న మే విదుః సురగణాః ప్రభవం న మహర్షయః ।
అహమాదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వశః ॥ 2
న, మే, విదుః, సురగణాః, ప్రభవమ్, న, మహర్షయః,
అహమ్, ఆదిః, హి, దేవానామ్, మహర్షీణామ్, చ, సర్వశః.
సురగణాః = దేవగణాలు; మహర్షయః = మహర్షులు కూడా; మే = నా; ప్రభవమ్ = ఉత్పత్తిని; న విదుః = ఎరుగరు; హి = ఏమన; అహమ్ = నేను; దేవానామ్ = దేవతలకూ; మహర్షీణాం చ = మహర్షులకు కూడా; సర్వశః = సర్వవిధాల; ఆదిః = ఆదికారణాన్ని;
తా ॥ ఇంద్రాది దేవతలూ, భృగ్వాది మహర్షులూ కూడా, నా ఉత్పత్తిని, (అంటే, జన్మరహితుడనైన నేను నానా విభూతులతో ఆవిర్భవించడాన్ని) ఎరుగరు. ఏమనగా దేవతలకూ మహర్షులకూ కూడా సర్వవిధాలై (ఉత్పాదకుడను, బుద్ధ్యాది ప్రవర్తకుడను అయిన) మూలకారణాన్ని నేనే. (కనుక, నా కృప లేకుంటే, నన్నెవ్వరూ ఎరుగజాలరు.)
వ్యాఖ్య:–
పరమాత్మ సనాతనుడు (ఎప్పటికీ ఉండేవాడు). అందరికీ ఆయనే మూల కారణం. దేవతలకు, మహర్షులకు, అసలు సృష్టిలోని సమస్త ప్రాణికోటికీ ఆయనే మూలపురుషుడు. ఆయనకు ఆది (మొదలు) లేదు. దేవతలు, మహర్షులు కూడా ఆయన నుండే పుట్టారు. తండ్రి పుట్టుక కొడుకుకి తెలియనట్లే, వీళ్లు కూడా ఆ పరమాత్మ పుట్టుకను గానీ, ఆయన గొప్పతనాన్ని గానీ పూర్తిగా తెలుసుకోలేకపోతున్నారు. సృష్టిలో అందరికంటే ఉత్తములైన దేవతలకు, మహర్షులకే భగవంతుడి పుట్టుక, శక్తి అర్థం కానప్పుడు, ఇక సామాన్యుల విషయం గురించి వేరే చెప్పనక్కర్లేదు. పరిమితమైన మన మానవ బుద్ధితో, అనంతమైన ఆ పరమాత్మ మహిమను, ఆయన పుట్టుక రహస్యాలను ఎవరూ అంచనా వేయలేరు. కాబట్టి, జీవుడు (మనిషి) చేయవలసిన పని ఒక్కటే – ధ్యానం ద్వారా తన మనసును ఆ పరమాత్మలో పూర్తిగా లీనం చేసి, ఆ దైవస్వరూపమే తానుగా మారిపోవాలి (ఆయనలో ఐక్యం అవ్వాలి).