శ్రీభగవానువాచ :
త్రివిధా భవతి శ్రద్ధా దేహినాం సా స్వభావజా ।
సాత్త్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు ॥ 2
త్రివిధా, భవతి, శ్రద్ధా, దేహినామ్, సా, స్వభావజా,
సాత్త్వికీ, రాజసీ, చ, ఏవ, తామసీ, చ, ఇతి, తామ్, శృణు.
దేహినామ్ = మనుష్యులకు; సాత్త్వికీ = సత్త్వగుణ ప్రధానం; రాజసీ చ ఏవ = రజోగుణ ప్రధానం; తామసీ చ = తమోగుణ ప్రధానమూ; ఇతి = అని; త్రివిధా ఏవ = మూడు విధాలుగానే; శ్రద్ధా = శ్రద్ధ; భవతి = కలుగుతోంది; సా చ = ఆ శ్రద్ధ; స్వభావజా = పూర్వజన్మలో ధర్మ-అధర్మ సంస్కారాన్ని అనుసరించి ఉత్పన్నమవుతుంది; తామ్ = వాటిని గురించి; శృణు = విను.
తా ॥ శ్రీభగవానుడు పలికెను: [శాస్త్రతత్త్వజ్ఞులైన వారికి పరమేశ్వర విషయమూ, ఏకవిధమూ అయిన సాత్త్విక శ్రద్ధ కలుగుతోంది (2-41). కాని లోకాచారాన్ని అనుసరించి ప్రవర్తిల్లే-] మనుష్యులకు దేవపూజా విషయమైన సాత్త్విక శ్రద్ధయూ, యక్ష రాక్షస పూజాసంబంధమైన రాజసిక శ్రద్ధయూ, భూతప్రేత పూజావిషయమైన తామసిక శ్రద్ధయూ కలుగుతున్నాయి. ఈ శ్రద్ధలు మూడూ పూర్వజన్మ కృత్యాలైన ధర్మ-అధర్మాల సంస్కారాన్ని అనుసరించే కలుగుతాయి. ఈ విషయాన్ని విను.