న వేదయజ్ఞాధ్యయనైర్న దానైః
న చ క్రియాభిర్న తపోభిరుగ్రైః ।
ఏవంరూపః శక్య అహం నృలోకే
ద్రష్టుం త్వదన్యేన కురుప్రవీర ॥ 48
న, వేదయజ్ఞ, అధ్యయనైః, న, దానైః, న, చ, క్రియాభిః, న, తపోభిః, ఉగ్రైః,
ఏవమ్, రూపః, శక్యః, అహమ్, నృలోకే, ద్రష్టుమ్, త్వత్, అన్యేన, కురుప్రవీర.
కురు ప్రవీర = కురుశ్రేష్ఠా; అహమ్ = నేను; నృలోకే = మనుష్య లోకంలో; త్వత్ అన్యేన = నీ కంటే అన్యులైనవారిచే; ఏవంరూపః = ఈ రూపంలో; ద్రష్టుమ్ = చూడ; న శక్యః = సాధ్యుణ్ణి కాను; వేద యజ్ఞ అధ్యయనైః = వేదాలను, యజ్ఞ విద్యలను అభ్యసించుటచే; న చ క్రియాభిః = అగ్నిహోత్రాది క్రియలచే (సాధ్యుణ్ణి కాలేదు); న దానైః = దానాలచేత కూడా (సాధ్యుణ్ణి కాలేదు); న ఉగ్రైః తపోభిః = చాంద్రాయణాది కృచ్ఛవ్రతాలచేత కూడా (సాధ్యుణ్ణి కాలేదు, నీవు ఒక్కడివే నా ప్రసాదంతో గాంచి ధన్యుడవైనావు).
తా ॥ కురుశ్రేష్ఠా! వేదాలను, యజ్ఞవిద్యలను అధ్యయనం చేసినవారు ఈ విశ్వరూపాన్ని చూడలేదు. అగ్నిహోత్రాది శ్రౌతకర్మలను, తులాపురుషాది దానాలను, చాంద్రాయణాది కఠిన తపాలను ఆచరించినవారికి కూడా ఈ దర్శనం లభించలేదు; నీవు ఒక్కడవే నా అనుగ్రహంతో దర్శించి, ధన్యుడవయ్యావు.
వ్యాఖ్య:-
శ్రీకృష్ణుడు ఇక్కడ “వేదాలు చదవడం వల్ల, యజ్ఞాలు చేయడం వల్ల, దానాల వల్ల నన్ను (నా విశ్వరూపాన్ని) చూడలేరు” అని చెప్పాడు. అయితే, దీని అర్థం ఆ పనులన్నీ (వేదాధ్యయనం, యజ్ఞాలు) పూర్తిగా నిరుపయోగం లేదా వృథా అని కాదు. దీని అసలు ఉద్దేశ్యం ఏమిటంటే ఆ మంచి పనులకు ‘భక్తి’ తోడవకపోతే అవి గొప్ప ఫలితాన్ని ఇవ్వలేవు. కేవలం యాంత్రికంగా పూజలు, యజ్ఞాలు చేస్తే సరిపోదు; అందులో దేవుడిపై ప్రేమ (భక్తి) ఉండాలి. రైతు పొలంలో ఎంత కష్టపడి దున్నినా, విత్తనాలు వేసినా, ఎరువులు వేసినా… చివరగా ‘నీరు’ లేకపోతే పంటలు ఎలాగైతే పండవో…అలాగే… మనం ఎన్ని పూజలు, జపాలు చేసినా, అందులో ‘భక్తి’ అనే నీరు లేకపోతే భగవంతుని దర్శనం అనే ‘పంట’ చేతికి రాదు. (అంటే… సాధనలకు ప్రాణం భక్తి మాత్రమే).