనం చేస్తే సంస్కృత శ్లోకాలను డబడబలాడిస్తాడు. నువ్వు కనుక దుస్సాంగత్యంలో ఉంటే, నీ సహచరుల్లానే మాట్లాడతావు, ఆలోచిస్తావు. అలా కాక సజ్జనులైన భక్తుల సాంగత్యంలో ఉంటే నీ ధ్యాస, పలుకు భగవత్పరమైనవిగానే ఉంటాయి.
“మనస్సే సర్వమూ. ఒక వ్యక్తికి భార్య ఒక వైపు, కుమార్తె మరో వైపు ఉన్నారనుకోండి. వారి పట్ల ఆ వ్యక్తి తన అనురాగాన్ని భిన్నరీతిలో ప్రదర్శిస్తాడు. కాని అతడి మనస్సు ఒక్కటే కదా!
5.6 షష్ఠ పరిచ్ఛేదం క్రైస్తవధర్మం, బ్రహ్మసమాజం – ‘పాప వాదన’
సర్వధర్మాన్పరిత్యజ్య మామేకం శరణం వ్రజ ।
అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః ॥(గీత 18 : 66)
“బంధం మనస్సుకు చెందినది, ముక్తికూడా మనస్సంబంధితమే. ‘నేను ముక్తుణ్ణి. సంసారంలో ఉన్నా, అరణ్యంలో ఉన్నా నే నెలా బంధింపబడతాను? నేను భగవంతుని బిడ్డను, రాజాధిరాజు బిడ్డను. నన్నెవరు బంధించగలరు?’ ఒక వ్యక్తి సదా ఆ విధంగా చింతన చేస్తే, అతడు తప్పక ముక్తుడవుతాడు. పాము కాటువేసినప్పుడు ‘నాలో విషం ఎక్కలేదు’ అని దృఢంగా సంకల్పిస్తే ఆ విష ప్రభావాన్ని తొలగించుకోవచ్చు. అదే రీతిలో ‘నేను బద్ధుణ్ణి కాను, నేను ముక్తుణ్ణి’ అని దృఢనిశ్చయంతో పునరుచ్చరిస్తే, అతడు యథార్థానికి అలాగే అవుతాడు – ముక్తుడే అవుతాడు.
5.6.1 శ్రీరామకృష్ణుల బైబిల్ శ్రవణ సంఘటన – కృష్ణకిశోర్ విశ్వాసం
“ఒకసారి ఎవరో నాకు ఒక క్రైస్తవ గ్రంథాన్ని ఇచ్చారు. అతణ్ణి ఆ గ్రంథాన్ని చదివి వినిపించమన్నాను. ఆ గ్రంథంలో కేవలం ‘పాపం’ గురించే చెప్పబడివుంది. (కేశవ్‌తో) మీ బ్రహ్మసమాజంలోనూ కేవలం పాపం గురించే వినవలసి వస్తుంది. సదా ‘నేను బద్ధుణ్ణి, నేను బద్ధుణ్ణి’ అనుకొనే దౌర్భాగ్యుడు, బద్ధుడే కావటం నిశ్చయం. రేయింబవళ్లు ‘నేను పాపిని, నేను పాపిని’ అంటూ తలపోసేవాడు వాస్తవానికి పాపిగానే రూపొందుతాడు.”
“ ‘ఏమిటీ, భగవన్నామాన్ని జపిస్తూన్న నన్ను పాపం ఎలా అంటగలదు? ఇకపై నేను బద్ధుణ్ణి ఎలా అవుతాను?’ ఇలా చెప్పగల అచంచల విశ్వాసం భగవంతుడి పట్ల ఉండాలి. కృష్ణకిశోర్ నిష్ఠాగరిష్టుడైన బ్రాహ్మణుడు. అతడు బృందావనం వెళ్ళినప్పుడు, ఒకనాడు అటూయిటూ తిరుగుతూండగా అతడికి దాహం వేసింది. ఒక బావి వద్ద ఒక వ్యక్తి నిలబడి ఉండటం చూశాడు. అతడితో ‘ఏమయ్యా, కొంచెం మంచినీళ్ళిస్తావా? నీ కులం ఏమిటి?’ అని అడిగాడు. ‘అయ్యా, నేను నిమ్నకులానికి చెందినవాణ్ణి’ అని జవాబిచ్చాడా వ్యక్తి. అందుకు కృష్ణకిశోర్ ‘సరే, శివనామం ఉచ్చరించి, నీటిని చేది ఇవ్వు’ అన్నాడు.
“భగవన్నామ స్మరణతో శరీరం, మనస్సుతోబాటు సమస్తం పవిత్ర మవుతాయి. పాపం, నరకం ఇత్యాదుల గురించే మాట్లాడుకోవటం ఎందుకు? ‘ఓ భగవంతుడా! నిస్సంశయంగా నేను దుర్మార్గాలు చేశాను, మళ్ళీ అలా ప్రవర్తించను.’ ఇలా ఒక్కసారి చెప్పు. భగవన్నామం పట్ల విశ్వాసం కలిగివుండు.”
శ్రీరామకృష్ణులు దివ్యప్రేమలో తన్మయులై ఇలా పాడసాగారు:
ఓ దుర్గా యని పిలుచుచు
అసువులు నే బాసినచో
ఎటు లీయవు ముక్తి నాకు
ఎంతటి పాతకినైన నేను….
