6.యస్తు సర్వాణి భూతాన్యాత్మ న్యేవాను పశ్యతి
సర్వభూతేషు చాత్మానం తతోన విజుగుప్సతే
7.యస్మిన్ సర్వాణి భూతాన్యాత్మైవాభూద్విజానతః
తత్రకో మోహః కః శోక ఏకత్వమనుపశ్యతః
అర్థం: ఎవరైతే అన్ని జీవులను ఆత్మలోనూ, ఆత్మను అన్ని జీవులలోనూ చూస్తాడో అతడు ఎవరినీ ద్వేషించడు.
ఆత్మే అన్ని జీవరాసులుగా ఉన్నదని గ్రహించిన వ్యక్తికి మోహం, శోకం ఎలా ఉంటాయి?
వివరణ: పై 6,7 శ్లోకాలు ఆత్మను సాక్షాత్కరించుకొన్నవాడి లేక ఆత్మానుభూతి పొందిన వాడి గురించి చెబుతున్నాయి. మనకు ఇష్టం లేనిదాన్ని మనం ద్వేషిస్తాం. విపరీత ఆకర్షణ వలన మనకు ఒక వస్తువుపై మోహం కలుగుతుంది. మనకు ఇష్టం లేనిది జరిగినప్పుడు మనకు బాధ కలుగుతుంది. కాని ఆత్మానుభూతి పొందిన వ్యక్తి విశ్వాన్ని అంతటినీ ఆత్మస్వరూపంగా లేక భగవంతుడిగా చూస్తాడు. అలాంటప్పుడు అతనికి ఆత్మ తప్ప ప్రపంచములో వేరేది కనిపించదు. ఏదైనా రెండవ వస్తువు ఉన్నప్పుడు మాత్రమే కదా మనకు దానిపైన మనసు పోయేది. అంతా ఒకటే అయినప్పుడు మనసు ఎక్కడకు పోగలదు. ఒక్కచోటే ఉంటుంది. అందువలన బాధ గాని, ఆకర్షణ లేక మోహం కాని, ద్వేషం కాని ఎలా ఉంటాయి. ఇవన్నీ ఆత్మానుభూతి పొందిన వాడి లక్షణాలు.
ఆత్మానుభూతి, ఆత్మసాక్షాత్కారం మొదలగునవి ఆంతరంగిక అనుభవాలు. బయటి ప్రపంచం ముందులానే ఉంటుంది. కాని చూసేవాడి మనసును బట్టి వ్యక్తివ్యక్తికీ ప్రపంచస్వభావం వేరేలా ఉంటుంది. ఒక యువకుడికి ఏదైనా సాధించగలననే విశ్వాసం ఉంటుంది. అదే ఒక ముసలివ్యక్తికి అంతా అయిపోయిందనే భావన ఉంటుంది. ప్రపంచం ఏమీ మారలేదు. మార్పు అంతా చూసేవాడిని బట్టే. అలానే ఆత్మసాక్షాత్కారం పొందిన వ్యక్తికి రెండు కొమ్ములు ఏమీ రావు. అతని మనసు విశాలమై విశ్వమంతటితోనూ ఏకం అవుతుంది.