ఆదిత్యానామహం విష్ణుః జ్యోతిషాం రవిరంశుమాన్ ।
మరీచిర్మరుతామస్మి నక్షత్రాణామహం శశీ ॥ 21
ఆదిత్యానామ్, అహమ్, విష్ణుః, జ్యోతిషామ్, రవిః, అంశుమాన్,
మరీచిః, మరుతామ్, అస్మి, నక్షత్రాణామ్, అహమ్, శశీ.
అహమ్ = నేను; ఆదిత్యానామ్ = ద్వాదశాదిత్యులలో; విష్ణుః = విష్ణువనే ఆదిత్యుణ్ణి; జ్యోతిషామ్ = ప్రకాశాన్ని ఒసగే వానిలో; అంశుమాన్ = కిరణాలు గల; రవిః = సూర్యుణ్ణి; మరుతామ్ = మరుద్గణ సప్తకంలో; మరీచిః = ఆవహనాముడనైన మరీచిని; అస్మి = అయి ఉన్నాను; నక్షత్రాణామ్ = నక్షత్రములలో; అహమ్ = నేను; శశీ = చంద్రుణ్ణి.
తా ॥ నేను ద్వాదశాదిత్యులలో* విష్ణువనే ఆదిత్యుణ్ణి, జ్యోతులలో విశ్వవ్యాపి రశ్మియుక్తుడైన సూర్యుణ్ణి, మరుద్గణ సప్తకం* లో ఆవహనాముడనైన మరీచిని; నక్షత్రాలలో చంద్రుణ్ణి నేనే.
వ్యాఖ్య:-
‘ఆదిత్యులు’ – అదితికుమారులు పండ్రెండుగురు – వీరినే ద్వాదశాదిత్యులందురు. వారు (1) ధాత (2) మిత్రుడు (3) అర్యముడు (4) శక్రుడు (5) వరుణుడు (6) అంశువు (7) భగుడు (8) వివస్వంతుడు (9) పూష (10) సవిత (11) త్వష్ట (12) విష్ణువు అను పేర్లు గలిగియున్నారు.
‘మరుత్తులు’ ఏడుగురు. వారు క్రమముగ (1) ఆవహుడు (2) ప్రవహుడు (3) నివహుడు (4) పరాహుడు (5) ఉద్వహుడు (6) సంవహుడు (7) పరివహుడు (మరీచి) – అనుపేర్లు గలిగియున్నారు.
“ఆదిత్యులలో నేను విష్ణువును” అని చెప్పడంలో అసలు అర్థం ఏమిటంటే… ఆదిత్యులందరిలోకెల్లా ‘విష్ణువు’ అనే ఆదిత్యుడిలో, మిగతా వారిలో కంటే నా శక్తి (దైవత్వం) చాలా ఎక్కువగా, ప్రత్యేకంగా కనిపిస్తుంది అని అర్థం. మిగిలిన వాక్యాలన్నింటినీ (కృష్ణుడు చెప్పిన మిగతా ఉదాహరణలను) కూడా ఇదే పద్ధతిలో అర్థం చేసుకోవాలి.