“నేను జగజ్జనని నుండి కేవలం శుద్ధ భక్తినే కోరుకున్నాను. ఆమె పాదపద్మాల వద్ద పుష్పాలను సమర్పించి ఇలా ప్రార్థించాను: ‘అమ్మా! ఇదుగో నీ పుణ్యం, ఇదుగో నీ పాపం. రెంటినీ గైకొని నీ పట్ల శుద్ధభక్తిని ప్రసాదించు. ఇదుగో నీ జ్ఞానం, ఇదుగో నీ అజ్ఞానం. రెంటినీ స్వీకరించి నీ పట్ల శుద్ధభక్తిని అనుగ్రహించు. ఇదుగో నీ పవిత్రత, ఇదుగో నీ అపవిత్రత. రెండిటినీ గైకొని, అమ్మా! నీ పట్ల శుద్ధభక్తిని ప్రదానం చేయి. ఇదుగో నీ ధర్మం, ఇదుగో నీ అధర్మం. రెంటినీ తీసుకొని నీ పట్ల శుద్ధభక్తిని ప్రసాదించు.
(బ్రహ్మసమాజ భక్తులతో) రాంప్రసాదు పాట నొకదాన్ని వినండి.”
రావే మనసా షికారు పోదము
కాళీ కల్ప ద్రుమంబునకు
ప్రోగుచేయుమా చెట్టు క్రిందను
నాలుగు పురుషార్థంబులును॥ రా ॥
రాగవిరాగంబను భార్యలతో
వెంబడి తెమ్ము విరాగమును
వివేకంబను ఆమె కుమారుని
అడుగుము సత్యవిచారణను॥ రా ॥
శుద్ధాశుద్ధము అటునిటునుండగ
ఆనందాలయ సౌధమున
వాని నడుమనే పవ్వళించుటను
నేర్చునదెప్పుడె ఓ మనసా॥ రా ॥
ఏక పంచలో భార్యలిరువురను
తృప్తిగ నుంచెడు దారి దొరికిన
అద్వితీయమగు శ్యామరూపమును
సందర్శించగజాలితి వీవు॥ రా ॥
అజ్ఞానాహంకారంబులు నీ
తల్లిదండ్రులే ఓ మనసా
తక్షణమే వారి తరిమివేయు నీ
దృష్టి పథంబున బడకుండ॥ రా ॥
మోహము నిన్ను తన కూపమున
లాగజూచిన ఓ మనసా
ధీరతతోడ క్షాంతి కంబమును
కౌగిలించవే ఓ మనసా॥ రా ॥
పాపపుణ్యములను మేకల గట్టుము
నిర్లిప్తత యను యూపమున
ఎదురు తిరిగిన జ్ఞానఖడ్గమున
ఖండన చేయు మా పశువులను॥ రా ॥
దూరమునుండియె బ్రతిమాలుము నీ
పెద్దభార్య సంతానమును
మాట విననిచో వారిని ముంచుము
విజ్ఞానంబను సంద్రమున॥ రా ॥
రామప్రసాదు చెప్పిన మాటలు
చేయగలుగుచో ఓ మనసా
కొనియాడుచు నిను కన్నతల్లి యని
పిలిచెద నెప్పుడు ఓ మనసా॥ రా ॥
“ఈ జన్మలోనే భగవత్సాక్షాత్కారం ఎందుకు పొందలేరు? జనక మహారాజు అటువంటి సాక్షాత్కారం పొందాడు. ఈ ప్రపంచం కేవలం ఒక ‘మాయా మందిరం’ గా రామ్‌ప్రసాద్ అభివర్ణించాడు. భగవంతుడి పావన పాదాలను ఆరాధించితే, తరువాత
ఈ లోకమే ఒక ఆనంద సౌధం
ఆనందముగ నిందు తిని త్రాగుచుందు
మతిలేని ఓ వైద్యకుల* సంభవుండ నీ చూపు విషయాలు పైపైనె చూచు॥ ఈ ॥
ఆ జనక మహారాజు అసమానఘనుడు
ఏ లోప మాతనికి ఇహపరమునందు?
ఇద్దాని అద్దాని తాననుభవించు
పొరలేటి పాత్రలో తన పాలు గ్రోలు॥ ఈ ॥ (అందరూ నవ్వారు)
5.6.2 బ్రహ్మసమాజం, జనకమహారాజు – గృహస్థులకు మార్గం – ఏకాంతవాసం, వివేకం
“హఠాత్తుగా ఎవరూ జనక మహారాజు కాలేరు. మొదట్లో జనక మహారాజు ఏకాంత ప్రదేశంలో తపం ఆచరించాడు.
