ఇదం తే నాతపస్కాయ నాభక్తాయ కదాచన ।
న చాశుశ్రూషవే వాచ్యం న చ మాం యోఽభ్యసూయతి ॥ 67
ఇదమ్, తే, న, అతపస్కాయ, న, అభక్తాయ, కదాచన,
న, చ, అశుశ్రూషవే, వాచ్యమ్, న, చ, మామ్, యః, అభ్యసూయతి.
ఇదమ్ = ఈ గీతాశాస్త్రం; అతపస్కాయ = తపోరహితునికి; అభక్తాయ = భక్తుడు కానివాడికి; అశుశ్రూషవే చ = వినగోరని వాడికి; యః = ఎవడు; మామ్ = నన్ను (మనుష్యునిగా తలచి); అభ్యసూయతి = ద్వేషిస్తాడో వాడికి; తే = నీకు (నీ చేత); కదాచన = ఎప్పుడూ; న వాచ్యం = చెప్పబడదగింది కాదు.
తా ॥ (శాస్త్రసంప్రదాయ ప్రవర్తనా నియమం ఏమంటే 🙂 సంసారశాంతికై నీకు ఉపదేశించిన ఈ గీతాశాస్త్రాన్ని తపోరహితునికి చెప్పకూడదు. తపస్వియే అయినప్పటికీ గురుభక్తి, ఈశ్వరభక్తి లేకపోతే చెప్పవద్దు. భక్తుడూ తపస్వి అయినా వినగోరకపోతే చెప్పకు. వాసుదేవుడనైన నన్ను సామాన్యమానవునిగా తలచి, నా ఈశ్వరత్వాన్ని అంగీకరించని వాడికి కూడా చెప్పవద్దు. భగవద్ద్వేష శూన్యుడూ, తపస్వి, భక్తుడూ, శ్రవణాసక్తుడూ అయిన వాడికి మాత్రమే చెప్పవలెను.