ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవ చ ।
క్షరస్సర్వాణి భూతాని కూటస్థోఽక్షర ఉచ్యతే ॥ 16
ద్వౌ, ఇమౌ, పురుషౌ, లోకే, క్షరః, చ, అక్షరః, ఏవ, చ,
క్షరః, సర్వాణి, భూతాని, కూటస్థః, అక్షరః, ఉచ్యతే.
క్షరః = క్షరుడు; అక్షరః చ = అక్షరుడు; ఇమౌ = అనే ఈ; ద్వౌ = ఇరువురు; పురుషౌ ఏవ చ = పురుషులే; లోకే = జగత్తున (ప్రసిద్ధులు); సర్వాణి భూతాని = సమస్తభూతాలనీ; అక్షరః = అవినాశియైన పురుషుడు; కూటస్థః = కూటరూపంలో, (మాయారూపంలో) స్థితుడు అని; ఉచ్యతే = చెప్పబడుతోంది.
తా ॥ (శ్లోక చతుష్టయంలో విశిష్టోపాధికృతమైన భగవద్విభూతి సంక్షేపంగా వర్ణించబడింది. ఇక, క్షర-అక్షరోపాధి విభాగమొనర్చి, తదతీతమైన నిరుపాధి స్వరూపం వ్యాఖ్యాతమవుతోంది:) ఈ జగత్తులో క్షర-అక్షరులనే పురుషులు ఇరువురు* ప్రసిద్ధులై ఉన్నారు. (బ్రహ్మాది స్థావరాంతములైన జడ శరీరాలు) వినాశశీలమైన రూపజాతమంతా కూడా క్షర-పురుషుడు. (నిర్వికారుడైన చేతన భోక్త) మాయా శక్తియే కూటస్థుడైన అక్షర-పురుషుడు.