అథైతదప్యశక్తోఽసి కర్తుం మద్యోగమాశ్రితః ।
సర్వకర్మఫలత్యాగం తతః కురు యతాత్మవాన్ ॥ 11
అథ, ఏతత్, అపి, అశక్తః, అసి, కర్తుమ్, మద్ యోగమ్, ఆశ్రితః,
సర్వకర్మ ఫలత్యాగమ్, తతః, కురు, యత్ ఆత్మవాన్.
అథ = ఇక; ఏతత్ అపి = దీనిని కూడా; కర్తుమ్ = ఆచరించడానికి; అశక్తః = అసమర్ధుడవు; అసి = అయితే; తతః = మరి; యత ఆత్మవాన్ = సంయత చిత్తుడవై; మద్ యోగమ్ = నా శరణాగతిని; ఆశ్రితః = అవలంబించి; సర్వకర్మ ఫలత్యాగమ్ కురు = దృష్ట-అదృష్ట విషయ ఫలాలను, నిత్యకర్మల ఫలాలను త్యజించు.
తా ॥ (భగవద్ధర్మ నిష్ఠకు కూడా అత్యంత అసమర్థుడైన వానికి ఉపాయం చెప్పబడుతోంది-) ఈ విధంగా ఆచరించడానికి అసమర్థుడవైతే, నన్ను శరణు పొంది, చిత్తాన్ని నిగ్రహించి (“ఈశ్వరాజ్ఞా రూపమైన నిత్యనైమిత్తికాది కర్మలను అవశ్యం ఆచరించాలి, కాని ఫలాన్ని పరమేశ్వరార్పణ చేస్తున్నాను” అనే భావంతో) కర్మఫలాలను త్యజించు. (దానితో కృతార్థుడవు అవుతావు)