సత్త్వాత్ సంజాయతే జ్ఞానం రజసో లోభ ఏవ చ ।
ప్రమాదమోహౌ తమసో భవతోఽజ్ఞానమేవ చ ॥ 17
సత్త్వాత్, సంజాయతే, జ్ఞానమ్, రజసః, లోభః, ఏవ, చ,
ప్రమాదమోహౌ, తమసః, భవతః, అజ్ఞానమ్, ఏవ, చ.
సత్త్వాత్ = సత్త్వగుణం నుండి; జ్ఞానమ్ = జ్ఞానం; సంజాయతే = కలుగుతోంది; రజసః = రజోగుణం నుండి; లోభః ఏవ = లోభమే (కలుగును); తమసః చ = మరి, తమస్సు నుండి; అజ్ఞానమ్ = అవివేకం; ప్రమాద మోహౌ ఏవ చ = విస్మృతి, విమూఢత్వమూ; భవతః = కలుగుతున్నాయి.
తా ॥ (ఈ ఫలభేదానికి కారణం ఏమంటే-) సత్త్వగుణం నుండి జ్ఞానం కలుగుతోంది. (కనుక, సాత్విక కర్మ వల్ల ప్రకాశబహుళమైన సుఖం లభిస్తోంది) రజోగుణం నుండి లోభం కలుగుతోంది. (ఇది దుఃఖ హేతువవడం వల్ల, ఈ కర్మల ఫలం కూడా దుఃఖమే) తమస్సు నుండి అవివేకం, అనవధానత, విమూఢత్వం కలుగుతున్నాయి (కాబట్టి తామసిక కర్మలకు అంటే, అధర్మాచరణానికి ఫలం మోహం).