“ఈ సంసారంలో ఉంటూవున్నప్పటికీ అప్పుడప్పుడు ఏకాంత ప్రదేశాలకు పోయి ఆవాసం చేయాలి. సంసారం నుంచి బయటకు పోయి, ఒంటరిగా ఉంటూ, కనీసం మూడు రోజులపాటు అయినా భగవంతుడికోసం విలపించితే, అదికూడా మంచిదే. తీరిక చిక్కినప్పుడు ఏకాంతంలో కనీసం ఒక్క రోజైనా భగవచ్చింతన చేసినా, అదికూడా మంచిదే. లోకులు భార్యాబిడ్డలకై కడివెడు కన్నీరు కారుస్తారు. కాని భగవంతుడి కోసం ఎవరు విలపిస్తున్నారు? అప్పుడప్పుడు ఏకాంత ప్రదేశాలకేగి భగవత్సాక్షాత్కారానికై ఆధ్యాత్మిక సాధనలు తప్పక ఆచరించాలి. ఈ సంసారంలో ఉంటూ అనేక కర్మలలో చిక్కువడి సాధకుడు మనస్సును స్థిరపరచుకోవటంలో ప్రథమ దశలో ఎన్నో ఆటంకాలను ఎదుర్కోవలసి ఉంటుంది. బాటకు ఇరువైపుల ఉన్న చెట్లు, మొక్కలుగా ఉన్నప్పుడు వాటి చుట్టూ కంచెలు కట్టాలి. లేకుంటే పశువులు వాటిని మేసివేస్తాయి. చెట్టు, మొక్కగా ఉన్నప్పుడు కంచె అత్యవసరం. చెట్టు బోదె లావుగా, బలిష్ఠంగా పెరిగాక కంచెను తీసివేయవచ్చు. అప్పుడు ఆ చెట్టుకు ఒక ఏనుగును కట్టినా, చెట్టుకు హాని కలుగదు.
“విషయాసక్తి అనే రుగ్మత సన్నిపాత జ్వరం లాటిది. సన్నిపాత రోగి గదిలో ఒక పెద్ద నీటి బిందె, ఒక ఆవకాయజాడీ ఉన్నాయనుకోండి. అతణ్ణి రోగవిముక్తుణ్ణి చేయాలంటే ఆ గదినుండి అతణ్ణి తరలించాలి. విషయలోలుడు సన్నిపాత రోగివంటివాడు. సుఖాన్నిచ్చే వివిధ వస్తువులే ఆ పెద్ద నీటిబిందె; ఆ వస్తువులను అనుభవించాలన్న తృష్ణే దాహం. ఆవకాయ పేరు వినగానే నోరూరుతుంది; దాన్ని దగ్గరకు కూడా తీసుకొని రానక్కర్లేదు. అతడి చుట్టూ అవి ఉన్నాయి. ఆవకాయ అంటే స్త్రీ సాంగత్యం మొదలైనవి. కనుకనే ఏకాంతవాస చికిత్స అవసరమై ఉంది.”
“వివేక వైరాగ్యాలు సముపార్జించిన తరువాతనే సంసారంలోనికి ప్రవేశించటం మంచిది. సంసార సాగరంలో కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే ఆరు మొసళ్లు ఉన్నాయి. ఒంటికి పసుపు రాసుకుని ఆ తరువాత నీళ్ళలో దిగితే మొసళ్ళ భయం ఉండదు. వివేక వైరాగ్యాలే ఆ పసుపు. సదసద్విచారణను వివేకం అంటారు. భగవంతుడు ఒక్కడే సత్యం, నిత్యం; తక్కినదంతా అసత్యం, అనిత్యం, కేవలం మూన్నాళ్ళ ముచ్చటే అనే ఎరుకే వివేకం. నువ్వు భగవంతుడి పట్ల తీవ్ర అనురాగాన్ని అలవరచుకోవాలి. భగవంతుడికై ప్రేమను అనుభూతం చేసుకోవాలి; ఆయన వైపు ఆకర్షితుడవు కావాలి. బృందావన గోపికలు శ్రీకృష్ణుడి పట్ల ఇలాంటి ఆకర్షణను కలిగి ఉన్నారు. మీకోసం ఒక పాట పాడతాను:
5.6.3 భగవదనురాగం – గోపికల ఆకర్షణ
విన్నారె సఖులార విన్నారె మీరు
నా శ్యామమోహనుని ఆ మురళి రవళి॥ వి ॥
అల్లంతదూరాన ఆ వనాంతరిని
మోహనాంగుని మధుర మురళి మ్రోయింపబడె
కాచుకొని కృష్ణుండు వేచియుండెను దారి
వేగ నాతని చేరి ఎగిరిపోవలె నిపుడు॥ వి ॥
చేరి నాతోగూడ అరుదెంతురా అటకు?
చెలులార తెలుపుడి నిలిచిపోదుర ఇటను
నా శ్యామా నామము నామమాత్రము మీకు
నా కన్ననో అతడు హృదయమందలి వ్యధ॥ వి ॥
చెవులతో ఆరవము చేరి వినెదరు మీరు
అది నాకు హృదయాంతరాళంబులో మ్రోగు
ఆ మురళి పిలిచినది వేరావె ఓ రాధ!
ఈ నికుంజము నీవు రాలేకున్న శోభిల్లదు.”॥ వి ॥
శ్రీరామకృష్ణులు అశ్రుపూరిత నయనాలతో ఆ పాట పాడి, కేశవ్ తదితర బ్రహ్మసమాజ భక్తులతో ఇలా అన్నారు: “మీరు రాధ, కృష్ణులను అంగీకరించినా అంగీకరించకున్నా వారి పరస్పర ఆకర్షణను దయచేసి అంగీకరించండి. భగవంతుడికై అదే విధమైన వ్యాకులతను మీ హృదయాలలో కల్పించుకోండి. భగవత్సాక్షాత్కారానికి మీకు కావలసినదంతా ఆ వ్యాకులతే!”
