అశ్వత్థః సర్వవృక్షాణాం దేవర్షీణాం చ నారదః ।
గంధర్వాణాం చిత్రరథః సిద్ధానాం కపిలో మునిః ॥ 26
అశ్వత్థః, సర్వవృక్షాణామ్, దేవర్షీణామ్, చ, నారదః,
గంధర్వాణామ్, చిత్రరథః, సిద్ధానాం, కపిలః, మునిః.
సర్వవృక్షాణామ్ = వృక్షములన్నింట; అశ్వత్థః = అశ్వత్థమును (రావిచెట్టును); దేవర్షీణాం చ = దేవర్షులలో; నారదః = నారదుణ్ణి; గంధర్వాణామ్ = గంధర్వులలో; చిత్రరథః = చిత్రరథుడను; సిద్ధానాం = సిద్ధులలో; కపిలః మునిః = కపిల మునిని.
తా ॥ నేను వృక్షాలలో అశ్వత్థమును , దేవర్షులలో నారదుణ్ణి , గంధర్వులలో చిత్రరథుణ్ణి , సిద్ధులలో కపిలుణ్ణి అయి ఉన్నాను.
వ్యాఖ్య:-
“అశ్వత్థః సర్వవృక్షాణామ్” – చెట్లన్నిటిలోకెల్లా రావిచెట్టు (అశ్వత్థ వృక్షం) చాలా గొప్పది, పవిత్రమైనది. పురాణాల్లో ఈ చెట్టు గొప్పతనం గురించి చాలా వివరంగా చెప్పారు. చెట్లన్నిటిలో రావిచెట్టును నేనే అని సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పడం వల్ల, ఆ చెట్టు దేవుడికి నిలయమని స్పష్టంగా తెలుస్తోంది. అందుకే ప్రజలు ఆ చెట్టుకు పూజలు, ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. కేవలం ఆధ్యాత్మికంగానే కాదు, ఆరోగ్యపరంగా (ఔషధాల పరంగా) చూసినా రావిచెట్టుకు చాలా ప్రాముఖ్యత ఉంది.