మత్కర్మకృన్ మత్పరమో మద్భక్తస్సంగవర్జితః ।
నిర్వైరస్సర్వభూతేషు యస్సమామేతి పాండవ ॥ 55
మత్ కర్మకృత్, మత్ పరమః, మద్భక్తః, సంగవర్జితః,
నిర్వైరః, సర్వ భూతేషు, యః, సః, మామ్, ఏతి, పాండవ.
పాండవ = అర్జునా; యః = ఎవడు; మత్ కర్మకృత్ = నా నిమిత్తం కర్మలను ఆచరిస్తాడో; మత్ పరమః = నేనే పరమగతిగా కలవాడో; సంగ వర్జితః = ధనమిత్రపుత్రాదులపై ఆసక్తి విడిచినవాడో; మత్ భక్తః = నన్నే భజించువాడో; సర్వభూతేషు = సర్వజీవులయెడ; నిర్వైరః = శత్రుభావం లేనివాడో; సః = అతడు; మామ్ = నన్ను; ఏతి = పొందుతాడు.
తా ॥ పాండవా! నా నిమిత్తం మాత్రమే కర్మలను ఆచరిస్తూ, నన్నే పరమ పురుషార్థంగా తలుస్తూ, ధన మిత్ర పుత్రాదుల యందు ఆసక్తి లేక, నన్నే ఆశ్రయించుకుని, సర్వజీవుల యెడల (తనకు అత్యంత అపకారం ఒనర్చేవారి యెడ కూడా) వైరభావం లేనివాడు మాత్రమే నన్ను పొందగలడు. (శ్రీమద్భాగవతమ్ 11-14-16 చూ.)