5.7 సప్తమ పరిచ్ఛేదం కేశవ్‌తో నౌకావిహారం – సర్వభూతహితే రతాః
సంనియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః ।
తే ప్రాప్నువన్తి మామేవ సర్వభూతహితే రతాః ॥(గీత 12 : 4)
క్రమంగా నదిలో పోటు ప్రారంభమైంది. స్టీమరు కలకత్తా వైపుగా సాగిపోతోంది. హౌరాబ్రిడ్జి క్రిందుగా దాటి బొటానికల్ గార్డెన్స్ సమీపంలోనికి వచ్చింది. నదిలో కాస్త ముందుకు వెళ్లవలసిందని స్టీమర్ కెప్టన్‌కు చెప్పటమైంది. శ్రీరామకృష్ణుల వచనామృతం గ్రోలటంలో మంత్రముగ్ధులైపోయిన ప్రయాణీకులకు అప్పుడు సమయం ఎంత అయిందో లేక తాము ఎంత దూరం వచ్చామో ఎరుకే లేకపోయింది.
కేశవ్ బొరుగులు, కొబ్బరి ముక్కలు అందరికీ ఇచ్చాడు. అతిథులు తమ వస్త్రపు కొంగులలో వీటిని ఉంచుకొని, తినసాగారు. ప్రతి ఒక్కరూ సంతోషంలో మునిగిపోయారు. కాని కేశవ్, విజయ్ ముభావంగా ఉండటం శ్రీరామకృష్ణులు గమనించారు. వారిద్దరినీ సమాధాన పరచటానికి ఆతురత చెందారు.
శ్రీరామకృష్ణులు (కేశవ్‌తో): ఇటు చూడు! విజయ్ వచ్చాడు. మీ కలహం శివుడు, రాముడు మధ్య యుద్ధం లాటిది. శివుడు, రాముడి గురువు. వారిద్దరూ పరస్పరం యుద్ధం చేసినా, వెంటనే సమాధానపడ్డారు. కాని శివుడి భూతగణాలు, రాముడి వానరసైన్యం మాత్రం తమ జగడాలను మానలేదు! (గొల్లున నవ్వులు) అటువంటి కలహాలు చుట్టపక్కాలలో కూడా జరుగుతాయి. శ్రీరాముడు తన సొంతకుమారులైన లవకుశులతో యుద్ధం చేయలేదా? తల్లి కుమార్తె కలిసి ఒకే ఇంట్లో నివసిస్తూ, ఒకే ఆధ్యాత్మిక గమ్యంతో వేర్వేరుగా శ్రావణ మంగళవార వ్రతాలు ఆచరిస్తారు – తల్లి సంక్షేమం కుమార్తె సంక్షేమానికి భిన్నం అయినట్లుగా! కాని ఒకరికి మంగళమయితే మరొకరికి మంగళమే అవుతుంది కదా! అదే తీరులో నీ కొక ఆధ్యాత్మిక సమాజం ఉంది; విజయ్ కూడా తనకూ ఒకటి ఉండాలని భావిస్తున్నాడు. (నవ్వులు) ఇవన్నీ ఉండవలసినవే అని నా భావం.
“సాక్షాత్తూ భగవదవతారుడైన శ్రీకృష్ణుడు గోపికలతో బృందావనంలో లీలానాటకం జరుపుతున్నప్పుడు జటిల కుటిలలనే దుష్టచిత్తులు రంగ ప్రవేశం చేశారు. ఎందుకు? అని నువ్వు అడగవచ్చు. అందుకు జవాబు: దుష్టచిత్తులు లేకుంటే లీలానాటకం బొత్తిగా రక్తికట్టదు. (గొల్లున నవ్వులు)
“శ్రీరామానుజులు విశిష్టాద్వైతవాదులు. కాని వారి గురువు పూర్తిగా అద్వైతవాది. పరస్పరం వారు విభేదించుకునేవారు. ఒకరి వాదాన్ని మరొకరు ఖండించేవారు. అలా సర్వదా జరుగుతూనే ఉంటుంది. కాని గురువుకు, శిష్యుడు తన సొంతవాడే కదా!”
5.8 అష్టమ పరిచ్ఛేదం కేశవ్‌కి ఉపదేశం – బ్రహ్మసమాజంలో ‘గురుగిరి’ – సచ్చిదానందుడే గురువు
పితాఽసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజ్యశ్చ గురుర్గరీయాన్ ।
నత్వత్సమోఽస్త్యభ్యధికః కుతోఽన్యో లోకత్రయేఽప్యప్రతిమప్రభావ ॥(గీత 11 : 43)
శ్రీరామకృష్ణుల గోష్ఠిలో, ఆయన పలుకులు ఆలకించి అందరూ ఆనందంలో ఓలలాడారు.
శ్రీరామకృష్ణులు (కేశవ్‌తో): మీరు వ్యక్తుల స్వభావం తెలుసుకోకుండా శిష్యులనుగా చేర్చుకుంటారు. అందుచేతనే వారిలా విడిపోతున్నారు.
