సర్వద్వారేషు దేహేఽస్మిన్ ప్రకాశ ఉపజాయతే ।
జ్ఞానం యదా తదా విద్యాత్ వివృద్ధం సత్త్వమిత్యుత ॥ 11
సర్వద్వారేషు, దేహే, అస్మిన్, ప్రకాశః, ఉపజాయతే,
జ్ఞానమ్, యదా, తదా, విద్యాత్, వివృద్ధమ్, సత్త్వమ్, ఇతి, ఉత.
యదా = ఎప్పుడు; అస్మిన్ = ఈ; దేహే = శరీరంలో; సర్వద్వారేషు = సమస్త ఇంద్రియ ద్వారాలలో వాటిని ప్రకాశింపజేయు; జ్ఞానమ్ = జ్ఞానరూపమైన (బుద్ధివృత్తిరూపమైన); ప్రకాశః = ప్రకాశం; ఉపజాయతే = పుడుతోందో; తదా ఉత = అప్పుడే; సత్త్వమ్ = సత్త్వగుణం; వివృద్ధం = వృద్ధి చెందింది; ఇతి = అని; విద్యాత్ = తెలిసికోవాలి.
తా ॥ (ఇక వృద్ధి చెందిన గుణాల చిహ్నాలు చెప్పబడుతున్నాయి) ఈ శరీరం ఆత్మకు భోగాయతనం; ఎప్పుడు ఈ శరీరద్వారాలైన శ్రోత్రాదుల యందు శబ్దాది జ్ఞానాత్మకమైన ప్రకాశం కలుగుతోందో, లేక ఆ శబ్దాదుల సుఖం పరిలక్షిత మవుతోందో, అప్పుడు సత్త్వగుణం వృద్ధి చెందింది అని గ్రహించాలి.