కిం పునర్బ్రాహ్మణాః పుణ్యాః భక్తా రాజర్షయస్తథా ।
అనిత్యమసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వ మామ్ ॥ 33
కిమ్, పునః, బ్రాహ్మణాః, పుణ్యాః, భక్తాః, రాజర్షయః, తథా,
అనిత్యమ్, అసుఖమ్, లోకమ్, ఇమమ్, ప్రాప్య, భజస్వ, మామ్.
పుణ్యాః = సత్కులోద్భవులైన; బ్రాహ్మణాః = బ్రాహ్మణులను; (గురించీ) తథా = మరియు; భక్తాః = భక్తులైన; రాజర్షయః = రాజర్షులను; (గురించి) కిం పునః = ఏమి చెప్పనగును; (అంటే, వారు నన్ను ఆశ్రయించి, తప్పక మోక్షం పొందుతున్నారు) అతః త్వం = కాబట్టి నీవు; అనిత్యమ్ = అనిత్యమూ; అసుఖమ్ = సుఖరహితమూ అయిన; ఇమమ్ = ఈ; లోకమ్ = మర్త్యలోకాన్ని, మనుష్యశరీరాన్ని; ప్రాప్య = పొంది; మామ్ = నన్ను; భజస్వ = భజించు.
తా ॥ (అసత్కులజాతులూ అనధికారులూ అయినవారు కూడా నన్ను ఆశ్రయించి ముక్తిని పొందుతుంటే) పవిత్ర కులోద్భవులైన బ్రాహ్మణులూ, భక్తులైన క్షత్రియులూ అయిన వారి విషయంలో ఏం చెప్పాలి? (వారు నన్ను ఆశ్రయించి తప్పక మోక్షాన్ని పొందుతున్నారు) అనిత్యమూ, సుఖహీనమూ అయిన ఈ మర్త్య లోకాన్ని (మనుష్యదేహాన్ని) బడసి నన్ను భజించు. (ఇది అనిత్యమవడం వల్ల ఆలసించవద్దు. సుఖరహితమవడం వల్ల సుఖప్రయత్నాన్ని త్యజించి, నన్నే భజించు).