స్వే స్వే కర్మణ్యభిరతః సంసిద్ధిం లభతే నరః ।
స్వకర్మనిరతః సిద్ధిం యథా విందతి తచ్ఛృణు ॥ 45
స్వే, స్వే, కర్మణి, అభిరతః, సంసిద్ధిమ్, లభతే, నరః,
స్వకర్మ నిరతః, సిద్ధిమ్, యథా, విందతి, తత్, శృణు.
స్వేస్వే = తన తన; కర్మణి = వర్ణానికి, ఆశ్రమానికి చెందిన కర్మలో; అభిరతః = నిరతుడైన; నరః = మనుష్యుడు; సంసిద్ధిమ్ = సిద్ధిని; లభతే = పొందుతాడు; స్వకర్మనిరతః = స్వీయకర్మలో తత్పరుడైన వాడు; యథా = ఏ రీతిగా; సిద్ధిమ్ = సిద్ధిని; విందతి = పొందుతాడో; తత్ = దానిని; శృణు = విను.
తా ॥ (ఈ కర్మల జ్ఞానహేతుత్వం చెప్పబడుతోంది 🙂 తమ తమ అధికారం విధించే కర్మలలో పరినిష్ఠితుడైన వాడు సిద్ధిని అంటే జ్ఞానయోగ్యతను పొందుతాడు. ఈ కర్మలు జ్ఞానప్రాప్తికరాలు; స్వకర్మ నిరతుడైన వాడు తత్త్వజ్ఞానాన్ని పొందే రీతిని విను.