సుఖం త్విదానీం త్రివిధం శృణు మే భరతర్షభ ।
అభ్యాసాద్రమతే యత్ర దుఃఖాంతం చ నిగచ్ఛతి ॥ 36
సుఖమ్, తు, ఇదానీమ్, త్రివిధమ్, శృణు, మే, భరత ఋషభ,
అభ్యాసాత్, రమతే, యత్ర, దుఃఖ అన్తమ్, చ, నిగచ్ఛతి.
భరత ఋషభ = భరతశ్రేష్ఠా; తు = కాని; ఇదానీమ్ = ఇప్పుడు; త్రివిధమ్ = మూడు విధాలైన; సుఖమ్ = సుఖాలను; మే = నా ద్వారా; శృణు = విను; యత్ర = ఏ సుఖంలో; అభ్యాసాత్ = మళ్ళీ మళ్ళీ అనుశీలించడం వల్ల (మనుష్యుడు); రమతే = ప్రీతిని పొందుతాడో; చ = మరియూ; దుఃఖ అంతమ్ = దుఃఖ నాశాన్ని; నిగచ్ఛతి = పొందుతాడో;
తా ॥ అర్జునా! ఇక త్రివిధ సుఖాలను గురించి విను. ఏ సుఖంలో (విషయ సుఖం వలే వెనువెంటనే కాకుండా) దీర్ఘాభ్యాసం వల్ల క్రమంగా మనుష్యుడు ప్రీతిని పరితృప్తిని పొందుతాడో, సంసార దుఃఖం నుండి విడివడతాడో…
వ్యాఖ్య:-
‘అభ్యాసాత్’ – సాత్విక సుఖం లేదా దైవానందం (బ్రహ్మానందం) అనేది కేవలం ‘అభ్యాసం’ (Practice/Sadhana) వల్ల మాత్రమే మనిషికి దొరుకుతుంది. ఆధ్యాత్మిక విద్య అనేది కేవలం మాటల్లో చెప్పేది కాదు (వాచా జ్ఞానం కాదు). ఇది ఒక ‘అనుభవ విద్య’ (Practical Science). పుస్తకాల్లో చదివిన విషయాలను మనం ఆచరణలో పెట్టి, అనుభవంలో చూసుకోవాలి. అప్పుడే నిజమైన సుఖం దొరుకుతుంది. చాలామంది “మాకు దేవుడు ఎప్పుడు కనిపిస్తాడు? మా దుఃఖం ఎప్పుడు పోతుంది? సుఖం ఎలా వస్తుంది?” అని అడుగుతుంటారు. దానికి భగవంతుడి సమాధానం ఒక్కటే – “సాధన చేయండి, ఫలితం అదే వస్తుంది”. ప్రయత్నం చేయకుండా, సాధన చేయకుండా, కేవలం ఒడ్డున కూర్చుని కబుర్లు చెబితే పరమార్థం ఎప్పటికీ దొరకదు. పెరుగును కష్టపడి చిలికితేనే వెన్న బయటకు వస్తుంది. నువ్వులను గట్టిగా పిండితేనే నూనె వస్తుంది. చెరకు గడను నమిలితేనే దానిలోని తీపి తెలుస్తుంది (చూస్తే తెలియదు). అలాగే, కష్టపడి నిరంతరం ‘సాధన’ చేస్తేనే మనలోని దుఃఖం అంతమై, సుఖం బయటకు వస్తుంది.
‘దుఃఖాంతం చ నిగచ్ఛతి’ – ప్రపంచంలో చిన్న చీమ, దోమ దగ్గర నుండి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి వరకు.. అందరూ కోరుకునేది ఒక్కటే: “మాకు దుఃఖం పోవాలి, సుఖం కావాలి”. ప్రతి ప్రాణినీ వేధించే అతిపెద్ద సమస్య ఇదే. దుఃఖం ఎక్కడ అంతమవుతుంది? ప్రపంచంలో మనం ఎక్కడ వెతికినా దుఃఖం లేని చోటు దొరుకుతుందా? అంటే.. దొరకదు. బయట కనిపించే ఏ వస్తువులోనూ శాశ్వతమైన సుఖం లేదు. కాబట్టి బయట ప్రపంచంలో వెతికితే దుఃఖం పోదు. దుఃఖం పూర్తిగా అంతమయ్యేది ఒక్క చోట మాత్రమే.. అదే ‘ఆత్మ’ (లేదా దైవం). ఎప్పుడైతే మనిషి సాత్విక సుఖాన్ని (ఆత్మానందాన్ని) పొందుతాడో, అప్పుడే అతని దుఃఖం పూర్తిగా నశిస్తుంది. భగవంతుని ఈ మాటతో “దుఃఖాన్ని ఎలా పోగొట్టుకోవాలి?” అనే మన సమస్యకు పరిష్కారం దొరికింది. అదే “ఆత్మసుఖం కోసం ప్రయత్నించడమే అసలైన మందు”. మరి ఆ ఆత్మ సుఖం మనకెలా వస్తుంది? అంటే.. కేవలం ‘అభ్యాసం’ (Practice) వల్ల మాత్రమే. సాధన చతుష్టయం (వివేక, వైరాగ్యాది గుణాలు), అమానిత్వం (వినయం) వంటి మంచి గుణాలతో నిరంతరం సాధన చేస్తే.. జీవుడు కచ్చితంగా (నిగచ్ఛతి) ఆ దుఃఖం లేని స్థితిని పొందుతాడు.