అర్జున ఉవాచ :
పశ్యామి దేవాంస్తవ దేవ దేహే
సర్వాంస్తథా భూతవిశేషసంఘాన్ ।
బ్రహ్మాణమీశం కమలాసనస్థం
ఋషీంశ్చ సర్వానురగాంశ్చ దివ్యాన్ ॥ 15
పశ్యామి, దేవాన్, తవ, దేవ, దేహే, సర్వాన్, తథా, భూతవిశేష సంఘాన్,
బ్రహ్మాణమ్, ఈశమ్, కమల ఆసనస్థమ్, ఋషీన్, చ, సర్వాన్, ఉరగాన్, చ, దివ్యాన్.
దేవ = జ్యోతిస్స్వరూపా; తవ = నీ; దేహే = విశ్వరూపంలో; దేవాన్ = దేవతలను; సర్వాన్ = అందరిని; తథా = మఱియు; భూత విశేష సంఘాన్ = స్థావర జంగమమైన భూతసమూహాలను; దివ్యాన్ ఋషీన్ = దివ్యులైన వసిష్ఠాది ఋషులను; సర్వాన్ ఉరగాన్ చ = తక్షకాదులైన సర్పాలనన్నిటిని; కమల ఆసనస్థం చ = పృథివీ పద్మకర్ణిక అనదగిన మేరువున లేక, నీ నాభిపద్మంలో వెలయు; ఈశమ్ = సృష్టికర్తయైన; బ్రహ్మాణమ్ = బ్రహ్మను; పశ్యామి = చూస్తున్నాను.
తా ॥ అర్జునుడు పలికెను: దేవా! ఈ నీ విశ్వరూపంలో దేవతలనందరినీ, చరాచర జగత్తును, వసిష్ఠాది ఋషులను, తక్షకాది సర్ప సమూహాన్నీ, పృథివీ పద్మకర్ణిక అనదగిన మేరువుపై (లేక, నీ నాభిపద్మంలో) ఆసీనుడై ఉన్న సృష్టి కర్త అయిన బ్రహ్మను గాంచుతున్నాను.