శ్రీ భగవానువాచ :
హంత తే కథయిష్యామి దివ్యా హ్యాత్మవిభూతయః ।
ప్రాధాన్యతః కురుశ్రేష్ఠ నాస్త్యంతో విస్తరస్య మే ॥ 19
హంత, తే, కథయిష్యామి, దివ్యాః, హి, ఆత్మ విభూతయః,
ప్రాధాన్యతః, కురుశ్రేష్ఠ, న, అస్తి, అంతః, విస్తరస్య, మే.
హంత = అహో(అట్లయిన); కురుశ్రేష్ఠ = అర్జునా; దివ్యాః = అలౌకికాలైన; ఆత్మవిభూతయః = మదీయములూ, ధ్యానావలంబనములూ అయిన వస్తువులను; ప్రాధాన్యతః = యోగ్యతననుసరించి; తే = నీకు; కథయిష్యామి = చెబుతాను; హి = ఏమన; మే = నా; విస్తరస్య = అవాంతర విభూతులకు; అంతః = తుది; న అస్తి = లేదు.
తా ॥ శ్రీభగవానుడు పలికెను: కురుశ్రేష్ఠా! అట్లయితే అత్యంత ముఖ్యములూ, మదీయాలూ, దివ్యాలూ, ధ్యానావలంబన యోగ్యాలూ అయిన వస్తుసమూహాలను నీకు చెబుతాను; నా అవాంతర విభూతులకు అంతం లేదు. (కనుక, ప్రధానమైన వాటిని కొన్నింటిని వర్ణిస్తాను.)
వ్యాఖ్య:–
భగవంతుడు అనంతుడు (అంటే ఆయనకు అంతం లేదు). కాబట్టి ఆయన మహిమలు (విభూతులు) కూడా అనంతమైనవే; వాటికి కూడా హద్దులు లేవు. అందువల్ల, అన్నింటినీ చెప్పడం సాధ్యం కాదు కాబట్టి… భగవంతుడు కేవలం ముఖ్యమైన మహిమలను మాత్రమే వివరించి చెప్పడానికి సిద్ధపడ్డారు.
శ్రీరామకృష్ణులు: ఉపాధి జ్ఞానం ఉన్నంత వరకు ఈతడు కేశవ్, ఈతడు ప్రసన్నుడు, ఈతడు అమృతుడు అని నానా విషయాల గురించిన ఎరుక ఉంటుంది. పూర్ణజ్ఞానం కలిగినప్పుడు సమస్తమూ ఒకే చైతన్యం అనే ఎరుక కలుగుతుంది. అంతేకాదు, ఆ స్థితిలో చైతన్యం ఒక్కటే ఈ జీవజగత్తులుగాను, ఇరవై నాలుగు తత్త్వాలుగాను అయివున్నట్లు దర్శిస్తాడు.
“కాని శక్తి అభివ్యక్తీకరణలో తారతమ్యాలు ఉంటాయి. సమస్తమూ ఆయనే అయివున్నాడన్న మాట నిజమే, అయితే కొన్నిచోట్ల శక్తి అధికంగా అభివ్యక్తం అవుతూ ఉంది, కొన్నిచోట్ల తక్కువగా అభివ్యక్తం అవుతోంది.
“విద్యాసాగర్ ఒకసారి నాతో, ‘అలా అయితే భగవంతుడు కొందరికి అధిక శక్తిని, కొందరికి తక్కువ శక్తిని ఇచ్చి ఉన్నాడా?’ అని అడిగాడు. అందుకు నేను ‘అవును. అలా కాకుంటే ఒక్కడే యాభై మందిని ఓడించగలుగుతున్నాడే! అదెలా సాధ్యం! పైగా, మిమ్మల్ని దర్శించే నిమిత్తం మేం రావటానికి ఏమిటి కారణం?’ అని అన్నాను.
“భగవంతుడి లీలలు ఎవరి ద్వారా అభివ్యక్తం అవుతాయో ఆతడిలో విశేష శక్తి కానవస్తుంది. జమీందారు తన జమీలో అన్ని చోట్లకు పోతూ ఉంటాడు; కాని కచ్చేరి చావడికి మాత్రం ప్రతిరోజూ వచ్చి చాలసేపు కూర్చుంటాడు. భక్తుడే భగవంతుడి కచ్చేరి చావడి. భక్తుడి హృదయంలో తన లీలలు ప్రదర్శింప భగవంతుడు ఇష్టపడతాడు. భక్తుడి హృదయంలోనే ఆయన విశేష శక్తి అభివ్యక్తమవుతుంది. అటువంటి భక్తుడి లక్షణాలు ఏమిటి? మహాకార్యాలు నిర్వర్తింపబడే చోట్ల భగవంతుడి విశేషశక్తి అభివ్యక్తీకరణ ఉంటుంది.
“ఈ ఆద్యాశక్తీ, పరబ్రహ్మమూ అభిన్నాలు. ఒకదాన్ని వదిలి మరొకదాన్ని ఊహించనైనా లేము. మాణిక్యం, దాని ప్రకాశం మాదిరి. మాణిక్యాన్ని వదలి దాని ప్రకాశాన్ని మాత్రం ఊహించుకోవటం అసాధ్యం. అదే విధంగా ప్రకాశాన్ని విడిచి మాణిక్యాన్ని మాత్రం ఊహించుకోవటమూ సాధ్యం కాదు. అలాగే, పామూ, దాని తిర్యక్గతి (మెలికలు తిరిగే కదలిక). పామును విడిచి, తిర్యక్గతిని ఊహించగలమా? తిర్యక్ గతిని వదలి పామును ఊహించటమూ సాధ్యం కాదు.
