న తదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః ।
సత్త్వం ప్రకృతిజైర్ముక్తం యదేభిః స్యాత్త్రిభిర్గుణైః ॥ 40
న, తత్, అస్తి, పృథివ్యామ్, వా, దివి, దేవేషు, వా, పునః,
సత్త్వమ్, ప్రకృతిజైః, ముక్తమ్, యత్, ఏభిః, స్యాత్, త్రిభిః, గుణైః.
పృథివ్యామ్ = భూలోకంలో గాని; దివి వా = స్వర్గంలో గాని; దేవేషు వా పునః = లేక దేవతలలో గాని; యత్ = ఏది; ఏభిః = ఈ; ప్రకృతిజైః = మాయాజాతాలైన; త్రిభిః గుణైః = బంధకారణాలైన త్రిగుణాల చేత; ముక్తమ్ స్యాత్ = విడివడిందో; తత్ సత్త్వమ్ = అటువంటి ప్రాణి; న అస్తి = లేదు.
తా ॥ (గుణభేదాన్ని అనుసరించి చాలా విషయాలు చెప్పబడ్డాయి; ఇక అనుక్త విషయాలను కూడా సంగ్రహంగా సూచించి, ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నాడు-) స్వర్గంలో గాని మర్త్యంలో గాని, ప్రకృతిజాతాలైన గుణాల నుండి విడివడిన ప్రాణి ఏదీ లేదు; దేవతలలో కూడా లేదు.