అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ।
ఇతి మత్వా భజంతే మాం బుధా భావసమన్వితాః ॥ 8
అహమ్, సర్వస్య, ప్రభవః, మత్తః, సర్వమ్, ప్రవర్తతే,
ఇతి, మత్వా, భజంతే, మామ్, బుధాః, భావసమన్వితాః.
అహమ్ = నేను; సర్వస్య = సమస్తానికి; ప్రభవః = ఉత్పత్తి స్థానాన్ని; మత్తః = నా నుండియే; సర్వమ్ = సమస్తమూ; ప్రవర్తతే = కలుగుతున్నది, నడుస్తున్నది; ఇతి = అని; మత్వా = గ్రహించి; బుధాః = జ్ఞానులు; భావసమన్వితాః = భక్తి యుక్తులై; మామ్ = నన్ను; భజంతే = భజిస్తున్నారు.
తా ॥ (విభూతిని, యోగాన్ని గ్రహించ గలిగే సమ్యక్–దర్శనక్రమం నిరూపించబడుతోంది-) నేను సమస్త జగత్తుకూ (భృగు మన్వాది విభూతి రూపంలో) ఉత్పత్తి స్థానాన్ని. నా నుండే [సూక్ష్మ గ్రహణ సామర్థ్యం మొదలుగా గల (గీత : 10 – 4, 5)] సమస్తమూ కలుగుతున్నాయని తెలుసుకొని జ్ఞానులు నన్ను భక్తియుక్తులై భజిస్తున్నారు.