ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మి కామధుక్ ।
ప్రజనశ్చాస్మి కందర్పః సర్పాణామస్మి వాసుకిః ॥ 28
ఆయుధానామ్, అహమ్, వజ్రమ్, ధేనూనామ్, అస్మి, కామధుక్,
ప్రజనః, చ, అస్మి, కందర్పః, సర్పాణామ్, అస్మి, వాసుకిః.
ఆయుధానామ్ = ఆయుధాలలో; అహం = నేను; వజ్రం = (దధీచి వెన్నెముక వల్ల కలిగిన) వజ్రాయుధాన్ని; ధేనూనామ్ = గోవులలో; కామధుక్ = కామధేనువును; అస్మి = అయి ఉన్నాను (నేను); ప్రజనః = సంతానోత్పాదకుడైన; కందర్పః చ = మన్మథుడను కూడా; అస్మి = అయి ఉన్నాను; సర్పాణామ్ వాసుకిః = సర్పాలలో వాసుకి; అస్మి = అయి ఉన్నాను;
తా ॥ ఆయుధాలలో (దధీచి* వెన్నెముక వలన కలిగిన) వజ్రాయుధాన్ని నేను, గోవులలో కామధేనువును; సంతానోత్పాదకుడైన మన్మథుణ్ణి కూడా నేను (కాని, కేవలం సంభోగమాత్ర ప్రధానమైన కామం అశాస్త్రీయమవడం వల్ల, నా విభూతి కాదు.* ) సర్పాలలో వాటికి అధిపతియైన వాసుకి కూడా నేనే.