“వ్యక్తులందరూ నిజానికి ఒకే మాదిరిగా ఉంటారు, కాని వారి స్వభావాలు విభిన్నాలు. కొందరిలో సత్వగుణం అధికం. మరికొందరిలో రజోగుణం పాలు ఎక్కువ, ఇంకా కొందరిలో తమోగుణం అధికంగా ఉంటుంది. కజ్జి కాయలు పైకి చూడటానికి ఒకే రకంగా ఉంటాయి. కాని లోపలి పూర్ణం వేర్వేరుగా ఉంటుంది. కొందరు కొబ్బరికోరు ఎక్కువగా వేస్తారు.” (అందరూ నవ్వారు)
“నా వైఖరి ఏమిటో తెలుసా? నా వరకు నేను తింటాను, ఆనందంగా జీవిస్తాను. అంతే. తక్కినదంతా అమ్మే చూసుకుంటుంది. నా శరీరాన్ని నొప్పించే మూడు పదాలు ఉన్నవి. అవి: ‘గురు’, ‘కర్త’, ‘తండ్రి’.
“సచ్చిదానందు డొక్కడే గురువు. అతడొక్కడే శిక్షణ గరపగలడు. భగవంతుడి పట్ల నా వైఖరి బిడ్డకు తన తల్లి పట్ల ఉండే భావమే. మానవ గురువులు లక్షలాది లభిస్తారు. అందరూ గురువులు కావాలనే వాంఛిస్తారు. కాని శిష్యులుగా ఉండడానికి ఎవరు ఇచ్ఛగిస్తారు?
“ఇతరులకు బోధించటం ఎంతో కష్టం. భగవంతుడు ప్రత్యక్షమై ఆదేశించే పక్షంలోనే ఆ వ్యక్తి బోధించవచ్చు. నారదుడు, శుకుడు మొదలైన ఋషులు భగవంతుని నుండి అట్టి ఆదేశాన్ని పొందినవారు; శంకరుడు కూడా ఆ కోవలోనివాడే. భగవదాదేశం లేనప్పుడు నీ మాటలు ఎవరు ఆలకిస్తారు?
“కలకత్తావాసులు ఎంత సునాయాసంగా ఉద్విగ్నులవుతారో మీకు తెలియదా? పొయ్యిలో కట్టెలు మండుతున్నంత వరకు గిన్నెలోని పాలు కాగి, పొంగుతాయి. కట్టెలను బయటికి లాగివేస్తే, అంతా స్తబ్ధమవుతుంది. కలకత్తావాసులకు సంచలనాత్మక విషయాలపట్ల ఆసక్తి. ఒక ఫలానా చోట వారు నీటికోసం బావి త్రవ్వుతూ ఉండటం మీరు చూసి ఉంటారు. రాయి పడగానే ఆ చోటు వదలి వేసి వేరే చోట త్రవ్వసాగుతారు. అక్కడ యాదృచ్ఛికంగా ఇసుక పడుతుంది. ఈ రెండవ చోటును కూడా వదలి మరొక చోట త్రవ్వకం మొదలుపెడతారు. అలా ఈ కార్యం కొనసాగుతూనే ఉంటుంది.
“తనకు భగవదాజ్ఞ అయిందని కేవలం భావిస్తే మాత్రం చాలదు! భగవంతుడు మనిషికి దర్శనమిచ్చి మాట్లాడతాడు కూడా. అటువంటప్పుడు భగవదాజ్ఞను పొందవచ్చు. భగవదాజ్ఞను పొందిన గురువు వాక్కులలో ఎంతటి శక్తి ఇమిడి ఉంటుందో తెలుసునా? ఆ శక్తి మహాపర్వతాలను సైతం కదిలించివేస్తుంది. కేవలం ఉపన్యాసాలు దంచటమా? జనం కొన్ని రోజులు వారి పలుకులు వింటారు; తదనంతరం వాటిని మరచిపోతారు. కేవలం మాటలు, చేతలను చేయించలేవు.
5.8.1 భావావస్థలో హల్దార్పుకూర్ దర్శించిన సంఘటన
“కామార్పుకూర్లో హల్దార్పుకూర్ అనే చిన్న చెరువు ఉంది. ప్రతిరోజూ కొందరు ఆ చెరువు గట్లను మరుగుదొడ్డిగా ఉపయోగించేవారు. ప్రొద్దుట స్నానార్థం వచ్చిన గ్రామస్థులు చెరువు గట్లను అశుద్ధపరచినవారిని పెద్దగా తిట్టుకొనేవారు. కాని మర్నాటి ఉదయం వారికి అదే అశుద్ధం దర్శనమిస్తుంది. ఈ దుశ్చర్య ఆగలేదు. (అందరూ నవ్వారు) ఆఖరికి గ్రామస్థులు ఈ విషయం గురించి అధికారులకు తెలియజేశారు. ఫలితంగా ఒక గుమాస్తా పంపబడ్డాడు; అతడు చెరువు గట్టుపై ‘ఇక్కడ ఎవరూ అశుద్ధం చేయరాదు’ అనే నోటీసు (సూచన పత్రం) అంటించి వెళ్ళిపోయాడు. అంతటితో ఈ దుశ్చర్య ఆగిపోయింది. (అందరూ నవ్వారు)
“ఇతరులకు బోధించాలంటే అధికారిక ఆమోదం పొంది ఉండాలి. లేకుంటే బోధన అపహాస్యంగా పరిణమిస్తుంది. తానే అజ్ఞాని, ఇతరులకు జ్ఞానోపదేశం చేయటానికి పూనుకోవటమా? ఇది ఒక అంధుడు మరొక అంధుడికి దారిచూపటం వంటిది. అలా బోధచేయటం మేలుకంటే కీడే ఎక్కువ వాటిల్లజేస్తుంది. భగవత్సాక్షాత్కారానంతరం అంతర్దృష్టి కలుగుతుంది. ఆ తరువాతనే ఒక వ్యక్తిలోని ఆధ్యాత్మిక రుగ్మత నిర్ధారించి, సముచిత ఉపదేశం చేయగలిగేది.
