మాం హి పార్థ వ్యపాశ్రిత్య యేఽపి స్యుః పాపయోనయః ।
స్త్రియో వైశ్యాస్తథాశూద్రాః తేఽపి యాంతి పరాం గతిమ్ ॥ 32
మామ్, హి, పార్థ, వ్యపాశ్రిత్య, యే, అపి, స్యుః, పాపయోనయః,
స్త్రియః, వైశ్యాః, తథా, శూద్రాః, తే, అపి, యాంతి, పరామ్, గతిమ్.
పార్థ = అర్జునా; యే అపి పాపయోనయః = ఏ అసత్కుల జాతులు; స్యుః = కలరో; (ఏ అపి = మరియూ;) వైశ్యాః = కేవలం కృష్యాదికం చేసే వైశ్యులూ; తథా = మఱియు; (అధ్యయన రహితులైన) స్త్రియః = స్త్రీలూ; శూద్రాః = శూద్రులూ (కలరో); తే అపి = వారు కూడా; మామ్ = నన్ను; వ్యపాశ్రిత్య = ఆశ్రయించి (సేవించి); పరామ్ = పరమమైన; గతిం హి = గతిని (ముక్తినే); యాంతి = పొందుతున్నారు.
తా ॥ (ఆచారభ్రష్టుడైన వాణ్ణి నా భక్తి పవిత్రం చేయడంలో విచిత్రమేమిటి? అసత్కుల జాతులూ, అనధికారులూ అయిన వారిని కూడా ముక్తులను చేయ గలదు:) పార్థా! నికృష్ట జన్ములైన అంత్యజులూ,* కృష్యాది నిరతులైన వైశ్యులూ,* అధ్యయన రహితులైన స్త్రీ* శూద్రులు* కూడా నన్ను సేవించి, మోక్షాన్ని తప్పక పొందుతున్నారు. (శ్రీమద్భాగవతమ్. 1–4–18; 11–12–3, 7 చూ:)