సమశ్శత్రౌ చ మిత్రే చ తథా మానాపమానయోః ।
శీతోష్ణసుఖదుఃఖేషు సమస్సంగవివర్జితః ॥ 18
తుల్యనిందాస్తుతిర్మౌనీ సంతుష్టో యేన కేనచిత్ ।
అనికేతః స్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః ॥ 19
సమః, శత్రౌ, చ, మిత్రే, చ, తథా, మాన అపమానయోః,
శీత ఉష్ణ సుఖదుఃఖేషు, సమః, సంగ వివర్జితః.
తుల్య నిందా స్తుతిః, మౌనీ, సంతుష్టః, యేన, కేనచిత్,
అనికేతః, స్థిరమతిః, భక్తిమాన్, మే, ప్రియః, నరః.
శత్రౌ చ మిత్రే చ =శత్రుమిత్రుల పట్ల; సమః = సమభావం కలవాడూ; తథా = అదే విధంగా; మాన అపమానయోః = గౌరవపరాభవాల పట్ల; శీత ఉష్ణ సుఖ దుఃఖేషు = శీతోష్ణ సుఖ దుఃఖాల యెడనూ; సమః = సమంగా భావించేవాడూ; తుల్య నిందా స్తుతిః = ప్రశంసను, నిందను సమంగా గ్రహించేవాడూ; సంగ వివర్జితః = ఆసక్తిరహితుడూ; మౌనీ = వాక్సంయమం కలవాడూ; యేన కేనచిత్ = ఒకించుక ఏమి లభించినా; సంతుష్టః = తృప్తిచెందే వాడూ; అనికేతః = నిర్దిష్టమైన వాసస్థానం లేనివాడూ; స్థిర మతిః = నిశ్చల చిత్తుడూ; భక్తిమాన్ = భక్తియుక్తుడూ అయిన; నరః = నరుడు; మే = నాకు; ప్రియః = ఇష్టుడు.
తా ॥ శత్రుమిత్రులు, గౌరవపరాభవాలు, శీతోష్ణ సుఖదుఃఖాలు, నిందా స్తుతులు – వీటి యెడల సమదృష్టి కలిగి, లభించిన ఏ కొద్ది తోడనో పరితృప్తిని పొందుతూ* , మౌనియై, స్థిరనివాసం లేక, నిశ్చలచిత్తాన్నీ, భక్తినీ కలిగి ఉండే వ్యక్తి నాకు ప్రియమైనవాడు.