5.8.2 ‘అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే’
“భగవదాదేశం లేకుంటే, మనిషికి ‘నేను జనులకు ఉపదేశం చేస్తున్నాను’ అని అహంకారం జనిస్తుంది. ఈ అహంకారం అతడి అజ్ఞాన జనితమే; అజ్ఞాని తాను కర్తనని భావించుకొంటాడు గదా! ‘భగవంతుడే కర్త. ఆయనే సమస్తం చేస్తున్నాడు. నే నేమీ చేయటం లేదు.’ ఇలా భావిస్తున్న వ్యక్తే నిజానికి జీవన్ముక్తుడవుతాడు. ‘నేను కర్తను, నేను కర్తను’ అనే భావం నుండే మనిషి యొక్క సమస్త దుఃఖాలు, అశాంతి ఉద్భవిస్తాయి.
5.9 నవమ పరిచ్ఛేదం కేశవాది బ్రహ్మసమాజస్థులకు కర్మయోగ ఉపదేశం
తస్మాదసక్త స్సతతం కార్యం కర్మ సమాచర ।
అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః ॥(గీత 3 : 19)
“లోకానికి హితం ఒనగూర్చాలని మీరు పలుకుతారు. ఈ లోకం అంత చిన్న విషయమా? మీరెవరు, లోకానికి హితం చేయటానికి? మొదట భగవత్సాక్షాత్కారం పొందండి; ఆధ్యాత్మిక సాధనల ద్వారా ఆయన్ను దర్శించండి. ఆయన శక్తి ప్రసాదిస్తే, ఆ తరువాత ఇతరులకు హితం ఒనగూర్చగలరు. లేకుంటే లేదు.”
ఒక బ్రహ్మసమాజ భక్తుడు: అలా అయితే భగవత్సాక్షాత్కారం పొందేవరకూ మా విధ్యుక్త కర్మలను విడిచివేయాలా?
శ్రీరామకృష్ణులు: అక్కర్లేదు. మీ విధ్యుక్త కర్మలను ఆపుకోవటం ఎందుకు? భగవచ్చింతన, భగవన్నామ సంకీర్తన, నిత్యకర్మలు – ఇవన్నీ చేయవలసినదే.
బ్రహ్మసమాజ భక్తుడు: ధన సంపాదన మొదలైన మా లౌకిక కర్తవ్యాల మాట ఏమిటి?
శ్రీరామకృష్ణులు అవును, వాటిని కూడా నిర్వర్తించవలసిందే; కాని జీవన యాత్రకు వలసినంత వరకే సుమా! అదే సమయంలో ఏకాంత ప్రదేశంలో అశ్రుపూరిత నయనాలతో భగవంతుణ్ణి ఆ లౌకిక కర్తవ్య నిర్వహణ నిష్కామ భావంతో జరిగేట్లుగా ప్రార్థించాలి. ఆయనకు ఇలా విన్నవించుకోవాలి: “ఓ భగవంతుడా! నా కర్తవ్యాలను తగ్గించివేయి తండ్రీ! లేకుంటే, ఓ భగవాన్! నేను అనేక లౌకిక కర్మలలో చిక్కుకోవడం ద్వారా నిన్ను మరచిపోతున్నాను. నేను నిష్కామ కర్మలు ఒనరుస్తున్నానని భావించవచ్చు; కాని అవి సకామ కర్మలుగా మారుతాయి. పేదలకు దాన ధర్మాలు అధికంగా చేయబోయినప్పుడు, పేరు ప్రతిష్ఠలపై మోజు కలిగే ప్రమాదం ఉంది.”
5.9.1 శంభుమల్లిక్కు దానాది కర్మలపై ఉపదేశం
“ఒకసారి శంభుమల్లిక్ వైద్యశాలలు, పాఠశాలలు, బాటలు, చెరువులు మొదలైనవి నిర్మించాలని నాతో చెప్పాడు.
