తస్మాన్నార్హా వయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ ।
స్వజనం హి కథం హత్వా సుఖీనః స్యామ మాధవ ॥ 37
తస్మాత్, న, అర్హాః, వయమ్, హంతుమ్, ధార్తరాష్ట్రాన్, స్వబాంధవాన్,
స్వజనమ్, హి, కథమ్, హత్వా, సుఖీనః, స్యామ, మాధవ
తస్మాత్ = అందువలన; స్వబాంధవాన్ = మన బంధువులైన; ధార్తరాష్ట్రాన్ = ధార్తరాష్ట్రులను; హంతుమ్ = వధించుటకు; వయమ్ = మనము; న అర్హాః = అర్హులం కాము; మాధవ = కృష్ణా; హి = కనుక; స్వజనమ్ = స్వజనులను; హత్వా = చంపి; కథం = ఎలా; సుఖీనః స్యామ =సుఖులం కాగలం?
తా ॥ కాబట్టి, దుర్యోధనాదులను, వారి బంధువులను చంపడం మనకు తగదు. మాధవా! స్వజనులను చంపి మనమెలా సుఖీంచగలం?
వ్యాఖ్య:-
అర్జునుడు “స్వజనం, స్వబాంధవులు” అంటూ కలవరపడుతున్నాడు. ‘నాది’ అనే మమకార భావం అతన్ని గట్టిగా పట్టుకుని పీడిస్తోంది. ‘నేను, నాది’ (అహంకారం, మమకారం) రెండూ జీవుడిని మోక్ష మార్గంలో అడ్డుకునే పెద్ద ప్రతిబంధకాలే.
దేహాభిమానం – మూల కారణం: “‘ఈ దేహమే నేను’ అని భావించేంతకాలం ఈ నిట్టి భావాలు (అహంకారం, మమకారం) వదలవు.” కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడి ఈ దేహాభిమానాన్ని “‘నీవు ఆత్మవి, దేహం కాదు'” అనే అఖండ జ్ఞానోపదేశంతో తొలగించబోతున్నాడు .