క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వచ్ఛాంతిం నిగచ్ఛతి ।
కౌంతేయ ప్రతిజానీహి న మే భక్తః ప్రణశ్యతి ॥ 31
క్షిప్రమ్, భవతి, ధర్మ ఆత్మా, శశ్వత్, శాంతిమ్, నిగచ్ఛతి,
కౌంతేయ, ప్రతిజానీహి, న, మే, భక్తః, ప్రణశ్యతి.
(సః = అతడు;) క్షిప్రమ్ = శీఘ్రంగా; ధర్మ ఆత్మా = ధర్మచిత్తుడు; భవతి = అవుతాడు; శశ్వత్ = నిత్యమైన; శాంతిమ్ = శాన్తిని; నిగచ్ఛతి = పొందుతాడు; కౌంతేయ = అర్జునా; మే = నా; భక్తః = ఉపాసకుడు; న ప్రణశ్యతి = వినష్టుడుకాడు (కృతార్థుడగును); (ఇతి = అని;) ప్రతిజానీహి = నిశ్చయంగా గ్రహించు.
తా ॥ ఆ దురాచారి నన్ను భజిస్తూ శీఘ్రంగా ధర్మ చిత్తుడవుతున్నాడు. పిదప, (చిత్తోపప్లవోపరమ రూపమూ, పరమేశ్వరనిష్ఠా రూపమూ అయిన) నిత్యశాంతిని పొందుతున్నాడు. కౌంతేయా! నా భక్తుడెన్నడును వినష్టుడు కాడు, కృతార్థుడే అవుతాడు. నీవు ఈ విషయాన్ని నిశ్చయంగా గ్రహించు.