సంజయ ఉవాచ :
ఏవముక్త్వా తతో రాజన్
మహాయోగేశ్వరో హరిః ।
దర్శయామాస పార్థాయ
పరమం రూపమైశ్వరమ్ ॥
ఏవమ్, ఉక్త్వా, తతః, రాజన్, మహాయోగ ఈశ్వరః, హరిః,
దర్శయామాస, పార్థాయ, పరమమ్, రూపమ్, ఐశ్వరమ్.
సంజయః = సంజయుడు; ఉవాచ = పలికెను; రాజన్ = ధృతరాష్ట్రా; మహాయోగఈశ్వరః =మహాయోగేశ్వరుడైన; హరిః = నారాయణుడు; ఏవమ్ = ఈ రీతిగా; ఉక్త్వా = పలికి; తతః = అనంతరం; పార్థాయ = అర్జునునికి; ఐశ్వరమ్ = ఈశ్వరసంబంధమైన; పరమం రూపమ్ = విశ్వరూపాన్ని; దర్శయామాస = దర్శింపచేసెను.
తా ॥ సంజయుడు పలికెను: ఓ రాజా! మహాయోగేశ్వరుడైన ఆ శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్పి, అర్జునుడికి తన అత్యున్నతమైన, దివ్యమైన ఐశ్వర రూపాన్ని చూపించాడు.
వ్యాఖ్య:-
శ్రీ వేదవ్యాస మహర్షి అనుగ్రహం (దివ్యదృష్టి) వల్ల సంజయుడికి యుద్ధభూమిలో జరిగే ప్రతి విషయాన్ని తెలుసుకునే శక్తి లభించింది. ఆ శక్తి వల్లే… ఇప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి చూపిస్తున్న ‘విశ్వరూపాన్ని’ చూసే అదృష్టం (భాగ్యం) సంజయుడికి కూడా కలిగింది. అలా తాను చూసిన ఆ అద్భుతమైన విశేషాలన్నింటినీ ఇప్పుడు ధృతరాష్ట్రునికి వివరిస్తున్నాడు.