శ్రీభగవానువాచ :
అభయం సత్త్వసంశుద్ధిః జ్ఞానయోగవ్యవస్థితిః ।
దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవమ్ ॥ 1
అభయమ్, సత్త్వ సంశుద్ధిః, జ్ఞానయోగ వ్యవస్థితిః,
దానమ్, దమః, చ, యజ్ఞః, చ, స్వాధ్యాయః, తపః, ఆర్జవమ్.
అభయమ్ = భయం లేకుండుట; సత్త్వ సంశుద్ధిః = త్రికరణశుద్ధి; జ్ఞానయోగ వ్యవస్థితిః = జ్ఞాననిష్ఠ (యోగనిష్ఠ); దానమ్ = దానం; దమః చ = బాహ్యేంద్రియ సంయమం; యజ్ఞః చ = యజ్ఞం; స్వాధ్యాయః = బ్రహ్మయజ్ఞం; తపః = తపస్సు; ఆర్జవమ్ = ఋజుప్రవర్తనం (సరళత);
తా ॥ [పూర్వాధ్యాయాంతంలో దీనిని గ్రహించినవాడు, జ్ఞానియై ముక్తిని పొందుతాడు (15-20) అని చెప్పబడింది. మరి ఈ తత్త్వాన్ని ఎటువంటి వ్యక్తి గ్రహించగలడు? అనే సందేహం కలగడం సహజం. కనుక అధికారిని అనధికారిని నిర్ణయించడానికి, అధికారికి విశేషణములైన దైవీసంపదను వర్ణిస్తూ-] శ్రీ భగవానుడు పలికెను: భయరహితత్వం, భావశుద్ధి,* జ్ఞానయోగ నిష్ఠ,* దానం, బాహ్యేంద్రియ సంయమం, అధికారాన్ని అనుసరించి దర్శపూర్ణమాసాది యజ్ఞాలను ఆచరించడం, బ్రహ్మయజ్ఞం, తపస్సు, ఋజుప్రవర్తనం–