సఖేతి మత్వా ప్రసభం యదుక్తం
హే కృష్ణ! హే యాదవ! హే సఖేతి ।
అజానతా మహిమానం తవేదం
మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి ॥ 41
యచ్చావహాసార్థమసత్కృతోఽసి
విహారశయ్యాసనభోజనేషు ।
ఏకోఽథవాప్యచ్యుత తత్సమక్షం
తత్ క్షామయే త్వామహమప్రమేయమ్ ॥ 42
సఖా, ఇతి, మత్వా, ప్రసభమ్, యత్, ఉక్తమ్, హేకృష్ణ, హేయాదవ, హేసఖా, ఇతి,
అజానతా, మహిమానమ్, తవ, ఇదమ్, మయా, ప్రమాదాత్, ప్రణయేన, వా, అపి.
యత్, చ, అపహాస అర్థమ్, అసత్కృతః, అసి, విహార శయ్య ఆసన భోజనేషు,
ఏకః, అథవా, అపి, అచ్యుత, తత్ సమక్షమ్, తత్, క్షామయే, త్వామ్, అహమ్, అప్రమేయమ్.
తవ = నీ; మహిమానమ్ = మాహాత్మ్యాన్ని; ఇదమ్ = ఈ విశ్వరూపాన్ని; అజానతా = ఎరుగని; మయా = నాచే; ప్రమాదాత్ = చిత్త చాంచల్యంతో గాని; ప్రణయేన వా అపి = స్నేహాధిక్యంతో గాని; సఖా = స్నేహితుడవు; ఇతి = అని; మత్వా = భావించి; హే కృష్ణ = ఓ కృష్ణా; హే యాదవ = ఓ యాదవా, హే సఖా = ఓ సఖా; ఇతి = అని; ప్రసభమ్ = తిరస్కారపూర్వకంగా; యత్ = ఏమి; ఉక్తమ్ = వచింపబడినదో; అచ్యుత = అచ్యుతా; విహార శయ్య ఆసన భోజనేషు = విహరిస్తున్నప్పుడూ, కూర్చున్నప్పుడూ, పరుండునప్పుడూ, భుజించునప్పుడూ – ఈ సమయాలలో; అథవా = లేక; ఏకః = ఒంటరిగా ఉన్నప్పుడు; తత్ సమక్షం = ఇతరుల ఎదుట; అవహాస అర్థమ్ = పరిహాసార్థంగా; యత్ = ఏ రీతిగా; అసత్కృతః = అసమ్మానితుడవు; అసి = అయ్యావో; అహమ్ = నేను; అప్రమేయమ్ = ప్రమాణాతీతుడవైన; త్వామ్ = నిన్ను; తత్ = దాని కొరకు; క్షామయే = క్షమింప ప్రార్థిస్తున్నాను;
తా ॥ విశ్వరూపుడవైన నీ మహిమను గుర్తింపజాలక, నిన్ను సఖుడవని ఎంచి పొరపాటున గాని, చనువుచే గాని, కృష్ణా! యాదవా! సఖా! అని వినయరహితంగా దేనిని వచించి ఉన్నానో; మరియు అచ్యుతా! విహార, శయన, ఆసన కాలాలలో గాని, నీ ఎదుట గాని వెనుక గాని, నీవు ఒక్కడవే ఉన్నప్పుడు గాని, లేక ఇతరులతో ఉన్నప్పుడు గాని, పరిహాసార్థం నీకు చేసిన అమర్యాదకు అప్రమేయుడవైన నీ వద్ద క్షమాప్రార్థన కోరుతున్నాను.