“ఆద్యాశక్తియే ఈ జీవజగత్తులుగాను, ఇరవై నాలుగు తత్త్వాలుగాను అయి ఉంది. అనులోమం, విలోమం. (ఆద్యాశక్తి క్రమక్రమంగా స్థూలమైన జీవజగత్తులుగా, తత్త్వాలుగా అవటం అనులోమం. ఈ స్థూల వ్యక్తీకరణలు మళ్ళీ ఆద్యాశక్తిలో ఒదిగిపోవటం విలోమం.)
“రాఖాల్, నరేంద్రుడు మొదలైన యువకులకై నేను ఎందుకు ఇంతగా ఆరాటపడుతున్నాను? ‘వీళ్ల కోసం ఇంతగా ఆరాటపడుతూ ఉంటే ఇక భగవచ్చింతన ఎప్పుడు చేస్తారు?’ అని హాజ్రా నన్ను అడిగాడు. (కేశవాదులు నవ్వారు) అప్పుడు నేను ఎంతో వ్యధకు లోనయ్యాను.
జగజ్జననితో, ‘అమ్మా! నా స్థితి ఇలా అయిందే! ఈ యువకుల కోసం ఎందుకు ఆరాటం చెందుతున్నావు అని హాజ్రా అడుగుతున్నాడే!’ అని మొరపెట్టుకున్నాను. తరువాత భోలానాథ్తో ఈ విషయం గురించి అడిగాను. అందుకు భోలానాథ్ ఇలా చెప్పాడు: ‘మహాభారతంలో ఈ ప్రస్తావన ఉంది. సమాధి స్థితిలో ఉన్న వ్యక్తి క్రిందికి దిగివచ్చినప్పుడు దేన్ని ఆధారం చేసుకుంటాడు? సత్త్వగుణ భక్తులనే!’ మహాభారతంలోని ఈ వివరణను విన్న తరువాత ప్రశాంతచిత్తుడనైనాను. (అందరూ నవ్వారు)
“ఇందులో హాజ్రా తప్పు ఏమీ లేదు. సాధన ప్రాథమిక స్థితిలో ఉన్నప్పుడు, ‘నేతి, నేతి’ (ఇది కాదు, ఇది కాదు) అని విచారణచేసి మనస్సును సంపూర్ణంగా భగవంతుడి వైపు కేంద్రీకరించాలి. కాని సిద్ధినొందాక, ఆ పరిస్థితే వేరు. భగవద్దర్శనానంతరం అనులోమ విలోమం.* వెన్న తీయాలంటే మొదట దాన్ని మజ్జిగ నుండి విడగొట్టాలి. వెన్న తీసిన పిదప ‘మజ్జిగకు చెందినదే వెన్న, వెన్నకు చెందినదే మజ్జిగ’ అన్న విషయం అవగతమవుతుంది. అదే విధంగా భగవంతుడే సమస్తమూ అయి ఉన్నాడని నిశ్చయంగా తెలుసుకుంటాం. కొన్నిచోట్ల అధిక ప్రకాశం, కొన్ని చోట్ల తక్కువ ప్రకాశం.
“సముద్రం పొంగితే తీరం యావత్తు నీటిమయమవుతుంది. మునుపు చుట్టూ మెలికలు తిరిగి ప్రవహించే నది మీదుగా పడవను నడిపే, సముద్రం చేరుకోవాలి. ఇప్పుడో, వరద వెల్లువలో ఎక్కడ చూసినా నీరే; కనుక పడవను తిన్నగా నడిపి సముద్రాన్ని చేరుకోవచ్చు. వరికోతలు అయ్యాక, గట్లపై చుట్టు తిరిగి వెళ్లవలసిన అగత్యం ఉండదు. అడ్డంగా చేల మీదుగానే నడిచిపోవచ్చు.
“భగవద్దర్శనానంతరం ఆయనను సర్వాంతర్యామిగా గాంచవచ్చును. మనుష్యుల్లో, అందునా సత్త్వగుణ భక్తులలో, అంటే కామినీ కాంచన ఆసక్తి లేశమాత్రమైనా లేని వారిలో ఆయన శక్తి ప్రకాశం అధికంగా ఉంటుంది. (అంతా మౌనంగా ఉన్నారు) సమాధిమగ్నుడైన వ్యక్తి క్రిందికి దిగివస్తే తన మనస్సును ఎక్కడ నిలుపుతాడు? అందుచేతనే కామినీ కాంచన ఆసక్తి లేని, సత్త్వగుణ భక్తుల సాంగత్యం అవసరమై ఉంటుంది. లేకుంటే సమాధిస్థితిని పొందినవారు దేనిని ఆధారం చేసుకుని జీవిస్తారు? (మూలం: శ్రీరామకృష్ణ కథామృతం/ 15. కేశవ్‌తో చివరి సమావేశం)