అనాదిత్వాన్నిర్గుణత్వాత్ పరమాత్మాయమవ్యయః ।
శరీరస్థోఽపి కౌంతేయ న కరోతి న లిప్యతే ॥
అనాదిత్వాత్, నిర్గుణత్వాత్, పరమాత్మా, అయమ్, అవ్యయః,
శరీరస్థః, అపి, కౌంతేయ, న, కరోతి, న, లిప్యతే.
కౌంతేయ = అర్జునా; అనాదిత్వాత్ = ఆదిరహితమైనందు వల్ల; నిర్గుణత్వాత్ = త్రిగుణ సంబంధ శూన్యమవడం వల్ల; అయం = ఈ; అవ్యయః = అక్షయమైన; పరమాత్మా = పరమాత్మ; శరీరస్థః అపి = శరీరంలో వెలయుచున్నప్పటికీ; న కరోతి = కర్తృత్వాన్ని పొందడు; న లిప్యతే = కర్మఫలంచే లిప్తుడు కాడు.
తా ॥ (సంసారస్థితిలో శరీర నిమిత్తములైన కర్మలు, కర్మఫలాలు, సుఖ దుఃఖాలు కలుగుతుండగా సమదర్శనం ఎలా, అంటావా?) అర్జునా! ఈ పరమాత్మ అనాది, ఉత్పత్తి రహితం, నిర్గుణం, గుణ సంగం లేనిది (ఉత్పత్తి ఉన్నా వినాశమూ, గుణ సంగం ఉన్నా గుణవ్యయమూ -ఇవి లేవు కనుక) అవ్యయం. అవికారియైన ఈ పరమాత్మ, శరీరంలో ప్రకాశిస్తున్నప్పటికీ, ఏమీ కూడా చేయడంలేదు. కాబట్టి, దానికి కర్మఫల సంగం కూడా లేదు. (కనుక, పరమాత్మే శరీర స్థితుడై మిథ్యయైన జీవభావాన్ని పొందాడు.)
వ్యాఖ్య:-
ప్రపంచంలోని అన్ని వస్తువులకు మొదలు, చివర ఉంటాయి. కానీ పరమాత్మ ఒక్కడికే ఆది, అంతం లేవు. అంతేకాక ఆయనకు (త్రి)గుణాలు గానీ, వాటివల్ల వచ్చే మార్పులు గానీ లేవు; ఆయన నాశనం లేనివాడు (అవ్యయుడు). నిజానికి ఆయన ఏ పనీ చేయడం లేదు. అంతా తానే అయి ఉన్నప్పుడు, ఇక ఎక్కడికైనా వెళ్లడం కానీ, రావడం కానీ, ఏదైనా చేయడం కానీ ఎలా కుదురుతుంది? ఆయన అసంగుడు—అంటే దేనినీ అంటుకోకుండా ఉంటాడు. నిద్ర లేచిన తర్వాత కలలోని వస్తువులు మనల్ని ఎలా అంటుకోలేవో, అలాగే శరీరంలో ఉన్నప్పటికీ ఆత్మ దేనికీ అంటుకోదు. శరీరం, మనస్సు, బుద్ధి మొదలైనవి ఎన్నో పనులు చేస్తున్నా, ఆత్మ మాత్రం సాక్షిగా, ఏ పనీ చేయకుండా (నిష్క్రియగా), దేనితో సంబంధం లేకుండా (అసంగంగా), తన సహజమైన ఆనంద స్థితిలో వెలుగుతూ ఉంటుంది.
‘శరీరస్థోఽపి’ (శరీరంలో ఉన్నప్పటికీ) అని చెప్పడం వల్ల, పరమాత్మ ఎక్కడో దూరంగా లేడు. మనందరికీ చాలా దగ్గరగా, మన శరీరాల్లోనే ఉన్నాడని స్పష్టమవుతోంది. కాబట్టి మన పక్కనే, హృదయమనే గుహలో దాగి ఉన్న ఆ దేవుణ్ణి తెలుసుకుని ధన్యులయ్యేందుకు అందరూ ప్రయత్నించాలి. శరీరాన్ని ఒక దేవాలయం లాగా, అందులో ఉన్న ఆత్మను దేవుని విగ్రహం (మూలవిరాట్టు) లాగా భావించాలి. ఎప్పుడూ పవిత్రమైన ఆలోచనలే కలిగి ఉండేలా, పాపం అంటుకోకుండా ఉండేలా చూసుకోవాలి.