బుద్ధ్యా విశుద్ధయా యుక్తో ధృత్యాత్మానం నియమ్య చ ।
శబ్దాదీన్ విషయాంస్త్యక్త్వా రాగద్వేషౌ వ్యుదస్య చ ॥ 51
వివిక్తసేవీ లఘ్వాశీ యతవాక్కాయమానసః ।
ధ్యానయోగపరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః ॥ 52
అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహమ్ ।
విముచ్య నిర్మమః శాంతో బ్రహ్మభూయాయ కల్పతే ॥ 53
బుద్ధ్యా, విశుద్ధయా, యుక్తః, ధృత్యా, ఆత్మానమ్, నియమ్య, చ,
శబ్ద ఆదీన్, విషయాన్, త్యక్త్వా, రాగద్వేషౌ, వ్యుదస్య, చ.
వివిక్తసేవీ, లఘు ఆశీ, యత వాక్ కాయ మానసః,
ధ్యానయోగపరః, నిత్యమ్, వైరాగ్యమ్, సముపాశ్రితః.
అహంకారమ్, బలమ్, దర్పమ్, కామమ్, క్రోధమ్, పరిగ్రహమ్,
విముచ్య, నిర్మమః, శాంతః, బ్రహ్మభూయాయ, కల్పతే.
విశుద్ధయా బుద్ధ్యా = ఆత్మను బ్రహ్మంగా నిశ్చయించడం వల్ల సంశయ విపర్యయాలు లేని బుద్ధితో; యుక్తః = కూడి; ధృత్యా = ధైర్యం చేత; ఆత్మానమ్ = శరీరేంద్రియ సంఘాతాన్ని; నియమ్య = సంయతమొనర్చి; శబ్ద ఆదీన్ చ విషయాన్ = శబ్దాది విషయాలను; త్యక్త్వా = త్యజించి; రాగ ద్వేషౌ చ = శరీరధారణకు ఉపయోగపడే విషయాలలో ఆసక్తి, ద్వేషాలను కూడా; వ్యుదస్య = పరిత్యజించి.
వివిక్త సేవీ = నిర్జనస్థానవాసి; లఘు ఆశీ = మిత భోజి; యతవాక్ కాయ మానసః = మనోవాక్కాయాలను నియమించుకున్న వాడూ; నిత్యమ్ = ఎల్లప్పుడూ; ధ్యానయోగపరః = ధ్యానయోగ పరాయణుడూ; వైరాగ్యమ్ = (దృష్ట-అదృష్ట విషయ) వైరాగ్యాన్ని; సముపాశ్రితః = అవలంబించినవాడూ.
అహంకారమ్ = దేహేంద్రియాల యందు ఆత్మబుద్ధిని; బలమ్ = మొండిపట్టును; దర్పమ్ = యోగబలగర్వంతో కుమార్గాన్ని అనుసరించడమూ; (ప్రారబ్ధవశంతో లభించే విషయాలపై); కామమ్ = కోరికను; క్రోధమ్ = కోపాన్ని; పరిగ్రహమ్ = స్వీకరించడాన్ని; విముచ్య = వదలి; నిర్మమః = శరీర-జీవితాలపై మమత్వం లేకుండా; శాంతః = చిత్త విక్షేపరహితుడైన వ్యక్తి; బ్రహ్మభూయాయ = బ్రహ్మత్వం పొందడానికి; కల్పతే = సమర్థుడవుతాడు.
తా ॥ ఆత్మను బ్రహ్మమని నిశ్చయించుకోవడం వల్ల సంశయ విపర్యయాలు తొలగిన బుద్ధితో ధైర్యాన్ని అవలంబించి శరీరేంద్రియాలను వశమొనర్చుకొని, శరీరస్థితికి ప్రయోజనమైన వాటినిగాక మిగిలిన శబ్దాది విషయాలను అన్నిటిని పరిత్యజించి, శరీరస్థితికి ప్రయోజనమైన విషయాలలో రాగద్వేషాలను కూడా పరిత్యజించి-
తా ॥ నిర్జనస్థానవాసియూ, మితభోజియూ, త్రికరణాలను నియమించి నిత్యం* ధ్యానాన్ని* యోగాన్ని* అభ్యసిస్తూ, ఐహికాముష్మిక విషయాలన్నిటి యందూ వైరాగ్యాన్ని పూని, –
తా ॥ దేహేంద్రియాల యందు ఆత్మబుద్ధిని, మొండిపట్టును, యోగబల గర్వాన్ని, ప్రారబ్ధవశంతో లభించే విషయాలపై కోర్కెను, కోపాన్ని, పరిగ్రహాన్ని* వదలి, శరీరంపైనా జీవితంపైనా అభిమానం లేకుండా చిత్త ఉపరతిని పొందిన వాడు ఇహజీవనంలోనే బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి సమర్థుడు అవుతాడు.