“అప్పుడు నేను ఇలా అన్నాను: ‘నీ దారి తప్పించి అలాంటి పనులకై ఎదురుచూడకు. నీ ముందుకు వచ్చే అత్యవసరమైన కార్యాలనే చేపట్టు; అదీ నిర్లిప్తతాభావంతో ఆచరించాలి.’ కావాలని అనేక కార్యకలాపాలలో పాల్గొనటం కూడా మంచిది కాదు. అందువల్ల భగవంతుణ్ణి విస్మరించటం జరగవచ్చు. కాళీఘాట్ ఆలయ విషయానికి వస్తే – కొందరు తమ పూర్తి సమయాన్ని పేదలకు ధర్మం చేయటంలో గడిపివేస్తారు. కాళికాదేవి దర్శనానికి వారికి ఇక సమయం ఉండదు కదా! (అందరూ నవ్వారు)
శంభుమల్లిక్
“గుంపులో జొరబడి అందరినీ త్రోసుకొంటూ అయినా సరే ఏదో విధంగా ముందు దేవీ దర్శనం చేసుకోవాలి. అటు తరువాత ధర్మం చేసినా, చేయకపోయినా, ఇక నీ ఇష్టం. మనస్సంతృప్తిగా పేదలకు ధర్మం చేయవచ్చు, నువ్వు ఆ విధంగా భావిస్తే. భగవత్సాక్షాత్కార సముపార్జనలో కర్మనిర్వహణ కేవలం ఒక సాధన మాత్రమే. అందుకే శంభుమల్లిక్ని ‘భగవంతుడు నీ ఎదుట ప్రత్యక్షమైతే వైద్యశాలలు, ఔషధశాలలు నిర్మించమని కోరుకుంటావా?’ అని అడిగాను. (నవ్వులు) భక్తుడు ఎన్నటికీ అలా కోరడు. పైగా అతడిలా అంటాడు: ‘ఓ ప్రభూ! నీ పాదపద్మాల వద్ద నాకొక స్థానం కల్పించు. సర్వదా నన్ను నీ సాన్నిధ్యంలో ఉంచుకో. నీ పాదపద్మాల పట్ల శుద్ధభక్తి కలిగేట్లు అనుగ్రహించు.’
“కర్మయోగం అతి కఠినమైనది. ఈ కలియుగంలో శాస్త్రవిహిత కర్మలను నిర్వర్తించటం ఎంతో కష్టం. నేటి కాలంలో జీవులు అన్నగత ప్రాణులు. మనిషి శాస్త్రవిహిత కర్మలు విశేషంగా నిర్వర్తించలేడు. ఒక ఫలానా వ్యక్తి జ్వరంతో మంచంపట్టాడనుకోండి. స్వదేశ చికిత్సా విధానంలో నెమ్మదిగా రోగ నిదానం చేయ ప్రయత్నిస్తే, త్వరలోనే అతడు ‘హరీ’ అంటాడు. రోగి ఎక్కువ ఆలస్యాన్ని తట్టుకోలేడు. ప్రస్తుతం ‘డి. గుప్త’ ఔషధమిశ్రం (ఎక్కువ మోతాదులో క్వినైన్ ఉన్న ఔషధం) వాడటం సముచితం. కలియుగానికి భగవన్నామ సంకీర్తన, ప్రార్థనలతో కూడిన భక్తియోగం ఉత్కృష్ట విధానం. భక్తియోగమే నేటి యుగధర్మం. (బ్రహ్మసమాజ భక్తులతో) హరి నామ సంకీర్తన, దేవీ గుణగానం చేస్తున్న మీరు ధన్యులు. మీ వైఖరి నాకు నచ్చింది. వేదాంతవాదుల మాదిరి జగత్తు స్వప్నం అని మీరు పేర్కొనరు. మీరు వారిలా బ్రహ్మజ్ఞానులు కారు; మీరు భక్తులు. మీరు భగవంతుణ్ణి వ్యక్తిగా పరిగణించటం కూడా మంచి పద్ధతే. మీరు భగవద్భక్తులు. పరమ వ్యాకులతతో మీరు పిలిస్తే ఆ భగవత్సాక్షాత్కారం మీకు తప్పక లభిస్తుంది.”
5.10 దశమ పరిచ్ఛేదం సురేంద్రుని ఇంట్లో నరేంద్రాదులతో
కాయలాఘాట్ వద్ద పడవ లంగరు దించారు. అందరూ దిగసాగారు. బయటకు వచ్చి చూసేసరికి వారికి పున్నమి చంద్రుడు దర్శనమిచ్చాడు. చెట్లు, భవనాలు, గంగానదిపై నడయాడే పడవలు పండు వెన్నెల కాంతిలో స్నానం చేసినట్లున్నాయి. శ్రీరామకృష్ణుల కోసం ఒక బండిని కేకవేశారు. శ్రీరామకృష్ణులతో పాటు ‘మ’, కొందరు భక్తులు బండి ఎక్కారు. శ్రీరామకృష్ణులు కేశవ్ గురించి అడిగారు. వెంటనే కేశవ్ అక్కడకొచ్చి శ్రీరామకృష్ణుల దక్షిణేశ్వర తిరుగు ప్రయాణానికి చేస్తున్న ఏర్పాట్ల గురించి విచారించాడు. తరువాత కేశవ్ శ్రీరామకృష్ణులకు సాష్టాంగ ప్రణామం చేసి పాదధూళి స్వీకరించి సెలవు పుచ్చుకున్నాడు.
బండి, ఐరోపియన్లు నివసించే ప్రాంతంగుండా వెళుతోంది. ప్రకాశమానమైన బాటకు ఇరువైపులా అందంగా తీర్చిదిద్దబడినట్లు కట్టబడిన భవంతుల దృశ్యాన్ని తిలకిస్తూ శ్రీరామకృష్ణులు ఆనందిస్తున్నారు. హఠాత్తుగా శ్రీరామకృష్ణులు, “నాకు దాహం వేస్తోంది. ఏం చెయ్యాలి?” అన్నారు. కేశవ్ మేనల్లుడైన నందలాల్, ఇండియా క్లబ్ ముందు బండిని ఆపించి, మేడ మీదకు వెళ్ళి ఒక గ్లాసులో నీళ్ళు తీసుకొని వచ్చాడు. ఆ గ్లాసు పరిశుభ్రంగా కడిగినదేనా అని శ్రీరామకృష్ణులు అడిగారు. నందలాల్ అవుననగానే, ఆయన ఆ గ్లాసుతోనే నీళ్ళు త్రాగారు.
