15. హిరణ్మయేన పాత్రేణసత్యస్యాపిహితం ముఖం
తత్ త్వం పూషన్నపావృణు సత్యధర్మాయ దృష్టయే
16. పూషన్నేకర్షే యమ సూర్య ప్రాజాపత్య వ్యూహ రశ్మీన్ సమూహ
తేజో యత్ తే రూపం కళ్యాణతమం తత్ తే పశ్యామి
యో సావసౌ పురుషః సోహమస్మి
అర్థం: సత్యం యొక్క ముఖం బంగారు తెరతో కప్పబడి ఉంది. ఓ సూర్యదేవా! సత్యనిష్ఠుడనైన నేను ఆ సత్యాన్ని దర్శించడానికి తెరను తొలగించు.
సకల జీవరాసులను పోషించి కాపాడేవాడవు, ఒంటరిగా పయనించేవాడవు. అన్నిటినీ పాలించే ఓ సూర్యదేవా! ప్రజాపతి కుమారుడా! నీ కిరణాలను ఉపసంహరించుకో. నీ తేజస్సును కుదించుకో. కళ్యాణకరమైన నీ స్వరూపాన్ని నీ అనుగ్రహంతో నేను చూస్తున్నాను. ఆ సూర్యునిలో ఉన్నది “నేనే”.
వివరణ (Verse 15):ఈ శ్లోకం మన ఊహకు కూడా అందని దాన్ని గురించి తెలుపుతోంది. అజ్ఞానం అనే చీకటి నుండి జ్ఞానం అనే వెలుగులోనికి తోడ్కొని వెళ్ళమని ప్రార్థన మనకు తెలుసు. ధ్యానం, భక్తి మొదలగు వాటివలన భగవత్దర్శనం కలుగుతుంది. అంటే వెలుగులోనికి మనం ప్రయాణించగలం. కాని సత్యం అనేది వెలుగుచీకట్లకు, జ్ఞానాజ్ఞానాలకు అతీతమైనది. అంటే ఆ తేజస్సును అంటే వెలుగును కూడా దాటిపోవాలి అనే విషయం ఈ శ్లోకంలో తెలుస్తోంది. ఆ తేజస్సునే ఇందులో సత్యం యొక్క ముఖం బంగారు తెరతో కప్పబడి ఉన్నదని చెప్పబడింది.”సత్యనిష్ఠుడనైన నేను” అని ఎందుకు అంటున్నారంటే తన అర్హతను తెలిజేయడం జరుగుతోంది.నిరాకార, నిర్గుణమైన సత్యాన్ని అనుభూతి పొందడానికి ప్రార్థించడం ఇక్కడ జరుగుతోంది.
వివరణ (Verse 16): ఈ శ్లోకంలో ఋషి తను దర్శించినది చెప్పినాడు. భగవత్కృపతో దర్శిచి ఆ సత్యమైన పదార్థం “నేను” అని కనుగొన్నాడు. ఇక్కడ “నేను” అని సూచించబడ్డది మనం మామూలు అర్థంలో తీసుకోకూడదు. ఈ “నేను” అన్నది ఏంటో నాకు ( రచయిత) చెప్పడానికి అర్హత కానీ, అనుభవపూర్వక జ్ఞానం కానీ లేవు. కానీ ఉపనిషత్తు ప్రకారం ఈ “నేను” అనేది ముందటి శ్లోకాలలో చెప్పబడిన “ఒకే వస్తువు”. ఈ స్థితి అత్యున్నత స్థితి, భగవంతుడి స్థితి.