సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ ।
అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః ॥ 66
సర్వధర్మాన్, పరిత్యజ్య, మామ్, ఏకమ్, శరణమ్, వ్రజ,
అహమ్, త్వా, సర్వపాపేభ్యః, మోక్షయిష్యామి, మా, శుచః.
సర్వధర్మాన్ = సర్వధర్మ అనుష్ఠానాల నన్నింటిని; పరిత్యజ్య = త్యజించి; మామ్ = గర్భ–జన్మ–జరా–మృత్యు వర్జితుణ్ణి, సర్వాత్ముణ్ణి, పరమేశ్వరుణ్ణి అయిన నన్ను; ఏకమ్ = ఒక్కనినే; శరణం వ్రజ = ఆత్మరూపంలో ఆశ్రయించు; అహమ్ = నేను; త్వా = (ఇలా నిశ్చిత బుద్ధివైన) నిన్ను; సర్వపాపేభ్యః = ధర్మాధర్మబంధ రూప పుణ్యపాపాల నుండి; మోక్షయిష్యామి = ముక్తుణ్ణి చేస్తాను; మా శుచః = శోకించకు.
తా ॥ సమస్త ధర్మ-అధర్మాల* అనుష్ఠానాన్ని పరిత్యజించి, గర్భ–జన్మ జరా–మృత్యు వర్జితుణ్ణి, సర్వాత్ముణ్ణి, పరమేశ్వరుణ్ణి అయిన నన్ను ఒక్కణ్ణే ఆత్మరూపంలో ఆశ్రయించు; నేను కాకుండా మరేదీ లేదనే దృఢ నిశ్చయుడవు కమ్ము. ఇటువంటి నిశ్చితబుద్ధి గల నీకు నేను, నా స్వరూపాన్ని ప్రకటించి ధర్మాధర్మ బంధనాలైన పుణ్యపాపాల నుండి* నిన్ను ముక్తుణ్ణి చేస్తాను. కనుక, శోకించకు.* (గీత. 10-11, 4-36; శ్రీమద్భాగవతమ్. 11-12-14, 15 చూ.)