సర్వస్య చాహం హృది సన్నివిష్టో
మత్తః స్మృతిర్ జ్ఞానమపోహనం చ ।
వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో
వేదాంతకృద్వేదవిదేవ చాహమ్ ॥ 15
సర్వస్య, చ, అహమ్, హృది, సన్నివిష్టః, మత్తః, స్మృతిః, జ్ఞానమ్, అపోహనమ్, చ,
వేదైః, చ, సర్వైః, అహమ్, ఏవ, వేద్యః, వేద అంతకృత్, వేదవిత్, ఏవ, చ, అహమ్.
అహమ్ = నేను; సర్వస్య చ = ఆబ్రహ్మస్తంబ పర్యంతం గల ప్రాణులందరి; హృది = హృదయంలో; సన్నివిష్టః = ప్రవిష్టుడను; మత్తః = నా నుండి; స్మృతిః = జ్ఞప్తి; జ్ఞానమ్ = జ్ఞానం; అపోహనమ్ చ = ఈ రెంటి విస్మృతి (కలుగుతున్నాయి); సర్వైః వేదైః చ = వేదాలు నాలిగింటితో; అహమ్ ఏవ = నేనే; వేద్యః = తెలుసుకోబడ దగినవాణ్ణి; వేద అంత కృత్ = వేదాంత సంప్రదాయ ప్రవర్తకుణ్ణి; వేద విత్ చ = వేదార్థవేత్తను కూడా; అహమ్ ఏవ = నేనే.
తా ॥ నేను ఆబ్రహ్మస్తంబ పర్యంతం గల ప్రాణుల హృదయాలలో (అంతర్యామి రూపంగా) ప్రకాశిస్తున్నాను, నా నుండే* (పూర్వానుభూతార్థ విషయాల) స్మృతి,* (విషయేంద్రియ సంయోగ జనితమైన) జ్ఞానం, వీటి విస్మృతి కూడా కలుగుతున్నాయి. వేద చతుష్టయం చేత (ఆయా దేవతా రూపాలలో) తెలియబడేది నేనే. వేదాంత సంప్రదాయ ప్రవర్తకుణ్ణైన జ్ఞానగురువును, వేదాంతవేత్తను కూడా నేనే అని గ్రహించు. (గీత : 13-17; కఠోపనిషత్తు 1-2-15 చూ 🙂