తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయం
ప్రసాదయే త్వామహమీశమీడ్యమ్ ।
పితేవ పుత్రస్య సఖేవ సఖ్యుః
ప్రియః ప్రియాయార్హసి దేవ సోఢుమ్ ॥ 44
తస్మాత్, ప్రణమ్య, ప్రణిధాయ, కాయమ్, ప్రసాదయే, త్వామ్, అహమ్, ఈశమ్, ఈడ్యమ్,
పితా, ఇవ, పుత్రస్య, సఖా, ఇవ, సఖ్యుః, ప్రియః, ప్రియాయాః, అర్హసి, దేవ, సోఢుమ్.
దేవ = దేవా; తస్మాత్ = కనుక; అహమ్ = నేను; కాయం = శరీరాన్ని; ప్రణిధాయ = వంచి; ప్రణమ్య = నమస్కరించి (దండప్రణామమొనర్చియనుట); ఈడ్యమ్ = వందనీయుడవూ; ఈశమ్ = ఈశ్వరుడవు అయిన; త్వామ్ = నిన్ను; ప్రసాదయే = ప్రసన్నం చేసుకున్నాను (అనుగ్రహింప వేడుకున్నాను); పుత్రస్య = పుత్రుని; పితా ఇవ = తండ్రి వలే; సఖ్యుః = సఖుని; సఖా ఇవ = స్నేహితుని వలే; ప్రియాయాః = ప్రేయసిని; ప్రియః ఇవ = ప్రియుని వలే (నా అపరాధాన్ని); సోఢుమ్ = సహింప (క్షమింప); అర్హసి = తగుదువు.
తా ॥ దేవా! కనుక, నీకు సాష్టాంగ ప్రణామం చేస్తున్నాను; పూజ్యుడమా, ఈశ్వరుడమా అయిన నిన్ను అనుగ్రహించమని వేడుతున్నాను. తండ్రి కొడుకు యొక్క, స్నేహితుడు స్నేహితుని యొక్క, ప్రియుడు ప్రేయసి యొక్క దోషాలను సహించే విధంగా నీవు నా అపరాధాన్ని క్షమించు.
వ్యాఖ్య:-
‘ప్రణిధాయ కాయమ్’ – పెద్దలకు ఎలా నమస్కరించాలో ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పబడింది. శరీరాన్ని పూర్తిగా నేలమీద వాల్చి, భక్తితో పెద్దలకు పాదాభివందనం చేయాలి. అర్జునుడి ద్వారా లోకానికి ఈ పద్ధతిని చూపించారు. ఇలా నేలమీద పడి నమస్కరించడం వల్ల… మనిషిలో ఉన్న అహంకారం, గర్వం, దర్పం అన్నీ చచ్చిపోతాయి. అందుకే హిందూ సాంప్రదాయంలో ఈ పద్ధతిని పెట్టారు. ఇలా వినయంగా నమస్కరించినప్పుడే పెద్దల అనుగ్రహం లభిస్తుంది. అర్జునుడు ఇలాగే చేసి శ్రీకృష్ణుడి అనుగ్రహాన్ని పొందాడు. విశ్వామిత్రుడు కూడా ఇలాగే వసిష్ఠ మహర్షికి పాదాభివందనం చేసి, ఆయన దయతోనే ‘బ్రహ్మర్షి’ అనే బిరుదును పొందగలిగాడు. అయితే, కేవలం శరీరంతో నమస్కరిస్తే సరిపోదు. మనసులోనూ, మాటలోనూ కూడా అదే వినయం ఉండాలి. అప్పుడే మనసా, వాచా, కర్మణా (త్రికరణ శుద్ధిగా) దేవుడిని లేదా పెద్దలను సేవించినట్లు అవుతుంది.
తన తప్పులను క్షమించమని అర్జునుడు వినయంతో భగవంతుడిని ప్రార్థించాడు. స్వచ్ఛమైన భక్తితో చేసే ప్రార్థనలను భగవంతుడు తప్పక మన్నిస్తాడు.