అర్జున ఉవాచ :
సన్న్యాసస్య మహాబాహో
తత్త్వమిచ్ఛామి వేదితుమ్ ।
త్యాగస్య చ హృషీకేశ
పృథక్ కేశినిషూదన ॥
సన్న్యాసస్య, మహాబాహో, తత్త్వమ్, ఇచ్ఛామి, వేదితుమ్,
త్యాగస్య, చ, హృషీకేశ, పృథక్, కేశి నిషూదన.
మహాబాహో = శ్రీకృష్ణా; హృషీకేశ = హృషీ కేశా; కేశి నిషూదన = కేశి వినాశకా; సన్న్యాసస్య = సన్న్యాసం యొక్క; త్యాగస్య చ = త్యాగం యొక్క; తత్త్వమ్ = తత్త్వరూపమును; పృథక్ = వేరు వేరుగా; వేదితుమ్ = తెలుసుకోవలెనని; ఇచ్ఛామి =కోరుతున్నాను;
తా ॥ అర్జునుడు పలికెను: ఓ మహాబాహో! హృషీకేశా! కేశినిషూదనా! ‘సంన్యాసం’ యొక్క తత్త్వాన్ని మరియు ‘త్యాగం’ యొక్క తత్త్వాన్ని వేర్వేరుగా తెలుసుకోవాలని కోరుకుంటున్నాను.
వ్యాఖ్య:-
గీతలో ఇప్పటివరకూ శ్రీకృష్ణుడు చాలా సందర్భాలలో ‘సన్న్యాసం’, ‘త్యాగం’ అనే పదాలను వాడుతూ వచ్చాడు (ఉదాహరణకు శ్లోకాలు 3-30, 4-20, 4-41, 9-28, 12-6, 12-11, 12-12, 12-16, 1-25 మొదలైనవి). కానీ వాటి పూర్తి వివరాలను మాత్రం ఎక్కడా స్పష్టంగా వివరించలేదు. అందుకే అర్జునుడికి వాటి గురించి పూర్తిగా తెలుసుకోవాలన్న కోరిక కలిగి, కృష్ణుడిని ఇలా ప్రశ్నించాడు.
(ఉపనిషత్తులలో కూడా సన్న్యాసం, త్యాగం రెండూ మోక్షానికి మార్గాలని చెప్పబడ్డాయి. ఉదాహరణకు: “త్యాగం వల్లనే అమృతత్వాన్ని పొందారు” (త్యాగేనైకే అమృతత్వ మానశుః) అని, “సన్న్యాస యోగం ద్వారా శుద్ధ సత్త్వాన్ని పొందిన యతులు…” (సన్న్యాసయోగాద్యతయశ్శుద్ధసత్త్వాః ) అని అనేక వాక్యాలు ఉన్నాయి).
ఈ శ్లోకంలో అర్జునుడు శ్రీకృష్ణుడిని మూడు రకాల విశేషణాలతో స్తుతిస్తూ పిలిచాడు. ఇలా స్తుతించడం ద్వారా తన భక్తిని చాటుకున్నాడు. ఎంతో వినయంతో, పూర్తి భక్తిభావంతో ఇలా అడగడాన్నే ‘పరిప్రశ్న’ అంటారు. శిష్యుడు గురువు దగ్గర ఇంతటి శ్రద్ధాభక్తులతోనే మెలగాలి. అప్పుడే ఆ ప్రవర్తనకు సంతోషించిన గురువు, శిష్యుని మేలు కోరి జ్ఞానాన్ని దయచేస్తాడు.