బండి వెళుతూవుంటే శ్రీరామకృష్ణులు తమ తలను కిటికీగుండా బయటకు పెట్టి జనాన్ని, వాహనాలను, గుర్రాలను, వెన్నెలతో వెల్లివిరిసిన వీథులను చూస్తూ చిన్నపిల్లవాడిలా ఆనందిస్తున్నారు. అప్పుడప్పుడు ఐరోపియను స్త్రీలు పియానో నేపథ్యంలో పాడుతూండటం ఆలకిస్తూ పరమానంద స్థితిలో ఉన్నారు.
బండి సురేశ్ మిత్ర ఇంటి ముందు ఆగింది. సురేశ్మిత్ర శ్రీరామకృష్ణుల పరమ భక్తుడు. శ్రీరామకృష్ణులు ఇతణ్ణి ఆప్యాయంగా సురేంద్ర అని పిలిచేవారు. ఆ సమయంలో సురేంద్ర ఇంట్లో లేడు.
ఇంట్లోనివారు క్రింది భాగంలో ఒక గదిని శ్రీరామకృష్ణుల, ఆయన అనుయాయులకోసం తెరిచి ఉంచారు. బండి బాడుగ ఇవ్వవలసి ఉంది. సురేంద్ర ఇంట్లో ఉండివుంటే బాడుగ అతడిచ్చేవాడు. శ్రీరామకృష్ణులు ఒక భక్తుడితో ఇలా అన్నారు: “బండి బాడుగను ఇంట్లోని ఆడవారిని చెల్లించమని నువ్వు అడగవచ్చు కదా? ఇంటి యజమాని దక్షిణేశ్వరానికి వస్తూవుండటం తప్పక వారు ఎరిగే ఉంటారు. నేను వారికి అపరిచితుణ్ణి కాను కదా!” (అందరూ నవ్వారు)
నరేంద్రుడు ఆ ప్రాంతంలో వసిస్తూండటంతో, అతడికి కబురు పంపారు. ఈలోపు శ్రీరామకృష్ణులను, భక్తులను మేడ మీది గదిలోకి ఆహ్వానించి, తీసుకువెళ్ళారు. ఆ గది నేలపై ఒక తివాచీ, ఒక తెల్లవస్త్రం పరచబడి ఉన్నవి. కొన్ని మెత్తలుకూడా అమర్చబడి ఉన్నవి. గది గోడకు సురేంద్రుడికోసం ప్రత్యేకంగా చిత్రించబడిన ఒక తైలవర్ణచిత్రం వ్రేలాడుతోంది. ఆ తైలవర్ణచిత్రంలో శ్రీరామకృష్ణులు, కేశవ్‌కి హిందూ, క్రైస్తవ, మహమ్మదీయ, బౌద్ధాది మతాల సమన్వయాన్ని తెలుపుతూన్నట్లు చిత్రించబడింది. ఈ చిత్రాన్ని చూపి కేశవ్ ఒకసారి “ఈ భావాన్ని ఊహించిన వ్యక్తి ధన్యుడు” అన్నాడు.
శ్రీరామకృష్ణులు ఆనందంగా భక్తులతో మాట్లాడుతూన్నప్పుడు నరేంద్రుడు వచ్చాడు. అప్పుడు ఆయన ఆనందం ద్విగుణీకృతమయింది. తమ యువశిష్యుడితో ఆయన ఇలా అన్నారు: “ఈ రోజు మేమంతా కేశవ్‌తో పడవలో విహరించి వచ్చాం. విజయ్ మరి కొందరు బ్రహ్మసమాజ భక్తులు కూడా ఉన్నారు.
(‘మ’ ను చూపుతూ) ఇతణ్ణి అడుగు–కేశవ్, విజయ్‌లతో నేను ఏం అన్నానో? తల్లి, కుమార్తె విడివిడిగా మంగళవార వ్రతాలు ఆచరిస్తారు – ఒకరికి మేలు కలిగితే మరొకరికి కలిగినట్లే. అయినప్పటికీ, దుష్టచిత్తలైన జటిల కుటిలల ప్రవేశం నాటకం రక్తికట్టటానికి అత్యవసరం అని కూడా కేశవ్‌తో చెప్పాను. (‘మ’ తో) అంతేకదా?”
‘మ’ : అవునండి, నిజమే.
అప్పటికి బాగా పొద్దుపోయింది. సురేంద్ర ఇంకా తిరిగిరాలేదు. శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వర ఆలయ ఉద్యానవనానికి వెళ్ళాలి. ఆయన కోసం బండి తీసుకువచ్చారు. ‘మ’, నరేంద్రుడు శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి సెలవు పుచ్చుకున్నారు. వెన్నెల కాసే వీథుల గుండా శ్రీరామకృష్ణుల బండి దక్షిణేశ్వరం వైపుగా బయలుదేరింది.