12.అంధం తమః ప్రవిశన్తి యే సంభూతిముపాసతే
తతో భూయ ఇవ తే తమో య ఉ సంభూత్యాగ్ం రతాః
13.అన్యదేవాహుః సంభవాదన్యదాహురసమ్భవాత్
ఇతి శుశ్రుమ ధీరాణాం యే నస్తద్విచచక్షిరే
14.సంభూతిం చ వినాశం చ యస్తద్వేదోభయగ్ం సహ
వినాశేన మృత్యుం తీర్త్వా సంభూత్యామృతమశ్నుతే
అర్థం: దేవుడిని నిరాకారముగా పూజించేవారు కటిక చీకటిలోను , ఆకారం ఉన్నవాడిగా పూజించేవాడు ఇంకా ఘోరచీకటిలోనూ మునిగిపోతారు.
మాకు దానిని వివరించిన మహాత్ములు విన్నది ఏమంటే ” సాకార ఉపాసన వలన ఒక ఫలితం,నిరాకార ఉపాసన వలన మరోరకమైన ఫలితం లభిస్తాయి” అని.
సాకార ఉపాసన, నిరాకార ఉపాసన రెంటినీ కలిపి గ్రహించినవాడు సాకారోపాసన వలన మరణాన్ని దాటి, నిరాకారోపాసన వలన అమరత్వం పొందుతాడు.
వివరణ (Verse 12): అనగా దేవుడు నిరాకారుడు మరియు సాకారుడు.అలా కాకుండా కేవలం సాకారుడు లేదా నిరాకారుడు అని వాదించే వారు మూర్ఖులు. వారు ఘోరమైన నరకానికి పోతారు.
వివరణ (Verse 14): మనకు రూపం, గుణాలు ఉన్నాయి కాబట్టి మన జ్ఞానం రూపాన్ని, గుణాలను దాటిపోవాలంటే కష్టం. దేవుడిని నిరాకారముగా పూజించడములో కలిగే కష్టం ఇది. దానివలన మనకు ఏదీ సరిగా అర్థం కాదు. ఆధ్యాత్మికముగా ఉన్నతస్థితిలో ఉన్నవారికి మాత్రమే ఇది సాధ్యము. అందువలన మనలాంటి సాధారణజీవులకు ఇది చీకటిలో ఉన్నట్లే లెక్క. అలాగే సాకారఉపాసన అంటే రాముడిగానో, శివుడిగానో పూజించడం. ఇలా పూజించాలంటే అన్ని దేవుళ్ళరూపాలు ఒకే పరమాత్మ అని గ్రహించి ఉండాలి. లేకుంటే “దశావతారం” చిత్రంలో రాజుల కాలం నాటి పరిస్థితి ఎదురవుతుంది. అంటే నీ దేవుడి కంటే నా దేవుడే గొప్ప అనే దురభిమానం, మూఢభక్తి లాంటి ప్రమాదాలు ఎదురవుతాయి. అందుకని ఇది ఇంకా చీకటిలో ఉండడం అన్నమాట. కాబట్టి రెండింటినీ కలిపి మనం ఆత్మానుభూతి పొందాలనేది ఈ శ్లోకాల అర్థం. అది ఎలా అనేది తర్వాతి శ్లోకాలలో చూస్తాము.