సత్త్వానురూపా సర్వస్య శ్రద్ధా భవతి భారత ।
శ్రద్ధామయోఽయం పురుషో యో యచ్ఛ్రద్ధః స ఏవ సః ॥ 3
సత్త్వ అనురూపా, సర్వస్య, శ్రద్ధా, భవతి, భారత,
శ్రద్ధామయః, అయమ్, పురుషః, యః, యత్ శ్రద్ధః, సః, ఏవ, సః.
భారత = అర్జునా; సర్వస్య = ప్రతి మనుజుని; శ్రద్ధా = శ్రద్ధయు; సత్త్వ అనురూపా = విశిష్టసంస్కార యుక్తమైన అంతఃకరణానికి అనుగుణమై; భవతి = కలుగుతోంది; అయమ్ = ఈ; పురుషః = జీవుడు; శ్రద్ధామయః = శ్రద్ధాస్వరూపుడు; యః = ఎవడు; యత్ శ్రద్ధః = పూర్వజన్మలో ఎటువంటి శ్రద్ధ కలిగి ఉన్నాడో; సః = అతడు; సః ఏవ = ఇప్పుడు కూడా అటువంటి నిష్ఠనే గ్రహిస్తున్నాడు;
తా ॥ అర్జునా! మనుష్యులందరికీ వారివారి అంతఃకరణ సంస్కారాన్ని అనుసరించే శ్రద్ధ కలుగుతోంది. మనిషి శ్రద్ధామయుడు. పూర్వజన్మలో ఎవరికి ఎటువంటి శ్రద్ధ ఉందో, అతడు వర్తమాన జన్మలో కూడా అటువంటి స్వభావాన్నే (నిష్ఠనే) పరిగ్రహిస్తున్నాడు. (శ్రీమద్భాగవతమ్. 11-14-9 చూ.)