సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయః ।
మత్ప్రసాదాదవాప్నోతి శాశ్వతం పదమవ్యయమ్ ॥ 56
సర్వకర్మాణి, అపి, సదా, కుర్వాణః, మద్వ్యపాశ్రయః,
మత్ ప్రసాదాత్, అవాప్నోతి, శాశ్వతమ్, పదమ్, అవ్యయమ్.
సదా = ఎల్లప్పుడూ; సర్వకర్మాణి = సమస్త కర్మలను; కుర్వాణః అపి = చేస్తున్నప్పటికీ; మద్వ్యపాశ్రయః = నన్ను శరణు పొందిన భక్తుడు; మత్ ప్రసాదాత్ = నా అనుగ్రహంతో; శాశ్వతమ్ = సనాతనమూ; అవ్యయమ్ = అక్షయమూ అయిన; పదమ్ = స్థానాన్ని; అవాప్నోతి = పొందుతాడు;
తా ॥ (స్వకర్మ ద్వారా పరమేశ్వరారాధన చేయడం వల్ల మోక్షం లభించే క్రమం చెప్పబడింది; అది ఉపసంహరింపబడుతోంది 🙂 పూర్వోక్తరీతిని అనుసరించి, నిత్యనైమిత్తిక కర్మలను అన్నింటినీ స్వర్గాది ఫలాలను అపేక్షించకుండా, నన్నే ఆశ్రయించి, అనుష్ఠించేవాడు నా అనుగ్రహంతో, సనాతనమూ అక్షయమూ అయిన స్థానాన్ని (మోక్షాన్ని) పొందగలడు.