4.అనేజదేకం మనసో జవీయో నైనద్దేవా ఆప్నువన్ పూర్వమర్షత్
తద్ధావతో న్యానత్యేతి తిష్ఠత్ తస్మిన్నపో మాతరిశ్వా దధాతి
5.తదేజతి తన్నైజతి తద్దూరే తద్వంతికే
తదంతరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యతః
అర్థం: ఆత్మ కదలలేనిది, ఒక్కటే అయినది. మనస్సు కంటే వేగవంతమైనది. ఇంద్రియాలు దాన్ని పొందలేవు. అన్నిటికన్నా ముందు వెళ్తూనే అది స్థిరముగా ఉంటుంది. కదిలే వస్తువులు అన్నిటికన్నా ఆత్మ వేగవంతమైనది. ఆత్మ స్థిరముగా ఉండటం వలన ప్రాణం అన్నిటితో పనిచేయిస్తుంది.
అది చలిస్తుంది, చలించదు. దూరంగా ఉంటుంది, చాలా దగ్గరగా ఉంటుంది. అది అన్నిటి లోపలా, బయట కూడా ఉంటుంది.
వివరణ (Verse 4): ఈ శ్లోకంలో ఎన్నో పరస్పర వ్యతిరేక అంశాలు ఉన్నాయి. చలిస్తుంది అనీ చలనం లేనిదనీ, స్థిరము అనీ అన్నిటికన్నా వేగవంతం అనీ వ్యతిరేకాలు ఉన్నాయి. ఏదైనా ఒక వస్తువు కదలాలన్నా, పనిచేయాలన్నా ఒక స్థలం ఉండాలి. విశ్వమంతా ఆత్మ ఒకటే ఉన్నప్పుడు రెండవది లేనప్పుడు ఆత్మ ఎక్కడకు కదలగలదు? అందుకే ఆత్మ చలనం లేనిది అన్నారు.
మనం ఒక వస్తువును అనుకొన్నప్పుడు మన మనసు ఆ వస్తువు రూపాన్ని ఊహించుకొంటుంది లేక ఆ వస్తువు రూపాన్ని గ్రహిస్తుంది. మన శరీరం ఆ వస్తువు వద్దకు వెళ్ళక ముందే మనసు ఆ వస్తువు వద్దకు వెళ్ళిపోతుంది. కాని ఆత్మ ఒక్కటే ఈ విశ్వమంతా వ్యాపించి ఉండడం వలన మనసు, శరీరం అన్నీ అందులోనివే కావడం వలన మనసు ఆ వస్తువు వద్దకు వెళ్ళక ముందే అక్కడ ఆత్మ ఉంటుంది. అంటే ఆత్మ స్థిరముగా ఉంటూనే మనసు కన్నా కూడా వేగవంతం అని చెప్పబడింది.
ఇంద్రియాలు ఆత్మను గ్రహించలేవు. ఎందుకంటే ఇంద్రియాలు ( కన్ను, ముక్కు, చెవి, కాళ్ళు, చేతులు, చర్మము, నాలుక మొదలగునవి) బయటి ప్రపంచాన్ని తెలుసుకోవడానికే సృష్టింపబడ్డాయి. ఏ వస్తువు కదలాలన్నా, కదలని వస్తువు ఒకటి ఆధారముగా ఉండాలి. బస్సు కదలాలంటే కదలని రోడ్డు, చలనచిత్రం చూడాలంటే కదలని తెర ఉండాలి. ప్రాణం అనేది ఆత్మను ఆధారముగా చేసుకొని ఇంద్రియాలను లేక ప్రపంచముతో పని చేయిస్తుంది. ఈ శ్లోకం యొక్క వివరణ ఇది.
వివరణ (Verse 5): ఈ శ్లోకంలో కూడా ముందటి శ్లోకంలో లాగా వ్యతిరేకాలే కనిపిస్తున్నాయి. ముందు శ్లోకంలో చెప్పుకున్నట్లుగా ఆత్మ ఇంద్రియాలకు అందదు. చలిస్తుంది, చలించదు అనే వాటికి ముందు శ్లోకములో అర్థం చెప్పుకున్నాము. ప్రతి ఒక్కరిలో ఆత్మ ఉంది కాబట్టి అందరికీ అది చాలా దగ్గరగా ఉంది. కాని మనం ఆ విషయం అనుభవపూర్వకముగా తెలుసుకోనప్పుడు అది మనకు దూరంగా ఉందనే కదా అర్థం. ఆత్మ రూపములో అది మనలోనే ఉంది, అలాగే పరమాత్మ రూపంలో మన బయట కూడా ఉంది అన్న విషయం మనకు తెలుసు కదా.