అప్రకాశోఽప్రవృత్తిశ్చ ప్రమాదో మోహ ఏవ చ ।
తమస్యేతాని జాయంతే వివృద్ధే కురునందన ॥ 13
అప్రకాశః, అప్రవృత్తిః, చ, ప్రమాదః, మోహః, ఏవ, చ,
తమసి, ఏతాని, జాయంతే, వివృద్ధే, కురునందన.
కురునందన = అర్జునా; అప్రకాశః = అవివేకం; అప్రవృత్తిః చ = ప్రయత్న శూన్యత; ప్రమాదః = కర్తవ్యాల పట్ల ఔదాసీన్యం; మోహః ఏవ చ = మూఢత్వం; ఏతాని = ఇవి; తమసి = తమోగుణం; వివృద్ధే = వృద్ధి చెందితే; జాయంతే = కలుగుతున్నాయి.
తా ॥ కురునందనా! అవివేకం, ప్రయత్న శూన్యత, కర్తవ్య–ఔదాసీన్యం, మిథ్యాభినివేశం (మూఢత్వం) – అనేవి తమోగుణం ప్రాధాన్యం పొందితే పుడుతు న్నాయి; ఇవి తమోవృద్ధి సూచకాలు అని గ్రహించు.
వ్యాఖ్య:-
తమోగుణం పెరిగినప్పుడు మనిషిలో మత్తు, సోమరితనం, అజాగ్రత్త, మందబుద్ధి వంటి లక్షణాలు కనిపిస్తాయి. వారి ఆహారం, మాట తీరు అన్నీ ఈ తమోగుణానికి తగ్గట్టే ఉంటాయి.
మామిడికాయ పూర్తిగా పక్వానికి రాకముందు వగరుగా ఉంటుంది కదా! ఆ స్థితిని తమోగుణంతో పోల్చవచ్చు. (వగరు -> పులుపు -> తీపి).
ఎప్పుడూ నిద్రపోయే కుంభకర్ణుడిని ఈ తమోగుణానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
ప్రతి ఒక్కరూ తమ మనస్సును తామే పరీక్షించుకోవాలి. మనలో ఏ గుణం ఉందో గమనించుకుని, సాధన ద్వారా పైస్థాయికి ఎదగాలి.
చెట్టు ఉదాహరణ – సాధన రహస్యం:
ఒక చెట్టు మొదట్లో మనం నీరు పోస్తూ ఉంటే ఏమవుతుంది?
- మొదట వగరుగా ఉన్న పిందె (తమస్సు), మెల్లగా పులుపుగా మారుతుంది (రజస్సు).
- ఆ పులుపు క్రమంగా తీపిగా మారుతుంది (సత్త్వం).
- చివరకు ఆ పండు పూర్తిగా పండి, చెట్టు నుండి రాలిపోతుంది (మోక్షం/జీవన్ముక్తి).
అలాగే, మనం నిరంతరం భగవంతుడి ధ్యానం చేయడం, ఆధ్యాత్మిక సాధన చేయడం అనే “నీరు” పోస్తూ ఉంటేనే జీవుడు పరిణామం చెందుతాడు. తమోగుణం, రజోగుణాల నుండి సత్త్వగుణానికి మారి, చివరికి గుణాలకు అతీతమైన స్థితిని (మోక్షాన్ని) చేరుకుంటాడు.