శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వరః ।
గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధానివాశయాత్ ॥ 8
శరీరమ్, యత్, అవాప్నోతి, యత్, చ, అపి, ఉత్క్రామతి, ఈశ్వరః,
గృహీత్వా, ఏతాని, సంయాతి, వాయుః, గంధాన్, ఇవ, ఆశయాత్.
ఈశ్వరః = దేహాది సంఘాతానికి స్వామి అంటే జీవుడు; యత్ = ఎప్పుడు; శరీరమ్ = దేహాన్ని; అవాప్నోతి = పొందుతున్నాడో; యత్ చ అపి = మరియు, ఎప్పుడు; ఉత్క్రామతి = త్యజిస్తాడో (అప్పుడు); వాయుః = వాయువు; ఆశయాత్ = ఆధారం నుండి (పుష్పాదులకోశం నుండి); గంధాన్ ఇవ = సుగంధాన్ని గ్రహించే విధంగా; ఏతాని = ఈ ఇంద్రియాలను; గృహీత్వా = గ్రహించి; సంయాతి = వెలువడుతున్నాడు;
తా ॥ (ఆకర్షించిన పిదప, ఏం చేస్తున్నాడు? – చెప్పబడుతోంది:) వాయువు పుష్పాదుల ఆధారకోశం నుండి గంధాన్ని సేకరించే విధంగా, జీవుడు కర్మవశాన శరీరాంతరమును పొందేటప్పుడు,* పూర్వశరీరం నుండి మనస్సును, ఇంద్రియాలను తన వెంట తీసుకుపోతున్నాడు.* అంటే, పూర్వదేహంలోని ఇంద్రియాదులే నూతన శరీరంలో ప్రవేశిస్తున్నాయి.