అర్జున ఉవాచ :
యే శాస్త్రవిధిముత్సృజ్య యజన్తే శ్రద్ధయాన్వితాః ।
తేషాం నిష్ఠా తు కా కృష్ణ సత్త్వమాహో రజస్తమః ॥ 1
యే, శాస్త్ర విధిమ్, ఉత్సృజ్య, యజంతే, శ్రద్ధయా, అన్వితాః,
తేషామ్, నిష్ఠా, తు, కా, కృష్ణ, సత్త్వమ్, అహో, రజః, తమః.
కృష్ణ = శ్రీకృష్ణా; యే = ఎవరు; శాస్త్ర విధిమ్ = శృతిస్మృతుల విధానాన్ని; ఉత్సృజ్య = పరిత్యజించినవారై; తు = కాని; శ్రద్ధయా అన్వితాః = శ్రద్ధాయుక్తులై; యజంతే = దేవతలను అర్చిస్తున్నారో; తేషామ్ = వారి; నిష్ఠా = నిష్ఠ; కా = ఎట్టిది; సత్త్వమ్ = సత్త్వమా; రజః = రాజసికమా?; అహో = లేక; తమః = తామసికమా?;
తా ॥ [పూర్వాధ్యాయాంతంలో ‘శాస్త్రవిధిని ఉల్లంఘించి కామచారియైన వాడికి తత్త్వజ్ఞానాధికారం లేదు’ (16-23) అని చెప్పబడింది; కాని, యథేష్టాచారి కాక శ్రద్ధాయుక్తుడైన వాడికి అధికారం ఉన్నదో లేదో తెలుసుకో గోరుతూ-] అర్జునుడు ప్రశ్నించెను: కృష్ణా! శాస్త్రనిర్దిష్టాలైన విధినిషేధాలను కష్టతరాలని తలచి గాని, లేక ఔదాసీన్యాన్ని వహించి గాని, తెలుసుకోవాలని ప్రయత్నించకుండా, ఆస్తిక్య బుద్ధితో ప్రాచీనుల ఆచారాలను, పరంపరాగతాలైన వాటిని అనుసరిస్తూ దేవతాదులను అర్చించే వారి ప్రవృత్తి ఎటువంటిది? సాత్త్వికమా, రాజసికమా, లేక తామసికమా?